“ఎవురెవురికో వొస్తుండాది సావు, ఈ పాపిష్టి బతుక్కి రాడంల్యా! కష్టం చ్యాతకానిదాన్ని గాకపోతిని. రెండు చ్యాతలా సంపాయిస్తిని. రెక్కలాడినన్ని దినాలు పాకులాడితిని. యాదరజేసిందంతా ఆ నా బట్టగుంపుకి దారబోస్తిని. ఆనాడే గురిగింజంత తెలివన్నా నేర్సిన్నా లంజినయ్యుంటే, ఈ పొద్ది నాకీ బగిసేట్లు వచ్చుంటాయా సచ్చుంటాయా?” నిట్టాడికానుకొని గొణుక్కుంటా కూసోనుండాది మునెవ్వ.
రొవంచేపుటికి మొత్తల్లోకిబొయ్యి తొంగి సూసింది బైటికి. వొసారా వొక పక్కకి వొరిగిపొయ్యుండాది. వసాటి పంచన గోడకానా గుంటల్దొవ్వి ముడుసుకోని పొణుకోనుండాయి కుక్కలు. సూసీసూణ్ణట్టు వదిలేసింది. రొవంచేపు గడపట్లో నిలబడి అట్టాయిట్టా జూసింది. ముక్కుజీది తలుపుని ముందరికి నెట్టి పైటకొంగుతో తుడుసుకుంటా మల్లా నిట్టాడిగుంజకే ఆనుకోని కూకున్నాది.
కాళ్ళుసేతులు నానిపొయ్యుండాయి. యాళ్ళ మద్దిల్లో పుండ్లుబట్టేసి వొకటే తీపులు. పొసుబ్బొడి పూసుకుంటా కాసేపు మంటకి అల్లాడింది. ఏదేదో గురుతుకొచ్చి కుమల్తుండాది. ముక్కులు, మూతి అదర్తుండాయి. ఎనికిటి గెవణాలు బరాయించడం అలివిగాకపొయ్యేతలికి తలకాయి బాదుకోని బోరుమని యేడ్సింది.
“ఒసే కూతరా..ఎవురి సొమ్ముకి పొయ్నేనే? ఎవురి కాపరంలో నిప్పులుబోసినేనే? ఎవురికి ఏఁవి అన్నేలం జేసినేనే? నా నొష్ట్న ఇటుమంటి రాత రాసినాడు వలపచ్చిపు దేవుడు. వోడి సేతల్లో పుండుబుట్టా. ఈ మాదిరి దిక్కుల్యాకుండా గాచారం బట్టిచ్చినేడు తల్లో! ఎవురితో జెప్పుకోవాల? వొకేళ మొహందప్పిచ్చుకోలేక ఇంటారుగూడనుకో! ఇంటే మటుకు ఆరస్తారా తీరస్తారా! ఎవురికేంబట్టిన దురద? ఎవురి కల్ల్యాట్లు వోళ్ళవేనమ్మో!”
కళ్ళల్లో నీళ్ళు బొటబొటా కారతానే వుండాయి మునెవ్వకి. తలుసుకోని తలుసుకోని యాడస్తుండాది. కొంగుతో రెండుచేతుల్నీ మొహానికేసి అదింపెట్టుకున్నాది. నిఁవషాల్లోనే కొంగు మొత్తం తడిసిపొయ్యింది. ఎదురుంగా వొక సత్తుబకిటి సూస్తుండగానే వాన నీళ్లతో నిండి పొల్లిపోయింది. ఆ నీళ్లు పారి కాలు తడిసేదాకా తెలవలా మునెవ్వకి. ఆపట్నే లబక్కన తడువుకోని పైకి లెయ్యబొయింది. నడుముల్లో సత్తవుంటే కదా తలుసుకోంగానే నిటారుగా నిలబడ్డానికి. రొవంత కష్టంగానే తచ్చాడి తచ్చాడి నిలబడింది.
“ఓయమ్మా..నా బతుకులో మట్టిగొట్ట! ఇట్ట పగబట్టిందేందమ్మా ఈ నా సవితి వాన? ఇంత జల్లాటం దేనికమ్మా ఈ కిలాడిదానికి నేనంటే?”
నిండిపొయిన బకిటి దీసి అక్కణ్ణే వొక గంగాళంబెట్టి అలివైనకాడికి లాక్కుంటాబొయ్యి గడపట్లోనే నిలబడుకోని బకిట్లో నీళ్లు బైటపారబోసింది. సిత్తసీకటి! జల్లిట్లో నీళ్ళుబోసినట్టే వస్తుండాది వాన. యాణ్ణో పిడుగుబడ్డట్టుండాది. పళామని తిమిరి పెద్ద మెరుపొకటి మెరిసింది. గడపట్లో నుంచి రొండడుగులు ఎనక్కేసింది మునెవ్వ. మొత్తలకెదాళం ఇరగబడిపొయ్యుండాది యాపసెట్టు. అట్ట పెళపెళపెళా ఉరిఁవిందో లేదో మునెవ్వ గుండికాయలు డంగుబొయినేయి.
మునెవ్వ కాపరానికొచ్చేటప్పుటికే అది పెద్ద మాను. దాని కిందనే పిలకాయిలికి బుట్టిన పిలకాయిలు గూడా పెద్దోళ్ళైనేరు. ఎంతమందిని సాకుంటాదీ, ఎన్ని సావులు జూసుంటాదీ యాపసెట్టా! ఆ సెట్టు కిందనే ప్యాణాలొదిలేసినేడు మునెవ్వ మొగుడు. మొగుడు గుర్తుకొచ్చేతాలికి పెద్ద పెట్ట్న ఏడిసింది మునెవ్వ.
“ఏఁవి సుకపడ్డానుయా నేనా? కట్టుకున్నోడివి నీ పాటికి నువ్వు దాటుకునేస్తివి. కడుపున బుట్టినోళ్ళు వోళ్ళపాటికి వోళ్ళు సిన్నంగా మరిసిపోతిరి నా సంగతి. బతికుణ్ణన్ని రోజులు బొక్కలాడిస్తివి. నువ్వు మటుకు గబక్కన జచ్చి సుకంగా ఉంటివి. సాలూసాంపర్దాయం లేని ఈనా కొడకల్ని నమ్మి నన్నొదిలేస్తివి. ఎనికిలరిగి ముసిల్దాన్నయ్యేతలికి ఈ పొద్దు నేనెవురికీ కాకుండాబోతిని. వోళ్ళోళ్ళ బిడ్డల్ని దీసుకోని ఎవురి బతుకుదెరువు వోళ్ళు జూసుకుంటిరి. కూతురు బిడ్డల్ని చేరదీస్తుండానని కోడాళ్ళ సేత తన్నిచ్చుకుంటిని. పించిను డబ్బులొచ్చినపుడే వస్తాది సిన్నకోడలు. చెవల్లో కమ్మలు జూస్తే పెద్దకూతురు లాక్కోనిబొయింది. ముక్కులో పుల్లొక్కటే ఎట్నో మిగిలింది. రేషన్లో ఆ నాలుగు బియ్యిం గింజిలు రాకపోతే నా గెతేఁవయ్యుండాల? ఆ కూలబడ్డ సెట్టేదో ఈ ఇంటిమిందనన్నా కూలబడకపోయ! బతికి మటుకు దేనికీ బతుకు? సావుగూడా రాకపాయ దాని తాడుదెగ”.
మల్లొక్కతూరి పళామని మెరిసింది. పొయ్యిగెడ్డ పక్కన ఉరుపుకి ఆడబెట్టిన దబర గురుతుకొచ్చి కాళ్లీడస్తా బొయ్యింది. దబర నిండిపొయ్యుండాది. పొయ్యా, పొయ్యిలో కట్టిపుల్లలు అన్నీ తడిసిపొయ్యుండాయి. నిన్న మజ్జ్యానం మంటేసింది పొయ్యి. ఆ రాత్రి కూడు మిగిలితే గెంజిబోసి పెట్టింది. ఈ పొద్దు అదే తినింది. కూటికుండలో ఇంకా రొవణి కూట్నీళ్లు మిగలబెట్టుండాది. మొన్నెప్పుడో నాగిరెడ్డి కోడలు పెట్టింది నాలుగు ఊరగాయ దబ్బలు. ఊట మాత్రం ఇంకారొవంత కూరగిన్నిలోనే ఉండాది.
ఆ కూట్నీళ్లు, ఊరగాయ ఊట ముందురబెట్టుకున్నాది. కూట్నీళ్లు దేవతావుంటే అక్కడక్కడా మెతుకులు తగల్తుండాయి. ఆ తగిలిన మెతుకులు ఒక్కొక్కటీ పిసకతా ఉండాది.
వగుసులో ఉన్నెప్పుడు మంగళారం మంగళారం పోలేరమ్మ మానుకాడ అంబలి పోసేది. మునెవ్వ అంబలి కాసి కలిపిందంటే అంత రుసిగా ఉండేది. నంచుకునేదానికి ఎరగెడ్డలు ఉప్పుగాయలు నిమ్మకాయ ఊరగాయ రకానికొకటి చేసి పెట్టేది.
బలే పెద్ద సెయ్యే మునెవ్వది. తనామనా జూడకుండా ఎవుర్నైనా చేరదీసేది. ఎవురికైనా అంత ముద్ద పెట్టేది. కూడూ కూరాకూ పక్కంగా వొండుకోని కడుపునిండా తినేది. ఎద్దలబేరాలు, బోగాతం అనుకుంటా మొగుడు ఊళ్లు దిరుగుతుంటే మొగోళ్ళకి పోటీగా మోటుకొని సేద్దెం జేసేది. ఆలూమొగులు కష్టాలుబడి పిలకాయిలందరికీ పెళ్ళిళ్లు జేసినేరు. మొగుడు బొయినాక అన్నీ వోడితోనే బొయ్నేయి. ఆ మిగిల్న కయ్యాగాలవ కూడా అమ్ముకునేసినేరు కొడుకులు. పెత్తనం కోడళ్ళ సేతల్లోకొచ్చింది. అన్నీ పోంగా మూడు బరిగొడ్లుంటే దినాము మేపుకోనొచ్చేది. ఆ మూడు బర్లు ఎనిమిదైనేయి. కష్టం పెరిగిపొయ్యింది. ఇంటికాడున్నంతసేపు ఇంట్లో పనిజెయ్యాల. పేడకళ్ళు జవిరి, ఊడవాల. బర్లు మేపుకొని రావాల. కొన్ని దినాలు వసాట్లో పొణుకునేది. నిదానంగా మునెవ్వ మంచం యాపసెట్టు కిందకి జేరింది. ఎప్పుడన్నా ఉడుగ్గా అంతగద్దు టీసుక్క పోసేటోళ్ళు. పెట్టిందే తినాల. మునెవ్వ గూడా అడగటం మానేసింది. మనవళ్ళూ మనవరాళ్ళు అమ్మల మాట జవదాటరు.
పిలకాయలు సదువులికి ఇబ్బంది పడతుండారని కొడుకులిద్దురూ నాయిడుపేట్లో కాపరం బెట్టినేరు. ఒకడు సూళ్లూరుపేట్లో, ఇంకోడు మేనకూరు కంపినీల్లో కుదిరినేరు. పోతాపోతా బర్లు కూడా అమ్ముకోనిబొయ్నేరు. కూతుళ్ళా ఎప్పుడో రావడమే మానేసినేరు. అదిగో మొగుడున్నెప్పుడు కట్టిన దూలాప్పట్టిల్లు. తాతల కాలంనాటి యాపసెట్టు, ఆ తెగిపొయ్న నులకమంచం..అంతే! ఆకరాకి అయ్యి మటుకు మిగిల్నేయి.
ఆలోచిచ్చుకుంటానే కూట్నీళ్లు పిసికి గుంటగిన్నిలో పోసుకొనింది. అప్పుటికి ఏ జాముదాటిందో ఉరుపు ఎక్కువయ్యి ఇల్లంతా నీళ్లు పారతుండాయి. కళ్లుబైర్లుగమ్మి సెవులు కూడా గుప్పుగుప్పుమంటుండాయి. ఏడుసుకుంటానే రెండు గుక్కలు తాగింది మునెవ్వ. కూట్నీలు మింగతుంటే గొంతులోకి దిగడంల్యా. మునెవ్వ కూకున్నకాడనించే ఎనక్కెనక్కి జరిగి నిట్టాడికి ఆనుకునింది. మజ్జ్యానం కాణ్ణించి నీళ్ళు తాగినట్టు లేదు. గొంతు పట్టేసినట్టుండాది. ఎవురో కుతికి పట్టుకోని పిసికేసినట్టే కూట్నీళ్లు కిందకీ దిగడంల్యా, బయిటికీ రావటంల్యా. గుంటగిన్నినొదిలేసి ఎనక్కి దిరిగి నిట్టాడిగుంజని పట్టుకున్నాది. బయట తుపాను గాలి మల్లుకుంటుండాది. ఉరుములు మెరుపులు తిప్పిచ్చి, మల్లిచ్చి దంచికొడతుండాది వాన. మునెవ్వకి ఊపిరాడ్డంల్యా. ఉండేకొందీ గుండెల్లో బారమైపోతుండాది. అరవడానికి కూతరావడంల్యా. తనుకులాడి తనుకులాడి కూటికుండని తన్నింది. అదిబొయ్యి పొయ్యిగెడ్డకి దగిలింది. ఆ అలికిడి మొత్తలు దాటి బయటిగ్గూడా పోకుండా ఆ తుపాను గాల్లోనే కలిసిపొయింది. రొవంచేపుటికే కన్నుగుడ్లు తేలాడిపొయ్నేయి. నోట్లో కూట్నీళ్లు బైటికొచ్చేసినేయి.
వాన కురిసీ కురిసీ తెరిపిరిచ్చేసింది. కూలిపొయ్యిన యాపసెట్టుకి యేర్లు తెల్లంగా బైటిగ్గనిపిస్తావుండాయి. పెద్దేరు సొర్ణముకి సుడుల్దిరగతా పారతుండాది. ఊర్లో జనాలంతా ఈదుల్లోకొస్తుండారు. ఆ యాపసెట్టు కత, ఆ మునెవ్వ కత ఆ రకాన ముగిసిపొయింది.
*
కథలు రాయగలనన్న ధైర్యం ఇప్పుడిప్పుడే వచ్చింది!
* హాయ్ మల్లికావల్లభ! మీ గురించి చెప్పండి.
హాయ్! మాది నెల్లూరు(ప్రస్తుతం తిరుపతి) జిల్లా నాయుడుపేట దగ్గర్లో ఉండే తిమ్మారెడ్డివాగు అనే ఊరు. స్వర్ణముఖి నది పాయ మా ఊరి నుంచి ప్రవహిస్తుంది. నేను పుట్టి, పెరిగింది అక్కడే. వాకాడులో బీ.ఎడ్ పూర్తి చేసి, ఆ తర్వాత తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేశాను. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ జైభారత్ ఉద్యమంలో పనిచేస్తున్నాను. అడపాదడపా సినిమాలు, షార్ట్‌ఫిల్మ్స్‌కి పాటలు రాస్తూ ఉంటాను.
* ‘మల్లికావల్లభ’..పేరు చాలా కొత్తగా ఉంది. మీ అసలు పేరు అదేనా?
నా అసలు పేరు ‘మల్లికార్జున’. చదువుకునే రోజుల్లో ‘మల్లికావల్లభ’ అని మార్చుకున్నాను. ఆ తర్వాత పరిచయమైన అందరికీ నేను ‘మల్లికావల్లభ’గానే తెలుసు. కానీ అన్ని సర్టిఫికెట్లలో మల్లికార్జున అనే ఉంటుంది. పేరు మార్చుకోవడానికి ప్రత్యేకమైన కారణమేమీ లేదు. ఆ పేరు నాకు నచ్చింది. అంతే!
* కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
మా సావిత్రక్క వల్ల చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటైంది. మొదట్లో ధార్మిక వాఙ్మయాలు, పురాణేతిహాసాలు బాగా చదివేవాణ్ని. ఆ తర్వాత ఇంటర్‌లో ఉన్నప్పుడు కొలకలూరి ఇనాక్ గారు రాసిన ‘ఆకలి’ అనే కథ సిలబస్‌లో భాగంగా చదివాను. ఆ కథ నా మనసులో అలా నిలిచిపోయింది. ఆ కథలో ‘చిన్ని’ పాత్ర గుర్తొచ్చి ఎన్నో రాత్రుళ్లు ఏడ్చాను. అప్పుడు ఎక్కువగా కవితలు రాసేవాణ్ని. కథలు చదవడమే తప్ప, కథలు రాయాలన్న ఆలోచన అప్పట్లో లేదు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక చాలామంది రచనలు చదివాను. నేను చెప్పాలనుకున్న అంశాన్ని మొదట్లో కవితలు, పాటల రూపంలో రాసేవాణ్ని. ఆ తర్వాత కథల రూపంలో చెప్పాలని అనిపించి కొన్ని కథలు రాశాను. అయితే ప్రచురితమైన మొదటి కథ మాత్రం ఇదే.
* సాహిత్యరంగంలోకి వచ్చేందుకు మీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు?
మా బాబాయి కిరణ్‌కుమార్ ఫ్లూట్ కళాకారులు. ఆయన చెన్నైలో ఉంటారు. పెద్ద పెద్ద సంగీత దర్శకుల దగ్గర ఆయన పనిచేశారు. దక్షిణాది భాషల మీద ఆయనకు చాలా పట్టుంది. ఇప్పటికీ భాషా సంబంధిత అంశాల మీద ఆయన పరిశోధన చేస్తూ ఉంటారు. మేమిద్దరం కలిస్తే ఆ విషయాలే మాట్లాడుకుంటాం. చిన్ననాటి నుంచి నా మీద ఆయన ప్రభావం ఎక్కువగా ఉంది. ఎంఏ చదువుతున్నప్పుడు మేడిపల్లి రవికుమార్ మాకు పాఠాలు చెప్పేవారు. సాహిత్యంలో స్త్రీవాదం, దళితవాదం, తదితర అంశాలను ఆయన పరిచయం చేశారు. వీరిద్దరి ప్రభావం, మా సావిత్రక్క ప్రోత్సాహం సాహిత్యం పట్ల అభిరుచి కలగడానికి కారణమయ్యాయి.
* తొలి కథ ‘యాపసెట్టు కూలిపోయింది’ రాయడానికి నేపథ్యం ఏమిటి?
ఈ కథ రాసేముందు రెండు, మూడు కథలు రాశాను. రచయిత సొలమోన్ విజయ్‌కుమార్ అడిగినప్పుడు కథలు పంపాను. ఆయన చదివి మెచ్చుకున్నారు. ఈ కథ ఒకరి గురించి రాసింది కాదు. నాకు తెలిసిన ఇలాంటివారు చాలామంది ఉన్నారు. అలాంటి జీవితాలను చూసి ఈ కథ రాశాను.
* మీకు ఇష్టమైన రచయితలు ఎవరు?
నేను వీళ్ల రచనలే చదువుతాను అని చెప్పలేను. అందరి రచనలూ చదువుతాను. ముఖ్యంగా శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ నాకు చాలా ఇష్టం. కొత్తగా ఎవరు కవిత్వం రాయాలని అనుకున్నా ముందు ఆ పుస్తకం చదవమని అంటాను. కేశవరెడ్డి నవలలు కూడా చాలా ఇష్టంగా చదువుతాను. ఎవరి రచనలైనా బాగా నచ్చితే వెళ్లి వాళ్లను కలిసే ప్రయత్నం చేస్తాను. ‘విజయవిహారం’ రమణమూర్తి గారు పరిచయమైన తర్వాత ఆయన రచనలు, జైభారత్ సాహిత్యం నా ఆలోచనలను, భావాలను మరింత సంపద్వంతం చేయగలిగాయి.
* ముందుముందు ఇంకా ఏం రాయాలని ఉంది?
నేను కవిత్వం రాసి చాలాకాలమైంది. అడిగినవాళ్ల కోసం సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్‌కి పాటలు రాస్తుంటాను. పేరిణి నృత్యం కోసం ‘సరస్వతి స్తుతి’ రాశాను. దానికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత మరికొన్ని నృత్యాంశాలకు సాహిత్యం అందించాను. వాటికి స్వరకల్పన జరుగుతోంది. కథలు రాయగలనన్న ధైర్యం ఇప్పుడిప్పుడే వచ్చింది. ఏం రాస్తానో చెప్పలేను కానీ, ఏదో రాస్తానన్న నమ్మకం మాత్రం ఉంది.
*
Add comment