మా తిరుమల కొండంతావున్న స్పీకర్స్‌లోనుంచి, గోరంతదీపం సినిమాలో సుశీలమ్మ పాడినపాట వినిపిస్తోంది. ‘‘రాయినైనా కాకపోతిని రామపాదముసోకగా! బోయనైనాకాకపోతిని పుణ్యచరితము పాడగా!!’’ చెవుల్లో తేనెపోసినట్టు ఎంతో తియ్యగా, మధురంగా వుంది ఆ గొంతు.
స్కూల్ నుంచి ఇంటికొస్తూ ఆ పాటని వింటున్నాను. ఇంతలో షడన్‌గా ఎవరో గొంతుపట్టుకొని పిసికినట్టు పాట ఆగిపోయింది. ఒక ప్రకటన అనౌన్స్‌చేసారు. ‘‘యాత్రికులకు విజ్ఞప్తి… తిరుమల వాస్తవ్యులు శ్రీ కేసు లక్ష్మయ్య గారి మనవడు పీరుబాబు తప్పిపోయాడు. వయసు మూడు సంవత్సరములు, చామన ఛాయ, పసుపు పూలచొక్కా, బ్లూకలర్ డ్రాయర్ ధరించి ఉన్నాడు మాటలు కూడా సరిగారావు. ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్నాడు. యాత్రికులకు మరియు ఉండూరోళ్ళకు దొరికినయడల గుడికి ఎదురుగా వున్న విచారణ కేంద్రమందు అప్పగించవసినదిగా కోరుతున్నాము’’ అని అనౌన్స్‌చేసారు.
ఆ అనౌన్స్‌మెంట్ విని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. ఆ తప్పిపోయిన పీరుబాబు ఎవడోకాదు మా తమ్ముడే! మళ్ళీ అదే విషయాన్ని తమిళంలో అనౌన్స్‌చేస్తున్నారు, కన్నడంలో, మళయాలంలో, హిందీలో చివరగా ఇంగ్లీషులో కూడా అనౌన్స్‌చేసారు. ఖచ్చితంగా అన్ని రకాల భాషల్లో చెప్పింది మా తమ్ముడి గురించే!
ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చాను. ఇంట్లో అప్పటికే జనం గుమికూడి పోయివుండారు. కొండమీదవుండే మా చుట్టాలు, ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, నాలుగు మాడవీధుల్లోవుండే మాకు తెలిసినవాళ్ళంతా అక్కడే వున్నారు. అరుపులు, పెడబొబ్బలు, ఏడుపు గోలగోలగావుంది.
మా అమ్మకు స్పృహకోల్పోయినంతపనైంది. ఆ షాక్‌లోనుంచి కొంచెం తేరుకుంది. పుస్తకాల సంచి అక్కడ పడేసి నేను వెళ్ళి మా అమ్మ పక్కన దిగులుగా కూర్చున్నాను.
మా అమ్మను కొంతమంది ఓదారుస్తున్నారు. మా హేమవతి పిన్నమ్మ దూరంగా కూర్చుని ఏడుస్తూవుంది. ఆమెను ఎవరు పట్టించుకోలేదు. మా మామ హైస్కూల్‌నుంచి వచ్చేసి, కాఫీ చెంబుపట్టుకుని టీ అంగడిదగ్గరికీ, ఇంటికీ తిరుగుతున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ కాఫీ ఇస్తూ ముక్కుచీదుకుంటా ఏడుస్తూ వుంది మా ఇడ్లీ అవ్వ.
వచ్చినవాళ్ళు వెచ్చవెచ్చగా కాఫీ తాగుతూ తలాఒక మాట అంటున్నారు.
‘‘ఎప్పుడు తప్పొయినాడమ్మా..?’’ అని అడిగినాడు ఒకాయన.
‘‘సాయంత్రం మూడుగంటకు అన్నా… ఇద్దో ఈ పిల్ల, బిడ్డని సంకనవేసుకుని సినిమాబొమ్మలు (బయోస్కోప్) చూడ్డానికి వీధిలోకి తీసుకొనిపోయింది. సినిమా బొమ్మలు చూస్తా చంకన్నవున్న బిడ్డని వదిలేసింది. వాడు తప్పటడుగు వేసుకుంటా అటుపక్కన గాంధి మిఠాయి అమ్మేవాడి దగ్గరకు పోయినాడు. ఇది గమనించనేలేదు. నాలుగు మాడవీధుల్లో గుంపు ఫుల్‌గా వుంది. పిపిషెడ్ కూడా నిండిపొయ్యి, క్యూ పరమట మాడవీధిలోకి వచ్చేసుండాది. గుంపులో కలిసిపోయినాడు. ఎవురు ఎత్తుకొనిపోయినారో తెలీదు’’ అని మా హేమావతి పిన్నమ్మని చూస్తూ అంది మా అమ్మ.
మా హేమావతి పిన్నమ్మ ఏడవటం ఆపి దొంగలా చూసింది.
‘‘ఉండూరోళ్ళకు (స్థానికులకు) దొరికివుంటే తెచ్చిఇస్తారు. పరషోళ్ళకు (యాత్రికులకు) దొరికివుంటే తెచ్చిఇచ్చేది కష్టమే!’’ అన్నాడు అగ్నిలో కొంచెం ఆజ్యం పోస్తూ.
ఆ మాటతో మా అమ్మ మళ్ళీ ఏడుపునెత్తుకునింది. అదిచూసి ఎక్కడ మళ్ళీ నన్ను కొడతారోనని, మా హేమావతి పిన్నమ్మ మళ్ళీ ఏడవటం మొదులుపెట్టింది.
‘‘పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారా?’’ అని అడిగాడు ఇంకో అతను.
‘‘ఇచ్చినారు… మైకుల్లో కూడా నాలుగైదుసార్లు అనౌన్స్ చేసినారు’’ అని చెప్పింది మా ఇడ్లీ అవ్వ.
కాఫీలు చెంబులు చెంబులు వస్తున్నాయి, అయిపోతున్నాయి. ఇంతలో మా పూనాసత్రం అత్త వచ్చింది. ఆమె ఆగింతం మనిషి. చేతులు తిప్పుతూ, ఓవర్‌యాక్షన్ చేస్తావచ్చింది.
‘‘బంగారంలాంటి మగబిడ్డే! కాకి ఎత్తుకుపోయినట్టు ఎవరో ఎత్తుకుపోయినారే!! నా తమ్ముడు వస్తే నేనేం సమాధానం చెప్పేది దేవుడా! నాకు కాళ్ళూచేతులు ఆడటం లేదే దేవుడా!!’’ అని శోకాలు తియ్యటం మొదలుపెట్టింది.
అంత బాధలో కూడా ఆమె ఓవర్‌యాక్షను చూసి మా అమ్మకు కోపం వచ్చింది. ఏడుపు ఆపి మా మహేమావతి పిన్నమ్మ ఆమెవైపు చూసింది.
‘‘మిడిగుడ్లువేసుకొని చూస్తావుండాది చూడు… నేనేమన్నా తప్పుగా మాట్లాడినానా? ఇక్కడ ఎవురికీ బిడ్డ తప్పొయినాడన్న బాధేలేదు. తలనొప్పిగా వుండాది.. నాకు కొంచెం కాఫీ ఇవ్వండమ్మా’’ అని అంది.
మా ఇడ్లీఅవ్వ కాఫీ ఇచ్చింది. వేడివేడి కాఫీని ఊదుకొని తాగుతోంది. నాకు మా అమ్మను చూస్తుంటే బాధగావుంది. వీళ్ళ ఓవర్‌యాక్షన్ చూస్తుంటే, అంత బాధలో కూడా నవ్వువస్తోంది. ‘‘వేడివేడి కాఫీ నా మొగాన కొట్టకపోతే, కొంచెం చల్లార్చి ఇవ్వొచ్చుకదా! ఊదుకొని తాగలేక చస్తున్నాను’’ అని కాఫీ గ్లాసుని మా రెండో పిన్నమ్మ చంద్రమ్మకు ఇచ్చింది. ఆమె ఇంకో గ్లాస్ తెచ్చి, కాఫీ చల్లార్చి ఇచ్చింది. కొంచెం కాఫీ తాగింది మా పూనాసత్రం అత్త.
‘‘అబ్బా… చల్లగా చల్లార్చి ఇచ్చేసింది.. ఐస్‌నీళ్ళు తాగినట్టు చల్లగా వుండాది. ఎట్లతాగేది’’ అని ముఖం చిట్లించింది. ఇంతలో మా అంగిడితాత వచ్చాడు.
‘‘అందరూ కాఫీలు తాగుకుంటూ, కబుర్లు చెప్పుకుంటా కూర్చున్నారే! లెయ్యిండి లెయ్యిండి… నలుగురూ నాలుగు దిక్కులకు పోయి వెతుకుదాం! కొండంతా జల్లెడపట్టేద్దాం! ఏడుస్తూ కూర్చుంటే తప్పోయిన బిడ్డ తిరిగొస్తాడా? లెయ్యిండి లెయ్యిండి’’ అని అందరిమీద కోపగించుకున్నాడు.
ఆ మాటతో అందరూ పైకిలేచినారు. నలుగురు నలుగురు ఒక గ్రూపుగా ఏర్పడి, తలోదిక్కుకి పోయినారు. మా అమ్మ, మా హేమావతి పిన్నమ్మ, మా మామ, నేను ఇంకో వైపుకి వెళ్ళాము.
మొదట పిపి షెడ్‌లోకి వెళ్ళాము. అక్కడ క్యూ ఇన్‌స్పెక్టర్ పర్మీషన్ తీసుకొని, యాత్రికులు వున్న కంపార్ట్‌మెంట్స్ అన్నీ వెతికేసాము. నాలుగు మాడవీధుల్నీ చుట్టేసాము. చంద్రబాబుతోట, సురాపురంతోట, నారాయణాద్రి, శంఖుమిట్ట, బస్టాండ్, ఒకటో సత్రం, రెండో సత్రం, మూడో సత్రం, రామకోటి, సన్నిధి వీధి, నూరు రూమ్ లు, యానాదుల ఇళ్ళు, పాపవినాశనం టోల్‌గేట్, గాలిచక్రం మొత్తం తిరుమలకొండంతా అణువణువు గాలించేసాము. గ్రూపులుగా విడిపోయినవాళ్ళు కూడా మాకు అక్కడక్కడా ఎదురుపడ్డారు. ఎవ్వరికీ మా తమ్ముడు కనిపించలేదు.
మా అమ్మకు చివరిగా వున్న ఆశకూడా అడుగింటిపోయింది. అంతవరకు దొరుకుతాడన్న ఆశవుండేది. ఎంతో హుషారుగా తిరిగింది. ఒక్కసారిగా గుడిముందు, గొల్లమండపం దగ్గరున్న మెట్లమీద కూలిపోయింది. ‘‘దేవుడా… నా బిడ్డని నాకు ఎందుకు దూరం చేసావు? నేను ఏం పాపం చేసాను స్వామి!’’ అని ఓ అని రోదించసాగింది.
మా పిన్నమ్మ, మా మామ, మా అమ్మను పట్టుకున్నారు. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయినాయి. మా తమ్ముడు ఎలావుండేవాడో గుర్తుకు వచ్చింది. వాడి ముద్దు ముద్దుమాటలు, బుడిబుడి అడుగులు, పాలుగారే బుగ్గలు, బోసినవ్వు, వాడి అల్లరి, ఒక్కసారిగా కళ్ళముందు మెదిలింది.
రాత్రి తొమ్మిది గంటలయింది. దర్శనం చేసుకున్న యాత్రిలు గుడిలో నుంచి బయటకు వస్తున్నారు. క్యూలైన్ పలుచగా ముందుకు కదులుతోంది. గుంపు క్రిక్కిరిసి వుంది. దర్శనానికి ఐదుగంటల సమయం పడుతోంది.
స్వామిని దర్శనం చేసుకొని బయటకు వస్తున్న గుంపులోనుంచి, ఓ అరవోళ్ళ ఫ్యామిలీ కూడా వుంది. ఆడవాళ్ళు, మొగవాళ్ళు అని తేడాలేకుండా గుండు కొట్టేసుకున్నారు. గుండుకి చిక్కగా చందనంపూసేసుకున్నారు. గుండ్లు మెరిసిపోతున్నాయి. ఆ అరవగుంపులో ఒకామె మాతమ్ముడ్ని ఎత్తుకొని కనిపించింది. కళ్ళనీళ్ళు తుడుచుకుని చూసాను.
‘‘అమా… అమా… తమ్ముడుమా’’ అన్నాను.
మా అమ్మ తలెత్తి చూసింది… ఆమె చంకలో వున్న మా తమ్ముడ్ని చూసి ఒక్క ఉదుటున పైకిలేచి పరిగెత్తింది. వాళ్ళు ప్రసాదాలు అమ్మే కౌంటర్స్ వెనకనుంచి బయటకు వచ్చారు. మా అమ్మ వాళ్ళ దగ్గరకెళ్ళి, చంకలో వున్న మా తమ్ముడ్ని తీసుకోబోయింది. వాడు మా అమ్మను చూసి రాలేదు.
‘‘యారుమా నీ…?’’ అని అరవంలో అడిగింది.
‘‘నా కొడుకమ్మా… పొద్దున తప్పొయ్యినాడు… మీరు దేవుళ్ళా కనిపించారు.. నా బిడ్డను నాకు ఇవ్వమ్మ!’’ అని తీసుకోబోయింది. మా తమ్ముడు, మా అమ్మను చూసి రావటంలేదు. ఏడవటంలేదు. ఎవరో పరాయిదాన్ని చూస్తున్నట్టు చూస్తున్నాడు. వాళ్ళకి అనుమానం వచ్చింది.
‘‘నీ బిడ్డ అయితే నువ్వు పిలుస్తునే, నీ దగ్గరికి రావాలికదా!’’ అని అరవంలో అడిగారు. మా అమ్మకు ఏడుపు వచ్చేసింది. రెండు చేతులు చాచి అడుక్కుంటా వుంది.
‘‘రేయ్ అమ్మనురా! రా నాయనా!!’’ అని బతిమాలుతున్నా వాడు రావటం లేదు. మా అమ్మను పరాయిదానిలా చూస్తున్నాడు.
‘‘నువ్వు వీడితల్లి అని ఎలామ్మా నమ్మేది! మేము ఇవ్వము’’ అన్నారు వాళ్ళు. మా అమ్మకు ఏడుపు వచ్చేసింది. కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి. వాళ్ళని ఎలా నమ్మించాలో అర్ధంకావటంలేదు. వాడు మా అమ్మవైపు చూసాడు. ఎలాంటి హావభావాలు ప్రదర్శించకుండా, ఏడుస్తున్న మా అమ్మను చూస్తున్నాడు. మా అమ్మను గుర్తుపట్టాడు.
ఎవరో కొట్టినట్టు ఉలిక్కిపడి ఏడవటం మొదలుపెట్టాడు. ‘‘అమ్మా… అమ్మా’’ అంటూ మా అమ్మవైపుకి వంగబడ్డాడు. వాడ్ని మా అమ్మ చేతుల్లోకి లాగేసుకుంది. గుండెకి హత్తుకుంది. తల్లిప్రేమకు కన్నీళ్ళే సాక్ష్యం. మా అమ్మని నమ్మినారువాళ్ళు.
ఆ దృశ్యాన్ని చూస్తున్న అందరి కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగిపోయినాయి. మా తమ్ముడ్ని ఎత్తుకున్న ఆమె కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఆమె చేతులుచాచి మా తమ్ముడ్ని రమ్మని పిలిచింది. వాడు వెళ్ళలేదు. మా అమ్మ మెడచుట్టూ చేతులేసి, గట్టిగాపట్టు కున్నాడు. పొద్దున్నుంచి బిడ్డ స్పర్శకు అవాటుపడినట్టువుంది. ఆమె వదల్లేక వదిలివెళ్ళిపోయింది. మా తమ్ముడ్ని తీసుకొని మేము ఇంటికి బయలుదేరాము.
మైక్స్‌లోనుంచి అనౌన్స్‌మెంట్ వినిపిస్తోంది. ‘‘యాత్రికులకు విజ్ఞప్తి… బెంగుళూరు వాస్తవ్యులు కెంపేగౌడాగారి తల్లిగారు తప్పిపోయినారు. వయసు ఎనభైఏళ్ళు. మతిస్థిమితంలేదు. ఎక్కడ కనిపించినా గుడికి ఎదురుగావున్న విచారణ కేంద్రమందు అప్పగించగలరు’’ అని అనౌన్స్ చేస్తున్నారు.
***
Add comment