యవ్వనం ఎంతో జాగ్రత్తపడాల్సిన మలుపు 

ఇంగ్లీషులో ‘stumble upon’ అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. అంటే మనం వేరే ఎదో పనిలో ఉండగా అనుకోకుండా మనకి ఒక విషయమో, వస్తువో, వ్యక్తో సంభావ్యవశాత్తుగా లభించడం. అయితే, విషయం ఆసక్తికరంగానో, వస్తువు విలువైనదిగానో , వ్యక్తి ప్రియమైన వారో, మనం అభిమానించే వారో అయినప్పుడు మాత్రమే ఈ వ్యక్తీకరణ సముచితంగా ఉంటుంది.

ఒకానొక సాయంత్రం యథావిధిగా నేనూ , నా శ్రీమతి వంటింటి యుద్ధానికి సమాయత్తమవుతూ, తనని యూట్యూబ్ లో ఏమైనా ప్లే చేయమన్నాను. అప్పట్లో చాలా పాపులర్ అయిన కపిల్ శర్మ కామెడీ షో ప్లే చేసింది. ఆ ఎపిసోడ్ లో ఒక ఉర్దూ కవిని స్వాగతించారు. ఎప్పుడూ అతని గురించి వినలేదు. కామెడీ షోకి వచ్చాడంటే బహుశా ఎవరో హాస్యకవి అనుకున్నాను. తాను చదివిన మొదటి షేర్ విని నా అనుమానం నిజమైందనుకున్నాను. కానీ అతను చదివిన తరువాతి షేర్:
 
కిస్ నే దస్తక్ దీ యే దిల్ పర్ కౌన్ హై
ఆప్ తో అందర్ హై బాహర్ కౌన్ హై  
ఎవరది, నా గుండె తలుపులు తట్టింది ఎవరు
నువ్వు గుండెలో కదా ఉన్నావు బయట ఎవరు
 
అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి రెండు మెతుకులు చాలు అన్నట్టు, ఈ కవి ప్రతిభాశాలి అన్న విషయాన్ని ఈ రెండు వాక్యాలు నిరూపించాయి.
*
ఆ తరువాత కొన్ని రోజులు ఏకాగ్రతగా తన కవిత్వమే చదివాను. యూట్యూబ్ లో వెతికి వెతికి తన కవిత్వమే విన్నాను. తన గజళ్లలో ఏదో కొత్తదనం, ఏదో ఆకర్షణ, ఏదో గాఢమైన అనురక్తి నన్ను వశపరచుకున్నాయి. తన కవనాధారలో జీవితం పట్ల తన తత్త్వం,  ప్రణయం, రాజధిక్కారం ప్రధానంగా కనిపించాయి.
పైన ఉటంకించిన షేర్ కి కొనసాగింపుగా ఇంకొన్ని ప్రణయానికి సంబంధించిన షేర్లు చూద్దాం.
Face is the index of mind అన్నారు. సగటు మనిషి భావాలను అంత సులువుగా దాచుకోలేడు. ముఖంపై మారే రంగులు మనం అణచుకునే భావాలను బయటపడేస్తాయి. ప్రేమ, అసూయ, నిరాశ, ఆగ్రహం ఇత్యాది భావాలను ఇతరుల దగ్గర నేను దాయలేకపోవడం, ఇతరులు నా దగ్గర దాయలేకపోవడం రెండూ అనుభవపూర్వకమే నాకు.
 
ఆతే జాతే హై కయీ రంగ్ మేరె చెహ్రే పె
లోగ్ మజా లేతే హై జిక్ర్ తుమ్హారా కర్ కె
నా మోములో ఎన్ని వర్ణాలు కదలాడుతాయో
నీ ప్రస్తావన తెచ్చి అందరూ ఆనందపడతారు
ఇలా దైనందిన జీవితానుభూతిని చిత్రించడం వల్ల జనబాహుళ్యంలో తన కవిత్వానికి రిలేటబిలిటీ తద్వారా పాపులారిటీ ఎక్కువ లభించాయి అనుకుంటాను.
ఇంకో చోట ఉడుకు రక్తం ఉరకలెత్తే యుక్తవయసులో కోల్పోయే నిగ్రహాన్ని గురించి చమత్కరించారు:
మోడ్ హోతా హై జవానీ కా సంభల్నే కే లియే
ఔర్ సబ్ లోగ్ యహీఁ ఆ కె ఫిసల్తే క్యూఁ హై 
యవ్వనం ఎంతో జాగ్రత్తపడాల్సిన మలుపు 
మరి అందరూ ఇక్కడే ఎందుకు జారిపడతారో 
 
ఇంకొంచెం గంభీరమైన షేర్లు ప్రస్తావించే ముందు ముషాయిరాలలో కుర్రకారుని ఉర్రూతలూగించిన ఒక షేర్:
ఆగ్ కే పాస్ కభీ మోమ్ కో లా కర్ దేఖూఁ
హో ఇజాజత్ తొ తుఝే హాథ్ లగా కర్ దేఖూఁ
అగ్నికి దగ్గరగా మైనాన్ని తెచ్చి చూడాలని ఉంది 
అనుమతిస్తే నిన్ను తాకి చూడాలని ఉంది
 
ముషాయిరాలలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఈ కవి, ఇటువంటి షేర్లను శ్రోతల్లో ఒక ఉల్లాసమైన వాతావరణం కలిగించడానికి అత్యంత ప్రభావవంతంగా చదవడం, దానికి ప్రతిక్రియగా వాహ్వాకారాలు, కేరింతలు, చప్పట్లు రావడం తరచుగా కనిపించే దృశ్యం. ఒక సమూహానికి వినిపించడానికి ఇలాంటి షేర్లు వ్రాసిన ఈ కవి, చదివి ఆస్వాదించడానికి ఇంకొంచెం మధురమైన షేర్లు కూడా వ్రాశాడు:
జెహెన్ మే జబ్ భీ తేరే ఖత్ కీ ఇబారత్ చమ్కే
ఎక్ ఖుశ్బూ సీ నికల్నే లగీ అల్మారీ సే
తలపుల్లో నీ లేఖలోని రమ్యత ఎప్పుడు మెరిసినా
అరలో నుండీ ఒక పరిమళమేదో బయటకొస్తుంది 
 
*
నేను చదివి, విన్నంతలో తన కవిత్వం నాకు దాదాపు సగభాగం అర్థం కాలేదు. యథార్థము కొన్ని చోట్ల, సూచితార్థము కొన్ని చోట్ల స్ఫూరించలేదు. ఈ విషయం బహుశా నేను చదివే ప్రతి కవికీ వర్తిస్తుంది. అవగాహన కలిగినంతలో ఎన్నో అద్భుతమైన షేర్లు దొరికాయి. ఎంతో లోతైన పరిశీలన, అంతే సున్నితమైన అభివ్యక్తి మేళవించి అతను చెప్పిన కొన్ని షేర్లు చూద్దాం.
మేరే హుజ్రే మేఁ నహీఁ ఔర్ కహీఁ పర్ రఖ్ దో
ఆస్మాఁ లాయే హో లే ఆవో జమీఁ పర్ రఖ్ దో
నా కుటీరంలోవద్దు వేరే ఎక్కడైనా పెట్టు 
నింగిని తెచ్చావా తీసుకురా నేల మీద పెట్టు 
 
కప్పి చెబితేనే కవిత్వం అన్నారు. చెప్పాల్సిన విషయాన్ని కప్పడానికి కవి వాడే తెరలే ప్రతీకలు. పై షేర్ లో మూడు ప్రతీకలు చాలా అందంగా ప్రయోగించబడ్డాయి. ‘నా కుటీరం’ అనడంలో ఈ మాటలు చెబుతున్నది ఒక సాధువు అని తెలుస్తోంది. అంటే కేవలం అడవుల్లోనో కొండల్లోనో ఉండే మునిపుంగవులని కాదు, రాగద్వేషాలను అధిగమించి సాధుస్వభావంతో అందరి మధ్య జీవించే వారు కూడా అయ్యుండొచ్చు. తర్వాత ‘నింగిని తెచ్చావా’ అనడం ఎవరో తనకి అత్యంత విలువైన వస్తువు కానుకగానో ఎరగానో ఇవ్వడానికి తెచ్చారు అని చెప్పడం. ‘నేల మీద పెట్టు’ అనడంలో తన దృష్టిలో ఆ వస్తువుకి ఏ మాత్రం విలువలేదని చెప్పడం, ‘వేరే ఎక్కడైనా పెట్టు’ అనడంలో ఆ వస్తువుని నిరాకరించడం కనబడతాయి. నాకు సూఫీ తత్త్వం పట్ల అవగాహన లేదు గానీ, ఇది materialistic world ఇవ్వాలనుకునే తాత్కాలిక సుఖాలని denounce చేస్తున్న షేర్.
దాదాపు ఇటువంటి భావననే ఇంకో షేర్ లో ఇలా చెప్పారు:
వో చాహ్తా థా కి కాసా ఖరీద్ లే మేరా 
మై ఉస్ కె తాజ్ కీ కీమత్ లాగా కె లౌట్ ఆయా
అతను నా భిక్షపాత్ర కొనాలని ఆశపడ్డాడు
దాని వెల తన కిరీటం అని చెప్పి వచ్చాను
 
వీటితో పాటు అందరూ ఎదో ఒక దశలో అనుభూతి చెందే జీవితసత్యాలను కూడా స్పృశించారు.
నరమ్-ఓ-నాజుక్ హల్కే ఫుల్కే రుయీ జైసే ఖ్వాబ్ థే
ఆన్సువో మే భీగ్నే కే బాద్ భారీ హో గయే
లేలేత తేలికైన సున్నితమైన దూది వంటి కలలు
కన్నీళ్ళలో తడిశాక బరువెక్కిపోయాయి
మనం కలల్లో తేలిపోవడం అనే వ్యక్తీకరణ వాడుతాం. కలలు ఆరంభంలో అటువంటి హాయిని కలిగిస్తాయి. అదొక వాస్తవానికి అతీతమైన లోకం. ఈ షేర్ మొదటి పంక్తిలో ఆ విషయమే చిత్రించబడింది. చివరికి సాకారం కానీ ఎదో ఒక కలే మనకు జీవితాంతం ఒక వ్యథని కలిగిస్తుంది. అదే రెండవ పంక్తిలో చెప్పబడింది.
*
అతను ఎంత ప్రజాదరణని పొందాడో అంతే ఆక్షేపణకి కూడా గురయ్యాడు. స్వభావరీత్యా ఒక నిజాయితీ గల contrarian and non-conformist అవ్వడం వలన, తన సాహితీప్రస్థానం మొదట్లోనే సభలలో కవిత్వం చదవడంలో ఒక తనదైన శైలిని తీసుకొచ్చాడు. ఎవరెన్ని మాటాలన్నా నాలుగు దశాబ్దాలు అదే శైలిని కొనసాగించాడు. ఆ కారణంగా సాహితీలోకంలోనే కొంత వ్యతిరేకతని ఎదుర్కొన్నారు.
ఈ మధ్య కాలంలో, ఒక ముస్లిం కవిగా, ఇప్పటి రాజకీయ పరిస్థితులలో నిర్భయంగా తన నిరసన గళం వినిపించడం కూడా కొందరి ఆగ్రహానికి కారణమయ్యింది.
చాలా మంది ఇటీవలి సభల్లో ఊగిపోతూ ఉద్రేకపడిపోతూ అస్తిత్వవాద కవిత్వాన్ని వినిపించడం నేను కూడా విన్నాను. అందరిలోనూ ఒక పరిపూర్ణమైన పరిపక్వత చెందిన స్పృహ కనబడదు. ఐతే. ఈ కవి గోద్రా ఘటనకు సంబంధించి చెప్పిన షేర్ చూడండి:
జిన్ కా మస్లక్ హై రోష్ని కా సఫర్ వో చరాగ్ క్యూఁ బుఝాయేంగే
అప్నే ముర్దే భీ జో నహీఁ జలాతే నహీఁ జిందా లోగోఁ కో క్యూఁ జలాయేంగే
వెలుగుదారుల్లో ప్రయాణం ఆచరించే వాళ్ళు దీపాలు ఎందుకు ఆర్పేస్తారు
తమ మృతదేహాలను కూడా కాల్చని వాళ్ళు సజీవదహనం ఎందుకు చేస్తారు
ఇవి నలుగురి మెచ్చుకోలు కోసం చెప్పిన మాటలు కాదు. ఒక తీవ్రమైన సామూహిక వేదనకి ప్రాతినిధ్యం వహిస్తూ ఎంతో బాధ్యతగా చెప్పిన మాటలు.
భారతదేశంలో మతం ఎల్లప్పుడూ రాజకీయ నాయకుల చేతిలో పనిముట్టుగా ఉంది. ఈ నిజాన్ని గుర్తు చేస్తూ ఈ కవి చెప్పిన షేర్:
ఆప్ హిందూ మై ముసల్మాన్ యే ఇసాయీ వో సిఖ్

యార్ ఛోడో యే సియాసత్ హై చలో ఇష్క్ కరేఁ

నువ్వు హిందూ నేను ముస్లిం తను క్రైస్తవుడు ఇతను సిఖ్
ఇవి రాజకీయాలు నేస్తమా, పద సఖ్యతగా ఉందాం
 
నిన్నటి సంవత్సరం జరిగిన NRC/CAA నిరసన ప్రదర్శనలలో అతను ముప్ఫయ్ ఏళ్ల క్రితం చెప్పిన షేర్లు నినాదాలుగా మారాయి. పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఈ విషయంపై ప్రశ్నిస్తూ ఒక విపక్ష నేత చేసిన ప్రసంగాన్ని ఆ షేర్లు కోట్ చేస్తూనే ముగించింది.
జో ఆజ్ సాహిబ్-ఏ-మస్నద్ హై, వో కల్ నహీఁ హోంగే
కిరాయెదార్ హై జాతీ మకాన్ థోడీ హై
ఈ రోజు పీఠంపై ఉన్నవారు రేపు ఉండరు
అద్దెకి ఉంటున్నారే కానీ సొంత ఇల్లు కాదు
సభీ కా ఖూన్ హై షామిల్ యహాఁ కి మిట్టీ మే
కిసీ కె బాప్ కా హిందుస్తాన్ థోడీ హై
ఈ మట్టిలో అందరి రక్తమూ కలిసి ఉంది
భారతదేశం ఎవరి తాతల సొమ్మూ కాదు

*

ఏదేమైనా ఒక నిత్యయవ్వనుడిగా, ఒక కవిగా, ఒక అధ్యాపకుడిగా, ఒక అస్తిత్వానికి నిర్మాణాత్మక ప్రతినిధిగా, ఒక మనిషిగా జీవితాన్ని నిండుగా జీవించి కొన్ని రోజుల క్రితమే గుండెపోటుతో మరణించారు. జీవితంలో వైరాగ్యసమానమైన ఒక సమతౌల్యస్థితికి చేరిన అతని కవిత్వంలో కూడా మృత్యువు గురించి చేసిన వ్యాఖ్యానం కనబడుతుంది.
 
ఏక్ హీ నదీ కె హై యే దో కినారే దోస్తోఁ

దోస్తానా జిందగీ సే మౌత్ సే యారీ రఖో

ఒక నదివే ఈ రెండు తీరాలు నేస్తమా
జీవితంతో స్నేహం ఉంచు మరణాన్ని ప్రేమించు

తన మరణానంతరం కూడా తనని అందరూ ఎలా గుర్తుంచుకోవాలి కూడా తానే ఒక షేర్ లో సూచించాడు:

జనాజే పర్ మేరే లిఖ్ దేనా యారోఁ
మొహబ్బత్ కర్నే వాలా జా రహా హై
మిత్రులారా నా మరణశయ్యపై ఇలా వ్రాయండి
ప్రేమించే వాడు వెళ్ళిపోతున్నాడు
*
అలా, అనుకోకుండా ఒకానొక సాయంత్రం, కాసేపు ఆహ్లాదంగా ఉందామని చూసిన కపిల్ శర్మ కామెడీ షో లో, నేను stumble upon అయిన విలక్షణమైన కవి, మోడ్రన్ లెజెండ్ – రాహత్ ఖురేషి ఉరఫ్ రాహత్ ఇందోరీ సాహెబ్!
*

రమాకాంత్ రెడ్డి

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • జీవితంలోని అన్ని ముఖ్యమైన పార్శ్వాలనూ హృద్యంగానూ బాధ్యతగానూ రాసిన రాహత్ ఇందోరీ గారి గురించి మీరూ అంతే హృద్యంగా బాధ్యతగా రాశారు, వారి రచనల ద్వారా నేర్చుకొనవలసిన రచనా విలువలు ఉన్నాయి అని ఈ వ్యాసం వలన తెలియవస్తోంది. థ్యాంక్యూ రమాకాంత్ గారు.

  • 🙏🙏❤️ stumble upon చేసిన కవి,కి,,మీకు .sir!premichevadu వెళ్ళి పోయాడు..!. మీ write-up
    bagundi..sir

  • చాలా లోతైన గంభీరమైన కవితలు సర్

      • కిసీ కె బాప్ కా హిందూస్థాన్ తోడీ హై – ఈ ధిక్కార స్వరం కవిది కాక ఇంకెవరిది అవుతుంది…… రాహత్ కాక ఇంకెవరు అనగలరు ఆ మాట. సభను, సభికులని తన షేర్లని వినిపించే విధానం తో కట్టి పడేసే రాహత్ తీరు చూడవలసిందే……. రమాకాంత్ గారు చాలా మంచి రచన, గజల్ పరిచయానికి ఇంకా చెప్పాలంటే ఉర్దూ సాహిత్య వివరణ కి సరిపడే అర్ధవంతమైన భాష……. ముత్యాల వెనుక దారం లా సాగిపోయే మీ శైలి ప్రశంసనీయం.

  • చాలా చక్కటి వ్యాసం అందించారండి. ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు