మౌమిత ఆలం కవితలు-2

1

గాజా మృత శిశువుల కోసం

ఎవ్వరూ జవాబివ్వరు.కానీ, ప్రతి రాత్రి ఒక స్వరం విలపిస్తూ వుంటుంది          — అఘా షాహిద్ ఆలీ
కుళాయి విప్పే వున్నా
ఒక్క నీటి బొట్టూ లేదు‌.
ఇక్కడ దిగబడి స్థిరపడినవాళ్ళకే అన్నీ అధికారాలు.
ఆహారం నుండి నీళ్ళదాకా
అంతా తెల్లవాళ్ళ గుత్తాధిపత్యమే.
పసి మొఖాలన్నీ ఒకచోట చేర్చారు.
ఎవరో ఒక కొత్త ఆట నేర్చారు.
రండి!త్వరగా!తొందరగా..!
 ఏ లాంచర్ కు ఎవరి పేరుందో
ఎవరికి తెలుసు ?
దూరంగా మూలన కూర్చొని
ఒక పిల్ల శిశువు బొమ్మను గీస్తోంది.
ఆ పిల్ల నింపాదిగా వుంది.
ఆమె చిన్ని వేళ్ళకి ఇంకా
మసిబొగ్గు అంటుకునే వుంది.
అప్పుడే ఒక బాంబు పేలుడు..
నీ తల దించు!
నీ తల దించు!
పిల్లలు ఆ పిల్లని హెచ్చరించారు.
‘చనిపోయిన పిల్లల కోసం
స్వర్గంలో బొమ్మలు గీసుకునే కాగితం వుంటుందా ?’
అని ఆ పిల్ల అడుగుతోంది.

2

అక్టోబర్, 23*

నేను నిన్ను కౌగిలించుకోగలనా ?
బిగియార ?
పిల్లలందరూ చనిపోలేదని చెప్పు.
ఆడుకునేందుకే వెళ్ళారని చెప్పు.
సాయంత్రానికి తిరిగివచ్చి
వాళ్ళ అమ్మల దగ్గర చేరి ముద్దులాడతారని చెప్పు.
చెప్పు..ఒక్కసారి చెప్పు..
పిల్లలందరూ చనిపోయిన పిల్లలు కాదని చెప్పు.
వాళ్లు బతికున్నారు.
సాయంత్రానికి తిరిగివచ్చి
వరండాలో ఆడుకుంటారు.
ప్రియ ప్రపంచమా..
చెప్పు..
మృత వదనాలన్నీ అసత్యాలని చెప్పు.
ఇదొక పీడకలని చెప్పు.
మేమొక నూతన ఉషోదయంలోకి
మేల్కొంటామని చెప్పు.
నన్ను కౌగిలించుకో.
నేను మొద్దుబారిపోయాను.
ఆ చిన్నారి సమాధులు అబద్దాలని చెప్పు.
పిల్లలు తిరిగొస్తారని చెప్పు.
( అక్టోబర్ 07, 2023 న హమాస్ ఇజ్రాయిల్ మీద దాడి చేసింది )

3

యుద్ధ కాలంలో కవి

ప్రపంచం ముక్కలుగా పడి వున్నప్పుడు
యుద్ధ వానర మూకలు బాంబులు వేస్తాయి.
బంగారం ధరకు
ఒక అన్నం పళ్ళేన్ని అమ్ముతారు.
జనియన్‌వాలా బాగ్‌లో
మరణం సంభవించిన మార్గంలో
గాజు పలకలు తాపడం చేసారు.
ప్రేమలో వున్న కవి మాత్రమే మిగిలి వున్న ఆశ.
తృష్ణాగ్నిని రగిలిస్తూ
ఆమె క్రూర శీతరాత్రిని గడుపుతుంది.
ఆమె అపరిపక్వ కలలను,
పర్వతాలను,నదులను నాటుతుంది.
ఆమె పుస్తకాలలో
బంతిపూలను భద్రపరిచింది.
కిటికీ మీద ముద్దాడే పొగమంచుని
అట్టకట్టి వుంచింది.
వారి జన్మభూమికి తిరిగొచ్చే
శరణార్ధుల పాదముద్రలతో
ప్రాతఃకాలం మరలినపుడు
తను త్యజించిన రాత్రుల నుండి
ఆమె అలసిపోయి..
లోకాన్ని కదలనిస్తుంది.
అక్షరాలలో,విరామ చిహ్నాలలో
వారు వెచ్చని ఆశను పొదుగుతారు.
రాత్రి నుండి తెల్లవారిందాక
వారి కలం వర్షిస్తూనే వుంటుంది.
శరణార్ధులుగా మారినవారికి
అది ఆశలు కల్పిస్తుంది.
మరి రేపు –
వాళ్ళు మళ్ళీ తప్పక తిరిగి వస్తారు.
( The smell of Azadi పుస్తకం నుండి )
*

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

1 comment

Leave a Reply to గిరి ప్రసాద్ చెలమల్లు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Nice poems . అక్షరాల్లో విరామ చిహ్నాల్లో వారు వెచ్చని ఆశను పొదుగుతారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు