1
పాలస్తీనా
పాలస్తీనా
నువ్వొక అద్దానివి .
నిండుగా అలంకరించుకున్న ప్రపంచం
నీ ముందు
నగ్నంగా బట్టబయలై పోతది
వాళ్ల చేతులు
రక్తంలో ముంచబడ్డవి
వాళ్ళ నాలుకల్ని లేసులు చేసుకు
ఇజ్రాయిల్ బూటుకుముడేసుకున్నారు
వాళ్ల చెవులను
అమెరికా తెల్ల సూదులతో
కుట్టేసుకున్నారు
తలలేని మొండాలు వాళ్ళు
ఆత్మలేని దేహాలు వాళ్ళు .
2
ఇంక్విలా బ్
కోళ్ల గూటిలోకి
పాము జొరవడ్డట్టు
అర్ధరాత్రి వాళ్లు
రూములోకి చొరబడ్తారు
నిరసన గొంతుకల్ని
తుపాకులకెర జేస్తారు
బదిరాంధుల పాలనలో
అధికారమే అన్నింటిని శాసిస్తుంది
నీ చెవులెట్లా తెగిపోయాయీ
నీకు మెడ పట్టి ఎప్పుడొచ్చిందీ
కోపం కృూరత్వాన్ని పెంచుతుంది
లాఠీ ఒళ్ళు విరుస్తుంది
వాళ్లకు
ఆకలి తెలీదు
నిరుద్యోగమూతెలియదు
మన్సద్ బూడిదెలా అయ్యాడో తెలవదు
ఎత్తిన పిడికిళ్లను
ఎన్ని బాయొనెట్లు కుల్లబొడిచాయో తెలువదు
మూర్ఖులు వాళ్లు
చీకట్లో ప్రజల్ని చంపుతారు
విద్యార్థులు, యువకులు, రైతులు, శ్రామికులు
పదేపదే
చిత్రహింసల కొలిమిలో దగ్ధమవుతుంటారు
ఇక్కడ
ఎవడూ అమ్ముడువోడు
యుద్ధాలు చేస్తూ, రక్త తర్పణ గావిస్తూ
ఉదయ గీతం కోసం పిలుపునిస్తారు
ఇప్పటికీ
పోరాటం మేలుకొనే ఉంది
గొంతులు పెగులుతూనే ఉన్నాయి.
ఊరేగింపు నడుస్తూనే ఉంది
పిడికెడు సూర్యకాంతి
వసంతమై విచ్చుకుంటూ నే ఉంది
విద్యార్థులు, యువకులు, శ్రామికులు
కెరటాలై వొస్తున్నారు
రాతిసింహాసనం పగుళ్ళు వారుతోంది
మిత్రులారా
ఇంకొంచెం గొంతు పెంచుదాం
ఇంక్విలాబ్.. ఇంక్విలాబ్.. ఇంక్విలాబ్
****
చిత్రం: రాజశేఖర్ చంద్రం
excellent