మధుర మీద మూగిన మబ్బులు ఎటూ తేల్చకుండా ఉన్నాయి . ఆరుబయటి అరుగు పైన నిదర తీయచ్చో లేదో కేసన్న కు బోధపడటం లేదు. లోపలి రణగొణధ్వని నిలవనీయటం లేదు. పోనీ కాస్త కాలు సాగించి సత్రం దాకా పోతే ?
దారి గుర్తున్నట్లు లేదే.. విస్సన్న చేయిపుచ్చుకు పట్టుకొచ్చాడు , విసుగులో ఏమీ గమనించుకోలేదు. సత్రం లో ఆ పూట వంట ఉండదనీ అం-దరికీ ఇక్కడే భోజనాలనీ అంటే , తప్పనిసరయి రావలసి వచ్చింది. అర్ధరాత్రి కావస్తూ ఉంది , అసలా ధ్యాసే ఎక్కడా లేదు.
” రాధే శ్యామ్ రాధే శ్యామ్ ..” – వెర్రులెక్కినట్లు అదేం తాండవం. అబ్బబ్బా…
ఊరొదిలి వచ్చిందైతే కాశీ కి పోదామని. అక్కడే ఉండి పోవాలని. గుంపులో కలవటం వల్ల తంటా, ఈ చోట ఆగటం. సరేలే , ఒక్ఖ రోజే గా..ఓపిక పట్టాలి.
అనుకున్నాడే గాని మనస్సు లో నెమ్మది లేదు. చిన్నా పెద్దా అలలు లేస్తున్నాయి లోపల. పెదవులు కదపకుండా పంచాక్షరి జపించుకుంటున్నాడు . అది నిజంగానే అజపమయి నడుమ నడుమ తునిగి పోతూ ఉంది.
” మహాదేవా !! పరమేశ్వరా !!! ”
ఆరాటానికి , లేచి – అటూ ఇటూ పచార్లు. ఏదో సుగంధం గాలిలో తేలి వస్తోంది – మొగలిపూవులదా ? ఛ.ఛ. శివుడికి ఆ పూవు కూడనే కూడదు..ఎటు వెళితే అటు వెంబడిస్తోందే…
ఏదేదో జ్ఞాపకమొస్తోందే..వద్దు వద్దనుకుంటున్నా.
***
ఎల్లన్న మంత్రి కొడుకు కేసన్న. బుద్ధి చురుకువాడు . బాగా డొక్కశుద్ధి గల కుటుంబం. అన్నోదకాలకు లోటు లేదు. పారంపర్యం గా వారు ఆ ఊరికి గ్రామాధికారులు. కుదుటి మొదటి నుంచీ స్మార్తులు. శివకేశవులు వారికి సమానం. ఇతరేతర దేవతలూ పనికివస్తారు , దేశకాలాల ప్రకారం.
ఆ మధ్యనెప్పుడో గంగాధరారాధ్యుల వారు సంచారం చేస్తూ అక్కడి కి వచ్చి , పెద్దలెవరో అర్థించటం వలన చాలాకాలం ఉండిపోయారు . కేసన్న కు పన్నెండేళ్ళొచ్చినప్పుటి నుంచీ, ఆరాధ్యుల వచనధార లో పొద్దస్తమానమూ, ఎన్నాళ్ళో – తడిసి ముద్దయి పోయినాడు. మహా విద్యుదయస్కాంతం వలె సదాశివుడి మహిమ లాగివేసింది. తండ్రికి చెప్పీ చెప్పకనే శివదీక్ష తీసుకొని లింగధారి ఆయినాడు. జన్మ ధన్యమయిందని తోచింది.
ఎల్లన్న కొంత విరాగి , వేదాంతి – ఈ పరిణామం ఆయనను పెద్దగా కలవరపెట్టింది కాదు…ఏకాదశి నాడు కేశవాలయానికి రానులెమ్మంటే తల్లి మాచమాంబకే గుండె కొంత చివుకుమంటుండేది. ప్రేమగా ఆ స్వామి పేరు కొడుకు కు పెట్టుకున్నది ఆవిడే. వారి వైపునంతా – జాస్తి గానే , విష్ణు భక్తి.
మేనమామ నారన్నప్రగడ కూతురు లక్కమ్మ , కేసన్న కన్నా ఆరేళ్ళు చిన్నది – పుట్టగానే తనకు జత గా ఆ పేరు పెట్టించుకుంది. ఈడూ వచ్చిందన్నారు – కాదనేందుకేముందని , ఆమె అంత చక్కనిది.
ఆ పిల్ల కాపురానికి వచ్చాకనే నలుగుడు మొదలైంది.తల్లి నీ తండ్రినీ తనవైపుకు తిప్పుకోలేకపోయాడు గాని, ఆ పసి ఇల్లాలు , అర్భకురాలు – అనుసరించి తీరాలని అతనికి పట్టు. శివదీక్ష ఇప్పించాడు. మారు మాట్లాడకుండా తీసుకుంది. మెడలో మంగళసూత్రాలనూ లింగాన్నీ మగడి పాదాలనూ లేస్తూనే వరసగా కళ్ళకు అద్దుకుంటుంది. శివపూజ కు ఏ కొరతా లేకుండా తీర్చుతుంది . తీర్థానికీ క్షేత్రానికీ తన వెంటే , తనతోనే. కలిగిన బిడ్డకు భక్తి తో త్రిపురాంతకేశ్వరుడి పేరు పెట్టుకున్నాడు.
కాని –
ఆమె హృదయం వేరే ఉంది. అది ఆలస్యంగా తెలిసి వచ్చింది .
తిప్పన్న కు మూడో ఏడు . మాచమ్మ ,లక్కమ్మ -నాలుగు వీధుల అవతల పేరంటానికి వెళ్ళి ఉన్నారు. ఎల్లన్నా ఇంట్లో లేడు. పిల్ల వాడు ఆడుతూ దెబ్బ తగిలించుకున్నాడు. ఒక్క వరసన ఏడుపు , చేతుల్లో నిలవకుండా. బలిమి ని చంకను వేసుకు ఇల్లంతా తిప్పుతున్నాడు తండ్రి. ఆ సందట్లో సామానులు పెట్టే కొట్టు దాటుతూ ఉంటే ” గోపన్న, గోపన్న ” అని కేకలు పెట్టాడు పిల్లాడు. ఏమీ అర్థం కాలేదు. గాలీ వెలుగూ చొరబడని ఆ మూల న, ఆ పాతభోషాణం అడుగున – ఏమిటి ? తిప్పన్న కష్టపడి బయటకు లాగాడు. చిన్న చందుగాయపెట్టె.
” ఇక్కల. ఇక్కలున్నాలు ” –
ఆ. ఉన్నాడా మంజూషికలో. త్రిభంగి గా నిలుచుని , వేణువు పట్టుకుని. చుట్టూ పూజ చేసిన పువ్వులు. పెద్దగా వడలలేదు.
కేసన్న కు రగిలిపోయింది. మోసం. మోసగత్తె ఇది. అసలా దేవుడే మోసగాడు. మాయగాడు…
నిలదీసి అడిగితే వణికిపోయి బావురుమంది. ఆమెతో బాటు పిల్లవాడూ మళ్ళీ ఏడుపు. పెద్ద వాళ్ళిద్దరూ నచ్ఛజెప్పబోయినారు. కేసన్న కు శాంతం రానేలేదు…అప్పటికి అణచుకున్నాడు గాని, హుటాహుటినఆ పెట్టె ను లక్కమ్మ పుట్టింటికి పంపించేశాడు గాని – తన మాట చెల్లకపోవటం ఆది నుంచీ అలవాటు లేదు కద , తగని రోషం…భార్యను ఆ పైన ఆదరించబుద్ధి కాలేదు.
ఏదో వెగటు- అంతంతకూ పెరిగిపోతూ.
వద్దు ఇంక ఇదంతా, వదిలేయాలని పుట్టింది.
అంతా సర్దేసుకుని ఎవరికీ చెప్పకుండా కాశీ బయలుదేరి పోయాడు. పది ఆమడలు దాటిన అనంతరం ఇంటికి వార్త పంపాడు , తిరిగి వచ్చేదంటూ లేదని.
నెలల తరబడి నడక. పదిదినాల కిందట , కృష్ణా తీరం నుంచి వస్తూ , విస్సన్న గుంపు తగిలారు. ఎంత కాదన్నా కేసన్న – మనిషి కీ మాటకూ మొహం వాచిపోయి ఉండి , వాళ్ళ తో కలిసిపోయాడు.
పేరుకే విస్సన్న గాని , వెన్నదొంగ మీద పిచ్చి అతనికి. ఆ వేళ శ్రావణ బహుళ అష్టమి అట – ఆ చోటనే పుట్టాడట – పుట్టుకంటూ ఉన్న వాడు భగవంతుడేమిటో…శివుడికైతే మొదలే లేదు.
***
విసిరి విసిరి కొడుతూ ఉన్న సౌరభాల గాలితెరలలో , ఇన్నాళ్లూ స్మృతి కి రాని గతమంతా – అప్పుడే జరిగినట్లు ఆవరించింది . ఆలోచిస్తుండిపోయి అడుగులు ఎటు పడినాయో గమనించుకోలేదు.
హోరున వాన మొదలైంది. దగ్గరగా కనిపించిన మండపంలో ప్రవేశించాడు. విశాలంగా వెచ్చగా ఉంది. వెంటాడుతూ వచ్చిన పరిమళం ఇక్కడ ఇంకా సాంద్రం గా ఉంది. పక్కనుంచి ప్రమిదల వెలుతురు. సన్నసన్నగా అందెల చప్పుడు .
చూడగా ఒక ఆడపిల్ల. పదహారేళ్ళది. నీలిరంగు పట్టు చీర లో.
మెరుపుతీగలన్నిటితోనూ వానమబ్బు దిగివచ్చినట్లు . పదునుగల ఖడ్గాల ను మాల కట్టి నిలిపినట్లు తళ తళ మనే శ్యామల దేహం. అలల అలల చీకటి లాగా బారెడు నొక్కుల జుట్టు. విచ్చిన నును నల్ల కల్వపూవు వంటి ముఖం. తననేనా – చూస్తున్న ఇంతలేసి కళ్ళు… చూస్తూండి పోబుద్ధయింది. అద్భుతంగానూ ఆత్మీయంగానూ కూడా అనిపించింది. ఒక చెల్లెలుంటే ఇంత ఉండేదా? ఇట్లా ఎక్కడుంటుంది, యువరాజ్ఞి కి మల్లే !
” ఏమన్నా ? ” – పలకరించింది.
” అమ్మాయీ, తెనుగు వచ్చునేమిటి ? ”
” వచ్చు ”
” మీ ఇల్లెక్కడమ్మా ”
” పుట్టిన ది ఆ ఒడ్డున అన్నా , ఉండటం ఇక్కడే ”
” పెండ్లి అయిందా ? ”
” ఆ. ఎప్పుడో. పుట్టక ముందే ”
” అదేమిటి ? ”
” సరే గానీ , పండగ లేదా నీకు ఇవాళ ? ”
” లేదమ్మా , నేను శ్రౌత శైవుడిని ”
” అయితే ? ”
” విష్ణువు నాకు ఆరాధ్యుడు కాడు ”
” నీకేనా , ఇంట్లో అందరికీనా ? ”
ఆమె యథాలాపంగానే అడిగినట్లున్నా ఉలిక్కిపడ్డాడు.
” చెప్పన్నా. చిన్న వయసులోనే ఇంత దూరమెందుకొచ్చినట్లు ? ”
చెప్పేశాడు. అంతా.
ఎందుకట ? ఆర్చేదా తీర్చేదా ?
నవ్వింది. అంత వానా తెమిలి సందెడు వెన్నెల చిమ్మినట్లు.
” అయితే గుళ్ళోకి వెళ్ళనంటావు ”
” ఊహూ ”
” వాడే వస్తాడులే ”
” ఎవరు ? ఎక్కడికి ? ”
” ఏం లేదులే –
అయితే అన్నా , అంత తేడా ఉందా శివుడికీ విష్ణుమూర్తి కీ ? ”
” మరి లేదేమిటి ? శివుడు ఎప్పుడూ ఉంటాడు. అట్లాగే ఉంటాడు. ”
” అడిగిన వారందరికీ వరాలిచ్చి అవస్థ పడుతూ ”
కేసన్న కు కోపమొచ్చింది.
ఆమె అల్లరి తగ్గించి –
” మరి , అట్లా…గే ఉంటే లోకాల పనులన్నీ తీర్చేదెవరయ్యా ? ”
” ఏం పనులు ! పిచ్చి పనులు అన్నీ – లేకపోతేనేం ? ”
” అందరికీ అట్లాగే అనిపిస్తుందా ? ”
” అనిపించకపోతే తెలుసుకోవాలి ”
” నీకు తెలిసినట్లు గానా ? ”
అతను మాట్లాడలేదు.
” చలనం లేని శివుడి కదలిక శక్తి – అది ఆమె అయితే పార్వతి, అతను అయితే విష్ణువు – వినలేదా ? ”
” నాకు స్థావరమే దైవం ”
” నీ దారి ఇది సరే , అందరికీ అదే నచ్చద్దూ ? ” – ఈసారి నవ్విన నవ్వుకి అతని మనసు ఒక్కసారి తేలికైంది.
” నీ పేరేమిటమ్మా ? ”
” చెప్పుకో చూద్దాం..నీకెన్ని పేర్లు తెలుసు – ఆడవాళ్ళవి ? ”
తల్లి చదువుకుంటుండే వేయి పేర్లు చిన్న ప్పుడు విని నోటికి వచ్చును. ఆ సమయానికి అవే గుర్తు వస్తున్నాయి.
చెప్పటం మొదలుపెట్టాడు .ఆమె వింటోంది.
” విష్ణు మాయా విలాసినీ ” – ఆ మీదట ఒళ్ళు తెలియలేదు.
***
చాన్నాళ్ళుగా పట్టని గాఢమైన నిద్ర . లేస్తూనే లక్కమ్మ ఏంచేస్తోందో అనిపించింది. . కోపం గా లేదు , ప్రేమ గా ఉంది. మమత గా ఉంది. అట్లా ఉన్నందుకు ఆశ్చర్యం కూడా లేదు.
అంత దూరాన ప్రాతఃస్తవం వినిపిస్తోంది. దగ్గరగా వెళితే ఆలయం లో నల్ల రాతి బొమ్మ. నీలిరంగు పట్టుచీర. ఎనిమిది చేతులు.
” ఎవరు ”
” ఎవరేమిటి నాయనా – యోగమాయా దేవి. శ్రీకృష్ణ సోదరి . నిన్న ఆవిడ జన్మదినం కూడా కదా , ఉత్సవం చేశాము ”
నిన్నటిదే ఆ పరిమళం. పరీక్షించి పరికిస్తే అవే అవే కవళికలు. అదే సామీప్యపు ఎరుక.
విస్సన్న వచ్చాడు వెతుక్కుంటూ.
” ఎక్కడికి పోయావయ్యా – భోజనం సమయానికి ? బ్రహ్మాండమైన విందు – అన్నన్ని తీపి వంటలు మనకెప్పుడైనా తెలుసా పెట్టా ? కన్నయ్య కు భోగమనగా ఈ ఉత్తరాది వాళ్ళ దగ్గరే …. ఆహాహా !! ”
కేసన్న కు ఏమీ చెవికి ఎక్కటం లేదు.
కాళ్ళూ కళ్ళూ తేలిపోతున్నాయి .
యోగమాయ.
ఎందుకు ఆ దర్శనం ? తనకే ఎందుకు ?
ఇప్పటి తపస్సా ఎప్పటిదో పుణ్యమా ఆవిడ సంకల్పమా …
వలయాలై చక్రాలై గిరాగిరా తిరిగిపోతూ టక్కున ఆగింది యోచన. అప్పుడింక ప్రపంచం వాస్తవమై కనబడి , సంభవించినది స్వప్న మాత్రమైంది.
అమావాస్య నాటికి వారణాసి చేరారు. విశాలాక్షీ నాథుడై విశ్వేశ్వరుడు కనిపించాడు. అది ఒక మార్పు – ఇన్నాళ్ళూ అమ్మ వారిని ప్రత్యేకించి తలచుకున్నది లేదు, ఇప్పుడు ఇద్దరూ విడివడటం లేదు.
మణికర్ణికా ఘట్టం. ఆ సరస్సు ను విష్ణుమూర్తి తవ్వాడట.
” ఆహా. అవునా ”
అక్కడి బిందుమాధవస్వామి గుడి లోపలికి వెళ్ళలేదు గానీ , పూజారి హారతి ఇస్తుంటే ఎవరూ అడ్డం లేరు …కనబడిపోయాడు. రాకపోకలు లేని చుట్టాన్నెవరినో చూసినట్లనిపించింది.
* * *
తల్లీ తండ్రీ పొంగి కిందామీదా అయినారు – ఎల్లన్న వైరాగ్యం ఆ వేళ ఎటుపోయిందో ఏమో. అంత పౌరుషంగలకుర్రవాడు,ఇంతత్వరగాతిప్పుకుంటాడనుకోనే లేదు. పొలిమేర లో ఉన్న పోతరాజు కు మొక్కుకున్నది సత్యమైందనుకుంది మాచమ్మ. అంతకూ మూలమైన కథానాయిక భర్త కు ఎదురు పడనేలేదు…ఆ నాడే కాదు, అత్తగారు మందలించేదాకా.
తర్వాత మాత్రం అబ్బురమే – అంత లాలస, మార్దవం – అతనిలో ఇదివరకెన్నడూ లేదు.
” నీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి కొలుచుకో ” – మెల్లిగా చెప్పాడు. ఆమె తిరిగి అంత సాహసానికి ఒడిగట్టలేదు. ఆయన వచ్చాడు అంతే చాలు .
మళ్ళీ ఏటికి బంగారుతండ్రి వంటి పిల్లవాడు కలిగాడు.
పోతన్న.
ఏళ్ళు గడిచాయి.
పెద్దవాడు తిప్పన్న తండ్రి దారిలోనే శివదీక్ష తీసుకున్నాడు , అతనికి భక్తి కుదిరింది.
పోతన్న కూ శివుడు ఇష్టమే … అయినా ఇంకేదో మాధుర్యం వైపుకు అంతరాత్మ ప్రసరిస్తుండేది. మాతామహుల ఇంట చేరిక ఎక్కువ. ఆ చోట వినిపించే కృష్ణ లీలలు , భాగవత గాథలు…లోపల చల్లగా ఉండేది.
ఉపనయనం అయింది. ఆ వెంటనే చిదానందయోగి పిలిచినట్లు గా వచ్చి ఉపదేశం ఇచ్చాడు . తారక మంత్రాన్ని. తండ్రి కి చెప్పే వెళ్ళాడు , కేసన్న చూస్తూ ఊరుకున్నాడు.
ఈ పిల్లవాడు పుట్టిన కారణమేదో – ఉందేమో !
పోతన్న లింగధారి కాలేదు గానీ తండ్రి దగ్గరే శివ పంచాక్షరీ మంత్రం తీసుకున్నాడు . శివుడికీ శ్రీరాముడికీ అభేదం గా ఉండేది – ఒక్కోసారి ఒక జపం మొదలై మరొకదానిలోకి విస్తరిస్తుండేది…అట్లా అవవచ్చునో లేదో తెలియదు. తిక్కన్న సోమయాజి ది ఆంధ్రమహాభారతాన్ని అంకితం పుచ్చుకున్న హరిహరనాథుడు లేడూ ?
నిబ్బరం వచ్చేది.
గ్రాహకం వచ్చిననాటినుంచీ పోతన్న కూ సారస్వతానికీ తెంచరాని లంకె. కొంతేమో చదివాడు , ఊరిలోని పండితుల దగ్గర. వాళ్ళు నేర్పినదానికీ ఇతను నేర్చినదానికీ సహస్రం తేడా ఉండేది. పద్యాలు అల్లుతూ ఉంటే ఆ సంగతి కొట్టొచ్చినట్లు తెలిసేది. అమ్మవారికి దయ పుడితే , ఎన్నడూ చదవని గ్రంథాలన్నీ స్ఫురణ లోకి వస్తాయని శాస్త్రం ఉంది – నాటికి కాళిదాసూ ఉన్నాడు. గురువులు చాటు గా తలచుకొని మురిసేవారు – ఎదుట అంటే ఆయుక్షీణమని.
ఒక తప్పటడుగుల దండకం అనంతరం తండ్రి కేసన్న కు సంతోషమిచ్చిన వీరభద్రవిజయం.
* * *
ఆనాడు పూర్ణిమ. చంద్రగ్రహణం.
గోదావరీ స్నానం చేసి మహేశ్వర ధ్యానం చేస్తున్నాడు.
కలో మెలకువో ఏదీ కానిదో – అప్పుడు , అక్కడ.
నల్లనివాడు, పద్మనయనమ్ముల వాడు , కృపారసమ్ము పై జల్లెడు వాడు – చేత విల్లంబులతోటి చెంగట కనకాంగి తోటి
పొడగట్టాడు.
భాగవతాన్ని తెలుగు చేయి, మోక్షం ఇస్తానన్నాడు.
”పలికెద , వేరొండు గాథ పలుకగనేలా ? ”
సంప్రదాయానుసారం అందరు దైవాలనూ స్మరించి ప్రారంభించినా ,
గట్టిగా పట్టుకున్నది మాత్రం అమ్మ పాదాలను. షష్ట్యంతాల తర్వాత స్మరించుకున్నదంతా అమ్మలగన్న అమ్మనే , వైనవైనాలుగా. అక్షరాలా త్రివిక్రమం కాగల వాక్కు ను ఆవిడ వరమిచ్చింది.
తలపెట్టిన పని తెలిసిన మేనమామ మారన్న పరుగెత్తి వచ్చాడు . అప్పటి గోపన్న ను చాటున తెచ్చి చేర్చాడు. పోతన్న తల్లి ఎదురుగా కళ్ళకు అద్దుకున్నాడు.
తొమ్మిది వేల పైచిలుకు పద్యాలలో మూడవ భాగాన్ని మించి , వాసుదేవుడి గురించినవి. దశావతారాల కథలూ ఉన్నా దశమ స్కంధపు రుచే చాల హెచ్చు. విష్ణువు పరంగా చెప్పిన మొట్టమొదటి పద్యంలో మహానందాంగనా డింభకుడని చిట్టచివరన వేసిన సమాసం లోవి మునిగిన కొలది లోతులు.
తొమ్మిది విధాల భక్తికీ భాగవతం ఆలవాలం – అన్నింటినీ , సాటిలేనట్లుగా – చిత్రించారు పోతన్న.ప్రహ్లాదుడూ గజేంద్రుడూ తెలుగుల పున్నెం కొద్దీ ఆయన నోట పలికారు. కుంతిదేవీ విదురుడూ కుచేలుడూ నారదుడూ …ఎందరని !!
ఇందరున్నా , కృష్ణుడిని వలచినవారిదీ వరించినవారిదీ అక్కడి పరమాకర్షణ. ఎప్పటికీ .
” మనమందరమూ స్త్రీలమే, ఆయనొక్కడే పురుషుడు ” అంటాడు ఉద్ధవుడు. మధురభక్తి – భగవంతుడి పైని మోహం … గోకులం లో ప్రారంభమై కుబ్జ చెంత అందగించి కుండిననగరం లో వర్ధిల్లి జాంబవంతుడి గుహ లో రాజిల్లి సత్రాజిత్తు ఇంట అతిశయించి కాళిందీ తీరానా కోసల అవంతీ మద్ర కేకయ రాజకుమారిక ల చిత్తాలలోనూ నర్తించి , నరకాసుర కారాగారపు వేనవేల విడుదలల ధ్యేయమై.
ఎందరిదో ఉపాధియై , పాథేయమై. నిరవధిగా.
* * *
( పోతన్న గారి తండ్రి కేసన్న శైవాన్ని స్వీకరించారని – భాగవతం లో, వంశావళి గురించిన పద్యం లో ఉంది. అంటే అంతకు మునుపు వారు శైవులు కారు. అన్నగారు తిప్పన్న శివభక్తి తత్పరుడని ఉంది. తల్లి పేరు లక్కమ్మ ( లక్ష్మమ్మ ) , అది శైవుల పేరు కాదు. వీరు పదిహేనవ శతాబ్ది మొదటి/ మధ్య భాగం వారు. శైవ వైష్ణవుల మధ్యన వైషమ్యాలు అంతకు మునుపెప్పుడో మొదలై అప్పటికి ఉన్నాయి.
ఇది ఆధారం కాగా, జన్మాష్టమి ని ‘ మోహరాత్రి ‘ అంటారని ఒక మహానుభావులు ఇచ్చిన వివరణ ఈ కథ కు ప్రేరణ.
లోకయాత్ర సాగేందుకని మోహపుతెర కప్పి ఉంచి , అడిగి వేడుకుంటే తానే కరగించగల యోగమాయా
మోహాన్ని తనవైపుకు తిప్పితే చాలు మోక్షమని తేల్చిన శ్రీకృష్ణుడూ
ఒకరే అయిన ఇద్దరూ పుట్టిన రాత్రి కనుక (కూడా) అది మోహరాత్రి అన్నారు ఆయన. )
*
చాలా కావాలి… చాలా వుండాలి
తత్వం బోధ పడడానికి…ఇది…నా గురించి
మీ మాటలను అభినందనగా తీసుకుంటున్నాను..ధన్యవాదాలండీ !
మాటల్లేవండి. ఈ రాత్రి ( అమెరికాలో) నాకు మోహరాత్రే అయ్యింది. ఎంత చక్కని భాష. పోతన్న గారి నేపథ్యానికి మీ భాష, కథనం గంధపుపూతే అయ్యింది. యోగమాయ, విష్ణుమాయా విలాసిని, శివుని శక్తి ఆమె అయితే పార్వతి, అతను అయితే విష్ణువు……. ఒళ్లు గగుర్పొడిచింది మైథిలిగారూ! ఇంత గొప్ప మోహరాత్రికి మీకు ధన్యవాదాలు!
చాలా ధన్యవాదాలు శశికళ గారూ…
Very informative Mam, the way you take up the storyline…. it is very interesting.
Thank you so much andee
Great!
“కేళీ ముగ్ధ శుకాభిరామ లపనా క్రీడా సరోహంసికా!
కాళీపాద శరణ్యుడైన హరి నాకంటెన్ మరొక్కర్తితో
శూలాకారకబాల ఫాల రుచితో చొక్కున్గదే వానినీ
కాళిందీతట కాననంబుల కనంగానౌనటే చెప్పవే!
………………..(గోపికా గీతలు – వి. స. నా)
ధన్యవాదాలండీ !
కృష్ణాష్టమి రోజు భాగవత కర్త జన్మవృత్తాంతం తెలిపారు, ఇది నిజంగా అద్భుతం. ధన్యవాదాలు madam.
చాలా సంతోషమండీ !! ఇది Historical fiction కిందకు వస్తుంది..
చదివాను. ఆ తన్మయత్వం నుండి బయట పడడానికి కొంత సమయం పట్టింది.
అమృతం వంటి అంశం తీసుకుని
అద్భుతం గా రాశారు.
కథ కాదు.
కమనీయ మైన దృశ్య కావ్యం.
అభినందనలు.
చాలా ధన్యవాదాలు మాడమ్ !
కళ్లకద్దుకుకోవాల్సిన ‘మోహరాత్రి’.. అది… మైథిలి గారే
యిలా రాయగలరు.
చాలా చా లా ధన్యవాదాలండీ
అద్భుతమైన కధనం మైథిలి గారు! శ్రీకృష్ణాష్టమి నాడు చక్కటి కధ అందించారు. ధన్యోస్మి!
This story will be a benchmark for “faction” (fiction based on facts) in telugu.
చాలా సంతోషమండీ !! మంచి పేరు పెట్టారు 🙏
మోహమనే మత్తులో మైమరపించేసారండీ..ఎంత చెప్పినా తక్కువే..
చాలా ధన్యవాదాలండీ !!
well chakkati paalu kobbari payasam tinnanttu vundi me rachana
మంచి పోలికండీ. ధన్యవాదాలు !!
Excellent mythili. Couldn’t stop reading.
Thank you so much, Uma !
కృష్ణాష్టమి మత్తులోనుంచి ఇప్పుడిప్పుడే బయటకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను … మీ కధ చదివి ఆనందంగా తిరిగి ఆ మత్తులాంటి అవస్థలోకి వెళ్ళిపోయాను. Thank you soo much maam 🙂
చాలా సంతోషం సురేష్ !!
చాలా సంతోషం సురేష్ !
యోగమాయ….నాక్కూడా సాక్షాత్కరింపచేశారు.ఆ వాక్యాల దగ్గర శరీరం రోమాంచితమయింది.మీలోని సరస్వతికి నా పాదాభివందనాలు…భవానీ జగదీష్
చాలా సంతోషం భవాని గారూ
కథ చదూతున్నంత సేపూ పిలకా గణపతి శాస్త్రి గారు గుర్తుకు వచ్చారు, మళ్లీ ఆయనే వచ్చి ఈ కథ వ్రాశారా అని, మొదటి కాసిని వాక్యాల లోనే పోతన గారి సమయానికి వెళ్ళి పోతాము. ఇంకా ఇంకా రాస్తు ఉండండి..
ఎంత మంచి మాటలండీ ! చాలా సంతోషం…
భక్తి కి అక్షర రూపం…అపురూప చైతన్య స్రవంతి బహురూపమైన వైనం….అక్షరం తోనే కళ్ళకు కట్టినట్టు వ్రాసారు…అభినందనలు…
చాలా చాలా ధన్యవాదాలండీ!
Able to read a different story depicting the Maha Maya leading into Mohamaya. Really a true story to remember. Krishna Madhu sudhana Madhava HaraHara. 🙏🙏🙏
Thank you so much !
” మోహ రాత్రి ” కథ లో భావుకత అద్భుతంగా , మధురంగా వుంది !
పౌరాణిక గాధలు రాయడంలో తనదైన ఓ ప్రత్యేక శైలి చూపంచారు మైథిలి గారు . అభినందనలు !
చాలా చాలా ధన్యవాదాలు మాడమ్ !!
Atyadbhutam,no words to express how much I have connected with the narration.
చాలా చాలా సంతోషమండీ !
పోతన కృష్ణ లీల కధ పుణ్య వశంబున బుట్టె దెవకీ
మాత కు కృష్ణ పక్షనిజ మాసము శ్రావణ మష్టమీ తిధిన్
మాతుల దౌష్ట్య నష్టమన , మాయను మాత్రమె జూపె , నంతలో
జాత స్తనంధయుండరిగె ఝల్లిక జల్లుచు నంద వాడకున్.
శ్రీ కైవల్యపదాన్ని చేరుకోవడానికి తోడ్పడే మోహమాయ ఇదేనేమో ఆనిపించేంతగా ఉందండీ, మీ మోహమాయా ! అద్భుతం !!
చాలా ధన్యవాదాలండీ !
Beautifully told….