మోహయానం

నంతవాయు వొక నియంత

మంటలకౌగిలి పాషాణ శాసనం

పన్నీటికి ఖరీదు కట్టేది బూడిదే

అస్తమయం నిత్యం చితిలోనే

 

సమ్మోహ ప్రపంచంలో కాలుపెట్టాక

పువ్వుల పుట్టుక ఒక పరిహాస పీఠిక

అరణ్యాల ఉనికి అంటరాని క్రీడ

సామ్రాజ్య విస్తరణే ఏకైక నినాదం

+++++

లోయల్లో వికారాలు విర్రవీగుతాయి

శిఖరాలపై పెనువిపత్తులు పేట్రేగుతాయి

చూపులూ చేతలూ బరితెగిస్తాయి

సుషుప్త గొంతుకల దీనారావాలతో

పచ్చని దిక్కులు పిక్కటిల్లుతాయి

భీతహరిణులు బేలగా కొమ్ములిసురుతాయి

లోహపదఘట్టనల నడుమ భయంకర నిశ్శబ్దీకరణ

 

పరుగెక్కడికో పందెమెవరితోనో తెలియదు-

అద్దాలను మోసగించే అలంకారాలెందుకో

భుజం మోయలేనన్ని భూములెందుకో

నిట్టాడుకు బదులు నింగినంటే భవనాలెందుకో-

 

నిర్భీతిగా మరణించగల

క్షణకాలాన్ని కలగన గలవా

దళసరి దాహాల సముద్రాన్ని ఈది

పెరటిబావిలో దప్పిక తీర్చుకోగలవా

పరీక్షమాత్రంగా నాలుక కత్తిరించుకుని

ఖాళీడుపుల లోతుల్ని లెక్కించగలవా –

 

ప్రాణవాయు వొక ప్రజాక్షేత్రం

ఉల్లంఘన నిప్పులాంటి నిరసన

ఉదయకాంతి ఒక నిరంతర స్వప్నం

కన్ను విప్పి చూడు

బూడిద కూడా పరిమళ భరితమే

—0—

 

painting: Satya Birudaraju

ఎమ్వీ రామిరెడ్డి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు