నేను బొంబాయి ఐఐటి లో ఉన్న ఎనిమిదేళ్ళే కాదు….ఆ తరువాత ఈ మధ్య వాడు రిటరై అయిపోయే దాకా సుమారు 30 ఏళ్ళు కేంపస్ లో తెలుగు వారికి తలలో నాలుక ఎవరూ అనే ప్రశ్నకి ఆని తరాల వారూ చెప్పే పేర్లు మోహనూ & లక్ష్మీ….వాడి పూర్తి పేరు తల్లాప్రగడ రాజా రామ్ మోహన్..అనగా టి.ఆర్.ఆర్. మోహన్…గుంటూరు వాడు. నా ఆప్తమిత్రుడు టి.పి. కిషోర్ గాడి అన్నయ్య. మెటలర్జీ డిపార్ట్ మెంట్ లో డాక్టరేట్ చేసి, చేస్తూ ఉండగాఎలా పడ్డాడో కానీ బొంబాయి మాటుంగా అమ్మాయి సుబ్బలక్ష్మి తో ప్రేమలో పడి, ఆగ లేక పెళ్లి చేసుకున్నాడు. ఇంకా స్టూడెంట్ కాబట్టి కేంపస్ లో కాపరం పెట్టడానికి క్వార్టర్స్ ఇవ్వ లేదు కాబట్టి …రైలు పట్టాల మీద నడిస్తే ఐదు మైళ్ళ దూరంలో విహార్ సరస్సు పక్కన ఉండే NITIE ( National Institute of Training Industrial Institute) అనే చోట కాపరం పెట్టి, బిందు అనే ఆడ పిల్లని కని ….సంసారం ఈదే వాడు…కొన్నాళ్ళకి లెక్చరర్ గా చేరి కేంపస్ లో క్వార్టర్స్ సంపాదించుకుని స్థిరపడ్డాడు. మోహన్ కూడా కిషోర్ లాగే నిత్యాగ్నిహోత్రుడే…మంచి టేబుల్ టెన్నిస్ ఆటగాడు…ఆంధ్రా టీమ్ కి ఆడాడు…. అసలు విషయం ఏమిటంటే ఆ సుబ్బలక్ష్మికి వంట చెయ్యడం సరిగ్గా రాదు కానీ భరత నాట్యం, వీణ వాయించడం, పాటలు పాడడం, నాటకాలలో మాతో వేషాలు వెయ్యడం, ఇంటికి ఎవరొస్తారా అని ఎదురు చూస్తూ వాళ్ళకి మంచి టీ కలిపి ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం లాంటి కోటి విద్యలూ వచ్చును. అంచేత మా ముగ్గురికీ..అంటే నేనూ, మూర్తీ, రావూ ఏ సాంస్కృతిక కార్యక్రమం తలపెట్టినా వీళ్ళు మా తరం వాళ్ళే కాబట్టి రిహార్సల్స్ కీ అన్నింటికీ వాళ్ళ ఇల్లే హెడ్ క్వార్టర్స్. మరొక ముఖ్యమైన కారణం ఈ మోహన్ గాడి జాతకం ఏమిటో తెలీదు కానీ, ఎప్పుడూ వాడి ఆదాయం 2, వ్యయం కనీసం 14…..వాడి జేబుకి ఎప్పుడూ చిల్లే. లక్షి కూడా అదే బాపతు. అంచేత చంటిది అయిన బిందు కి పాలు కొనాలన్నా, వాడి కి బీడీలు కావాలన్నా, అసలు ఇంట్లో సరుకులు ఏం కావాలన్నా “ఏరా పి.ఎమ్.కె….ఎలా ఉన్నావు..అలా బజారు కెళ్ళాలి వస్తావా?” అనగానే నాకు విషయం అర్ధం అయిపోయేది. నా జేబుకి చిల్లు పడేది. ఈ పి.ఎమ్.కె. అనేది వాడు నన్ను ప్రేమగా పిలిచే ముద్దు పేరు. ..అంటే పొట్టి ముం….కొడుకు” అని. 1967 లో నాకు పరిచయం అయినప్పటి నుంచీ నన్ను అంత ఆప్యాయంగా పిలిచే వాళ్ళు ఆ రోజుల్లోనూ, ఈ రోజుల్లోనూ ఎవరూ లేరు. నేను వాణ్ణి “బొండాం” అని పిలిచే వాడిని. ఎందుకంటే నేను వాడి కంటే పొట్టి అయితే వాడు నా కంటే గుండ్రంగా ఉండే వాడు మరి!. ఈ రోజుల్లో, ఈ తరంలో ఇటువంటి పిలుపులు ఉన్నాయో, లేదో, ఉన్నా ఎటువంటి సంకర భాషలో ఉంటాయో తెలీదు.
మోహన్ గాడు డాక్టరేట్ పూర్తి చెయ్యడానికి కొన్ని “వందల” సంవత్సరాలు పట్టింది..అంటే పదేళ్ళకి పైగా అవస్తపడ్డాడు పాపం. అవును మరి…ఒక వేపు సంసారం, ఆర్ధికపరమైన ఇబ్బందులు…పూర్తి స్థాయి లెక్చరర్ ఉద్యోగం…ఏం చేస్తాడు పాపం. ఇక నేను అమెరికా వచ్చేశాక పుట్టిన వాడి రెండో కూతురు రేఖ ని ఒకటి , రెండు సార్లు చూశాను. నేను ఒక సారి అమెరికా నుంచి బొంబాయి వెళ్లి నప్పుడు వాళ్లకి తీసిన ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను. ఆ మాట కొస్తే నాకు పెళ్ళయ్యాక మా ఆవిడని బొంబాయిలో దగ్గరుండి విమానం ఎక్కించి హ్యూస్టన్ పంపించి పుణ్యం కట్టుకున్నది కూడా మోహన్ దంపతులే. మోహన్ ప్రొఫెసర్ గా సుమారు 20 మంది డాక్టరేట్లని తయారు చేసి, పదవీ విరమణ చేసి ప్రస్తుతం బొంబాయి దగ్గర థాణే అనే ఊర్లో ఉన్నాడు. నేను మోహన్ & సుబ్బలక్ష్మి దంపతులని చూసి కానీ, మాట్లాడి కానీ 15 ఏళ్ళు దాటింది. ఇప్పుడు బిందు కెనడాలో ఉంది అని విన్నాను. విశేషం ఏమిటంటే…మోహన్ వాడికి యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కేలిఫోర్నియా, లాస్ ఏంజెలెస్ లో సుమారు ఇరవై ఏళ్ల క్రితం ఫెలోషిప్ మీద విజిటింగ్ ప్రొఫెసర్ గా అవకాశం వచ్చింది. అప్పుడు అతని కుటుంబం, మరొక ఆప్త మిత్రుడు శివరామ్ కుటుంబం హ్యూస్టన్ వచ్చి వారం రోజులు మా ఇంట్లో ఉన్నారు. అప్పటి ఫోటో కూడా జతపరుస్తున్నాను. ఎటొచ్చీ యధాప్రకారం వాడి వ్యయం ఆదాయం కంటే బాగా తక్కువ గానే ఉండి, జేబులు ఖాళీ చేయించుకునే నా లాంటి పి.ఎమ్.కె లు అమెరికాలో ఉండరు కాబట్టీ, సుబ్బ లక్ష్మికి అమెరికా అస్సలు నచ్చ లేదు కాబట్టీ అమెరికాని కాదని మళ్ళీ బొంబాయి వెళ్ళిపోయాడు మోహన్. ఈ వ్యాసం వాస్తున్నంత సేపూ మోహన్ & సుబ్బ లక్ష్మీ జ్ఞాపకం రావడమే కాదు…వాళ్ళ చేత నేను వేయించిన నాటకాలూ…ముఖ్యంగా మోహన్ గాడు మొట్ట మొదట సారి యమ ధర్మ రాజు వేషంలో స్టేజ్ ఎక్కగానే హడిలి చచ్చి పోయి గద కుర్చీకి ఆనించి బిగుసుకు పోయిన సంగతి తల్చుకుని ఇప్పటికీ నవ్వొస్తోంది….నా నాటకాల సంగతులు తర్వాత సంచికల లో వ్రాస్తాను.
ఇక 1967 లో మా కేంపస్ లో జరిగిన అత్యంత కీలకమైన, మా అందరినీ రెప రెప లాడించిన పెను మార్పు ఐదుగురు అమ్మాయిలు ఒకే సారి రంగ ప్రవేశం చెయ్యడం. అంత రెప రెప లాడడానికి మొదటి కారణం ..అంత వరకూ మొత్తం కేంపస్ లో ఉన్న వేలాది మంది విద్యార్ధులలో సుమన్, రేఖా రెగే, ఉష చిందర్కర్ అనే ముగ్గురు మాత్రమే అమ్మాయిలు ఉండే వారు. రంగు కోసం మొహం వాచిపోయిన మిగిలిన 997 మందీ…మా ముగ్గురితో సహా…రోజూ కాకపోయినా కనీసం వారాంతం లో అయినా అటు కొలాబా నుంచి ఇటు మాటుంగా, దాదర్, జుహూ బీచ్ వగైరాలు చక్కర్లు కొడుతూ ఉండే వారు. అంత కంటే హుషారైన కారణం ..స్వాతి దత్తా, అరుణ గోఖలే, రత్న, ఉమా రామమూర్తి…ఐదో అమ్మాయి పేరు మర్చిపోయాను…పేరు ఏదయితేనేం…వీళ్ళు అత్యాధునిక తరహా ‘అమెరికన్ యువత”…అనగా ….మర్యాదకి క్లాసులకి సల్వార్ , కమీజ్ కానీ, చీర కానీ కట్టుకున్నా, ఇతర సమయాలలో అవును…..మోకాలి పైకి ఉండే చెడ్డీలు….టీ షర్ట్ లు..వేసుకునే వారు. అంత కంటే ఆశ్చర్యంగా …అబ్బాయిలతో హుషారుగా తిరిగే వారు….ఉత్తినే తిరగడం ఏమిటీ…అందులో ఇద్దరు నిక్కర్లు వేసుకుని టెన్నిస్ ఆడేవారు. మరొక ఇద్దరు ..అవును..ఏకంగా గిటార్ వాయించే వారు..హాలీవుడ్ సినిమాలలో డోరిస్ డే, సోఫియా లోరెన్ లాగా…ఇక కుర్ర కారు గుండెలు రెప రెప లాడాయి అంటే ఆడవు మరీ!. వాళ్ళు ఏయే డిపార్ట్ మెంట్లలో ఏం చదివే వారో మాకు తెలీదు. అయితే వాళ్ళు ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ లాంటివే కానీ ఇంజనీరింగ్ కాదు అని తెలుసు. ఆ రోజుల్లో అమ్మాయిలు ఇంజనీరింగ్ చదివే వారు కాదు.
పైగా మరొక విశేషం…..మా కేంపస్ లో సుమారు వెయ్యి మంది పట్టే కాన్వోకేషన్ హాల్ అని ఒక పెద్ద హాలు ఉండేది. అందులో ప్రతీ వారం ఒక సినిమా వేసేవారు. అక్కడ ఉన్న బ్రహ్మాండమైన స్టేజ్ మీద రవీంద్ర నాథ్ టాగూర్ నాటకాలు వేశేవారు. అక్కడే పరీక్షలు కూడా జరిగేవి. ఇప్పుడు ఇంకా చాలా ఆధునికంగా మారిపోయిన ఫోటో ఇక్కడ జతపరుస్తున్ను. ఆ రోజుల్లో మటుకు ఆ హాల్ మా సాంస్కృతిక కేంద్రం. ఆ స్టేజ్ వెనకాల సుమారు 500 అడుగుల వైశాల్యం ఉండే పెద్ద హాల్ ఉండేది. అది మ్యూజిక్ హాల్. అందులో తబలాలు, సితార్లూ, గిటార్లు, వయొలిన్లు, డప్పులు, మెండోలిన్లు,..ఫ్లూట్లు…ఒకటేమిటి….మన దక్షిణాది వీణ, మృదంగం లాంటివి తప్ప మిగిలిన భారతీయ సంగీత వాయుద్యాలు అన్నీ ఉండేవి. ఆ సంగీతం విభాగానికి “శోక్రబోర్తి”..అదే లెండి..చక్రవర్తి అనే బెంగాలీ ఆయన టీచర్ గా ఉండే వాడు. ఆ మానవుడు బాగా వాయించని వాయిద్యం లేదు. బాగా పాడని సంగీతం లేదు. అటు గుజరాతీ భజనలు, మరాఠీ గీతాలు, హిందుస్తానీ సంగీతం…ముఖ్యంగా రబీంద్ర శోంగీత్..అనగా బెంగాలీ రవీంద్ర సంగీతం…అన్నింటిలోనూ ఆయనకి ప్రావీణ్యత ఉంది. అంతే కాదు..రోజుకి ఇరవై నాలుగు గంటలూ కారా కిళ్ళీ నమలడం లో కూడా..అంతే కాదు. అసలు సిసలు బెంగాలీ లాల్చీ, పజామా…
ఈ సంగీతం హాల్ గురించి ప్రస్తావించడానికి ప్రధాన కారణం ఇందాకా చెప్పిన ఆ ఐదుగురు అమ్మాయిలే. ఎందుకంటే వాళ్ళు ఐదుగురూ పాటలు నేర్చుకోడానికి ఈ చక్రవర్తి గారి దగ్గర చేరారు అని తెలియగానే పోలో మని మేం అందరం కూడా అర్జంటుగా గుజరాతీ భజనలతో సహా నేర్చుకోడానికి రెడీ అయిపోయాం. పైగా మా రావు పి.సుశీల తమ్ముడు అని తెలియగానే మాకు స్పెషల్ ట్రీట్ మెంట్ ఉండేది. అలా అని మాకూ, ఆ అమ్మాయిలకీ పెద్ద స్నేహం కుదర లేదు కానీ ఇది వరకూ లేని కబుర్ల కాలక్షేపం జరిగేది.
ఒక సారి మా హాస్టల్ పార్టీ కి వాళ్ళని కూడా పిలిచాం..అలాంటి పార్టీలలో ఒక చిన్న తమాషా ఉండేది. అదేమిటంటే….హాస్టల్ లో ఉన్న కొంత మందికి ..అంటే హాస్టల్ మెస్ సెక్రెటరీ లాంటి వాళ్లని స్టేజ్ మీదకి పిలిచి “రోస్ట్” పద్దతిలో ఒక సరదా నిక్ నేమ్ ఇచ్చి, వాళ్ళ గురించి జోకులు చెప్పి నవ్వించే ప్రక్రియ ఉండేది…ఆ రోజు మాకు తెలియకుండా హఠాత్తుగా ఈ ఐదుగురు అమ్మాయిలు నన్నూ, మూర్తి నీ, రావునీ స్టేజ్ మీదకి పిలిచి మాకు వాళ్ళు ఇచ్చిన నిక్ నేమ్స్ చదివారు. అందులో రావు పొడుగ్గా ఉంటాడు కాబట్టి “స్టడ్” అనీ, మూర్తి ని “బోల్ట్” అనీ..నన్ను…అవును..”నట్” అనీ మా సంగీతం మీదా, క్రికెట్ మీదా ..ఒకటేమిటీ రక రకాల జోకులు వేశారు…..అంటే మా ముగ్గురినీ The stud, the bolt and the nut” అని పిలుచుకునే వారనమాట!
మరి కొన్ని విశేషాలతో ..వచ్చే నెల కలుద్దాం…
*
Nice anecdotes of the forgotten times. Anyway, you create (or remember) such memorable characters, I usually look up the names. Here is the info: https://www.researchgate.net/profile/Rama_Mohan_Tallapragada (Rama mohan Tallapragada). He went to Majety Guravayya High school!
షోక్ర బొర్తి is the term caused PEAK of my laugh Sir. Reason, I am staying in Kolkata and being called as రబీ కుమార్ or రోబి కుమార్ by different people.
It also reminds me Late Kavana Sharma Gaaru, who wrote many Bengali pronounciation centric satires.
Entire article has Universality for any Campus-resident-student
ప్రియమైన వంగూరి చిట్టెన్ రాజుగోరండీ !
బాపూ రమణల అనిర్వచనీయ స్నేహసౌరభాలు తలపుకుతెస్తూ తల్లాప్రగడ రాజా రామ్ మోహన్ తో ( వారు మా గుంటూరు వారా ? ) మీకున్న స్నేహ బంధాలను, మాసిపోని మరపుకురాని యవ్వన జీవన చాయలను చూపించినందుకు కృతజ్నతలు అని పొడిమాటలతో సరిపెట్టలేకపోతున్నా. ఇంతకీ మెడమీదో శాలువా కప్పి, చెతిలో ఓ పూలగుత్తి పెట్టి మీవోడిని ఇండియాలోనో, హ్యూస్టన్ అమిరికాలోనో సత్కరించారా లేదా ? మీరా క్లారిటీ ఇవ్వలేదు సుమండీ.
కన్నెగంటి రామారావు గారండి! గుంటూరు మాజేటి గురయ్య హై స్కూల్ లో చదివిన రోజుల్లోని రాజా రామ్ మోహన్ గారి కుఠో చూపించకుండా అదెవరో పెద్దమడిసిలాగున్నాయన కుఠో చూపించారు ఆ లింకులో. అది నాకేవీ నచ్చలా. చిట్టెన్రాజు గారు చూపించిన కుఠో ఉన్నాయన్ని తెలుగు సినేమా వోళ్లు ఎందుకు ఎగరేసుకుపోలేదో నాకర్ధం కావటంలా.
మూలా రవికుమార్ గారూ! త్రిపుర గారు తన వీరాభిమాని, కవీ అయిన డా. మూలా సుబ్రహ్మణ్యం ను సుబ్రతో అని పిలిచేవారండి. ( సుబ్రతో బాబు ఇటీవలే తన అల్మామేటర్ I.I.T., Kharagpur నుండి Engineering లో PhD తీసుకున్నాడండీ – VLSI architectures for real-time adaptive filtering applications topic లోననుకుంటానండి )