గోడలకు ఊచలు

ఉదయాస్తమయాలు తెలియని చీకట్లో అతడి కళ్లు కవితల నిప్పుల వర్షం కురుస్తూనే ఉన్నాయి.

‘నేను మీతో మాట్లాడాలి…’ అని ఒక ఫోన్ వస్తుంది.

ఆమె ఏం మాట్లాడాలనుకుంటుందో నాకు తెలుసు.  ఆ స్వరంలో ఎన్ని సముద్రాల తడి దాగున్నదో నాకు తెలుసు.

కాని నేను ఏమి చేయగలను?

‘లేదు.. నేను పార్లమెంట్ కు వెళుతున్నాను.. ఇవాళ శీతాకాల సమావేశాల మొదటి రోజు. కాలమ్ కూడా రాసుకోవాలి. చాలా బిజీగా ఉంటాను.’

‘పోనీ సాయంత్రం వస్తాను..’ అన్నది.

‘ఏం చెప్తాను? సరే’ అన్నాను.

సాయంత్రం నాలుగు గంటలకు పోన్ లో మెసేజ్.. ‘మీ ఆఫీసులో మీకోసం ఎదురు చూస్తున్నాను..’  అని.  సెంట్రల్ హాలులో ఎంపిలతో కబుర్లు అడుతూ.. ఎన్నికల గురించి విశ్లేషణ చేస్తున్నాను. ఎలాగూ ఆఫీసుకు వెళ్లి వార్తలు రాసే సమయం వచ్చింది.

ఆఫీసుకు వెళ్లాను. వెళ్తూ, వెళ్తూ ఆమె గురించే ఆలోచిస్తున్నాను. నిజానికి ఆమెను కలుసుకోవాలని నాకు లేదు. కలుసుకోవడం అంటే నాలో నేను ఘర్షణ పడడం లాంటిదన్నమాట. అంతా చాపక్రింద నెత్తురులా, వర్షాన్ని దాచుకున్న మేఘంలా ప్రశాంతంగా, చల్లగా ఉంటే ఒక జ్వాలాజ్వలితను కలుసుకుని రగిలిపోవడం దేనికి?

‘మీకోసం చాలా సేపటినుంచి ఎదురు చూస్తున్నాను..’ అన్నది ఆమె. ఆఫీసులో ఉన్న పేపర్లన్నీ అప్పటికే చదివేసినట్లుగా కనిపిస్తోంది. ఆ పేపర్లలో ఆమెకు అవసరమైన వార్తలేముంటాయి?

‘చెప్పండి..’ అన్నాను. ‘మీకు చెప్పేదేముంది.. ఆయన ఆరోగ్యం బాగు లేదు.  చాలా దుర్భర స్థితిలో ఉన్నారు.’ అని కంటనీరు పెట్టుకుంది.

ఆఫీసంతా నీటితో నిండిపోయినట్లనిపించింది. కాళ్లు చెట్ల వ్రేళ్లయి నేలను తడిని తాకినట్లనిపించింది.

‘ఆయనను నాగపూర్ జైల్ నుంచి హాస్పిటల్ కు తీసుకువెళ్లి పరీక్షలు చేసేందుకు కోర్టు అనుమతించింది. బెయిల్ ఇవ్వకుండా ఉండేందుకు ఏం చేయాలో అంతా చేస్తున్నారు. అక్కడ ఆసుపత్రిలో సౌకర్యాలు ఉండవు. అన్ని పరీక్షలు చేశామంటూ మళ్లీ తిరిగి జైలుకు తీసుకువెళతారు..’ అని ఆమె చెప్పింది.

అతడో వికలాంగుడు. 70 శాతం పైగా అవయవాలు జబ్బుపడ్డాయి. ఎందుకు జైల్లో ఉన్నానో తెలియని ఆదివాసీ యువకులు ప్రతిరోజూ చేతులతో లేపి తీసుకువెళితే కాని కాలకృత్యాలు కూడా తీర్చుకోలేడు. అయినా అతడి ఆత్మ దేదీప్యమానంగా వెలుగుతోంది. చూపులు, స్వరం, వణుకున్న చేతులతో  పారిస్ లో స్వేచ్చా ప్రతిమను కొవ్వొత్తిలా కరిగిస్తున్నాడు.

చివరకు నేను దేన్ని చూడదలుచుకోలేదో అదే జరిగింది. సముద్ర గర్భంలో బడబానలం బయటపడ్డట్లు ఆమె కన్నీటి చుక్కల్ని రాల్చింది.

ఆమె అడపా దడపా ఆఫీసుకు రావడం, ఇలాంటి విషయాలు చెప్పడం నాకు మామూలే. ఒకో సారి భర్త రాసిన కవిత్వాలు కూడా తీసుకువస్తుంది. మొన్న లాయర్ తో పంపించారు.. అని చెబుతుంది.  ఉదయాస్తమయాలు తెలియని చీకట్లో అతడి కళ్లు కవితల నిప్పుల వర్షం కురుస్తూనే ఉన్నాయి.

ఒక జర్నలిస్టుగా నేను ఆమెకు ఏం సహాయం చేయగలను? నేను కార్యకర్తనూ కాను. మహా అయితే చిన్న వార్త రాయగలను. అది కూడా ఈ రాజకీయాల మధ్య జాగా ఉంటే డెస్క్ వాళ్లు వేస్తారు. దాన్ని చూసి ఆమె సంతృప్తి పడుతుంది. కాని దాని వల్ల జరిగేదేమీ లేదని నాకు తెలుసు, ఆమెకు తెలుసూ. కేవలం అక్షరాలు స్వాంతననీయవు.

నాకంటూ కాలక్రమేణా కొన్ని అభిప్రాయాలు స్థిరపడ్డాయి. అడవుల్లో ఉండి పోరాడేవారికి మధ్దతుగా నగరాల్లో సభలూ సమావేశాలు నిర్వహించాలంటే అన్నిటికీ సిద్దపడి ఉండాలి. అసలు అడవుల్లో ఉండి పోరాడడమెందుకు? అలా పోరాడుతూ గ్రామాలను, నగరాలను, రాష్ట్రాలను, దేశాన్ని విప్లవం వైపు తీసుకువెళ్లడం ఎన్ని యుగాలకు సాధ్యపడుతుంది? విప్లవం తర్వాత వారు ఏర్పర్చే సమాజం ఇంతకన్నా గొప్పగా ఉంటుందన్న నమ్మకం ఏమిటి? ఇప్పటికే ఎన్నో పంథాలు, ఎన్నో సిద్దాంతాలు.. ఏది సరైనది? అసలు ప్రజలకు వ్యవస్థలతో పోరాడడానికి అవసరమైన చైతన్యం ఉన్నదా? ప్రజలు తమలో అభద్రతా భావాన్ని పోగొట్టుకోవడానికి, తమ కష్టాలు దూరం కావడానికి ఏ దేవుళ్లనో నమ్ముకుంటారు కాని విప్లవాలు చేసి ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్దపడరు.

ఈ దేశంలో లెక్క వేస్తే మొత్తం జనాభాలో 99 శాతం గుళ్లకూ, మసీదులకు, చర్చిలకు, మఠాలకు, సన్యాసుల వద్దకు వెళ్లకుండా ఉండరు. అందులోనే రకరకాల భావోద్వేగాలకు లోనవుతారు. ఎన్నికల సమయం వద్దకు వచ్చే సరికి 80 శాతం మంది ఓటింగ్ పాల్గొంటారు. రక రకాల ప్రలోభాలకు గురవుతారు. ఏదో ఒక పార్టీని ఎన్నుకుంటారు. మోసపోతే మరో పార్టీని ఎన్నుకుంటారు. ఒక నాయకుడికి జై కొడతారు. అతడు ఆశల్ని వమ్ము చేస్తే మరో నాయకుడు వచ్చే వరకూ ఎదురు చూస్తారు.  కాని   వ్యవస్థలను కూలద్రోసి, అంతా విధ్వంసం చేయాలనుకోరు. మత, ప్రాంత భావోద్వేగాల్లోను, కులాభిమానాల్లోను, అభిమాన సంఘాల్లోను, నినాదాల్లోను హేతుబద్దత అన్న దానికి అర్థం ఉండదు. విద్యార్థులకు ఉద్యమాల వైపు చూసే తీరిక లేదు. ఏదో ఒకటి తెగ చదివేసి ఇక్కడకాకపోతే ఏ దేశానికో వెళ్లి ఆర్థిక భద్రత ద్వారా సామాజిక భద్రత సాధించాలనుకుంటారు.

ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఏ వ్యవస్థా ఈ దుర్మార్గాలకు అతీతం కాదు. అది ఇక్కడే కాదు, అన్ని దేశాల్లోనూ జరుగుతోంది.రియల్ ఎస్టేట్ మాఫియా డాన్ అయిన ట్రంప్ అన్ని వ్యవస్థల్నీ అపహాస్యం చేసి అమెరికా అధ్యక్షుడయ్యారు. నరేంద్రమోదీ సృష్టించిన నెత్తుటి ఊచకోతను జనం మరిచిపోయి తమ కష్టాలను తీరుస్తారంటూ నెత్తికెక్కించుకుంటే, అతడు అన్ని వ్యవస్థలతో చెలగాటం అడుతున్నారు.  కెన్యాలో ఎన్నికల కమిషనర్ బొటనవేలు కత్తిరించి  ఆ వేలుతో కంప్యూటర్ ను తెరిచి ఓట్లను తారుమారు చేసి కెన్యాట్టా గెలిచాడట. పోరాడీ పోరాడీ,ఎన్నో హింసలకూ, నిర్బంధాలకూ గురై అలిసిపోయి గూగీ విదేశాలకు వెళ్లి పుస్తకాలు రాసుకుంటే వాటిని మనం అచ్చువేసి ప్రచురించుకుని విప్లవం వచ్చేసిందని సంతోషపడుతున్నాం.

చెప్పాలంటే, చర్చించాలంటే ఎన్నో ఉన్నాయి. కాని ఎవడు ఏ ముద్రవేస్తాడో అని మనం ఏమీ మాట్లాడకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాం. ఇదో దరిద్రం. మన చుట్టే కాదు, మన శరీరం నిండా రాజకీయమే. మన బతుకుంతా రాజకీయమే. మనకోసం, మన పిల్లలకోసం, మన భద్రత కోసం, మన పిట్టగూళ్లకోసం బతకాలంటే ఈ రాజకీయం తప్పదు.

ఎప్పుడో కాని కడుపుమండితే నాలుగు అక్షరాలు కవితల్లోనూ, మాటల్లోనూ ధ్వనింపచేస్తాం. కీట్స్ అన్నట్లు చెట్టుకు ఆకుల్లా కవిత్వం ఆవిర్భవిస్తుంది.

‘మీరెవరితోనైనా మాట్లాడండి.. హోంమంత్రికి చెప్పించండి.. బెయిల్ ను వ్యతిరేకించకూడదని చెప్పండి.’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది.

ఘనీభవిస్తున్న కాలం ఆమె కంటతడికి కరుగుతోంది.

వ్యవస్థలపై పోరాడేవారు, ఆ వ్యవస్థల్నే నమ్ముకోవడమా..? దుర్మార్గాల చేసే వారు ఎక్కడైనా చలిస్తారా? నాకు నవ్వు వస్తుంది. రాజ్యాంగం రాసిన అంబేద్కరే చివరకు వ్యవస్థలతో పోరాడి, పోరాడి విసిగెత్తిపోయి బౌద్దమతంలో చేరారు. ఆయన పట్ల నెహ్రూతో సహ అధికారంలో ఉన్నపెద్దలు వ్యవహరించిన తీరు అధ్యయనం చేస్తే బాధ కలుగుతుంది. సుప్రీంకోర్టులోనే కాదు, ఈ దేశంలో అన్ని న్యాయాస్థానాల్లోనూ ఆ రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలనే చైతన్యం ఉన్న న్యాయమూర్తులు చాలా తక్కువ.  ఎప్పుడు ఏ కోర్టు ఏ తీర్పు ఇస్తుందో, ఎందుకు ఇస్తుందో దాని వెనుక ఎంత నేపథ్యం ఉన్నదో అనుభవం ప్రకారం గ్రహించగలనే కాని అన్యాయమని ఘోషిస్తే పిచ్చివాడి క్రింద జమ కట్టే పరిస్థితి ఏర్పడుతుంది.

ప్రశ్నించాల్సిందే.. తప్పదు. కాని ప్రశ్నించదగ్గ చైతన్యాన్ని ప్రజల్లో కల్పించలేకపోతే ప్రశ్న గాలిలో కలిసిపోతుంది. నీతో పాటు వేలమంది, లక్షలమంది, కోట్లాది మంది ప్రశ్నించదగ్గ పరిస్థితిని కల్పించకపోతే ప్రశ్న ప్రశ్నార్థకమవుతుది. ఎవడ్నో ప్రశ్నించడానికి ముందు నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి.. నీ కులాభిమానాన్నీ, నీమతాభిమానాన్నీ, నీ భక్తినీ, నీ సంకుచిత దృక్పథాన్నీ ప్రశ్నించుకోవాలి. నీ అడుగడుగునూ ప్రశ్నించుకోవాలి. నిన్ను నీవు చైతన్యం చేసుకోకుండా  ఎవర్ని చైతన్యవంతం చేయగలవు? ప్రశ్నించడమంటే నిప్పుల్లో దూకడం కాదు. ప్రశ్నించడమంటే నిన్ను నీవు మండించుకుని దేహమే కాగడాయై జనానికి దారి చూపించడం.

నడుస్తున్న కొద్దీ కాళ్ల క్రింద ఎండుటాకుల ధ్వనుల చిటపటలు వినిపిస్తున్నాయి.

ఉన్నట్లుండి ఒక పరిచయమైన స్వరం ‘కృష్ణుడూ’ అని పిలిచింది.

ఒళ్లు గగుర్పొడిచి వెనక్కి చూస్తే అక్కడెవరూ లేరు..

పూనే లోని ఎరవాడలోంచి కాబోలు.

నా చుట్టూ ఉన్న నాలుగు గోడలకు ఊచలు మొలిచినట్లుంది..

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ‘‘రాజ్యాంగం రాసిన అంబేద్కరే చివరకు వ్యవస్థలతో పోరాడి, పోరాడి విసిగెత్తిపోయి బౌద్దమతంలో చేరారు.’’

    ఈ వాక్యం చాలా గజిబిజిగా వున్నట్లుంది. వ్యవస్థలతో పోరాడేవారు విసిగితే బౌద్ధమతంలో చేరతారా? ఏ వ్యవస్థలయివుంటాయి? మతవ్యవస్థలా? బౌద్ధం కూడా ఒక మతమేగా? బౌద్ధం అన్ని మత అక్రమాలకు, అన్యాయాలకు, అసమానతలకు సాంత్వనా లేక పరిష్కారమా?

    మీకు మధుకిష్వర్ తెలిసేవుంటారు. ఆవిడ వెబ్ సైట్ లో గుజరాత్ నరమేధం గురించి, అది సృష్టించినవారి గురించి మరోకోణం నిజనిర్ధారణ (ఆవిడ చేసింది) వుంటుంది, మీకు ఆసక్తి వుంటే చూడవచ్చు. 99.99999999% మీరు చెప్పిన కథనమే ప్రచారంలో వుంది గనక దీనిని కేవలం చదివినంతమాత్రంచేత నష్టమేమీ వుండదని నా అభిప్రాయం.

    అలాగే, నేషనల్ వ్యూస్ అనే ఆన్ లైన్ వెబ్ ప్రతిక వున్నది. అది నూటికి నూరుశాతం యాంటీ మోడీ, బిజెపి, ఆరెస్సెస్. అయితే, చిత్రంగా దీనికి విరుద్ధంగా మోడీ, గుజరాత్ అల్లర్లకి సంబంధించిన వ్యాసం (రెండో కోణం) రెండు భాగాలు దానిలోనే ప్రచురితమయింది. మొదటి భాగం లంకె యిస్తున్నాను. రెండో భాగం దానిలోనే వుంటుంది.

    కృష్ణారావుగారూ, మీ రాజకీయ విశ్లేషణ, అవగాహన ముందు నేనొక పిపీలికం, మీ వ్యాసాలు ప్రతి నిత్యమూ ఆంధ్రజ్యోతిలో చదువుతూనే వుంటాను. కానీ, తెలుగు దిన ప్రతికామాధ్యమాలు, కవితా, రచనా మాధ్యమాల విషయం వచ్చేసరికి గత 40 ఏళ్లనుండి ఎడమ, ఎడమాతి ఎడమ, సిక్యులర్, అభ్యుదయ, ప్రగతిశీల, ఆకుపచ్చ శాంతిమతం, కన్వర్షన్ శ్వేత పతాక, నీలి, నయానీలి భావజాలాల వ్యాసాలు, అభిప్రాయాలు 99 శాతం దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్నాయని నా పరిశీలన. కుడివైపు భావజాలాన్ని ప్రతిబింబించే, కుడివైపు కోణాన్ని చూపించే ప్రతికలు, రచయితలు బహు తక్కువ, (ఆంధ్రభూమి, దానిలో వ్రాసే హెబ్బార్ నాగేశ్వరరావు, ఎం.వి.ఆర్. శాస్త్రి మినహా). సత్యం అనేది ఒకవైపువారిలో మాత్రమే గూడుకట్టుకుని వుంటుందని నేను నమ్మడంలేదు కుడి, ఎడమ మధ్యేమార్గంగా వుంటుందేమో. ఆలోచించగలరు.

    ఉపసంహారం: ప్రజల అర్హత, యోగ్యత, స్వార్థం, దురాశ, భీరుత్వం,
    తప్పనిసరి పరిమితులు, రాగద్వేష బానిసత్వాన్ని బట్టే నాయకులు, పాలకులు వస్తారని నా అభిప్రాయం. మన దురవస్థకి కారణం, ఫలితం మనమే.

    • మీ అభిప్రాయాలను నేను ఖండించడం లేదు. Ambedkar di నిరాశా నిస్పహలతో తీసుకున్న నిర్ణయమని నా అభిప్రాయం. నిజానికి ఇప్పుడు బౌద్ధం ఎక్కడుంది. వేషాలే తప్పితే. గోద్రా నేపథ్యం గురించి నాకు తెలుసు. అయితే మోడీ ప్రభుత్వ ప్రమేయమూ తెలుసు. నేను ఆ కాలం లో అక్కడ తిరిగాను. అవి కూడా మరిచి జనం గెలిపించడం కూడా నేను తప్ప న లేదు. కానీ దేనికోసం గెలిపించారన్నది మరిచారాన్నది నా అభిప్రాయం. .పత్రికల్లో అన్ని అభిప్రాయాలు రావాలన డం లో నాకు విభేదం లేదు. Andhrajyothi లో ఎడిట్ పేజ్ లో బల్బీర్ పుంజ్ లాంటి వారిని ప్రవేశపెట్టింది నేనే. సనాతన భారతీయ సంప్రదాయం లోని ప్రశ్నించే సంస్కృతి ని కొనసాగించాలన్న దే నా అభిప్రాయం.

  • నాకు చాలా కాలం తర్వాత మీ రచనలను సారంగ ద్వారా చదివే అవకాశం దొరికినందుకు ధన్యుడుని అయ్యాను సర్ . మీ ఒకప్పటి ిశిష్యుడు అశోక్ .కె

    • అశోక్ గారూ మీ లాంటి మిత్రులు ఉండడం కూడా ఒక వరమే. ధన్యవాదాలు

  • చాలా బాధగా వుంది. ఇంతేనే ఇంకేమీ చేయలేమా అనిపిస్తుంది. కవితలతో, కథలూ వ్యాసాలతో తీరే సమస్య కాదిది. ఏమో నాక్కూడా చుట్టూ ఊచలు మొలిచిన ఫీలింగ్ కలిగింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు