మై నేమ్ ఈజ్ గోహర్ జాన్………..

2

క్కడ కలకత్తాలో( 1888) అజాంఘర్ నుండీ వచ్చి సహాయంగా వుంటున్న ఆషియా బేగం హఠాత్తుగా చనిపోయింది. ఆమె కొడుకు భగ్లూ చెడు సావాసాలు పట్టి మల్కాజాన్ ను బాధించసాగాడు. ఖుర్షిద్ నూ, ఆషియానూ కోల్పోయిన మల్కాజాన్ ను ఒంటరితనం వేధిస్తోంది.

బనారస్ నుండీ తిరిగి వచ్చిన గౌహర్  సంగీత సాధనలో సాంత్వన పొందుతోంది. సంగీత కచేరీలన్నింటికీ శ్రధ్ధగా హాజరవుతోంది. కొత్త కొత్త విషయాలేమన్నా వుంటే గ్రహించి తన గాయన పధ్ధతిని మెరుగు పరుచుకుంటూ వుండేది. ఆమె పేరు ప్రఖ్యాతులు ఉత్తర హిందూస్థానంలోనే కాక దక్షిణాదికి కూడా పాకాయి. మైసూర్ సంస్థానంలో ఆమె కచేరీ విన్న వారందరూ మంత్రముగ్థులయ్యారు.

గ్రామఫోన్ కంపెనీ 1898సంవత్సరం లో స్థాపితమైంది.  ఫ్రెడరిక్ విలియమ్ గీస్బర్గ్ అనే ఆయన మొట్టమొదటి రికార్డింగ్ నిపుణుడు. అతను వివిధ గొంతులను రికార్డు చేశాడు. భారత దేశం వచ్చి ఇక్కడ పాటలనీ, మాటలనీ ,నాటకాలనీ ఇంకా అనేక విషయాలను రికార్డు చేసి లండన్ పంపుతూ వుండేవాడు. అక్కడనుండీ అవి గ్రామఫోన్ రికార్డుల మీదకి రికార్డ్ చేయబడి ఇండియాకి  అమ్మకానికి తిరిగి వచ్చేవి.

1902 లో గీస్బర్గ్ గౌహర్ జాన్ కచేరీ విని ముగ్థుడయ్యాడు. ఆమెకు యెంత జనాదరణ వుందో కూడా చూశాడు. ఆమె పాటలు రికార్డు చేసి విడుదల చేస్తే బాగా  లాభాలు గడించవచ్చని అంచనా వేశాడు.

ఆమె మొట్టమొదటి రికార్డింగ నవంబర్ 11వతేదీ 1902న జరిగింది. అయితే ఆమె ఒక్కొక్క రికార్డింగ్ కీ మూడువేల రూపాయలు పుచ్చుకునేది. అలా 1902నుండీ1920వరకూ సుమారు 600రికార్డులు ఇరవైకి పైగా భాషలలో పాడింది. హిందుస్థానీ, బెంగాలీ, ఉర్దూ, పర్షియన్, ఇంగ్లీషు, అరబిక్ , పష్తో,తమిళ్, మరాఠీ, పెషావరీ, గుజరాతీ, ఫ్రెంచ్ భాషలలోనే కాక కర్ణాటక సంగీతానికి సంబంధించిన పాటలూ, పాశ్చాత్య సంగీతానికి సంబంధించిన పాటలూ కూడా పాడేది.

ఆమె పాటలోని విశేషమేమంటే శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన స్వారస్యం చెడకుండా మూడుగంటలు పైగా పాడే పాటని మూడున్నర నిముషాలకి కుదించి పాడటం. రికార్డు చివరలో “మై నేమ్ ఈజ్ గోహర్ జాన్” అని ముద్దుగా  పలికేది ఆమె.

రికార్డింగ్ కి వెళ్లేటప్పుడు ఆమె ఆహార్యం, హుందాతనం ప్రతి ఒక్కరినీ ఆకర్షించేది. ఒకసారి ధరించిన దుస్తులూ, నగలూ మరోసారి ధరించేది కాదు. బంగారు జరీ తో నేసిన, లేసులతో అల్లిన ఖరీదైన గౌనులు ధరించేదని రికార్డిస్ట్  గీస్బర్గ్ పేర్కొన్నాడు.  హిందూస్థానీ సంగీతానికి సంబంధించిన ద్రుపద్, ఖయాల్, ఠుమ్రీ, కజ్రీ, చైతీ,హోరీ, ధమార్ , తరానా, భజన్ ఈ పధ్ధతులన్నింటిలో  ఆమె పాడిందీ, రికార్డులిచ్చిందీ, అయితే శాస్త్రీయ సంగీతానికీ, జానపద సంగీతానికీ మధ్య వారథిలా వుండే ఠుమ్రీ పాడటంలో ఆమె నిష్ణాతురాలు. ఆమె పాడిన ఠుమ్రీలలో “ఛోడో ఛోడో మోరీ బయ్యా” అనేది ప్రసిధ్ధి చెందినది.

1903లో ఆమె పాడిన రికార్డులు ఇండియాలో విడుదలయ్యాయి. హాట్ కేక్సులాగా అమ్ముడు పోయాయి. ఆమె పేరు ప్రపంచమంతా మారుమోగి పోయింది. పోస్ట్ కార్డుల మీదా(రంగుల్లోనూ,తెలుపు నలుపుల్లోనూ కూడా ముద్రింపబడేవి), అగ్గిపెట్టెల మీదా (ఆస్ట్రియా లో తయారయ్యేవి) ఆమె ఫోటోలు  చోటు చేసుకున్నాయి. అవన్నీ విపరీతంగా అమ్ముడయ్యేవి ఆమె రికార్డుల్లాగే!

ధనవంతుల ఇళ్లల్లోనే కాక, ఖరీదయిన కచేరీలకు హాజరుకాలేని మధ్యతరగతి వారి గృహాల డ్రాయింగ్ రూముల్లో కూడా గ్రామఫోన్ వినిపించసాగింది. గోహర్ జాన్ ఇంటింటా వినిపించే పేరయిపోయింది.

అలా అజాంఘర్ లో పేదరికంలో మగ్గిపోయి తిండికి కూడా కటకటలాడిన ఆ కుటుంబం నేడు అత్యంత ధనవంతుల జాబితాలోకి చేరింది. ఆమె విలాసవంతమైన జీవన విధానాన్ని గురించి అనేక కథలు ప్రచారంలో వుండేవి. ఆమె పెంపుడు పిల్లి పెళ్లికి పన్నెండొందల రూపాయలతో ఉత్సవం జరిపితే, ఆ పిల్లి నీళ్లాడితే ఇరవైవేలు ఖర్చుపెట్టి పెద్ద పండగ చేసింది.

ఆమెకు గుర్రపు స్వారీ అన్నా, గుర్రపు రేసులన్నా, గుర్రపు బగ్గీలో వేగంగా వీథుల్లో విహరించడమన్నా యెంతో మక్కువ. ఒక సారి అలా గుర్రపుబగ్గీలో వేగంగా వెళుతూ అప్పటి బ్రిటీష్ ఆఫీసర్ ని దాటుకుని వెళ్లిపోతే, ఆయన ఈమెకు జరిమానా విధించాడు. ఆ జరిమానా చెల్లించి మరీ మళ్లీ మళ్లీ షికారు పోవడం ఆమె ఆభిజాత్యాన్ని తెలుపుతుంది.

ఆ రోజుల్లో ఆమె ఒక్కొక్క కచేరీకీ వెయ్యి రూపాయల పారితోషికం తీసుకునేది. దాతియా సంస్థానానికి చెందిన మహారాజా కచేరీ చేయమని అభ్యర్థిస్తే, తనకీ తన 110మంది పరివారానికీ ప్రత్యేకంగా రవాణా సౌకర్యం కల్పించమనీ, రోజుకి రెండువేల రూపాయల పారితోషికం కావాలనీ అడిగి పదకొండు బోగీల ప్రత్యేక రైలులో వెళ్లి తన మాట నెగ్గించుకున్న ఘనురాలు. ఇండోర్ మహారాజా ఆమెను కచేరీకి పిలిచి ఆమె కచేరీ చేస్తూ కూర్చున్న పీఠం కింద లక్ష వెండిరూపాయలు పరిచి ఆమెను ఘనంగా సన్మానిస్తే ఆ డబ్బంతా తిరిగి అక్కడి పేదలకి పంచేసిన దాతృత్వం ఆమెది.

ఆమె దేశమంతా తిరిగి కచేరీలు చేయసాగింది. ఉత్తర హిందూ స్థానంతో పాటు దక్షిణాదిని కూడా ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. 1911లో పంచమ జార్జ్ చక్రవర్తి భారతదేశం సందర్శించినప్పుడు ఢిల్లీలో జరిగిన నృత్య గాన ప్రదర్శనలలో పాల్గొన్న కళాకారులలో గౌహర్ జాన్ కి కూడా స్ధానం లభించడం విశేషం. అప్పుడామెను బ్రిటీష్ గవర్నమెంట్ వంద బంగారు నాణేలతో సత్కరించడమే కాక ఒక స్వర్ణపతకాన్ని కూడా బహూకరించింది. ఆమెతో పాటు గానం చేసింది అలహాబాద్ కి చెందిన జానకీబాయి  ఉరఫ్ “ఛప్పన్ ఛురి”.

మళ్లీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే–

1904-1905 ప్రాంతాలలో ఆమెకు అమృతలాల్ కేశవ నాయక్ అనే మరాఠీ నాటక రంగానికి చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. ఆయన నటుడు, రచయిత, దర్శకుడు, నాటక కర్తా, గాయకుడు. ఆయనకీ గౌహర్ జాన్ కీ చక్కటి సయోధ్య కుదిరింది. ఇద్దరూ సాహిత్య సంగీత విషయాలను ఒకరితో ఒకరు పంచుకునేవారు. ఇరువురూ తాము ఒకరికొకరు సరియైన జోడీ అని భావించారు. గౌహర్ కలకత్తా విడిచి  యెక్కువ కాలం బొంబాయిలో అమృతలాల్ సమక్షంలో గడపసాగింది. ఇంతలో హఠాత్తుగా ఆమె తల్లి మల్కాజాన్ ఆరోగ్యం క్షీణించసాగింది. గోహర్ జాన్ కలకత్తా తిరిగి వచ్చి తల్లిని జాగ్రత్తగా చూసుకోసాగింది. కానీ విధివ్రాతనెవరూ తప్పించలేరని మరోసారి రుజువైంది.

1906 జూన్ నెలలో యాభైయేళ్ల వయసులో మల్కాజాన్ మరణించింది. ఆ దెబ్బనుండీ కోలుకోవడానికి గౌహర్ కి చాలాకాలం పట్టింది.ఎందుకంటే ఆమెకు మొదటినుండీ తల్లితో అనుబంధం యెక్కువ

ఆ సమయంలో అమృతలాల్ ఇచ్చిన మానసిక ధైర్యం ఆమెను మళ్లీ మనుషుల్లో పడేసింది

అమృతలాల్ కేశవ నాయక్ ఆమెను కలకత్తానుండీ బొంబాయి వచ్చెయ్యమని ఆహ్వానించాడు.ఆమె కూడా బొంబాయిలో అతనితో కలసి వుండటానికే మొగ్గు చూపి కలకత్తాలో తన కున్న ఆస్తులు కొన్నింటిని అమ్మి సొమ్ము చేసుకుంది. అలా బొంబాయి చేరిన ఆమెను ఒక సంవత్సరం తిరిగే సరికి దురదృష్టం మళ్లీ కాటేసింది.

18 జూన్ 1907లో అమృతలాల్ కేశవ నాయక్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. గుండె పగిలిన గోహర్ జాన్ బొంబాయిని వీడి తిరిగి కలకత్తా చేరుకుంది. కలకత్తా చేరిన నాటినుండీ ఆమెకు ఇంట్లో సుఖశాంతులు లేకుండా పోయాయి. ఆషియా బేగం  అనే సహాయకురాలి కొడుకు భగ్లూ చిన్ననాటినుండీ మల్కా జాన్ వద్ద పెరిగాడు, ఆమెను బడీమా అని పిలిచే వాడని చెప్పుకున్నాం కదా, అతను సమస్యలు సృష్టించడం మొదలు పెట్టాడు. చెడ్డ సహవాసాలూ, చెడ్డఅలవాట్లతో అతను ఆమె కొక సమస్యగా తయారవడమే కాక, తానే ఆస్తికంతటికీ వారసుడనినీ, మల్కాజాన్ సొంత కొడుకుని తానే అనీ కోర్టులో కేసు వేశాడు. ఆ కేసునుండీ బయట పడటానికి,మల్కాజాన్ సొంత కూతురు తానే అని ఋజువు చేసుకోవలసి వచ్చింది గౌహర్ జాన్ కి. ఆ క్రమంలో ఆమె తన తండ్రినీ మూలాలనూ వెదుక్కుంటూ అజాంఘర్ వెళ్లింది. అక్కడనుండీ తన తండ్రి అలహాబాద్ లో వున్నాడని తెలుసుకుని అక్కడకు వెళ్లింది. చివరికి తన తండ్రిని చూసి యెంతో ఉద్విగ్నతకి లోనయింది. విషయం చెప్పి తన పుట్టుకకు చట్టబధ్ధత కల్పించమని కోరింది.

అంతావిన్న తండ్రి కొంత మూల్యం చెల్లిస్తే కానీ కోర్ట్ కి రానన్నాడు. తండ్రి మాటలు విన్న ఆమె హతాశురాలయి వెనుదిరిగింది. అక్కడ డబ్బు ప్రశ్న కాదు తండ్రీ కూతుళ్ల మధ్యకు కూడా  డబ్బు రావడం ఆమెను బాధించింది.

చివరకు కోర్టు ఉత్తర్వుల ప్రకారం రాబర్ట్ కోర్టుకొచ్చి తగిన సాక్ష్యాధారాలతో గౌహర్ జాన్ తన కూతురే అని నిరూపించాడు. భగ్లూ పెట్టిన కేసు వీగిపోయింది. ఈ వ్యవహారమంతా  జరిగేటప్పుడు ఆమె వెనుకే  అసిస్టెంట్ గా వుండి జాగ్రత్తగా లాయర్లతో మాట్లాడి, అన్ని విషయాలూ సమర్థించిన వాడు అబ్బాస్ అనే పఠాన్ యువకుడు. ఆమె కన్నా పదిపన్నెండేడ్లు చిన్నవాడు. ఆమె తో చాలా మర్యాదగానూ భయభక్తులతో మసలే వాడు. కనీసం ఆమెను కన్నెత్తి చూసేవాడు కాదు. కోర్టు వ్యవహారాలతో విసిగిపోయిన గౌహర్ జాన్ కి ఒక నమ్మకమైన తోడు కావాలనిపించింది. అందుకు అబ్బాసే సరైన వాడనిపించింది. అక్కడే ఆమె పప్పులో కాలేసింది. అబ్బాస్ పని తంతే గారెల బుట్టలో పడినట్లయింది. ఇలా జరుగుతుందనే ఊహ కూడా లేదతనికి. 1913 లో వారిద్దరూ కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నారు. అయితే అబ్బాస్ తండ్రి చాలా తెలివైన వాడు. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్నాడు. అతను తన కుటుంబం మొత్తాన్నీ తీసుకువచ్చి గౌహర్ జాన్ ఇంట్లో తిష్ఠవేశాడు. మొదట్లో అంతా బాగున్నట్టే అనిపించింది.  కానీ చివరికి ఆమె కళ్లు తెరచి విషయం గ్రహించే సరికి జరగవలసిన నష్టమంతా జరిగిపోయింది.

ఆమె బాంక్ ఖాతాలకు  రెక్కలొచ్చి యెగిరిపోయాయి, ఆస్తులు చాలావరకూ కరిగి పోయాయి. అబ్బాస్ వ్యసనాలకి బానిసయ్యాడు. మందూ మగువ లేనిదే అతనికి పొద్దుగడవడం లేదు. గౌహర్ జాన్ కి చెందిన పెద్ద భవనంలో అబ్బాస్ బంధువులందరూ వుండేవాళ్లు తన సంగీత సాధనకీ తన ఉనికికీ ఈ  బంధువుల సందడితో కుదరక ఒక చిన్న ఇంట్లో ఆమె కుదురుకుంది. ఈ చిన్న ఇంటికి అబ్బాస్ వస్తూ పోతూ వుండేవాడు, క్రమంగా అతని రాకపోకలు తగ్గిపోసాగాయి.

చివరికి అతనామెకొక పెద్ద తలనొప్పిగా మారిపోయాడు. ఇదంతా భరించలేక తన కాంట్రాక్టు మారేజిని రద్దుచేయమని కోర్టునాశ్రయించింది. సమర్థులైన ప్లీడర్లని నియమించుకుంది. డబ్బు మంచి నీళ్లలాగా ఖర్చు చేయవలసి వచ్చింది. చాలారోజులు కోర్టు కేసు నడిచింది. ప్రజలందరూ విడ్డూరంగా చెప్పుకునేవారు.ఈ కేసుతో పూర్తిగా ఆమె పరువు బజార్న పడింది. చివరికెలాగో కోర్టులో తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చింది. గౌహర్ జాన్ బంధ విముక్తురాలయింది. అయినా అబ్బాస్ మీద జాలితో, కృతజ్ఞతతో ఒక ఇల్లు అతనికి రాసి ఇచ్చేసింది.

ఆమె ఈ కేసునుండీ బయట పడి వెనక్కుతిరిగి చూసుకుంటే చాలావరకూ ఆస్తులన్నీ అబ్బాస్ పుణ్యమా అని కరిగిపోయాయి. మిగిలిన వాటిలో కొన్ని అమ్మి లాయర్ల ఫీజులు చెల్లించవలసి వచ్చింది. ఆమె ఆర్థికంగా మానసికంగా కూడా చితికిపోయింది. జీవితం మళ్లీ మొదటికి వచ్చింది. పెద్దగా బయటకు వెళ్లడానికి ఇష్టపడేది కాదు. కచేరీలకు పిలిచే వాళ్లు కూడా తగ్గిపోయారు. కొన్నాళ్లు రూపాయకీ, రెండురూపాయలకీ విద్యార్థులకి సంగీత పాఠాలు చెబుతూ కాలం గడిపేది. ఎప్పుడయినా యెవరైనా పాత పరిచయంతో కచేరీకి పిలిస్తే వెళ్లేది. విన్నవాళ్లకి ఆమె గానంలో తేడా తెలిసేది కాదు కానీ, తనలో తనకే యేదో పూడ్చలేని శూన్యం వున్నట్టు తోచేది. ఉన్న కొద్దిపాటి నగదు తోనూ, ఒక భవంతిలోని అయిదవ అంతస్తులో రెండు గదుల పోర్షన్ లో వుండసాగింది పెద్ద పెద్ద భవంతులన్నీ కరిగిపోయాయి కోర్టు కేసుల కోసం.

మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టుగా యెవరో ఉచిత సలహా ఇచ్చారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని- ఉన్న నగదంతా ఊడ్చి షేర్లలో పెట్టింది. అవి చావుదెబ్బ కొట్టాయి. పెట్టిన డబ్బంతా పోవటమే కాక అప్పుల పాలయ్యింది. ఆమెకు మిగిలిన నివాసాలూ, ఆభరణాలూ  ఒక్కొక్కటీ కాళ్లొచ్చి నడిచి పోయాయి. అకస్మాత్తుగా ఆమెలో వార్థక్య ఛాయలు ముసురుకున్నాయి. ఇప్పుడు గౌహర్ జానంటే పేదరికంలో మగ్గుతున్న ఒకవృధ్ధ  గాయని. అయినా ఆమె  జీవితం లో మళ్లీ పైకి లేవాలని   కొన్ని ప్రయత్నాలు చేయకపోలేదు.

డార్జిలింగ్ లో ఎవరో ఆమె అభిమాని ఒక బంగళా ఉచితంగా ఇచ్చి సహాయం చేశాడు. అక్కడ కొంతమందికి సంగీత పాఠాలు చెబుతూ సంగీత సాధన చేస్తూ బతక సాగింది. పులిమీద పుట్రలా ఆమె దగ్గరకు సంగీతం నేర్చుకోవడానిక వచ్చే ఒక యువకుని కీ ఆమెకూ సంబంధాలు అంటగట్టి ఆమె నొక వేశ్య లాగా చిత్రీకరించి గొడవ చేస్తుంటే, ఆమెకు ఆశ్రయ మిచ్చిన వదాన్యుడు ఆమెని అక్కడి నించీ ఖాళీ చేయించాడు. ఇదంతా ఆమెను  మరింత ఛిన్నాభిన్నం చేసి ఒంటరితనంలోకి తోసింది.

(ముగింపు వచ్చే సంచికలో)

రొంపిచర్ల భార్గవి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు