మేకింగ్ సరే, కథ తలకిందులైంది!

సినిమా ప్రతి ఫ్రేంలో దర్శకుడు తన నైపుణ్యాన్ని చూపించినా విలువల పరంగానే బొక్క బోర్లా పడ్డాడనిపించింది.

“అమ్మాయిల చేతిలో చితికి పోవడం కంటే చచ్చి చితి కి పోవడం మేలు”

ఏమిటి ఈ కొటేషన్ అనుకుంటున్నారా?  ఇది ఓ ఆటో వెనక భాగం మీద సందేశం.  ఐతే ఇది మామూలు ఆటో కాదు.  ఓ సినిమా హీరో బాగా తాగేసేసి దుఃఖంతో నడిపిన ఆటో. ఎక్కడంటారా? సినిమా హీరో ఎక్కడ నడుపుతాడు ఆటోని సినిమాలో గాక!  అదేమిటో తెలుగు సినిమాలు కూడా సందేశాలిస్తాయాండోయ్!  కాకపోతే అవెప్పుడైనా ఇస్తే గిస్తే ఇలాంటి చచ్చు (చితి అంటున్నాడుగా మరి) సందేశాలే ఇస్తాయ్.  కావాలంటే  ఈ సంవత్సరం వచ్చిన సూపర్ హిట్ సినిమా “బేబీ” చూడండి. “హృదయ కాలేయం” వంటి స్పూఫ్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ ఒక సీరియస్ సినిమా తీయాలనే ప్రయత్నంలో లోతుగా ఆలోచించకుండా అసంబద్ధ ముగింపుతో అప్పటి వరకు మంచి ఫీల్ అందించిన కథకి తానే అన్యాయం చేసుకున్నాడనిపించింది.  ఒక బాధ్యత లేని సందేశమే ఇస్తుంది ఆ సినిమా.  చివరిలో హీరో మూర్ఖత్వాన్నే హైలైట్ చేస్తాడని ఆశించిన నా వంటి వారికి ఆశాభంగం కలిగించాడు.  డైరెక్టర్ సాయి రాజేష్ కి సినిమా మేకింగ్ మీద వున్న అవగాహన జీవితం మీద, సమాజం మీద లేదని తెలుస్తుంది.

ఈ సినిమా ఏ విధంగా తిరోగమన స్ఫూర్తితో తీశారో తెలియాలంటే కథ మొత్తం వివరంగా చెప్పాల్సిందే. సినిమా చూసిన వారు రాబోయే నాలుగు పేరాలు స్కిప్ చేసి ఆ తరువాత పేరాలలో ఇచ్చిన విశ్లేషణ వద్దకు నేరుగా వెళ్లిపోండి.

ఈ సినిమా కథానాయకి పేరు వైష్ణవి. ఆమె ఒక బస్తీలో నివసించే మెరిట్ విద్యార్ధిని. చాలా చురుకైన అమ్మాయి కూడా.  ఆమె, ఇంటి ఎదురుగా వుండే ఆనంద్ అనే డల్ స్టూడెంట్ ఇద్దరూ ప్రేమలో పడతారు.  వైష్ణవి ఇంజినీరింగ్ చదువు కోసం ఒక పెద్ద, అధునాతనమైన కాలేజిలో చేరుతుంది. ఆనంద్ చదువుకి బంద్ పెట్టి బతుకుతెరువు కోసం ఆటో నడుపుతుంటాడు.  వైష్ణవికి ఎవరైనా బహుమతులు ఇస్తే ఎంతో సంబరపడుతుంది.  చాలా జావియల్ మనస్తత్వం.  ఆనంద్ ఇచ్చే చిన్న చిన్న బహుమతుల్ని సంతోషంగా స్వీకరిస్తుంది.  ఒకసారి ఆనంద్ ఆటో తాకట్టు పెట్టి మరీ ఆమెకి ఓ మొబైల్ ఫోన్ బహుమతిగా ఇస్తాడు.  ఓ సాధారణ మొబైల్ ఫోన్ కోసం ఆటో తాకట్టు పెట్టడమేంటో కానీ ఆటో మీద అప్పు తీర్చడానికి మరో రౌడీ దగ్గర అప్పు చేస్తాడు.  వాడు అప్పు తీర్చమని బెదిరిస్తూ ఆనంద్ వెంటపడుతుంటాడు.  ఆనంద్ వైష్ణవి కోసం ఎంతో అసాధారణ త్యాగం చేశాడని ప్రేక్షకులకు అనిపించాలన్న మాట.

ఇంజినీరింగ్ కాలేజిలో చేరిన వైష్ణవికి అక్కడి అధునాతన ప్రపంచం జిగేల్మనిపిస్తుంది.  అక్కడ పరిచయమైన ధనిక మిత్రులు ఆమెని ప్రభావితం చేసి ఆమె రూపు రేఖల్ని మారుస్తారు.  తమతో పాటు పబ్స్ కి, క్లబ్స్ కి తిప్పుతారు.  విరాజ్ అనే ధనిక యువకుడితో స్నేహం చేస్తుంది.  అతనిని తన బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతుంది.  ఆనంద్ ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనబడుతుంది. వైష్ణవి తన హైఫై ఫ్రెండ్స్ తో పార్టీలలో మజా చేస్తుంటే పాపం ఆనందేమో అమాయకంగా ఆమె గురించి ఆలోచిస్తూ పరవశించిపోవడమో లేదా బాధపడుతూ కనిపిస్తుంటాడు. ప్రేక్షకుల దృష్టిలో ఆమెను కించపరచేలా చేయడమే దర్శకుడి ఉద్దేశ్యం కావొచ్చు. వైష్ణవి తప్పు దారిన పోతుందని మనల్ని కన్విన్స్ చేయడానికి వైష్ణవికి సమాంతరంగా ఆమె స్నేహితురాలు కుసుమ అనే పాత్ర వుంటుంది సినిమాలో. ఆ హైఫై జీవితాన్ని కుసుమ వ్యతిరేకిస్తుంది.  ఆ మాయలో పడొద్దని సలహా ఇస్తుంది.  అయినా వైష్ణవి వినదు.  కుసుమ ఆమెకి దూరమవుతుంది.

ఆమెలో వచ్చిన ఈ మార్పుని ఆనంద్ హర్షించడు.  పట్టరాని కోపంతో లం…లా  వున్నావని తిడతాడు.  చెప్పు తీసుకొని కొట్టబోతాడు. అది ఆమె భరించలేక పోతుంది.  కసి కొద్దీ కావొచ్చు విరాజ్ ని ఆప్తుడిలా భావిస్తుంటుంది.  అతనిచ్చే ఖరీదైన ఫోన్ స్వీకరిస్తుంది.  అతని పుట్టినరోజున క్షణికావేశంలో ఇంగ్లీష్ ముద్దొకటి పెట్టేస్తుంది.  ఆమె కేవలం తన ఈజీ గోయింగ్ స్వభావంతో విలాస వర్గాలకు చెందిన యువతతో కనెక్ట్ అవుతుంటుంది. ఐతే వైష్ణవి ఆనంద్ తో ఎంత ఘర్షణ పడుతున్నప్పటికీ ఆమె మనసులో అతనే వుంటాడు.  అతన్నే పెళ్లి చేసుకోవాలనే అనుకుంటుంది.  విరాజ్ పెళ్లి ప్రతిపాదన తెచ్చినప్పుడు నిష్కర్షగా తిరస్కరిస్తుంది.  అతను కేవలం ఒక మంచి ఫ్రెండ్ అని చెబుతుంది.  ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయడంతో అతనితో ఒక నెల పాటు డేట్ చేయడానికి, ఆ నెల పాటు రోజూ గిఫ్ట్ తీసుకోడానికి అంగీకరిస్తుంది.  నెల తరువాత అతను పెళ్లి చేసుకోమని పాత పాటే పాడతాడు.  కోపంతో అతనిచ్చిన ఖరీదైన గిఫ్ట్స్ అన్నీ అతని మీదే విసిరి కొడుతుంది.  అతని ముఖం మీద ఉమ్మేస్తుంది కూడా. అప్పుడు విరాజ్ ఆమె తనని ముద్దు పెట్టుకున్న వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేస్తాడు.  అతని బ్లాక్మెయిలింగ్ కి లొంగి అతనితో ఆమె శారీరికంగా కలవాల్సి వస్తుంది.

ఆమె తన “శీలం”ని పోగుట్టుకున్న విషయం తెలిసి ఆనంద్ కత్తి తీసుకొని ఆమెని చంపడానికి వెళ్తాడు. మరో పక్క విరాజ్ కూడా ఆమె ఒక బాయ్ ఫ్రెండ్ ని పెట్టుకొని కూడా తనతో ఆటాలాడుకుందని భావించి అతను కూడా కత్తి తీసుకొని ఆమెని చంపడానికి బయలుదేరతాడు.  చివరికి వాళ్లిద్దరి ముందే ఆమె కత్తి తీసుకొని గొంతు, చేతులు కోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది.  ఎలాగో బతుకుతుంది.  వెళ్లి ఆనంద్ కాళ్లా వేళ్లా పడుతుంది తనని అర్ధం చేసుకోమని.   అయినా లాభం లేదు.  కానీ ఆ మూర్ఖుడు ఆమె మాట వినకుండా తనకి మళ్లీ కనబడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తాడు. ఆమె చేసేది లేక అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది.  కొన్నాళ్లకు వేరే పెళ్లి చేసుకుంటుంది. ఆమెని పెళ్లి బట్టల్లో చూసి మద్యం బాటిలెత్తి గటగట తాగి ఆటో నడుపుకుంటూ వెళ్లిపోతాడు.  అక్కడ ఆటో వెనక భాగంలో పైన ఇచ్చిన కొటేషన్ కనబడుతుంది.

“అది నా పిల్లరా!” అని మిత్రులతో చాలా సార్లు అంటాడు హీరో.  అంటే ఆమె అతని ఆస్తి.  అసలు విషయం ఏమిటంటే చెరగని కన్యత్వ సహిత ఆమె శరీరమే అతని ఆస్తి. స్త్రీ పురుషుల హృదయాలు పరస్పర ఆస్తులు కాదన్న మాట.   ఆమె ఇప్పుడు వర్జినిటీ కోల్పోయింది కాబట్టి తన పిల్ల కాదు.  ఏ కారణం చేతనైనా అమ్మాయి వర్జిన్ గా మిగలకపోతే అది ఆమె అతనికి చేసిన పెద్ద ద్రోహం అవుతుందనుకోవాలి. పురుషుడి గుండె పగలాలన్న మాట.  ఎంత దిక్కుమాలిన భావజాలం.  ఆమె ఆత్మహత్య చేసుకోబోయినా అతని మనసు కరగదు.  వర్జినిటీ అనే అంశాన్ని ఇంతగా గ్లోఇఫై చేయడం చిరాకు పుట్టిస్తుంది.  ఒక యువతి తన ప్రేమికుడికి చేయగల అతి పెద్ద ద్రోహం వర్జినిటీ లేకపోవడమేనని అనుకోవడాన్ని మించిన భావ దారిద్ర్యం ఇంకోటి లేదు.  తనకి చెందని అమ్మాయిని కత్తితో పొడిచో లేదా యాసిడ్ పోసి మట్టు పెట్టాలని చూసే వారిలానే ఇందులో ఆమె జీవితంలో ప్రవేశించిన ఇద్దరు మగవాళ్లూ ప్రవర్తిస్తారు.  ఇది దారుణం కదా?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చాలా బాగా చేశారనడంలో సందేహం లేదు.  సినిమా ప్రతి ఫ్రేంలో దర్శకుడు తన నైపుణ్యాన్ని చూపించినా విలువల పరంగానే బొక్క బోర్లా పడ్డాడనిపించింది.  హీరోయిన్ పాత్రని మొదటి నుండి చివరి వరకు సహజంగా రూపొందించిన దర్శకుడు పురుష పాత్రల విషయంలో జెండర్ సెన్సిటివిటీని చూపించలేక పోయాడు.   మనసు, హృదయానికి సంబంధం లేని గతకాలపు చచ్చు పుచ్చు విలువల్ని భీకరంగా నెత్తికెత్తుకున్నాడు.  యువతులు యువకుల్ని సెడ్యూస్ చేసి మోసం చేస్తారని, యువకులు పాపం యువతుల ప్రేమ మైకంలో పడిపోయి జీవితాన్ని నాశనాన్ని చేసుకుంటారనే ఈ సినిమా యువతకి చాలా తప్పుడు సందేశం ఇస్తుంది.  ఆర్ ఎక్స్ 100 సినిమా నుండి ఈ ధోరణి పెరిగినట్లుంది.  ఆడైనా, మగైనా ఎవరైనా తన వ్యక్తిని మోసం చేయొచ్చు.  కానీ ఈ సినిమా కథ ప్రధానాంశం మోసం కాదు.  ఒక యువతిగా ఆమె స్వేచ్ఛ తీసుకోవడమే అతి పెద్ద విలువల భంగపాటుగా తీయడం జరిగింది.  హీరో తన స్నేహితులతో కలిసి మద్యం సేవించడం మాత్రం తప్పు కాదు.  మరి తాను బతుకుతున్న సమాజం ప్రభావం ఆమె మీద పడదా? ఈ ప్రశ్నకి జవాబుండదు.

సామాన్యంగా చురుకైన యువతకి ఆధునిక జీవితమంటే ఇష్టముంటుంది. వారికి వస్తుమయ ప్రపంచం ఓ అద్భుతంగా కనబడుతుంది.  మోడర్న్ గాడ్జెట్స్ అంటే మోజు వుంటుంది.  సదుపాయాలతో కూడిన జీవితమంటే ఓ ఆకర్షణ వుంటుంది. ఇవన్నీ సులువుగా, మామూలుగా అందుకునే సదుపాయం వున్న ఎగువ వర్గం వారి కంటే వాటిని అఫర్డ్ చేయలేని దిగువ మధ్య తరగతి వర్గం, బస్తీలకు చెందిన యువతలో ఆ క్రేవింగ్ ఎక్కువగా వుంటుంది.  ఈ విషయాన్ని దర్శకుడు ఆబ్జెక్టీవ్ గా చెప్పుంటే ఈ సినిమా సమాజానికి మేలు చేయగలిగి వుండేదేమో.  కానీ ఆ విలాస జీవితాన్ని అఫర్డ్ చేయలేని వారు దాని పట్ల మోజుతో నైతిక భ్రష్టులవుతున్నారనే తీర్పు ఈ సినిమా ఇస్తుంది.  ఇది చాలా దుర్మార్గమైనది.  అంటే సులువుగా ఈ విలాస జీవితాన్ని పై వర్గం అందుకుంటే లేని తప్పు అదే కింది వర్గం వారు కోరుకుంటే భ్రష్టులవుతారని తేల్చేయడమే ఈ సినిమా నేర్పే నీతి.  సమాజం చూపించే దుష్ప్రభావమని ఎత్తి చూపకుండా ప్రలోభ పడటం వ్యక్తుల నైతిక దోషం అనడం ద్వంద్వ విలువే.

కొసమెరుపు: ఈ సినిమాకి “బేబి” అనే టైటిల్ కి ఏమైనా సంబంధం వుంటే దయచేసి నాకు చెప్పండి.  ఆధునికంగా వుండాలనుకునే యువతిని ఇలా వ్యంగ్యంగా బేబీ అని పిలుస్తారా ఏమిటి కొంపతీసి “హృదయకాలేయ” సంబంధంలా?

*

అరణ్య కృష్ణ

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి సమీక్ష.
    మూస ధోరణితో మెదడునంతా జోకొట్టుకుంటూ…
    స్వయం పీడనకు గురవుతూ…
    సహజ సిద్ధంగా వికసించాల్సిన మానవ మేధస్సును చీకటి గుహరంలోకి తోసుకుంటున్న పరాన్న జీవుల/ఆధునిక మానవులకు కనువిప్పు.

  • మిత్రమా కృష్ణ పరిశోధనలో నూతన సత్యాలకై అన్వేషించే జిజ్ఞాస మీది. తెలుగు చిత్ర పరిశ్రమ సినిమాలో ఉన్న డార్విన్ కోతుల కుప్పి గంతులకు కూడా అవార్డులు ఇచ్చే అకాడమీల తీరు మారదు.
    సామాజిక రాజకీయార్థిక , కళాత్మక విలువలు లేని సినిమాలపై సమీక్ష వ్యాసాలు రాసి విలువైన కాలాన్ని వృధా చేయకుండా అంతర్జాతీయంగా పేరుందిన విప్లవాత్మక చిత్రాల గురించి రాస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.
    మనము బి యన్ రెడ్డి నుంచి బి నర్సింగ్ రావు వరకు తెలుగు చిత్రంలో ఉత్తమ కళాత్మక చిత్రాలుగా వచ్చి ఆగిపోయాయి. అందులో మాభూమి దాసి. తెలుగులో గొప్ప చిత్రాలు. కనక మీరు అంతర్జాతీయ చిత్రాలపై దృష్టిని కేంద్రీకరించండి. ఉదాహరణకి టర్కిష్ నటుడు, చిత్రదర్శకుడు యిల్మాజ్ గునే (Yılmaz Güney).
    (The People’s Artist, The People’s Warrior: Yılmaz Güney)

  • మిత్రమా కృష్ణ
    పరిశోధనలో నూతన సత్యాలకై అన్వేషించే జిజ్ఞాస మీది. తెలుగు చిత్ర పరిశ్రమ సినిమాలో ఉన్న డార్విన్ కోతుల కుప్పి గంతులకు కూడా అవార్డులు ఇచ్చే అకాడమీల తీరు మారదు.
    సామాజిక రాజకీయార్థిక , కళాత్మక విలువలు లేని సినిమాలపై సమీక్ష వ్యాసాలు రాసి విలువైన కాలాన్ని వృధా చేయకుండా అంతర్జాతీయంగా పేరుందిన విప్లవాత్మక చిత్రాల గురించి రాస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.
    మనము బి యన్ రెడ్డి నుంచి బి నర్సింగ్ రావు వరకు తెలుగు చిత్రంలో ఉత్తమ కళాత్మక చిత్రాలుగా వచ్చి ఆగిపోయాయి. అందులో మాభూమి దాసి. తెలుగులో గొప్ప చిత్రాలు. కనక మీరు అంతర్జాతీయ చిత్రాలపై దృష్టిని కేంద్రీకరించండి. ఉదాహరణకి టర్కిష్ నటుడు, చిత్రదర్శకుడు యిల్మాజ్ గునే (Yılmaz Güney).
    (The People’s Artist, The People’s Warrior: Yılmaz Güney)

  • సినిమా నేను చూడలేదు గాని మీ విశ్లేషణ చాలా చక్కగా ఉంది వాస్తవంగా ఉంది ఆలోచించాల్సిందిగా ఉంది

  • 90 నుంచి 110 నిముషాలలో చూపించతగిన సినిమాను ఎంతసేపు లాగటం కూడా నచ్చలేదండి. చివర్లో విసుగనిపించి ff తో ముగించా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు