మెహ్సా మెహ్సా మేరీ మెహ్సా
గుండెల్ని చెమ్మగిల్లించే స్థైర్యమా
నా కన్నీటి శాసనమా
ఒకానొక నగ్నదేశ పూల గుచ్ఛంలో
నిలువెత్తు గాయమై నిలబడిన పోరాటమా
సంకెళ్లకు లొంగని ధిక్కారమా
ఎన్నెన్ని సార్లు నన్ను నీలో చూసుకున్నాననీ!
మెహ్సా మెహ్సా మేరీ మెహ్సా
రగిలే హృదయాలను చుట్టుముడుతున్న తుపానా!
నా అంతర్గత పోరాటమా
లోలోపలికి చొచ్చుకొస్తున్న ప్రవాహమా!
నెలవంకను చూసి రోజా విడుస్తారు!
నెలవంకను చూసాకే ఈద్ షురూ అవుతుంది
నేలమీది నెలవంకలకేమో చీకటి ముసుగులు తొడుగుతారు
వాళ్ళదెప్పుడూ దురహంకారమే
ప్రశ్నించే నోళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఎప్పటికీ అందుకోలేని వాళ్ళే!
నువ్వు లేవని ఎవరన్నారు
చూస్తున్నావుగా మెహ్సా
నిన్ను మింగేసిన దేశంలో ఇప్పుడు
అంగుళానికో మెహ్సా రెక్కలు విదుల్చుకుంటూ!
మెహ్సా మెహ్సా మేరీ మెహ్సా
నా ఆశల సౌధమా
విశాల విశ్వాస విహంగమా
ఎర్రెర్రని నీ నెత్తురు ఎగజిమ్మిన ధైర్యం కదూ ఇదంతా
నిర్బంధాన్ని కొనగోటితో విదిలించి
స్ర్తీ పర్వాన్ని తిరగరాశావు
ప్రజ్వోల్లిత సాహసానివి, ప్రేరణవి కదూ
ప్రపంచ యవనికపై ఫ్రీడమ్ వాక్ చేస్తున్న
అరురారుణ పతాకమా! విప్లవ యవ్వనమా!
ఇప్పుడిప్పుడే ఊపిరి గాలులు వీస్తున్నాయిక్కడ!
మెహ్సా మెహ్సా మేరీ మెహ్సా
నువ్విప్పుడు అత్యుత్తమ లోకోక్తివి
మాంత్రికుల నీడలు అడుగైనా పెట్టలేని
అస్తిత్వపు కోట గుమ్మానివి
ఇదర్ దేఖో మెహ్సా!
న్యాయ శాస్ర్తాన్ని నచ్చినట్టుగా రాసుకునే
రాజ్యం దేహం నిండా ఒకటి కాదు రెండు కాదు
వేల కొలదీ మెహ్సా పచ్చ బొట్లు
తిరుగుబాటుకు తల వంచాల్సిన
దేశాల జాబితాలు సిద్ధం చేస్తున్నాం!
మెహ్సా మెహ్సా ఓ మెహ్సా
ఏడు సముద్రాలవతల దాక్కున్నా
నిర్బంధాలు కాళ్ళకు చుట్టుకుని
ఉక్తిరిబిక్కిరి చేసే బతుకులకూ
చీము నెత్తుర్లుంటాయని హెచ్చరించావు
దారి చూపే నక్షత్ర ద్వీపానివి నువ్వు
పీడన వేర్లని పెకిలిస్తున్న పదునైన పద్యానివి!
నువ్వెప్పటికీ మా మెహ్సావి
ప్రపంచమిప్పుడు నిన్నే చూస్తోంది
మెహ్సా మెహ్సా ఓ మెహ్సా!!
*
చిత్రం: సృజన్ రాజ్
అద్భుతమైన కవిత అక్క…అవసరమైన సందర్భంలో అవసరమైన కవిత…
న్యాయం పక్షం,సత్యం పక్షం మీ వాక్యాలు ఎప్పుడూ నిటారుగా నిలబడుతాయి.కవితలో మీదైన స్పష్టత కవితను శక్తివంతంగా నడిపించింది.. శుభాకాంక్షలు అక్క
ధన్యవాదాలు తమ్ముడు