“ఫోన్ నెంబర్ చెప్పండి మేడమ్”
“9618..”
“నీలిమా మేడమ్?”
“మెలీనా”
తన పేరు తప్పు చదివితే భలే కోపం నీలిమకి. సారీ మెలీనకి. బిల్ కట్టేసి వస్తువులు తీసుకుని మాల్ లోంచి పార్కింగ్ లోకి వచ్చి తన కార్లో బయటకు వచ్చింది. సరదాగా మంచి గంధర్వ కథ ఏదో చదివాక లైట్ ఆఫ్ చేసి పడుకునే సమయానికి పక్క రోజు ప్రెసెంట్ చెయ్యాల్సిన ఆఫీస్ పని చాచి పెట్టి చెంప మీద కొట్టి లాప్ టాప్ ముందు కూర్చోబెట్టినట్టు అనిపించింది ఆ ట్రాఫిక్ లోకి రాగానే. శనివారాన్ని బుజ్జగిస్తూ ట్రాఫిక్ ని తిట్టుకుంటూ ఇల్లు చేరుకుంది.
తను ఫ్లాట్ కి వచ్చేసరికే కొడుకు జాయ్ స్కూల్ నుంచి వచ్చి చిప్స్ తింటూ టీవీ చూస్తున్నాడు.
“హాయ్ మమ్మీ” ఇది కూడా టీచెర్ కి గుడ్ మార్నింగ్ చెప్పడం లాంటిదే. రోజులో అదొక భాగం.
“హాయ్ నాన్నా” ఎనిమిదేళ్ళ కొడుకుని అమాంతం ఎత్తుకుని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేసి సోఫాలో కుదేసి భర్త జీవన్ కి ఫోన్ చేసింది.
“ఆ జీవన్ ఎలా జరిగింది మీటింగ్”
“యా. ఓకే. వచ్చేసావా ఇంటికి. జాయ్ వచ్చాడా ఏం చేస్తున్నాడు?”
“టీవీ చూస్తున్నాడు. నీ ట్రైన్ ఎప్పుడు? యు వాంట్ మి టు పిక్ యు అప్ ఇన్ ద మార్నింగ్?” వద్దని అంటాడని తెలిసే అడుగుతుంది. అదొక ఇది.
“వద్దు. ఫ్రెండ్స్ ని పిలిచావ్ గా. యు టేక్ కేర్. ఐ విల్ టేక్ అ కాబ్”
“ఓకే దెన్. మిస్ యూ. బై” ఇదీ గుడ్ మార్నింగ్ లాంటిదే.
ముందు చక చకా ఫుడ్ ఆర్డర్ పెట్టేసింది. సరిపడ గ్లాసులు, ప్లేట్లు, స్పూన్స్, ఫోర్క్స్ తీసి డైనింగ్ టేబుల్ మీద సర్దింది. కల్పనకి ఫోన్ చేసి ఎప్పుడొస్తున్నారో కనుక్కుంది. కంఫర్టబుల్ గా ఉండే డ్రెస్ తీసుకుని స్నానానికి వెళ్ళింది. తయారయ్యేలోపే ఫుడ్ డెలివరీ కూడా వచ్చేసింది. టైం చూస్తే ఏడవుతోంది. టక్కున గుర్తొచ్చి ఫ్రిడ్జ్ తెరిచి చూసింది. ‘హమ్మయ్య! ఐస్ క్యూబ్స్ ఉన్నాయి’ అనుకుని మరో రెండు వాటర్ బాటిల్స్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టింది.
అరగంటకి వచ్చారు కల్పన, ధనుంజయ్. రావడమే హాయ్ చెప్తూ ఇద్దరినీ హత్తుకుంది మెలీనా. కొడుక్కి పరిచయం చేయడం, వాడు కొత్తగా చూడడం, కాసేపటికి వాళ్ళు బోర్ కొట్టడం, అమ్మ తనకి స్పెషల్ గా తెప్పించిన అమెరికన్ చాప్సీ తినేసి వీడియో గేమ్స్ ఆడుకోడానికి వాడి గదిలోకి వెళ్ళిపోడం వెంట వెంటనే జరిగిపోయాయి.
“మీ వాడు చాలా ఫాస్ట్ ఉన్నాడే” కిచెన్ లోకి వస్తూ అనింది కల్పన.
“యా వాడంతా వాళ్ళ డాడీ టైప్స్” తెప్పించిన చికెన్ స్ట్రిప్స్, అపోలో ఫిష్ ఒకసారి అవెన్ లో వేడి చేస్తోంది మెలీనా.
ధనుంజయ్ హాల్ లో పెగ్ ఫిక్స్ చేస్తున్నాడు.
కల్పన కిచెన్ లోంచి బాల్కనీలోకి వెళ్తూ “మెలీనా ఇక్కడ పర్లేదు కదా” అని అడిగింది.
” ష్యూర్! నో ప్రాబ్లం” అని మెలీనా అనగానే చేతిలో ఉన్న సిగరెట్, లైటర్ తీసి గబగబా పని ముగించి అక్కడే సింక్ లో అయిపోయిన సిగరెట్ పీకని కాస్త తడిపి డస్ట్ బిన్ లో పడేసి హాల్లోకొచ్చింది.
మెలీనా అన్నీ సర్వ్ చేసింది. అంతా సెటిల్ అయ్యిందనుకున్నాక జాయ్ గదిలోకి వెళ్ళింది. వీడియో గేమ్స్ ఆడుతూనే ఉన్నాడు. గట్టిగా ఒక ముద్దు పెట్టి తలుపు దగ్గరకేసి వచ్చింది.
“రండి మెలీనా మీ కోసమే వెయిటింగ్” అంటూ గ్లాస్ అందించాడు ధనుంజయ్.
ముగ్గురూ చియర్స్ అంటూ గ్లాసులు కలిపారు.
“హబ్బా! మొత్తానికి మీరు జాయిన్ అయిన ఇన్ని రోజులకి పార్టీ ఇచ్చారు” అన్నాడు ధనుంజయ్.
“ఎప్పుడూ ఏవో పనులు. పైగా జీవన్ కి డ్రింక్స్ ఇవన్నీ పెద్దగా నచ్చవు. ఏదో నా కోసం కొన్ని సార్లు భరిస్తాడు”
“పోన్లే ఇప్పుడు ఎలాగూ తెలీదుగా” కల్పన.
“హి నోస్. హి డసంట్ హావ్ అ ప్రాబ్లం” నవ్వుతూనే అంది మెలీనా.
“ఓహ్! తెలుసా. గుడ్ గుడ్. వెరీ అండర్స్టాండింగ్” పెగ్ ముగిస్తూ అన్నాడు ధనుంజయ్.
ఆ ప్రశంస వినగానే భర్తని ఇప్పుడు నిజంగా మిస్ అవుతోంది మెలీనా.
“మెలీనాని అడుగుతున్నావ్ పెద్ద నువ్వేదో ఆఫీసు లో జాయిన్ అయిన వెంటనే పార్టీ ఇచ్చినట్టు” వెక్కిరించింది కల్పన.
“అరె! కాస్త పరిచయమవ్వాలి. ఫ్రెండ్స్ అవ్వాలి. టైం పడుతుంది కదా!”
“మెలీనా జాయిన్ అయిన నెలకే ఇవ్వట్లేదా?”
“మనలాంటి మంచి ఫ్రెండ్స్ దొరికారు కాబట్టి ఇంత త్వరగా కలిసిపోయాం”
“రియలీ! జాయిన్ అయిన కొత్తలో ఎంత దూర దూరంగా ఉండేవాడో ధనుంజయ్. అప్పటికీ నేనూ కంపెనీ మారి జస్ట్ ఫోర్ మంత్స్ అయ్యింది అంతే. ఎందుకో ఎవరితోనూ మేం ఇంత క్లోజ్ కాలేదు. మీతోనే మెలీనా”
చిన్నగా నవ్వింది మెలీనా. ఆఫీస్ లో వీళ్ళిద్దరి కంపెనీ తప్ప ఎవరితోనూ నచ్చలేదు. ధనుంజయ్ అయితే మాట్లాడని విషయమంటూ ఉండదు. చాలా హెల్ప్ ఫుల్. నవ్విస్తాడు. ఎంపతీ ఉన్నవాడు. కల్పన కూడా వెరీ డీసెంట్ అండ్ సెన్సిబుల్. ఎప్పుడూ మగ పెత్తనాన్ని సహించేది కాదు. ఏదన్నా నచ్చకపోతే బాస్ ని కూడా ఎదిరిస్తుంది. వీళ్ళద్దరూ టామ్ అండ్ జెరీ లాగా సరదాగా ఉంటారు. మెలీనా ఆఫీస్ లో అందరితో బావుంటుంది. వీళ్ళతో ఉంటే తనకింకా బావుంటుంది.
“మీరు MJ మినిస్ట్రీస్ కే వెళ్తారా?” ఎదురుగా గోడకున్న చర్చ్ క్యాలెండర్ చూస్తూ అడిగాడు ధనుంజయ్.
“కొంప దీసి నువ్ కూడా వెళ్తున్నావా ఏంటి?” కల్పన.
“కాదెహే ఆ పక్కనే మా ఇల్లు” రెండో పెగ్ ఖాళీ చేస్తున్నాడు ధనుంజయ్.
“ఓహ్ అదా సంగతి”
“అదేంటి కల్పనా మీరు ఇంతవరకూ ఆయనింటికి వెళ్ళలేదా?” మెలీనా తెలుగు మాట్లాడుతున్నా ఇంగ్లీష్ లానే ఉంటుంది.
“లేదు. కుదరలేదు” మత్తును కూడా అదుపు చేస్తోంది కల్పన.
“మీరింత క్లోజ్ కదా. ఫామిలీస్ కూడా క్లోజ్ అనుకున్నాను” మధ్య మధ్యలో కొడుకు గది వైపు చూస్తోంది.
“మగాళ్ళ కష్టాలు మీకేం తెలుసు మేడమ్” ధనుంజయ్ మాట చిన్నగా తూగుతోంది.
“నీకేం కష్టాలు. మేం పోతే కూడా ఎవడూ పట్టించుకోడు”
మెలీనకి కాస్త కొత్తగా ఉంది. వీళ్ళిద్దరూ ఆఫీస్ లో సీనియర్స్ అవడం వల్ల మంచి స్నేహితులు. ఇక్కడ గమ్మత్తుగా కనిపిస్తున్నారు. తను జాయిన్ అయ్యే నెలవుతోంది. సరే ఎప్పటినుంచో ‘వస్తాం వస్తాం’ అంటుంటే జీవన్ కి ఇబ్బంది లేని ఈ శనివారం పిలిచింది. నిజానికి ఇంకా కొత్త మనిషిగానే వాళ్ళని ఆహ్వానించింది.
“మీరు పోతే పట్టించుకోరా? ‘పడవ బోల్తా. ఇద్దరు మహిళలు ముగ్గురు పిల్లలతో సహా నలుగురు మృతి’ అని చెప్తారు వార్తల్లో. చావులోనూ మిమ్మల్నే చూస్తారు. పెళ్లిలోనూ మిమ్మల్నే చూస్తారు” వర్క్ ప్లేస్ లో ఎడాపెడా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు మందు పడేసరికి అచ్చ తెలుగు తన్నుకు రావడం చూసి నవ్వుకుంటోంది మెలీనా.
“ఇప్పుడు నువ్వెవరిని చూస్తున్నావ్ మరి?”
కల్పన కొంటె చూపులని పసిగట్టినా మౌనంగానే ఉంది మెలీనా.
“ఏంటి నిన్ను కూడా చూస్తారా?” ధనుంజయ్ కొత్త పెగ్ మొదలుపెట్టాడు.
మెలీనాకి ఏదో నచ్చడం లేదు. ఫిష్ బాలేదేమో అనుకుని చికెన్ ట్రై చేసింది. ఉహూ అదీ బాలేదు. ఈ హడవుడిలో మటన్ ఫ్రై చేసిన విషయం మర్చేపోయింది. హఠాత్తుగా గుర్తొచ్చి మళ్ళీ కాస్త వేడి చేసి హాల్లోకి తీసుకొచ్చింది.
ధనుంజయ్ రుచి చూస్తూ “నిజంగా మటనే కదా” అని అనుమానం బయట పడకుండా నవ్వుతూ అడిగాడు.
“అఫ్ కోర్స్, డిన్నర్ కూడా చేసేద్దామా” మెలీన కూడా అదే నవ్వుతో చెప్పింది.
“అప్పుడేనా మీరింకో పెగ్ వేస్కోండి” అన్నాడు.
“లేదు. ఎర్లీ మార్నింగ్ జీవన్ వస్తాడు. నేను లెగాలి. ఐ థింక్ ఐమ్ డన్” అని కొడుకు రూమ్ లోకి వెళ్ళింది. జాయ్ నిద్రలోకి జారుకున్నాడు. ట్యాబ్ ఆఫ్ చేసి దుప్పటి కప్పి లైట్ ఆపేసి వాడి తల మీద చెయ్యి పెట్టి ఇంగ్లీష్ లో ప్రార్ధన చేసి నుదుటి మీద బోటన వేలితో సిలువ గుర్తు వేసింది. తలుపు దగ్గరకేసి హాల్లోకొచ్చింది. ఇద్దరూ లేరు. కిచెన్ బాల్కనీ లో దమ్ము కొడుతున్నారు. మెలీనా గమనించినా వెళ్ళలేదు. బిర్యానీ, రైతా ప్లేట్లలో వడ్డించింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ హాల్లోకొచ్చారు.
“సారీ ఆకలేస్తుందా? మీరు మొదలు పెట్టేయండి” అంటూ నాలుగో పెగ్ ఫిక్స్ చేసేస్తోంది కల్పన.
మెలీనా తన కసిన్స్ తో, క్లాస్ మేట్స్ తో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎన్నో సార్లు ఇలా కలిసినా ఎప్పుడూ తనని తాను కోల్పోలేదు. ఆఫీస్ లో వీళ్ళిద్దరిలో ఉండేదేదో ఇక్కడ లేదు.
“కల్పనా! ఎక్కువవుతుందేమో చూస్కోండి. ఇంట్లో పర్వాలేదా?” అనింది మెలీనా.
‘ఇంట్లో పర్లేదా’ అంటే మొగుడు ఏం అనడు కదా’ అని తన ఉద్దేశం.
“వాడ్ని నోరెత్తనిస్తే కదా. హిహ్హీ” ఇక్కిలించాడు ధనుంజయ్.
మెలీనా అవాక్కైంది. తేరుకుని “ఏం చేస్తారు?” అని అడిగింది.
“పడుంటాడు” మళ్ళీ నవ్వాడు. “అంతే కదే శంఖిణీ” ధనుంజయ్ బాగా అదుపు తప్పాడు.
“శంకిణీ ఆ? వాట్ డస్ థట్ మీన్?” ఆశ్చర్యంగా అడిగింది మెలీనా.
“అదేంటి నీకు తెలీదా? నువ్వొచ్చిన రోజే చిత్తిణీ అయ్యుంటావని అనుకున్నామే” అనేసాడు.
స్పృహలో ఉన్న కల్పన గత్తుక్కుమంది.
“మెలీనా ఏం అనుకోకండి. హి ఇస్ హై” ఎక్కడా తప్పులు దొర్లకుండా నిదానంగా చెప్పింది కల్పన.
“దట్స్ ఓకే” మెలీనా మొహమాటపు నవ్వు.
“అదేంటమ్మాయి నీకు స్త్రీ జాతులు తెలీవా?” మళ్ళీ మొదలు పెట్టాడు.
ఆ పిలుపు ఆ భాష ఆ మాటలు విచిత్రంగా ఉన్నాయి మెలీనాకి. తనకి తెలిసిన స్త్రీలంటే- తన ఇల్లు తాను కట్టుకునే జ్ఞానవంతురాళ్ళు, నెనరు గల స్త్రీలు, బుద్ధిగల కన్యలు, భర్తకు లోబడే భార్యలు, తమ చేతులతో తమ ఇళ్ళు ఊడ బెరుక్కునే మూఢురాళ్ళు, పంది ముక్కున ఉన్న బంగారు కమ్మీ వంటి వివేకం లేని సుందర స్త్రీలు లాంటి వాళ్ళని గురించి వింటూ చదువుతూ పెరిగింది తప్ప అమ్మాయిని చూసిన వెంటనే ఈ రకరకాల జాతుల్లో పడేయడమేంటో ఇప్పుడే వింటోంది.
‘ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే తన హృదయంలో వ్యభిచరించినట్టు’ అని బైబిల్లో ఉంది కదా డాడీ ఆ మాట ఎందుకని చర్చిలలో పదే పదే చెప్పరు? అదే ‘అందం మోసకరం, సౌందర్యం వ్యర్ధం’ అని ఒకటికి పది సార్లు చెప్తూ అమ్మాయిలని ఇలా తయారవ్వొద్దు అలాంటి బట్టలేసుకోవద్దు అని రెస్ట్రిక్ట్ చేస్తారు గానీ అబ్బాయిలకి చూడడం తప్పని మాత్రం చెప్పరు చాలా చర్చెస్ లో. మా ఫ్రెండ్ వాళ్ళ చర్చిలో కూడా అంతే. మన చర్చ్ ఇంకా బెటర్. రెండూ చెప్పరు’ అని వాదించిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఎందుకో.
ధనుంజయ్ మాటలు మెలీనాకి నచ్చలేదని అర్ధమైంది కల్పనకి. డైనింగ్ హాల్ లోకి తీసుకెళ్ళింది.
“మెలీనా మీరేం అనుకోకండి. తనకి ఎక్కువైంది కదా. ఏవేవో మాట్లాడుతున్నాడు. నిజానికి మీరంటే చాలా ఇష్టం”
“వ్వాట్”
“ఆ…అంటే ఐ మీన్ హి హాస్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యు, అంతే”
“ఎనీవే, మీరు కూడా తినేసేయండి. ఇట్స్ లేట్”
మెలీనా కి దేని రుచి నచ్చలేదో ఇప్పుడు బాగా తెలుస్తోంది.
“యా ష్యూర్” కల్పనకి ఎక్కిన మత్తు దిగిపోయింది.
“మెలీనా… రా..నీకు వివరంగా చెప్పిగానీ కదలను” హాల్లోంచి అరుస్తున్నాడు ధనుంజయ్.
ఈ రాత్రి ఎలా ముగుస్తుందోనని విసుగ్గా పైకి చూసింది మెలీనా. గోడ మీద ముళ్ళ కిరీటంతో రక్తమోడుతున్న క్రీస్తు కూడా పైకే చూస్తున్నాడు.
ధనుంజయ్ ఫోన్ మోగడం మొదలైంది.
చిందులేసే కోతి ఉన్నట్టుండి సర్కస్ లో రింగ్ మాస్టర్ ఆజ్ఞ కోసం ఎదురు చూసే కోతిలా క్షణంలో సర్దుకుని ఫోన్ ఎత్తాడు.
“ఆ లక్కీ వచ్చేస్తున్నానమ్మా. లేదు. అస్సలు తాగట్లేదు. ఏదో కొద్దిగా అంతే. ప్రసాద్ డ్రాప్ చేస్తాడు. నేను డ్రైవ్ చెయ్యను. వచ్చేస్తున్నా. ఇంకో అరగంట”
ఫోన్ పెట్టిన వెంటనే వాష్ రూమ్ ఎక్కడుందని అడిగి పరుగుపరుగున వెళ్లి మొహం మీద నీళ్ళు జల్లుకుని మెలీనా ఇచ్చిన నాప్కిన్ ని మొహానికి పాముకుని కల్పనని త్వరగా తినమని కంగారు పెట్టాడు.
క్యాబ్ బుక్ చేసాడు. షూస్ వేసుకున్నాడు. కల్పన కూడా తినడం మధ్యలోనే ముగించేసి హడావుడిగా గుమ్మంలో నిల్చుంది.
“క్యాబ్ వచ్చేదాకన్నా ఉండండి” అంది మెలీనా.
తన రంగస్థలం మీద తనది కాని నాటకమేదో నడుస్తోందక్కడ.
“లేదండీ చాలా లేట్ అయ్యింది. తాంక్యూ సో మచ్ మెలీనా. కార్ రేపొచ్చి తీసుకెళతాను. ఆఫీస్ లో కలుద్దాం, బై” అనేసి దబదబా మెట్లు దిగారిద్దరూ.
ఏం జరిగిందో ఏం అర్ధం కాలేదు. కింద పడ్డ నాప్కిన్ తీసుకుని బాల్కనీ లోకి వెళ్ళింది. వాషింగ్ మెషిన్ లో నాప్కిన్ పడేసి కిందకి చూసింది. ధనుంజయ్ కల్పనలు క్షణాల క్రితమే మొదలుపెట్టిన సుదీర్ఘమైన ముద్దులో మునిగిపోయారు. మెలీనా పై నుంచి చూస్తోంది. తనకి కనబడనివి కూడా ఇంకేవో చూస్తోంది. క్యాబ్ రావడంతో ముద్దు ముగిసింది. ధనుంజయ్ క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయాడు. కల్పన ఇంకా అక్కడే నిలబడి ఉంది. మెలీనా వాచ్ చూసింది. పదకుండు. కల్పనని ఈ రాత్రికి తన దగ్గరే ఉండమని అడగాలా? ఈ టైంలో క్యాబ్ లో ఎలా వెళుతుందని అనుకునే లోపే ఆమె భర్త వచ్చాడు. కార్ మీద కల్పన పేరుంది. ఆ బండి కూడా వెళ్ళిపోయింది. రోడ్డు ఖాళీగా ఉంది. అంతా చీకటి. అయినా ఇంకేదో కనిపిస్తోంది మెలీనకి. ముఖమంతా ప్రశార్ధకాలు, ఆశ్చర్యార్ధకాలు. హాల్లోకి వచ్చింది. తిన్న ప్లేట్లు, తాగిన గ్లాసులు సీసాలు అక్కడే ఉన్నాయి. తలుపు ఇంకా తెరిచే ఉంది.
తనకిప్పుడు తన స్త్రీజాతి కనిపిస్తోంది. కల్పనల్లోంచి బయటకు తీసుకురావలసిన జాతి. చదువుకున్న మెలీనాలు, చదువురాని మెలీనాలు, గుర్తింపు లేని మెలీనాలు, తోసేయబడ్డ మెలీనాలు, నలిగిపోయిన మెలీనాలు, పైకి రావాల్సిన మెలీనాలు, రక్షించబడాల్సిన మెలీనాలు- తన స్త్రీలు ఎలా ఉన్నారో ఎక్కడున్నారో అని వెతుక్కుంటూ తలుపేసేసింది మెలీనా.
***
మంచి కథనం
Thank you
స్త్రీజాతిని చూస్తూన్న పితృస్వామ్య కోణాలు మారాలి.దాని కంటే ముందు తోటి స్త్రీలను సవాలక్ష కారణాలతౌ ద్వేషించే స్త్రీల భావజాలం కూడా మారాలి. సూపర్ కథ రాశారు మానసగారు అభినందనలు
Thank you madam❤️
ఇది జరిగిన కథ కావచ్చు,కాకపొనూ వచ్చు. ఐతే నెలరోజుల్లొ
పార్టీకి పిలిచే టంత స్నేహం ఏర్పడినప్పుడు, వాళ్ల మనస తత్వాలు కూడా అర్ధం అయి వుండాలి. కొత్త చోటికి వచ్చిన వ్యక్తి అలా ప్రవర్తించ డానికి సాహసిస్తాడా?
తప్పతాగి మెలీనాను అలా అనగలడా? మందు ఎక్కువైతే
ఇంటి ఫోన్ కాల్ తో దిగి పోతుందా?
కథలో క్రైస్తవ కుటుంబాలు అన్నీ ఇలానే వుంటాయి అనే భావన
కలుగుతూంది!
ఏమో..ఈ ఆధునిక యుగంలో అలా వున్నాయెమో!
ప్రతి మగవాడు ప్రతి స్త్రీ మందు తాగుతారన్న భావన కలగనందుకు సంతోషం.
పల్లెటూరి వాళ్లం కదమ్మా…
అంత జ్నానం మాకుటుందా?
మందు గురించి అసలు తెలియని వాళ్లం కదా!!
కథనం బావుంది కానీ, ఒక మతాన్ని టార్గెట్ చేయకుండా ఉంటే బాగుండేది. మీరు చెప్పనివి, చెప్పాలనుకున్నవీ స్పష్టంగా కనబడుతున్నాయి. ఒక్క మాట స్పష్టంగా మీకు చెప్పాల్సిన అవసరముంది. కనుక చెబుతున్నాను. ఇతర మతాల్లో ఏవో కథల్లో స్త్రీ జాతుల వర్ణనలు- ఉటంకిస్తూ ఇతరమతాల వారినందరినీ ఒకే గాటన కట్టటము- బైబిల్ మాత్రమే పరస్త్రీని మోహంతో చూడకూడదని చెప్పిందనుకోవటమూ సరికాదు. మీరు చదివిన బైబిల్ ని మీరు సరిగ్గా అర్థం చేసుకున్నందుకు అభినందనలు. కానీ, ప్రతీ మతం – మానవత్వం, నైతిక విలువలూ నేర్పుతుంది. అర్థం చేసుకునే జ్ఞానం మనుషులపై ఆధారపడి ఉంటుంది. ఆడవారిని మోహదృష్టితో చూసే మగవారు అన్ని మతాలలోనూ ఉంటారు, భర్తని వంచించే ఆడవాళ్ళూ అన్నిమతాల్లోనూ ఉంటారు. మీకు మంచి రచనాపటిమ ఉంది. ధనంజయ్ చర్చ్ కి వెళ్ళేవాడయి ఉంటే కూడా అతని దృష్టి, ఆలోచన అలాగే ఉండేది అనే కోణాన్ని చూడగలిగితే ఇంకా బాగుండేది. శంకిణీ అని కాకుండా దానికి సరిపోయే ఏ ఇతర వ్యావహారిక టెలుగు/ఆంగ్ల పదాన్నో వాడేవాడు అంతే.
Thank you Aruna garu. ధనుంజయ్ ని సరిగ్గా అంచనా వేశారు .
కాకపోతే మీకు కథ రాసేప్పుడు ఆ విషయం అర్థం అయుంటే బాగుండేదనిపించింది. కథకి ఏ మాత్రం అవసరం లేకున్నా అతను చర్చికి వెళ్ళే వాడు కదన్న విషయం మీరు కథలో చెబుతూ అతన్ని మతపరంగా Disown చేసుకుని ఉండేవారు కాదు కదా!
“మతం” అనే లౌల్యానికి మన రచయితలు దూరమయితే ఇంకా మంచి రచనలు చదవవచ్చు. We actually can focus on the subject rather than religion.
Nirmala garu
నాకు అర్థమైందా లేదా అని మీరే నిర్ధారించారు. కథ లో ఉన్న మతం కంటే కామెంట్ లోనే నాకు ఎక్కువగా కనిపిస్తుంది.
Thank you
ఈ కథ చదివాక, చప్పట్ల వంటి accolades రచయితకు అందించి, తప్పుకొని వెళ్లకపోతే నా అయోమయం, అజ్ఞానం బైటపడుతుందనే ఎరుక ఉన్నా, అందుకు సిద్ధపడి, నాకు ఈ కథ ద్వారా అర్థమయ్యిందాన్ని ఇలా రాస్తున్నాను.
1. సొగసైన, ఘనమైన, ఉన్నతమైన అనే అర్థమొచ్చే biblical పేరున్న మెలీనా ఒక practicing Christian. Software ఉద్యోగి.
2. ఆమె- ఆమె భర్త జీవన్ – ఎనిమిదేళ్ల కొడుకు జాయ్… వీళ్ల మధ్య అన్యోన్యత ఎంత ఉందో, రంగు రుచి లేని అలవాటైన గుడ్ మార్నింగ్ లాంటి పెట్టుడు బంధం కూడా అంతే ఉంది. అనేకానేక వేనవేల (కాస్త ఎగువ తరగతి)కాపురాల్లో ఒకటి.
3. ‘ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే తన హృదయంలో వ్యభిచరించినట్టు’ అని బైబిల్లో ఉన్న పవిత్ర వాక్యం, చర్చిలో, వీలైతే ఈ మగలోకంలో చాటాలని కోరుకునే ఆధునిక భావాలున్న అభ్యుదయ స్త్రీ మెలీనా!
4. ‘అందం మోసకరం, సౌందర్యం వ్యర్ధం’ అని పదే పదే అమ్మాయిలకి చెప్పడం కంటే, అవే చర్చీలలో ఆ ‘మోసకరమైన అందాన్ని, వ్యర్థమైన సౌందర్యాన్ని చూడకండిరా’ అని అబ్బాయిలకి చెబితే బాగుంటుందని ఫెమినిస్టిక్ వాదనలు చిన్నప్పట్నుంచే చేసే స్వతంత్ర – మెలీనా.
5. తన enlightened కంటికి అంత వరకూ తెలిసిన స్త్రీలు- ‘తన ఇల్లు తాను కట్టుకునే జ్ఞానవంతురాళ్ళు, నెనరు గల స్త్రీలు, బుద్ధిగల కన్యలు, భర్తకు లోబడే భార్యలు, తమ చేతులతో తమ ఇళ్ళు ఊడ బెరుక్కునే మూఢురాళ్ళు, పంది ముక్కున ఉన్న బంగారు కమ్మీ వంటి వివేకం లేని సుందర స్త్రీలు…’
6. తాను చేరిన కొత్త ఆఫీసులో డీసెంట్ అండ్ సెన్సిబుల్ అనిపించిన ఇద్దరు సీనియర్ కొలీగ్స్ – ధనుంజయ్, కల్పన లకి ఇంట్లో పార్టీ ఇచ్చినప్పుడు గానీ, వాళ్ల చద్మవేషాల మాటున్న అసలు స్వభావాలు అర్థంకావు మెలీనాకి. ‘మెలీనా తన కసిన్స్ తో, క్లాస్ మేట్స్ తో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎన్నో సార్లు ఇలా కలిసినా ఎప్పుడూ తనని తాను కోల్పోలేదు’.
ఇంతకీ ధనుంజయ్, కల్పనల్లో కొత్తగా బైటపడినవి, మెలీనా ఊహకు కూడా అందని కనీవినీ ఎరగని విపరీత స్వభావాలు ఏమిటి?
– మందు ఒక్కొక్క పెగ్గు ఎక్కువౌతున్న కొద్దీ ధనుంజయ్, కల్పన తెలుగులో మాట్లాడుకోవడం.
– ధనుంజయ్ కి తన (మెలీనా) మీద మోజు ఉందని, చూడగానే తనని చిత్తిణీ (చిత్రిణి లేదా చిత్తిని) గా లైంగిక దృష్టితో చూశాడని అర్థం కావడం.
– వాళ్లిద్దరి దగ్గరితనంలో కుటుంబాలకు తెలియకూడని సంబంధం ఉందని తెలియడం.
అందుకే మెలీనా పదే పదే అవాక్కవుతుంది. ఎప్పుడూ మగ పెత్తనాన్ని సహించక, బాస్ ని కూడా లెక్కజేయని కల్పన, ధనుంజయ్ లో మగలక్షణాల్ని సమర్ధించుకురావడం చూసి ఆశ్చర్యపోవడంతో ఆగదు. ఇంట్లో భర్తని నోరెత్తనివ్వదని తెలిసి కూడా అవాక్కవుతుంది.
అప్పుడు మెలీనా మనస్థితికి- గోడ మీద ముళ్ళ కిరీటంతో రక్తమోడుతున్న క్రీస్తు – ఒక ప్రతీక అయ్యాడంటే మనం అర్థం చేసుకోవచ్చు, మెలీనా ఎంత భరించిందో.
‘కనబడనివి కూడా ఇంకేవో చూస్తోన్న’, ‘ఖాళీగా ఉన్న చీకటిరోడ్డులో కూడా ఇంకేదో కనిపిస్తోన్న’ realised స్థితిలో ‘ముఖమంతా పరుచుకున్న ప్రశార్ధకాలు, ఆశ్చర్యార్ధకా’ల్నీ తుడిచేసుకున్న liberated మెలీనాకి ‘ఇప్పుడు కల్పనల్లోంచి బయటకు తీసుకురావలసిన తన స్త్రీజాతి కనిపిస్తోంది’!!
కల్పనల్లోంచి బయటకు తీసుకురావాల్సిన స్త్రీ జాతి. కథనం బాగుంది. మెలీనా ఆలోచనలకు, కొడుకు, భర్తతో ప్రవర్తనలో కొంత కృత్రిమత్వం వైరుధ్యం కనబడుతోంది. కథనం బాగుంది.
నాకు ఏమాత్రం సమర్ధనీయంగా లేదు కథ. క్రిస్టియన్ కుటుంబాలు ఇలా ఉంటాయా ! ఉండవు. ఏ క్రిస్టియన్ సంస్కృతీ గురించి రాశారు మీరు ! బాంబేలోని ఆంగ్లో ఇండియన్ లగురించా, సింగపూర్ లోని క్రైస్తవ కుటుంబాల గురించా! మతం అనవసరంగా చొప్పించారు . కొంత కృత్రిమంగా ఉంది చిత్రీకరణ.
ఏమీ అనుకోకు మానస. అభినందనలు
చాల అద్బుతంగా రసావు అక్కా
కథ బాగాలేదు . ఒక మతాన్ని కావాలని కించపరిచినట్టు ఉంది .
మేాత్తానికీ కథ చాల బాగుంది. పిత్రుస్వామ్య ద్రుష్ఠిలో మార్పు రావాలి.ఇది అన్ని దేశాల్లో ఉంది. అన్నిమతాల్లోను ఉంది. ఐతే సమాజంలో మార్పు అనివార్యం. మార్పు గతిని వేగవంతం చేసేందుకు మీలాంటి స్త్రీవాధ రచనలు దొహదపడుతాయి.
మానస మీకు ధన్యవాదాలు
కార్పొరేట్ జీవితాల్లో ఉండే క్రుత్రిమత్వాన్ని కథలో బాగా చిత్రీకరించారు. అంతగా ముసుగులు వేసుకొని జీవించే హై క్లాస్ బతుకుల్లో ఏం ఆనందం ఉంటుంది!
వచనం బాగుంది. చదివిం గలగడమే కథ ప్రధాన లక్షణం గా నేను ఆశిస్తాను. అభినందనలు. సిటీ సంస్కృతి!?
స్త్రీమూర్తి ప్రకృతికి ప్రతిరూపం. ప్రకృతికి పలు రూపాలున్నట్లు…బహుశా అవసరతను ఈ కథ లో అతగానికి ఆమె పట్ల అవసరతను తన కొలీగ్ తో చెప్పించాడు. కాముఖ తెలివి. వైవిధ్యాన్ని ఆశించే తృష్ణ ప్రస్ఫుటంగా చెప్పాడు. ప్యూర్ లీ తాత్కాలికమే. ప్రపంచంలో సర్వసాధారణం. నిజ జీవితంలోఒక్కోచోట ఒక్కో రూపములో ఉంటుంది. ఇలా లీనమైన విలీనమైన జీవితాలు బలీయమైన శక్తిని ఇరుపక్షాలలోనూ ఉంటారు. మె లీనా చాలా కష్టపడి ప్రయత్నిస్తే మార్పుకు అవకాశం ఉంటుంది. ( క్రొత్త గా ఉద్యోగం వచ్చిన తర్వాత ముందస్తుగా మోసపోవడానికి అతి తక్కువ సమయమైనా సరి పోతుంది అవకాశవాదులకు నెల రోజులు అవసరం లేదు) రచన చాలా సహజంగా ఉంది. మనఃపూర్వక అభినందనలు మానస గారూ💐💐💐
Nice narration …Congratulations Manasa