మెట్లు ఎక్కి దిగిన ప్రతిసారీ

కొన్నిసార్లు మనసు నింపే ఖాళీని ఎలా పూరించాలో తెలీదు. అన్నీ ఉన్నా ఆకలి తీరని ఫీలింగ్.

క్కోసంవత్సరం గడుస్తూండగా నేను ఎక్కి…దిగిన మెట్లు!

మద్రాస్ హైవే నుండి కుడి పక్కకి తిరిగి ఒక మూడు కిలోమీటర్లు అడవి లాంటి దారిలో వెళ్తే…అదొక ప్రపంచం. సన్నటి తారురోడ్లు, రోడ్డుకి రెండు వైపులా మండుటెండల్లో కూడా ఎర్రగా విరగబూసే గుల్మొహర్ చెట్లు, అవి దాటి వెళ్తే, ఫారెస్టు ఫైర్ చెట్లు…

‘ఏ కహా ఆగయే హమ్’ అని పాడుకోవాలనిపించే వాతావరణం! ధనుర్మాసంలో చలి రోజుల్లో చీకట్లో కూర్చుని ముగ్గుని చూస్తూ మొదటి కాఫీ తాగేటప్పటి ప్రశాంతత! మొదటి అంతస్తులో ఉన్న లక్సరి- రాత్రి కొండల వెనుక ఉదయించే చంద్రున్ని, కరెంట్ పోయినప్పుడు చుక్కల్ని, వెన్నెల్లో మెరిశే బోగన్ విల్లాల్ని మనల్ని ఎవరూ గమనించకుండా చూడ గలగడం!

ఇన్నేళ్ళు ఆ ఇంట్లో ఉన్నా, మెట్లు ఎక్కి దిగిన ప్రతిసారీ, ఒక్క జ్ఞాపకమైనా కదలక మానదు- మదిలో! వెన్నెల్లో కలిసిన మనుషులు, మిడ్నైట్ కాఫీల మధ్య దొర్లిన మాటలు!

దాదాపుగా ప్రతి సాయంత్రం కలవడం, ఆంజనేయస్వామి గుడి ప్రదక్షిణలు, అప్పుడపుడు అమ్మవారి గుడిలో దర్శనాలు అయ్యాక, నీతో గడిపే ఆ గంట కోసం ఇంత భక్తీ వచ్చిందేమో అని ఇంటికి వెళ్ళేపుడు అనిపించేది. మీ ఇంటి బయట వేపచెట్టు అరుగు, ముందున్న పిట్టగోడ, ఇంటి ముందున్న నాలుగు మెట్లు రోజుకో చోటు మారినా, ఎక్కడ ఉన్నమో  తెలీని స్థితి, కబుర్లలో మునిగితే. నిజానికి మాటలకంటే నిశ్శబ్దంగా కూర్చునే ఆ కొన్ని నిమిషాలే ఎంతో బాగుండేవి. పాతికేళ్ళ తరవాత కూడా, నిన్నలా అనిపిస్తుంది, ఇంకా వేప పూత వాసన వస్తూనే ఉంది. మోకాళ్ళపైన గడ్డం ఆనించి, నువ్వు ఊ కొడుతున్నట్లు ఉంది. మొదలుపెడితే ఎక్కడ ఆపాలో తెలియనంతగా ఉన్నాయి నీ జ్ఞాపకాలు నాలో. ఇంటి బయట కూర్చుని మెట్లవైపు చూస్తే మెరిసేది నువ్వే!

మాధవి! డిగ్రీ చదివే రోజుల్లో ప్రతి శనివారం సాయంత్రం నుండి రాత్రి దాకా  వాళ్ళ డాబా పైనే- అచ్చం ఇలాంటి మెట్లే- గంటలు గంటలు గడిపే వాళ్ళం, కబుర్లలో- రాత్రి కొబ్బరాకుల మధ్య నుండి చంద్రుడు కనిపించే దాకా! కవిత్వం, ఫిలొసఫీ, హ్యూమన్ రిలేషన్సు, ప్రేమ, బాధ, ఆనందం, విషాదం- డిస్సెక్టు చేసి వదలని టాపిక్కేదీ లేదేమో, ఆ రెండేళ్ళలో.  మధ్య మధ్యలో దొర్లే నిశ్శబ్దంలో కాఫీ చల్లారిపోయేది. కానీ ఉన్నంత సేపూ నా చెయ్యి పట్టుకునో గాజులు సవరిస్తూనో మాట్లాడు తుండేది తను. వాళ్ళమ్మగారిచ్చిన కాఫీ చల్లారి పోతే, నీ చేతిలోని వెచ్చదనం చాల్లేవొయ్ అనేది-

నేను ఎక్కడ తప్పుగా మాట్లాడాను, ఎక్కడ సరిగా మాట్లాడాను, కాలేజీలో తను నాగురించి విన్నప్పుడు ఎలా అనిపించిందో స్పష్టంగా చెప్పేది. నా వ్యక్తిత్వంలో పరిణతి రావడంలో తన పాత్ర కూడా చాలా ఉంది.

జీవితంలో ఎదురయ్యే ప్రతి బంధం అద్దంలాగ మనల్ని మనం చూసుకోవడానికి ఉపయోగపడుతుందని అంటారు జె. కె.

ఒక ఏడేళ్ళ తరువాత, వాళ్ళాయనని ఎంతగా ప్రేమిస్తుందో చెప్పేటప్పుడు కూడా, డాబా మెట్లపైన నా చెయ్యి పట్టుకుని అడిగింది- ఎందుకింత వెచ్చగా ఉంటాయి నీ చేతులు అంటూ- అయామ్ వార్మయట్ హార్టు అన్నా నవ్వుతూ! మెట్లు దిగేస్తూ!

ఇంకో అయిదేళ్ళ తరువాత, ఈ లోకం వదిలేసి వెళ్ళిన తనని చివరిసారిగా చూసేందుకు వెళ్ళి కూడా ముట్టుకునే ధైర్యం చేయలేకపోయాను, అంత చల్లదనాన్ని భరించే శక్తి లేక.

ఒంటరి తనం నిండిన వేసవి రాత్రులు, సముద్రపు గాలి, కలిసి చేసిన ప్రయాణం, ఎక్కడో కలిసినట్లనిపించే భాష (మనసుకి మాత్రమే వినబడేట్లు), కలిసి పాడిన పాటల్లో అక్కడక్కడా గొంతు కలిసిన గుర్తులు, స్వరాల్లో చిక్కుకున్న పదాలు ఒక్కటైన జ్ఞాపకం! ఒక్కోమెట్టు ఎక్కుతుంటే నీ గొంతు వెంటాడిన అలికిడి.

‘ పచ్చటి లోయ పైరు గాలి నిశీధి మౌనం ….’శిశిర రుతువులో రాలిన ఆకుల మధ్య నిశ్శబ్దాన్ని చీల్చుకు వచ్చే నీ గొంతు, చదివిన కవితలు చేసే చప్పుడు తప్ప, ఒక్క ఆకు కదల్లేదు చెట్టు మీద. నీ ఇంటి మెట్లెక్కి పిట్టగోడకి ఛేరబడి కూర్చుంటే, చుట్టూ ఉన్న కొండల కంటే, గంభీరంగా నువ్వు. ఒక ప్రశాంతత, సెక్యూరిటీ ఫీలింగ్. కిందకి దిగి వస్తుంటే, నన్ను వదిలేసి వచ్చిన భావన.

చిత్రం: సృజన్ రాజ్

నిన్ను చూసినపుడు, మాట్లాడిన ప్రతిసారీ ఓ పదేళ్ళ క్రితం నన్ను చూసుకున్న భావన- వేరే రూపంలో! సందర్భాలు మార్పు, స్పందనలు ఒకటే. పొయెట్రీ, పీపుల్, ప్రాసెస్ లు, బాధ, నిశ్శబ్దం- ఎంతచెప్పుకున్నా ఆగిపోని మాటలు; ఇవన్నీ నేనెదురు చూడనివి. మొత్తంగా నీ పరిచయమే ఒక పెద్ద కుదుపు నా స్తబ్దమైన జీవితంలో. ఎన్నిసార్లు నిన్ను తిట్టుకున్నానో చెప్పలేను- ఎవరూ చూడని ఏకాంతవేళ, నేను మాత్రమే నాతో ఉన్న సమయాల్లో, పూర్తిగా మరిచిపోయిన మనసులోని అట్టడుగు పొరల్ని నీ పరిచయం నిద్రలేపినందుకు, మరిచిపోయిన ‘అమృతం కురిసిన రాత్రి’ ని గుర్తు చేసినందుకు. నువ్వొచ్చి వెళ్ళిన ప్రతిసారీ ఎక్కి దిగిన నా ఇంటి మెట్లు-  నీకు సెండాఫ్ ఇచ్చేందుకు నిలబడిన మనసులోని నా ఈ మాటలకి సాక్ష్యాలు. We don’t have any emotional attachment, but the relationship is beyond any emotions can understand! మే బి యూ ఆర్ ద ఓన్లీవన్ హుకెన్ రీడ్ మి లైక్ ఎ బుక్, వితౌట్ ఈవెన్ ఒపెనింగ్ ఇట్.

నాకు చాలా ఇష్టమైన వాళ్ళ కి మెట్లకి ఏదో సంబంధం! “ రైన్ డ్రాప్సండ్ రొసెస్….దీస్ ఆర్ ది సమ్మాఫ్ మై ఫేవరెట్  థింగ్ స్” అన్న సౌండ్ ఆప్ మ్యూజిక్ లో పాట గుర్తొచ్చేది, మీ ఇంటి వసారాలో కూర్చొని కురిసే వర్షాన్ని చూస్తుంటే. ఆరుబయట విశాలమైన చోట ఎవరికీ కనబడకుండా, శబ్దంలోని నిశ్శబ్దాన్ని వింటూన్నా, మబ్బులచాటునుండి బయటపడే చంద్రుణ్ణి వేసవి కాలపు చల్లటి రాత్రుల్లో నేలమీద పడుకోని చూస్తున్నా- అసలు డిస్టర్బే చేసేదానివి కాదు, అది నీతో ఉన్న పెద్ద లక్జరీ. మీ ఇంటి మెట్లెక్కి కుడి పక్కకి తిరిగి మళ్ళీ ఇంకొన్ని మెట్లెక్కితే- మామిడి చెట్టు కింద కూర్చుని, చినుకులు పడితే పారిపోయేందుకు నీ ఇంటి వరండా. ఏమీ మాట్లాడకుండానే పంచుకొనేందుకు, చెరి కాస్త నిశ్శబ్దం. నాలోని ఒంటరితనాన్ని పోగొట్టేందుకు ఎంత సాయపడ్డాయో తెలుసా?

సెలవు పెట్టి వెళ్ళేటప్పుడు, హైవే ఎక్కేముందు ఒక్కసారి కారాపి వెనక్కి తిరిగి చూస్తే- వాలీలోకెళ్ళే రోడ్డు నిండా, రాలిన గుల్మొహర్ పూల మధ్య, పరుచుకున్నవన్నీ ఈ జ్ణాపకాలే!

Don’t know when I will be back, perhaps when I lose myself- to trace it back!

కొన్నిసార్లు మనసు నింపే ఖాళీని ఎలా పూరించాలో తెలీదు. అన్నీ ఉన్నా ఆకలి తీరని ఫీలింగ్. గార్డెన్ లో తిరుగుతూ సూర్యోదయాన్ని చూసినప్పుడు, ఒంటరిగా పౌర్ణమి నాడు చంద్రుడి కోసం ఎదురుచూసేటప్పుడు, నిశ్శబ్దం లోని నిర్లిప్తత అర్థమయ్యేది. అడవిలోని ఏకాంతం ఇక్కడ ఒంటరిరతనంలా ఎందుకు అనిపిస్తుందో మరి! ఒక్క పదినిముషాలు నీతో ఉండాలి అంటే గంటసేపు ప్రయత్నించేలోపే, నెలలు గడిచిపోయాయి. విరగబూసిన గులాబీలు, అప్పుడప్పుదూ కనిపించే నెమళ్ళూ, మెట్ల మీదనించి చూస్తే ఎదురుగా రాత్రి వెన్నెల్లో మెరిసిపోయే చెరువు- అన్నీ కలిసినా ఏదో వెలితి. మనసులో వెలితి.What am I missing?

ఇప్పుడు ఇన్నాళ్ళ తరువాత… మళ్ళీ

Stairway …

కొత్త ఇంట్లో కూడా

The steps I climbed up and down

Moment after moment….

Nostalgia!

అందులో లీలగా ‘నువ్వు’! నేనెక్కడా కనబడడం లేదు నాకు…

‘Meanderings of Memory’- Perhaps I need to search for myself! కానీ ఎక్కడ, ఎలా?

నిశ్శబ్దం నిండిన ఈ సాయంత్రాల్లో ఎప్పుడు ఇలా బయట కూర్చున్నా, కార్తీక మాసపు చలిలా కమ్మేస్తాయి ఈ జ్ఞాపకాలు. బయట దీపం పెట్టి ఒక్కో మెట్టు ఎక్కి వచ్చి పైన కూర్చుంటే ….

“People come into our life, for a reason, season or a life time…..”

అన్న లాంగ్ కోట్ గుర్తొచ్చింది. Who am I? Amn’t I the sum total of all of them?

నడిచిన దారంటామెట్లమీద   పరుచుకున్న పున్నాగపూలు, ఆ వాసనల మధ్య ఈ ఆలోచనలు!

 

*

శ్రీరంగవల్లి

చదవటం ఇష్టం. ఇలాంటివి అని చెప్పడం కష్టం - వాతావరణాన్ని బట్టి( బయటా లోపలా) ఏదైనా కావచ్చు: టాగూర్, రూమి, చలం ఇంకా చాలా. మనుషుల్ని చదవటం ఇంకా ఇష్టం - రోజువారీ జీవితంలో తారసపడే ప్రతి ఒక్కరి ప్రభావం మనమీద అంతో ఇంతో లేకుండా ఉండదు అని నమ్ముతాను. ఇలాంటి చాలా అద్దాల్లో కనిపించే మనల్ని పరీక్షగా చూసుకోవడానికి జె.కె ఫిలాసఫీ ఇంకా ఇష్టం. వృత్తి రీత్యా మాధమ్యాటిక్స్ ఫాకల్టీ, అప్పుడప్పుడు రాసుకున్న లైన్లు ఎప్పుడైనా ఇలా..బయట పడుతూ ఉంటాయి-

ఆమె( ఇమ్మే) చ్యూరు గా…..

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Sree ranga valligaru
    Mee kadha chala bagundandi.
    Manchu lo chinnaga thadusthu
    Istamina patalu vintu manchi coffee thaguthunna anubhuthi kaligindi.

    • Thank you Sailaja Garu ! చాలా సంతోషం మీరు ఎంజాయ్ చేసినందుకు
      🙂

  • “నిశ్శబ్దం నిండిన ఈ సాయంత్రాల్లో ఎప్పుడు ఇలా బయట కూర్చున్నా, కార్తీక మాసపు చలిలా కమ్మేస్తాయి ఈ జ్ఞాపకాలు” ఇది చదివాక ఊరికే ఉంటాయనుకొనే మెట్లు వాటి గుండెల్లో ఎన్ని వీడుకోళ్ళు దాచుకున్నాయో అనిపిస్తోంది. వాక్యానికీ వాక్యానికీ మధ్య మీరు క్రియేట్ చేసిన స్పేస్ (నిశ్శబ్దం) రీడర్ కి అక్కడ అలుముకున్న కవిత్వాన్ని అస్వాదించే అవకాశం ఇస్తోంది. చాలా బావుంది వల్లీ గారూ!

  • వెచ్చని మానవ భావాలతో, అందమైన భాషతో చక్కని అనుభూతిని ఇచ్చిని మీకు నా ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు