మెజారిటీల మూర్ఖత్వం గురించి….

చాలామంది కథకుల్లా తాము రాసే కథలన్నీ ఒకే శైలి, ఒక టోన్ కాకుండా ప్రతి కథకూ వైవిధ్యం చూపిస్తూ….విభిన్న వస్తువులతో కథలు రాసే కథకురాలు ఎం.ఎస్.కె.కృష్ణజ్యోతి.  నేను తోలుమల్లయ్య కొడుకుని…కథతో మేలైన కథకురాలిగా పాఠకుల గుర్తింపు పొందారు.

కోస్తా తీర ప్రాంతపు జీవితాల్ని, భాషనూ తనదైన శైలిలో కథల్లో చూపిస్తూ విభిన్నవస్తువులతో నాణ్యమైన కథలు రాశారు. సూటిగా , సరళంగా ఉంటూనే పదునైన వ్యంగ్యమూ, చురకలు వేయగల కలం తనది. ఎటువంటి అతిశయోక్తులు, అతి ఉండకుండా సాధారణంగానే కనిపిస్తూనే…చెప్పాలనుకున్న విషయాన్ని అసాధారణ రీతిలో చెపుతారు. 

“స్త్రీ ధనం” కథలో రమణమ్మ, “దురాయి” కథలో లచ్చమ్మ, కొత్త పండుగ కథలో “ అలివేలు”…ఇలా తన కథల్లోని మహిళల పాత్రలు పితృస్వామ్య సమాజంతో పోరాడుతున్న తీరును తన కథల్లో ప్రతిభావంతంగా చెప్పారు. 

***

   విష్ణుదేవుడు పంది అవతారం ఎత్తాడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుని బారినుంచి వేదాలను, భూమిని కాపాడే క్రమంలో.  చారిత్రిక నేపధ్యం ప్రకారం వ్యాఖ్యానించాలి అంటే, వైదిక ధర్మం పలుచన అవగల పరిస్థితి వచ్చి వుంటుంది ఆర్యులకు.  బహుశా అనార్య తెగలు సాంస్కృతిక అంశాల్లో పైచేయి కావొచ్చి ఉండొచ్చు. ఆ రాక్షస జాతిని నిలువరించాలి అంటే, అంతకు మించి బలమైన ప్రతినిధి కావాలి.  పంది ఎంత బలం కల జంతువో తెలుసా?!  ఆర్యుల సాంస్కృతిక వారసత్వ సంపద కాపాడుకోవలసిన క్లిష్ట పరిస్థితిలో విష్ణు దేవుడు పంది అవతారం ఎత్తడం సమంజసమే.

ఏది రాయాలని కూచుంటారో మొదట్నించి చివరిదాకా అదే రాయగల రచయితలు దేవుళ్ళు.  కానీ, నా సంగతి అలా కాదు. నేను విన్న, చూసిన పందిని భక్షించిన మైనారిటీల క్రూరత్వం కాదు, నేను నివసించే మెజారిటీ సమూహాల మూర్ఖత్వమే  ‘తెల్ల మచ్చల నల్ల పంది’ అనే కథగా బైటికి వచ్చింది.

తెల్ల మచ్చల నల్ల పంది-కృష్ణజ్యోతి కథ  ఇక్కడ చదవండి.

        కావలి పాతూరులో ఎటుచూసినా పందులు కనబడతాయి. ఛీ యాక్ పంది.  మా ఏలూరులో కూడా చాలాఉండేవి.  పడమర వీధిలో ప్రతిరోజూ వాటితో సహజీవనం చేస్తూనే మేం పెద్దాయ్యాం.  ఇప్పుడు వున్నాయో లేక మునిసిపాలిటీ వాళ్ళు కట్టడి చేశారో తెలీదు.  కనుక్కోవాలి.

మా వీధిలో ఒక బక్క పలచటి మర్యాదస్తుడైన రౌడీ ఉండేవాడు.  వయసు యాభైకి చాలా పైనే కావచ్చు,  పంది దాడికి గురి అయిన అమ్మాయిని కాపాడాడు, గునపం సాయంతో వీరోచితంగా పందితో పోరాడి.  హిరణ్యాక్షుడి కన్నా బలమైన వాడు అన్నమాట. నా ఫ్రెండ్ తాతయ్య.  కుక్కలాగా కర్రతో ఎదుర్కోగల జంతువు కాదు, అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. అప్పడు నేను ఎలిమెంటరీలో వున్నాను.

మామూలు పందులతో సమస్య తక్కువ. అవి అడ్డదిడ్డంగా రోడ్డుగా పోయే సమయంలో మాత్రం చిన్న, పెద్ద ప్రమాదాలకు కారణం కావచ్చు.  నన్ను సైకిల్ మీంచి పడదోసి పారిపోయింది ఒక పంది, హిరణ్యాక్షుడి కాలిగోరుకి సరిపోలని నన్ను మీదబడి కరవకుండా పోయిందే అదృష్టం.  అప్పటికి హై స్కూల్ ఏడో తరగతి.

జీలుగుమిల్లి అడవి ప్రాంతం దారిలో ఒక వూళ్ళో చూశాను.  దానిని వేలాడ గట్టారు.  అది బతికే వుంది.  దాని తోలు కొంత కోశారు.  అది హృదయ విదారకంగా అరుస్తోంది.  నిస్సహాయమైన ఆ జంతువుని చంపకుండానే కావలసిన శరీర భాగాలు తీసుకుంటున్నారు.  అయ్యో. జంతువుకి బలం ఇచ్చిన ప్రకృతి మనిషికి ఇంగితం ఇవ్వలేదు.  ఇలాంటి దయ చూపని ఆహారపు అలవాట్లను నేను గౌరవించలేను.  ఎవరు ఏమైనా అనండి.  తినొచ్చు.  కానీ కృతజ్ఞత వుండాలి.  చప్పున అనాయాసంగా చంపాలి.  హింసించకూడదు. ప్రతి జీవి వేరొక జీవి మీద ఆధారపడటం ప్రకృతి సహజం.  కానీ, ఏ జంతువుకీ లేని ఇంగితం నాకు వున్నది అని విర్రవీగే మనిషి, ఏ జంతువూ ప్రదర్శించలేని దుర్మార్గాన్ని చూబిస్తాడు, కేవలం రుచి కళికలకు కొద్దిపాటి సౌకర్యాన్ని పెంచడానికి. ఆ దృశ్యాన్ని మర్చిపోయి ఇది ఒక మామూలు రోజుల వ్యవహారంగా తీసుకోవాలని ప్రయత్నించే సమయంలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుకుంటున్నా.

చిన్నవి, మధ్య రకం సైజువి, ముఖ్యంగా మొగవి హానికరం కాదు.  కానీ, సూడి పంది అప్పుడే పిల్లలు పెట్టిన పంది చాలా ప్రమాదం.  పేపర్లో కూడా చదువుతూ వుండేవాళ్ళం కదా ఇదివరకు.  కళ్ళతో చూశాను, ఒక కుక్క పిల్ల పొరపాటున పంది పిల్లల జోన్ లోకి ప్రవేశించింది.  క్షణాల్లో ఆ పిల్లని తల్లి పంది పీసు పీసుగా చీల్చేసింది.  నేను గోడ ఇవతల నుంచి వణికిపోయాను.  పొడుగాటి వెదురు కర్రతో పందిని దారి మళ్లించాలని చూశాను కానీ, ఆ కుక్క పిల్లని కాపాడటం నా తరం కాలేదు.  అప్పటికి నాకు పెళ్లి, పిల్లలుఅయి కావల్లో వున్నాం.

కావలిలో పందులన్నీ వాటికవే స్వేచ్చా జీవులు కాదు. వాటికి ఓనర్లు వున్నారు.  వాళ్ళు ఊరిమీదికి వాటిని వదిలేసినట్లు వుంటారు కానీ, నిజానికి వాటి అనుపానాలు వాళ్లకు తెలుసు.  రోజంతా వాటితో కనెక్ట్ అయి వుండే పందుల పెంపకం కుర్రాళ్ళే, సూడి పందిని పట్టుకోవడానికి చాలా జాగ్రత్తలు పడుతూ వుంటారు. ఒక గ్రూప్ గా వస్తారు.  మంచి సమన్వయంతో పని చేస్తారు.  ముందర చెప్పినట్లు నాకు చాలా భయం అవంటే.  కేవలం భయమే కాదు, చాలా జాలి, బాధ కూడా.  మనిషిని తిట్టడానికి దొరికే ప్రతి అవకాశాన్నీ వినియోగించాలి కాబట్టి ఇంకోసారి గుర్తు చేసుకోవాలి, చాలా దుర్మార్గుడు.  తనకి ఆహారం ఇచ్చే జీవిని సైతం హింసించి చంపడానికి వెనకాడడు.  చంపే ముందు పందిని బాగా కొడతారు అంట. అప్పుడు దాని శరీరం మెత్తబడి రుచిగా వుంటుందంట.  నిజమో కాదో తెలీదు. స్కూల్ పిల్లలు ఎవరో చెప్పారు ముసునూరు హై స్కూల్ లో వుద్యోగం చేసేప్పుడు.

ఏదో వాసన వచ్చింది ఒకరోజు. అటూ ఇటూ చెక్ చేసి పంది చనిపోయింది అన్నాడు మా ఇంటిఆయన.  పందుల వాళ్ళు కనబడితే చెప్పి వచ్చాడు.  రెండో రోజుకి ఎవరూ రాలేదు. మునిసిపాలిటీ వాళ్ళు ఇంటి వైపుకి వస్తే, బిగ్గరగా చెప్పాము.  మూడో రోజికి ఎవరూ రాలేదు.  అరటి పండులో సైనైడ్ పెట్టి మీ పందులు అన్నింటినీ చంపించివేస్తా అని మళ్ళీ పందుల వాళ్ళ కుర్రాడి మీద అరిచాను.  నాలుగో రోజుకి ఎవరూ రాలేదు!  డబ్బులు ఇస్తాం, అడిగినంత అనుకున్నాం.  అలా చెప్పినా ఎవరూ రాలేదు.  పొద్దున్నంతా బడి.  సాయంత్రం ఇంటికి వచ్చినపుడు సమస్య మొదలు.  ఎవరో ఒకరు వచ్చి తీసుకుపోతారని అనుకున్నాం.  లేకపోతే, శెలవు పెట్టుకుని వెట్టి మనిషిని వెదికే ప్రయత్నం చేసేవాళ్ళం.  రాత్రి దుర్భరం అయిపోయింది.  ఆ వాసనకి తూలి పడిపోతాను అనిపించింది. అనుభవిస్తేగానీ తెలీని ఇబ్బంది.  ఎవరో వస్తారని ఏదో చేస్తారని, ఆ ప్రాణం పిండేసే దుర్గంధం నుంచి మమ్మల్ని కాపాడతారని  చూశాం.  లాభం లేదు.  ఎవరూ రాలేదు.  మనమే రంగం లోకి దిగాలి అని నిర్ణయం చేసుకున్నాం.  ఓ డబ్బాడు పెట్రోల్, అగ్గిపెట్టె, గునపం తీసుకొని ముక్కుకి తువాలు కట్టుకొని తను ముందు నడిస్తే, నేను తనని అనుసరించాను.  కుళ్లిపోయి పురుగులు చేరిన పంది. చాలా రోతగా ఉండింది. వెట్టి కర్మచారి, పందులు కాచే కుర్రాడు, మునిసిపాలిటీ స్కావెంజేర్-ఎవరు మాత్రం ఆ దృశ్యాన్ని ప్లెజెంట్  అనుకోగలరు?  ఎంత డబ్బులు ఇస్తే మాత్రం. పెట్రోలు గుమ్మరించి అగ్గిపెట్టె వెలిగించాం.  పంది కాలిన వాసన.  ఆహ్లాదకరమైన అనుభవం కాదు. దహన సంస్కారం చేసి మిగిలిన అవశేషాలను గొయ్యి తీసి అక్కడే పాతేశాం.  ఇప్పటికీ ఆ స్థలం ఖాళీగానే వుంది. ఎవరూ ఇల్లు కట్టలేదు. భవిష్యత్తులో ఎవరైనా కట్టబోతే, అక్కడ వాళ్లకి పంది ఎముకలు దొరుకుతాయి.   ఇది జరిగి పదేళ్ళ లోపే.

దహన సంస్కారాలు చేస్తే పుణ్యం అంటారు, కానీ అది గుర్తొస్తే భలే అసహ్యం పుట్టేది కొన్నాళ్ళు. వదిలించుకోవాలి అని పంది కథ రాయ మొదలు పెడితే,

“ఎదవ పంది నా బతుకు” అనుకుంటూ ‘కుమారి’ తెల్లమచ్చల నల్లపంది కాయితం మీదికి వచ్చింది.  పై అనుభవాలు అన్నీ కథ మొత్తంలో ఏదో ఒక వాక్యంలో లేదా పదంలో ఇరుక్కుని కూచున్నాయి!  తెల్ల మచ్చల నల్ల పందికి దాని నల్లని రంగు నచ్చలేదు.  జనాలు తనని అసహ్యించుకోవడం నచ్చలేదు.  అది చాలా డిప్రెషన్ లో వుంది.  తమ జాతిని కాపాడే సంస్కర్త ఎవరైనా వున్నారా అని ప్రశ్నిస్తే, సంస్కర్తల సంగతి ఏమో కానీ, సాక్షాత్తు విష్ణువు పంది అవతారం ఎత్తాడు అని తెలుసుకుంది.  ఆ మహా వరాహ అవతారం దర్శించాలని ప్రయత్నించి ఆ ప్రయత్నంలో భక్త జనుల పాలబడి చనిపోతుంది.  రాసే క్రమంలో కూరగాయల మార్కెట్ పక్కన కుళ్ళిన కూరగాయల విందులో   పందులగుంపులు; రైల్వే రోడ్ లో దక్షిణం దిక్కున కుంకుమ, బండారి, విభూతి అమ్మే ముసలమ్మ; గుడి పక్కన ఆకులు, కొబ్బరి తునకలు తింటూ మైకులో చాగంటి కోటేశ్వర రావు ఉపన్యాసాలు విని వేదాంతిగా మారిన వరాహ రత్నం; తెల్ల మచ్చల లోని నాగరిక విశేషాలు, నలుపు మీద లోకానికి గల నిరసన; నాకుగా కల పరిశోధనా కుతూహలం ఇవన్నీ వచ్చి చేరాయి.  ముందర చెప్పిన విశేషాల నుంచి కాకుండా గోదావరి జిల్లాల్లో పాతికేళ్ళ నాడు గుడిచుట్టూ గంటల తరబడి ప్రదక్షిణాలుచేసి చనిపోయిన భక్త శిఖామణి పంది మూలకథ అయింది.  ఆ సంఘటన వినాయకుడు పాలు తాగిన 1994/95 ముందర జరిగిందో, తరవాత జరిగిందో, స్థల కాల విశేషాలు జ్ఞాపకం లేవు.

ఈ కథ రాసేప్పుడు, పంది ప్రవర్తనా సంబంధ అంశాలు కొంత అధ్యయనం చేశాను.  పంది బురదలో ఎందుకు పోర్లాడుతుంది?  దాని తోక అది మామూలుగా వున్నపుడు ఎలా వుంటుంది?  హుషారుగా వున్నపుడు ఎలా వుంటుంది?  పంది IQ లెవెల్స్ ఎలా వుంటాయి వగైరా.  భూ ప్రపంచంలో మనిషి, కోతి తరవాత తెలివైన జంతువు పంది అని కొన్ని అధ్యయనాలు భావిస్తాయి.  ర్యాంకింగ్ అటూ ఇంటూ మారినా, అనేక అధ్యయనాల్లో పంది మొదటి ఐదో ర్యాంకుల్లో ఏదో ఒకటి కైవసం చేసుకుంది.  మిగిలిన పందుల్లాగా బురదలో పోర్లాడామా, వీధుల్లో తిరిగామా, సాయంకాలానికి పందులోళ్ళ పాలబడ్డామా అని కాకుండా, మితిమీరిన పరిశోధనాసక్తి చూపింది తెల్లమచ్చల నల్ల పంది. అక్కడే దాని పోగాలం లెక్క మొదలు అయింది!

పంది సమాజం గురించి ఏదో రాయాలని మొదలేసి, మానవ సమాజం సంగతే రాశానని గుర్తించాను చివరికి.

*

కృష్ణ జ్యోతి

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు