మూడు నదులు, మూడు పట్టణాలు, ఎందరో వ్యక్తులు…

మూడు నదులు చివరి భాగం

తిరిగి సేఠాణీఘాట్ లో దిగాక చిన్నపాటి ద్వైదీభావం. ఒకవైపు వెళితే నర్మదాఘాట్… బహుశా అది అక్కడి ముఖ్యమైన స్నానఘట్టం. మరోవైపుకు వెళితే నేను ఎప్పుడూ చూసి ‘దిగుదాం దిగుదాం’ అనుకొన్న రైలువంతెన పక్కన ఉన్న ఘాట్. అది ‘హింగ్ లాజ్ దేవి’ మందిర ప్రాంగణమట. రెండువైపులకూ వెళ్ళే సమయమూ, ఓపికా లేవు.

చివరికి నా చిరపరిచితమైన వంతెన వైపే మనసు మొగ్గింది.  ఆటో తీసుకుని అక్కడకు చేరేసరికి చీకటి పడనే పడింది. చీకటిపడినా దీపాల వెలుగులకేం కొదవలేదు…  అదో శోభ. గుడిని బైపాస్ చేసి తిన్నగా నది ఒడ్డున ఉన్న మెట్లవైపు దారితీశాను. ఈలోగా రైలు వంతెన మీద దడదడలాడుతూ రైలుబండి. అప్పటిదాకా రైల్లో కూర్చొని ఆ మెట్లను ఎన్నోమార్లు చూసినవాడిని. ఇపుడు అదే మెట్లమీంచి రైలుకేసి చూడటం… సాకారమయిన ఆనాటి కల! ఊరి చివరి ప్రదేశం కాబట్టి అంతగా కోలాహలాలు లేవు. రైళ్ళ శబ్దాలు తప్పించి పెద్దగా అల్లరి లేదు. ప్రార్ధనలు, ధ్యానాలు చేసేవారికి గంటా రెండు గంటలు ప్రశాంతంగా గడిచిపోయే వాతావరణమది. నాకు అవి చాతగాకపోయినా ఆలోచనలు లేని మనసుతో సమయం దొర్లిపోయింది.

“సార్….ఏ ఊరూ?” ఓ బక్కపలచటి నడివయసు మనిషి… పక్కనే చేరగిలబడ్డాడు. ఎందుకో మాట్లాడాలనిపించింది. సమాధానం చెప్పాను. కబుర్లలో పడ్డాం. అక్కడికి పాతిక కిలోమీటర్ల దూరాన ఉన్న గ్రామంలో పనిచేస్తున్నాడట. హోషంగాబాద్‌కు తరచూ వస్తుంటాడుట. స్థానిక వివరాలూ, రాజకీయాలూ, వర్తకవాణిజ్యాలూ, చదువు సంధ్యలూ, జీవనసరళీ వీటి గురించి ఆసక్తికరంగా మాట్లాడాడు.

“ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ ఎంత దూరం?” రాత్రి పదకొండింటికి నా ఝాన్సీ  రైలుబండి. “నాలుగు కిలోమీటర్లు.  ఆటోలుంటాయి. కానీ రాత్రిగదా నోటికి వచ్చినంత అడుగుతారు. షేర్ ఆటో తీసుకోండి. పదీపదిహేనుతో సరిపోతుంది,” ఆ ఆగంతకుడి సలహా.

తొమ్మిదవ వస్తోంది. స్టేషన్ కు చేరుకుని కాస్త మంచి చోటు చూసుకుని భోజనం చేయాలి. టైముంటే రిటైరింగ్ రూములోనో… వెయిటింగ్ రూమ్ లోనో స్నానమూ చేయాలి. లేచి బట్టలు దులుపుకున్నాను.

* * *

“వద్దు సార్, మీ దగ్గర డబ్బులు తీసుకోవడమేమిటీ? మీరు యాత్రికులు,” ఆ చిన్న రెస్టారెంటు పెద్ద మనసు కుర్రాడు డిన్నరుకు డబ్బులు తీసుకోనంటాడు!! యాత్రికుడ్ని అన్న మాట నిజమేగానీ తిన్న తిండికి డబ్బులివ్వని పాపం నాకెందుకూ?

స్టేషనుకు సమీపంలో, చిన్న సందులో అతి చిన్న రెస్టారెంటది. చేరేసరికి తొమ్మిదిన్నర అయింది. కట్టేసే సన్నాహాల్లో ఉన్నవాళ్ళు కాస్తా నన్ను చూసి విస్తరివేసారు. కుర్రవయసు యజమాని వచ్చి నా దగ్గర చేరాడు… మాటల్లో పెట్టాడు. వివరాలు చెప్పగానే వాతావరణం మారిపోయింది. నేనేదో రాహుల్ సాంకృత్యాయన్ని అన్నట్టు ఆ కుర్రాడూ అతని ఇద్దరు సహచరులూ నాకు మర్యాదలే మర్యాదలు, కొసరికొసరి వడ్డించడాలు. ముందు ఇబ్బందిగా అనిపించినా ఆశించని ఆ ఆదరణతో మనసు చెమర్చింది. అంతా అయ్యాక చెల్లింపు దగ్గర ఈ గొడవ. మొత్తానికి అతన్ని ఒప్పించి డబ్బులు ఇచ్చి నిండిన మనసుతో రైల్వేస్టేషన్ చేరాను.

……………

ఏదో తరుముకొచ్చినట్టు దాని నిర్దిష్ట సమయానికన్నా పావుగంట ముందే ఝాన్సీలో దింపేసింది రైలుబండి. రైళ్ళ పంక్చువాలిటీని చూసి నొచ్చుకునే అరుదైన సందర్భమది. ఇంకా తెలవారడానికి రెండు గంటల సమయముంది. ఓర్ఛాకూ, ఝాన్సీకి మధ్య పదిహేను కిలోమీటర్ల దూరముంది. అన్నట్టు ఝాన్సీ  ఉత్తరప్రదేశ్‌కు చెందిన పట్నమయితే ఓర్ఛా మధ్యప్రదేశ్ భూభాగం. వాస్తవానికి ఝాన్సీకి దాదాపు నాలుగువేపులా మధ్యప్రదేశ్ భూభాగమే. అది ఒక భౌగోళిక రాజకీయ వైచిత్రి.

అంత ఉదయమే ఓర్ఛాకు బస్సులుంటాయా… తెల్లారేదాక స్టేషనులోనే ఉండాలా? కనుక్కున్నాను. బస్సులు మరో గంటకు బయలుదేరతాయనీ… ఇప్పడైతే షేర్డ్ ఆటో దొరకవచ్చనీ స్థానిక సమాచారం. మరో గంట గడిచేలోగా ఓర్ఛా నడిబొడ్డుకు చేరుకున్నాను. మనిషి జాడ అంటూ ఉంటుందా అని సందేహిస్తూ దిగిన నాకు అక్కడ గుంపులు గుంపులుగా నదికేసి నడిచి వెళుతున్న జనసమూహాలను చూసి ఆశ్చర్యమనిపించింది. వాకబు చేశాను. నదికీ, నది ఒడ్డున ఉన్న రామాలయానికీ చెందిన స్థానిక పుణ్య తిథి అట ఆ రోజు. నదీస్నానాల కోసమూ, దైవ దర్శనంకోసమూ చుట్టుపక్కల గ్రామాలవాళ్ళు ఆ పుణ్య దినాన వందలకొద్దీ ఓర్ఛా చేరతారట.

ఆ తీర్ధయాత్రికులతోపాటు నేనూ నదివైపు నడక సాగించాను. ఎన్నో ఏళ్ళ తర్వాత ఇలా యాత్రికులతో నడవటం. మెల్లగా ఓ విషయం స్పష్టమవసాగింది. నది ఒడ్డున కూర్చొని పుణ్యసాన్నాల యాత్రికులను చూస్తూ సూర్యుడిని ఆహ్వానించడమన్నది అక్కడ దొరికే అపురూపమయిన అవకాశం అని. ఆ ఎరుక మనసును ఉత్తేజపరిచింది.

పది నిమిషాల్లో నది. నింగీనేలా కలిసే చోట వెలుగుఛాయలు. ఎన్నోసార్లు ఫోటోల్లోనూ, వీడియోల్లోనూ చూసిన నదీ తీరమది. అక్టోబరు వచ్చేసింది కాబట్టి ప్రవాహతీవ్రత లేదుగానీ, నదీగర్భంలో బండరాళ్ళ మధ్య నుంచి పారే సన్నటి ప్రవాహాలూ, అక్కడక్కడా లోతు ఉన్న ప్రదేశాలలో నిలిచిపోయి ఉన్న తటాకస్థాయి నీటి మడుగులూ… వింత అందంతో కనిపించాయి.

నదిని దాటి అవతలిగట్టు చేరడానికి నదీగర్భంలో నీటి మట్టానికి రెండే రెండడుగులు ఎత్తున వేసిన సిమెంటుబాట… ఎంత ప్రాథమికమైన వంతెన అయినా నిన్న మొన్నటిదాకా దానిమీదే అవతలి గట్టుకూ, ఆ పైన ఉండే గ్రామాలూ, పట్నాలకూ వాహనాలు వెళ్ళేవట. మొన్నటి వర్షాకాలం వంతెనకు రెండుమూడు చోట్ల గండి కొట్టిందట. ప్రస్తుతం మనుషులు నడవడానికీ, కాస్తంత సాహసం చేసి ద్విచక్రవాహనాలు నడపడానికీ మాత్రం ఆ వంతెన ఉపయోగపడుతోంది.

వంతెన మీద నడిచి నది మధ్యకు చేరుకొన్నాను. తూరుపు దిక్కున చిక్కనవుతోన్న వెలుగులు. కుడివేపున స్నానాలరేవులో రెండు మూడు వందలమంది సామూహిక ప్రక్షాళన దృశ్యం… ఎదురుగా విచ్చుకొంటున్న ఉదయపు వెలుగులు నిశ్చల నదీజలాలలో ప్రతిఫలించి వాటిల్ని అద్దంలా మారుస్తోన్న వైనం. నడిఒడ్డున కనిపించే కోట, గుడిగోపురాలు, రాజవంశీయుల సెనోటాఫ్‌లు, నదీగర్భపు చెలమల్లో మునిగి కేరింతలు కొడుతోన్న కుర్రకారు, ఆ బండల మధ్యనే చేరగిలబడి తూరుపు సూర్యుణ్ని ఆహ్వానించడానికి సంసిద్ధమయిన నేను…

కేరింతల కుర్రాళ్ళతో మాటలు కలిపి, నా ప్రవర అంతా చెప్పుకుని, వాళ్ళ వివరాలు తెలుసుకొన్నాను. నది అవతల కనిపిస్తోన్న అడవి ఆకర్షించగా గబగబా అటువెళ్ళి నాలుగడుగులు వేశాను. మళ్ళీ వచ్చి సూర్యోదయ దృశ్యం మనసులో నింపుకొన్నాను. స్నానఘట్టాల మీదుగా నడిచివెళ్ళి ఆ వాతావరణంలో భాగమయ్యాను. ఆ ఘట్టాల ఎగువునున్న విశాలమైన ‘కంచన్ ఘాట్’ ప్రాంగణం, ఆ ప్రాంగణంలో అలనాటి రాజులూ, రాణుల స్మృతి చిహ్నాలుగా నిలబడి ఉన్న పధ్నాలుగు గంభీరమైన సెనోటాఫ్‌లు, అక్టోబరు చిరుచలి, అక్కడక్కడ ఉన్న  కోతుల్ని చూసి ముచ్చట పడుతోన్న విదేశీ టూరిస్టులు, వాళ్ళను తమ మాటకారితనంతో ఆకట్టుకొని దక్షిణలు పొందుతున్న చిన్నపిల్లలు…

ఎనిమిది దాటింది. ఎండ చురుక్కుమనిపిస్తోంది. తాడూ బొంగరం లేకుండా ఇది రెండోరోజు. రోజంతా ఆ చుట్టుపక్కలే ఉంటాను కాబట్టి ఒక గూడంటూ వెతుక్కుంటే బావుంటుందనిపించింది. అటూ ఇటూ చూస్తే కాస్తంత దూరాన నది ఒడ్డునే గవర్నమెంట్ వాళ్ళ టూరిస్ట్ రిసార్టు. ‘ఇది నా బడ్జెట్ కు అందదు’ అనుకొంటూనే లోపలికి వెళ్ళాను. అనుకొన్నట్టే అక్కడి గదుల అద్దె రెండువేల అయిదొందలు.  ఆ నదీతీరపు సుందర ప్రాంగణం బాగా ప్రలోభపెట్టిందిగానీ, వద్దనుకొని బయటకు నడిచాను. గేటు దగ్గర పెద్దవయసు సెక్యూరిటీ గార్డును ‘ఊళ్ళో వెయ్యి రూపాయలలోపు శుభ్రంగా ఉండే వసతి ఏమన్నా సూచించగలవా’ అని అడిగితే… సూచించడమే కాకుండా ఒక ఫోన్ కాల్ చేసి అక్కడిక్కడ మెయిన్ రోడ్ లో ఉన్న చిన్నపాటి హోటల్లో గది కుదిర్చిపెట్టాడు కూడా.

……………

తిరిగే కాలు కదా… అది గదిలో నిలవదు. కాలకృత్యాలూ, స్నానాలూ ముగిసాక మళ్ళా తొమ్మిది కాకుండానే రోడ్డు పట్టుకొన్నాను.

ఓర్ఛా  అతి చిన్న పట్టణం. నిజానికి దాన్ని పెద్ద గ్రామం అనాలి. ఆ చివర నుంచీ ఈ చివరకి ఎటువెళ్ళినా మైలు లోపలే. ఎటుచూసినా చిన్నాపెద్దా గుళ్ళు… పొద్దున యాత్రికులంతా నదీస్నానాలు చేసి వెళ్ళిన గుడి కాక నది పక్కనే ‘బేతేశ్వర్ మహాదేవ్’ ఆలయమూ కనిపించింది. రోడ్డుమీదకు వచ్చి  కుడివేపు చూస్తే కోట ప్రదేశం… ప్రస్ఫుటంగా కనిపిస్తోన్న మహత్తర భవనాలు. ఎదురుగా కాస్తంత దూరాన ఓ గుట్టమీద నిడుపాటి గోపురాలతో మరో ఘనదేవాలయం… ‘బావుంది, రోజంతా చేతుల్నిండా పని’ అనుకొన్నాను.

కోటకేసి అడుగు పడిందో లేదో ఆ పక్కనే కనిపించిన తేనీటి దుకాణం పలకరించి నిలవరించి మూడు టీలు తాగేలా చేసి అరగంట తర్వాత సాగనంపింది. ఒట్టి టీ దుకాణమే అయితే పట్టించుకునే వాడిని కాదు… పక్కనే పేవ్ మెంట్ మీద ఎక్కడెక్కడ్నించో సేకరించి, సడలిన కీళ్ళకు తాళ్ళు వేసి ముడిపెట్టిన కుషన్లు లేని చెక్క సింగిల్ సోఫాలు నా దృష్టిని ఆకట్టుకొన్నాయి. ఆ నీరెండలో, ఆ సోఫాలో చేరగిలబడి, సాగిపోయే ఓర్ఛా పట్నాన్ని నింపాదిగా పరకాయిస్తూ రెండు మూడు టీలు తాగడం కన్నా గొప్ప విలాసం జీవితంలో ఉండబోదని నాలోని యాత్రికుడు తట్టి చెప్పాడు… ఆగాను. చెక్కసోఫాలో ఆ ఊరంతా నాదే అన్నంత కులాసాగా చేరగిలబడ్డాను. టీలు తాగాను. దారినపోయే ఓ కుర్రాడిని ఆపి ఒకటికి నాలుగు ఫోటోలు తీయించుకొన్నాను. పుణ్య బైరాగులకు మాత్రమే లభించగల జీవనసౌందర్యాన్ని తేనీటితో కలగలిపి ఆస్వాదించాను.

…………..

“ఏంవాయ్, నీదేనా షాపూ?”

‘తల్లీ’… అందామనుకొన్నాను కానీ అసంకల్పితంగా ‘వాయ్’ అన్నమాట వచ్చేసింది. ముందు తత్తరపడి బిత్తరపోయి క్షణంలో నిలదొక్కుకుని కళ్ళెత్తి చురుగ్గా చూసిందా పాప. ఆ చురుకు చూపులు ముద్దుగా అనిపించాయి, నవ్వాను. దాని పుణ్యమా అని ఆ అమ్మాయి కళ్ళలోని చురుకుదనం పెదాలమీదికి జారి చిరునవ్వుగా పరిణమించింది. “ఊ! నాదే… ఏం కావాలీ?” ‘అంకుల్’ అనో ‘చాచాజీ’ అనో పిలుస్తుందనుకున్నా… ఊహూ! నా ‘వాయ్’ కు సరితూగే బాణీలో ఉందా స్నేహసమాధానం!

పూలు, పూజాసామాగ్రి, చెక్కబొమ్మలు, ఇత్తడితో చేసిన అట్టే ఖరీదు కాని గృహాలంకరణ సామాగ్రి, పంచదారతో చేసిన ప్రసాదం ఉన్న గోనెసంచీ… అదో మినీ సూపర్ మార్కెట్. అటు గుట్ట మీది గుడికి వెళ్ళే యాత్రికుల అవసరాలూ… ఇటు కోటలోని భవనాలవేపు వెళ్ళే టూరిస్టుల అవసరాలూ తీర్చే దుకాణమది.

“ఏం చదువుతున్నావ్?” కబుర్లలో పెట్టే ప్రయత్నం.

కాస్త పక్కన ఉన్న పెద్దాయన  – వాళ్ల నాన్న కాబోలు – కళ్ళెత్తి చూసాడు. క్షణకాలం సందేహపు చూపులు. నా వాలకం చూసి, ప్రమాదం లేదని నిర్ధారించుకుని, ఓ అరచిరునవ్వు విసిరి, తిరిగి తన పనిలో పడిపోయాడా పెద్దాయన.  “అయిదో క్లాసు” పాప సమాధానం. “మా పాప చదువులో బాగా హుషారు. మొన్న వాళ్ళ టీచరు మూడు అవగానే అయిదులోకి పంపేసింది,” పుత్రికోత్సాహం ఆ తండ్రి మాటల్లో.

“ఊళ్ళో చూడాల్సినవి ఏం ఉన్నాయీ” పాపతో మాటలు పెంచాను. ఐదు నిమిషాలపాటూ గుక్కతిప్పుకోకుండా అనుభవజ్ఞుడైన గైడ్‌లా ఊరి విశేషాలు చెప్పుకొచ్చింది. ఊరి విశేషాలేగాకుండా ఊరు దాటాక వచ్చే అడవి గురించీ, ఆ అడవిలో అయిదు కిలోమీటర్లు వెళితే వచ్చే నది గురించీ, ఆ నది మీద వంతెన అందం గురించీ, అక్కడ గూడేల్లో ఉండే గిరిజనుల గురించీ చెప్పింది!!

“ఇవన్నీ నీకెలా తెలుసూ?”

“ఇక్కడే పుట్టి పెరిగాను కదా… ఎందుకు తెలియదూ?” నవ్వింది.

“మా ఇంటికి ఏ చుట్టాలొచ్చినా ఇవన్నీ చూపించేది నేనే,” కొంచెం గర్వం ఉంది ఆ సమాధానంలో.

“నీకూ వచ్చి చూపించమంటావా?” హరివిల్లు నవలలోని మువ్వ మాటలు గుర్తొచ్చాయి.

మనసు రెపరెపలాడింది. వాళ్ళ నాన్నకేసి చూశాను. ఆయన మొహంలో ఆమోదం కనిపించింది. అయినా ఆ పాపను నాతో తిప్పడం భావ్యం కాదనిపించింది. వద్దని చెప్పాను. ఒకటీ, రెండు ఇత్తడి వస్తువులు తీసుకొన్నాను. కోటకేసి ముందుకు సాగాను.

వద్దన్నాను గానీ ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది. ఆ పాపతో రెండు గంటలు గడిపే చక్కని అవకాశం చేతులారా వదులుకొని పెద్ద పొరపాటు చేశానని!

…………..

ఓర్ఛా రాజ్యాన్ని 1531లో ‘రుద్రప్రతాప్ సింగ్’ అన్న రాజపుత్ర యోధుడు స్థాపించాడట. అప్పటిదాకా చిన్నచిన్న ప్రదేశాలను తనకు స్థావరంగా చేసుకొని ఆ బుందేల్ ఖండ్ ప్రాంతాలను పాలించిన రుద్రప్రతాపుడు 1531లో వేత్రవతీ నదీ తీరాన ఓర్ఛా నగరాన్ని నిర్మించి తన రాజధానిగా ప్రకటించాడట. స్వతంత్ర రాజ్యస్థాపన జరిగిన మాట నిజమేగానీ అంతా కలిసి నూటయాభై మైళ్ళన్నా దూరం లేని ఆగ్రా కేంద్రిత మొఘల్ సామ్రాజ్యపు ధాటిని తట్టుకోలేక తిరుగుబాట్లూ, ఎదిరింపులూ కొంతకాలం సాగాక… ఓర్ఛా అక్బరు సామంతరాజ్యమయిందట. 1605-26 మధ్య ఓర్ఛాను పాలించిన ‘వీర్ సింగ్‌దేవ్’ కాలంలో ఓర్ఛా రాజ్యం రాజకీయపరంగానూ, బృహత్తర భవనాల నిర్మాణపరంగానూ ఉచ్ఛదశలతో ఉందట.

పట్నపు మెయిన్ రోడ్డులోంచి వందారెండొందల మీటర్లు కుడివేపుగా వెళ్ళి కోటలోకి ప్రవేశించాను. చిన్నకోట… ఎటుచూసినా వందమీటర్ల లోపే. అంతా కలిసి కిలోమీటరు చుట్టుకొలత. లోపలికి వెళ్ళీ వెళ్ళగానే ఎదురుగా అతి విశాలమైన ప్రవేశప్రాంగణం. ఆ ప్రాంగణం అవతలా, కుడివేపునా, ఎడమవేపునా రాజభవనాలు… ‘భలే గంభీరంగా ఉందే’ అని ముచ్చట కలిగింది.

కాస్తంత వివరాల్లోకి వెళితే, ఎడమవేపున ఉన్న భవనం ‘శీష్ మహల్’ అనీ, కుడివేపున ఉన్నది ‘రాజ్ మహల్’ అనీ, ప్రాంగణం అవతల ఉన్నది ‘జహంగీర్ మహల్’ అనీ ఆపైన ఉన్నది ‘రాయ్ ప్రవీణ్ మహల్’ అనీ తెలియవచ్చింది. అన్నీ ఘనభవనాలే అని అక్కడ వివరాలు చెబుతున్నాయి. ముందు ఏది చూడటం? ‘రాజ్ మహల్’ వేపుకే మనసు మొగ్గు చూపింది. అక్కడ ఉన్న భవనాల్లో ముందుగా కట్టినది అదేనట. ఆ పక్కన ‘శీష్ మహల్’ పదహారో శతాబ్దపు పూర్వార్ధంలో ‘మధుకర్ షా’ అన్న అక్బరు కాలపు సామంతుడు కట్టుకొన్న నివాసగృహమట. కానీ ఆ భవన సందర్శన ఉపరితల పరామర్శ మాత్రమే అయింది. ఇప్పడది ఓ హెరిటేజ్ హోటలుగా మారింది. అక్కడ ఉండే అతిధులకే తప్ప బయటవారికి ప్రవేశం లేదన్నారు.

జహంగీర్ చక్రవర్తి ఓర్ఛా సందర్శనకు గుర్తుగా రాజా వీర్ సింగ్‌దేవ్ నిర్మించిన జహంగీర్ మహల్ అక్కడి కట్టడాలకు కలికితురాయి. ఆ భవనాలలో తిరగడం అంటే గతకాలంతో చెలిమి చేయడమే! పరిమాణంలోనే కాకుండా సొగసూ సోయగాలలోనూ అవి చెప్పుకోదగినవి. వాటి వాస్తురీతుల గురించి వివరించేంత పరిజ్ఞానం నాకు లేదు కానీ అక్కడ తిరుగుతోంటే ఆగ్రా, జైపూర్‌లలోని రాజమందిరాలలో తిరుగుతోన్న భావన మాత్రం కలిగింది. రాజులూ, సామంతులూ పరస్పర అభిమానాలూ, స్నేహాలూ కలిగి ఉన్నప్పుడు వాటి ప్రతిబింబాలు వారి వారి భవనాల్లోనూ నిలిచిపోయి, కాలరేఖ మీద అప్పటి చరిత్రను రాసి ఉంచవూ?!

‘జహంగీర్ మహల్’ దాటి పైకి వెళితే ‘రాయ్ ప్రవీణ్ మహల్’ పలకరించింది. అది అప్పటి రాజనర్తకి నివసించిన భవనం అని చూచాయగా తెలుసుగానీ లోపలికి వెళ్ళాక అది ఒట్టి నివాసగృహమే కాదు… లలిత కళల ఆవాసం కూడా అని అర్ధం అయింది.

రాజా ఇంద్రజీత్ సింగ్ ఆస్థాన నర్తకి ప్రవీణ. అతని అనురాగమూ పొందిన వ్యక్తి. ఆస్థాన కవి కేశవదాస్ శిష్యరికంలో సంగీత సాహిత్యాలలోనూ ప్రావీణ్యం పొందిన వ్యక్తి. ఆమె బహుముఖ ఖ్యాతి ఆగ్రాదాకా వ్యాపించగా విని ముచ్చటపడిన అక్బరు పాదుషా తన హోదాను, బలాన్ని ఆసరాగా చేసుకుని ఆమెను రాణివాసముండటానికి రాజధానికి రప్పించాడట. ధైర్యం కోల్పోని ప్రవీణ ‘వినతీ రాయ్ ప్రవీణ్ కీ, సునియే షా సుజన్, పతేర్ భకత్ హై, బరి బియాస్ స్వాన్’ అనే కవితా పంక్తి ద్వారా తన విన్నపం అక్బరు ముందు పెట్టిందట. ‘ఓ సుజనశీల చక్రవర్తీ,  ఎంగిలి కూటిని ఆశించేది కాకులూ, శునకాలు మాత్రమే కదా’ అన్న ఆ పదునైన విన్నపానికి అక్బరు చక్రవర్తి ఆగ్రహం తెచ్చుకోకుండా, ప్రవీణ వ్యక్తిత్వాన్ని మెచ్చుకొని సగౌరవంగా ఓర్ఛా తిప్పి పంపాడట. అనార్కలి విషయంలోనూ ఆయన ఇంత ఔదార్యం చూపించి ఉంటే చరిత్ర మరో రకంగా ఉండేదిగదా అనిపించింది. ఆ గాథనంతా కేశవదాసు ‘కవిప్రియ’ అన్న కావ్యంలో పొందుపరిచాడట. అదిగో ఆ ప్రవీణకు రాజా ఇంద్రజీత్ సింగ్ ప్రేమతో నిర్మించి బహూకరించిన భవనం ఈ రాయ్ ప్రవీణ్ మహల్. ఏదైమైనా చరిత్రలో మల్లీశ్వరిలూ, ప్రవీణలూ అసంఖ్యాకం;  కృష్ణదేవరాయలులూ, అక్బర్ పాదుషాలూ అతి పరిమితం!!

ఆ ‘ప్రవీణ్ మహల్’ కళలకు ప్రతిరూపంగా ఇప్పటికీ భాసిస్తోంది. భవనపు కారిడార్లూ, పై కప్పుల నిండా లతలూ, రకరకాల డిజైన్లు… గోడల నిండా రమణీయంగా చిత్రించిన రామాయణ ఘట్టాలు… మళ్ళా ఆ రామసోదరులకు మొగలాయీ ప్రభావిత రాజస్థానీ దుస్తులు… హనుమంతునికి పట్టులంగోటీ… జాంబవంతునికి పట్టుపంచె… భవనపు గవాక్షాలలోంచి ఒక పక్క కనిపించే బేత్వానదీ తీరం, మరోవేపునుంచి దూరాన నిడుపాటి గోపురాల ఘనదేవాలయం… గంటసేపు అక్కడ గడిపితేనే మనసంతా నిండిపోతే, జీవితమంతా అక్కడ నివసించిన ప్రవీణ మన అసూయకు పాత్రురాలు కాదూ!!

…………….

ఓ గంటా రెండు గంటలు భవనాలలో గడిపాక వాటిల్ని వదిలి కోటగోడనూ, కోటలోని పచ్చదనాన్ని పలకరించాలనిపించింది. నా ఆలోచనకు స్వాగతం పలుకుతూ గోడను ఆనుకొని చుట్టూ సాగిపోతున్న నలభై అడుగుల కాలిబాట… కోటగోడ అవతల కందకపు ఛాయలు… అడుగడుగునా అచ్చమైన పచ్చదనం. అక్కడక్కడ గోడ ఎక్కడానికి మెట్లు… గోడ మీద బురుజులు. ఇక ఆగగలనా? మెట్లెక్కాను. అద్భుత దృశ్యాలు స్వాగతం పలికాయి. ఒక దిశలో కాస్తంత దూరాన మెరిసే నీళ్ళతో నది. ఆ నదికి అవతల దిగంతాలదాకా పచ్చని అడవి. మరో దిక్కున చూస్తే దూరాన గట్టుమీద ఎండలో ధగధగా మెరిసిపోతోన్న బృహత్తర మందిరం… గోడమీంచి లోపలికి చూస్తే రాజభవన సముదాయాలూ వాటి మధ్యనున్న విశాలప్రాంగణపు సువిశాల దృశ్యం… మనసు నిండినట్టనిపించింది. ఆ భావన వచ్చీ రాగానే మనసును శరీరం గద్దించి ‘నీ మనసు నిండటం సరే…పొద్దుట నుంచీ టీ బిస్కెట్లు తప్ప కడుపులో ఏమీ పడలేదన్న సంగతి గమనించావా?’ అని నిలదీసింది.

అయినా ఆకలి మాట పట్టించుకోకుండా ఒక ఎత్తైన బురుజు అరుగు మీద చేరగిలబడి దృశ్యపారవశ్యంలో మునిగి తేలుతుండగా నాలాంటి మనిషే ఒకతను నా వేపు రావడం గమనించాను. ఆ రావడంలో పలకరింపు ధోరణి ఉంది. ఉదయం నది దగ్గర కలిసానా? గుర్తు రాలేదు. ‘హాయ్’ అన్నాడు. అరుగుమీద చేరగిలబడ్డాడు. కబుర్లలో పడ్డాం. అతను అమెరికా మనిషట. భార్య తైవాన్ మనిషి. ఇద్దరూ తైవాన్లో ఇంగ్లీషు టీచర్లుగా పనిచేస్తున్నారట. ఈ మనిషికి ప్రయాణాలంటే ప్రాణం. క్షణాల్లో కబుర్లలో పడ్డాం. మా కబుర్లు ఓర్ఛా పరిసరాలు దాటేసి విశ్వపు వినువీధులకేసి సాగాయి. సాహిత్యం, ప్రయాణాలు, సంస్కృతులూ, రాజకీయాలూ… కబుర్లే కబుర్లు! కలిసి సెల్ఫీలు దిగాం. అరగంట ఎపుడు అయిపోయిందో తెలియనే తెలియలేదు!

ఇంతలో ఆకలి ‘నే ఉన్నాను’ అంటూ ఆక్రందనా హుంకారాలు మొదలెట్టింది. కోట ఆవరణలోనే ఉన్న ముచ్చటైన రెస్టారెంటు వేపు అడుగులు వేశాను. నిజానికి అది కాస్త ఉన్నతశ్రేణి ఆహారశాల. నా అవతారం, ఆహార్యం ఆ రెస్టారెంటులో ఇమడవు. అయినా అదేం పట్టించుకోకుండా, బింకం కోల్పోకుండా అటువేపు అడుగులు వేశాను. ద్వారపాలకుడు క్షణకాలం సంశయించాడు. చివరకి సంశయలాభం నాకే ఇచ్చేసి తలుపు తెరిచాడు.  వంటకాల సంగతి ఎలా ఉన్నా, కిటికీ పక్కన బైఠాయించి ఓ నలభై నిమిషాలపాటు లోపలి వాతావరణాన్నీ, బైట ఆవరణలో సాగిపోతున్న టూరిస్టుల నిశ్శబ్ద కోలాహలాన్ని ఆస్వాదించాను… అప్పటిదాకా పడిన శారీరక శ్రమకు అదో చక్కని రిలీఫ్!

……………

ఆహారశాల వదిలీ వదలగానే కాళ్ళు నూతన జవసత్వాలతో గుట్టమీద గుడివేపుకు సాగిపోయాయి. తొమ్మిదో శతాబ్దపు ఆలయం అన్నారుగానీ దాని నిర్మాణం అప్పటిదాకా చూసి వచ్చిన కోట గోడలనే గుర్తు చేసింది. అసలే గుట్ట మీద, ఆపైన మూడువందల ఏభై అడుగుల గోపురం! ‘ఈ ప్రాంతానికి నేనే ప్రభువును’ అని చాటి చెపుతోందా అనిపించే కట్టడమా చతుర్భుజ రామాలయం. రామునికి నాలుగు భుజాలు ఏమిటో, ఈ మందిరపు స్థలపురాణం ఏమిటో కనుక్కొని దేవుణ్ణి కుశలం అడుగుదామనుకునే లోగానే ఆ గర్భగుడి ముందర ఉన్న నాట్యప్రాంగణంలో ఏదో కోలాహలం వినిపించి, కనిపించి కాళ్ళు అటు అడుగులు వేశాయి. చూస్తే అది మూడవ జెండర్ వ్యక్తుల నాట్య సంబరం. వాళ్ళతో మనకేం పనిలే అని ఉపేక్షించే లోపలే అక్కడి వాద్య బృందపు గంభీరసంగీతాలు చెవినబడి నన్ను ఆకర్షించాయి. అంతా కలిసి నలుగురు వ్యక్తులు నాట్యం చేస్తున్నారు. ఒక ముఖ్య నాట్యగత్తె. వారికి తోడుగా తబలా, హార్మోనియం వాయిస్తూ మగపురుషులు. కంజీరా వాయిస్తూ మరో మూడో ప్రకృతి మనిషి. ఈ తరహా వ్యక్తుల నాట్యసంగీతాలంటే అందులో వెకిలితనం, వెగటు ధోరణులు పుష్కలంగా ఉంటాయి అన్న భావన నాలో బలంగా ఉంది. కానీ అక్కడి వ్యక్తుల నాజూకు శరీరాలు, మబ్బురంగు చీరలు, అశ్లీలం లేనేలేని లలితమైన నాట్యముద్రలు… ఆ నాట్యం చేసే తీరులో సంతోషం, పారవశ్యం, తన్మయత్వం… నాకు నాట్యపు ప్రాథమిక పరిజ్ఞానం లేదు. సంగీత జ్ఞానమూ లేదు. కానీ మంచి నాట్యాన్నీ, సంగీతాన్నీ గుర్తించి ఆనందించగలను. నాట్యాన్ని ఒక యాంత్రిక ప్రక్రియలాగాకుండా దాన్ని మనసులో నిండారా నింపుకొని తమ హావభావాలూ నాట్యముద్రల ద్వారా ప్రకటించే నాట్యకారులు నన్ను పరవశింపజేస్తారు. అదిగో ఆ ఆనందమే ఆ రామాలయంలో నాకారోజు కలిగింది. ప్రదర్శన ముగిసేదాకా ఆగి, వాద్యకారుల్నీ నాట్యం చేసే మనుషుల్నీ కలిసి, పలకరించి అభినందించాను. అదో చక్కని అనుభవం… అనుభూతి.

…………….

రాత్రి పదకొండింటికి ఝాన్సీనుంచి నా ఢిల్లీ రైలుబండి. అప్పటికే సాయంత్రం నాలుగవవస్తోంది. ఇంకా చుట్టబెట్టవలసిన ప్రదేశాలు రెండు మిగిలే ఉన్నాయి: నది దాటి అడవిగుండా వెళ్ళి అయిదు కిలోమీటర్ల దూరాన ఉన్న రెండో నదిని చూసి రావడం, తిరిగి సూర్యాస్తమయంలోగా వచ్చి నదికవతల సెనోటాఫ్‌ల మీదుగా దిగిపోయే సూర్యుడితో ఓ అరగంట గడిపి సెండాఫ్ ఇవ్వడం.

బేత్వానది అవతలి గట్టుకు చేరి వాహనాల కోసం వాకబుచేశాను. ‘మొన్నమొన్నటిదాకా బస్సులు నడిచేవి, బ్రిడ్జి పాడయ్యాక అవి ఆగిపోయాయి’ అన్నది అక్కడి సమాచారం. అయిదు కిలోమీటర్లే కదా నడిచేద్దాం… మధ్యలో ఏ స్కూటరు మనిషో ఎక్కించుకోకపోడు అని అడుగులు ముందుకు వేశాను. ‘జాగ్రత్తండీ, అడవిలో గిరిజన పల్లెలున్నాయి. వాళ్ళంత మంచోళ్ళు కాదు’ అక్కడివారి సలహా. మనిషి మనిషిని నమ్మకపోతే ఎలా? సలహా పట్టించుకోలేదు. ముందుకు సాగాను.

అటూ ఇటూ, మరీ చిక్కగా కాకపోయినా, చక్కని అడవి. ఆశ్చర్యకరంగా ఓ అరకిలోమీటరు వెళ్ళగానే ‘ఓర్ఛా వైల్డ్ లైఫ్ శాంక్చువరీ’ అన్న బడా బోర్డు. వన్యమృగాల సంగతి ఎలా ఉన్నా దారినిండా వానరసేన. దారితప్పి కాలినడకన వచ్చిన నన్ను చూసి ‘కాలక్షేపానికి ఇతగాడిని కాసేపు ఆటపట్టిద్దాం’ అని వాటి ప్రయత్నం. అదరకుండా బెదరకుండా వెళిపోతున్న నన్ను చూసి అవి నిరాశపడటం.

అనుకొన్నట్టే పది నిమిషాలు నడిచేసరికి ఒక మోటారు సైకిలు వస్తూ కనిపించింది. ఆపితే ఆగింది. అయిదు నిమిషాల్లో ఆ చిరునది దగ్గర దింపింది. ఆ మోటారు సైకిలు మనిషీ అదేమాట. ‘ఏం పనండీ ఇదీ? అడవోళ్ళు తిరిగే ప్రాంతం’ అన్నాడు ఆ మోటారు సైకిలు పెద్దమనిషి! ‘నల్లమేకా, నలుగురు దొంగల కథా’ గుర్తొచ్చింది. మరో ఇద్దరు ముగ్గురు ఇదే మాట చెప్పి ఉంటే నేనూ బెదిరేవాడినే కాబోలు!

చక్కని చిరునది. ఆశ్చర్యకరంగా బేత్వానదిలో కన్నా ఈ నదిలో ఎక్కువ నీళ్ళు ఉన్నాయి. నది మీది రెండడుగుల ఎత్తు వంతెన చెక్కుచెదరకుండా నిలబడి ఉంది. వంతెనకు వందమీటర్ల దూరాన చిన్నపాటి కొండలాంటి రాతికట్టడం… ఆనాటి సైనికుల గస్తీ శిబిరమా? అక్కడిదాకా నదీ గర్భంలో నడక. నీళ్ళల్లో అందమైన ప్రతిబింబాలు… చెక్కు చెదరని ఏకాంతం. ఓ ఇరవై నిమిషాలు నాతో నేను. ఈలోగా ‘సూర్యాస్తమయం అవుతోంది, గబగబా బేత్వా తీరం చేరాలి’ అన్న తపన మొదలయింది. ఆ అయిదు కిలోమీటర్లూ నడిచి వెళితే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. అంచేత లిఫ్టు దొరకడం తప్పనిసరి. అది దొరకడంలో జాప్యం అయ్యేసరికి ఆందోళన పెరిగిపోయింది. చివరికి ఓ స్కూటరు కుర్రాడు దొరికాడు. మాట్లాడే బాణీ మనిషి కూడానూ. సివిల్ డిప్లోమా చేసి ఎవరో కాంట్రాక్టరు దగ్గర పనిచేస్తున్నాడట. బతుకు మీద ఆశా, నమ్మకం ఉన్న మనిషి. మరో పావుగంటలో సూర్యాస్తమయం అనేలోగా బేత్వానది ఒడ్డున దింపాడు.

……………

బేత్వా నదీతీరాన, పురాతన కట్టడాల వెనుక సూర్యాస్తమయం అయితే ఎలా ఉంటుందీ? యావత్ ప్రపంచమూ పనులన్నీ మానుకొని నిలబడిపోయి చూసేలా ఉంటుంది.  ఆ శిధిలవారధి మీంచి సూర్యాస్తమయ దృశ్యం చక్కగా కనిపించేమాట నిజమే కానీ, నది అవతల ఉన్న సెనోటాఫ్‌ల ప్రతిబింబాలు ఆ సమయపు బంగారు నదీజలాల్లో కనిపించి కెమెరాకు ఎక్కాలంటే వంతెన దిగి నీటి ఒడ్డుకు చేరి అనువైన ప్రదేశాన మాటువేయాలి. అయిదే నిమిషాల్లో ఆ పనిచెయ్యగలిగాను.

మరుసటి పదీపదిహేను నిమిషాలూ అతిలోక ఆనందహేతువులు. నాతోపాటూ ఇదే తపనతో నదీజలాల తీరం చేరిన ఇద్దరు స్వీడన్ విద్యార్ధినులు. పక్షుల శబ్దాలు తప్ప మరింకే శబ్దమూ వినపడని సంధ్యాసమయం… గులాబీ, పసుపు, కాషాయపు రంగుల్లోకి మారుతున్న మబ్బుల్లేని ఆకాశం… సెనోటాఫ్‌ల ప్రతిబింబాలనే కాకుండా అస్తమయ సూర్యుడి ప్రతిబింబాన్ని తనతో బంధించిన ఆనందంలో కేరింతలు కొడుతున్న మొబైల్ కెమెరా…

నిస్సందేహంగా ఏ మనిషి అయినా జీవితాంతం గుర్తుంచుకోదగ్గ సాయంత్రమది.

……………

ఊళ్ళో ఇంకా గుళ్ళూ గోపురాలూ, వింతలూ విశేషాలూ ఉన్నాయని హోటలు మనిషి చెప్పాడు. కానీ మినీ సూపర్ మార్కెట్ చిన్నారి పాపా, రాయ్ ప్రవీణ్ మహలూ, ఆమె ప్రేమగాధా, మహల్లోని కళాసంపదా, ఛతుర్భుజ్ ఆలయంలోని మూడో ప్రకృతి మనుషుల నాట్యవిన్యాసాలూ, నదీజలాల్లో అస్తమయ సూర్యుడు సృష్టించిన అద్భుత వర్ణవిన్యాసాలూ చూసిన మనసుతో ఇతరేతర వింతలూ విశేషాలు చూడటానికి నేను సిద్ధపడలేకపోయాను. మిగిలిన రెండు గంటలూ ఆనాటి జ్ఞాపకాల నెమరువేతలో గడిచిపోయాయి. ఆ జ్ఞాపకాలు వదలమన్నాయి. రాత్రి రైలు పట్టుకొని మర్నాటి ఉదయం ఢిల్లీ చేరినా అవే జ్ఞాపకాలు… ఎక్కడో ఏదో వెలితి… ఏమిటదీ?!

మా ద్వారకా ఇంటి దగ్గరలోని చిరుఅడవిలో తిరుగాడుతుంటే ఛటుక్కున తెలిసివచ్చింది… ఆ వెలితి ఏమిటో. ప్రవీణ్ మహల్లో ఆమెకథ విన్న తర్వాత ఊకొట్టి ఊరుకోకుండా ఆరోజు అక్కడే ఆగిపోయి ఇంద్రజిత్, ప్రవీణల పాదముద్రలు వెతుక్కుంటూ… వారి అనురాగ గాధలో లీనమవుతూ… వారితోపాటూ ఆ మహల్లో మర్నాడంతా గడిపి ఉండాల్సిందిగదా… వారిని మరింత తెలుసుకొని ఉండాల్సిందిగాదా… అలాగే ఆ చిన్నారిపాప వాళ్ల దుకాణానికి వెళ్లి వాళ్లతో గంటో రెండు గంటలో గడిపి వాళ్ల దుకాణంలో నేనూ భాగమయి ఉండాల్సింది గదా…

ఎందుకని ఆ పని చెయ్యలేదూ?!

మరోసారి ఓర్ఛా వెళ్ళాలి… ప్రవీణ కోసం, ఇంద్రజిత్ కోసం.

వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలి.

ఆ పాప కోసం, ఆమెతో కబుర్లు కొనసాగించడం కోసం.

వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలి.

తపతీనది ప్రయాణంలో కలసిన టీచరుగారికోసం.

హోషంగాబాద్‌లో నర్మద ఒడ్డున కనిపించిన పూర్ణలకోసం.

టీచరుగారూ, పాపా, పూర్ణలూ మళ్లా కనిపించకపోవచ్చుగానీ వాళ్లలాంటి మనుషులు మళ్లీ మళ్లీ కనిపించి తీరతారు… తెలుసు.

ఇహ ప్రవీణ ఇంద్రజిత్‌లు ఎన్ని దశాబ్దాల తర్వాత వెళ్లినా ఆ మహల్లో ఎదురు చూస్తూనే ఉంటారు. అదీ తెలుసు.

బేతుల్ దగ్గర తపతి… హోషంగాబాద్ దగ్గర నర్మద… ఓర్ఛా దగ్గర వేత్రవతీ… వేత్రవతీ దగ్గర ప్రవీణ-ఇంద్రజిత్. మూడు నదులు, మూడు పట్టణాలు, ఎందరో వ్యక్తులు… మొత్తం ఓ జీవితానికి సరిపడే జ్ఞాపకాలు.

(ఈ రచన రూపకల్పనలో సూచనలూ సహాయసహకారాలూ అందించిన ఆలమూరు మనోజ్ఞకూ, శ్రీనివాస్ బందాకూ బోలెడన్ని కృతజ్ఞతలు)

*

Dasari Amarendra

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు