పీడిత ప్రజా ఉద్యమాల మిత్రుడు తన మిత్రుడి అంతిమ యాత్రలో మరణించడం విషాదం. సియాసత్ అనే ఉర్దూ పత్రికకు మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్. తన మిత్రుడు గద్దర్ అంతిమయాత్రలో పాల్గొంటూ అక్కడ జరిగిన తోపులాటలో అస్వస్తతకు లోనై గుండెపోటుతో మరణించాడు. గద్దర్ మరణాన్నే ఇంకా జీర్ణించుకోలేని తెలంగాణ ప్రజా ఉద్యమాల సమూహానికి జహీర్ మృతి దెబ్బ మీద దెబ్బ. అబీద్ అలీ ఖాన్ ‘సియాసత్’ పత్రిక ప్రారంభకుడు. ఆయన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ లో ఉండేవాడు. ప్రతిక మొదలై 73 ఏళ్ళు నడుస్తున్నా అదే విలువలను పత్రిక కొనసాగిస్తు వస్తోంది. అబీద్ ఆలీ ఖాన్ మరణానంతరం అతని పెద్ద కొడుకు జాహెద్ అలీ ఖాన్, తమ్ముడి కొడుకు జహీర్ అలీ ఖాన్ పత్రిక బాధ్యతలను నిర్వస్తున్నారు. జహీర్ రాకతో పత్రిక ఊపందుకుంది అంటారు ‘సియాసత్’తో పరిచయం ఉన్నవాళ్ళు. ‘సియాసత్’ సామాజిక సేవల వెనుక మేధ కూడా జహీర్ దే అంటారు.
జహీర్ స్నేహం అంటామా, పరిచయం అంటామా చెప్పలేను. అతనితో సాన్నిహిత్యపు వయసు పదేళ్ళు. ఉస్మానియా విద్యార్థి ఉద్యమానికి ఉన్న పెద్ద దిక్కులలో ఒకడు జహీర్. ప్రతి రంజాన్ మాసంలో ఏదో ఓ రోజు ఫోన్ చేసి ‘ఈ సాయంత్రం ఆఫీస్ కి వచ్చేయండి’ అని పిలిచేది. జహీర్ ఇచ్చే ఇఫ్తార్ నిజంగా ఒక పండగ. యూనివర్సిటీలో ఇంటికి దూరంగా ఉంటున్న పిల్లలు కదా అని కొసరి కొసరి తినిపించేవాడు. గొప్ప ప్రేమికుడు జహీర్. ఉస్మానియా విద్యార్థులకు ఓ తండ్రిలాంటి వాడు. ఏదైనా ప్రోగ్రాం చేస్తున్నం దానికి ఫండింగ్ ఎట్లా అనుకుంటే ‘ఛలో సియాసత్.’ ఫోన్ చేసి ఇది విషయం అని చెబితే ఇంకో మాట లేకుండా రమ్మని చెప్పేవాడు. ఒక్క విద్యార్థి ఉద్యమానికే గాక ప్రజా ఉద్యమాలకు గొంతుకగా ఉండేవాడు. ఒక రకంగా ఓల్డ్ సిటీకి – న్యూ సిటికి వంతెన లా ఉండేవాడు.
జహీరుద్దీన్ అలీ ఖాన్ ఇస్లాం మత విశ్వాసి. ప్రతి మతంలోనూ మానవత్వాన్ని ప్రేమించే, పాటించే మనుషులుంటారు. జహీర్ ఆ కోవకు చెందుతాడు. అందులో నుండే సమాజంలో శాంతిని, మార్పును కోరుతాడు. పీడిత ప్రజల కోసం నిలబడటం ఇస్లాం విశ్వాసిగా నా కర్తవ్యం అని మనసా వాచా నమ్మినవాడు జహీర్. గుజరాత్ మారణ కాండలో ఇళ్ళు కోల్పోయిన ముస్లింలకు ఇళ్ళు కట్టిచినట్లు ఓ సందర్భంలో చెప్పాడు. నక్సలైట్లకు – ప్రభుత్వాలకు మధ్య చర్చలు జరగాలి అనే ‘పీస్ ఇన్షియేటివ్’ మొదలైనప్పుడు అందులో ఉన్నాడు. తన చుట్టూ ఉన్న సమాజం చదువుకోవాలనే తపన తనది. అట్టడుగు వర్గాలు చదువుకుని పైకి రావాలి అనేది ఆయన ఆకాంక్ష.
ఎప్పుడు ఆఫీస్ పోయినా ఎవరికో ఒకరికి చదువుకు సంబంధించిన సహాయాలు చేస్తూ ఉండేవాడు. ఎంతో మంది పేద పిల్లలను డాక్టర్లను, ఇంజనీర్లను చదివించాడు. ఓసారి ఆఫీస్ పోయినప్పుడు ‘ఒక పేద ముస్లిం అమ్మాయి పైలెట్ అయిందనీ, మనమే చదివించాం.’ అని చెప్పి సంబరపడ్డాడు. ఎంతమందిని చదివించి ఉంటారు అని లెక్క అడిగితే 22000 (అక్షరాలా ఇరవై రెండు వేల) మంది అని తెలిసింది. అందులో ఏడువేల మందికి పైగా బీహార్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఉత్తర ప్రదేశం గుజరాత్, అస్సాం రాష్ట్రాల విద్యార్థులున్నారు. ఉర్దూ భాషాభిమానంతో ఉర్డూ భాష అభివృద్ధికీ తోడ్పడ్డాడు. ఎప్పుడైనా పోతే మనం ఉర్దూ శిక్షణ ఇస్తున్నాం అని చెప్పేవాడు. కాని, ఆ శిక్షణలో 6 లక్షల పైచిలుకు మంది ఉత్తీర్ణులు అయినట్లు నిన్నే తెలిసింది.
విరసం సభల్లో పాల్గొనడానికి వచ్చిన మహారాష్ట్ర కవి గాయకుడు, విద్రోహి పత్రిక సంపాదకుడు వీరా సాతేదార్ (కోర్ట్ సినిమా నటుడు)ని ఇంటర్వ్యూ చేయడానికీ ఆఫీసుకు పిలిచాడు. అక్కడే ఉన్న వరవరరావుకూ, నాకూ ఉర్దూ లిపి నేర్చుకునే శిక్షణకు సంబంధించిన పుస్తకాలను ఇచ్చాడు. మహిళలకు ఉర్దూ కాలిగ్రఫి శిక్షణ నడుస్తుండే ఉర్దూలో కాలిగ్రఫి చేసిన అక్షరాలను అలంకరించి, ఫ్రేములుగా కట్టించి ఉన్న వాటిని చూపించి మా ముగ్గురికీ తలా ఒక్కటి బహుకరించాడు. విద్యలోనూ అమ్మాయిల విద్య మీద జహీర్ కి ప్రత్యేక శ్రద్ధ ఉండేది. వాళ్ళిచ్చిన శిక్షణతో 1996 నుండి నేటి వరకు 11 వేల మందికి ఉర్దూ అధ్యాపకులుగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అందులో 70% అమ్మాయిలున్నారు. అమ్మాయిలు సాధించిన విజయాలను చాలా గర్వంగా చెప్పేవాడు. ఆంగ్ల విద్య గురించి తరగతులు, పోలీసు ట్రైనింగ్, బస్తీల్లో హెల్త్ క్యాంపులు, కట్నం లేని వివాహాలు ఇట్లా అనేక పనులు తమ ట్రస్ట్ ద్వారా నిర్వహించాడు.
సామాజిక వితరణలో ఎంత మానవీయంగా ఉండేవాడో, రాజకీయ అంశాల్లో అంతే ఖచ్చితంగా ఉండేవాడు. ఆది నుండి మజ్లిస్ రాజకీయాలను, హిందూ మహాసభ రాజకీయాలను సియాసత్ వ్యతిరేకిస్తూనే ఉన్నది. జహీర్ ప్రజా ఉద్యమ సంస్థలతో సంబంధాన్నీ, ప్రజా పోరాటాల్లో కలిసి నడవడాన్ని అక్కడి నుండే చూడాలి. హిందూ ఆధిపత్య శక్తులను ఎంతగా వ్యతిరేకించాడో, మజ్లిస్ ఆధిపత్యాన్ని అంతే వ్యతిరేకించాడు. మతం, మతాధిపత్యం రెండూ వేరు వేరు అని బలంగా విశ్వసించాడు. ‘మతం ప్రేమనే తప్పా ద్వేషాన్ని కోరుకోదు’ అని జహీర్ ఎప్పుడూ చెప్పే మాట. ఈ దేశంలో ఇప్పుడు జడలు విప్పి నర్తిస్తున్న ఫాసిజాన్ని ముందే పసిగట్టాడు. మోదీ ప్రధాని అయితే దేశమంతా గుజరాత్ అవుతుందని 2013లో దేశవ్యాప్తంగా వస్తున్నా యాంటి ఫాసిస్ట్ ఐక్య సంఘటనకు వెన్ను దన్నుగా ఉన్నాడు. ఆ క్రమంలోనే దేశంలోని ప్రజాస్వామిక వాదులతో కలిసి ఓ సమావేశం పెట్టి దానికి పిలిచి, తెలంగాణా వ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఈ సందేశాన్ని తీసుకుపోండి, మీతో పాటు నేనూ అనే ఆశ్వాసాన్ని ఇచ్చాడు. మోది చెబుతున్న అబద్దాలను ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం కాని 2013లోనే feku.com అని మోదీ గుజరాత్ లో చెప్పిన అబద్దాలను ఆ వెబ్ సైట్ లో పెట్టి, దాన్ని లామకాన్ లో లాంచ్ చేశాడు. ఒక రకంగా తెలుగు నేలలో వచ్చిన మొదటి ఫాక్ట్ చెక్ వెబ్ సైట్ అది.
యువత అందులోనూ దళిత, బహుజన నేపథ్యం అంటే ప్రత్యేక ప్రేమ కురిపించేవాడు. ఈ ప్రేమ ఒక్క తెలంగాణ సమాజం పైనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న పోరాడే యువతను ఏకతాటి మీదకి తేవాలి అనే స్పృహను, ఆకాంక్షను కలిగి ఉండేవాడు. ఉమర్ ఖాలీద్, కన్హయ్య కుమార్, జిజ్ఞేష్ మేవాని లాంటి వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేశాడు. ఉస్మానియా, ఇఫ్లూ, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులం ఎప్పుడైనా పోతే మిగతా పనులన్నీ ఆపుకుని మరీ గంటల తరబడి చర్చలు చేసేవాడు. ఆ చర్చలు ఊరికే కలిసాం కదా అని మాట్లాడుకున్నట్లు గాక, ఆ చర్చ నుండి ఆచరణను ఆశించేవాడు. “ఇప్పటిదాకా మాట్లాడిన అంశాల మీద ఒక ఆచరణాత్మక కార్యక్రమం రూపొందించండి మనం కలిసి చేద్దాం అనేవాడు. ఇన్ని సమస్యలున్నాయి కదా వాటి మీద వ్యాసాలు రాయండి, ఇంకా పెద్దగా రాసినా పరవాలేదు. బుక్ లెట్లుగా వేసి తెలంగాణ పది జిల్లాల్లో పంచుందాం. మీరు ఏ భాషలో రాసిన సరే, మన ప్రెస్ లో ప్రింట్ చేద్దాం” అని కార్యాచరణను ఇచ్చేవాడు. కొన్ని ఆచరణ సాధ్యమయ్యాయి. చాలా కాలేదు. కాలేదని ఏనాడూ భాధపడలేదు. రేపటి మీద గొప్ప ఆశ ఉండేది. రేపటి తరం మీద ఆశా, ప్రేమ ఉండేది. ఎక్కువగా ‘హమ్ దేఖేంగే’ పాటను కోట్ చేసేవాడు. మనందరం ఒక్కటైతే ఈ దోపీడీ, దుర్మార్గాలు ఫైజ్ చెప్పినట్లే ‘రూఈ కి తరహ్ ఉడ్ జాయేంగే’ అనేవాడు.
ప్రభుత్వంలో ఎవరున్నా వారి తప్పులను విమర్శించేందుకు వెనుకాడేవాడు కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఇప్పుడున్న అధికార పక్షంతో వేదికలు పంచుకున్నా, తెలంగాణ అనంతరం అధికార పక్షానికి ప్రతిపక్షం గానే నిలబడ్డాడు. తెలంగాణ ముస్లింలకు పాలకులు హామీ పడిన వాగ్దానాలను వేదికల మీద నిలదీశాడు. పౌర, ప్రజాస్వామిక హక్కుల కోసం గొంతెతున్న శిబిరాలతో గొంతు కలిపాడు.
ఒకరకంగా తెలంగాణ సమాజపు వేదికల మీద బలంగా వినిపించిన ఉర్దూ గొంతుక. జహీర్ మరణంతో తెలంగాణ సమాజం ఓ గొప్ప గొంతుకను కోల్పోయింది. ప్రజా ఉద్యమాలు తమకు అండగా ఉన్న వ్యక్తిని కోల్పోయాయి. నా మటుకు గద్దర్ మృతి కన్నా జహీర్ మృతి ఎక్కువ బాధించింది. ఎందరికో అండగా ఉన్న జహీర్ అలా ఒక్కడే మెట్లపై ఊపిరాడక తండ్లాడుతున్న వీడియో చూస్తే గుండె తరుక్కపోయింది. “ఇంకొన్నాళ్ళు ఉండాల్సిన వాడు” అని పోయిన ప్రతి ఒక్కరి కోసం అనుకునే మాటే అయినా కొందరి గురించి బలంగా అనుకుంటాం. అట్లా అనుకుంటున్నప్పుడు గుండెల్లో గూడు గట్టుకున్న దుఃఖం కండ్ల నుండి నీరై దుంకుతుంది. జహీర్ అట్లాంటివాడు. అల్విదా జహీర్ సాబ్.
*
అల్విదా
The best tribute. 22000 మందిని చదివించడం, ఆరు లక్షల మందికి ఉర్దూలో శిక్షణ, ప్రజా సంఘాలకి వెన్నుదన్నుగా ఉండడం…ఓహ్ ఎంత గొప్ప మనిషి
జోహార్లు జహీర్ సాబ్.
మీలాంటి సత్పురుషులు, వదాన్యులు కలకాలం వుండాల్సిన వాళ్లు.
రాష్ట్రానికో పది మంది వున్నా చాలుకదా.
మీ నిస్వార్థ సేవలు లోకానికి తెలియజెప్పిన అరుణాంక్ లత గారికి నమస్సులు.
గొప్ప నివాళి అరుణాంక్
Alvida Zaheer Sahab
నిజంగా ఇంతమంచిని నా జీవితంలో ఒక్కసారి కూడా కలిసి మాట్లాడలేకపోయానా అని బాధపడుతున్నాను. చాలాసార్లు మీటింగుల్లో దూరం నుంచి చూశాను, ప్రత్యక్షంగా ఆయన ప్రసంగాలు విన్నాను. అందరిలానే ఈయన గారు కూడా మాటలకే పరిమితమనుకున్నాను. ఇంతగొప్ప వ్యక్తిని కలవలేకపోవడం నా దురదృష్టం.
Great tribute to both the great persons
జహీర్ ని కోల్పోవటం మనందరికీ ఎన్నటికీ మానని దుఃఖం…
ఆయనతో ఎప్పుడూ కలవలేదు.కానీ సీయాసత్ పత్రిక గురించి తెలుసు. మంచి వ్యకతిని కొల్పోయాం. మీ పరిచయం బాగుంది.