ముస్లింల రామాయణం 

అంత అద్భుతమైన కట్టడాల నేపథ్యానికి పురాతనమైన కళారూపాన్ని జోడించి ప్రేక్షకులకి ఒక జీవితకాలపు అనుభూతినిచ్చే ప్రదేశం ఏదైనా ఉందా!

‘బాలి వెళ్ళాలి‘… ఇది ఎప్పటినుంచో అనుకుంటున్నదే! బాలి ఒక ద్వీపమని తెలుసు కానీ ఇండోనేషియా లోని 17508 ద్వీపాల్లో ఒకటని, చిన్నప్పుడు చదువుకున్న సుమత్రా, జావా, బాలీల్లో ఒకటని, ప్రయాణం గురించి రీసెర్చ్ చేసినప్పుడు కానీ అర్థంకాలేదు. ప్రపంచంలోనే పెద్ద హిందూ దేవాలయం అంగ్కోర్వాట్ గురించి వెదుకుతుంటే రెండవ పెద్ద దేవాలయం ఇండోనేషియాలో ఉన్న ప్రాంబణన్ గురించి తెలిసింది. ప్రాంబణన్ ఇండోనేషియాలో మెయిన్ ఐలాండ్ జావాలో యోగ్యకర్త అనే పట్టణంలో ఉంది. యోగ్యకర్త లో ఇంకా ఏమున్నాయి ? ప్రపంచంలోనే పెద్ద బుద్దిస్ట్ టెంపుల్ ! బోరోబదూర్!! బాలి తో బాటు యోగ్యకర్త కూడా మెల్లగా ఐటినరరీలో చేరింది.

బాలి కి డైరెక్ట్ ఫ్లైట్ ఒక్క బెంగుళూరు నుంచి మాత్రమే ఉంది. 7 గంటల ప్రయాణం. లేదా వైజాగ్ నుంచి వెళ్లాలంటే సింగపూర్ వెళ్లి వెళ్ళాలి. మొత్తమ్మీద అన్ని బడ్జెట్లు పరిశీలించి వైజాగ్ నుంచి సింగపూర్ మీదుగా యోగ్యకర్త, అక్కడనుంచి బాలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం.

వైజాగ్ నుంచి రాత్రంతా ప్రయాణించి యోగ్యకర్త చేరుకునే సరికి ఉదయం ఎనిమిది దాటిపోయింది. సింగపూర్ లో యోగ్యకర్త ఫ్లైట్ ఎక్కేటప్పుడు గమనించాను. బహుశా మేమిద్దరమే భారతీయులం. బాలి కున్న డిమాండ్ దీనికి లేదు. యోగ్యకర్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగగానే నన్ను ఆకర్షించింది మహిళల టాయిలెట్స్ బయట ‘ వనిత ‘ అనే బోర్డు.

యోగ్యకర్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రాంబణన్ దగ్గర మేము తీసుకున్న హోం స్టే  చేరటానికి రెండుగంటలు పడుతుందని గూగుల్ తల్లి చెప్పింది. టాక్సీ లో బయలుదేరిన పది నిమిషాలకే మా టాక్సీ డ్రైవర్ ఎంక్వయిరీ మొదలెట్టాడు. మేమక్కడ మర్నాడు రాత్రి వరకూ ఉంటున్నామని తెలిసి మర్నాడు బోరోబదూర్ తో బాటు కొన్ని టూరిస్ట్ స్పాట్స్ తిప్పి సాయంత్రం ఎయిర్పోర్ట్ లో దింపడానికి బేరం మొదలెట్టాడు. నిజానికి అతనికి ఇంగ్లీష్ రాదు. నాకు జవానీస్ రాదు. ఇద్దరం గూగుల్ ట్రాన్సలేట్ సాయంతో మాట్లాడుకుంటున్నాం ! రాత్రంతా ఫ్లైట్స్ లో తిరుగుతూ నిద్రలేమితో ఉన్న నాకు ఆ బేరాలు చేయాలనే ఆసక్తి లేదు. రేపటి సంగతి రేపు చూసుకుందాం అని గట్టిగా అనుకుని అతన్ని వదిలించుకున్నాను.

మేము బుక్ చేసుకున్న హోమ్ స్టే ఒక ముస్లిం కుటుంబానిది. మేము వెళ్ళేసరికి ఇంటావిడ మాత్రమే ఉంది. మధ్యాహ్నం లంచ్ లో ఏమి కావాలో అడిగింది. లోకల్ ఫుడ్ ఏదైనా ఫర్వాలేదని చెప్పాను. ఇద్దరికీ నాసి గోరింగ్ ( రొయ్యలు పేస్ట్ సోయా సాస్ చికెన్ తో చేసిన ఫ్రైడ్ రైస్ ), కొన్ని పళ్ళు ఇచ్చింది. అలాంటి నాసి గోరింగ్  ఇండోనేషియా పర్యటన పూర్తయ్యేవరకూ ఇంకెక్కడా తినలేదు.

భోజనం ముగించేసరికి ఆమె భర్త వచ్చాడు. అతని పేరు విభవో! బహుశా వైభవ్ అనే పేరు  అలా మారి ఉంటుంది. అతనొక ముస్లింగా గుర్తించగల విషయమేదీ అతని పేరులో గానీ వేషంలో గానీ నాకు కనిపించలేదు.

సాయంత్రం ప్రాంబణన్ టెంపుల్, మర్నాడు బోరోబదూర్ ఆలయాన్ని చూపించి మమ్మల్ని ఎయిర్పోర్ట్ లో వదిలేలా విభవోతో ఒప్పందం కుదుర్చుకున్నాం !దీనిలో నాకొక లెక్క ఉంది. ఇండోనేషియా, థాయిలాండ్ లాంటి దేశాల్లో ఇంచుమించు మనదేశంలో అయ్యే ఖర్చే అవుతుంది. కాబట్టి వెహికల్ కి ఒకరోజుకి సుమారుగా (రూపాయల్లో ) 4000 నుంచి 5000 వరకూ అడిగితే అది రీజనబుల్ అనే లెక్క !

ప్రాంబనన్ మాకు కేవలం ఒక కిలోమీటరు దూరం లోనే ఉంది. ప్రాంబణన్ దేవాలయం తొమ్మిదవ శతాబ్దంలో సంజయ డైనస్టీ కాలంలో ప్రారంభించారట! విశేషమేమిటంటే చాలాకాలం తర్వాత బుద్ధిజం ప్రభావం నుంచి బయటపడి హిందూ మత పునరుత్థానానికి ప్రతీకగా ఈ ఆలయాన్ని ప్రారంభించారట.  అది భారత దేశంలో భక్తి ఉద్యమం ఉచ్ఛ స్థితిలో ఉన్న కాలం.  బుద్ధిజం అంతరిస్తున్న కాలం.  రెండిటికీ ఏమన్నా సంబంధం ఉందా! తెలియదు!!

ప్రాంభణన్ దేవాలయం ఇంచుమించు భారతదేశంలోని దేవాలయాల్లాగే ఉంది. నిజానికి అంగ్కోర్వాట్ దేవాలయం కంటే ఇదే ప్రాచీనమైనది. హిందూ దేవతల విగ్రహాలు ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రాంబనన్ ప్రాంగణంలోనే హిందూ దేవాలయం కంటే ప్రాచీనమైన ‘క్యాండీ సేవు ‘ అనే బుద్దిస్ట్ కాంప్లెక్స్ కూడా ఉంది. అది ఏడవ శతాబ్దానిదట. రెండూ చూసేటప్పటికి చీకటి పడుతోంది. ఆ రోజు గురువారం కావడంతో ప్రాంబనన్ దేవాలయంలో రామాయణ బ్యాలే ఉందట. అనుకోకుండా గురువారం రాత్రి యోగ్యకర్త లో ఉండేలా రావడం మా అదృష్టం అని తర్వాత తెలిసింది.

రామాయణ  బాలే కి టికెట్స్ తీసుకుని కాఫీ షాప్ కి వెళ్ళాం.

ఇండోనేషియా లో కాఫీ సివెట్ లేదా కొపి లువాక్ ని రుచి చూడాలని ఎప్పటినుంచో కోరిక. మేము వెళ్లిన రెస్టారెంట్ లో కాఫీ సివెట్ ని ఎలా తయారు చేస్తారో ప్రదర్శనకి పెట్టారు. సివెట్ అంటే ఒక రకమైన పిల్లి. అది కాఫీ పళ్ళని తిని గింజల్ని మలం ద్వారా విసర్జిస్తుంది. అలాంటి మలాన్ని సేకరించి బాగా శుద్ధిచేసి కాఫీ గింజల్ని వేరుచేస్తారు. సివెట్ కడుపులో ఫర్మెంట్ కావడం వల్ల కాఫీకి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. కాఫీ సివెట్ తాగి రెండు వందల గ్రాముల కాఫీని వెయ్యి రూపాయలకి కొని ఆ షాప్ నుంచి బయటపడ్డాం ! అది నిజంగా ప్రత్యేకంగా ఉందా ! రుచి పదార్థంలో ఉందా ! భావనలోనా!!

ఏడుగంటలకల్లా రామాయణ బాలే ప్రారంభమైంది. ఆ నాటకానికి టికెట్ ఖరీదు 15000 నుంచి 450000 ఇండోనేషియన్ రూపాయలు. సుమారు 850 నుంచి 2500 రూపాయలు. ముందు ఖరీదనిపించినా అది ఎంత సరసమైన ధరో అయిపోయిన తర్వాత తెలిసింది.

వెయ్యేళ్ల పురాతనమైన ప్రాంబణన్ దేవాలయం నేపథ్యంలో కనీసం యాభై మంది కళాకారులు రామాయణాన్ని ఆడుతూ పాడుతూ ఆ వెన్నెల రాత్రిలో ప్రదర్శించడాన్ని బహుశా ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులు, ప్రేక్షకులు ఇంచుమించు అందరూ ముస్లింలే కావడం గమనించాను. ప్రదర్శన ముగిసేసరికల్లా మా విభవో వచ్చేశాడు. మాతోపాటు కారులో ఒక ఆస్ట్రేలియన్ జంట ఉండటం చూసాను. వాళ్ళు కూడా మాతోబాటే హోమ్ స్టే లో ఉంటున్నారట.

‘నీకేమన్నా అర్థమైందా! ‘ ఆస్ట్రేలియన్ ని అడిగాను.

‘అర్థమైంది ఒకాయన భార్యని వేరొకాయన ఎత్తుకుపోతే అతన్ని చంపి వెనక్కి తెచ్చుకుంటాడు. అంతేనా!’ అడిగాడతడు.

‘ఇండియా ఎప్పుడైనా వచ్చారా!’

‘ లేదు ‘

‘ ఇండియాలో ఇంతకంటే గొప్ప దేవాలయాలు ఇంకా పటిష్టమైన దశలో ఉన్నాయి తెలుసా ‘

అతను ఆశ్చర్యంగా చూసాడు. అయితే అంత అద్భుతమైన కట్టడాల నేపథ్యానికి పురాతనమైన కళారూపాన్ని జోడించి ప్రేక్షకులకి ఒక జీవితకాలపు అనుభూతినిచ్చే ప్రదేశం ఏదైనా ఉందా ! లైట్ అండ్ సౌండ్ షో పేరిట జరిగే తమాషా గుర్తొచ్చింది. భారతదేశపు యునెస్కో హెరిటేజ్ సైట్స్ గురించి చెప్పడానికి ప్రయత్నించాను. అతనికి నిజంగా ఆసక్తి ఉందా ! ఆ చీకటిలో తెలియలేదు.

ఒకప్పుడు బౌద్ధ మతాన్ని, హిందూ మతాన్ని అవలంబించి, కాలక్రమేణా ఇస్లాంని స్వీకరించినా తన మూలాలకి సంబంధించిన కళారూపాన్ని ఇప్పటికీ ఇంతగా ఆదరించే దేశం ఏదైనా ఉందా !

అసలు మతం పేరుతో జరిగే హింస నిజంగా మతం వల్లేనా!

*****

“ఎందుకు యోగ్యకర్త గురించి రాస్తున్నావ్ ?”

“బాలి గురించి ఎవరైనా రాస్తారు కాబట్టి “

“ నీ గోదారి “

*

శ్రీధర్ నరుకుర్తి

1 comment

Leave a Reply to పాణిని జన్నాభట్ల Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బావుంది శ్రీధర్ గారూ. ‘అసలు మతం పేరుతో జరిగే హింస నిజంగా మతం వల్లేనా?’ అన్న ప్రశ్నతో ముగించడం ఇంకా బావుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు