నిద్ర లేచి తలుపు తీయగానే చల్లటి గాలి విసురుగా ముఖానికి తగిలింది. బయట కుండపోతగా వాన. అమ్మో చలి అనుకుంటూ మళ్ళీ తలుపు వేసేసింది లత. వేడి వేడిగా కాఫీ కలుపుకుని తాగుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగడంతో లేచి వెళ్ళి తలుపు తీసింది.
“తొందరగా వచ్చావే ఇవాళ” అంది ఎదురుగా ఉన్న రేణుకను చూస్తూ
“వాన కదా. పిల్లలకి స్కూల్ లేదు. నీకు పని చేసేసి పోయి ఇంట్లో పని చేసుకోవచ్చులే అని వచ్చేసా” అంటూ లోపలకి నడిచింది రేణుక. “పైగా తొందరగా పనులు చేసుకుని మా చంద్రమ్మ ఇంటికి పోవాలి”
“చంద్రమ్మ ఎవరూ?
“నా చెల్లి. చంద్రకళ దానిపేరు. చంద్రమ్మ అంటాం మేమంతా”
చంద్రమ్మ.. ఆ పేరు వినగానే లత మనసంతా మబ్బు కమ్మినట్లయ్యింది. సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం ఇలాంటి ముసురు పట్టిన రోజుల్లోనేగా చంద్రమ్మని కలిసింది!
****
ఎవరైనా ఉన్నారా ఇంట్లో?” గట్టిగా అరిచింది లత.
ఇది మూడో సారి పిలవడం. ఎవరూ ఉలకరు పలకరే అని విసుక్కుంది కానీ జోరున పడుతున్న వాన చప్పుడుకి అసలు తన గొంతు లోపల ఉన్న మనుషులకు వినిపించిందో లేదో అనుకుంటూ మళ్ళీ ఒకసారి తలుపు మీద గట్టిగా కొట్టింది. బలంగా కొట్టేసరికి అనుకుంటా తలుపు మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది. ఇదేం తలుపో! చిన్నగా కొడితే లోపలున్న వాళ్లకి వినబడటం లేదు, గట్టిగా కొడితే ఊడిపడేలా అని ఉంది, ఏ క్రీస్తు పూర్వం తయారయ్యిందో ఇది అనుకుంటూ ఉండగానే కిర్రుమంటూ చెక్కతలుపు చిన్నగా తెరుచుకుంది.
“ఎవరమ్మా నువ్వు? ఇంత వానలో వచ్చావు?” ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది తలుపు తీసిన ముసలమ్మ
“చంద్రమ్మ అంటే నువ్వేగా?” అడిగింది లత.
“ఆఁ, నేనే. నాతో ఏం పని నీకు?” అనుమానంగా అడిగింది చంద్రమ్మ
“నా పేరు లత. డ్వాక్రాలో పనిచేస్తాను. మీతో చిన్న పని ఉండి వచ్చా.”
“ఇంత వానలోనా? సర్లే లోనకిరా. ఆ చూరు కింద తడిచిపోతున్నావు” అంటూ తలుపు పూర్తిగా తెరిచింది.
చేతిలో గొడుగుని గుమ్మానికి ఒక పక్కన ఆనించి లోపలికి నడిచింది లత. లోపల అడుగుపెట్టిందో లేదో పై నుండి ఒక వాన చినుకు బరువుగా తలపై పడింది. తల తడుముకుంటూ చుట్టూ చూసింది. ఉన్న నాలుగు మట్టి గోడలూ వానకి నాని చెమ్మగా కనపడుతున్నాయి. లోపలకి, బయటకి పెద్ద తేడా లేనట్లే ఉంది. తాటాకు కప్పు నిండా చిల్లులు పడి అక్కడక్కడా వర్షం నేరుగా ఇంట్లోకి పడుతుంది. మట్టితో అలికిన నేల అంతా నీళ్ళకి నానిపోకుండా ధార పడుతున్న చోట అక్కడక్కడా గిన్నెలు, ప్లాస్టిక్ బిందెలు పెట్టి ఉన్నాయి.
“అట్టా కూర్చో అమ్మాయ్” అన్న మాటలు వినిపించి చంద్రమ్మ వైపు తిరిగింది. ఆమె కళ్ళు ఒక మూలన ఉన్న చెక్క బల్ల వైపు చూపిస్తున్నాయి. దాని పక్కనే ఎన్నాళ్ళ నాటిదో ఒక నవ్వారు మంచం. ఆ మంచం మీద ఒక ముసలాయన అటు తిరిగి పడుకుని ఉన్నాడు. ఆ కొంచెం స్థలమే ఆ ఇంట్లో కాస్త పొడిగా ఉంది. మిగిలినదంతా వానకి నాని నాని ఇల్లంతా ఒకరకమైన వాసన అలుముకుని ఉంది.
ఆ బల్ల కొంచెం ముందుకు లాక్కుని దాని మీద కూర్చుంది లత. చంద్రమ్మ మాటలకు నిద్రలో ఉన్న ముసలాయన కాస్తా లేచి ఇటు తిరిగి కొత్తగా ఎవరు వచ్చారా అని చూస్తున్నాడు.
ముసలాయన వైపు ఒకసారి చూసి చంద్రమ్మ వైపు తిరిగింది లత. “నీతో మాట్లాడదామని నిన్న అంగన్వాడీ టీచర్ తో కబురు పెట్టాను. నువ్వు రాకపోతివి” కొంచెం నిష్టూరంగా అంది.
“ఏం రమ్మంటావమ్మా? మూడు రోజులుగా ఒకటే ముసురు. పనికి పోడానికి లేదు. ఇంట్లో రూపాయి లేదు. నిన్నటి నుండీ పొయ్యిలో పిల్లి లేవలేదు. మా ఇంటాయన్ని చూడు ఓపిక లేక ఎలా మంచానికి కరుచుకుని పడుకున్నాడో?” చెబుతుండగానే చంద్రమ్మ గొంతు దుఖంతో పూడుకుపోయింది.
“అయ్యో..పనికి పోలేదా? ఏం పని చేస్తాడు తాత?”
“ఏటి దగ్గర.. ఇసక క్వారీ ఉంది కదా. దాన్లో పనికి పోతాడు”
“ఈ వయసులో క్వారీ పనా? కష్టమేమో కదా?”
“ఆయన వయసులో ఉన్నప్పటి నుండీ అదే పని చేస్తన్నాడు. ఇంకో పని రాదు. ఓపికున్నన్నాళ్ళు అదే పని చేయాల్సిందే”
“పిల్లలు?”
“ఒక్కడే కొడుకు. ఇంకో ఇద్దరు పిల్లలు పుట్టి పోయారు”
“మీ అబ్బాయి మీతో ఉండడా?”
“ఇక్కడుండి ఏం చేస్తాడు. వాణ్ణి బాగా చదివించి ఉద్దోగం చేయించాలి అనుకున్నాం. మాలాగా కూలీనాలీ చేయకూడదు అని వాడిని బళ్ళో వేసాం. బడికి అయితే పంపాం కానీ వాడికి చదువు అబ్బలే. ఊళ్ళోకి వచ్చేటప్పుడు నువ్వు వాగు దాటి వచ్చి ఉంటావుగా. బడికి పోవాలంటే ఈ ఊరి పిల్లలు ఆ వాగు దాటాలి. ఇట్టా గట్టి వానలు రెండు రోజులు పడ్డాయంటే వాగు దాటటం కష్టం. ఎటోళ్ళు అటు ఉండాల్సిందే. సరిగ్గా బళ్ళు మొదలయ్యే టైంకే వానలు మొదలయ్యే. వీడు బడికి సరిగా పోయింది లేదు, ఆ చదువు వచ్చింది లేదు. పిల్లగాడు చదువుకుంటున్నాడులే అని మేము వేరే పని కూడా నేర్పియ్యలే వాడికి. తీరా చూస్తే పదో తరగతి తప్పి కూర్చున్నాడు. మళ్ళీ పరీక్ష రాయరా అంటే ఇక నాకు ఆ చదువు వచ్చేది లేదు, నేను రాయనంటే రాయను అని మొండికేసాడు. టౌన్ కి పోయి కరెంటు పని నేర్చుకుని అక్కడే పని చేసుకుంటున్నాడు.”
“మీరు కూడా కొడుకు దగ్గరకే పోవచ్చుగా ఇక్కడ కష్టపడేబదులు?”
“అక్కడకి పోయి మేమేమి చేయాలి? వాడిది వాడికే అంతంత మాత్రం. పెళ్ళాం, పిల్లల్ని చూసుకునేందుకే చాలట్లేదు వాడి సంపాదన. ఇక మాకేం పెడతాడు? అయినా పుట్టినూరు విడిచిపెట్టి ఏడకి పోతాం? కలో గంజో తాగి ఇక్కడే పడుంటాం” అప్పటిదాకా మాట్లాడకుండా కూర్చున్న ముసలాయన అందుకున్నాడు.
కలోగంజో తాగి అన్న ఆయన మాటలు వినగానే నిన్నటి నుండీ పొయ్యిలో పిల్లి లేవలేదు అన్న చంద్రమ్మ మాటలు గుర్తొచ్చి ఒక్కసారిగా ఉలిక్కిపడింది లత.
“వచ్చీరాగానే మాటల్లో పడిపోయాను. బయట చిన్న పని ఉంది. దాని సంగతి మర్చిపోయి అలాగే కూర్చున్నా. పది నిముషాల్లో మళ్ళీ వస్తా” అని గబగబా బయటకి వచ్చి గొడుగు వేసుకుని బయలుదేరింది.
కిరాణాదుకాణం వైపు అడుగులు పడుతూ ఉంటే ఆలోచనలు ముసురులా చుట్టుకున్నాయి. ఉద్యోగంలో చేరి దాదాపు ఆరు నెలలు అయ్యింది. తనకు అప్పగించిన మండలాలలో పేద కుటుంబాలలోని మహిళలు అందరినీ డ్వాక్రా గ్రూపులో చేర్పించి ప్రభుత్వ పథకాలు వారికి అందేలా చూడడం తన పని. సంఘంలో చేరితే ఉండే లాభాల గురించి చెబితే వాళ్ళే గ్రూపులో చేరిపోతారు, ఇదేమంత కష్టమైన పని అనుకుంది కానీ తాను అనుకున్నంత తేలిక మాత్రం కాదని అప్పుడప్పుడే బోధపడుతుంది.
మూడు రోజులు అవుతుంది ఈ ఊరికి వచ్చి. అంగన్వాడీ టీచర్ ఇంట్లో మకాం. ఆమె సహాయంతో ఊర్లో ఇంకా గ్రూప్ లలో లేని ఆడవాళ్ళ లిస్ట్ తయారుచేసి అందరికీ కబురు పంపింది. కొన్నిచోట్లకి తానే వెళ్ళి పిలిచివచ్చింది. మొదటి రోజు అందరూ రాకపోవడంతో ఎక్కువమంది రాలేదని రెండోరోజు మళ్ళీ మీటింగ్ పెట్టింది.
సంఘంలో చేరి నెల నెలా పొదుపు చేసుకుంటే రివాల్వింగ్ ఫండు, లోన్లు వస్తాయని వాళ్లకి వివరంగా చెప్పింది. మాకొచ్చే ఆదాయమే అంతంత మాత్రం, అందులో మళ్ళీ పొదుపా అంటూ కొంతమంది ఆడవాళ్లు పెదవి విరిచారు. ఎక్కువ మొత్తంలో చేయనవసరం లేదనీ, రోజుకొక్క రూపాయి చొప్పున నెలకు కనీసం ముఫై రూపాయిలు చేస్తే చాలనీ చెప్పి వారిని సంఘంలో చేరేందుకు ఒప్పించింది లత. తన దగ్గరున్న ఆడియో ప్లేయర్ లో ‘రోజుకొక్క రూపాయి దాచుకోమంటేను దాచను పొమ్మంది మా వదిన, భలే డాబుసరిగుంటాది మా వదిన” అనే పాట పెట్టి వినిపిస్తే అక్కడ గుమికూడిన ఆడవాళ్ళంతా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.
రెండో రోజు మీటింగ్ తర్వాత ఇంకా ఎవరెవరు రాలేదు అని చూస్తే నలుగురు లెక్క తేలారు. వాళ్లలో ముగ్గురు ఊర్లో లేరు. చంద్రమ్మ ఊర్లోనే ఉంది కానీ రాలేదు అని చెప్పింది టీచర్. దానితో ఇలా వాళ్ళింటికి బయలుదేరింది. ఎలాగైనా ఊరిలో ఉన్న ఆడవాళ్లందరినీ గ్రూపుల్లో చేర్చాలి అని తన ప్రయత్నం.
దుకాణం దగ్గరకి రావడంతో లత ఆలోచనలు నిలిచిపోయాయి. తనకి కావాల్సినవి కొనుక్కుని మళ్ళీ వేగంగా వెనక్కి బయలుదేరింది.
ఇంట్లోకి అడుగుపెట్టేసరికి ముసలాయన మళ్ళీ అటువైపు తిరిగి పడుకుని ఉన్నాడు. ఉన్న కాసిని బియ్యాన్ని చేటలో పోసుకుని రాళ్ళూ రప్పలూ ఏరేందుకు కళ్ళు కనిపించక అవస్థ పడుతుంది చంద్రమ్మ.
“ఇవిగో చంద్రమ్మా ఈ సంచిలో పాలు, టీ పొడి ఉన్నాయి. కొంచెం టీ పెడతావా. తాగుతూ మాట్లాడుకుందాం.” అంటూ చంద్రమ్మ చేతికి సంచి ఇచ్చింది లత. “పోనీ ఒక పని చెయ్యి. అందులో బియ్యం, కూరగాయలు అవీ ఉన్నాయి. నువ్వు వంట చేయడానికి రెడీ చెయ్యి. టీ నేను పెడతా” అంటూ చనువుగా గిన్నె తీసుకుని పొయ్యి ముందు కూర్చుంది.
“అయ్యో ఇవన్నీ ఎందుకు తెచ్చావమ్మా? మాకిలా ఎన్ని రోజులు గడవలేదు?” నొచ్చుకుంటూనే సంచి చేతిలోకి తీసుకుంది చంద్రమ్మ. “అయినా ఇట్లా పనికి పోలేనప్పుడు, చేతిలో డబ్బులు లేనప్పుడల్లా ఆ కోమటాయన కొట్లో పద్దు రాయించి ఉప్పు, పప్పు తెస్తూనే ఉండేదాన్ని. కానీ ఇప్పుడు బయట వానెట్టా ఉంది? ముసలోళ్ళం ఈ వానలో బయటకు పోయి ఏ కాలో జారిపడ్డామంటే ఇక అంతే సంగతులు”
“నువ్వు పోతే మాత్రం పాత బాకీ జమేయకుండా మళ్ళీ అప్పిస్తాడేంటి ఆయన” గొణుగుతూ మంచం మీద నుండి లేచి కూర్చున్నాడు తాత
చంద్రమ్మ కూరలు తరిగి, బియ్యం కడిగి పెట్టేలోపు లత టీ తయారుచేసింది. చల్లటి వాతావరణంలో వేడి వేడి టీ పొగ, వాసన తగలగానే ముసలాయనకు ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది. ముగ్గురూ టీ తాగుతూ కబుర్లలో పడ్డారు.
తమ అనారోగ్యాల గురించీ, ఎన్నాళ్ళ నుండో ఎదురుచూస్తున్నా రాని వృద్ధాప్య పెన్షన్ గురించీ, తమ అవసరాలు తీర్చలేని కొడుకు గురించీ చెప్పుకుని ముసలాళ్ళిద్దరూ బాధపడ్డారు. “ఇందుకేగదా వెనకటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంచిది అనుకునేవాళ్ళు. సంపాదించే చేతులు ఎక్కువ, ఆదాయం ఎక్కువ. పిల్లలే ఆస్థి అనేటోళ్ళు. ఇప్పటి రోజులలా లేవులే” అన్నాడు తాత దీర్ఘంగా నిట్టూర్పు విడుస్తూ.
“నేనిక బయలుదేరతాలే చంద్రమ్మా. లేట్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి వస్తా” అంటూ లేవబోయింది లత.
“అదేంటమ్మాయ్, నేను ముగ్గురికీ బియ్యం పెట్టా. మిట్టమద్దానం అవుతుంది. జోరున వాన కూడా పడుతుంది. కాస్త తిని పోదువులే కూర్చో. అప్పటికి వాన కూడా కాస్త తెరిపిస్తదేమో ” అంటూ ఆపింది చంద్రమ్మ.
సరే అంటూ తలూపి వాకిట్లో ధారగా పడుతున్న వానకేసి చూస్తూ కూర్చుంది. వీధి చివర్లో పిల్లలు కాగితపు పడవలు చేసి నీళ్ళల్లో వదులుతూ పోటీలు పెట్టుకుంటున్నారు. వాళ్ళ అరుపులు, వాన చినుకుల చప్పుడుతో బయట అంతా కోలాహలంగా ఉంది. లత మనసులో మాత్రం ఏదో స్తబ్దత. తాను ఎందుకు వచ్చిందో, ఏమి చేయాలనుకుందో ఏమీ గుర్తులేదు. ఎవరికీ పట్టక, ఏ సహాయమూ అందక, జీవితం అత్యంత దుర్భరంగా గడిచే రోజులెన్నింటినో ఎంత ఓర్పుతో దాటుకుంటూ వచ్చారు వాళ్ళు! ఎవరినీ నిందించలేదు. ఏ ఫిర్యాదూ లేదు. వాన తెరిపి ఇవ్వకపోతదా? మళ్ళీ పనికి పోకపోతామా? అన్న ఆశతో నిబ్బరంగా రోజులను నెట్టుకొస్తున్న వాళ్ళని రోజుకొక్క రూపాయి కూడా దాచుకోలేరా అని ఏ ధైర్యంతో తాను అడగగలదు?
“ఇట్టా కూచో అమ్మాయ్. అన్నం పెట్టా” అన్న చంద్రమ్మ మాటతో నట్టింట్లోకి నడిచింది. కాస్త పొడిగా ఉన్న చోటు చూసి చాప పరిచి ముగ్గురికీ కంచాలలో అన్నం పెట్టి పప్పు వేసి ఉంచింది చంద్రమ్మ. వాతావరణం చల్లగా ఉందేమో వేడి వేడి పప్పన్నం గొంతు దిగుతుంటే అమృతంలా అనిపించింది లతకి.
చేతులు కడుక్కోగానే “ఇక నేను బయలుదేరతా చంద్రమ్మా, మళ్ళీ నేను హెడ్ ఆఫీస్ కు పోవాలి” అంటూ హ్యాండ్బ్యాగ్ తగిలించుకుని గొడుగు చేతిలోకి తీసుకుంది.
“అది సరే అమ్మాయ్. ఇంతకీ నువ్వెందుకు వచ్చావో చెప్పనే లేదు” అన్నాడు ముసలాయన
“మళ్ళీ వస్తాగా, అప్పుడు చెబుతాలే” అంటూ బయటకి నడిచింది.
“వాన తగ్గనే లేదుగా. ఎట్లా పోతావు?” అంటూ వెనకాలే వచ్చింది చంద్రమ్మ.
“ఈ ముసురు ఇప్పట్లో తగ్గదులే” అంటూ గొడుగు తెరిచి గబగబా అడుగులు వేసింది.
****
“ఎసరు పొంగిపోతుంటే అట్టా చూస్తూ నిల్చున్నావేమ్మా” అన్న రేణుక మాటలకు ఈ లోకంలోకి వచ్చిపడింది లత.
స్టవ్ సిమ్ లో పెట్టి మళ్ళీ ఆలోచనలో పడింది. చంద్రమ్మకి ఏదో తెలియచెప్పాలని కదూ తాను వెళ్ళింది. కానీ ‘మాకిలా ఎన్ని రోజులు గడవలేదు’ అన్న చంద్రమ్మ మాటతో తానే ఏదో జీవితసత్యం తెలుసుకుని వచ్చింది. రోజుకొక్క రూపాయి కూడా దాచుకోలేని చంద్రమ్మలు ఇంకెంతమంది ఈ ముసురులో పస్తులు పడుకుంటున్నారో అనుకోగానే ఆమె మనసు కలుక్కుమంది
“నా పని అయిపోయింది. ఇక నేను వెళ్తా” చేతులు తుడుచుకుంటూ చెప్పింది రేణుక
“వాన తగ్గలేదుగా”
“ఈ ముసురు ఇప్పట్లో తగ్గదులే” వేగంగా వెళ్లిపోతున్న రేణుక వంక చూస్తూ ఉండిపోయింది లత.
*
చిత్రం: సృజన్ రాజ్
చాలా మంచి కథ. “ఈ ముసురు యిప్పట్లో తగ్గేలా లేదు”.. వెంటాడే వాక్యం. కంగ్రాచ్యులేషన్స్ భారతిగారూ. కవయిత్రిగా మీకు ఎంత మంచి పేరుందో కథా రచయిత్రిగా కూడా అంతటి పేరు రావాలని కోరుకుంటున్నాను.
Thank you very much for your encouraging words Sridhar garu🙏
మంచి కథ భారతీ. మీ ఫీల్డ్ వర్కర్ డైరీ చదివినప్పుడల్లా అనుకుంటాను. ఒక్కో అనుభవం రాస్తే ఎన్ని కథలు అవుతాయో కదా అని. Congratulations.
Thank you very much Uma garu
చాలా సార్లు నేర్పుదామని వెళ్లి మనమే నేర్చుకుని వస్తాము. ఆ విషయాన్ని చక్కగా పట్టుకున్నారు. ఇంకా రాయండి భారతి.
Thank you Sudha garu
ఈ ముసురు ఇప్పట్లో తగ్గదు . మనసు నొప్పించి ఒప్పించినా కథ
అభినందనలు
Thank you Swati garu
“అత్యంత దుర్భరంగా గడిచే రోజులెన్నింటినో ఎంత ఓర్పుతో దాటుకుంటూ వచ్చారు వాళ్ళు! ఎవరినీ నిందించలేదు. ఏ ఫిర్యాదూ లేదు. వాన తెరిపి ఇవ్వకపోతదా? మళ్ళీ పనికి పోకపోతామా? అన్న ఆశతో నిబ్బరంగా రోజులను నెట్టుకొస్తున్న వాళ్ళని రోజుకొక్క రూపాయి కూడా దాచుకోలేరా అని ఏ ధైర్యంతో తాను అడగగలదు?” జస్ట్ కథ అని లైట్ తీసుకోలేము…. ఎన్నెన్ని జీవితాల రియాలిటీ ఇది. :'(
Thank you Sufi
జీవితం కళ్ళముందు చిత్రించిన కథ..
ఈ ముసురు ఇప్పట్లో తగ్గేలా లేదు..అనే వాక్యం
వెంటాడుతూ ఉంది..కథలోని లత గారికి వందనాలు..!
ధన్యవాదాలు మేడం మంచి కతను చదివించారు.
Thank you
ఇలాంటి చంద్రమ్మలు చాలా మంది వున్నారు భారతి గారు.. బావుంది రియాలిటీ కళ్ళకు కట్టినట్లు
Thank you Rupa garu
ఈ ముసురు ఇప్పట్లో తగ్గేది లేదు. ఈ జీవితాల్లో మార్పు వచ్చేది లేదు😪😪
Hmm, lives didn’t change much since then for few people 🙁