కత కొంచెం – తీత ఘనం

చక్కటి సినిమా తీయడానికి ఎక్కువ ఖర్చు పెట్టనక్కర్లేదనీ, పాటలూ ఫైట్లూ అసలే అవసరం కావనీ, కథలో బలం- చూపించదల్చుకున్న విషయం మీద దర్శకుడికి పట్టూ ఉంటే సరిపోతుందనీ ఈ సినిమా మరోసారి రుజువు చేసింది.

కొన్ని పాఠాలుంటాయి.  చిన్నప్పుడు బడిలో నేర్పనివి.  ప్రత్యేకించి ఎవరూ చెప్పనివి.

కొందరు అదృష్టవంతులకి, వీటిని చూసి నేర్చుకోవడానికి వీలుంటుంది. ఆ వీలున్నా, నేర్చుకున్నా, వాటిని మడత పెట్టి ఎక్కడో లోతుల్లో తొక్కి పెట్టే తీరుంటుంది మరి కొందరికి.

ఈ పాఠాలు పెద్దయ్యాక మనల్ని తీరుగా మలిచేవి. మనల్ని మనం మళ్ళించుకోవడానికి తోడ్పడేవి. ఆలోచించి అర్థం చేసుకోవలసినవి. అలాంటి కొన్ని పాఠాలని, పాఠాల్లాగా కాక, పంచదార అద్దిన పచ్చిమిరపకాయ బజ్జీలా అందించిన ఓ చక్కటి కథని, “మన వూరి రామాయణం”లో చూడచ్చు.

కథ చిన్నది. అలా అని అందులో మలుపులకి తక్కువేం లేదు.

చాలా రోజుల క్రితం ఏదో కథలో చదివాను. పొద్దున్నే ముతక చీరలో అలసిన ముఖంతో నడిచి వెళ్తూ కనపడిన పక్కింటావిడని చూచి, “దుబాయ్ నించి మొగుడు బానే సంపాదించి పంపిస్తున్నా, ఎందుకో ఈ బీదవతారం”  అంటూ కొందరనుకుంటే, “ఎక్కణ్ణించి వస్తోందో ఏమో… మొహం ఎందుకలా మాడిందో…” అని మరికొందరు రకరకాలుగా ఊహాగానాలు  చేసేరట. తీరా చేసి ఆవిడ యోగా క్లాసునుంచి తిరిగి వెళ్తోంది. నలిగినా పరవాలేదని ముతక చీర కట్టుకుంది. క్లాసులో పడ్డ శారీరక శ్రమకి ముఖంలో కొద్దిగా అలసట కనిపించింది.

అది లోకం తీరు. ఇందులో ఆ పాఠం ఉంది.

పది తలలున్నవాడు, పరమ శివనిష్టాగరిష్టుడు అయిన రావణుడు తన బాణానికి నేలకూలిన తర్వాత, ‘అంతటి సద్బ్రాహ్మణుడు కన్నుమూయక ముందే, అతనినుంచి కొంతైనా జ్ఞాన సముపార్జన చేసి రమ్మ’ని లక్ష్మణుడిని స్వయానా రాముడే పంపాడన్న వైనం మీకూ తెలిసే ఉంటుంది.   దాంతో మనం నేర్చుకున్నాం – జ్ఞానం అన్నది ఎవరినుంచైనా నేర్చుకోదగ్గదే అని.

ఇందులో ఈ పాఠం కూడా ఉంది.

ఎన్నో గ్రంథాలు, కావ్యాలు, చరిత్ర పుటలని సృష్టించిన కారణం, ఎన్నో రాజ్యాలు నశించి, ఎందరి పతనానికో దారితీసిన కారణం, అంతులేని పోరాటాలకీ, వీరోచిత-విషాదగాథలకీ మూలమైన కారణం, మనకి తెలిసిన చాలామందిలో ఉండే ఒక- మనకి తెలిసిన/తెలియని బలహీనత… మీకూ తెలుసు. అవును. మీరు ఊహించిందే కరెక్ట్. వ్యక్తిగత విలువలు ఎంతో బలంగా వేళ్లూనుకుంటే తప్ప, ఆ బలహీనతకి లోనుకాకుండా ఉండటం వీలు కాదు. మనుషుల్ని లోబరుచుకునే అవకాశం ఆ బలహీనతకి ఎప్పుడూ ఉంటుంది.

ఇందులో ఈ పాఠమూ ఉంది. అది అంత తీవ్రంగానూ ఈ సినిమాలో తగులుతుంది. ఇందులోని ముఖ్యపాత్ర ఆ బలహీనతకి పూర్తిగా లొంగితే ఈ సినిమా కథ ఉండదు. లొంగకపోవడాన్ని మనకి చూపించడం మాత్రం ఈ సినిమాలో గొప్పగా జరిగింది. ‘ఆ… లొంగిపోతే మాత్రం ఏం కొంప మునిగిందిట?’ అంటారా!  అది వేరే కథవుతుంది.

సినిమాల్లో అమ్మాయీ అబ్బాయీ చెట్టాపట్టాలేసుకుని చెట్లూ పుట్టల చుట్టూ తిరుగుతూ పాట పాడుతుంటేనూ/ కారు పక్కనుంచి రయ్యిన దూసుకుపోయిన మోటార్ బైక్ మీద, కుర్రాణ్ణి గట్టిగా వాటేసుకుని కూర్చొన్న పిల్లని వెనకనుంచి చూస్తేనూ/, ‘కుర్రాడు వేరే మతమండీ… మా అమ్మాయి ఇష్టపడింది, దాని ఇష్టమే మా ఇష్టం’ అంటూ పెళ్లివార్త అందించిన తల్లిదండ్రులని చూస్తేనూ/

బహుశా ఎంజాయ్ చేస్తాం/మనసులో ఈలేస్తాం/ఆమోదిస్తున్నట్లు తలూపుతాం.   కానీ సొంత కూతురిని మాత్రం ఆ పాటలో/ఆ పొజిషన్లో/ఆ పెళ్ళిలో ఊహించుకోం. మనల్ని మనం ఆ పరిస్థితుల్లో ఉంచి చూసుకోం. తరతరాలుగా మన రక్తంలో రంగరించుకుపోయిన పితృస్వామ్య భావజాలం అలా చూసుకోనివ్వదు కాబట్టి.

ఇందులో ఈ పాఠమూ ఉంది. ఆ భావజాలం ఎప్పుడు నీరుగారుతుందో, అప్పుడు ఏం చెయ్యాలో చెప్తుంది. పైగా ఆ చెప్పే పద్ధతీ పరిస్థితీ ఎంతో కన్విన్సింగ్ గా కూడా ఉంటుంది.

ఈ పాఠాలే కాకుండా, ఈ సినిమాలో మంచి ఫోటోగ్రఫీ ఉంది. ఎడిటింగ్ నైపుణ్యముంది. ముఖ్యపాత్రల నటన బాగుంది. సహాయక పాత్రల నటనాపాటవాలు తక్కువ మార్కులే సంపాదించుకున్నా, అవి ఈ సినిమాని మెచ్చుకోవడానికి ఆటంకం మాత్రం కావు. ఇందులో పాత్రలన్నీ, మనకి రోజూ ఎదురయ్యేవే. మన కనుచివరలనుంచి జారిపోయేవే. కొంచెం బలహీనంగా ట్రీట్ చేసినట్లు అనిపించిన ఒకే ఒక పాత్ర – నా దృష్టిలో – సత్యదేవ్ ధరించిన ఆటో డ్రైవర్ ది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ పాత్ర ప్రవర్తన మరి కొంత మెచ్యూర్డ్ గా ఉండొచ్చుననిపించింది.

ముఖ్య పాత్రధారులైన ప్రకాష్ రాజ్, ప్రియమణి, పృథ్వీరాజ్, సత్యదేవ్ ల నటన, కథకి న్యాయం చేకూర్చింది. ఒక అతి ముఖ్యమైన మలుపు మాత్రం, ముందే తెలిసినట్లు అనిపించి, కించిత్ నిరుత్సాహపరిచింది. కానీ, ముఖ్యమైన సన్నివేశాలన్నిట్లోనూ పడాల్సినన్ని షాట్లూ పడి, సినిమాలో టెంపో తగ్గకుండా కాపాడాయి. ప్రకాష్ రాజ్ స్వయంగా నిర్మించి, స్క్రీన్ ప్లే రాసి, మాటలు రాసి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం, మొత్తం మీద మిమ్మల్ని రంజించకుండా ఊరుకోదు.

ఒక చక్కటి సినిమాని తీయడానికి ఎక్కువ ఖర్చు పెట్టనక్కర్లేదనీ, పాటలూ ఫైట్లూ అసలే అవసరం కావనీ, కథలో బలం- చూపించదల్చుకున్న విషయం మీద దర్శకుడికి పట్టూ ఉంటే సరిపోతుందనీ ఈ సినిమా మరోసారి రుజువు చేసింది.

చిత్రానికి సంగీతాన్ని అందించింది ‘మేస్ట్రో’ ఇళయరాజా. అది నేపథ్య సంగీతానికే పరిమితమైనా, సన్నివేశాలకి బలం చేకూర్చింది.

షరా మామూలే. కథ చెప్పను. ‘అమెజాన్ ప్రైం లో ఉంది, చూడండి’ అని మాత్రం చెప్తాను.

PS: అన్నట్లు, చివర్లో చిన్న ట్విస్టు కూడా ఉందండోయ్!

 

చిత్రం: మన వూరి రామాయణం

నటీనటవర్గం: ప్రకాష్ రాజ్, ప్రియమణి, పృథ్వీరాజ్, సత్యదేవ్ (వీటిని నేను ఏ క్రమంలోనూ అమర్చలేదు)

సహ-నిర్మాత, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రకాష్ రాజ్

సహ-నిర్మాత: రాంజీ నరసింహన్

సంగీతం: మేస్ట్రో ఇళయరాజా

ఫోటోగ్రఫీ: ముఖేశ్

కూర్పు: శ్రీకర్ ప్రసాద్

*

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు