మున్నార్‌ మడుల్లో రాఘచంద్రం

న్నోమార్లు వాసంతికల్ని వలగా కట్టి

వర్తమానం పంపినా

అడుగెందుకో తీరిక చేసుకోలేకపోయింది

శరత్‌హేమంతాల సోయగాలు

మొవ్వ చాచుకున్న మొగలిపత్రాల్ని

ఎన్నిమార్లు మోసుకొచ్చినా

మలయరాజసాల్లోకి ఊపిరెందుకో విప్పుకోలేకపోయింది

యాలకపువ్వంత నాజూకు చెలువాలు,

మిరియపుతీగ పెనవేతలాంటి

బిగుతుబిగుతు రసరాగావేశాలేవో

పులకింతలకెన్నిమార్లు స్వాగతాలు పంపినా

ఎక్కడ చిక్కుబడిపోయాయో కానీ

బతుకుగల్లీల్లో వాటి ఆనవాళ్లను వెతుక్కోలేకపోయా

ఎగుడుదిగుడు దిబ్బల పక్కన

ఎంత గుంటపువ్వునై తలదించుకుపోతున్నా

ఏ దీపాలదొప్పల్లోనో కొత్తపూత కోసం

కొండపొద్దుల్ని వడగొట్టుకుంటూనే ఉన్నా,

కొద్దికొద్దిగా చైత్రాన్ని పులుముకుంటూనే ఉన్నా

 

నిదురకాచి నిదురకాచి

చివరికొక స్వప్నవీచిక రెక్కవిప్పిన సుగంధమై

నెలవంకల్ని మంచెకట్టి పంపితే

గడ్డకట్టిన తపనల్ని ఈదుకుంటూ ఈదుకుంటూ,

వానమట్టిలా నానేసుకున్న నన్ను

రుచులురుచులుగా పోతపోసుకుని

ఉల్లములో ఒత్తిపెట్టిన ప్రేమలేఖల మీద

పేరుకున్న మరుపుధూళిని దులుపుకుంటూ –

కంచెదాటిన తుమ్మెదపాటలా

.. నా అడుగు

 

నేనొస్తున్నానన్న కబురందుకునీ

రెపరెపలాడే పయ్యెదనే దీపస్తంభంగా ఎగరేసీ

జారిపడే చూపుల్ని దారిచూపే చుక్కలుగా పరిచీ-

గాలిబుగ్గన గాట్లుపెట్టి

చెరుకురాగాల్ని పిండేసుకుపోయే పిల్లనగ్రోవినో

కైపున పండిన కమ్మని కైతలమడుగునో చేసిపోయే

ఓ నాలుగు జావళీలతో నాలోకి పరకాయం చేయకుండా

తానేమో అక్కడే.. ఆ గర్భకొసనే..

తూరుపుగాలుల్లాంటి తన నవ్వుల్లో

మొగ్గేసే చిత్రకేళుల్ని కోసుకోవడానికి

ఇక పొంచి పొంచి నేను..

 

డిన పెళ్లిపందిరులు కట్టి

వెన్నపూసల కొసరుముద్దలు తినిపిస్తానంటూ

పంపిన కబురునే ఏమరిచిందో ఏమో

నేనెంత పరుగులు పెడుతున్నా అందినట్టే అంది

అంతలోనే కోసెడు దూరంలో

ఏమెరగనట్టు కొసకంటన గుప్పెడు జాజిమల్లెలతో తాను..

నా నిండా కొలనుగట్టిన వీణియఝరుల్లో

మునకేసి మునకేసి.. నేను

 

సంజెకెంజాయల్లోంచి

దాగుడుమూతల దోసిళ్లు విప్పుకున్న తొలిచీకట్లలోంచి –

తేలితేలిపోయే మంచుమబ్బుల పరదాల మాటునుంచి

కస్తూరిలా కాస్తకాస్తగా నన్నొలుచుకుపోతుంటే

ఎడద కవాటాలు తెగిపోయి

తొలకరి ఋతువులా పొంగిపొరలే

రక్తం నిండా సప్తమివెన్నెల మిసమిసలే!

ఇన్నాళ్ల నైరూప్యం ఏ కుంచెకొసల చిరులాస్యాలకే

పులకించి పులకించి దీపాంగనయ్యిందో కానీ

కాసేపు దారి చూపుతూ, మరికాసేపు దారి తప్పిస్తూ

నన్నో బిచ్చగాడిగా ఊరేగించుకుంటున్నా సరే –

అప్పుడే అమృతంబొట్టును

నాలుక్కింతగా రాసుకున్న మైకంలో

చిగురేసిన కొత్తనేలల్లో కొత్తగాలిగా నేను

 

వంగంలా మొగ్గతొడిగిన పిడికెడు అపురూపాల్ని

దాల్చినంలా తొలుచుకున్న గుప్పెడు దేహదవళాల్ని

నాలో ఒద్దికగా సర్దింది సరే,

చిక్కగా చిలుక్కున్న తీపిగాయాల్ని

పుప్పొడితేటల్లో మాగనీయకుండానే,

ఆమె నెమలికన్నుల జడల మీంచి

వీచే ఏడోఋతువు విసిరే వర్ణాలలోంచి

కొత్తసరిగమలు కొన్నిటినైనా

పరిచయం చేసుకోనీయకుండానే,

ఆమె తనువుదీపం కింద కొత్తఅలుపుల్ని

ఉలిక్కిపడనీయకుండానే

నా పాటల్ని సగంలో కాజేసుకుపోతుంటే

ఆ కొండకొసన విప్పిన

రసజ్వాలరాగచంధస్సును బట్టీయం పడుతూ నేను

***

పొద్దుపొడిచే సంబరాల నిండా

ఆ కాస్తలోనే

ఎన్ని రంగుల తురాయిలు కట్టుకుంటేనేం

పూలతెప్పల నిండా తుళ్లింతల్ని తురిమిపెట్టుకుని

ఎల్తురు ఏడాదిలెన్నిటిని దాటేస్తేనేం,

బతుకుఎరల తొక్కిసలాటల్లో

మళ్లీ ఓ అర్ధంతర యుద్ధాన్నైపోతూ

మళ్లీ ఒక జీవితకాల అపరిచితాన్ని పరుచుకుంటూ –

కోసుకోలేని చందమామల కోసం

చెట్టుచెట్టూ కొండగట్టూ పట్టిపోయిన నన్ను

కొక్కెనలగాలాలతో దేవులాడుకుంటూ.. నేను

చ్చకర్పూరంలాంటి పండగలన్నీ

కొమ్మలు దూకేసిన కిరణాల్లా నేలపాలైపోతుంటే

గెలుపు అంచుల్లో వదిలేసి

అడుగెటో వెళ్లిపోయినట్లు

వెనకెనక్కి జరిగిపోతోందో

నేనే తనని విడిచి కొట్టుకెళ్లిపోతున్నానో..

మరి, సగం దేహాన్నిక్కడే కానుకగా

ఒదిలేసి పోదామనుకున్నా

నాలోని మున్నారం సగమైపోతుందేమోనన్న భయంలో –

నిదుర తీరని పసికందులా కిందామీదైపోతున్నా..

వాడిపోతున్న విరులకొండ మీంచి

జారిపడుతున్న నీడల్లో

మైలపడిన వాయుగుండమైపోతున్నా..

 

యితేనేం-

ఇప్పుడు నేనిక పగిలిన గింజనైపోతేనేం

నానిండా

ఎవరూ మోసుకుపోలేని ఎన్ని ఎన్ని అడవులో!

అడవులు పెంచుకుంటున్న ఎందరు ఎందరు

రాఘచంద్రులో!

*

చిత్రం: అక్బర్ 

యార్లగడ్డ రాఘవేంద్రరావు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • టిపికల్ యార్లగడ్డ వారి మార్క్ ప్రతిఫలించిన కవిత
    కేరళ స్పైసెస్ ఘాటు అక్షరమై మనసంతా పాకింది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు