“నీతో ఇలా చెప్పాల్సిరావడం నాకు యిబ్బందిగానే వుంది. కానీ, తప్పట్లేదు. నువ్వు నా గురించి బ్యాడ్ గా అనుకున్నా పర్వాలేదు. ఒక ఫ్రెండ్ గా యిది నా బాధ్యత అని అనిపిస్తోంది నాకు”, గంభీరంగా అన్నాడు ఆనందరావు.
అరగంట బట్టీ యిదే తంతు. అసలు విషయమేంటో చెప్పడు. రెండు గంటల క్రితం ఫోన్ చేసి, “నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎవరూ డిస్టర్బ్ చేయకుండా వూరి చివర ఫంక్షన్ హాల్ దగ్గరకెళ్లి మాట్లాడుకుందాం. ఫైవ్ కల్లా వచ్చెయ్. నీతోపాటు యింకెవ్వర్నీ తీసుకురావొద్దు. అసలు మనం కలవబోతున్నట్టు ఎవరికీ తెలీనీయొద్దు”, అని వంద జాగ్రత్తలు చెప్పాడు. ఎంత ఆలోచించినా ఆనందరావు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో సురేష్‌కి అర్థం కాలేదు.
ఆనందరావు, సురేష్, సునీత ఒకప్పుడు క్లాస్ మేట్స్. ఆనందరావు విద్యార్థి ఉద్యమాల్లో చాలా చురుగ్గా వుండేవాడు. లెక్చరర్లు కూడా అతన్ని ఒక స్టూడెంట్‌లా కాకుండా విఐపీలాగా ట్రీట్ చేసేవాళ్లు. సునీతకి మొదట్లో రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి వుండేది కాదు. ఆనందరావు ప్రభావంతోనే ఆమె కూడా స్టూడెంట్ యూనియన్స్ లో ఏక్టివ్‌గా వుండడం మొదలెట్టింది. చదువైపోగానే ఆనందరావు, సునీత పెళ్లి చేసుకుంటారని ఫ్రెండ్సు అనుకునేవాళ్లు. సురేష్‌కి సినిమాలు, సాహిత్యం తప్ప సమాజం గురించి పట్టేది కాదు. అలాంటివాడితో సునీత ప్రేమలో పడడం, పెళ్లివరకూ వెళ్లడం చాలామందికి షాకింగ్‌గా అనిపించింది. ఆనందరావు మాత్రం చాలా హ్యాపీగా దగ్గరుండి మరీ పెళ్లిపనులన్నీ చూసుకున్నాడు. సురేష్ కీ, సునీతకీ రెగ్యులర్ గా టచ్ లో వుంటాడు. కానీ యిలా బయటెక్కడో కలుద్దాం అని అడగడం గతంలో ఎప్పుడూ జరగలేదు.
ఐదింటికి సురేష్ వెళ్లేసరికే ఆనందరావ్ సీరియస్‌గా అటూయిటూ పచార్లు చేస్తూ కనిపించాడు. కింద పడేసున్న సిగరెట్ పీకల్నిచూస్తే ఆనందరావ్ అక్కడికి వచ్చి చాలాసేపు అయిందని అర్థమవుతోంది.
“ఏంటి సంగతి?” అడిగాడు సురేష్. అదిగో అప్పుడు మొదలైంది డ్రామా. ఏదో యిబ్బంది పడుతున్నట్టు దిక్కలు చూస్తాడు తప్ప ఎంతకీ అసలు మేటర్‌లోకి రాడే. సురేష్‌కి సహనం చచ్చిపోయింది.
“ఇంకొక్క నిముషంలో నువ్వు చెప్పాలనుకున్నదేంటో చెప్పకపోతే నేను వెళ్లిపోతా”, బెదిరించాడు.
చివరికెలాగైతే గొంతు పెగిలింది. తల పైకెత్తి, “సునీత గురించి” అన్నాడు.
“సునీత గురించా?”
అవునన్నట్టు తలాడించాడు.
“సునీత గురించైతే అదేదో యింటిదగ్గర కూచోని మాట్లాడుకునేవాళ్లంగా. అయినా తనకొక జాబ్ చూడమని మాటవరసకి చెప్పాన్నేను. నువ్వు మరీ సీరియస్‌గా తీసుకున్నట్టున్నావ్”, నవ్వుతూ అన్నాడు సురేష్.
“జాబ్ గురించి మాట్టాడ్డానికి రమ్మన్నానని నేను చెప్పానా?”, విసుగ్గా అన్నాడు ఆనందరావు. తాను ఆశించిన షాక్, భయం సురేష్ మొహంలో కనబడకపోవడం అతనికి కాస్త నిరాశని కలిగించింది.
“జాబ్ గురించి కాదా? మరి?”, క్యాజువల్‌గా అడిగాడు సురేష్.
ఇదే సురేష్‌లో ఆనందరావుకి నచ్చనిది. దేనికీ పెద్దగా రెస్పాండ్ అవ్వడు. జాబ్ గురించి కాదు అని చెప్పాకైనా కొంచెం కంగారు పడాలిగా. ఇక లాభం లేదు. ఏం చెపితే వాడి దిమ్మతిరిగిపోద్దో అదే డైరెక్టుగా చెప్పేయాలి.
“సునీతకి వేరే అతనితో సంబంధం వుందని నా అనుమానం”, అన్నాడు ఆనందరావు.
“సంబంధం అంటే?”, ఇంకా సురేష్ గొంతులో క్యాజువల్‌నెస్ పోలేదు.
“సంబంధం అంటే ఏంటో, ఆ వర్డ్ దేనికి వాడతారో తెలీదా నీకు? సునీతకి ఎవరితోనో శారీరక సంబంధం వుంది. ముసుగులో గుద్దులాట దేనికి. అతనెవరో కూడా నాకు తెలుసు. అదాటున చెపితే నువ్వు తట్టుకోగలవో లేదో అని యిందాక అనుమానం అన్నాలే కానీ, నిజానికి నాకు తెలిసింది హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ యిన్ఫర్మేషన్.”
ఈసారి సురేష్ మొహంలో కాస్త మార్పు వచ్చినట్టే అనిపించింది. కానీ, ఆ విషయం అతని గొంతులో మాత్రం తెలీడం లేదు. ఒక పదిసెకన్లు గ్యాప్ తీసుకోని, “అవునా సరే కానియ్యి, ఆలోచిద్దాంలే”, అన్నాడు.
ఆనందరావుకి బీపీ పెరిగిపోయింది. “ఏంటి ఆలోచించేది. అసలు నేనేం చెపుతున్నానో నీ బుర్రలోకి ఎక్కుతుందా?” కోపంగా అడిగాడు.
“ఇందులో అర్థం కాకపోవడానికేముంది? మా ఆవిడ యింకొకతనితో ఫిజికల్‌గా యిన్‌వాల్వ్ అయ్యిందని చెపుతున్నావ్ అంతేగా”, బదులిచ్చాడు సురేష్.
“ఈ విషయం ఆల్రెడీ నీకు తెలుసు కదూ?”, అనుమానంగా అడిగాడు ఆనందరావు.
“చాఛా. ఇలా జరుగుతుందనే ఆలోచన నా కల్లో కూడా లేదు”, సురేష్ గొంతులో ధ్వనించిన నిజాయితీ ఆనందరావుని కన్విన్స్ చేసింది.
“మరి?”
“ఏంటి మరి?”
“ఏం చేద్దామనుకుంటున్నావ్? “
“ఇప్పుడేగా నువ్వు చెప్పింది. అది నిజమా కాదా, ఒకవేళ నిజమైతే తను అలా ఎందుకు చేస్తోందో సునీతని అడిగి తెలుసుకోవాలిగా”, అన్నాడు సురేష్.
“అలా ఎందుకు చేస్తోందో సునీతని అడిగి తెలుసుకుంటావా?”, నమ్మశక్యం కానిదేదో విన్నట్టు అడిగాడు ఆనందరావు.
“అవును. తన వెర్షనేంటో కూడా వినాలిగా”, అన్నాడు సురేష్.
“సునీత వెర్షన్ మాత్రమే ఎందుకు? ఆమె లవర్ వెర్షనేంటో కూడా తెలుసుకుంటే పోలా?”, వెటకారంగా అన్నాడు ఆనందరావు.
“అతనితో ఏదైనా మాట్లాడాలనుకుంటే, ఆ పని చేయాల్సింది సునీత. నేను కాదు. అయినా ఈ విషయం గురించి అసలు సునీతని కూడా ఏదీ అడిగే వుద్దేశం లేదు నాకు. తను చెప్పేవరకూ వెయిట్ చేస్తా”, అన్నాడు సురేష్.
సురేష్‌కి మొదట్నించీ పిచ్చి వుండి కూడా అది తన దృష్టికి రాలేదని తోచింది ఆనందరావుకి. లేదా, ఇప్పడు తాను చెప్పిన న్యూస్ వల్ల ఫ్రెష్షుగా మైండ్ దొబ్బేసి వుండాలి. లేదంటే మనిషన్న వాడెవడైనా యిలా మాట్లాడతాడా.
“ఈ విషయంలో నానుండీ ఎలాంటి సహాయం కావాల్సివచ్చినా మొహమాటపడకుండా అడుగు. నేను కూడా నా సోర్సులు వుపయోగించి విషయం ఎందాకా వెళ్లిందీ కనుక్కుంటానే వుంటాలే”, భరోసా యిచ్చాడు ఆనందరావు.
“థేంక్యూ. నువ్వు ఈ విషయం గురించి మర్చిపో యిక. బయటివాళ్లని పెట్టి ఆరాలు తీయడం దేనికి. ఏదైనా తెలుసుకోవాలనుకుంటే సునీతనే డైరెక్టుగా అడుగుతా నేను”, బండి స్టాండు తీస్తూ అన్నాడు సురేష్. ఈ మీటింగ్ యింత త్వరగా ముగుస్తుందని వూహించలేదు ఆనందరావు.
“నువ్వెళ్లు సురేష్. నేనొక రెండు ఫోన్ కాల్స్ చేసుకోని చిన్నగా వస్తాలే”, అతని మాటల్లో అసహనం దాచినా దాగడం లేదు. “సరే” అని గేరుమార్చి బండిని రెండడుగులు ముందుకు పోనిచ్చిన సురేష్ మళ్లీ బ్రేకేశాడు, ఆనందరావ్ ఏదో చెపుతున్నట్టు అనిపించడంతో.
“నేను ఈ విషయం నీతో చెప్పినట్టు సునీతతో అనకు. నాకు మీ యిద్దరూ కావాల్సినవాళ్లే. ఈ యిష్యూలో తప్పు తనవైపు వుందని నేను నమ్మడం వల్ల నువ్వంటే సింపతీ వుంది నాకు. పొరపాటు నువ్వు చేసుంటే, ఆ విషయం సునీతకి చెప్పడానికి వెనకాడను నేను. తెలుసుగా నా సంగతి.”
తెలుసన్నట్టు నిలువుగా తలాడిస్తూ వెళ్లిపోయాడు సురేష్.
****
“స్కూల్ వర్క్ బోలెడంత పెండింగ్ వుండిపోయింది. ఈ ఒక్కసారికీ బాబాయి వాళ్లింటికి పోకపోతే ఏం పోయింది?”, పిల్లల మీద అరుస్తుంది సునీత.
“అదేంటి కొత్తగా? ఎప్పుడూ వుండేదేగా. ఈ టైమ్ కోసం వాళ్లెంతగా వెయిట్ చేస్తారో తెలిసి కూడా..”, అంటూ మధ్యలో ఆపేశాడు. సురేష్ వాళ్ల తమ్ముడు శివాజీ, మరదలు రమ్య కూడా అదే వూళ్లో వుంటారు. వాళ్లకీ యిద్దరు పిల్లలు. ప్రతి నెలా రెండో శనివారానికి ముందు రోజు రాత్రి శివాజీ వచ్చి అన్నయ్య పిల్లలిద్దర్నీ తన యింటికి తీసుకెళ్తాడు. సోమవారం ఉదయం వరకూ వాళ్లక్కడే వుంటారు. కుదిరితే ఆదివారం నాడు సురేష్, సునీత కూడా జాయిన్ అవుతారు. గత రెండు మూడేళ్లలో మహా అయితే ఒక నాలుగైదు సార్లు కుదరలేదేమో. హోం వర్క్ పెండింగ్ వుందనే కారణంతో సునీత పిల్లల్ని ఆపేయాలనుకోవడం సురేష్‌కి ఆశ్చర్యంగా అనిపించింది.
“నేనేదో మాట వరసకన్నాలే. అయినా…”, ఏదో చెప్పబోతూ, అప్పుడే లోపలికొస్తున్న శివాజీని చూసి ఆపేసింది సునీత. “బాబాయ్” అని పెద్దగా కేకలు పెడుతూ శివాజీని అల్లుకుపోయారు పిల్లలిద్దరూ. కాఫీలు, కుశల ప్రశ్నలు కానిచ్చి, పది నిముషాల్లో పిల్లల్ని తీసుకొని వెళ్లిపోయాడు శివాజీ.
రాత్రి పదిగంటలు కావొస్తోంది. బెడ్ రూమ్‌లో పడుకొని సునీత కోసం ఎదురుచూస్తున్నాడు సురేష్. పిల్లలు బాబాయివాళ్లింటికి వెళ్లే ఆ రెండు మూడు రోజులూ చాలా ప్రత్యేకం. మామూలుగా అయితే పిల్లలకి విడిగా పడుకునే అలవాటు లేదు. కొడుకు తల్లినీ, కూతురు తండ్రినీ అల్లుకోని పడుకోవాల్సిందే. సురేష్, సునీత క్లోజ్ గా వుండడానికి అవకాశం దొరికేది ఈ టైమ్ లోనే. అందుకే, చకచకా పనులు కానిచ్చేసి తొమ్మిదింటికల్లా పడకగదిలోకి వచ్చేస్తుంది సునీత. కానీ, ఈరోజెందుకో ఆలశ్యం అయ్యింది.
బెడ్రూంలోనుండీ బయటకొచ్చి కిచెన్‌వైపు తొంగిచూశాడు సురేష్. గ్రైండర్లో పిండి పడుతూ కనబడింది సునీత. అంటే, కనీసం యింకా అరగంట పైమాటే. ఏం మాట్లాడకుండా బాల్కనీలోకొచ్చి పాటలు వింటూ కూర్చున్నాడు. లోపల్నుండీ సునీత పని చేసుకుంటున్నట్లు గిన్నెల చప్పుడు వినబడుతోంది. అరగంట, గంట, గంటన్నర గడిచిపోయింది. సునీత పని యిప్పట్లో తెమిలేలా లేదు. లోపలికొచ్చి కళ్లు మూసుకొని పడుకున్నాడులే కానీ నిద్ర పట్టడం లేదు. కాసేపటికి మెల్లగా అడుగులు వేసుకుంటూ సునీత బెడ్రూంలోకొచ్చింది. చప్పుడు చేయకుండా చిన్నగా మంచం మీదకి వొరిగింది. నిద్ర పోయినట్టు నటిస్తోందిలే కానీ, ఆమె మెలకువతోనే వుందని సురేష్ కి అర్థం అవుతోంది. తనని అవాయిడ్ చేయడానికే సునీత కావాలని ఆలశ్యం చేసిందని తెలుస్తూనే వుంది. ఇలాంటి పరిస్థితి వాళ్ల మధ్య ఎప్పుడూ రాలేదు.
సునీతకి వేరే అతనితో శారీరక సంబంధం వుంది ఆనందరావు అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి.
“సునీతా” గుసగుసలాడుతున్నట్టు పిలిచాడు. ఆమె పలకలేదు. కానీ, తాను మెలకువతోనే వున్న విషయం దాయాలనే ప్రయత్నం కూడా చేయలేదు.
“సునీతా..”, ఈసారి ఊ కొట్టిందిలే కానీ తిరగలేదు.
“ఒక సారిటు తిరగవోయ్. నిన్నేమీ చేయన్లే”, అతని మాట పూర్తయ్యిందో లేదో పెద్దగా ఏడవడం మొదలెట్టింది సునీత.
“ఏయ్ ఏంటిది. ఊరుకో”, అన్నాడు. సునీత ఏడుపు యింకా పెద్దదయ్యింది. కట్టలు తెంచుకున్న ప్రవాహం లాగా భోరుమని ఏడుస్తోంది సునీత.
“ఇప్పుడేం మాట్లాడొద్దులే. పడుకో. ఒంట్లో బాగోలేదేమో కనుక్కుందామని వూరికే పిలిచా”, కంగారులో ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడం లేదు.
లేచి సురేష్ కి దగ్గరగా జరిగి, అతని ఛాతీ మీద తల పెట్టుకొని వెక్కిళ్లు పెడుతోంది సునీత.
“మా అమ్మగా, ఊరుకో. ఏమైందిప్పుడు. నువ్వు నాకేం చెప్పొద్దు. రేపొద్దున్నే వెళ్లి నానిగాణ్ని, పండూనీ తీస్కొచ్చేద్దాం సరేనా. ఇంకెప్పుడూ వాళ్లని ఎక్కడికీ పంపొద్దు.”
అతను ఓదారుస్తున్నకొద్దీ ఆమె ఏడుపు పెరిగిపోతోంది. ఏం చేయాలో పాలుపోక ఆమె వీపు నిమురుతూ వుండిపోయాడు.
తల పైకెత్తి, కాస్త దూరంగా జరుగుతూ, “సతీష్ తో నాకు సంబంధం వుంది”, వెక్కుతూనే చెప్పింది. సురేష్‌కి ఏం అనాలో అర్థం కాలేదు.
“ఇప్పుడా ముచ్చటెందుకు. తర్వాత మాట్లాడుకుందాం, పడుకో”, అన్నాడు.
“కాదు, నన్ను చెప్పనివ్వు. సతీష్ తెలుసుగా నీకు. మా అన్నయ్య ఫ్రెండు. రెండు నెలల క్రితం మా అన్నయ్య ఏదో పార్శిల్ పంపితే, యివ్వడానికి మనింటికొచ్చాడు. అప్పట్నించీ మెసేజ్‌లు పెట్టడం, కాల్స్ చేయడం చేస్తున్నాడు..”.
భర్త ఊ కొట్టడం లేదన్న సంగతి కూడా గమనించకుండా చెప్పుకుపోతోంది. “మొదట్లో నాకు యిబ్బందిగా అనిపించింది. కానీ, సతీష్ చాలా మంచోడు. నేనంటే చాలా యిష్టం. ఇదంతా తెలిస్తే నువ్వు బాధ పడతావని నాకు తెలుసు. కానీ, నీకు అబద్ధాలు చెప్పడం, నిన్ను మోసం చేయడం నా వల్ల కావడం లేదు. ఈ బరువు నేను మోయలేను”, మళ్లీ పెద్దగా ఏడవడం మొదలెట్టింది.
“ప్లీజ్. ఇక ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవొద్దు. పెళ్లికి ముందు తర్వాత నేను నీ పట్ల మరీ అంత లాయల్ గా లేనని నీకూ తెలుసు. కానీ, ఆ విషయంలో నువ్వెప్పుడూ నన్ను నిలదీయలేదు. ఎమోషనల్‌గానో, యింకో రకంగానో నేను వేరేవాళ్లతో సీరియస్‌గా యిన్‌వాల్వ్ అయిన సందర్భాల్లో.. వాటిల్లో నుండీ బయటకి రావడానికి కావాల్సిన స్పేస్ యిచ్చినందుకు నువ్వంటే నాకు చాలా రెస్పెక్ట్ వుంది. అదే కంఫర్ట్ యిప్పుడు నీకూ యివ్వడం నా రెస్పాన్సిబిలిటీగా ఫీలవుతున్నాను నేను. టేక్ యువర్ వోన్ టైమ్. అనసరానికి మించి గిల్ట్ ఫీలయ్యి, ఆ బరువుతో ఆరోగ్యం పాడు చేసుకోకు. మళ్లీ మనిద్దరం యిదివరకట్లాగా హ్యాపీగా వుండే టైమ్ వచ్చినప్పుడు.. మిస్ అయిపోయిన క్వాలిటీ టైమ్ గుర్తు చేసుకొని వుసూరుమనాలి”, చెప్పాడు సురేష్.
సునీత ఏమీ బదులు చెప్పలేదు. పది పదిహేను సెకన్లపాటు రెప్ప వాల్చకుండా భర్త కళ్లలోకి చూసి, అటుపక్కకి తిరిగి పడుకుంది.
*****
సునీతని బుజ్జగించడానికి తాను మాట్లాడిన మాటలు తల్చుకొని చాలాసార్లు ఆశ్చర్యానికి లోనయ్యాడు సురేష్. తను ఎందుకు అలా మాట్లాడాడు? సునీత వేరే అతనితో సంబంధం పెట్టుకుంది అనే వార్త తనని ఎంతగా కష్టపెట్టాలో అంత ఎందుకు కష్టపెట్టలేదు. తనకి భార్య మీద వుండాల్సినంత ప్రేమ లేదా? లేదా, మిగతా మగాళ్లందరి కన్నా భార్య మీద తనకి ఎక్కువ ప్రేమ వుండడం వల్ల ఆమెని క్షమించగలిగాడా? లేదా, తాను కూడా గతంలో యిలాంటి తప్పు చేసి వుండడం వల్ల అపరాధ భావనతో బాధపడుతూ, భార్య చేసింది సరైందే అనే భావనకి లోనవుతున్నాడా? తన ప్రవర్తన వెనక వున్న కారణం ఏంటో తనకే అర్థం కాకపోవడం సురేష్‌ని యిబ్బంది పెట్టింది.
అతనికి అర్థం కానిది యింకొకటుంది. అది తన మాటలకి సునీత రియాక్షన్. ‘నువ్వు చేసింది పెద్ద తప్పేమీ కాదు, అది నాకు తెలిసినందుకు గిల్టీగా ఫీలవ్వనవసరం లేదు’ అని తను భార్యతో చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుందని తాను వూహించాడు? ‘నీకు నేనంటే ప్రేమ లేదు. అందుకే నేను నీకు మాత్రమే సొంతం కావాలన్న పొజెసివ్‌నెస్ లేదు’, అని దెబ్బలాడి వుండాలి. లేదంటే, ‘నువ్వెంత మంచివాడివి. నీలాంటి వాడికా నేను ద్రోహం చేయాలనుకున్నది’, అని ప్రేమతో అల్లుకుపోయి వుండాల్సింది. ఈ రెండూ కాకుండా భార్య ముభావంగా వుండిపోవడం సురేష్‌కి మొదట్లో అయోమయంగా అనిపించింది. ఒక రెండు మూడు నెలల తర్వాత అతని సందేహాల్లో కొన్నిటికి సమాధానాలు దొరకడం మొదలైంది.
సునీతకి సతీష్ అంటే వున్నది కేవలం ఆకర్షణ మాత్రమే కాదు. అనుకోకుండా తారసపడి, తటపటాయిస్తూనే దగ్గరయ్యి, నాలుగైదు సార్లు ఏకాంతంగా కలుసుకొని, కాక చల్లారాక వొకరినొకరు తప్పుబట్టుకొని, ఎవరిదారిని వాళ్లు పోయే నార్మల్ రిలేషన్ కాదు వాళ్లిద్దరిదీ. సతీష్ సునీతలో ఏం చూశాడో కానీ, తన భార్య మాత్రం అతనిలో వొక ఐడియల్ హజ్బెండ్‌ని చూస్తోంది. ఇన్నాళ్లూ తమ దాంపత్యంలో మిస్ అయిందేదో అతని సమక్షంలో పొందగలుగుతోంది. అన్నిటికన్నా ముఖ్యమైందేంటంటే అసలు సతీష్‌తో వున్న రిలేషన్ తెంచుకోవాలనే ఆలోచన ఆమెలో ఏకోశానా లేదు. ఈ క్లారిటీ వచ్చాక సురేష్‌లో అయోమయం యింకా ఎక్కువైంది. ఇప్పుడు తన పాత్ర ఏంటి? భర్తగా తాను ఫెయిల్ అయ్యాడన్న సంగతి గుర్తించి, భార్య జీవితంలో వెలితి తాత్కాలికంగానైనా పూడినందుకు సంతోషించాలా, లేదూ తిరిగి భార్య మనసు గెలుచుకోడానికి ప్రయత్నించాలా అన్నది అతనికి అర్థం కాలేదు. తన అసమర్థతని ఆదర్శంగా భ్రమపడుతూ తాను ఆత్మవంచన చేసుకుంటున్నాడా?
ఇంటిపెద్దగా తన బాధ్యతలు యాంత్రికంగా చేసుకుపోతున్నాడు. కానీ, భార్య రోజురోజుకీ తనకి దూరం అయిపోతోందన్న సంగతి మాత్రం అతనికి క్లియర్‌గా తెలుస్తూనే వుంది.
*****
“శూన్యంలోకి చూడ్డం ఆపి సంగతేంటో తెముల్చుతావా లేదా”, గద్దించాడు ఆనందరావు.
“నీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. సాయంత్రం ఫ్రీగా వుంటావా”, అని సురేష్ కాల్ చేసి అడిగినప్పటినుండీ ఆనందరావు మనసు ఆనందంతో గంతులేస్తోంది. సునీత ఎఫైర్ గురించి తాను చెప్పినప్పుడు నిర్వికారంగా పోజులు కొట్టిన సురేష్ కి యిప్పుడు తనతో అవసరం పడడం ఆనందరావుకి చాలా సంతోషాన్నిచ్చింది. ఏం మాట్లాడడానికి సురేష్ తనని కలవాలనుకున్నాడో అర్థం కానట్టు నటించడాన్ని పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆనందరావు.
“సునీతా నేనూ కలిసుండడం యిక యింపాజిబుల్ అనిపిస్తోంది. తనకి యిష్టమైతే డివోర్స్ కి అప్లై చేద్దామనుకుంటున్నాను”, బాధగా అన్నాడు సురేష్.
భార్యని ముగ్గులోకి దింపినవాణ్ని చితక్కొట్టించడం ఎలా అని కానీ, భార్యని లొంగదీసుకోడానికి చిట్కాలేమిటో చెప్పమని కానీ అడక్కుండా సురేష్ విడాకుల ప్రస్తావన తీసుకురావడం ఆనందరావు వూహించనిది.
“పిచ్చివాగుడు వాగకు. మనుషులన్నాక వొకటీ అరా తప్పులు చేయడం సహజం. ఆమాత్రం దానికి కట్టుకున్న భార్యని నడిరోడ్డు మీద వదిలేస్తావా. మీ యిద్దరి సంగతీ సరే. పిల్లల గతి ఏమవుద్దో ఆలోచించావా”, గద్దింపు స్వరంతో అన్నాడు ఆనందరావు.
“సునీతని వదిలేయడమో, వదిలించుకోవడమే చేయాలనుకోవట్లేదు నేను. నాతోకన్నా ఆ సతీష్‌తోనే తను సంతోషంగా వుంటుంది అని అనిపిస్తోంది నాకు. తన వయసెంత. పట్టుమని ముప్పయ్యేళ్లు కూడా లేవు. ఇంకా బోలెడు జీవితం వుంది ముందు. ఇకనైనా తనకి నచ్చినవాడితో వుండడం కరెక్ట్ కదా?”, సురేష్ గొంతులో బాధ దాగడం లేదు.
సురేష్‌లో శారీరకంగా ఏదో లోపం వుందనీ, ఆ విషయం కప్పిపుచ్చుకోడానికే పొంతనలేని మాటలు చెపుతున్నాడనీ ఆనందరావుకి తోచింది. ఆ విషయమే డైరెక్టుగా అనేశాడు.
“అదేంటీ. సునీతంటే నాకు ఎంతిష్టమో నీకు తెలీదా? నాలో లోపం వుంటే తప్ప, తను సంతోషంగా వుండే పని చేయాలని నేను అనుకోకూడదా?”, తెల్లబోతూ అడిగాడు సురేష్.
“భార్యని సంతోషపెట్టాలంటే యింటికెళ్లేటప్పుడు పూలు కొని పట్టుకెళతారు. లేదంటే చీరలో బంగారమో కొనిపెడతారు. అంతేకానీ, విడాకులిచ్చి, దగ్గరుండి వేరేవాళ్లతో పెళ్లి చేయరు నాకు తెలిసినంతరవకూ”, వెటకారంగా అన్నాడు ఆనందరావు.
“నువ్వేమైనా అనుకో. నేనైతే వొక నిర్ణయానికొచ్చేశాను. ఇక పిల్లలంటావా. అది సునీత యిష్టం. తన దగ్గర వుంచుకుంటానన్నా సరే. నన్ను వుంచుకోమన్నా సరే. ఇద్దరు పిల్లలూ వొకేచోట పెరగాలన్నది నా కోరిక. నేనైనా, తనైనా పిల్లలకి ఏ లోటూ రానివ్వం. పిల్లలు నా దగ్గర వుండిపోతే వాళ్లు తల్లిని మిస్ అవ్వకుండా రోజూ ఆమె దగ్గరకి పంపి తీరతాను. పిల్లల్ని తనే వుంచుకుంటే సునీతైనా వాళ్లని నాకు దూరం చేయదనే నమ్మకం నాకుంది”, అన్నాడు సురేష్. అతని మాటల్లో భార్యపట్ల ఎలాంటి కోపం ధ్వనించడం చూస్తే ఆనందరావుకి పిచ్చెక్కిపోతోంది.
“అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నట్టున్నావ్ గా. మరి నన్నెందుకు పిలిచినట్టు?”, వెర్రిమొహం పెట్టుకొని అడిగాడు ఆనందరావు.
“నా వుద్దేశం యిలా వుందీ అని నేను సునీతతో అనలేదు. డైరెక్టుగా అనలేను కూడా. నువ్వోసారి తనతో మాట్లాడి, విడాకులు తీసుకోవడం తనకి యిష్టమో కాదో కనుక్కో. ఇష్టమే అంటే ఆ పనేదో ఎంత త్వరగా కానిస్తే అంత మంచిది”, చెప్పాడు సురేష్.
“ఇష్టం కాకపోతే?”, అడిగాడు ఆనందరావు.
“కాకపోతే యింకేముంటుంది? ఇలాగే కంటిన్యూ అవ్వడమే..”, అసలు యిదొక ప్రశ్నా అన్నట్టు చెప్పాడు సురేష్.
ఇక తను ఏం చెప్పినా వుపయోగం లేదని ఆనందరావుకి అర్థమైంది. ఒక రెండు నిముషాలు ఆలోచించి,
“సరే, నువ్వంత గట్టిగా డిసైడయ్యాక చేసేదేముంది. సునీతతో రేపే మాట్లాడతా. ఈలోగా నీ నిర్ణయం మార్చుకుంటే నాతో చెప్పు”, అన్నాడు. సురేష్ బదులివ్వకుండా మౌనంగా వుండిపోవడాన్ని బట్టి అతని నిర్ణయం మారేది కాదని తెలిసిపోతూనే వుంది.
*****
“పెద్దసారు గారికి మామీద సడెన్‌గా కనికరం కలిగిందేంటో” ఆనందరావుని ఆటపట్టించింది సునీత. మామూలుగా అయితే ఆమె మాటల్ని కాంప్లిమెంట్ గా తీసుకొని హ్యాఫీగా ఫీలయ్యుండేవాడు ఆనందరావు. కానీ, తాను వచ్చిన పని తాలూకూ సీరియస్‌నెస్ వల్ల ఎప్పటిలాగా వుండలేకపోతున్నాడు. కాసేపటికి సునీతకి అర్థమైంది అతనేదో యింపార్టెంట్ విషయం మాట్లాడ్డానికి వచ్చాడని. కాఫీ కలిపి తీసుకొచ్చి, ఆనందరావు ఎదురుగా వున్న సోఫాలో సెటిలౌతూ, “చెప్పు ఏంటి సంగతి”, అడిగింది.
ఏదో చెప్పబోతున్నట్టు వొకట్రెండుసార్లు ఎక్స్ప్రెషన్ యిచ్చి మళ్లీ ఆగిపోయాడు ఆనందరావు.
“ఏంటి సంగతి. ఎవరితోనైనా ప్రేమలో పడ్డావా? కొంపదీసి నేను మీడియేటర్‌గా వుండాలా ఏంటీ కర్మ”, పగలబడి నవ్వుతూ అంది సునీత.
“ప్రేమనేది మళ్లీ మళ్లీ పుట్టేది కాదు. నేను లవ్ లో పడింది వొక్కసారే. అదీ నీతోనే”, సీరియస్‌గా అన్నాడు ఆనందరావు.
“ఇప్పుడేమంటావ్? కొంపదీసి మా ఆయన్ని వదిలేసి నిన్ను కట్టుకోమంటావా?”, మళ్లీ పగలబడి నవ్వింది సునీత. నిజానికి ఆనందరావు రాసుకొచ్చిన స్క్రిప్టు వేరు. కానీ, సునీత కామెడీ చేయాలని చూడడంతో అనుకోకుండా ట్రాక్ అంతా మారిపోయింది.
“అవును. మీ ఆయన్ని వదిలేసి నాతో వుండమని అడగడానికే వచ్చాను. సురేష్‌తో నువ్వు సుఖపడలేవని నాకు మొదట్నించీ తెలుసు. నా ప్రేమ సంగతి తెలిసికూడా వాణ్ని చేసుకున్నావ్ నువ్వు. ఇప్పడు చూడు, నీకు వేరేవాడితో రంకుకట్టి నిన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. పైగా, అదంతా నిన్ను వుద్ధరించడానికే అన్నట్టు వెధవ పోజూ వాడూ. నీకు ఆ సతీష్ గాడితో.. సతీషేనా? అవుననుకుంట. సతీష్‌తో నీకున్నది వుత్త ఫ్రెండ్‌షిప్పే అని నాకు తెలుసు. అది అర్థం చేసుకునేంత లిబరల్ కాదు నీ మొగుడు. జరిగిందేదో జరిగిపోయింది. నీ లైఫ్‌లో వున్న వేక్యూమ్ గురించి తెలిసి కూడా యిన్నాళ్లూ నోరు మూసుకోని వుండడం నాదే తప్పు. ఇకనుండీ మనిద్దరం వొకటి. నువ్వు సతీష్‌తో క్లోజ్‌గా వుంటావా, హరీష్‌తో క్లోజ్‌గా వుంటావా అన్నది నీ యిష్టం. ఆ విషయంలో నేను నిన్ను ఎప్పటికీ క్వశ్చన్ చేయను. ఇక సురేష్‌గాడంటావా. వాడిని ఎలా బురీడీ కొట్టించాలో నాకు బాగా తెలుసు. మనిద్దరం వొక మాట మీద వున్నామంటే బ్రహ్మదేవుడు కూడా…”, మధ్యలో బ్రేక్ పడితే మర్చిపోతానేమో అన్నట్టు, ఆపకుండా గడగడా చెప్పుకుపోతున్నాడు ఆనందరావు.
“…. కనిపెట్టలేడు. నాకు పాలిటిక్స్ తప్ప సరసం తెలియదనీ, ఆ సురేష్ గాడేదో పెద్ద పోటుగాడనీ నువ్వు పొరపాటు పడ్డావ్. తప్పు నీది కాదులే. రెండు జెళ్ల సరోజ, కళ్లజోడు కామేశ్వరి యింకా టచ్‌లో వున్నారా? ఉంటే వాళ్లని వొకసారి కదిలించి చూడు. ఫేర్‌వెల్ పార్టీ జరిగిన నైట్ నేనెలా రెచ్చిపోయానో చెపుతారు. సరే నేనంటే ఏదో సిద్ధాంతాలు, థియరీలు పెట్టుకుచచ్చాను కాబట్టీ అన్నీ మూసుకోని కూచున్నా. నువ్వైనా వొక్కమాట కదిలించి వుండకూడదా నన్ను. తీరని కోరికలతో యిన్నాళ్లూ ఎలా వేగిపోయావో తల్చుకుంటే నన్ను నేను చెప్పు తీసుకొని కొట్టుకోవాలన్నంత కోపం వస్తోంది నాకు…”
అతను వాక్యం పూర్తి చేసీ చేయకముందే సునీత కుడిచేతిలో వున్న చెప్పు అతని ఎడమ దవడని తాకింది. ఏం జరుగుతుందో అతనికి అర్థమయ్యేలోగానే ఆపకుండా మళ్లీ మళ్లీ టపాటపా వాయించేసింది సునీత. చెప్పు కింద పడేసి ఏదో చెప్పిందిలే కానీ, ఆ మాటలేవీ అనందరావు చెవిలో పడలేదు.
****
“నువ్వు చెప్పింది కరెక్టే. ఆవిడ గారికి సెకండ్ హీరోని వదులుకునే వుద్దేశం లేదు”, కోపంగా అన్నాడు ఆనందరావు. సెకండ్ హీరో అంటే సతీష్ అని అర్థమవుతూనే వుంది.
“మరి విడాకులు?”, ఆతృతగా అడిగాడు సురేష్.
“విడాకులు యివ్వదట. అలాగని వాణ్ని వదలదట. అక్కడికీ నేను నెత్తీనోరూ బాదుకొని….”
‘విడాకులు యివ్వదట’ అన్న రెండు పదాల దగ్గరే ఆగిపోయాడు సురేష్. ఆ తర్వాత మాటలేవీ అతని చెవిని చేరలేదు. ఆనందరావుని బలంగా హత్తుకొని, అతని కుడిచెంపమీద ముద్దు పెట్టుకొని, సంతోషంగా విజిలేసుకుంటూ వెళ్లిపోయాడు సురేష్. పొద్దున చెప్పుతో కొట్టించుకున్న ఎడమ దవడ కన్నా.. తాజాగా ముద్దు పెట్టించుకున్న కుడిచెంప ఎందుకు ఎక్కువ నొప్పెడుతుందో అర్థం కాని కోపంలో యింకో సిగిరెట్ వెలిగించాడు ఆనందరావు.
*
Narration 💯. Story novel.
Super story.
A different story. Narration also good.
కథను చెప్పే విషయంలో రచయిత గొప్ప టెక్ నిక్ ఉపయోగించారు.మూసతరహా కథలకు భిన్నంగా కథను అందించిన రచయిత కు ధన్యవాదాలు, శుభాకాంక్షలు.
—డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ జిల్లా.
చాలా బాగుందండి…
సినిమాగా తీయగలిగే కథ..
రొటీన్ స్టోరీలకి భిన్నంగా….
కథ,కథలో పాత్రలూ.. మీరు రాసిన తీరు అధ్బుతంగా ఉంది…
కనీసం షార్ట్ ఫిలింగా అయినా తీయండి లేదా…ఇదే లైన్ పై నవల అయినా రాయండి…
..
చదివించే కథనం. కానీ ఎందుకో నాకు పూర్తిగా అర్థం అయినట్టనిపించలేదు. బహుశా నాకు ఆ స్థాయి లేదేమో! “సతీశ్ లో ఐడియల్ భర్తను చూస్తోంది.” అలాంటప్పుడు సురేశ్ ఏమిటన్నట్టు? సురేశ్ కి అర్థం గానట్టే నాకూ అర్థం గాలేదు. లేదూ… వివాహానికి విలువ లేనట్టా? ఒకవేళ సతీశ్ కావాలనుకుంటే, సురేశ్ తో విడిపోయి ఫ్రెండ్ గా ఉండకూడదా? సురేశ్ కి క్లారిటీ ఉందిగా? చివరికి సురేశ్ కి కలిగిన సంతోషమెందుకో… అయోమయంగా ఉంది.
చదివించే కథనం. కానీ ఎందుకో నాకు పూర్తిగా అర్థం అయినట్టనిపించలేదు. బహుశా నాకు ఆ స్థాయి లేదేమో! “సతీశ్ లో ఐడియల్ భర్తను చూస్తోంది.” అలాంటప్పుడు సురేశ్ ఏమిటన్నట్టు? సురేశ్ కి అర్థం గానట్టే నాకూ అర్థం గాలేదు. లేదూ… వివాహానికి విలువ లేనట్టా? దీనికీ పిల్లలను శివాజీ ఇంటికి పంపకపోవడానికి సంబంధం?
ఒకవేళ సతీశ్ కావాలనుకుంటే, సురేశ్ తో విడిపోయి ఫ్రెండ్ గా ఉండకూడదా? సురేశ్ కి క్లారిటీ ఉందిగా?
చివరికి సురేశ్ కి కలిగిన సంతోషమెందుకో… అయోమయంగా ఉంది.