మీనూ సెల్వా 

సెల్వా, ఇక్కడ ఎంత హాయిగా వుందో చూశావ్ , పచ్చగా, రంగురంగుల పూల మొక్కలూ, వాటితో పోటీ పడే సీతాకోక చిలుకలు, పైన దూది మబ్బులు నిండిన నీలి ఆకాశం, నిర్మలమైన గాలీ”

” ఔను మీనూ, ఇక్కడ మనకి అడ్డు చెప్పే వాళ్ళెవళ్ళూ లేరు. ఈ ప్రదేశం అంతా మనదే, ఈ నేలా , ఈ మబ్బూ, ఈ నీరూ, ఈ గాలీ ఇదే మన ఇల్లు, ఇదే మన కాపురం.. ”

” మాట ఎంత గట్టిదో, నీ ప్రేమ అంతకన్నా గట్టిదని తెలిసిపోయాక, నీ చేయి గట్టిగా పట్టేసుకున్నా సెల్వా”

***

” వొశేవ్ ఎక్కడ చచ్చేవే, కంపు భరించలేక పోతున్నా.”

” అగరొత్తులు వెలిగించమంటావా.. ”

” కొరివొకటి పట్టుకొచ్చి నా నెత్తి మీద పెట్టి నన్ను తగలెట్టు , చచ్చి వూరుకుంటా.. ”

” పొద్దున్నే ఏంటమ్మా ఆ మాటలు, నాకు కాలేజీ కి టైమవుతోంది. టిఫిన్ బాక్సులో అంత తిండి పెట్టివ్వు, నేను బయల్దేరాలి…ఇదుగో , ఒకటికి నాలుగు అగరొత్తులు వెలిగించా , సై కిలు బ్రాండుది, అమెరికా లో కూడా ఇది ఫేమస్ ట.”

” అఘోరించావ్ .. ఆ ఫాన్ మరికొంచెం ఫాస్ట్ గా తిరగనివ్వు. ముక్కులు వాసి పోయాయి. మూడ్రోజుల్నించి నెత్తి బాదుకుంటున్నా. నా మాటేవన్నా వింటాడా నా మొగుడు. ఆ మనిషికి తగ్గ కూతురే అనిపించావ్ … ఐనా తెలీకడుగుతా మీ నాసికలకి బొక్క లున్నాయా అని.”

” అరవకే, ఈ వాసనంతా మనదేగా, పక్కింటి వాళ్ళది కాదుగా..”

” హా, మనదే మరి, రోజుకి మూడు సార్లు ముక్కుతాడు, మీ అబ్బ.. ”

” నీకు కాన్స్టిపేషను, మూడురోజులు ఎలా ఆపుకుంటావే బాబూ .”

” ఇదుగో ఇవాళ నువ్వు కాలేజీ కి వెళ్ళవు. మర్యాదగ ఫోను కొట్టి వాళ్ళని వెంటనే రమ్మను. ”

” నాన , నాలుగు సార్లు చేశారు , వాళ్ళు బిజీ ”

” నువ్వు కాల్ చెయ్, ఇప్పుడే, ”

” నేను కాలేజీ కెళ్ళాలే, ఇవాళ మాకు సెమినారుంది. ”

” నిన్ను పంపనన్నానుగా. ముందు ఫోన్ చెయ్. ”

” నీతో ఎలా చావాలే అమ్మా, ఇదుగో చేస్తున్నా, … హలో .. నేను మూడో మాడ వీధి, పన్నెండో నంబర్ నుంచి

మాట్లాడుతున్నానండీ. మా సెప్టిక్ టాంక్ ఫుల్ అయిందండీ. మీకు కంప్లైంట్ పెట్టాం కూడా, ఓవర్ ఫ్లో అవుతోందండీ, అర్జెంట్.”

” వొస్తారట్నా .. ఏ వన్నారే…?

” కంప్లైంట్ నంబర్ ఇచ్చారు. ట్వెంటీ ఫోర్ అవర్స్ లో వస్తార్ట.”

” పోయి, గోతి లో దూకి చావ మనక పోయావ్. వాళ్ళనేమనేం, మన నెత్తులు బాదుకుని మనం చావాల్సిందే,

పెళ్ళయిన కాడినించి మొత్తుకుంటూనే వున్నా, ఈ కొంప నాకిష్టం లేదన్నాను, విన్నాడా నా మొగుడు.. రెండు మూడేళ్ళలో ట్రాన్స్ఫర్ ఖాయం, వేరే వూరెళతాం, మంచి ఫ్లాట్ లో దిగుతాం, ఇదిగో మల్లె పూల చెండు, జడలో తురుముకో అన్నాడు. సరే, నువ్వు పుట్టాకన్నా ఇల్లు మారదాం అంటే, ప్రమోషన్ రానీ చూద్దాం అని ఫైళ్ళు చంకలో పెట్టుకుని మోపేడ్ తొక్కుకుంటూ జారిపోతాడు. ఏలా చావలే ఈ మనిషి తో.. ఒశేవ్ మీనాక్షీ, మీనూ తల్లీ, నా బంగారువి కదూ, నీ కాళ్ళట్టుకుంటా, ఆ ఖర్మ ని క్లీన్ చేయించు.. చచ్చి నీ కడుపున పుడతా.. ”

“ఏంటే అమ్మా .. లె లే .. ”

” మడీ ఆచారం . శుచీ , శుభ్రం వున్న కులమే మనది. గడప కవతల కాలవ కట్టి పారుతుంటే, దాన్ని చూళ్ళేక పోతున్నానే, వాసన తలని బద్దలు చేస్తోందే.. ”

” అమ్మా, వూరుకో, వాళ్ళని రప్పిస్తాను. క్లీన్ చేపిస్తాను. నేను ఇవాళ కాలేజ్ కి వెళ్టం లేదు. కళ్ళు తుడుచుకో.”

***

” ఎవరండీ మీరు? ”

” నమస్తే అంకుల్. నేను మాడ వీధుల్లో వుంటాను, రంగాచారి గారి అమ్మాయిని. ”

” లోపలికి రండమ్మా, How may I help you? ”

” అంకుల్, మీ ఫ్లాట్స్ టాంక్ క్లీనర్స్ ఎవరండీ.. ?”

“ప్రైవేట్ క్లీనర్స్ వున్నారమ్మా. మేము మునిసిపల్ వాళ్ళని పిలవం అమ్మా. పిలిచినా రారు. ప్రైవేట్ వాళ్ళని బుక్ చేస్తాము. కొంచెం డబ్బు ఎక్కువే ఇవ్వాలి. ”

” వాళ్ళ నంబర్ ఇస్తారా అంకుల్. ”

” ష్యూర్..”

* **

“నమస్తే మేడం .. నా పేరు సెల్వరాజ్, క్లీనింగ్ టాంకర్స్. ”

“ఓహొ హో. .. సెప్టిక్ టాంక్ క్లీన్ చేస్తారా.. ”

” ఔనండీ, టాంక్ ఓపెన్ చేసి హోస్ దించమంటారా. మీరు తలుపులేసుకోండి. కిటికీ తలుపులు కూడా, జస్ట్ ట్వెంటీ మినిట్స్, మోటర్ తో తోడేస్తాను..”

“ఓకే కానివ్వండి, ……అమ్మా , ఆ కిచెన్ కిటికీ మూసేయవా.. ”

“అలాగలాగే, వొచ్చారా ..చొక్కనాధా, కరుణించావయ్యా.. ఎంతివ్వాలేం, నాలుగొందల యాభై యేనా ?”

” వెయ్యిన్ని రెండొందలు.”

” వెయ్యిన్నీ రెండొందలా.. మొన్నంతివ్వలేదే, ?”

” అది మునిసిపాలిటీ ఫీజు, ఇది ప్రయివేట్ క్లీనర్స్. వీళ్ళకి ఎక్కువే ఇవ్వాలి. ”

” ప్రయివేటోళ్ళా .. వాళ్ళెందుకొచ్చారిక్కడా.. ”

” నేనే రమ్మన్నాను. నీ పోరు భరించలేక, ఆ అవతల ఫ్లాట్స్ లో ఒకరింటికెళ్ళి, నంబర్ అడిగి ఫోన్ చేసి రమ్మన్నాను, ఎంత క్విక్ గా రెస్పాండ్ అయ్యారో..!”

” మునిసిపాలిటీ వాళ్ళెక్కడ చచ్చారేం …?”

” ఏమో గానీ, ముందు నువ్వు డబ్బు రెడీ చెయ్, మోటర్ ఆగింది .. క్లీనింగ్ ఓవర్ అనుకుంటా..”

” డబ్బులివ్వక తప్పుతుందా.. వొస్తా నుండు. నా పోపు డబ్బా మొత్తం ఖాళీ. ”

” హలో .. మేడం, క్లీనింగ్ అయిపోయింది. మీరు తలుపులు తెరుచుకోవచ్చు. ”

” థాంక్యూ సెల్వరాజ్ ”

” మీరొక బక్కెట్ వాటర్ ఇస్తే, ఇంటి ముందు కడిగి శుభ్రం చేస్తానండీ. ”

” వెరీ నైస్ ఆఫ్ యూ, వాటర్ తెస్తానండీ. ”

” మేడం, మీకో విషయం చెప్పాలి. ఈ ఇంటి టాయ్లెట్ పైపూ, వాష్ రూం పైపూ రెండూ సెప్టిక్ టాంక్ లో ఓపెన్ అవుతున్నాయి, అందువల్ల, టాంక్ తొందరగా నిండిపోయి ప్రతి రెణ్ణెల్లకీ క్లీన్ చేయాల్సి వుంటుంది కదా. ”

” అదే నండి మా ప్రాబ్లం. ఇది మా సొంతిల్లు కాదండీ ,అద్దె కొంప….! ప్చ్. వి కాంట్ హెల్ప్. ఇదుగోండి మీ డబ్బులు.”

” థాంక్ యూ మేడం. కాల్ చేయండి. ఎనీ టైం మేడం ”

” మేడం , మేడం అని పిలవకండి సెల్వరాజ్, నా పేరు మీనాక్షి, ”

” నైస్ నేం మీనాక్షి మేడం. నైస్ మీటింగ్ యూ. ప్లెషర్ సర్వింగ్ యూ. థిస్ ఈస్ ఫస్ట్ టైం ఐ కం టు దిస్ ఏరియా. ”

” ఏం చదువుకున్నారు సెల్వరాజ్. చక్కగా మాట్లాడుతున్నారు…?”

” బీ యెస్ సీ , బయో కెమ్ . స్వంతంగా ఈ జాబ్ సెటప్ చేసుకున్నానండీ. ఇదే నా బ్రెడ్ విన్నర్, కొంత సొసైటీ కి సర్వీస్ కూడా .. ”

” వెరీ గుడ్. వాటెబవుట్ యువర్ ఫామిలీ.? ”

” ఐ యాం ఎ బాచెలర్. మా అమ్మా , నేనూ, “మేల అనుప్పనది “ఏరియా లో, మా ఇల్లు. పక్కనే నా టాంకర్ షెడ్డు. మీ ఏరియా కి అవతల నా సర్విస్ ఏరియా, స్మాల్ ఇన్ కం .. బట్ ఐయాం హాపీ. ”

” వావ్ .. సీ యూ అగైన్ సెల్వరాజ్, బై బై. ”

” ఒశేవ్, డబ్బులిచ్చి పంపేయకండా , వాడితో ఏంటే కబుర్లూ..?

” చాలా మంచి కుర్రాడే, హి ఈస్ ఎ గ్రాడ్యువేట్.. అతడు చేసేది ఏమీ …మీన్ జాబ్ కాదు. ప్రజలకి సర్వీస్ చేస్తున్నాడు, ”

” చాల్లే, వూరికే చేస్తున్నాడా.. ?”

” గడప ముందు, పేరుకు పోయిన కంపునీటిని చీపురు తో కడిగి శుభ్రం చేశాడు, చూశావు గా.. రా చూడూ ఎంత నీట్ గా వుందో, ..”

” సడే లే, పోయి మొహం కాళ్ళూ చేతులూ కడుక్కు రా, అన్నం తిందువు గాని.. ”

” హలో.. ఎవరండీ.. ”

” మునిసిపల్ ఆఫీస్ .. మీ కంప్లైంట్ నంబర్ SE.. 263278.. హోల్డ్ లో వుంది.. నెక్ష్ట్ ట్వెంటీ ఫోర్ అవర్స్ లో ……..”

” హలో , మా కంప్లైంట్ కాన్సిల్ చేయండి..”

**********

“నాంగారూ, పొద్దున్న సెప్టిక్ టాంక్ క్లీన్ చేపించాం. ”

” మునిసిపాలిటీ వాళ్ళొచ్చారా..?”

” ప్రైవేట్ సర్విస్ కి కాల్ చేసి పని పూర్తి చేయించాం నాంగారూ.. ”

” ఎక్కువ చార్జ్ చేశుండాలే.. మీ అమ్మ ఒప్పుకుందా.. ”

” ఒప్పుకోక తప్పుతుందా.. చెప్పండి, నా ముక్కులు వాసిపోయినాయి, నా పోపుల డబ్బా కాస్తా చిల్లు.”

” సర్లేవే .. అరవమాకు, నా చెవులు వాసిపోతున్నాయి. ఎంతిచ్చావో చెప్పేడువ్, పైనెల ఇంక్రిమెంట్ రాగానే నీ పోపుల డబ్బా నింపేస్తా.. ”

” ఓ యబ్బో.. అవునూ, నాకు తెలీక అడుగుతా, ప్రెతీ సారీ,ప్రెతీ దానికీ ఇంక్రిమెంట్ డబ్బుల్తో తీర్చేస్తానంటారే.. .. ఇంతవరకు ఆ ఇంక్రిమెంట్ చిల్లిపైసా నే చూసెరగను కదా.. ? ఇంతకీ మీ జీతం బత్తెం గురించి ఒక్క మాటైనా నాకు చెప్పారా.. నెలకి వెయ్యి రూపాయలు నా మొహాన పడేసి సరుకులు తెచ్చి సంసారం చెయ్యమంటారే.. మీతో ఎలా ఏడ్చేదండీ.. ”

” ఎహేమీ ఏడవొద్దు గాని, ఓ కప్పుడు కాఫీ నా మొహాన పొయ్యి ఫో.. ”

” పొస్తా.. పోస్తా.. ఒశేవ్ .. ఏంటా చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వులూ, మొహం వాచిపోద్ది జాగ్రత్త..”

” ఓకే .. కీప్ కూల్.. మమ్మీ. నాంగారికి కాఫీ పట్రా పో.. బై ది వే.. నాంగారూ.. మనింటి అవుట్లెట్ పైపులు రెండూ సెప్ టాంక్ ని నింపుతున్నయన్నాడు , ఆ క్లీనర్ అబ్బాయి.. వాటిని సెపరేట్ చెయ్యమని సలహా చెప్పాడు. ”

” అది మనం ఎలా చేయం రా .. ఎక్కడో నెలకోటలో వుండే ఇల్లు గల్లాయన చేయాలి. అది కుదుర్తుందంటావా.. ?”

” అయితే మనం ఇల్లు ఖాళీ చేయడం బెటరేమో.. ప్రతీ రెణ్ణెల్లకీ సెప్ టాంక్ క్లీనింగ్ మనీ వేస్ట్ కదా..? ”

” ఖాళీ చేసి , బ్రాహ్మలం మనం ఎక్కడికి వెళ్ళి సర్దుకో గలం.. ?”

” సర్దుకో గలగాలి నాంగారూ.. సొసైటీ మార్తోంది , మనమూ అడ్జస్ట్ కాపోతే ఎలా.. ”

” ఏమో తల్లీ.. నా వల్ల కాదు. పోయి చదువుకో పో.. ”

**********

” హై .. సెల్వా. నువ్వు మా ఇంటికి సెప్ టాంక్ కారణంగా రావడం ఇది నాలుగో సారి..”

” అవును .. ఒక ఏడాది ఇట్టె గడిచి పోయింది మీనూ.. ”

” ఈ వాట్సాప్ గ్రూప్ లో మనిద్దరమే.. ఎండ్ టు ఎండ్.. కదా.. ”

” జస్ట్ మనిద్దరమే.. ”

” సెల్వా .. నీతో ఓ ముఖ్య మైన విషయం చెప్పాలి.. నాకు పెళ్ళి సంబంధం కుదిరేలా వుంది. ఎవరో మేట్టు పాళెం మనిషి. గవర్న్మెంట్ ఉద్యోగి. ఫోటో చుపించారు. నాకంటే పన్నెండేళ్ళు పెద్ద .బట్ట తల . నాకు నచ్చలేదు. ”

” నీ కిష్టం లేదని చెప్పేయ్.. ”

” చెబితే మా నాన్న చాలా కష్ట పడతాడు. ఇలాంటి సంబంధం ఇంకోటి దొరకడం కష్టం అని కేకలేస్తుంది మా అమ్మ. ఏం చెయ్యాలో ఎలా తప్పించుకోవాలో తెలియ లేదు సెల్వా ”

” నాకిచ్చి పెళ్ళిచేయమని మీ నాన్న గారిని అడగనా..”

” వొద్దు సెల్వా. నేను నిన్నిష్ట పడుతున్నానని తెలిస్తే.. మా అమ్మా నాన్న ఏమవుతారో వూహించలేను. మా కులం కట్టుదిట్టాలు మమ్మల్ని వెలి వేస్తారు. ”

” అయితే మీనూ, నాతో వచ్చేయ్. ఈ వూరొదిలి వెళ్ళి పోదాం. దూరంగా .. ఏవ్వరూ మనల్ని కనిపెట్ట లేనంత దూరంగా.. ”

” మీ వాళ్ళొప్పుకుంటారా.సెల్వా . ”

“వొప్పుకోరు. అయితే మా అమ్మ వొప్పుకుంటుంది. అది చాలు. నాకు. ”

” నన్ను కట్టి కాపాడుకుంటావా…? ”

” నీ కోసం ఏదైనా చేస్తాను మీనూ..”

” హహహ.. మనం సినిమా డైలాగులు మాట్లాడుకో లేదు కదా.. ?”

” నో …ఐయాం సీరియస్. మీనూ ”

**********

” ఇన్స్పెక్టర్ సార్ నమస్కారం , నా పేరు రంగాచారి, మూడో మాడ వీధిలో వుంటున్నాను, రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్లర్క్.”

” కూర్చోండి. ”

” నిన్న రాత్రి నుంచి, మా అమ్మాయి కనిపించలేదండీ. ! ”

” ఫోటో, పేరూ వివరాలు ఇవ్వండి. ఎవరినైనా అనుమానిస్తున్నారా..?

” అవునండీ, సెప్టాంక్ క్లీనర్, అతడి పేరు సెల్వరాజ్ అంటోంది మావిడ. నాలుగు సార్లు వాడు క్లీనింగ్ కోసం మా ఇంటికి రావడం జరిగింది సార్. వాడి నంబర్ ఇదండీ. ”

” ఇంకేం ! క్లూ ఇచ్చేశారు, మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి. రేపట్లోగా మీ అమ్మాయిని తీసుకొస్తాం. వాడి తాట వొలుస్తాను. పీసీ ఫోర్, ఈయన కంప్లైంట్ రికార్డ్ చేయవయ్యా. ఈ ఫోను కాంటాక్ట్ చెయ్యి.”

**********

” పార్టీ సెక్రట్రీ కి ఫోను , హెచ్ టూ ఇన్స్పెక్టర్ లైన్లో ”

” వణక్కం కామ్రేడ్ , మీ ‘మేల అను ప్ప నది ‘ సెప్టాంక్ క్లీనర్ సెల్వరాజ్ గురించి మాకు ఇన్ ఫర్మేషన్ కావాలండీ. వాడి ఫోన్ నంబర్ ********87. మేము ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. వాడి మీద కిడ్నాప్ కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ”

” ఓకే సార్ ,మా పార్టీ వాళ్ళు వాడిని పట్టుకుంటారు, నేను టచ్ లో వుంటాను సార్. ”

” థాంక్ యూ కామ్రేడ్. ”

రేయ్, ఆ కనకా గాడు ఎక్కడున్నా లాక్కురండి. వాడ్ని చితగ్గొట్టితే , ఆ సెల్వా గాడు ఎక్కడ దాక్కున్నాడో తెలిసిపోద్ది. ”

**********

“తిరుట్టు తేవిడియా పయ్యా …. ఎక్కడ్రాఅ సెల్వా గాడు. ఆ ముశిల్ది ఎక్కడ చచ్చిందిరా.. నా కొడకల్లారా , మన ఎర్రజండా పార్టీ పరువు మంట గలిపారూ కదరా.. నీ యమ్మా.. ”

” అన్నా అన్నా.. నన్ను కొట్టకండన్నా.. నాకేమీ తెలీదన్నా..”

” పళ్ళు రాలగొడతా, తోలె వురిచ్చిడువెం తిరుట్టు రాస్కెల్.. ఆ టాంకర్ లారీ ఎక్కడ్రా.. దానిమీదెక్కి పరారయ్యడా, ఆ పొరిక్కి , ఆ నా కొడుకు నా చేతుల్లో చచ్చాడే”

” అన్నా, అన్నా, కొట్టకండీ… ఆ లారీ ‘వత్తలగుండు ‘ సేటు తోలుకెళ్ళాడు, అదిమాత్రం తెలుసన్నా..”

” రేయ్, ఆ సేటుకి ఫొన్ కొట్టండ్రా.. ”

**********

” మచ్చాన్ .. కనకాని పార్టీ వోళ్ళు పట్టుకున్నార్రా, ఇవాళో రేపో నన్నుకూడా వదల్రు, మీమీద పెద్ద వల విశిరారు, మన పార్టీ పెద్దాయన కస్సు బుస్సు మంటున్నాడ్రో, .పళ్ళు కటకట కొరుకుతున్నాడంటరో. ఇద్దరి ఫోటోలు టీవీలో చూపిస్తున్నారంట రో..”

” ఫోన్ లో ఎవరు సెల్వా. ”

” ఈ ఫోన్ సిం పారేసి, మనం ఒక చోటికి వెళ్ళాలి మీనూ. అక్కడైతే, మనల్ని ఎవ్వరూ పట్టుకోలేరు. నా చెయ్యి గట్టిగా పట్టుకో..”

” ఎక్కడికి సెల్వా..”

” చెబుతా పద. నీ ముఖం కవర్ చేసుకో. లెట్ అస్ గో ”

**********

” వత్తల గుండు పోలీస్ స్టేషన్ సర్. టాంకర్ లారీ సీజ్ చేశాం సార్. ”

” గుడ్, బార్డర్ చెక్ పోస్ట్ లన్నీ అలర్ట్ చెయండి.అందరికీ ఆక్యూస్డ్ ఫోటోలు వాట్సాప్ చెయండి. బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ అన్నీ బ్లాక్ చేయండి. ఓవర్. ”

” ఓవర్ ”

**********

” నేను నడవలేక పోతున్నాను సెల్వా. ఇదేదో కాలిబాట, ముళ్ళూ, రాళ్ళూ.. ”

” The course of true love never runs smooth…. మీనూ”

” ఔను కదా.. మనం ఎక్కడికి వెళుతున్నాం చెప్పూ..”

” చెబుతా పదా.. మెల్లగా ,, ఈ ఇనప గేటు,ఎక్కి దిగాలి.. ముందుగా నువ్వెక్కు, ఆ చువ్వలు పట్టి ఎక్కి అటువైపు దిగు. మీనూ. భయపడకు, నేనున్నాను గా.. ”

” నువ్వూ ఎక్కూ.. ”

” గుడ్ గళ్ .. పద ,మరికొంత దూరం. ”

“చీకటి పడేలా వుంది, అంతా నిర్మానుష్యం గా వుందే. ”

” అదే మనకి రక్షణ. మరి కొంత దూరం, అదిగో ఆ కనిపించే ఆ చీకటి ద్వారం.. ”

” అందులో వెళ్ళాలా.. ”

” అక్కడైతే మనం సేఫ్. మనల్ని ఎవ్వరూ పట్టుకోలేరు మీనా.. ”

” ఎవరైనా పట్టుకుంటొనేమో.. భయమేస్తోంది. ఔనూ ..భుజాలు ఎగరేస్తున్నావ్?”

” నన్ను పట్టుకుంటే, కిడ్నాప్ కేసు పెట్టి జైల్లో కి తోసేస్తారు ”

” హమ్మో.. అది జరగనివ్వను. మనం మేజర్లు కదా. పోలీస్ కి సరెండరై, మనకి పెళ్ళి చెయ్య మంటాం. దండలు మార్చేసు కుందాం. సెల్వా ”

” నేను కొంత దూరం ఆలోచిస్తున్నాను మీనూ, మీ అమ్మా నాన్నా ఇప్పటికే షాక్ లో వున్నారనుకుంటాను. మీ బంధుజనం మన పెళ్ళికి ఒప్పుకుంటారంటావా.. ”

” ఒప్పుకోరు. అయినా నేను లెక్క చేయను. నాకు నువ్వు కావాలి సెల్వా. ”

” నాకూ నువ్వే కావాలి. మీనూ. అయితే మనిద్దరినీ విడదీయడనికి మా పార్టీ , పెను భూతంలా కోరలు చూపి బుసలు కొడుటోంది. ”

” మీ పార్టీ యా.. ? ”

“అవును .. ఎర్ర జెండా పార్టీ, నేను భయపడేది వాళ్ళ గురించే. ఇంతకు ముందు నాకు ఫోన్ చేశాడే , వాడు చెప్పిన మాట. మా ఎసోసియేషన్ పెద్దాయన కళ్ళురుముతున్నాడని.. అందరూ, నన్ను పోలీసులకి ముందే పట్టుకుని హత్య చేసి పూడ్చిపెట్టేసి, కేసు మూసేస్తారు. ఇది ప్రెస్టీజ్ ఇష్యూ వాళ్ళకి. పైగా పార్టీ పరువు పోతుందన్న భయం. మా ప్రైవేట్ టాంకర్స్ ఎసోసియేషన్ వాళ్ళు కూడా చేతులు కలిపినట్లుంది. కస్టమర్స్ కి వాళ్ళ మీద నమ్మకం పోయే అవకాశమే వుంది. నన్ను బైటికి నెట్టేస్తారు.”

” నన్ను భయపెడుతున్నావు సెల్వా, ఇదంతా నువ్వు ముందుగా ఆలోచించలేదా.. ”

” ఆలోచించే వ్యవధిలేకుండా, నేను తొందర పడ్డానేమో.. మీనూ, నీ అందం , నీ ప్రేమ కి బానిసై పోయాను.నిన్ను పెళ్ళి చేసుకుని వేరే సుదూర ప్రాంతాలకి వెళ్ళి పోవాలనే అను కున్నాను. ”

” కమాన్. వెళ్ళి పోదాం పద. ”

” వత్తల గుండు సేటుకి లారీ తాకట్టు పెట్టి డబ్బుకూడా తెచ్చుకున్నాను , అవునా.. పళని కి వెళ్ళి నీ మెళ్ళో మంగళ సూత్రం కడదామను కున్నాను. రాత్రికి రాత్రి బయల్దేరాము పళనికి పొద్దున్నే చేరామా. కనకాని పార్టీ వాళ్ళు పట్టుకున్నారు. సేటు నంబర్ తెలుసుకున్నా రు. ?”

” సో వాట్? నా మెళ్ళో మంగళ సూత్రం ఎందుకు కట్టలేదు .. సెల్వా.. ? ”

” ఆలస్యం చేశా నేమో అనిపించినా.. ఇప్పుడు మంచే చేశాను మీనూ. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. ”

” ఏం మాట రా ఇదీ, రాత్రంతా గడిపి, వెళితే , ఏ ఆడపిల్లని ఇంట్లోకి రానిస్తార్రా ..”

” నేనే మీ ఇంట్లో దిగబెడ్తా, మా పార్టీ ఆఫీసులో లొంగిపోతా. ”

” You are a fool , రా సెల్వా. నేనొప్పుకోను. నేను తిరిగి వెళ్ళను. నిన్నొదిలి వెళ్ళను. ఇక్కడే వుంటా . కావలిస్తే ఇక్కడే చస్తా. ”

” ఓహో.. నువ్వొక్కత్తివే చస్తే, నేను చూస్తూ వూరుకుండాలా, మనిద్దరం కలిసి చచ్చి పోదాం మీనూ.”

” నన్ను గట్టిగా కౌగిలించుకోరా సెల్వా. నా మెళ్ళో మంగళ సూత్రం కట్టు, నన్ను ముద్దుపెట్టుకో. ”

” కళ్ళు మూసుకో మీనూ, కమాన్ జంప్. ”

**********

” మనసు ఎంత ఆనందంగా వుందో .. సెల్వా. ”

” నిజం .. నాకూ పరమానందం గా వుంది. ”

” చూడూ.. ఇక్కడే నా మెళ్ళో తాళి కట్టావ్.. ”

” ఇది, ఏ ప్లేసో తెలుసా.. డెవిల్స్ కిచెన్.. జనం ఇలా పిలుస్తారేమో గానీ, నిజంగా ఇది ఏంజెల్స్ హెవెన్.”

” వావ్, ఔన్రా సెల్వా, ఈ రాయి మీద ఇదెప్పుడు రాశావ్.

…….SELVARAJ LOVES MEENAKSHI….”

“మన లవ్ డిస్కషన్ లో.. You are a fool అని గాట్టిగా కళ్ళు మూసుకుని మొహం ఆ పక్కకు తిప్పి , నీ కుడి కాలు టప్పుమని తొక్కి నన్ను తిట్టావ్ .. అప్పుడూ.. ”

“ఓ మై గాడ్, నిన్ను తిట్టానా ..సారీ సెల్వా.. !”

*

మంజుమెల్ బాయ్స్ సినిమా నిన్న చూశాను. చాలా టచింగ్ గా ఉంది. చివరి సీన్లలో గుహ శిల ఒక దానిమీద Selvaraj loves Meenakshi, 2003 అని రాసి వుంది. ఎవరో ఆ ప్రేమికుల జంట. వున్నారో, లేరో , అక్కడ ఆత్మహత్య చేసుకున్నారో. ఒక కథ అల్లాలనిపించింది. కోడై కానల్ సమీపంలో ని ” గుణా కేవ్స్ ” “మంజుమెల్ బాయ్స్ ” హిట్ మూవీ కారణంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ గుహలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదని ఆ చుట్టుపక్కల వాళ్ళ నమ్మకం. అది ” డెవిల్స్ కిచెన్” అనీ అక్కడ ప్రేతాత్మలు సంచరిస్తాయని చెప్పి అటువైపు జనం ,భయంతో వెళ్ళరు. ఆ గుహలు జన సంచారానికి ప్రమాదకరమని తమిళనాడు ప్రభుత్వం దాదాపు ఇరవై యేళ్ళ క్రితమే ప్రకటించింది. . ఆ గుహ లోపలి రాళ్ళు నున్నగవుండి, అడుగుపెడితే, జారి కొన్ని వందల అడుగుల లోయ లోకి పడి పోతారనీ, భగ్న ప్రేమికుల చివరి స్ధలం ఇదేననీ చెప్పుకుంటారు. ఆ క్షణంలో ప్రేమికుల జంటలు , శిలల మీద, తమ పేర్లు రాసుకుంటారని అంటారు. అలాంటి ప్రేమికుల జంట , సెల్వరాజ్ – మీనాక్షీలకి , ఈ కథ  అంకితం!

చిత్రం: అన్వర్ 

 

కార్టూనిస్ట్ జయదేవ్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు