మిరియం

విస్మయం మొలకెత్తినపుడు
శోధించటానికి నీవు సత్యంగా నిలబడాలి
గుప్పిట రహస్యాలను
బైనాక్యులర్ లోంచి చూసే
శిఖర చూపు నీకుండాలి
రుచి చూడని ప్రదేశాల్ని
మైక్రాన్ దూరాలకు దగ్గర చేసుకోవాలి
నశించే కాలం వద్ద
శ్రద్ధాంజలి ఘటించడం అంత మంచిది కాదు
రంగుల్ని ఒడగట్టి స్వప్నాన్ని బొమ్మను చేసి
ఆకాశంలో గాలిపటంలా ఎగురవేసినపుడు
కిక్కు బలేగుంటది బ్రో…
విప్లవ సాహిత్యం పక్కనే ప్రేమలేఖనుంచుకుని
పేదరాశి పెద్దమ్మ కథల్లో రాకుమారునివై
కీలుగుఱ్ఱం ఎక్కడం అబ్బో! మస్తు గురూ
కవిత్వమంటే…
మొనాటనీ రూపాన్ని గొబ్బెమ్మలుగా చేసి
సంక్రాంతి ముగ్గులో సామాజిక వస్తువును చుట్టి
బొడ్డెమ్మ దరువేయడం కాదు సామి
కనబడని వస్తువు చుట్టూ
రూపం తొడిగిన అస్పష్టాన్ని
మైక్రోస్కోపులో వెదకే సహనముంటే
సముద్రం అడుగును దర్శిస్తాము
జిజ్ఞాసిగా జీవించడం
జిప్సిలా సంచారం చేయడం
అందరికీ సాధ్యం కాకపోవచ్చు
కొత్త ఎరుకను కలిగి ఉండటం
నత్త చట్రం నుంచి బయటపడ్డం
తేలికే కదా మేష్టారు
కప్పు పాతదే అయినా
చాయ్ ఎప్పుడూ కొత్తదే గురూ
ఎగరడానికీ, ఎదగడానికీ
బద్దకమో చెద
ఏరివేసేయ్ తాలునంతా
థింసా నృత్యంలో నీవొక బంతిపూవయినపుడే
అడవి బిడ్డల ప్లేవర్ను ఆస్వాదించగలుగుతావు
జల్దీ నికలో…
గల్లీ లోంచి బయటకు వచ్చి
మెట్రో నగరపు వాసన్ని అనుభవించు
అది అగరొత్తుల పొగ కాదు
సిగరెట్టు గరళం
ఫ్రేములో ఇరుక్కుంటే ఏమొస్తది
బావిలో కప్పని బిరుదొస్తది
ఇప్పటికైనా కొండనాలుకను చూసిన కళ్ళకు
అనకొండను చూపు
భయం ప్రసవించినపుడు
ప్రేతాత్మల కథలు కారంగా ఉంటాయి
అప్పుడే కొత్త డిక్షన్ కోసం
నిన్ను నీవు విడగొట్టుకుని
అనేక రూపాల్ని దర్శిస్తావు.
*

తెలుగు వెంకటేష్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వో కొత్త చూపుతో కొత్త దృష్టిని అందిస్తూ అనుభవించే ఆనందమ్ అద్బుతంగా చిత్రించారు..కవికి పాఠకునికి ీ యీ
    కవితాప్రయోజనపు బరువును లెక్కకట్టలేమ్..అసాంఘిక సాంఘిక వొంటరి వుమ్మడి దోబూచులాటల్లో విశాలత్వమునకూ వైరుధ్యములకు వొక ప్రతిపదికగా నిలువరించిన యీ కవికి కవితకు దాని ఆనందపు వుధ్వేగపువుద్ధేశ్యములు యే చట్రములకు లొంగని వ్యాపకత్వమ్ కవితకు ప్రమాణమూ కావచ్చు..శుభాకాంక్షలతో..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు