పరాయీకరణపై నిరసన మియా కవిత్వం

బెంగాలీ ముస్లిముల పట్ల చిన్న చూపు, భేదభావం, ఏలుబడి దృష్టి, మియా పదాన్ని అవహేళనగా అర్ధం చేసుకుందుకు మరింత దారి తీసింది. ఫలితంగా మియా కవిత్వం వచ్చింది. అది వారి కష్టాల పట్ల, పక్షపాతం పట్ల విస్ఫోటంగా బయటపడింది. ఆ కవిత్వం వారి బాధని, అనుభవిస్తున్న హానిని ప్రతిబింబించింది. కొన్ని దశాబ్దాలుగా వివిధ కారణాలతో అస్సాంలోనే వారు ఉంటున్నా, అస్సామీ భాషనే అధికారికంగా అంగీకరించినా, అస్సామీయులుగానే వారిని వారు తీర్చిదిద్దుకుంటున్నా, వారందరినీ అస్సామీయులు పరాయివాళ్లుగానే పరిగణించడం మూలంగా తలెత్తుతున్న సమస్యలు బాధలు మియా  కవిత్వానికి పునాదిరాళ్లు. అస్సాంలో మియా కవిత్వం, ఒక నిరసనగా, ప్రతిఘటనగా బయటకొచ్చింది.  ఆ నేలతో సంబంధం, పౌరసత్వం విషయంలో సమాధానాల్ని కోరింది.

తొందరలోనే ఛాయా పబ్లికేషన్స్ ద్వారా పుస్తకంగా రాబోతున్న “మియా కవిత్వం – (అసోమియా ముస్లిం అస్తిత్వ స్వరం)” పుస్తకంలోనుండి కొన్ని కవితలు.

 

ఒక చారువా ప్రతిపాదన (1939)

  • మౌలానా బందె (1906-1979)
  • 84 గ్రంథాలు రాసిన కవి, రచయిత, నాటకకర్త, బాలసాహిత్యకారుడు. ఈ కవితలో మియా అన్న పదం స్పష్టంగా వాడకపోయినా, వారి ఉనికిని వక్కాణించే ఆది కవిత్వగా మియా కవులు దీనిని భావిస్తారు.

 

నా జన్మస్థలం బెంగాల్ అంటారు కొందరు

కటువైన ఈ నిందారోపణ దుర్బుద్ధితో చేస్తారు

నిజానికి, వాళ్లు రాక ముందే

మా నాన్న, మా అమ్మ, ఇంకా చాలా మంది

ఇళ్లు విడిచి పెట్టి, దేశవిహీనులయారు  

అప్పట్లో దేశానికి చెందిన వాళ్లు ఎంత మంది

ఇప్పుడు కిరీటాలు తగిలించుకుని నాయకుల ముసుగులు వేసుకున్నారు?

నాకు తెలుసు వాళ్లు దురాశలో చిక్కుకున్నారని

భాష దురాశ మాటాడటం, నేను శాంతంగా గమనిస్తున్నాను 

నాకు తిండిపెడుతున్న విస్తరిని నేను చించేయను

నా విశ్వాసం నన్ను అలా చేయనివ్వదు

నేను నివసిస్తున్న ఈ నేల శ్రేయస్సులోనే

నేను ఆనందం పొందుతాను

మా అమ్మా నాన్నా

స్వర్గానికి పోయినా

ఈ నేల నా సొంతం, నా అస్సాం బంగారం

ఈ నేల నా పవిత్ర పుణ్యస్థలం

నా ఇంటిని కట్టుకుందుకు తవ్వుకుంటున్న ఈ నేల

నా సొంత నేల

ఖురాను లోవి ఈ మాటలు

ఇందులో అసత్యం లేదు

ఈ నేల ప్రజలు సామాన్యులు, నిర్మలులు

అస్సామీలు మా వారు

పంచుకున్న మా ఇంటిలో మాకు ఉన్నదే మేము పంచుకొని

ఒక గొప్ప కుటుంబాన్ని నిర్మించుకుంటాం

 

నేను చారువా (ఇసక మేటవాసి) ని కాను, వలస వాసినీ కాను

మేము కూడా అస్సాం నేలా గాలీ భాషలతో

అసోమియాలు అయాము

అస్సాం మరణిస్తే మేమూనూ

కానీ అలా ఎందుకు కానిస్తాం మేం?

కొత్త కష్టాలకు మేము కొత్త ఆయుధాలను తయారు చేసుకుంటాం 

కొత్త పనిముట్లతో కొత్త భవిష్యత్తుని నిర్మించుకుంటాం 

ఎక్కడ దొరుకుతుంది మనకు ఆ ప్రేమా, ఆ గౌరవం

ఎక్కడ దొరుకుతుంది అలాంటి ప్రాంతం?

నాగలి దున్నిన భూమిలో బంగారం బయటపడే

అనుగ్రహపు నేల ఎక్కడ లభిస్తుంది?

అస్సాం తల్లి తన రొమ్ముతో మమ్మల్ని పోషిస్తుంది

ఆమె ఉల్లాసమైన బిడ్డలం మేం

ఒకే స్వరంలో మనం పాడదాం – మేము అసామీయులం

మైమెన్ సింగ్ వాసులం కాదు

మాకు సరిహద్దులు అవసరం లేదు

మేము సోదరులుగా ఉంటాం 

పరాయివాళ్లు మనల్ని దోచుకుందుకు వచ్చినపుడు

మా ఉత్త చాతీతో వారిని అడ్డుకుంటాం 

 

 

వినమ్రంగా నివేదించుకుంటున్నాను  ఇది (1985)

-కబీర్ అహ్మద్

 

వినమ్రంగా నివేదించుకుంటున్నాను  ఇది

నేను వలస వాడిని, అసహ్యించుకునే మియాని

ఏదైతేనేమి, నా పేరు

ఇస్మాయిల్ షేక్, రంజాన్ ఆలీ లేదా మజీద్ మియా

విషయం: నేను అస్సామీ అసోమియాని

 

నేను చెప్పాల్సింది చాలా ఉంది

అస్సాం జానపద కథల కంటే కథలు పాతవి

కథలు మీ సిరల్లో ప్రవహిస్తున్న

రక్తం కంటే పాతవి

 

స్వాతంత్య్రం వచ్చిన నలబై ఏళ్ల తరువాత

ప్రియమైన రచయితల పదాల్లో నాకు చోటు లేదు

సినీ రచయితల కుంచె నా చిత్రంలో మునగదు

శాసనసభల్లో చట్టసభల్లో నా పేరు ఉచ్చరించకుండ వదిలేయబడుతుంది

మృతవీరుల స్మారక చిహ్నాల్లో గాని, లేదా వార్తా కథనాల్లో గానీ నా పేరు ప్రచురించబడదు

కనీసం చిన్న ఉత్తరాల్లోనైనా

పైగా, నన్ను ఎలా పిలవాలో ఇంకా నిర్ణయించు కోనేలేదు

నేను మియానా, అసోమియానా, లేదా నూతన-అసోమియానా?

 

అయినా మీరు నది గురించి మాటాడతారు

నది అస్సాం తల్లి అంటారు

చెట్ల గురించి మాటాడతారు

అస్సాం నీలం కొండల నేల అంటారు

నా వెన్నెముక దృఢమైనది, చెట్లలా స్థిరమైనది

చెట్ల నీడ నా చిరునామా ..

మీరు రైతులు కార్మికుల గురించి మాటాడతారు

అస్సాం నేల వరి శ్రమకు చిహ్నం అంటారు మీరు

నేను రైతుబిడ్దని కావున

వరి ముందు తలొంచుతాను, చెమట ముందు తలొంచుతాను

 

వినమ్రంగా నివేదించుకుంటున్నాను  ఇది

నేను వలస వాడిని, అసహ్యించుకునే మియాని

ఏదైతేనేమి, నా పేరు

కబీర్ అహ్మద్ లేదా మిజనూర్ మియా

విషయం: నేను అస్సామీ అసోమియాని

గత శతాబ్దంలో ఎప్పుడో

పద్మా నది తుఫాన్లలో నా చిరునామా పోగొట్టుకున్నాను 

ఒక వ్యాపార నౌక నేను కొట్టుకుపోవడం చూసి ఇక్కడ వదిలేసింది

అప్పటినుంచీ ఈ నేల నా హృదయానికి దగ్గరయి

ఒక కొత్త ఆవిష్కరణ యాత్ర మొదలయింది

సదియా నుండి డుబ్రీ వరకూ ..

 

అప్పటినుండీ

ఎర్ర కొండల్ని చదును చేసాను

అడవుల్ని నరికి నగరాల్ని, మట్టిని దొర్లించి ఇటుకల్ని

ఇటుకలనుండి స్మారకభవనాల్ని కట్టాను

నేలమీద రాళ్లు పరిచాను, నా శరీరాన్ని కుళ్ళిన మొక్కతో నల్లగా మాడ్చుకున్నాను

నదుల్ని ఈదాను, తీరంలో నిల్చొని వరదల్ని ఎదుర్కొన్నాను

నా రక్తం చెమటతో పంటలు పండించాను

నా తండ్రుల నాగలితో “అస్సాం” అని భూమి మీద దున్నాను

 

స్వాతంత్య్రం కోసం నేనూ వేచి చూసాను

నది రెల్లులో గూడు కట్టుకున్నాను

భతియాలిలో పాటలు పాడాను

బ్రహ్మపుత్ర సంగీతాన్ని విన్నాను

సాయంత్రం కొలోంగ్, కొపిలి

దగ్గర నిల్చుని బంగరు తీరాల్ని చూశాను

 

ఆకస్మికంగా నా ముఖానికి ఒక గరుకు చేయి తాకింది

1983 మంటల రాత్రి

నెల్లీ నల్లటి పొయ్యిమీద నిల్చుని నా దేశం అరిచింది

ముకల్మువా, రుపోహి, జురియా లలో మేఘాలు అంటుకున్నాయి

సయ డాకా, పాఖీ డాకా – మియాల ఇళ్లు

స్మశానాల్లా కాలాయి

1984 వరదలు నా బంగరు పంటని తుడిచిపెట్టేసాయి

1985లో జూదగాళ్ల ముఠా నన్ను

శాసనసభ సమావేశాల్లో వేలం వేసింది 

 

సంగతి ఏదైనా, నా పేరు

ఇస్మాయిల్ షేక్, రంజాన్ ఆలీ లేదా మజీద్ మియా

విషయం – నేను అస్సామీ అసోమియాని

 

 

రాసుకో – నేను మియానని రాసుకో (2016)

  • డాక్టర్ హఫీజ్ అహ్మద్ (వృత్తిపరంగా ఉపాధ్యాయుడు, రచయిత, కవి చార్ చపోరీ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు)

 

అర్హులైన జాతీయ పౌరుల జాబితా(NRC)లో నా సంఖ్య 200543

నాకు ఇద్దరు పిల్లలు

వచ్చే వేసవిలో

ఇంకొకడు చేరబోతున్నారు

నన్ను అసహ్యించుకుంటున్నట్టే

వాడినీ అసహ్యించుకుంటావా?

 

నేను మియానని రాసుకో

వ్యర్ధ ముళ్ల నేలల్ని

పచ్చటి పైరు పొలాలుగా మారుస్తాను

మీకు తిండి కోసం

ఇటుకలు మోస్తాను

మీ మేడల కోసం

మీ కారు నడుపుతాను

మీ సుఖం కోసం

మీ మురుగును శుబ్రం చేస్తాను

మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి

మీ సేవ కోసమే సదా ఉన్నాను

అయినా మీకు సంతృప్తి లేదు

రాసుకో నేను మియానని

ప్రజాస్వామిక లౌకిక గణతంత్ర రాజ్యంలో

ఏ హక్కులూ లేని పౌరుడిని

నా తల్లి ఒక సందేహాస్పద వోటరు

ఆమె తల్లిదండ్రులు హిందువులు ఐనా సరే 

 

కావాలంటే నన్ను చంపేయ్, ఊరు నుండి తరిమేయ్

నా పచ్చటి పొలాలు  లాక్కో

నా మీద తొక్కించడానికి

బుల్డోజర్లు అద్దెకు తెచ్చుకో

నీ బుల్లెట్లు

నేరమే లేకుండా

నా ఎదను చెదరగొట్టొచ్చు

 

నేను బ్రహ్మపుత్ర

మియానని రాయు

నీ హింస

నా శరీరాన్ని నల్లగా కాల్చింది

నా కళ్లను అగ్గితో ఎర్రబార్చింది

జాగ్రత్త!

కోపం తప్ప నా దగ్గర ఏమీ లేదు

దూరంగా ఉండు

లేదా

బూడిదగా మారిపో 

(ఈ కవిత అమెరికా కవి లాంగ్ స్టన్ హ్యూజెస్ రాసిన I am a Negro: Black as the night black ని గుర్తుచేస్తుంది.)

 

 

నేను మరణించిన తరువాత చెట్టులా జీవిస్తాను

–  హీనా అల్ హయ

నా మరణం తరువాత నేను చెట్టులా జీవిస్తాను

లిపి లేకుండా

కవులు లేకుండా

మరణించిన భాషలాగ

 

కిడ్నీలను అమ్ముకోనవసరం లేకుండా

శాశ్వతంగా ఆకలిని చంపేసే

పిడికెడు గింజల్ని నేను

 

నా మరణం తరువాత నేను దేశమవుతాను 

ఎక్కడయితే పశువులకంటే మనిషి ఖరీదెక్కువో

ఎక్కడయితే నిరసన పదం బుల్లెట్ ని ఆర్జించదో

 

వారసత్వ హక్కు కోసం పోరాడేవారిలో 

దేశం లేకపోయినా ఇళ్లున్న వారిలో

నేను మరణించినా జీవిస్తూనే ఉంటాను

 

పోరాటంగా నేను జీవిస్తూనే ఉంటాను వంశం లేని తెగకోసం

 

 

నా తల్లి (1 మే 2016)

  • రెహనా సుల్తానా

(కవి సామాజిక కార్యకర్త. గౌహాటీ విశ్వవిద్యాలయంలో అస్సామీ భాషలో పరిశోధక విద్యార్ధి. మియా కవిత్వం రాస్తున్నందుకు గాను, ఆమె మీద నాలుగు FIR లు ఉన్నాయి. ఆమె మొబైల్ లో బెదిరింపులు అశ్లీల వ్యాఖ్యానాలు కోకొల్లలు.   )

 

తల్లీ, నీ ఒడిలో నన్ను వదిలారు

నా తండ్రి, తాత, ముత్తాతల్లానే

అయినా తల్లీ నువ్వు నన్ను తిరస్కరిస్తున్నావు

ఎందుకంటే నేనెవరో

అవును, నీ ఒడిలో నన్ను వదిలారు

తల్లీ, శాపగ్రస్త మియాని

ఎందుకంటే ఎలానో ఈ గడ్డం పెరిగింది

ఎలానో లుంగీలోకి దూరాను

నేను అలసిపోయాను, నీకు నన్ను పరిచయం చేసుకుంటూ అలసిపోయాను

నీ తిరస్కారాలన్నింటినీ భరిసున్నాను, అయినా అరుస్తాను

తల్లీ నీకే నేను చెందుతానని!

ఒక్కోమారు ఆశ్చర్యపోతాను

నీ ఒడిలో చేరి నేను పొందినదేమిటని

నాకు ఆనవాలు లేదు, భాష లేదు

నన్ను నేనే కోల్పోయాను, అన్నింటినీ కోల్పోయాను

అది నన్ను స్పష్టం చేస్తుంది

అయినా నిన్ను దగ్గరగా హత్తుకుంటాను

నీలోపలికి నేను కరిగి పోడానికి ప్రయత్నిస్తాను 

నీ పాదాల దగ్గర చుక్కగా తప్ప

నాకు ఏమీ అవసరం లేదు తల్లీ

ఒక్కసారి కళ్లు తెరువు తల్లీ

నీ పెదాలు విప్పు

ఈ భూమి పుత్రులకు చెప్పు

మేమంతా సోదరులమని

అయినా నీకు మరోమారు చెబుతున్నాను

నేను కేవలం మరొక బిడ్దని

నేను మియా మర్మాంగాన్ని కాదు

బంగ్లాదేశీని కాదు

మియాని నేను

ఒక మియా

కవిత్వం ద్వారా పదాలు కూర్చలేను

నా బాధని పాటగా పాడలేను

ఈ ప్రార్ధన, నా దగ్గరున్నది  అంతా ఇదే

 

 

నా కొడుకు నగరం తిట్లు  నేర్చుకున్నాడు

– సిరాజ్ ఖాన్

-అస్సామీ ముస్లిం హక్కుల కోసం పోరాడుతున్న బెంగాలీ మూలాలున్న కవి

 

నగరం కోసం నేను చార్ ను వదిలేస్తుంటే

అడుగుతారు వాళ్లు “ఓయ్, నీ ఇల్లెక్కడ?” అని

ఎలా చెప్పాలి నేను, “బోరోగంగ్ హృదయంలో 

ఝావు గడ్డి కాడల మధ్య మినుకుమినుకు మంటూ

వెండిలాంటి ఇసకనేల నడుమ

రోడ్లు లేని, రథాలు లేని

గొప్పోళ్ల అడుగులు అరుదుగా పడే చోట

గాలి పసిరికపచ్చగా ఉండే దగ్గర

అక్కడ, అక్కడే నా ఇల్లు” అని 

 

నగరం కోసం నేను చార్ ను వదిలేస్తుంటే

అడుగుతారు వాళ్లు “ఓయ్, నీ భాష ఏమిటి?” అని

సరిగ్గా పశువుల పక్షుల భాషల్లా

పుస్తకాలు లేవు, నా భాషకు బడిలేదు

మా అమ్మ నోటినుండి వచ్చేవాటికి రాగం తీసి

భతియాలీ పాడుకుంటాను. లయలో లయ కలుపుతాను

బాధకు బాధతో

నా హృదయానికి దగ్గరగా ఉండే నేల శబ్దాల్ని కౌగలించుకొని

ఇసుక గుసగుసల్ని మాటాడతాను 

భూమి భాష అంతటా ఒకటే కదా 

 

వాళ్లు అడుగుతారు “ఓయ్, నీ జాతి ఏమిటి?” అని

వాళ్లకు ఎలా చెప్పాలి నాది మనుష్య జాతి అని 

భూమి మాకు ఒకటి చేసే వరకూ

మేము హిందువులం లేదా ముస్లిములం.

నన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తారు వాళ్లు “ఓయ్, ఎప్పుడు వచ్చావు ఇక్కడికి” అని  

నేను వచ్చింది ఎక్కడినుంచో కాదు   

తలమీద జనపాకుల కట్టతో

నగరం కోసం బాజన్, చార్ ని వదిలేస్తుంటే   

కారణం లేకుండా పోలీసులు అతని మీద గెంతారు 

పరిశోధనపత్రాల విచారణ మొదలెట్టారు  

బాజన్ మంచిమార్కులతో పాసయిన ప్రతిసారీ  

 

అతను ఇసుకవాసి కావున

అతనికి వాళ్లు అనేక రంగురంగుల పేర్లు పెట్టారు

అతనిని చారువా అని పిలిచారు వాళ్లు, పౌమా, మైమెన్సింఘియా

కొందరు నూతన అసోమియా అని

ఇంకొందరు “విదేశీ మియా” అని

అతని హృదయం మీద ఈ దద్దుర్లను అతను మోసుకొనేపోయాడు

అతని గోరీకి

 

దద్దుర్లన్నీ కలిసి, వాటి సామూహిక తలెత్తి బుసకొట్టాయి నా మీద

 

ఓ పాములోడా

నువు ఎంతకాలం జారుతూ జారుకుంటావు

నా కొడుకు కాలేజీకి వెల్తున్నాడిపుడు

నగరం తిట్లు నేర్చుకున్నాడు

కొద్దిగా తెలిసినా బాగా తెలుసు వాడికి

కవిత్వపు తీయటి మెలికలు, తీయటి మలుపులూనూ

*

ముకుంద రామారావు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు