మా ఊరి గుట్ట

“డంగ్ డంగ్ డంగ్ డంగ్..”

ఇస్కూలు బెల్లు ఎప్పుడు మోగుతుందా అని ఎదురుచూస్తా ఉన్న సురేసు గంట శబ్దం ఇనబడగానే ఒక్కసారిగా పరుగందుకున్నాడు. ఆ దినం నుంచే మధ్యానం సెలవులు మొదలయినాయి.

గొర్రెలమంద నీళ్ళు తాగేదానికి పోయినట్టు, ఇంటికాడికి ఫస్టు పోవాలని పిల్లలు పరుగెడతా ఉండారు. జారిపోతున్న పుస్తకాల సంచిని ఎగేసుకుంటా పోతా ఉన్నాడు సురేసు. పక్కనే తోటి పిల్లకాయిలు ఆడితో పరుగు పందెం పెట్టుకున్నట్టు పరుగెడతా ఉన్నారు.

“ఈ రోజు ఎట్టయినా ఫస్టు నేనే రావాల! నేను మాత్రమే రావాల“ అని జపం జేస్తా, సూటిగా చూస్తా పరిగెడతా ఉండాడు సురేసు.

పొలిమేర దాటుకొని ఊరి ముందున్న ఇంటికాడికి ఎవరు ఫస్టు పోతారో వాళ్ళు ఆరోజు గెలిచినట్టు! సురేసు అనుకున్నట్టుగానే ఆరోజు ఇంటికి ఫస్టు వచ్చేసినాడు. ఎదురుగా వెంకటేశు బాబాయ్ కనిపించినాడు. ఆడికి ఒగ విష్యం జ్ఞాపకం వచ్చినాది. ఈ సమత్సరం అయినా వర్షం పడింటే బాబాయ్ ఈత నేర్పించేవాడు కదా అని.

ఆ ఊరి పేరు శ్రీరంగరాజపురం. ఊర్లో చెరువులు ఎండిపోయి చానా కాలమే అయినాది. ఇప్పుడు బావులూ అదే మాదిరిగా ఉండాయి.

“ఈ సమత్సరం కూడా నాకు అద్రుష్టం లేదు” అని ఇంటికాడికి పోయినాడు. తలుపుకి తాళం వేసుండాది. సంచిని దిన్నె మీద పడేసి, కొంచెం ఎగిరి దూలం కిందున్న బీగాలందుకుని తలుపులు తెరిచినాడు. లోపల చీకటిగా ఉండాది. “ఈ వారం మధ్యానం కరెంటు గదా?” అని బల్బు స్విచ్చు వేసినాడు. బల్బు తళ్కుతళ్కుమని మెరస్తా ఉంది. బల్బు పాడవుతుందని ఆపేసినాడు.

గవర్నమెంటోల్లు ‘పొద్దున కరెంటు, మధ్యానం కరెంటు’ అని పల్లెల్లో వారం మార్చి వారం కరెంటు వొదులుతా ఉన్నారు. పొద్దున కరెంటయితే బిన్నిగా ఆపేసేవోళ్లు. మధ్యాహ్నం కరెంటు చాలాసేపు ఉంటాది.

చీకట్లో తారాడతా పొయ్యి కాడున్న గిన్నెపై తట్టు తీసి చూస్తే సంగటి ముద్ద ఉంది. స్కూల్లో అన్నం సరింగ తినలేదు. కడుపులో ఆకలి తడతా ఉండాది. అరముద్ద చేత్తో తుంచుకొని సర్ది కలుపుకొన్నాడు. డబ్బాలో మిరపకాయ ఊరుబిండి నంజుకొని తాగి ”ప్రిడ్జి నీళ్ళలా భలే వున్నాయి” అని చిన్నగా తేపు వదిలినాడు.

బయట నుంచి “ఒరేయ్ సురేసూ! గుట్టకాడికి పోదాం వస్తావా?” అని అడిగినాడు దేసులు. పక్కన బాబుగాడు, కిరణ్ దొంగచూపులు చూస్తా ఉండారు. ఆ మాటలు విని మూతి తుడుచుకుంటా, ఎప్పట్లానే కొత్తగా “హా! వస్తారా” అని ఇస్కూలు యూనిఫారం యిప్పేసి, చిన్న చెడ్డి తగిలించుకొని, ‘పైన చొక్కా వేసుకుంటే పాడైపొద్ది, లేదంటే చినిగిపోద్ది’ అనుకుని అలానే బయలుదేరినాడు సురేసు.

వాడు ఐదో క్లాసు సదవతా ఉండాడు. ఇస్కూలు అయిపోంగానే వాళ్ళ బ్యాచీతో కల్సి నేరుగా గుట్టపైకి పోయి ఆడుకోడం ఆడికలవాటు. ఊరికి వెనుక ఆడాడ పచ్చని కసువుతో, పెద్ద పెద్ద బండరాళ్ల నడుమ చెట్లతో నిండిపోయి ఉంటాది ఆ గుట్ట. దూరం నుంచి చూస్తే కింద ఉన్న రెండు మూడు పల్లెలకి అందం ఆ గుట్టే అనిపిస్తాది.

ఆ గుట్టంటే సురేసుకు భలే ఇష్టం. ఒగప్పుడు ఆ గుట్ట చానా పెద్ద అడవిగా ఉండేదని, గుంటనక్కలు ఊరి మింద పడి కోళ్ళని పట్టుకుపోయేవని వాళ్ళ అవ్వ రోజూ పండుకునే ముందు కతలు కతలుగా చెప్పేది.

అందరూ వరుసగా మిట్టపై నడుస్తా ఉంటే, కింద చెరుకుతోటకి  మోటారు నీళ్ళు పారతా ఉన్నాయి. కిరణ్‌గాడు మిట్టపై నుంచి కిందకి అమాంతం దూకి, చెరుకుగడ పట్టుకొని కిందకి వంచినాడు. ఫట్‌మని శబ్దం వచ్చినాది. అందరూ కళ్లు పెద్దవి చేసి చూస్తా ఉంటే, బాబుగాడు గట్టిగా “బత్తులు చిన్నాయినా! మీ తోటలో చెరుకుగడలు ఇంచేస్తా ఉండారు” అని పరిగెత్తడం మొదలుపెట్నాడు. ఆడి వెనకాల్నే మిగిల్నోల్లు నవ్వుకుంటా పరుగుబెట్నారు. చెరుకు తోట మధ్యలో నీళ్ళు కడతా ఉన్న బత్తులు చిన్నాయిన చెవిలో ఆ మాటలు పడినాయి.

“ఏనా కొడుకురా చెరుకులు ఇంచేది?” అని పచ్చిబూతులతో శపిస్తా ఉండాడాయన. ఆ మాటలు పూర్తిగా వినపడక ముందే ఇంకిపోయిన పెద్ద కాలువలోనికి దిగిపోయినారు పిల్లకాయిలంతా. చెరుకుగడ పట్టుకొని పరిగెట్టుకుంటూ, ఆయాసంతో కాలువలోకి దిగుతున్న కిరణ్‌గాడ్ని చూసి అందరూ గట్టిగా నవ్వినారు.

వాడు కోపంతో అందరి వంకా చూసి “నా కొడకల్లారా! చెరుకు ఎవడికీ ఇచ్చేది లే! నేనే తింటా” అని పరిగెత్తడం మొదలుపెట్నాడు. అందరూ నవ్వడం ఆపేసి “రేయ్ కిరణ్‌గా! నేను కాదు రా, చెప్పింది మొత్తం బాబుగాడే” అన్నారు. కిరణ్‌గాడి యనకాల్నే పరిగెట్టినాడు సురేసు. పక్కనున్నోళ్ళు వాళ్ళల్లో వాళ్ళు సాకులు చెప్పుకుంటా ఉండారు. ఎవర్ని నమ్మాలో తెలియక కిరణ్ తెలివిగా చెరకు మొదలు ఇంచుకొన్నాడు. మిగిలింది వాళ్ళ ముందర పడేసి ముందుకు పరిగెట్నాడు. వెనకాల వచ్చిన సురేష్ పక్కనే దేసులుగాడు మధ్యలో ఉన్న చెరుకు ఇంచుకొన్యారు. చివర్న ఉన్న పింది చెరుకు బాబుగాడికి నవ్వుకుంటా ఇచ్చినారు.

వాడు వద్దన్నట్టుగా ముఖం పెట్టి “కావాలంటే చెరుకు నేను ఒలిచిస్తాను. ఇద్దరూ తలో రెండు ముక్కలు ఇయ్యండ్రా” అని అమాయకంగా అడిగినాడు. ‘ఇదేదో బాగుందే’ అని ఇద్దరూ తలాడించి, “సరే రా” అని చెరుకులు వాడికిచ్చి నడక మొదలుపెట్నారు. కిరణ్‌గాడు పెద్దగా ఒలిచిన చెరుకుపిప్పిని గడతో కొడతా నడుస్తా ఉన్నాడు.

గుట్టకి వెళ్ళే దారిలో ఎవరో గానిగ ఆడించేదానికి రెండు పెనువులు తెచ్చి పెట్టిపోయినట్టు ఉన్నారు. వాటిని చూడగానే బాబుగాడు పెనువుపై దరువు వాయించినాడు. దేసులు, కిరణ్‌గాడు కుశాలగా ఆ గానిగ చక్రాలు తిప్పతా ఉండారు. పోయిన సమత్సరం సురేసు వాళ్ళ అమ్మానాన్న ఇక్కడే పనికి వచ్చినారు. చెరుకు సీజన్ వస్తే చాలు గానిగ పనికి, బెల్లం ముద్దలు పట్టే పనికి ఈడకే వస్తా ఉంటారు. గుట్టకాడికి వెళ్ళిన ప్రతిసారీ సురేసుకి అది జ్ఞాపకానికొస్తా ఉంటాది. అమ్మానాయిన కష్టం చూస్తే వాడికి బాధ తన్నుకొని వచ్చేస్తాది. వాళ్లకి సాయం చేసేదానికిపోతే, అస్సలు చేయనిచ్చేవోళ్ళు కాదు. “మంచిగా సదువుకో! అదే మాకు సాలు” అని చేతిలో బెల్లం పెట్టి ఇంటికి పంపించేవోళ్ళు.

గానిగ చక్రాలు పట్టుకొని తిప్పేసరికి దేసులుగాడికి చేతికంతా గ్రీసు పూసుకొని నల్లగా అయిపోయిండాది. ఆడి చేతి వంక చూసి కిరణ్‌గాడికి ఒగటే నవ్వు. అది చూసి దరువులు కొడుతున్న బాబుగాడు గట్టిగా నవ్వినాడు. దేసులుకి కోపం వచ్చేసి, చేతిలో ఉన్న గ్రీసు తీసుకొని కిరణ్‌ ముఖానికి పూసినాడు. కిరణ్‌గాడు నల్లగా ఉంటాడు. ఆ గ్రీసు పూసేసరికి వాడి పళ్లు మెరిసిపోతా ఉన్నాయి తప్ప ఇంకేమీ కనబడట్లా! అది చూసి అందరూ కొంటెగా నవ్వుకుంటా పరిగెత్తడం మొదలుపెట్నారు. కిరణ్ వాళ్ల వెనకాలే వచ్చినాడు గ్రీసు పుసేదానికి. ఎలాగోలాగ తప్పించుకొని గుట్టకింద ఉన్న ఎల్లంపల్లికి వచ్చేసినారంతా. పాతబడిపోయిన చిన్న తొట్టిలో నీళ్ళు తీసుకోని చేతులు ముఖం కడుక్కొన్నారు కిరణ్, దేసులు.

ఆయాసంతో దాహం వేస్తా ఉంటే, పక్కనున్న ఇంటికాడికి పోయి నీళ్ళు అడిగినారు. ఇంట్లో నుంచి ఒగ అక్క బయటకొచ్చి కుండలో నీళ్ళు తీసి దూరం నుంచి నిలబడి పోసింది. ఇద్దరూ చేతుల్ని నోటికి దగ్గరగా పెట్టుకొని తాగినారు. ఆ వూర్లోవాళ్ళు వాళ్ళకి గ్లాసులో నీళ్ళు ఇచ్చేవోళ్ళు కాదు. ఎందుకు అని వీళ్లూ అడిగేవోళ్ళు కాదు.

దేసులు, కిరణ్‌గాడు దగ్గరకి వచ్చేసినారు. ఇంగ కొద్దిదూరమే ‘గుట్ట’ అని ఒకళ్ళ మీద ఒకళ్ళు చెయ్యి వేసుకొని నడుస్తా ఉన్నారు. కిరణ్‌గాడు కన్ను కొడితే, దేసులుకి ఏదో అర్థమై “అరే సురేసా! మీ దేవున్ని ఈరోజు ఏం కోరుకుంటావు రా?” అని కవ్వింపుగా అడిగినాడు. ఆ మాట వినంగానే టక్కున “నేనైతే పుల్లుగా బంగారం, డబ్బులు కోరుకుంటాను” అని కిరణ్ నవ్వుకుంటా చెప్పినాడు. దేసులు కోపంగా చూస్తా “నిన్నెవ్వడు అడిగినాడువై? మూసుకొని నడు” అని కసిరినాడు.

సురేసు వైపు చూస్తా “నువ్ చెప్పరా” అన్నాడు. సురేసు ఆలోచిస్తా గుట్ట వంక చూసి “కోరుకున్నవి చెప్పగూడదురా! చెప్తే నెరవేరదు” అన్నాడు. ముగ్గురూ నవ్వుకుంటా, వీడితో నిజం ఎలా చెప్పించాలా అని ఆలోచిస్తూ నడుస్తా ఉన్నారు.

సురేసుకి దైవభక్తి ఎక్కువ. ఒగనాడు ఆ గుట్టపై ఒగ రాయి శివుడి ఆకారంలో కనిపిస్తే, అప్పటికప్పుడు పసుపూ కుంకుం దెచ్చి అభిషేకం చేసి, రోజూ బొట్టు పెట్టుకోడానికి, పగిలిన పెంకుముక్కలో పసుపూ కుంకుం అక్కడ పెట్టినాడు. రోజూ వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని “ఈ గుట్ట, మేమూ ఎప్పుడు కలిసే ఉండేలా చూడు సామీ” అని వేడుకుంటా ఉంటాడు.

ముగ్గురికీ ఏదో ఆలోచన వచ్చినట్టు సురేసుని పట్టుకొని పైనా కిందా కుదిపేస్తా ”రేయ్! మేం అడిగినా చెప్పవారా? అంతేనా” అని పిడివాదంగా అడిగేసినారు. సురేసు తికమక పడతా ”అలా కాదు రా” అని సంకోచిస్తా ఉండాడు. ముగ్గురూ మూతి ముడుచుకున్నారు.

సురేసు వాళ్లని కుశాలగా దగ్గరికి లాక్కొని ”నేనేం కోరుకుంటాను రా? ఈ గుట్ట, మనం ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకున్నా” అని చెప్పినాడు. ఆ ముగ్గురూ వచ్చి సురేసుని అబ్బళించుకొని, సంతోషంతో “మనం ఎప్పుడూ కలిసే ఉంటాం ఈ గుట్టతోపాటు” అని ఒట్టు వేసుకున్నారు.

గుట్ట దగ్గరకు వచ్చేసినాది. గంతులేసుకుంటా పైకి పోబోతా ఉంటే, ఒక సెక్యూరిటీ గార్డు “రేయ్ పిల్లకాయిలూ! లోపలకి వెళ్ళేకి వీలు లేదు” అన్నాడు. సురేసు కోపంగా “ఎందుకు పోగూడదు? రోజూ మేం ఈడకే వచ్చి ఆడుకుంటాం” అన్నాడు.

దానికాయన నవ్వతా “చెప్పేది వినండ్రా! గుట్ట లోపల ఏదో ఉంద…” అతను మాట పూర్తి చేయకముందే, “ఏముంది? పైన మా శివయ్య ఉండాడు. పక్కకు పో వాచిమ్యాను” అన్నాడు సురేసు. మిగతావాళ్ళు కళ్ళు పెద్దవి చేసి చూస్తా ఉండిపోయినారు.

“అరే పిల్లనాయాలా! నేను వాచ్‌మ్యాన్ కాదు రా! సెక్యూరిటీ ఆఫీసర్ని” అన్నాడు.

కిరణ్‌కి ఏదో గుర్తుకొచ్చినట్టు “అయితే ఏందినా ఇప్పుడు? కాపలా కాసే పనే కదా” అని అమాయకంగా అన్నాడు. పక్కన చిన్నగా దేసులు పెదాలు కొరుక్కుంటా, నవ్వు ఆపుకుంటా ఉండాడు. సురేసు పిడివాదంగా “నేను మా గుట్టపైకి పోవాల. కొంచెం జరుగు నా” అని ముందుకు అడుగు వేసినాడు. అంతవరకు నవ్వుతా ఉన్న సెక్యూరిటీ కోపంగా కర్రని నేలమింద కొడతా “మీకు చెప్తే అర్థంగావట్లా? కావాలంటే ఆడ చూడండ్రా” అని అటు వంక చెయ్యి చూపించినాడు. పిల్లకాయిలు ఆ వైపు చూసినారు.

దూరంగా సిమెంట్ రాళ్ళతో కొంతమంది గోడ కడతా ఉన్నారు. ఆ వైపు పిల్లకాయిలు ఆశ్చర్యంగా చూసినారు. “ఇక్కడ క్వారీ తవ్వడం మొదలుపెట్నారు. ఎవ్వరూ లోనికి పోగూడదు” అని సెక్యూరిటీ ఖండితంగా చెప్పేసినాడు.

“అన్నా! అయితే మా గుట్టని మొత్తం కూల్చేస్తారా?” అని భయపడతా అడిగాడు బాబుగాడు. “అవున్రా! ఇంగ పోండి” అన్నాడు సెక్యూరిటీ. ఆ మాటలకి సురేసు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అప్పుడే వేరే సెక్యూరిటీ వచ్చి “బాంబులు పెడుతున్నారు” అని చెప్పేసరికి భయంతో పిల్లకాయిలు కొంచెం దూరం పరిగెట్నారు. సురేసు భయంతో పరిగెడతా కిందపడి బోరున ఏడుస్తా గుట్ట వంక చూసినాడు.

‘ఇన్నేళ్ళుగా మాది అనుకున్న గుట్ట. అభిమానంతో చానా జ్ఞాపకాలు పంచిచ్చిన గుట్ట. ఇప్పుడా జ్ఞాపకాలు లేకుండా చేసి, ఇంకొచ్చే తరానికి మూలం లేకుండా పోతా ఉంది. మొత్తం నాశినం చేసేసి సొమ్ములు దండుకుంటావున్న వాళ్లకి మా బాధ అర్థమైతాదా?’ అన్నట్టు వాడి కళ్ళు అమాయకంగా అడగుతా ఉన్నాయి.

గుట్టపైన శివయ్య రాయి రూపంలో మౌనంగా ఉండాడు. పక్కనే పగిలిన పెంకులపైన పసుపూ కుంకుం గాలికి ఎగిరిపోతా ఉంది. ఇంతలో పెద్ద చప్పుడు. పిల్లకాయిలంతా ఒక్కసారిగా ఏడుస్తా గుట్టవైపు చూసినారు. వాళ్ళ కళ్ళ ముందే గుట్టలో కొంతభాగం చెల్లాచెదురైనాది.

సురేసు వెక్కి వెక్కి ఏడుస్తా, మిగితావాళ్ల వంక చూస్తా “అప్పుడే చెప్పా కదరా! దేవుడి దగ్గర కోరుకున్నది చెప్తే జరగదని” అని భోరున ఏడ్చినాడు. వాళ్లు ముగ్గురూ‌ సురేసుని దగ్గరకు తీసుకున్నారు. వాళ్ళు పోయే దారి పక్కన కొత్తగా “క్వారీ తవ్వకాలు జరుగు ప్రదేశం” అని రాసున్న బోర్డు కనబడ్డాది. సురేసు కోపంగా పక్కనున్న పెద్ద రాయి తీసుకోని ఆ బోర్డుపైకి విసిరేసినాడు. రాయి తగిలి బోర్డు కిందపడింది.

ఆపైన కొన్నిరోజులకి అలాంటి బోర్డులు చుట్టు పక్కల చానా వెలిసినాయి. కనిపించిన ప్రతి బోర్డుపైనా సురేసు, అతని స్నేహితులూ రాళ్ళు వేస్తానే ఉన్నారు.

*

మాకూ సంతోషాలు, బాధలు, సంప్రదాయాలు ఉంటాయి

* హాయ్ హరి! మీ గురించి చెప్పండి.

హాయ్! మాది చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం పెద్ద తయ్యూర్ గ్రామం. నేను పుట్టింది, పెరిగింది అక్కడే. పదో తరగతి దాకా అక్కడ చదివి, ఆ తర్వాత కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చేరాను. మెకానికల్ ఇంజినీరింగ్ చేసి, ప్రస్తుతం సినిమా రంగంలో పనిచేస్తున్నాను. మూడు సినిమాలకు రచయితగా, నాలుగు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను.

* ఇది మీ మొదటి కథ కదా! కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

నా చిన్నప్పుడు మా ఇంట్లో వాతావరణం చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. చదువు తప్ప మరో ధ్యాస ఉండకూడదని బయటికి పంపేవారు కాదు. మా నాన్న, బాబాయ్ ఈ విషయంలో చాలా కచ్చితంగా ఉండేవాళ్లు. ఇంట్లోనే ఉంటూ దినపత్రికల్లో వచ్చే కథలు చదివేవాణ్ణి. ట్రిపుల్ ఐటీలో చేరాక స్వేచ్ఛ వచ్చినట్లయింది. అక్కడే మొదటిసారి యండమూరి వీరేంద్రనాథ్ నవలలు చదివాను. అందులో ‘రుషి’ నవల నాకు చాలా నచ్చింది. అక్కడున్నప్పుడే కేశవరెడ్డి గారి నవలలు చదివాను. అవి నా మీద చాలా ప్రభావం చుపించాయి. అదే టైంలో నా ఫ్రెండ్స్ మహమ్మద్ గౌస్, బూదూరి సుదర్శన్ కవితలు, కథలు రాయడం మొదలుపెట్టారు. వాటిని చదివి, చర్చించుకునేవాళ్లం. ఆ తర్వాత వాళ్లిద్దరూ వాళ్ల ఊరి గురించి కథలు రాసి, పుస్తకాలు వేశారు. నేనూ మా ఊరి కథలు రాస్తే బాగుంటుందన్న ఆలోచన అప్పుడే మొదలైంది.

* ‘మా ఊరి గుట్ట’ కథలో ప్రకృతి విధ్వంసం వల్ల పిల్లలు పడే మానసిక  వేదనను చూపించారు. దానికి నేపథ్యం ఏమిటి?

ఇంటర్ నుంచి నేను హాస్టల్‌లో ఉండి చదువుకున్నాను. మా ఊళ్లో నేను తిరిగింది తక్కువే! అయితే సెలవులొస్తే ఊరికి వచ్చేవాణ్ని. మా ఊరి చుట్టూ గుట్టలు ఉండేవి. స్నేహితులంతా కలిసి ఆ గుట్టపైకి వెళ్లి ఆడుకునేవాళ్ళం. వాటితో మాకు చాలా అనుబంధం. తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది. గుట్టల్ని తవ్వేయడం మొదలుపెట్టారు. వాటి వైపు ఎవరూ రాకుండా కంచె వేశారు. అది నాకు చాలా బాధ కలిగించింది. మాకు ఎన్నో అనుభూతులు అందించిన గుట్ట మా కళ్ల ముందే అలా అయిపోవడం తట్టుకోలేకపోయాను. దాన్నే కథగా రాశాను.

* కథని చిత్తూరు యాసలో రాశారు. దానికి స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది?

సినీ దర్శకుడు వెట్రిమారన్ గారికి నేను వీరాభిమానిని. ఆయన్ని గురువులా భావిస్తాను. ఆయన సినిమాలు గమనిస్తే కథ ఏ ప్రాంతంలో జరుగుతుందో దానికి తగ్గ భాషనే వాడతారు. అదే నాకు స్ఫూర్తి. మా ఊరి కథలు రాయాలని అనుకున్నప్పుడు అందుకు మా ఊరి యాసే సరిపోతుంది అనిపించింది. నామిని ‘మిట్టూరోడి కతలు’, ఝాన్సీ పాపుదేశి ‘దేవుడమ్మ’ కథలు చదివాక మా ఊళ్లో జనం మాట్లాడే మాటలే రాయాలన్న ఆలోచన మరింత బలపడింది.

* మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన మీకు సినిమాల వైపు వెళ్లాలని ఎందుకు అనిపించింది?

చిన్నప్పటి నుంచి ఆర్మీ లేదా పోలీసు ఆఫీసర్ అవ్వాలని అనుకునేవాణ్ని. సినిమాలు చూసేవాణ్ని కానీ, అందులో పనిచేసే ఆలోచన లేదు. బీటెక్ చదివేటప్పుడే సినిమాలపై ఆసక్తి పెరిగింది. కథల్ని సినిమాలుగా తీస్తే బాగుంటుందని అనిపించింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారన్న నమ్మకం లేదు. బీటెక్ పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్‌‌కి వచ్చి ఒక వారం రోజులు ఆ ఉద్యోగం చేసి మానేశాను. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నం చేశాను. ఆరు నెలలు గడిచాక ఈ రంగం నాకు సరిపోదేమో అనిపించింది. చెన్నైకి వెళ్లి అక్కడ ఒక కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌లో చేరాను. రోజుకు 8 గంటలపాటు నిలబడే పనిచేయాలి. ఆరు నెలలు పనిచేశాక ‘ఇదే కష్టం సినిమాల్లో పడితే సక్సెస్ అవుతాను’ అనిపించింది. అక్కడ ఉద్యోగం మానేసి హైదరాబాద్‌కి వచ్చి సినిమా అవకాశాల కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాను.

* ఎలాంటి కథలు రాయాలని ఉంది?

మా ఊరి నిండా వింతవింత కథలున్నాయి. వాటిని చెప్పాలని ఉంది. నేను బీటెక్ రోజుల్లో రాయలసీమ అనగానే వేరే ప్రాంతం వాళ్లు ఏదేదో ఊహించుకునేవారు. సీమ అంటే ఫ్యాక్షన్, పగలు ఉంటాయని అనుకునేవారు. మాకూ సంతోషాలు, బాధలు, సంప్రదాయాలు ఉంటాయి. వాటిని కథలు చేయాలని ఉంది.

*

టి. హరిబాబు

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు