మా అమ్మ బతికుంటే ఎంత సంతోషించేదో!

ప్రముఖ కన్నడ రచయిత వసుధేంద్ర ఇంటర్వ్యూ

సాక్షి పత్రికలో  నేను పనిచేస్తున్న రోజుల్లో ‘స్టెయిన్‌లెస్ స్టీలు పాత్రలు’ అనే అనువాద కథను పబ్లిష్ చేశాం. అప్పుడే మొదటిసారి వసుధేంద్ర పేరు వినడం, తెలుసుకోవడం. వసుధేంద్ర అప్పటికే కన్నడలో పాపులర్ రచయిత. ఆయన రాసిన ‘మోహనస్వామి’ పుస్తకమైతే పెద్ద సంచలనమే సృష్టించిందని తెలిసింది. ఆ తర్వాత అదే పుస్తకం తెలుగులో కూడా అనువాదమైనప్పుడు చదివా. అది నన్ను ఎంత ప్రభావితం చేసిందీ, నా ఆలోచనల్ని ఎంత మార్చిందీ చెప్తూ పోతే ఇక్కడ స్పేస్ సరిపోదు. దేశంలోని చాలా భాషలకు అనువాదమై వసుధేంద్రకు ఎంతో పేరు తీసుకొచ్చిన మోహనస్వామి గురించి ఇప్పుడు ప్రత్యేకించి నేను చెప్పాల్సింది కూడా ఏం లేదు.

తాజాగా ‘నమ్మమ్మ అంద్రె ననిగిష్ట’ అనే వసుధేంద్ర పుస్తకం ఒకటి ‘మా అమ్మంటే నాకిష్టం’ పేరుతో తెలుగులోకి అనువాదమైంది. కన్నడలో దాదాపు పదిహేనేళ్ల క్రితం వచ్చిన ఈ పుస్తకం ఇప్పటికీ ప్రతి ఏటా బెస్ట్‌సెల్లర్స్‌లో ఒకటిగా ఉంటున్నది. తెలుగులో కూడా ఇప్పుడు ఈ పుస్తకం పాఠకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా వసుధేంద్రతో మాట్లాడి మీ ముందు పెడుతున్న కొన్ని మాటలివి:

* హలో వసుధేంద్ర గారూ! ముందుగా కంగ్రాచ్యులేషన్స్. ‘మా అమ్మంటే నాకిష్టం’ తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకుంటోంది. మీ పుస్తకం కొత్త భాషలోకి వెళ్లి కొత్త పాఠకులను వెతుక్కుంటున్నప్పుడు ఎలా ఉంటుంది?

థ్యాంక్యూ మల్లి. చాలా సంతోషంగా ఉంటుంది. మామూలుగా మనం ప్రాంతీయ భాషలో రాసిన పుస్తకాలు ఎవరో ఒకరు ఇంగ్లిష్‌లోకి తీసుకెళ్తే తప్ప వేరే భాషలకు చేరవు. ఈ పుస్తకం మాత్రం కన్నడ నుంచి నేరుగా తెలుగులోకే అనువాదమైంది. ఇలా ఒరిజినల్ లాంగ్వేజ్‍నుంచి వచ్చినప్పుడు రచయిత చెప్పాలనుకున్నది చెప్పాలనుకున్నట్టు దాదాపు వందశాతం చేరుతుందని నమ్ముతాను. రంగనాథ రామచంద్రరావు గారు చక్కగా అనువాదం చేశారు. నా కథలన్నీ తెలుగులోకి తీసుకొచ్చింది ఆయనే.

* మోహనస్వామి అప్పట్నుంచే తెలుగులో మీకు మంచి క్రేజ్ ఉంది కదా! అది ‘మా అమ్మంటే నాకిష్టం’ పుస్తకంతో ఇంకా పెరిగిందనిపిస్తోంది. ఏమంటారు?

మోహనస్వామి రిలీజైనప్పుడు తెలుగు పాఠకుల దగ్గర్నుంచి గొప్ప స్పందన వచ్చింది. తమిళం, మలయాళం, మరాఠీ.. ఇలా వేరే ఏ ప్రాంతీయ భాషలోనూ మోహనస్వామి గురించి ఇంతలా మాట్లాడలేదు. అలాగే ఇప్పుడు ఈ పుస్తకానికి కూడా అలాంటి స్పందనే వస్తోంది. ఖదీర్‌బాబు గారు నిర్వహించే రైటర్స్‌మీట్ వల్లనే నేను తెలుగు రచయితలు, ఆ తర్వాత పాఠకులకు దగ్గరయ్యాననుకుంటా. ఛాయా పబ్లికేషన్స్ మోహన్‌బాబు గారు కూడా నాకు ఆ రైటర్స్‌మీట్ ద్వారానే పరిచయం. ఆయన నా పుస్తకాన్ని తీసుకొస్తానన్నప్పుడు – బాగా తెలిసినవారు కదా అని ధైర్యంగా ఒప్పుకున్నా. ఆయన చాలా ఇష్టంగా పనిచేసి పుస్తకాన్ని ఇంత అందంగా తీసుకొచ్చారు. సోషల్‌మీడియాలో ఈ పుస్తకం గురించి వస్తున్న రివ్యూలు చాలావరకు చదువుతున్నా. అవన్నీ చదువుతుంటే సంతోషంగా ఉంది.
అందులో ఒక కాంప్లిమెంట్ నాకు చాలా నచ్చింది. నేను శ్రీరమణ గారి ‘మిథునం’ పుస్తకాన్ని కన్నడ భాషలో అనువాదం చేశా. ఇక్కడ దాదాపు ఏడు రీప్రింట్‌లకు వెళ్లింది ఆ పుస్తకం. నేను తెలుగు పుస్తకాన్ని కన్నడలో పరిచయం చేసినందుకు – తెలుగువాళ్లు నా పుస్తకాన్ని ఆదరించి ఇలా తమ ప్రేమను చూపిస్తున్నారని అన్నారు. అది చాలా స్వీట్‌గా అనిపించింది.

* ఈ పుస్తకంలోని రెండు కథలు ఇంతకుముందే సాక్షిలో చదివాను. అయితే మొదటికథ ‘మా అమ్మంటే నాకిష్టం’ మాత్రం ఈ పుస్తకంలోనే మొదటిసారి చదివా. నా ఫేవరెట్ కథ ఏది అనడిగితే ఈ కథే. ఇదెప్పుడు రాశారు? అప్పట్లో దీనికి ఎలాంటి స్పందన వచ్చింది?

ఈ కథను నేను 2004లో రాశా. మొదట్లో కొన్ని పత్రికలకు పంపిస్తే వేసుకోమని చెప్పేశారు. ‘ఇది ఎమోషనల్ బ్లాక్‌మెయిల్, ఇలాంటి కథలు రాయడం మంచిది కాదు’ అన్నారు. నేను ఆలోచనల్లో పడిపోయా. అయితే ఎవరు తిరస్కరించినా నేను మాత్రం ఈ కథని చాలా నమ్మా. ఈ కథలో నేను చెప్పిన అంశం ఏమైనా అసహ్యంగా ఉందా అని చాలా ఆలోచించా. కానీ జరిగిందైతే ఇదే కదా, నిజాయితీగా రాస్తే పాఠకులు కచ్చితంగా ఒప్పుకుంటారు అన్న ధైర్యంతో పబ్లిష్ చేశా. ఈ కథ బయటికొచ్చాక ఎంత రెస్పాన్స్ వచ్చిందో చెప్పలేను. ఈ కథ రాసి పబ్లిష్ చేసినప్పుడే బహుశా నేను ‘మోహనస్వామి’ రాయగలను, రాయొచ్చు అనే ధైర్యం వచ్చిందనుకుంటా.

* ‘మా అమ్మంటే నాకిష్టం’ కథ రిలీజయ్యాకే మీ అమ్మగారి గురించి వరుసగా కథలు రాయడం మొదలుపెట్టారా?

అవును. మా అమ్మ చనిపోయిన రెండేళ్ల తర్వాత ఆలోచిస్తే మా అమ్మ చుట్టూ నా జీవితంలో ఎన్ని కథలున్నాయో కదా అనిపించింది. అవన్నీ చెప్పాలనిపించి రాసుకుంటూ వెళ్లా. కన్నడలో వీటిని లలిత ప్రబంధాలు అంటారు. కథలని చెప్పలేం, వ్యాసాలని కూడా అనలేం. దాదాపు అందరూ ఇలాంటివి రాస్తుంటారు. రెండేళ్లపాటు రాసిన తర్వాత పుస్తకం తీసుకొచ్చా. ఆ తర్వాత కూడా మా అమ్మ గురించి ఇంకా రాయమని అడిగేవాళ్లు. కాకపోతే నాకు ఇంక ఈ కథల్ని ఒక దగ్గర ఆపాలనిపించింది. అన్నీ కలిపి పుస్తకం తీసుకొచ్చా. దీనికంటే ముందు నాలుగు పుస్తకాలు వచ్చినా రాని పేరు, ఈ ఒక్క పుస్తకంతో వచ్చింది. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయానని చెప్పుకోవచ్చు. పదిహేనేళ్లయినా ఈ పుస్తకం గురించి ఇంకా మాట్లాడుతున్నారు, ప్రతి ఏటా వెయ్యికి పైగా కాపీలు అమ్ముడవుతూ ఉంటాయి. మదర్స్ డే రోజు ఈ పుస్తకం మీద ఎవరో ఒకరు వ్యాసం రాస్తుంటారు. ‘మోహనస్వామి’ కంటే ముందే నాకొక గుర్తింపు తెచ్చింది ఈ పుస్తకమే.

* ఇందులో మీ అమ్మగారి గురించి చెప్తూ ఆవిడకు తెలుగు సినిమాలన్నా, సాహిత్యమన్నా ఇష్టమని చెప్పారు. ఆవిడ ద్వారానే తెలుగు నేర్చుకున్నారా?

మా అమ్మ ఆంధ్రప్రదేశ్‌లోని కడప, ధర్మవరంలో చాలాకాలం ఉంది. అలాగే ఆమె చదువుకుంది కూడా బళ్లారిలో. అక్కడ తెలుగు మీడియమే ఉండేది అప్పట్లో. అందుకని అమ్మకు తెలుగంటేనే చాలా ఇష్టం. మా ఇంట్లో నా చిన్నప్పుడు తెలుగు సినిమాలు, తెలుగు సీరియళ్లే ఎక్కువ చూసేవాళ్లం. అమ్మకు తెలుగు చదవడమే వచ్చేది కాబట్టి ఇంట్లో తెలుగు పుస్తకాలు ఉండేవి, పత్రికలు కూడా వస్తుండేవి. మాకు ఎప్పుడైనా ఉత్తరాలు రాసినా తెలుగు లిపిలో కన్నడ భాషలో రాసి పంపేది. ఇప్పుడు ఆమె మీద నేను రాసిన ఈ పుస్తకం తెలుగులో రావడం నాకంటే మా అమ్మకే ఇంపార్టెంట్ అనొచ్చు. ఇప్పుడు అమ్మ బతికుంటే ఈ పుస్తకం చూసి ఎంత సంతోషించేదో అనుకుంటా. అయితే మళ్లీ మా అమ్మ చనిపోయిన తర్వాతే కదా నేను ఈ కథలు రాశానని గుర్తొచ్చి బాధపడుతుంటా.

* ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన ఒక విషయం ఏంటంటే సటిల్ హ్యూమర్. ప్రతీ కథలోనూ అది స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని ఇలా రాయాలనుకొనే రాసుకున్నారా?

ఈ కథలన్నీ ఎమోషనల్ కథలే అయినా, మీరన్నట్టు హ్యూమర్ కూడా ఉంది. నేను నా కథలు హాయిగా నవ్వించాలని అనుకుంటాను. అలాగే ఈ పుస్తకంలో ఎక్కడా కూడా మా అమ్మను దేవతలాగా చూపించలేదు. అలా చూపిస్తే మొత్తం మెలోడ్రామా అయిపోయేదేమో. అమ్మ కూడా మనిషే కదా, ఆమెను మనిషిలా చూపిస్తేనే బాగుంటుంది. అలా నిజాయితీగా రాయడం వల్లే ఇందులో ఆ హ్యూమర్ కూడా సహజంగా వచ్చేసింది.

* కన్నడలో 1998 నుంచే రాస్తున్నా 2006లో ‘నమ్మమ్మ అంద్రె నంగిష్ట’ తర్వాతే ఎక్కువ పేరొచ్చింది కదా! ఒకప్పట్నుంచైనా అక్కడ సాహిత్యం ఎలా ఉంది? పుస్తకాలకు స్పందన ఎలా ఉంటుంది?

‘మా అమ్మంటే నాకిష్టం’ రిలీజయ్యాక నాకు చాలా పేరొచ్చింది. ఆ పుస్తకానికే నాకు కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు, అమ్మ ప్రశస్తి అవార్డులొచ్చాయి. అయితే అవార్డుల కంటే కూడా ఎక్కువమంది పాఠకులకు నా పుస్తకం చేరినప్పుడే నాకు ఆనందం. మామూలుగా అయితే కన్నడలో ఒక్కో పుస్తకం రెండు వేల కాపీల వరకు అమ్ముడవుతుంది. అది దాటి ఇంకా ఎక్కువ కాపీలు అమ్ముడయితే ఇక్కడ – ‘మీరు పాపులర్ రచనలు చేస్తున్నారు కాబట్టే అన్ని పుస్తకాలు అమ్ముడవుతున్నాయి, ఈ తరహా రచనలు చెయ్యడం మంచిది కాదు’ అంటుంటారు. ఎక్కువ పాపులర్ అయితే అది సీరియస్ రైటింగ్ కాదని ముద్ర వేస్తుంటారు. నేను ఇలాంటివేవీ పట్టించుకోకుండా ఎన్నేళ్లయినా నా పుస్తకాల్ని గుర్తుంచుకోవాలని, ఎక్కువమందికి నా పుస్తకం చేరాలని కోరుకుంటాను.

* మీ కొత్త పుస్తకం ‘తేజో – తుంగభద్ర’ కన్నడలో ఇప్పుడు బెస్ట్‌సెల్లర్ అయినట్లుంది?

అవును, ఇప్పటివరకూ నేను పదిహేను పుస్తకాలు రాశా. అందులో ‘మా అమ్మంటే నాకిష్టం’ ఎక్కువ కాపీలు అమ్ముడయిన పుస్తకం. తేజో తుంగభద్ర ఇప్పటికే ఏడో రీ ప్రింట్‌కి వెళ్లింది. త్వరలో ఆ పాత పుస్తకం రికార్డును దాటొచ్చు. నాకు కూడా ఇది మంచిదే, ఎన్నాళ్లని పాత వైభవం మీదనే ఉంటాం?

* మనదేశంలో రచననే పూర్తి స్థాయి ప్రొఫెషన్‌గా ఎంచుకొని రాస్తున్న అతికొద్దిమంది రచయితల్లో మీరొకరు. మీకు ఇది ఎలా వీలవుతోంది?

నేను ప్రతి సంవత్సరం ‘చంద పుస్తక’ అని నా ప్రచురణ సంస్థ నుంచే చాలామంది కొత్త రచయితలను పరిచయం చేస్తూ వాళ్ల పుస్తకాలు తీసుకొస్తుంటా. నేను నా పుస్తకాల కోసమని ప్రతిరోజూ రాస్తూనే ఉంటా. ఇలా పూర్తిగా సాహిత్యంలోనే ఉండటం బాగుంది. పుస్తకాలు రాయడం, పబ్లిష్ చెయ్యడమే కాకుండా వాటిని పాఠకుల దగ్గరికి చేర్చే మార్గాలు కూడా వెతుక్కోవాలి. అప్పుడే సాహిత్యం నిలబడుతుంది.

* రచయితగా మీ దినచర్య లేకపోతే సాహిత్య వ్యాపకం ఎలా వుంటుంది?

చిన్న కథలకూ, వ్యాసాలకూ పెద్ద షెడ్యూల్ ఏమీ పెట్టుకోను. అయితే మనసులో స్కెచ్ గీసుకోడానికి కొన్ని నెలలు పడుతుంది. 24/7 లో అదొక రొటీన్. కథ మనసులో స్పష్టమైన రూపం తీసుకున్నాక రాయడానికి ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ పట్టదు. నవల పని పెట్టుకుంటే మాత్రం  ప్రతిరోజూ పొద్దున టిఫిన్ తరవాత కనీసం రెండు వేల పదాలు రాస్తా.

* తెలుగు పుస్తకాలు చదువుతుంటారా?

నాకు తెలుగు భాషంటే చాలా గౌరవం. పైగా మా అమ్మకు ఇష్టమైన భాష కాబట్టి నాక్కూడా ఇష్టమే. తెలుగు చదవడం వచ్చు కానీ వేగంగా చదవలేను. అందుకే ఎప్పుడైనా వీలు చూస్కొని చదువుతూ ఉంటా. ఇంకా పూర్తి చెయ్యాల్సిన ఇంగ్లిష్, కన్నడ పుస్తకాలు చాలా ఉన్నాయి కదా, ఈ మధ్యలో తెలుగులో పుస్తకాలు ఏవైనా కొన్ని వెతుక్కొని చదువుతుంటా. అయితే నాకు తెలుగు వచ్చు కాబట్టి చదవుతాననుకుందాం, రాకపోయి ఉంటే? అందుకే మన పుస్తకాలు వేరే భాషల్లోకి వెళ్లాల్సిన అవసరం చాలా ఉందని నాకనిపిస్తుంది. ముఖ్యంగా కన్నడ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో వచ్చే పుస్తకాలు ఈ నాలుగు భాషల్లోకి వెళ్తే ఎక్కువమందికి మన కథలు చేరుతాయి. అలాగే ఇంగ్లిష్ భాషలోకి కూడా వెళ్లాలి. ఇప్పుడు ఇంగ్లిష్ పాపులర్ లాంగ్వేజ్ అని దాన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. మన కథలు ఎక్కువమందికి చేరితే అంతకంటే ఏం కావాలి!

* చివరగా ఒక ప్రశ్న – భవిష్యత్తులో ప్రాంతీయ భాషలో వచ్చే పుస్తకాల పరిస్థితి ఎలా ఉంటుందనుకుంటున్నారు?

ఈ విషయంలో నాకు కొన్ని భయాలున్నాయి. ఇప్పుడు మాతృభాషలోనే చదువుతున్నవాళ్లు ఎంతమంది ఉన్నారు? ఎక్కువమంది ఇంగ్లిషులోనే చదువుతున్నారు. కాబట్టి మన పుస్తకాలు ఆ భాషలోకి వెళ్లాలి. మన పుస్తకాలు ఒకవేళ ఇంగ్లిష్‌లో పాపులర్ అయితే, వాటిని తిరిగి మన భాషలో వెతుక్కొని చదివేవాళ్లు పెరుగుతారు. ఇలాంటి ప్రయత్నాలు జరగాలి.

*

photo: Avadhimag

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

2 comments

Leave a Reply to uma nuthakki Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి ఇంటర్వ్యూ మల్లీ. వసుధేంద్ర గారి insight ని చక్కగా పట్టుకున్నావ్. ఆయన వ్యాసాలు కన్నడలో చాలా ఫేమస్ అట. తెలుగులోకి ఎవరైనా అనువాదం చేస్తే బాగుండు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు