మా అమ్మకి టైం తెలీదు,
అందుకేనేమో చెప్పిన టైం కంటే
ముందే నిద్రలేపుతుంది.
మా అమ్మకి పెద్ద పెద్ద డిగ్రీలు లేవు,
కానీ గుణంలో డాక్టరేట్ కంటే పెద్ద డిగ్రీనే ఉంది.
మా అమ్మకి ఏ పాటలు ఎవరు పాడారో తెలీదు,
కానీ నా స్వరాన్ని మాత్రం గుర్తుపట్టేస్తుంది.
మా అమ్మకి రుచికరమైన హోటళ్లు తెలీదు,
కానీ తన చేతి వంట కంటే రుచికరమైనది నేను ఇంతవరకు తినలేదు.
మా అమ్మకి తన ఆకలి తెలీదు,
కానీ నా ఆకలి తెలుసు.
మా అమ్మకి తన అందం గురించి తెలీదు,
కానీ నా అందాన్ని చూసి మెచ్చుకుంటుంది.
మా అమ్మకి తన గెలుపు తెలీదు,
నా గెలుపులో తన గెలుపును వెతుకుతుంది.
మా అమ్మ తినడం మర్చిపోతుంది,
కానీ నాకు ప్రతిపూటా గోరుముద్దలు చేసి పెడుతుంది.
మా అమ్మకి కథలు తెలీవు,
కానీ ప్రతి రోజు రచయిత్రిగా మారిపోతుంది.
మా అమ్మకి చందమామ తనలో దాగుంది అని తెలీదు,
అందుకే పైకి చూపించి తినిపెడుతుంది.
మా అమ్మకి తన ఆస్తులు, అంతస్థులు తెలీవు,
అందరికన్నా నేను పెద్ద ఆస్తి అనుకుంటుంది.
మా అమ్మకి తన కష్టాలు తెలీవు,
కానీ నా కష్టాలను తీరుస్తుంది.
మా అమ్మ తన పేరు మర్చిపోయింది,
తన పేరు “అమ్మ” అని మాత్రమే గుర్తుండిపోయింది.
*
nice
Amaa gurunchi chala chakkaga cheppavu.
Abhinandanalu.