ఉమేష్ కౌల్ : మరుగున పడిపోయిన మంచి కష్మీరీ కథా రచయిత . జననం శ్రీనగర్ లోని సోపోర్ లో. మొదట్లో హిందీ, ఉర్దూ భాషల్లో రచనలు చేసినా, చివరికి కష్మీరీ లో నేరుగా రాయడం, కష్మీరీకే కట్టుబడిపోవడం జరిగింది. ఆయన రాసిన మొట్టమొదటి కష్మీరీ కథ అధా కథ్ (అర కథ! / సగం కథ) 1955 లో ప్రముఖ కష్మీరీ పత్రిక “కోంగ్ పోష్” లో ప్రచురింపబడింది. ఆయన కథలు “దిల్” మరియు “దువోత్” లు, మానవ సంబంధాల ని ఆకళింపు చేసుకోవడంలో అతని నైపుణ్యాన్ని కళ్ళకు కడతాయి.
యూరోపియన్ సాహిత్యంతో ప్రభావితులైన ఆధునిక కష్మీరీ రచయితల సముదాయానికి చెందిన రచయిత, ఉమేష్ గారు. అతని రచన ల్లో అతని ఉనికి స్పష్టంగా కనిపిస్తుంటుంది. తరచుగా అతని భాష శృంగారాత్మకంగా మారుతుంటుంది. కొందరు పాఠకులకు అతని రచనలు అనుభూతుల పూలపానుపుల్లా అనిపిస్తాయి. ప్రసిద్ధమైన అతని రెండు కథలు అధా కథ్ (అర కథ), అఖ్ దేవ్తా అక్ రాఖయుస్ (ఒక దేవత, ఒక రాక్షసుడు) అతని, శైలిలో, భాషలో అన్ని కోణాలనూ బయట పెడతాయి. ఒకరకంగా అవి అతని ప్రాతినిధ్య కథలు.
ఉమేష్ కౌల్, సమాచార మరియు ప్రచార మంత్రిత్వ శాఖ తీసిన కొన్ని డాక్యుమెంటరీలకు స్క్రిప్ట్ కూడా రాసారు. మంచి ఫోటోగ్రాఫర్ కూడా. కేమెరా తో ప్రయోగాలు చేయడంలో దిట్ట. చిన్న కథల రచన లో ఆయనకున్న అపార ప్రావీణ్యం చెప్పుకోదగ్గది.
*
మానవ హృదయం
– ఉమేష్ కౌల్
“రాజరాణి అత్తయ్యా ! గాషా తో మాటాడి నన్ను ఆ ఫతె కి ఇచ్చి పెళ్ళి చెయ్యొద్దని చెప్పవూ ? ” మెహర్ మొత్తానికి ధైర్యం చేసి రాజ రాణి ని అడిగేసింది.
రాజరాణి అప్పుడే తన ఎడమ మోకాలి వైపుకు కుంపటి ని జరిపి, చిలుము నిండా బొగ్గు నింపుతూ ? “ఏం ఫతేకి ఏమి తక్కువ ?” అనడిగింది.
మెహర్ దగ్గర ఈ ప్రశ్నకి సమాధానం లేదు. ఆమె కేవలం రాజరాణి అత్తయ్య వైపు గుడ్లప్పగించి చూడటం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయింది.చెప్పాలంటే ఫతె లొ ఎటువంటి దుర్లక్షణాలూ లేవు. అతను వయసులో ఉన్నాడు. మంచి దేహ దారుడ్యంతో శుభ్రంగానే ఉంటాడు. కానీ మెహర్కి మాత్రం అతనిని పెళ్ళాడటం ఇష్టం లేదు.
ఫతెహ్ ఆమె దగ్గరి బంధువే. ఆమె తండ్రి సోదరుడి కొడుకు. అతని తల్లితండ్రుల మరణం తరవాత అతను మెహర్ తండ్రి, పాలమ్ముకునే ‘గాషా’ దగ్గరే ఉన్నాడు. అనాధ అయిన ఫతే మీద జాలితో కాకుండా, గాషా అతన్ని చేరదీయడానికి వేరే స్వార్ధపూరితమైన కారణాలున్నయి. అంతవరకూ ఇద్దరు అన్నదమ్ములకూ చెందిన ఇంటిని తానొక్కడే మింగేయాలని గాషా ఆలోచన. అందుకే ఫతే ని పెంచి ‘పెద్ద’ చేసే బాధ్యతని భుజాన ఎత్తుకున్నాడు గాషా. అతని తో పాటూ చనిపోయిన సోదరుడుకి చెందిన నాలుగు ఆవులనీ తన చేతికిందికి తెచ్చుకోవడమూ గాషా మర్చిపోలేదు. పైగా రెండుసార్లు పెళ్ళాడినప్పటికీ గాషాకి మగ సంతానం లేదు. దాంతో అతని పాడి అదీ చూసుకోవడానికీ, ఇరవైనాలుగు గంటలూ అందుబాటులో ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ఆ పన్లకీ, ఫతెహ్ సరిగ్గా సరిపోయాడు. ఫతే కూడా చాలా మంచి అబ్బాయి. వాడికి తన మొదటి భార్య కూతురు మెహర్ ని ఇచ్చి పెళ్ళి చేస్తే ఫతె ఇంక ఇంటిని విడిచిపోడని గాషా ఆలోచన.
ఫతే సరిగ్గా గాషా అవసరాలకి అతికినట్టు సరిపోయిన మంచి పని వాడు. తన ఎనిమిదో ఏటి నుండీ, ఆవులని మేతకు తోలుకుపోవడం, వాటిని జాగ్రత్త చూసుకుని, చీకటి పడే వేళకి ఇంటికి తీసుకురావడం, అతనికి అప్పగించబడిన పనులు. పాలని ఖాతాదార్లకు ఇచ్చి వాళ్ళ దగ్గనుంచి వసూలు చేసిన డబ్బు గాషా కి అందివ్వడమూ ఫతే చాలా నిజాయితీ గా చేసేవాడు. ఏళ్ళు గడిచేకొద్దీ అతని బాధ్యతలు పెరుగుతూనే వచ్చాయి. తనకోసం అంటూ కాణీ కూడబెట్టుకోవడం తప్ప మిగిలిన అన్ని పన్లనీ యంత్రం లాగా చేసిపెట్టేసెవాడు.
అతను బలవంతుడు, నిజాయితీ పరుడు, ముఖ్యంగా వొళ్ళు దాచుకోండా కష్టపడే మనిషి. అయినా మెహర్ కి అతనిలో జీవితపు మెరుపు ఎక్కడా కనబడేది కాదు. ఎలాంటి మెరుపంటే, ఏ కాస్తంత కొంటెతనమో, పరిమళాలు వెదచల్లే ఓ మంచి మాటో, వెచ్చని స్వభావమో, ఏదీ ఆమెకు కనిపించేది కాదు. ఒకప్పుడు అనాధ అయిన అతని లోకం అంతా ఆ ఇల్లు, నాలుగు ఆవులు, బోల్డంత పనీ తప్ప ఇంకోటి లేదు. వీటన్నిటి మధ్యా నిజమైన ఫతే ఎప్పుడో మాయమైపోయాడు.
మెహెర్ చిన్నప్పటి నుంచి పెద్దయాక తన పెళ్ళి ఫతే తోనే అని అందరూ చెప్తూండడం వింటూనే పెరిగింది. కానీ ఆమె మాత్రం ఫతే ని ఆ దృష్టి తో చూడలేకపోయింది. ఆమె వరకూ అతను ఓ చల్లని, జీవం లేని బొమ్మ, ఆ బొమ్మ కి దేని గురించీ ఆర్తీ లేదు, నిస్పృహా ఉండదు. ఒట్టి మూర్ఖుడు. ఆమెని అతను చూసే చూపులు కూడా అభావంగానే ఉండేవి. ఆ కళ్ళలో నవ్వో, ఆనందమో ఎప్పుడూ కనపడలేదు ఆమెకు. అతనో పని చెయ్యడం మాత్రమే ఎరిగిన యంత్రం.
హృదయం ఒక కొలను లాంటిది. తనకున్న ఆ చిన్న పరిధి లోనే ఆకాశపు లోతులనీ , , సూర్యుడి వెలుగుల్నీ, చంద్రుడి నవ్వుల్నీ ఒడిసిపట్టుకోగలదు. మెహర్ కి ఫతే లో ‘లేనిదే’మిటో స్పష్టంగానే తెలుసు, కానీ దానిని ఇతరులకు బోధపరిచేంత భాషా పరిజ్ఞానం ఆమెకు లేదు. అందుకే ఫతే కేమి తక్కువని అత్తయ్య అడుగుతుంటే చెప్పేందుకు ఆమెకు నోరు రాలేదు. నిజానికి ‘చేత’ కాలేదు. అందుకే రాజ రాణి అత్తయ్య చిలుముని హుక్కాకు బిగించి, బొగ్గు మంట ని ఊది, నోరు విప్పని ఆ పిల్లని ఆరాగా “నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా మరి ?” అని అడిగింది.
Heart touching story.
VERY NICE STORY!