మహమూద్ కవితలు రెండు

1

కలల దారిలోకి

ప్రవేశిస్తాం తెలియకనే
తెలియని లోకంలోకి
మూతపడ్డ కనుల లోపలి
చీకటిని చీల్చుకొని
విచ్చుకునే వర్ణాల తీరాల్లోకి
ఖాళీ నదులైనా
తడి తగిలే ప్రవాహాల్లోకి
కాలం
భూతమో
వర్తమానమో
భవిష్యత్తో విభజించలేని ఏకైక స్థలంలోకి
పర్వతాలు తలకిందులై
ప్రవాహాలు ఆకాశాలై
మేఘాలు రోడ్ల మీద వాహనాల్లా తిరిగే
సుషుప్తిలోకి
సౌందర్యం అసౌందర్యమై
అసౌందర్యం సౌందర్యమై
నలుపుకు పట్టం గట్టే వెలుతురు వేళల్లోకి
ఎప్పుడూ చూడని వాళ్ళు
రోజూ నీతోనే ఉండేవాళ్ళ కంటే అత్మీయత
కురిపించే స్రవంతిలోకి
నిజం సిగ్గుపడి కవి నలిప్పడేసే కాగితంలా
గిరాటేయబడ్డ
దారిలోకి
కనుల గర్భంలో ఆడుకునే
కలల పిల్లల ఆటల మైదానంలోకి
వాస్తవం అనిపించేలా మైమరిపించే అవాస్తవంలోకి
****

నువ్వు రాకమునుపు

వలస‌పక్షి గమ్యంలా,
అన్నీ నువ్వే కనుగొన్నావు
ఎక్కడ దొరికాను నేను నీకు-
దారి తప్పిన మానవుణ్ణి
మంచి మిత్రుని కరచాలనంలా
ఇహలోకపు మాయా మార్మాల్లో మత్తిగిలిన
ఏ దారుల్లోంచి న్నన్నెత్తుకొచ్చేసి
ఇక్కడ దింపావూ?
గమనం గురించి నీకే తెలుసు
దారి కూడా నీవే నిర్మించుకున్నావు!
జాడలు ఎలా కనుగొంటారో శోధకులు!?
ఎన్నెన్ని అవాంతరాలను దాటి వచ్చేస్తారో!?
చివరికి గాయాల దేహంతో
చిర్నవ్వు ముఖంతో
చేరాల్సిన చోటికి చేరాక,
ఎక్కడో పుట్టిన విహంగం ఇంకెక్కడో గూడల్లినట్టు,
ఓ ప్రపంచాన్ని నిర్మించేస్తావు.
ఒకటి రెండూ ఓయాసిస్సుల్ని కూడా!
తల్లి దీవెనలేవో ఖర్జూరపు చెట్ట్లై,
ఆమె పిల్లల మందహాసాలేవో అత్తరు తోటలై,
ప్రేమికుల ప్రేమసమయాలేవో నెమలి నాట్యాలై,
అరేబియా పడుచుల ముఖారవిందపు మెరుపులు సెలయేటి గలల లై,
నా కలల్లో ప్రపంచం వాస్తవంలోకి వచ్చి
నన్ను నిత్య మైమరపుకు గురి చేస్తోంది.
ఇప్పుడిక్కడ ఓ లోకం ఉంది-
అందులో జీవితం ఉంది-
జీవితం నిండా సంతోషపు ముఖవర్చస్సు ధగధగలాడుతోంది-
సముద్రం మీద
సాయంకాలపు గోధూళిలా పరుచుకొని ఉంది-
తారకల పైకప్పు శిరస్సు మీద
పచ్చని పొలం పాదం కింద
చలువ రాతిరి ఉదయపు కిరణాల ఒడిలో
ఓలలాడుతున్నది
“శోధించుకో నువ్వూ నీ జీవితాన్ని,
నీలో నీ జీవితాన్ని” అని అంటావు కదా నువ్వు,
నీ దృష్టి ఎన్ని కఠిన కాలాలకి రెక్కలిచ్చిందో
ఎంత దుఃఖాన్ని విడుదల చేసిందో-
ఇక్కడి దాకా రావడానికెంత
జీవితాన్ని వెచ్చించావూ?
ఎన్ని కష్టాల్ని దిగమింగావూ?
ఎన్ని నొప్పుల వసంతాల చిగురింతల వానలో తడిచి వచ్చావూ?
నువ్వు రాక మునుపు
ఇది ఒట్టి ఎడారి..
ఇప్పుడు నాదనే ఆకాశం
నాదనే భూమి
నావనే కొన్ని మొక్కలు
నాదనే పరిమళం
గడ్డిపోచలతో స్నేహం
ఇప్పుడు మానవత్వం నా వ్యవసాయం
అన్నింటికీ మించి
ఇసుకతుపానుల తాకిడిని
ఎదుర్కొనే ధైర్యం నా స్వంతం
జహాపనా!
రేపటి నీ విడిది ఏక్కడో చెప్పు,
ఈ లోకాన్ని ఇంకొకరి కోసం వొదలి
నువ్వు నిర్మించబోయే-
కొత్త లోకం దగ్గరికి నీ వెనుకెనుకే వచ్చేస్తాను.!
*

మహమూద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు