మల్లెపూలు

జీవాడ బస్టాండు దగ్గిర బందరుకాల్వ బిజ్జి మీదకొచ్చి నీరసంగా నిలబడిపోయాను. కూతంత దూరంలో ఓ మామ్మ పూలమ్ముతా కనపడింది. బుట్టలోని మల్లెపూలన్నీ నన్ను సూసి “ఏమేవ్ మల్లీ! సిన్నప్పుడు మేమంటే పడి సచ్చిపోయేదానివి. అప్పట్నుంచి పత్తా లేవ్. ఇన్నాళ్లూ ఏమైపోయావ్? ఏంటీ నీ కత” అంటూ కళ్ళెగరేసినట్లు అనిపించేసరికి ఏవేవో గుర్తుకొచ్చేసాయి. కాలం ఎనక్కి ఎళ్లిపోయినట్టు అనిపిచ్చింది.

మాది కడియపు సావరం. పూలమొక్కలకి పెట్టింది పేరు. గులాబీ, కనకాంబరం, సేమంతి, లిల్లీ, జాజి, సన్నజాజి, ఇరజాజి, బంతి, సంపెంగ. మా వూళ్ళో దొరకని పూలరకమంటూ వుండదు. ఎవురైనా వూళ్ళోకొచ్చి గులాబీమొక్క కావాలనడిగితే, “గులాబీ మొక్క కావాలాండీ? సరేనండి. ఇచ్చేత్తాను. ఇంతకీ మీకు ఏ రకం గులాబీమొక్క కావాలండి?” అంటా వందల రకాల మొక్కలను సూయించేత్తారు మా వూరోళ్ళు. అట్టాంటి వూళ్ళో పుట్టాన్నేను.

ఈ వూళ్ళో పెతి ఇంట్లోనూ ఆడోళ్ళు పూలమాలలు కడతానే కనిపిత్తారు. అదే ఆళ్ళకొచ్చిన పని. మాయమ్మ కూడా అలానే ఇంట్లోనే దండలు కట్టేది. అపుడపుడు పూలు కోయడానికి కూలికెల్లేది. ఆ పనిసేసే అన్నయ్యని సదివించుకునేది. నన్ను బడిలో ఎయ్యలేకపోయింది కానీ, అడిగింది కాదనకుండా మాత్రం సూసుకునేది.

మా ఇంటి నిండా ఎప్పుడూ పూలే! నేను పూలమజ్జే పుట్టి, పూలమజ్జే పెరిగాను. అదేంటోగానీ‌ సుట్టూ ఎన్ని పూలున్నా, సిన్నప్పటి నుంచి నాకు మల్లెపూలంటేనే మా పిచ్చి. ఆటి వాసనంటే పేనం. ఎందుకో నాకే తెలీదు. అదొక మాయనుకోండి. ఇది మాయమ్మ ముందే వూహించేసిందో, ఏంటో నా పేరు గూడా మల్లిక అనే ఎట్టేసింది.

సిన్నప్పుడు మా అమ్మ నాకు తలదువ్వి, ఎర్రరిబ్బన్‌తో రెండు జెడలూ బిగ్గా ముడేసి, తల్లో  మల్లెపూలెడుతూ, “రోజూ నీ జెడకి సరిపడా మల్లెపూలు ఎట్టాలంటే మన కడియం సరిపోదే మల్లీ” అంటా తెగ మురిసిపోయేది. ఎంటనే “దిట్టి తగుల్తాదే నీకు మల్లికా” అంటా ఉప్పుని సుట్టూ తిప్పి ఉమ్మేసేది.

అట్టాంటి అమ్మ ఓ రోజు మావుళ్ళు గారి పొలంలో పూలుకోసే పనికి పోయి అలిసిపోయొచ్చి పొడుకుంది. ఎందుకోగానీ పొద్దెక్కినా లేలేదు. మీ అమ్మ సచ్చిపోయిందని సుట్టుపక్కనోళ్లు అంటుంటే సావంటే ఏమిటో తెలీక ఏడలేదు అయ్యాల నేను.

రేతిరయ్యేసరికి అన్నయ్య, నేను ఇద్దరమే మిగిలాం ఇంట్లో. సీకట్లో భయమేసేసి అమ్మ గురుతుకొచ్చి బెంగతో అప్పుడు ఏడుపొచ్చేసింది నాకు. “ఊరుకో మల్లీ! అమ్మ రేప్పొద్దున్నే వచ్చేత్తాది” అంటూ అన్నయ్యే నాకు అన్నం తినిపింసేసి జోల పాడి నిదరోబెట్టాడు. మజ్జలో నాకు మెలకువొచ్చి చూత్తే  ఆడు అద్దరాతిరి గుక్కపెట్టి ఏడుత్తున్నాడు. నాకు ఇనపడగూడదని బలంతంగా ఏడుపు ఆపుకుంటున్నాడు. కానీ గుటకలు మింగడం నాకు ఇనిపించిపోతానే ఉంది.

ఆ తర్వాత ఎప్పటికో నాకేమనిపించిందంటే ఆడు అప్పుడు సావంటే తెలిసే నా ముందు ఏడుపు ఆపుకున్నాడన్నమాట. ఎవురైనా సచ్చిపోతే ఎంటనే ఏడ్చేసేవాళ్ళకి బోలెడు బాగ్యం. అక్కడితో తీరిపోద్ది. ఆ బాగ్యం లేనోళ్ళు జీవితమంతా ఏడుత్తానే వుంటారు.

అన్నయ్యకి ఆ బాగ్యం లేదు. పైగా ఆడు బతకడం కోసం, నన్ను బతికించడం కోసం బడి మానేశాడు. పనులకి పోయేవాడు. అపుడపుడు రాజిమండ్రిలో దొంగతనాలు కూడా సేసేవోడు. ఓసారి ఇంటికి వచ్చేసరికి ఆడి బుగ్గ ఆసిపోయివుంది. పర్స దొంగతనం సేత్తే పోలీసోడు అట్టుకుని వీడి సెంప పగలగొట్టేసి ఆ పర్సలోని డొబ్బులు లాగేసుకున్నాడట. ఆ పోలీసాయన లెక్కపెకారంగా అన్నయ్యని జైల్లో కదా ఎట్టాలి. కనీసం అలా సేసున్నా అన్నయ్యకి జైల్లో ఇంత కూడు దక్కేది. ఇలా డబ్బులు గుంజేసుకుంటే ఆ పోలీసోడు కూడా దొంగే కదా అవుతాడు.

ఈ దొంగతనాల ఇశయం తెల్సి “ఎలాంటామె కడుపునపుట్టి ఎలాంటి పనుల్రా చేసేది” అంటూ ఊరోళ్ళు కూడా అన్నయ్యని కొట్టేసారు. సచ్చిపోయిన అమ్మకి కూడా సెడ్డపేరు తెచ్చేసానని సిగ్గుతో ఇక ఆ ఊళ్ళో ఉండబుద్దిగాక రేత్రికిరేత్రి రైలెక్కేసి ఈ ఇజీవాడ తీసుకునొచ్చేసాడు మా అన్నయ్య.

ఇక్కడికొచ్చేసరికి ఆడికి పదిహేడు. నాకు పదకొండు.

ఇక్కడికొచ్చాక మా అన్నయ్య ముందుకులాగే సిన్న సిన్న దొంగతనాలు సేత్తా నన్ను బాగా సూసుకునేవోడు. ఓసారి మాత్రం దొరికిపోయి జైల్లో వుండాల్సొచ్చింది. అక్కడ ఆడికి ఎవరెవరితోనో జత కుదిరింది.

ఆళ్ళని బ్లేడు బ్యాచీ అంటారట. జైలు నుంచి బయటికొచ్చాక మా అన్నయ్య కూడా ఆళ్ళతో పాటే తిరిగేవోడు. ఆళ్ళతో కలిసి బ్లేడు చూయించి జనాల్ని బెదిరించి డబ్బులు గుంజుకునేవోడు. పోలీసోళ్లు వత్తే ఆడి సెయ్యి ఆడే కోసేసుకుని పోలీసోళ్లని కంగారెట్టేసేవోడు. ఇరవైనాలుగ్గంటలూ గంజాయి తాగుతా ఎప్పుడూ మత్తులోనే జోగేవాడు.

ఓ రోజు రాతిరి ఆ బ్యాచీలోని ఒకడు సీకటిలో నా మీద పొడుకుని ఏదేదో సేత్తున్నాడు. ఏం సేత్తున్నాడో నాకు అర్థంగావడం లేదు. నొప్పెడతుందని తోయబోతే సేతులు ఎనక్కి ఇరిసేసాడు. అరవబోతే నోరు నొక్కేసాడు. కొంసేపటికి లేసి ఎల్లిపోయాడు. కిందంతా జిగట జిగట. ఆ రోజంతా ఏడుత్తూనే ఉన్నాను. అన్నయ్యకి సెపుదామంటే ఆడు నాలుగురోళ్లుగా కనపడనే లేదు. ఆడు వొచ్చాక సెప్పాను. గంజాయి పీలుస్తూ గట్టిగట్టిగా ఏదేదో అరుత్తూ కిందడిపోయాడు. ఆ తర్వాత మళ్లీ ఆ ఊసు ఎత్తలేదాడు.

బ్యాచీలోని ఆ ఎదవ మళ్ళీ వొచ్చాడో రోజు. ఈసారి ఆడితో పాటు ఇంకో ఇద్దరు. ఆడూ ఆడి తర్వాత ఇంకొకడు. అలా ముగ్గురూనీ.

మళ్ళీ అదే పని..

అప్పటి నుండి రోజూ..

పదే పదే అదే పని..

ఇపరీతంగా కడుపునొప్పి. రాతిరవుతుందంటే సాలు జడిసిపోతున్నాను. ఆళ్ళు ఎందుకు అలా సేత్తున్నారో, నేనేం సేయాలో తెలీదు. రాన్రానూ వాళ్లేంసేసినా ఏమనకుండా గట్టిగా కళ్ళు మూసేసుకుని గమ్మునుండడం అలవాటుసేసుకున్నాను. కొన్నాళ్లకయితే వొళ్ళు తెలీని మత్తులో ముగ్గురు ఆళ్ళూ. ఆళ్ళతో పాటు అన్నయ్య కూడా.

అన్నయ్య కూడా ఎందుకు ఇలా సేత్తున్నాడు? మామూలుగా అయితే నాకు నొప్పొచ్చే పని సేయడు కదా! మరి నా నొప్పితో సంబందం లేకుండా ఎందుకిలా సేత్తున్నాడు? ఆ పనిని ఈళ్లందరూ ఎందుకు సేత్తున్నారు రోజూనీ? అంత బాగుంటుందా ఈళ్ళకి? మరి నాకేంటి ఇంత నరకంగా వుంటుంది?

అన్నయ్యకి ఇట్టం అయితే అన్నయ్యతో బరిత్తాను. అన్నయ్యకోసం బరిత్తాను. ఈళ్ళని ఎందుకు బరించాలి? ఈళ్ల కోసం ఇంతటి బాదని ఎందుకు మోయాలి అంటా ఏడుత్తూ కూకున్నేదాన్ని.

కొన్రోళ్లకి ఓసారి ఈళ్లంతా కలిసి, సదువుకుందాం అనొచ్చి ఇజీవాడ బస్టాండీలో బస్ దిగిన ఓ ఆడపిల్లని ఆటో ఎక్కించుకుని ఆ పని సేసారట. పేపరోళ్ళు బాగా గొడవెట్టేసరికి, జనాలు గగ్గోలెట్టేసరికి పోలీసోళ్ళు మా అన్నయ్యతోపాటు ఆ ముగ్గురినీ కూడా కాల్చి సంపేశారు.

ఇప్పుడు నాకు రోజూ ఆ నొప్పి తప్పినందుకు సంతోసించాలా? అన్నయ్య సచ్చిపోయినందుకు బాదపడాలా?

బాగా సదూకునే అన్నయ్య నా కోసమే కదా దొంగయ్యాడు. ఎంత కాదన్నా ఒక్కపుడు పేమగా సూసుకునేవోడు. ఆ బ్యాచీతో జతయ్యాకే గంజాయికి లొంగిపోయాడు. అన్నయ్య మంచోడో, సెడ్డోడో నాకు తెలీదు. ఆడు నాకున్న ఒకే ఒక్క పేగుబందం. అది కూడా తెగిపోయింది.

అన్నయ్యనే కాదు, అసలు నాకా పనిలో నొప్పిలేకపోతే ఆళ్ళెవ్వరిమీదా కూతంత గూడా కోపం వుండేదే కాదు. ఆడితోపాటు పాపం ఆ ముగ్గురు కూడా సచ్చిపోయారు. యే? రోజూ ఆ పనికి నేనెలాగూ వుంటున్నాను, నాతో సరిపెట్టుకోవచ్చు కదా! ఇంకో ఆడపిల్ల జోలికి పోయి ఇలా పేనాలు పోగొట్టుకునే బదులు. పిచ్చినాయాళ్లు కాకపోతీనీ.‌ ఆళ్ళకి అలా మూడిందేమో సావు?

ఇప్పుడు నేనేంసేయాలో తెలియని అయోమయంలో రోడ్డు మీదడ్డాను. దిక్కులు సూడ్డం తప్ప వేరే దిక్కులేనప్పుడు నన్ను ఆదుకుంది ఆ మందారమక్కే. రాజరాజేశ్వరిపేటలో అక్క ఇంటికి సేరిపోయాను నేను.

అప్పటినుంచి ఆమిల్లే నా ఇల్లు. ఆమితోనే నా బతుకు.‌ కానీ అక్కడ నాకొకటే ఇడ్డూరం. ఇన్నాళ్లు నా మీద పడి ఉత్తునే సేసిన పనే ఇక్కడ అక్కకి డొబ్బులిచ్చి సేత్తున్నారందరూ. “అక్కా! ఆళ్ళు నీకు డొబ్బులెందుకు ఇత్తున్నారు?” అని అడిగా ఓసారి. “ఇదెంతయిలువైందో నీకు తెలీదే పిచ్చిదానా” అని నవ్వేసింది.

కొన్రోళ్లకి నేనూ అదే పనిలోకి దిగిపోయాను. నాకెలాగూ అలవాటే కదా! పెద్దగా తేడా ఏముంది? ఇంకా డొబ్బులు కూడా వత్తున్నాయ్. నాకైతే అక్కకంటే ఎక్కువే ఇత్తున్నారు. అలాగని అక్కకి నా మీద కుళ్ళేమీ లేదు.

“నువ్వు అందంగా ఉంటావని పడి సచ్చిపోతున్నారు ఎదవలు. అందుకే అన్నేసి డొబ్బులిస్తున్నారు. నేను అటుఇటు కానిదాన్ని కాబట్టే తక్కువ డొబ్బులు. ఎవరో కక్కుర్తిగాళ్ళు తప్ప పెద్దగా రారు. అయినా గొంతెత్తి మాట్టాడకుండా ఉంటే పైకి చూత్తానికి మొత్తం అమ్మాయిలానే ఉంటాను. అందుకే ఈ మాత్రమయినా దక్కుతుంది. లేపోతే ఇదీ లేదు. ఏమో? తక్కువకి ఇత్తానంటే ఎలాగైనా వత్తారేమో ఈ కక్కుర్తి నా కొడుకులు” అంటూ గలగలా నవ్వేత్తుంది అక్క.

బాదొచ్చినప్పుడు నేను ఎక్కువగా ఏడిత్తే, ఈ అక్క ఎక్కువగా నవ్వుతాది అని నాకప్పుడే తెలిసింది.

అక్క ఇంట్లోకి వచ్చినప్పటినుంచి మాత్రం నాకు ఏడుపు లేదు. నవ్వూ లేదు. అలా గడుత్తుంది అంతే. అక్కడికి కాలేజీ సదువుకునే కుర్రాళ్లే ఎక్కువగా వొచ్చేవాళ్ళు. బాగా డబ్బున్నోళ్లు ఆళ్లంతా.

ఓసారి అక్కతో “అక్క ఈయాలా వచ్చినబ్బాయి ఏదేదో మాట్టాడుతూ సెక్కసు‌ అని ఏదో అన్నాడు. అలా అంటే ఏంటక్కా?” అని అడిగాను. “సెక్సా? అదా? అది ఇలాంటిదే. కానీ ఇది కాదు. ఈళ్ళు దీన్నే అది అనుకుంటున్నారు ఎర్రోళ్ళు. అందులో అయితే ఇద్దరికీ బోలెడు సుఖమూ, తృప్తి ఉంటాది. నీకు తెలియదులే అయన్నీ” అంది.

“అదెలా ఉంటుందో? అదేంటో తెలీకుండానే పోతానా అక్కా? నాకు ఒక్కసారి సెక్కసు కావాలని ఉంది. అది కావాలంటే నేనేం సేయాలక్కా?” అని అడిగాను.

అక్క నన్ను దగ్గరకు తీసుకుని కాసేపటిదాక ఏమీ మాటాడకుండా వుండిపోయింది.

మళ్ళీ నేనే అక్కతో “అవునూ! ఆ కుర్రోళ్ల కాలేజీలో  ఈళ్ళలాగే సదువుకునే అమ్మాయిలు కూడా ఉంటారు కదా! ఆళ్ళని అడగరా ఈళ్ళు? అడిగితే ఇవ్వరా ఆళ్ళు? ఎందుకనీ? అలా అందరూ ఇవ్వట్లేదు గనుకే కదా ఈ బెత్తెడు జాగ ఇంత ఇలువైనది అయ్యిపోయింది? మనిసికి మనిసి నచ్చితే ఆడికి అదిచ్చి ఆ సుఖాన్ని నచ్చినోడితో పంచుకోవచ్చు కదా” అన్నాను.

“ఆడోళ్ళలో ఈ లోకానికి పనికొచ్చేదేదైనా ఉందంటే నువ్వన్న ఈ బెత్తెడు జాగనే. పెపంచం మొత్తం దాని సుట్టే తిరుగుతుంది. దాన్ని వూరికే ఇచ్చేత్తే ఆడదానికి ఇక ఇలువే ఉండదు. అలా అందరూ ఇయ్యకపోడం వల్లనేగా మనకిప్పుడు ఈ మాత్రం అయినా కడుపు నిండుతుంది” అంది అక్క.

నిజమే కదా అనిపించింది నాకు.

ఓ రోజు అక్క సంబడంగా నా పక్కకొచ్చి కూకుని, “నా ఆపరేసన్‌కి సరిపడా డొబ్బులు పోగయ్యిపోయాయి. నాకు ఎప్పటినుంచో నీలా పూర్తిగా అమ్మాయిలా మారాలని కోరిక. ఈ డొబ్బులతో బొంబాయి పోయి ఆపరేసన్ సేయించేసుకుని ఓ నెలలో వచ్చేత్తాను” అనింది.

టేషన్‌లో అక్క రైలు ఎక్కుతుంటే నాకొకటే దిగులుగా ఉంది. తెలియకుండానే కన్నీళ్ళొచ్చేసి అక్కనట్టుకుని ఏడ్చేశాను.

“ఒక నెలేగా! పనవ్వగానే ఎంటనే వచ్చేత్తానన్నాను కదా! ఎందుకే ఏడుత్తావ్? ఓహో! నేను అమ్మాయినయితే నీకంటే అందంగా ఉంటానూ, నా దెబ్బకి నీకు బేరాలే ఉండవనే కదా నీ బయ్యం?” అంటా ఉడికించి పగలబడి నవ్వుతా బుగ్గ గిల్లింది అక్క.

సెప్పాకదా! ఈ అక్క పైకి ఎంత ఎక్కువ నవ్వితే,  లోన అంత ఎక్కువ ఏడుత్తున్నట్టు.

అలా నవ్వుతానే గిల్లిన బుగ్గ మీదే ముద్దెట్టి రైలు ఎక్కేసి ఎల్లిపోయింది అక్క. నెల కాదు, ఆరు నెలలైనా రాలేదు. ఏమైందో తెలీదు. ఆమకోసం ఎదురుచూత్తానే ఉన్నా గానీ, ఆమనుంచి ఏ కబురూ లేదు. తనకేమయ్యిందోనని గుబులట్టుకుంది. సూసి సూసి ఇక నిబ్బరం తెచ్చుకుని పోలీస్ టేషన్‌కి వెళ్లి కంప్లయింటు ఇచ్చాను. ఆళ్ళు సేసింది ఏమీ లేదుగానీ అప్పటినుంచి నన్ను ఏపుకుతిన్నారు. డొబ్బులో డొబ్బులు అంటూ ఇంటికొచ్చేసేవోళ్లు. అక్క ఉన్నప్పుడు గూడా ఈ పోలీసుల బెడద ఉండేది. కాకపోతే అన్నీ అక్కే సూసుకునేది కాబట్టి అవేవీ నాకు తెలిసేవి కావు.

వీళ్ళ గొడవ సూసి సూసి ఓ రోజు ఓనరు ఇల్లు ఖాళీ సేయించేసింది. అప్పటిదాక ఉన్న ఆసరా కూడా పోయింది. ఇప్పుడెలా?

మళ్ళీ రోడ్డు మీద పడ్డాను. కానీ ఇంతకుముందులా బేలగా లేను. నిబ్బరంగానే వున్నాను. సచ్చేదాక బతకడమే కదా బతుకంటే!

ఇప్పడేమి సేయాలి అనేదొకటే ఆలోసించాను. ఒకటే తట్టింది. ఇన్నాళ్లూ ఇంట్లో చేసిన పనే ఎక్కడబడితే అక్కడ సేసేద్దాం అనిపించింది. ఆ పనికే రోడ్డుమీద నిలబడ్డాను. ఎలాగైనా బతకాలి. అదొక్కటే మొండి పట్టుదల.

దాని కోసమే అలా అలా తిరుగుతూ ఉన్నా. ఈ బందరు కాల్వ బిజ్జి మీద నాలాంటివాళ్ళే నిలబడ్డం చూసి నేనూ ఇక్కడే నిలబడ్డా.

ముందుగా ఒక ఆటోవోడొచ్చి ‘ఎంత?’ అన్నాడు. తొలిబేరం కదాని “ఏడొందలు” సెప్పాను. “ఐదొందలిత్తా” అన్నాడు. “వూ” అన్నాను.

ఆటోలోకెక్కించుకుని ఉండవల్లి పొలాల్లోకి తీసుకునిపోయి, పనయ్యాక మూడొందలు సేత్లో ఎట్టాడు. ఈడిలాంటోళ్లకి లేతమాంసం అంటే ఇట్టం. దాన్ని కుమ్ముతూ హూనం చేయడం కిక్కు. దీన్నంత బరించి కూడా ముందొప్పుకున్న డొబ్బులు ఇయ్యకపోతే సంపేయాలనిపిత్తాది. కానీ ఓ పిచ్చి నవ్వు నవ్వి అక్కడ్నుంచి వొచ్చేసాను.

మర్నాడు ఎంతసేపు నిలబడ్డా ఒక్కడూ రావట్లేదు. తర్వాత అర్థమయ్యింది, మేము ‘అలాంటివోళ్ళం’ అని తెలియడానికి ఆ రాతిరిపూట తలనిండా మల్లెపూలు ఎట్టుకోని నిలబడాలంట. నిన్న ఆ ఆటోవోడు ఏదో ఉషారులో అడిగేసాడు గానీ, పాపం అందరూ ఎవరినిబడితే ఆళ్ళని అలా అడగలేరు కదా! మేము మేమే అని తెలియాలంటే మల్లెపూలు ఎట్టుకుని నిలబడాల్సిందే!

అమ్మ సచ్చిపోయాక నేనింక మళ్ళీ మల్లెపూలు ఎట్టుకోలేదు. ఇప్పుడు ఆ ముసలి మామ్మ బుట్టలోని పూలు సూడగానే సిన్నప్పటి నుంచివి నాకియన్నీ గురుతుకొచ్చాయ్.

ఆ పాత గురుతుల్లోనుంచి బయటపడి, ఇన్నాళ్ల తర్వాత ఇయ్యాల మళ్ళీ రెండు మూరల మల్లెపూలు కొనుక్కుని తల్లో ఎట్టుకుని ఆ బిజ్జిమీద నిలబడ్డాను.

అప్పటి నుంచి ఇక రోజూ తల్లో మల్లెపూలు ఎట్టుకుని అక్కడ నిలబడ్డమే నా పని. సెప్పాకదా! నాకు చిన్నప్పుడు మల్లెపూలంటే పేణం అని. కానీ ఇప్పుడు నాకీ పూలంటే అసయ్యం. ఒకప్పుడు మాఇట్టమైన ఆ సువోసన ఇప్పుడు నాకు ఎలుక సచ్చిన వోసన. నేను తానం చేసి వారం రోజులయ్యినా, నా వొళ్ళు ఎలాగున్నా ఈ మల్లెపూల మత్తులో ఆడు పట్టించుకోడు. సారా కొంపుతో మీదపడ్డా, గుట్కా తుంపర్లు మీదడ్డా ఈ గబ్బు మల్లెపూల వాసనలో నేనూ పట్టించుకోను.

కానీ, ఆ కడియపు సావరంలో మాయమ్మ పేమగా నా తల్లో తురిమిన పూల పేమ గురుతులని ఈ ఇజీవాడ మురికి మల్లెపూలు ఆపలేకపోతున్నాయి. పదే పదే గురుతుకొత్తానే వున్నాయ్. ఆ నా సిన్ననాటి మావూరి అమాయక పూలు నన్ను నాలో తోడేత్తా ఏడిపిత్తానే వున్నాయి.

పూలు ఎట్టుకోకపోతే ఇక్కడ బతుకు లేదు. ఎట్టుకుంటే గుండెలో గునపాల్లాంటి గురుతులు.

ఈ మల్లెపూల మత్తులో నా బతుకుతో సహా అన్నీ కొట్టుకుపోతున్నట్టు, ఈ సిన్నప్పటి గురుతులు కూడా అలా అలా కొట్టుకుపోతే ఎంత బాగున్ను!

చీ! ఏమిటో ఇయ్యాల మరీ ఏడుపొచ్చేత్తుంది.

*

చిత్రం: శ్రీచరణ్

చిన్నీ అజయ్

పేరు అజయ్. మూలాలు తెలుగే అయినా, పుట్టిపెరిగింది, డిగ్రీ వరకు చదువుకున్నది కర్ణాటకలోని రాయచూరు జిల్లా మాన్వి అనే ఊరిలో. బెంగళూరులో ఒక బహుళజాతీయసంస్థలో మూడేళ్లు ఉద్యోగం చేశాను. ప్రస్తుతం కడియం లో ఉంటూ ఒక ఎన్జీవో తరపున మూడేళ్ళ నుంచి ఫ్రీలాన్స్ ట్రైనర్‌గా పని చేస్తున్నాను.

13 comments

Leave a Reply to Thorlapati Raju Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ముందుగా రచయితకు అభినందనలు👏, కథ, కథను నడిపిన తీరు చాలా చాలా బాగుంది. స్లాంగ్ వల్ల కథకు అదనపు అందమొచ్చింది. ఏమీ ఎరుగని పల్లెటూరి మల్లి అమాయకత్వం ప్రతి ఒక్కరి గుండెని బరువెక్కిస్తుంది. కొన్ని సంభాషణలు superb గా ఉన్నాయి. కథ ఆపకుండా చదివించింది.

  • కథ చాలా బాగుంది.అద్భుతమైన వ్యక్తీకరణ. అభినందనలు.

  • కథనం ఏకధాటిగా చదివించింది. కథ గుండెను బరువెక్కించింది. మీనుంచి మరిన్ని గొప్ప కథలను ఆశించొచ్చు. అభినందనలు.

  • EE katha aedainaa poteeki pamper vunte arudaina bahumati
    ivva valasinanta goppagaa Vundi.ippati darunalu Elaa vunnayo
    Cheppadamekaadu voka Kotta pandhaalo raasina Ajya Gari aalochana adbhutam.ee kotta danam Kosam eduruchsaanu.
    Saaranga patrika writer ki tagina gurtimpu ivvamani korutunnaanu.
    Annapurna
    Writer
    California US.

  • చిన్నీ కథ మొదలుపెట్టాడంటే అది మధ్యలోనే ఆగిపోతుందనే అభిప్రాయంలోనే ఉండిపోయేవాడిని అప్పట్లో… ఎలాంటి పోస్ట్ రాసినా చదివించగల నేరేషన్ చిన్నీ ప్రత్యేకత అనే అభిప్రాయం వల్ల నీ కథలపట్ల ఆసక్తి కలిగి ఉన్నాకూడా మధ్యలో ఆపేయడంవల్ల నమ్మకం లేక ఎక్కడో నీ కామెంట్ చదివి నీ కథ ఈ పత్రికలో అచ్చయిందని తెలిసీ చదవాలనిపించలేదు చిన్నీ. బట్ శ్రీధరన్న కథ గురించి వచ్చి చదివాక స్క్రోల్ చేస్తుండగా నీ కథ కనిపించింది. స్టార్టింగ్ ఆ అంత ఏముంటుందిలే అనిపించింది కానీ ఆపకుండా చదివించేలా చేసిన నీ కొత్త శైలికి ఫిదాకాక తప్పలేదు.. ఒక మీనీ సినిమాని తలపించింది. ఇలాంటి కథనాలతో వచ్చిన చాలా సినిమాలు జ్ఞప్తికి వచ్చాయి. కంటిన్యూ చేస్తుండు చిన్నీ.. ఆల్ ద బెస్ట్ 👍

  • పూల పరిమళం అదిరింది ,ఎక్సలెంట్ అభినందనలు

  • కథనం ఏకధాటిగా చదివించింది. కథ గుండెను బరువెక్కించింది.

  • టైటిల్ తగ్గట్టు గా..మల్లెపువ్వు కోసం ఆద్యాంతం చాలా చక్కగా ఆకట్టుకునేలా ఉంది మీ పదజాలం.మల్లెలు ఉన్న మత్తెక్కించే గుణం కిక్కెంచే గుణం..మీ రచనలో ఉంది …ఇది చదువుతుంటే..మల్లెలు కోసం నాకో విషయం గుర్తుకు వచ్చింది మల్లెలు లేనిదే… ఆడవారి సిగకు అందం లేదు.. ఒక విధంగా చెప్పాలంటే నీ..నా పుట్టుకలో …. కాసింత అయిన..పాత్ర ఉంది ఎందుకంటే మల్లెలు లేని మొదటి రాత్రే ఉండదు…అంత ప్రాముఖ్యత ఉన్న మల్లెలకి…దేవుడు దగ్గర స్థానం లేకుండా చేశారు…

  • అజయ్…

    ఎంత బాగా రాసావో. ఈ కథ ముందెప్పుడో చదివాను. చాలా రోజులు వెంటాడింది. కానీ అప్పుడు నువ్వెవరో తెలీదు. మళ్ళీ ఈ రోజు ఇక్కడికొచ్చి చదివాక అదే గుండె బరువు.

    “ఎవురైనా సచ్చిపోతే ఎంటనే ఏడ్చేసేవాళ్ళకి బోలెడు బాగ్యం. అక్కడితో తీరిపోద్ది. ఆ బాగ్యం లేనోళ్ళు జీవితమంతా ఏడుత్తానే వుంటారు.”

    “పైకి ఎంత ఎక్కువ నవ్వితే,  లోన అంత ఎక్కువ ఏడుత్తున్నట్టు.”

    “సచ్చేదాక బతకడమే కదా బతుకంటే!”

    ఈ లైన్స్ చదువుతుంటే నువ్వు ఎంతో జీవితాన్ని చూసేసినట్టు అనిపిస్తుంది. ఆ మల్లిక నా పక్కనే ఉంది తన కథ చెప్పిందేమో అనిపించింది. నువ్వు ఇంకా చాలా చాలా రాయాలి.❤️

  • చాలా బాగా రాసారు అజయ్, మనుషుల పట్ల గొప్ప కన్సర్న్ ఉన్నప్పుడే ఇలా రాయడం సాధ్యం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు