మర్రికింద

“శిన్నమ్మా! నందుగాడున్నడా? ఫోన్ జేత్తే లేప్తలేడు!” గైన్దర్వాజా దగ్గర నుండే అడిగిండు సూరిగాడు.

“యెందుకు? ఇంత రాత్రేల మల్లేడికి వోతుండ్రు? ఇంకా సాల్ గాలేదా మీ తిరుగుడికి?” అమ్మ జర్రంత గట్టిగనే ఒర్లింది వాన్మీద.లోపట్ల రూంల కూసొని అన్నం తింటున్న నాకు ఇదంత ఇనిపిస్తనే ఉంది.

అయినా వాడేం ఉల్టా జవాబు జెప్పలే! అమ్మ గురించి వానికి బాగా తెలుసు.

ఇట్లనే గప్పుడోసారి నన్ను చేపలువట్టనీకి తోల్కపోతే, ‘అమాస గోల మావోణ్ణి వాగులకి తోల్కవొయిండు మీవోడు’ అని జెప్పింది వాళ్ళమ్మకి. అంతే! వాళ్ళమ్మ వాణ్ని పొట్టు పొట్టు గొట్టింది.

అగొ గప్పటినుండి గిప్పటిదాకా సూరిగాడికి మా అమ్మతోని మాట్లడుమంటే జర్రంత భయమే!

అమ్మ వాణ్ణి ఇంకేం అనకముందే నేనే “రేయ్! నేనొస్త, నువ్ నడు” ఆయింత రెండు బుక్కలు జెట్ట జెట్ట తిని రూమ్‌లకెళ్ళి బయటికస్తూ జెప్పిన.

“సరే జల్ది రా” అని జెప్పి వాడు పోయిండు.

“అచ్చిందే పొద్దంత వొయినంక. గిప్పడిదాకా గాన్తోనే ఉంటివి. మల్ల వస్తా అని జెప్తున్నవ్. గీ రాత్రిళ్ళ యాడికోతుండ్రు? మీ తిరుగుట్ల మన్నువడ.. ఒక యాళ్ల లేదు పాళ్ళ లేదు..” అమ్మ కోపం నాకు కొత్తేం గాదు.

“అసలు నువ్వు హైద్రాబాదుల ఉంటేనే మంచిగ. ఇంటికంట అస్తవ్ గానీ పొద్దుమాపు బయటనే” అమ్మ మనసుల మాట జెప్పింది.

ఇంటికి రాక బగ్గ రోజులయింది. ‘బెంగటిలినట్టు అనిపిస్తుందిరా’ అని మొన్న అమ్మ ఫోన్ జేసినప్పుడంటె అప్పడిదప్పుడే అంత నిన్ననే అచ్చిన ఊరికి.

“యే.. జెట్టన అటువోయిటత్త. నిద్రస్తే గైన్దర్వాజా దగ్గరేసి పండుకో నువ్వు” గైన్లకు అచ్చి చెప్పులు తొడుక్కుంట జెప్పిన.

అప్పుడే కిరాణ దుకాణం బంజేసి ఇంటికొస్తున్నట్టున్నడు కోమటోళ్ళ పెద్దనాన. మా ఇంటి పక్కకే వాళ్ళిల్లు.

నన్ను సుడంగనే “ఏం నాన తిన్నా? ఎటు వోతున్నవ్ గీ టైంల?”  వాళ్ళ ఇంటి గేటు తీస్కుంట అడిగిండు.

“హా! తిన్న పెద్దనాన. ఇగొ గిట్ల మర్రికింది దాకా వొతున్న” అని శెప్పి నడుస్తనే ఉన్న అడికెళ్ళి, ఇంకొంచెంసేపుంటె మల్ల ఏం అడుగుతడో అని.

మా ఇంటిపక్కకున్న హన్మాండ్ల గుడికాడ ఇద్దరు, ముగ్గురు కూసొని మాట్లాడుకుంటున్నరు. సలికాలమైతే ఈ టైంల ఒక్క పురుగు కనిపియ్యదు బయట.

ఆళ్ళందర్ని దాటి మర్రికిందికి కట్ట కట్ట నడ్సుకుంట పోయిన. అప్పటికే ఆడ మా దోస్తుగాళ్లంతా ఉన్నరు.

మర్రికింద అంటే ఇదేదో ఊరికి దూరంగా ఉన్న తావు అనుకునేరు, కానే కాదు.

మొత్తం తిర్గోలా ఇండ్లు, ఒక పక్క దొరోళ్ల పాత గడీ, పెద్ద వాటర్ ట్యాంక్, కశీరు, కట్కర్కాన్, హనుమాండ్ల గుడి, ఇంకో పక్క పాత గ్రామ పంచాతీ.. ఈటన్నింటి నడుమ ఉంటదీ జాగ మా కిందాడకట్టుకి. మా ఇంటికెళ్ళి ఒక ఇర్వై అడుగుల దూరంల.

“గాడికెళ్ళి గీడ్కి రానీకి ఇంత సేపా బే! ఎంతసేపు ఆగాల నీ కోసం?” మా నరేష్‌గాడు మాట్లాడినా బెదిరిచ్చినట్లనే ఉంటది.

“మామా బైక్ డబల్ స్టాండ్ ఎయ్ రా!” కవర్ల నుండి కేకు, ఓంబత్తులు, చాకు బైటకి దీస్కుంట జెప్పిండు ప్రణీత్‌గాడు.

ఇయాళ మా దోస్త్ అతీష్‌గాని బర్తు డే. అందుకే ఈ టైంల ఈడ కలిశినం, మా దోస్తులమంత వానితోని కేక్ కట్ జేపిద్దమని. మా దోస్తులల్ల యెవడి పుట్టిండ్రోజైనా కేక్ కోపిచ్చేది ఈడనే. రోజూ సాయంత్రం మేమంత కలిసే అడ్డా గూడా ఇదే. ఈ తావంటే నాకే గాదు, మా దోస్తుగాళ్ళందర్కి కూడా మస్తు ఇష్టం. ఫోన్ జేసి రమ్మంటే అయిపాయె, యాడికో జెప్పకున్న సరే అందరు ఈడికే అస్తరు.

అప్పట్ల పాత జమాన్లకెళ్ళివడితే ఇప్పట్కి ఊర్ల అన్ని పండగలు జరిగేది ఈన్నే.  దసరనాడు రావణాసురుడి దిష్టిబొమ్మ కాల్చుడు , కాముడు పున్నంకి కాముణ్ని కాల్చుడు ఈన్నే. బతుకమ్మ రోజు అందరు కలిసి ఇక్కడి నుండే ఊరేగింపుగ పోతరు. ఉట్ల పండుగప్పుడు ఊరు ఊరంత ఈన్నే ఉంటది. ఊర్ల గోదల పండుగ జేత్తే మేకని ఇక్కన్నే గావ్వడ్తరు. యాడాదికోసారి జరిగే జాతరకి విగ్రహాన్ని గుట్టమీనికి ఊరేగింపుగ ఈడికెళ్ళే తీస్కపోతరు. ప్రతి యాడాది గణపతి పండుగనాడు మా దోస్తులందరం గల్శి గణపతిని పెట్టేది మర్రికిందనే.

ప్రతి ఐతారం పక్క ఊరికెళ్ళి బట్టల గంగాధర్ వస్తడు చీరలు తీస్కొని. అప్పుడవి కొనుక్కునేటందుకు వచ్చే అమ్మలక్కలతో జాతర లెక్కనే ఉంటది ఈడ.

“అరేయ్! ఎటు రోకు వెట్టినవ్ రా? కేక్ కట్ జేస్తుండ్రు నడు” రజాక్‌గాడు పిలుసుడుతోని మల్లా ఈ లోకంలకచ్చిన.

ఈ జాగలకస్తే మంచిగనిపిస్తది. ఇట్లా చాలా దినాల తర్వాత సూడక సూడక సూశినప్పుడు పాత  కతలన్ని యాదికస్తయ్.

కేక్ కోపిచ్చి మా అందరి మొకాల కింత పూసుకున్నంక కడుపులింత ఏస్కున్నం. ఈ పుట్టిండ్రోజులేమోగానీ కేక్ అంట తెత్తరు, తినుడు తక్క పూసుకునుడే ఎక్క.

“ఏంరా వారీ? మస్తు పెద్దోనివైపోయినవ్?” దినేష్‌గాడు ఎప్పుడింతే, ఎడ్డిచ్చినట్టే మాట్లాడుతడు.

“ఇడ్సెయ్ మామా! హైద్రాబాద్ వోతే అంతే, ఊర్లె దోస్తులందర్ని మర్శిపోవాలే. అంతే గదరా నందు!” నేనేమైనా తక్కువనా అనుకుండేమో అరుణ్‌గాడు ఒక మాటేశిండు.

ఎప్పుడు ఊరికచ్చినా దోస్తుగాల్లందర్కి ముందే ఫోన్ జేశి జెప్పి వస్తుండే, కానీ ఈసారి చెప్పక చెయ్యక ఆగమాగంల అచ్చిన. అందుకే వీళ్ళు గిపుడు ఇట్ల అంటుండ్రు.

“అరేయ్! అమ్మ ఫోన్ జేసి బెంగటిలినట్టయితుంది ఒకసారి రా అంటే సడెన్‌గ అచ్చిన బే!” నాదేం తప్పు లే అన్నట్లు జెప్పిన.

“సరే గానీ దావత్ ఎప్పుడిస్తున్నవ్ మరి?”  మీరు అడగరారా అన్నట్లు మిగిలిన అందర్నీ సూస్కుంట అంటుండు మల్లేష్‌గాడు.

ఇట్ల పుట్టిండ్రోజులప్పుడు, నేను సిటీకెళ్ళి అచ్చినప్పుడు, లేదంటే ఉట్టి ఉట్టిగనే అట్లా దావత్‌లు నడుస్తనే ఉంటయి మాకు. ఆ సిటీల జేస్కునే లేట్ నైట్ పార్టీల కన్న మా దోస్తుగాళ్లతో జేస్కునే ఈ దావత్లంటనే ఇష్టం నాగ్గూడా.

“లే మామా! సాలరీ ఇంకా పడలే. మల్లచ్చినప్పుడు సూద్దం. అయినా పుట్టిండ్రోజు వానిదైతే నేను దావత్ ఇచ్చుడేంది బే?” నా మాట ఎవడు వింటున్నట్టు లేడు.

“రేయ్ ఆని దగ్గర పైసల్ లేవంట. అయినా మాల్ మసాలలన్ని మొన్న దావత్ జేస్కోంగ మిగిలినయే ఉండే. నువ్వు గా చికెన్, ఇంకా మిగిలిన కర్సుకియ్యు సాలు” నాకేదో పెద్ద సాయం జేశినట్టు జెప్పె భూమేష్‌గాడు.

“సరే, మరి రేపు అందరు ఏం పన్లు వెట్టుకోకుండ్రి” దినిగాడు జెప్పిండు. దావత్ అంటే అయిపాయే, మావోల్లకి ఎక్కడ లేని శ్రద్ధ.

“అరేయ్ జల్దీ ఒడగొడుతమంటెనే కుసుందం. ముందే మా అమ్మ మస్తు కోపంకత్తుంది, ఇంటికంట అచ్చి ఊకూకె బయటనే తిరుగుతున్న అని” ఇగ నాకు తప్పేటట్టు లేదు అని మనసుల అనుకుంట జెప్పిన.

మా దోస్తులల్ల ఇట్ల నా లెక్క ఊర్లకెళ్ళి పనిజేస్కోనికి  హైద్రాబాద్, ఇంకా వేరే దేశం పోయినోళ్లు తిరిగి ఊరికి సెలవులల్ల అచ్చినప్పుడు వాన్ని ఖుషీ జేశి పంపియ్యాల. ఎన్ని పన్లున్నా కచ్చితంగ అందరు వానికి టైం ఇయ్యాల. ఇవన్నీ మా దోస్తుగాళ్ళమంత కలిసి మాకు మేము వెట్టుకున్న రూల్సు.

మావోళ్లని గాదు గానీ, మా దోస్తుగాల్లంటే దోస్తుగాల్లే! మొత్తం సత్తెపూసలేం గాదు గాని మంచోళ్ళే. వీళ్ళతోని కాని పని లేదు. మాట గొంచెం పెడుసేగానీ, మనసు బంగారం. మా ఆడకట్టుకందర్కి తలల నాల్కె లెక్క ఉంటరు. నేను ఈరోజు హైద్రాబాద్‌ల జాబ్ జేస్కుంటున్ననంటె అంత ఈళ్ళ వల్లనే. నేను హైద్రాబాద్‌ల ఉన్నప్పుడు ఒక్క ఫోన్ జేత్తే అయిపాయె, మా ఇంట్ల అమ్మకి అన్ని పనులకు ఆసరయితరు.

“సరే మామా! మరి యాడ కుసుందం?” దినేష్‌గాడు అప్పుడే ప్లాన్ ఏస్తున్నట్టున్నడు దావత్‌కి.

“పోశవ్వ మాములల్ల కుసుందం” అప్పడిదాక సప్పుడు జెయ్యకుంట కుసున్న అజయ్‌గాడు మెల్లెగ అన్నడు.

“చల్ అద్దు బే! రేపు ఆదివారం. అందరు దేవుడి కాడ నైవేద్యం ఏస్కున అస్తరు” భూమేశ్‌గాడికి ఇసుంటియన్ని భలే యాదికుంటయ్.

“మర్కుడిప్ప మాములల్ల కుసుందమా? మామిడి చెట్ల కింద సల్లగుంటది” వాళ్ళ శేనుకి దగ్గరుంటదని మల్లిగాడి ప్లాను. మధ్య మధ్యల పోయి నీళ్లు మలిపి రావచ్చని.

“ఎందుకోయ్, మీ బాపు అచ్చి అందర్నీ కట్టెతోని మంచిగ అర్సుకొదందుకా?” అని దినిగాడు అనంగానే అందరు ఒక్కసారే నవ్విండ్రు.

“అరేయ్ వాగుల ఉస్కె తెప్పకాడ ఉన్న మర్రిచెట్టు దగ్గర అయితే ఎట్లుంటది?” ఏదో గుర్తచ్చినట్లు జెప్పిండు ప్రణీత్‌గాడు. అందరి మొకాలు ఒకటేసారి ఎలిగినయి.

“అవును రా మర్రిచెట్టు కాడ కూసోక మస్తు రోజులయితుంది మామ” సూరిగాడు నాకిష్టమే అన్నట్టు మాట కలిపిండు.

“వాగు గూడా పారుతుంది. ఆన్నే మంచిగ ఈత కొట్టచ్చు”  నవీన్‌గాడు మస్తు ఉషారుగా జెప్పిండు.

“మనం శిన్నగున్నప్పుడు ఎన్నిసార్ల పోతుంటిమి రా? రోజూ పోయినట్టు పోతుంటిమి” నరేష్‌గాడు పాత రోజులని యాదికి జేస్కున్నడు.

“ఇప్పుడేమో యాడోల్లమాడ పన్లల్ల వడితిమి” మల్ల వాడే చెప్పుకుంట బాధ చేస్కోవట్టె.

అప్పట్ల రోజులన్నీ నా కండ్లళ్ళ కదిలినయి.

@@@

ఆ మర్రిచెట్టుతోని మాకున్న దోస్తాని ఇప్పడిదిగాదు. మా తాతల వాళ్ళ తాతల కాలం నుండె ఊర్లె ఈ మర్రిచెట్టు ఉన్నదంటరు. ఇప్పుడు మేం కూసున్న ఈ తావుకు మర్రికింద అని పేరు గూడా ఆ చెట్టు జెయ్యవట్టే అచ్చిందంటరు. మర్రిచెట్టు మీది భాగంకు మా పక్కపోంటి ఊరు ఉంటది. కింది భాగంల మా కిందాడకట్టున్నది. అందుకే మర్రికింద పేరువడ్డదని జెప్తరు.

ఏది ఎట్లున్న మా ఊరుకి అందం మా వాగు. వాగుకి అందం ఈ మర్రిచెట్టు. అచ్చెటోళ్లకు పోయేటోళ్లకు కూడా దార్ల కూసోని కొంత దమ్ము తీస్కోనికి మంచి తావు.

నాకు బాగా గుర్తు, వానాకాలమస్తే అయిపాయె! వాగు ఎప్పుడు పారుతదా? ఎప్పుడు వొయి వాగుల దుంకన్నా అన్నట్టు ఎదురుజూశేటోల్లం మా దోస్తుగాళ్లమంతా శిన్నప్పుడు.

కొత్తగచ్చిన నీళ్ళల్ల తానం జెయ్యొద్దురా అని మా ఇండ్లల్ల ఒకటే మొత్తుకునేటోళ్లు. మేమింటె గదా! వాగు పారినన్ని రోజులు సాయంత్రమైతే సాలు మా టికానా ఆన్నే. వాగుల తానం జెయ్యాలె, ఆ మర్రిచెట్టు కింద కుసోని ముచ్చట వెట్టుకుంట, యాష్టకొస్తే ఊడలు వట్టుకొని ఊగాలే. మా సూరిగానికి చెట్లెక్కుడంటె మస్తిష్టం. ఏ చెట్టు మీదికైనా పై కొమ్మ దాక ఎక్కుతుండె. నాకేమో మస్తు భయం. కొన్ని దినాలల్ల నా భయం పోగొట్టి మిగిలినోళ్లందర్కి చెట్లెక్కుడు నేర్పిచ్చిండు.

అప్పటి నుండి ఆన్నే కాల్ కింద కట్టె ఆడుడు గూడా షురూ జేశినమ్. ఆ ఆట మా దోస్తుగాళ్లందరికి చానా ఇష్టం. పంటలేసి చివరాకర్కి మిగిలినోడు కింద, మిగిలినోళ్లంత పైన. కింద ఉస్కెల ఒక గుండం గీసి ఆ గుండంల కట్టె పెడితే వాడికి దొర్కకుంట తప్పిచ్చుకొని ఆ కట్టెని ముట్టుకోవాలె! మస్తు గమ్మతు అనిపిస్తుండె.

అప్పుడప్పుడు మా దోస్తుగానోల్ల శేన్ల మక్కెన్లు ఇర్సుకచ్చుకొని, కాల్సుకొని తిని, శెల్మెలు తోడుకొని నీళ్ళు తాగి అట్ల గొంచేపు గాన్నే ఒరుగుతుంటిమి. అవెంత కమ్మగ అస్తుండెనంటే ఒక్కోడు మూడు నాలుగు అల్కగ తిని వారేత్తుండె.

ఇగ ఎప్పుడన్న ఒకపారి చేపలు వట్టి తీస్కపోతుంటిమి. ఎన్ని తిట్లు దిట్టినా మేము చేపలు వట్టి తీస్కపోయిన్నాడు మా అందరి ఇండ్లల్ల మంచిగ కూరొండి పెడ్తుండే ఏమనకుంట. అదేందో ఆ రోజు మాకందరికి ఊకూకె ఆకలయితుండె.

గణపతి పండుగ అయిపోయిన కాడికెళ్ళి బొడ్డెమ్మల పండుగచ్చేడ్దాకా ఐదురోజులకొకసారి మా అక్క, ఇంకా వాళ్ళ దోస్తులంత కలిసి వాళ్ళు తయారు జేస్కున్న శిన్న బొడ్డెమ్మలని నీళ్లల్ల ఇడ్సిరానీకి పోన్కేసిన అటుకులు టిఫిన్లు గట్టుకొని వోతుండే. కొన్నిసార్ల నన్ను గూడ తోల్కపోతుండె. అట్ల వాగుల కూసోని ఇంటికెళ్లి దెచ్చుకున్న అటుకులు తింటుంటే ఎంత తిన్న ఇంగా తినబుద్ధయితుండే.

వానకాలం ఇట్లుంటే, ఇగ మిగిలిన కాలాలల్ల గూడా వాగుని మేం ఇడిసేటోల్లమే కాదు. సంకురాత్రి సెలవులప్పుడైతే దోస్తుగాళ్లమంత కలిసి పతంగిలు ఎక్కియ్య పోతుంటిమి వాగులకే. మా దోస్తుగాళ్ళేమో ఇంట్ల ఇచ్చిన పైసలతోని దుకాన్ల పతంగి కొనుక్కొచ్చుకుంటే, నేనేమో మా ఇంట్ల ఇచ్చిన పైసల్ దాసవెట్టుకొని పాత క్యాలెండర్ పేపరు, శీపిరి పుల్లలు గలిపి అన్నం మెతుకులతోని అంటువెట్టి తయారు జేస్కున్న పతంగి తీస్కపోతుంటి. అదేందో వాళ్ళు దుకాన్ల  కొనుక్కచ్చుకున్న పతంగి కంటే నేను తయారు జేస్కున్న పతంగే మస్తు మీదికోవు.

అప్పుడప్పుడు మా అమ్మ, ఇంకా మా దోస్తుగానోల్ల అమ్మలందరు కల్శి బట్టలు పిండనీకి వాగులకొస్తుండే. ఈ నీళ్లల్ల బట్టలు మస్తు తెల్లగైతయని జెప్తుండె మా అమ్మ. ఆ బట్టలారేశి మర్రిచెట్టు కిందనే కూసొని అందరు ముచ్చట్లు వెట్టుకుంటుండె, బట్టలారేదాక.

అప్పుడు మేము అయిదో క్లాసు గావచ్చు. ఎండాకాలం ఒకటే పూటలు చాలయినయి స్కూళ్ల. స్కూలుకెళ్ళి రాంగనే తిని దోస్తుగాళ్ళమంత కల్శి వాగులకంట బయలుదేరినం. వాగు ఇంకొంచం దూరంలుందనంగ ఎవరాడికి ఫస్టు పోతరోనని రన్నింగ్ రేస్ లెక్క పెట్టుకున్నం.

నరేష్‌గాడు అందరికంటే ముందు వోయిండు. ఆడ ఏదో చూడంది చూశినట్టు నిలబడిపోయిండు. ఎప్పుడు ‘నేనే ఫస్టు.. నేనే ఫస్టు’ అని అర్శేటోడు అరుస్తలేడు. అట్లనే బీరిపోయిండు ఎందుకో! ఏమైందోనని మేం గూడా ఆడికివొయ్యి జూస్తే పెద్ద లొంద. నిన్న పొద్మీకి గూడా లేకుండె, మల్ల ఇదెప్పుడొచ్చింది? అందరం బీరిపోయి జూస్తున్నం. ఉరుక్కుంటచ్చినందుకు జొక ఆగక సూరిగాడు జర్రయితే అందుల పడిపోతుండె. అది జూశి అజయ్‌గాడు “అరేయ్ నాకు భయమేస్తుంది రా! ఇంటికి పోదాం రా!” అని నడుస్తనే ఉన్నడు. ‘మేం గూడా వస్తం ఆగు రా’ అని అందరం ఇండ్లకు వోతున్నం.

“అరేయ్ అది ఉస్కె తవ్వనింకె తీశినట్టున్నర్రా! ఈరోజు పొద్దుగాల నేను స్కూల్‌కచ్చేటప్పుడు మా మామ ట్రాక్టరు దీస్కొస్తుంటె చూశ్న. ‘యాడికోయినవ్ పొద్దుగాల్ల పొద్దుగాల్ల’ అని మా అత్తమ్మ అడిగితే, ఉస్కె కొట్టనీకి వొయిన అని చెప్పంగ ఇన్న” భూమేష్‌గాడు జెప్పిండు.

“మన గాడ్దిలోళ్ళ సీనుగాడు ఓసారి వాగుల ఉస్కె నింపంగ చూశినరా నేను. ఆ లొంద చిన్నగున్నది. గింత పెద్దగ లే” భూమేష్‌గాని మాటలు అబద్దమన్నట్టు జెప్పిండు రత్నాకర్‌గాడు.

పక్కపోంటి ఆడాడ గొంచెం దూరంల అసువంటి లొందలెన్నో కనిపియ్యనీకె బగ్గ దినాలేం పట్టలే! కొన్ని రోజులకి పొక్లైన్లు కనిపించినయ్ ఆడ. గప్పుడర్థమైంది మాకు ఆ లొందలంత పెద్దగ ఎందుకున్నయో!

అట్లా దొబ్బిన ఉస్కెనంత ట్రాక్టర్లల్ల, టిప్పర్లల్ల యాడికో తీస్కవోతుండ్రు. అప్పటికెళ్ళి ఇంతకుముందు లెక్క ఎందుకో వాగులకి మాకు పోబుద్ది గాలే. యాడ జూశినా అన్నీ లొందలే. పొక్లైన్ల దుమ్ము, టాక్టర్ల మోతకి అటు పోవుడే బంజేశ్నం మెల్లమెల్లగ. అప్పుడప్పుడు పని మీద పక్క ఊరు పోతుంటిమి గానీ, అది గూడా చానా తక్వ.

ఇగ మల్లా ఇన్ని రోజుల తరువాత ఇట్లా దోస్తుగాళ్లమంత కల్శి ఈరోజు పోవుడు.

అందరం బాసండ్లు, చికెను, మక్కటుకులు, వంట సామానంత తీస్కొని బైకుల మీద వెట్టుకొని వోతున్నం వాగులకి. ఒక్కొక్క బైకు మీద ఇద్దరం.

“ఈసారి వానలు మంచిగనే వడ్డటున్నయి గదరా మన ఊర్లె గూడా” సామాన్లు వట్కొని ఎన్క కూసోని అడిగిన సూరిగాన్ని.

“హా మస్తు వడ్డది వాన. నడుము లోతు పారుతుంది మన వాగు గూడా” ముందట మేకలమంద అచ్చుడితోటి బండి ఆపుకుంట జెప్పిండు సూరిగాడు.

“మరెట్ల రా మనం కూసోనికి తావు ఉన్నదా! ఎట్లా దాటుడు?” మిగిలినోళ్లు యాడిదాకచ్చిండ్రో అని ఎన్కకు సూస్కుంట అడిగిన.

“అరేయ్ అది మన వాగు రా! మనం జూడని నీళ్లా, మనకు తెల్వని లోతులా?” నేనున్న గదా నీకేం బాధ లే అన్నట్టు జెప్పిండు.

మాట్లాడుకుంట అప్పుడే ఉస్కె తెప్ప దగ్గరిదాక అచ్చినం. ఆడికెళ్ళి బైకులు పోవు. నీళ్లు పారుతున్నాయి. అందరం మన్శికొక సామాను వట్టుకొని నడ్సుకుంట పోయి ఉస్కె తెప్ప ఎక్కినం. ఎదురుంగ మా మర్రిచెట్టు కనిపియ్యలేదు. అంత పెద్ద చెట్టు. అంత చరిత్ర గల్గిన చెట్టు. మేము శిన్నప్పటినుండి సూస్తూ పెరిగిన మా మర్రిచెట్టు, కింద వడి ఉన్నది. వేర్లు అన్నీ పైకి తేలినయి. పారుతున్న నీళ్లల్ల అన్నీ ఆ చెట్టు ఆకులే. తల్లిని ఇడిశెల్లిపోతున్న పిల్లల లెక్క అనిపించినయి. మేం ఉయ్యాలలూగిన చెట్టూడలు మా దిక్కు దీనంగ సూస్తున్నట్టు అనిపిచ్చింది.

సామాన్లు పక్కకు వాడేసి జెప్పన ఉరుక్కుంట దగ్గరికొయినం అందరం. చెట్టు మీదున్న పిట్టెగూళ్ళన్నీ మేం సూస్తుండంగనే నీళ్లల్ల కొట్టుకపోతున్నయి. మాకెవరికి నోట్లెకెళ్లి మాటలత్తలేవు. ఆన్నే అట్ల ఎంతసేపు నిలబడ్డమో మాకే తెల్వది. విషయం ఊర్ల తెలిసి మాలాస మంది గుమిగూడిండ్రు వాగుల.

పక్కన ఒకాయన ఫోన్లో, “ఏంలే కాకా! ఈసారి వానలు గట్టిగ వడ్డయి కదా, వాగుల బగ్గ నీళ్లు అచ్చి చెట్టు అడ్డం వడ్డది” అని వోళ్ళకో జెప్తున్నడు.

తెల్లారి పేపర్ల.. “భారీగా కురిసిన వానలకి కూలిన పురాతన మర్రిచెట్టు” అని జిల్లా ఎడిషన్‌ల ఎక్కడో మూలన కింద ఏసిండ్రు.

ఇది జరిగి మూడు రోజులయినంక ఇంటికి అక్కవాళ్ళొచ్చిండ్రు.

“అరేయ్! ఏమో కావాలని ఒకటే సతాయిస్తుంది. పోయి ఆ దుకాన్ల ఏమన్న కొనియ్యుపో” అని నన్ను సూపెట్టి మామతోని పో అన్నట్టు జెప్పింది అక్క మా మిల్కికి. మిల్కి మా అక్క బిడ్డె. మూడో తరగతి సదువుతుంది.

“మామా! నాకు ఫైవ్ స్టార్ చాక్లోట్ కొనియ్యు ఇంకా.. తర్వాత మనం జ్యూస్ షాప్‌కి పోదాం..” పెద్ద లిస్టే జెప్తుంది.

“కొనిస్తా గాని, నువ్వు గట్టిగ పట్టుకొని మంచిగ కుసో. ఆ డ్రెస్ కూడా పట్టుకో, లేదంటె టైర్ల ఇరుకుతది” జాగ్రత్త జెప్పి బైక్ ముందుకు తీశిన.

“మంచిగనే పట్టుకున్నలే! మామా! మొన్న టీవీల చూసిన, మీ ఊర్లె పెద్ద చెట్టు పడిపోయిందంట. అమ్మనడిగితే నిన్ను అడుగుమన్నది” తెలుసుకుందమన్నట్టు అడిగింది మిల్కి.

జ్యూస్ సెంటర్ కాడికి అచ్చినం. ఇద్దరం చెరొక జ్యూస్ తీస్కొని అక్కడ్నే కూసున్నం తాగుకుంట.

నాకు తెలిసిన కథంత జెప్పిన. మంచిగ శ్రద్ధవెట్టి విన్నది.

“బాగున్నది మామా మీ చెట్టు! మీరు మస్తు ఎంజాయ్ చేశిండ్రసలు” తానేదో మిస్ అయితున్నట్టు ఉన్నయ్ ఆమె మాటలు.

“అంత పెద్ద చెట్టు ఎట్ల పడిపోయింది?” నేను ఏం జెప్తనా అన్నట్టు నన్నే సూస్తుంది ఖాళీ గ్లాసు టేబుల్ మీన పెట్టుకుంట. నా జ్యూస్ అయిపోయింది.

“మొన్న మస్తు వానవడ్డది గదా! అప్పుడు వాగు నీళ్లల్ల కొట్టుకపోయింది” పర్సులకెళ్ళి పైసల్  తీసి టేబుల్ మీద పెట్ట్కుంట జెప్పిన.

“అన్నా పైసల్ ఈడ టేబుల్ మీద వెట్టిన్నే” షాపాయినకు జెప్పి బైక్ కాడికి పోతున్నం.

ఏదో యాదికొచ్చినట్టు మా మిల్కి,”మరి నువ్వు చిన్నగున్నప్పుడు అట్లాంటి వానలు పడలేదా? అప్పుడెందుకు కొట్టుకపోలేదా చెట్టు?” అని అడిగింది.

ఏం జెప్పాలో అర్థం గాలే! నేనేం జెప్తలేనని మల్ల మల్ల అడుగుతుంది. ఏమని జెప్పాలె ఆమెకు? అప్పట్ల మనుషులకి పైసల మీద ఇప్పటోళ్లకున్నంత ఆశ లేకుండె అని జెప్పన్నా? తనకర్థమయితదా?

మా మర్రిచెట్టు వానలకి కూలిందని అంత అనుకుంటున్నరు. నిజమేందో దాని పక్కనవారే వాగుకి దెల్సు.

*

కథలు రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు!

* హాయ్ ఆనంద్. మీ గురించి చెప్పండి.

హాయ్! మాది నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాక్. పదో తరగతి దాకా అక్కడే చదివాను. ఆ తర్వాత బాసర ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశాను. కొన్నాళ్లు హైదరాబాద్ బీహెచ్ఈఎల్‌లో పని చేసి, 2021 మార్చిలో ఖతార్‌కి వచ్చాను. ఇప్పుడు ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాను.

* కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

చిన్నప్పటి నుంచి ఆదివారం అనుబంధం కథలు చదవడం అలవాటు. కానీ నేను కథ రాస్తానని ఏరోజూ అనుకోలేదు. నేను చదివిన కథల్లో ప్రత్యేకమైన భాష ఉండేది. అది నాకు నచ్చేది. చదివించే గుణం ఉన్న కథల్ని ఇష్టపడేవాణ్ని. మా ఇంట్లో, ఊర్లో వాడే మాటలు కథల్లో కనిపించేవి కావు. కథలంటే అలాగే రాయాలేమో అనుకునేవాణ్ని. ఖతార్ వచ్చిన తర్వాతే వేరే కథలు చదవడం మొదలైంది. కథా రచయిత అంబల్ల జనార్దన్ గారిది నిజామాబాద్. బీడీ కార్మికుల నేపథ్యంలో ఆయన రాసిన ‘ఒర్ది’ కథ చదివాక, మనం మాట్లాడే భాషలోనూ కథలు రాయొచ్చన్న నమ్మకం కలిగింది.

* మొదటి కథ ఎప్పుడు రాశారు? దాని నేపథ్యం ఏమిటి?

మా ఊరి నుంచి చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్లారు. 2021లో నేనూ అక్కడికి వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆ టైంలో ఖతార్‌లో ఉన్న మా బాబాయ్‌తో ఎక్కువగా ఫోన్లో మాట్లాడాను. అప్పటిదాకా ఆయనతో మాట్లాడని నేను నా అవసరం కోసం ఆయనతో మాట్లాడటం కొత్తగా అనిపించింది. మనం పెద్దగా గమనించని మనుషుల్ని మన అవసరం కోసం దగ్గర చేసుకోవడం గురించి ఆలోచించాను. ఖతార్ వెళ్లిన తర్వాత కొన్ని రోజులకు ఆ అనుభవాన్నే కథగా రాశాను. అదే ‘ఖతార్ బాబాయ్’. 2021 మేలో ‘ది గోదావరి’ అంతర్జాల పత్రికలో అది ప్రచురితమైంది. ఇప్పటికి రెండు కథలు రాశాను.

* కథారచన మొదలు పెట్టాక మీలో వచ్చిన మార్పు గురించి..?

ముందే చెప్పినట్టు, నేను కథలు రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు. రాశాను. ఈ క్రమంలో మనసులో అనుకున్నది అనుకున్నట్లు రాయడం నేర్చుకున్నాను. మా ఇంట్లో వాళ్లు కూడా అవి చదివి సంతోషపడ్డారు. ‘అమ్మ గుర్తుకొచ్చినప్పుడు’ కథ చదివి, మా అమ్మ చాలా ఎమోషనల్‌గా ఫీలై ఏడ్చేసింది. తను చెప్పే కథలు వింటూ పెరిగిన నేను తనకు నచ్చే కథ రాయగలిగానంటే ఆనందంగా ఉంది.

* మీ అమ్మ కథలు చెప్పేవారన్నారు. ఎలాంటి కథలు? ఏమైనా గుర్తున్నాయా?

అమ్మ చెప్పే కథలంటే రాత్రి పూట నిద్రపోయేటప్పుడు చెప్పిన కథలు కాదు. సందర్భానికి తగినట్లుగా తను కథ చెప్పేది. కుటుంబమంతా కలిసి ఉంటే, ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయని వివరించేందుకు ఒక కథ చెప్పింది.

నలుగురు అన్నదమ్ములు, వాళ్ల భార్యలు కలిసి ఉన్న ఒక ఇంట్లో లక్ష్మీదేవి ఉంటోంది‌. ఎలాగైనా ఆమెను బయటకు పంపించి తను లోపలికి రావాలని దరిద్రలక్ష్మి ఆశ. వాళ్లలో వాళ్లు గొడవలు పడితే తాను ఆ ఇల్లు వదిలేస్తానంటుంది లక్ష్మీదేవి. సరేనని దరిద్రలక్ష్మి ఒక ఆలోచన చేసి, ఇంట్లోని నలుగురు కోడళ్ల చేతా కూరలో ఉప్పు వేసేలా చేస్తుంది. కూర ఉప్పుమయంగా మారుతుంది. అది తినలేక అందరూ ఒకరితో ఒకరు గొడవ పడి విడిపోతారని అనుకుంటుంది. 

మొదటగా పెద్దన్న భోజనానికి కూర్చుంటాడు. కూర నోట్లో పెట్టుకోగానే ఉప్పు కషం. అయినా ఏమీ అనడు. ఈరోజేదో తెలియక ఉప్పు ఎక్కువ వేసి ఉంటారని అనుకుని అలాగే తినేశాడు. ఆ తర్వాత రెండో తమ్ముడు, మూడో తమ్ముడు, నాలుగో తమ్ముడు కూడా భోజనానికి కూర్చుని, ‘అన్న ఏమీ అనకుండా తిన్నాడు కదా! నేనెందుకు చెప్పాలని’ అనుకుని మౌనంగా తిని లేచారు. ఆ తర్వాత ఆడవాళ్లు భోజనానికి కూర్చున్నారు. కూర నోట్లో పెట్టుకోగానే ఉప్పు సంగతి తెలిసిపోయింది. ‘మగవాళ్లే సర్దుకుని తినేశారు. మనమూ అంతే!’ అని అలాగే తిన్నారు. దీంతో దరిద్రలక్ష్మి ఆశ అడియాశైంది. ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనే సందర్భానికి చక్కగా సరిపోయే కథ ఇది. ఇలాంటి కథలు అప్పుడప్పుడూ చెప్తూ ఉండేది.

* ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?

నేను రాసిన మొదటి రెండు కథలూ నాకు జరిగిన అనుభవాలే! అవి రాసేటప్పుడు మామూలుగానే ఉండింది. ‘మర్రికింద’ కథ రాసేటప్పుడు దాని వెనుకున్న సామాజిక నేపథ్యం నన్ను అప్రమత్తం చేసింది. ఒకరకంగా చెప్పాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకొని రాసిన కథ ఇది. దీంతోపాటు ఇంకో కథ రాశాను. మరో కథ మనసులో ఉంది. నా మనసుకు రాయాలని అనిపించిన అంశాలను కథలుగా మలుస్తాను.

*

ఆనంద్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మా ఊరు వెళ్లి, ఊరంతా తిరిగి, అందరితో కాసేపు సరదాగా మాట్లాడి తిరిగొచ్చినంత సంబరంగా అనిపించింది ఈ కథ చదువుతుంటే. రచయిత ఆనంద్‌కి శుభాభినందనలు. మరిన్ని మట్టి పరిమళాలు వెదజల్లే కథలు రాయాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • Mana chinnanati anubhavalu chala gurthuchesavu. Marri kinda ane eea katha mana urilo chala mandiki daggara ainatidi, ilanti kathalu marenno rayali ani manaspurthiga korukuntuna♥️

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు