మర్కజ్ : రెండు కథలు

          1

“చూపుడు వేలు” : అబద్ధాలు మన ముఖాల్ని మార్చేసే వక్రరేఖలు

     ముందు అఫ్సర్ వ్రాసిన “చూపుడు వేలు” కథ ఆదివారం ఆంధ్ర జ్యొతిలో మే 17 నాడు వచ్చింది. కథ చదివి ముందైతే అది ఇంకా తీక్షణంగా వుండాల్సిన కథ అనుకున్నాను. ఈ కరోనా వార్తలు వస్తున్నప్పటినుంచీ చూస్తున్నాను ఎలాంటి దుష్ప్రచారాలతో ముస్లింల మీద అన్యాయమైన దాడి జరుగుతుందో. ఇది ఇప్పుడే మొదలైన విషయం కాదు. గత ఆరేళ్ళుగా చూస్తున్నదే. ఆ కథ వచ్చిన మర్నాడో, లేక అదే రోజో కస్తూరి మురళీ కృష్ణగారు తదుపరి ఆదివారం సంచికలో తన కథ “చూపుడు వేలు కాక మిగతా నాలుగు వేళ్ళు” వస్తుందని ప్రకటించారు. “చూపుడు వేలు” లాగా అది కూడా మర్కజ్ కు సంబంధించిన కథే. ఈ రెండూ చదివాక నేను వివరంగా స్పందించాల్సిన అవసరం కనిపించి ఇది వ్రాయడానికి పూనుకున్నాను. ముందు వొక్కో కథను క్లుప్తంగా చెప్పి తర్వాత నా టీకలు వ్రాస్తాను.

మొదటి కథ 17-5-2020 నాటి ఆదివారం ఆంధ్ర జ్యొతి లో గాని, అఫ్సర్ బ్లాగ్ లో గాని చదవవచ్చు. రెండోది 24-5-2020 నాటి “సంచిక” లో చదవవచ్చు.

కథకుడు వొక లెక్చరర్, భార్య రజియా, కొడుకు సాదిక్. కథకుడూ ఉమర్ ఇద్దరూ చిన్నప్పటినుంచీ స్నేహితులే. లెక్చరర్ కావాలనుకుని ఇంగ్లీషు చదువులు చదివిన కథకుడికి తన వర్గం ప్రజల కోసమే ఏదన్నా చేయాలని గట్టి నిర్ణయాలు లేవు. కాని అవే చదువులు చదివిన ఉమర్ తర్వాత తన వర్గంలోని పిల్లలకు అవసరం అని చెప్పి ఉర్దూ, అరబ్బీలు నేర్పే మేష్టారవుతాడు. ఒక సంఘటన జరిగిన తర్వాత సమాజంలోనే కాదు వ్యక్తుల మధ్య వున్న సంబంధాలలో కూడా ఎలాంటి మార్పులు వస్తాయో కదా. కరోనా ఆక్రమణ మన దేశంలో ఇంకా మొదలు కాలేదు, లేదా బయట పడలేదు. మర్కజ్ కు వెళ్ళి వచ్చిన ఉమర్ ని జనం దోషిలా చూస్తారు. అతను పరీక్షలు చేయించుకోవడానికి వెళ్తాడు, కానీ కరోనా లేదని వస్తుంది. అయినా అతని పట్ల జనం వైఖరి మారదు. జన్మభూమిలో మధ్యలో పగులు పడుతున్న విషయం గమనించని రజియాకి అర్థం కాదు, అర్థం చేయించలేని నిస్సహాయత కథకుడిది.

కథకుడు ఎలాంటి వాడు? కాస్త ఉన్నత కుటుంబంలోంచి వచ్చిన వాడు, ఇంగ్లీష్ చదువులు చదివి మంచి ఉద్యోగంలో వున్న వాడూ ను. అయితే ఈ కథ చెప్పేటప్పుడు కూడా తనకు తాను కొంత ఎడాన్ని పాటించి చెబుతాడు, ఎలాంటి వక్రీకరణకు తావు ఇవ్వకుండా. ఒక చోటా ఇలా అంటాడు “ఈ కొత్త హడావుడిలో రంజాన్ చంద్రుడు కనిపించడమూ, ఉపవాసాలూ మొదలు కావడమూ గమనించుకోలేదు. ఇంకో విధంగా చెప్పాలంటే, వాటిని గమనించుకోగలిగే ముస్లింతనానికి తను కొంచెంగా దూరమవుతూ వస్తున్నాడు కొంతకాలంగా-“.

కానీ ఎంత వద్దనుకున్నా కొన్ని కనబడక, వినబడక మానవు. ఆ విషయం ఎలా చెబుతాడంటే తను లాక్ డౌన్ వలన ఆన్లైన్ క్లాసులు చెబితే క్లాసులో చెప్తే వచ్చే తృప్తి రావట్లేదంటాడు. అక్కడ చెప్పే వాడికీ వినేవాడికీ మధ్య గోడలు వుండవు. “టెక్నాలజీ నాలో యేదో ఆస్తిమితత్వానికి కారణమవుతోంది.” అదే టెక్నాలజీ వాట్సప్ లాంటి రూపాల్లో దుష్ప్రచారాలకు పాల్పడి తీవ్రమైన అశాంతికి, బాధకూ కారణమవుతుంది. నాకు కూడా అలాంటివి వస్తుంటాయి, చదివితే రక్తం మరిగిపోతుంది. నిజాలను వక్రీకరించి నమ్మకంగా చెప్పగలగడం దేశం ప్రాణాల మీదకు వచ్చింది. కలిసి వుండాల్సిన మనుషుల మధ్య విభజన రేఖలు సృష్టిస్తుంది. పరస్పర నమ్మకం, గౌరవం మీద వేటు పడుతుంది.

ఇది చదువుకున్న కథకుడు పరిస్థితి. కాని రజియా మాత్రం టీవీలో వచ్చే వార్తలు మాత్రం చూస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీడియా ప్రభుత్వానికి తొత్తుగా మారిపోయి ఆ దుష్ప్రచారాలనే వార్తలుగా బట్వాడా చేస్తున్నాయి. వాట్సప్ లో కనీసం రెండు వాదనలూ వినబడతాయి. టీవీలో అవకాశం తక్కువ. మరి అలాంటి ఆమెకు ఉమర్ మర్కజ్ కు వెళ్ళి వచ్చాడని ఎలా చెప్పడం? ”

“చెప్పేయ్, ఏం పర్లేదు?! నిజం నిజమే. అది చెప్పడం ఆలస్యమైతే అబద్ధం కంటే ప్రమాదకరం కావచ్చు!” అంటున్నాడు ఉమర్ లోపలినించి.” కానీ చెప్పలేడు.

టీవీ లో వార్తలు చదివిన ఆమె భర్తతో ఇలా అంటుంది,”మన వాళ్ళు కూడా మరీ అన్యాయంగా తయారవుతున్నారు! ఈ మర్కజ్ లూ, జమాత్ లూ లేకపోతే ఏం? మనం బతకలేమా? వాళ్ళ వల్ల మామూలు ముస్లింలకు కూడా కష్టాలు!”

ఇది ఎలాంటి ఎత్తు. వొక ముస్లిం స్త్రీ మనసులోనే ఇలాంటి ఆలోచన నాటగలిగినవారిది ఎంత పెద్ద కుట్ర!

“మర్కజ్ లేకపోతే, ఇంకో కారణమేదో ముస్లింలని తిట్టిపోయడానికి వెతికి పట్టుకుంటారు. దేశమంతా ముస్లిం వ్యతిరేకతలో కొట్టుకుపోతోంది!” ఇది చెప్పినా ఆమె అర్థం చేసుకునే పరిస్థితి వున్నదా? కాబట్టే కథలో నేను ఆశించిన తీవ్రతకు తావు లేక పోయింది. వొక రకంగా ఇది నేను ఊహించినదానికంటే క్లిష్టమైనది.

ఇక చదువు వొక్కటే దారిద్ర్యాన్ని ఎదుర్కునే మంత్రం! మనకి తెలిసినంతలో చదువు విలువ గురించి చెప్పుకుంటూ వెళ్ళాలి” అని నమ్మే ఉమర్ గురించి. మర్కజ్ వెళ్ళి వచ్చిన తర్వాత విషయం తెలిసి స్వయంగా టెస్టు చేయించుకుని, జబ్బు లేదనిపించుకున్న తర్వాత కూడా అతడు వెలివేయబడ్డ మనిషే అయ్యాడు. “నేనెప్పుడూ ఇక్కడ పరాయీవాడిగా నన్ను నేను భావించుకోలేదు. కానీ, మర్కజ్ కి వెళ్ళి వచ్చాక అందరి దృష్టిలో నేను యెవరినో అయిపోయాను.!”.

ముస్లింల పట్ల అన్యాయం జరగడం లేదు అని నమ్ముతున్న వారు దీనికి ఏం సమాధానం చెబుతారో చూడాలి. మర్కజ్ నుంచి వచ్చిన తర్వాత ఉమర్ టెస్టు చేయించుకోవడం వగైరా అంతా సజావుగా జరిగిందా?

ఖమర్ మాటల్లో “సాదిక్ భాయ్, నెగెటివ్ వచ్చినా సరే వాళ్ళు అన్నయ్యని చాలా ఇబ్బంది పెట్టారు. ముందు ఆస్పత్రిలో తరవాత పోలీస్ స్టేషన్ లో “ఏరా, మర్కజ్ కి వెళ్లకపోతే యెమైందిరా?! ప్రాణాలతో ఆడుకుంటున్నార్రా మీరంతా!” ఇట్లాంటి సూటి పోటీ మాటలు. వారం రోజుల నుంచి ఈ ఇంటి వోనరు గొడవ ఇల్లు ఖాళీ చేయమని! ఇన్నేళ్లుగా ఇదే ఇంట్లో వున్నాం. ఓనర్ కి మేమేమిటో తెలుసు!”

న్యాయం ఎక్కడుంది? ఎవరున్నా లేకున్నా తను ఉమర్ కి సపోర్ట్‌గా వుండాలని నిర్ణయించుకోవడంతో కథ ముగుస్తుంది.

టీవీ పెడితే మంత్రులు ఈ మర్కజ్ కు వెళ్ళి వచ్చిన ముస్లింల వలనే కరోనా కేసులు పెరిగాయి అంటున్నారు. వాట్సాప్లో అయితే anonymity అనే ఆయుధం వుండబట్టి భయంకరమైన బూతులతో రెచ్చగొట్టే విధంగా వస్తున్నాయి పోస్ట్లు. ఏం టెక్నాలజీనో ఏమో గాని దావానలం కంటే త్వరగా వ్యాప్తి చెందుతున్నది. నిజాన్ని నిజముగా చూసేవాళ్ళు తక్కువై పోయారు. ఇప్పుడంటే కరోనా, కానీ ఈ “కార్యక్రమం” అంతకు ముందు నుంచీ వుంది. ఇదొక కొత్త beating stick. అంతే. భారత్ మాతా కి జై చెప్పాల్సిందే అని వొత్తిడి తేవడం. ఒక చోట జరిగిన అల్లర్లలో పోలీసులు ఓ ముస్లిం యువకుడిని చావగొట్టి అతని చేత బలవంతంగా చెప్పించడం, ఆ తర్వాత అతను చనిపోవడం జరిగాయి. ముస్లింలపై దాడులు చాలా తేలికైపోయింది. కేవలం బీఫ్ తిన్నాడు అన్న అనుమానం తో గుంపులుగా మనుషులు దాడి చేసి నడిరోడ్డు మీద చంపేస్తున్నారు. ఈ మర్కజ్ తో వీటికి సంబంధం ఏమిటి అనొచ్చు కొంతమంది. ఏం తమంతట తాము పరీక్షలు చేయించుకోవాల్సిన బాధ్యత పౌరుడిగా లేదా అని కూడా అంటారు. కేవలం అనుమానం ఆధారంగా హత్యలు చేసీ, ఎలాంటి శిక్షా పడకుండా తిరుగుతున్న ఈ నేలలో ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నమ్మకం, న్యాయం కరువైన పరిస్థితుల్లో అభద్రతాభావం తప్ప ధైర్యం ఎలా వస్తుంది. ధైర్యం చేసిన ఉమర్ కూడా ఎలాంటి అణచివేతలు, అవమానాలు ఎదురుచూడాల్సి వచ్చాయి.

ఈ కథ ప్రయోజనం ఏమిటంటే రజియాలా అమాయకంగా టీవీ లో చూస్తున్నదంతా నమ్మే వాళ్ళు పునరాలోచిస్తారన్న ఆశ. అందరికీ నడుస్తున్న కథ రెండు పక్షాలూ తెలిసి వుండక పోవచ్చు. అలాంటి వాళ్ళకు రెండో పక్క కథ తెలుస్తుంది. ఆత్మసంస్కరణకు అవకాశం కల్పిస్తుంది.

“చూపుడువేలు” అన్న శీర్షిక గురించి. మనకు తెలిసిందే, ఎప్పుడన్నా ఒకరి వైపు వేలెత్తి దోషిగా చూపిస్తే మిగతా నాలుగు వేళ్ళూ తనవైపే తిరిగి వుంటాయి. కాని ఆ తెలివిడి వుండదు ఆ మనిషికి ఆ క్షణాన. ప్రస్తుతం దేశంలో జరుగుతున్నది అదే.

                             2

       “చూపుడువేలు కాక మరో నాలుగు వేళ్ళు” : “పిల్లవాడికి ఉన్న తెలివి పెద్దలకు ఉంటే సగం సమస్య తీరేది”

       రెండో కథ కస్తూరి మురళీకృష్ణ “చూపుడువేలు కాక మరో నాలుగు వేళ్ళు”.

మాధవ్ వొక పోలీసు. భార్య రాధ, కొడుకు కిరణ్. రజియా లాగానే వీళ్ళిద్దరు కూడా అమాయకులు. మాధవ్ మిత్రుడు పర్వేజ్. తను బయట డ్యూటి చేస్తున్నాడు కాబట్టి ముందు జాగ్రత్తగా తను ఇంటిలోపలికి వెళ్ళడు, బయటే తినేసి వెళ్ళి స్టేషన్లో పడుకుంటాడు. చాలా బాధ్యత గల పౌరుడు. కాని పర్వేజ్ వాళ్ళు అలా కాదే. పర్వేజ్ ఇద్దరు కొడుకులు మర్కజ్ కు వెళ్ళి వచ్చారు, చాటుగా. బాధ్యతగా పరీక్షలు చేయించుకోవాల్సింది “కట్టేస్తారు, పోలీసులు కొడతారు” లాంటి పిచ్చి(?) భయాలతో “దేశ ద్రోహులు”గా ప్రవర్తిస్తారు. ఒక చోట మర్కజ్లు వున్నారని తెలిసి వెళ్తాడు మాధవ్. వాళ్ళను స్ట్రెచర్ మీద వేసుకుని ఆసుపత్రికి తరలించాలని చూస్తుంటే అక్కడి “మూక” దాడులు జరిపగా మాధవ్ తలకి గాయమై పడిపోతాడు, ఆసుపత్రి పాలవుతాడు. రాధ కిరణ్ ని పక్కింట్లో పర్వేజ్ వాళ్ళదగ్గర వదిలిపెట్టి ఆసుపత్రికి వెళ్తుంది భర్తను చూడడానికి. ఆ రాత్రి పర్వేజ్ ఇంట్లోంచి అతని ఇద్దరు కొడుకులనీ PPE లు ధరించిన వారు ఏంబులెన్స్ ఎక్కించి తీసుకెళ్ళడం చూసిన రాధ భయపడుతుంది, తను వీళ్ళ దగ్గరే తన కొడుకును వదిలి పెట్టి వెళ్ళిందే అని. ఇది స్థూలంగా కథ.

కథ కేవలం దాని గతి లో మాత్రమే కాదు, దాని శిల్పంలో, వ్యాఖ్యానంలో కూడా బయటపడుతుంది. శిల్ప పరంగా ఇది గొప్పగా ఏమీ లేదు; వొక కథకు స్పందనగా మరో కథ అల్లి, తన మనసులోని భావాలను వెల్లడిచేసే వాహనం మాత్రమే. కొన్ని వాక్యాలు ఎత్తి చూపి అది ఎలానో చెబుతాను.

పర్వేజ్ ఇంటివాళ్ళు “కానీ వాళ్ళింట్లో వాళ్ళు బయటకు వెళ్తారు కదా!”

రాధ మాత్రం “ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర కొన్నా సరే, అమ్మ అన్నిటినీ ఎండబెట్టి వాడుతోంది”

ప్రభుత్వం చెబుతున్నట్టు మర్కజ్ నించి తిరిగి వచ్చినవారు స్వచ్చందంగా పరీక్షలు చేయించుకోవడం లేదు. అనవసరమైన భయాలు పెట్టుకుంటున్నారు. అసలు వాస్తవం ఇదీ

“విదేశాల నుంచి టూరిస్టు వీసా మీద వచ్చి మతప్రచారం చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారు. అంతే…”

అయినా అర్థం కానిదేమిటంటే

“ఎక్కడ ఉన్నా సరే పరీక్షలు చేయించుకోమన్న విజ్ఞాపనలను పెడచెవిన పెట్టారు. తాము ఈ దేశంలోని ప్రభుత్వాన్ని ఖాతరు చేయం, చట్టాలను గౌరవించటం అన్నట్టు ప్రవర్తించసాగారు.”

ఆ మర్కజ్ వాళ్ళ గురించి భార్యకు చెబుతున్న మాధవ్ మాటలు ఇలా వున్నాయి “దెబ్బలు తగిలాయి కానీ మొత్తానికి వాళ్ళందరినీ పట్టుకున్నాం”; మరో చోట మర్కజ్‌లు “నేరస్తుల్లా దాక్కుంటున్నారు.”. కోర్టులు కాదు వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తారు నేరస్తులని, పట్టుకోవాల్సిన వారనీ. కారణం కూడా వాళ్ళ దృష్టిలో స్పష్టమే. అదేమిటి?

“మిగతా అందరూ ప్రభుత్వం చెప్పినట్టు విని పరీక్షలు చేయించుకుంటున్నారు. క్వారంటైన్ కు వెళ్తున్నారు. మర్కజ్ కు వెళ్ళివచ్చిన వారు ఇందుకు భిన్నంగా ప్రవర్తించటం, దాక్కోవటం, తప్పించుకోవటం వల్ల అందరి దృష్టి వారిపైనే పడుతోంది. వాళ్ళు కేవలం ముస్లీం లన్న నెపంతో వారి తప్పును సమర్ధిస్తూ, వారిని మిగతా ముస్లీములందరికీ ప్రతినిధులుగా చేసి సమర్ధించి వాదించేవారివల్ల ఆవేశాలు, ద్వేషాలు మరింత పెరుగుతున్నాయి. ”

ముస్లింల పట్ల ఇప్పుడు జరుగుతున్న అత్యాచారం కూడా వాళ్ళ వల్లే.

ఎందుకంటే

“తిరుపతిలో లక్షల సంఖ్యలో రోజూ మనుషులు వస్తారు. ఒక కేసు వచ్చిందని తెలియగానే దర్శనాలు ఆపేసారు. ఎందుకని ఆపేరు? అలాగే దర్శనాలు కానిస్తే దేశమంతా వైరస్ ఇంకెంత తీవ్ర స్థాయిలో వ్యాపించేది? ఎవరయినా గుడి ఎందుకు మూసేరని వాదించారా? అలా వాదించినా, గుడి మూయకపోవటంవల్ల వైరస్ వ్యాపించినా అదీ ఒక పెద్ద వార్త అయ్యేది. కానీ అలా జరగలేదు. అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించారు. ”

ఇంత స్పష్టంగా వుంది. బాధ్యతగా ఎవరు మసలుకుంటున్నారో, బాధ్యతా రాహిత్యంగా ఎవరు మసల్లుకుంటున్నారో. “దేశద్రోహం” చేస్తున్నదెవరో.

అసలు ఈ మర్కజ్లు ఎందుకు అలా ప్రవర్తిస్తారు? “ఎక్కువమంది ఒకచోట గుమిగూడవద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించిన తరువాత అంతమంది ఒకచోట కలవాల్సిన అవసరం ఏముందని? కొందరు ప్రశ్నించారు.”

(వాస్తవాలు ఇలా వున్నాయి మరి

March 13: 3400 people gather at the Nizamuddin markaz as part of a religious gathering.

March 16: Delhi CM Arvind Kejriwal announces that no religious, social, political gatherings of more than 50 people are allowed in Delhi till March 31.

March 21 – 1746 persons were staying in Hazrat Nizamuddin Markaz. Of these, 216 were foreigners and 1530 were Indians. (MHA was aware of it and state police was informed) మరి ఫారినర్ల రాకను ఎప్పుడు నిషేదించారు? మర్చి 22 న)

ఇంట్లో బోర్ కొడుతున్న కిరణ్ పర్వేజ్ మనవలతో ఆడుకుంటానికి బయటికి వెళ్తాను అంటే మాధవ్ ఓపికగా సోషల్ డిస్టాన్సింగ్ అర్థమయ్యేలా చెబుతాడు. అప్పుడు ఊరుకుంటాడు కిరన్. వెనక నుంచి ముస్లిం కొలీగ్ మాటలు వినిపిస్తాయి “పిల్లవాడికి ఉన్న తెలివి పెద్దలకు ఉంటే సగం సమస్య తీరేది” అవును ఇంతకంటే చెప్పేదేముంది?

3

     మొదటి కథ వొక బాధ నుంచి పుట్టినది. అది చదువరిని తర్కంతో ఒప్పించాలని చూడదు. కేవలం వో బాధాకరమైన సామాజిక పరిస్థితిని వర్ణించి వూరుకుంటుంది. ఎక్కడా హిందువుల మీదా, మరొకరి మీదా నిందలు వుండవు.

రెండో కథలో అంతా స్పష్టమే. ఎవరు దేశభక్తులు, బాధ్యతగా వున్నారు; ఎవరు దేశద్రోహులు, బాధ్యతారహితులూ అంతా తెలుపు నలుపు లలో వుంటాయి.

ఇంకా చాలా వార్తలు నెట్ లో లభ్యం. వీటిని ఇంకా అనేక అంశాలతో కలిపి చదువుకోవాల్సిన అవసరం వుంది. ఇది దీనికే ప్రత్యేకమైన విషయం కాదు. గోమూత్ర పాటీలు చేసిన వారు, వగైరా వాళ్ళందరి మీదా కేసులు నమోదు చేశారా, ఏమైంది? తీగ లాగితే డొంకంతా కదులుతుంది. ఆ నాలుగు వేళ్ళు దేన్ని చూపిస్తున్నాయో తెలుస్తుంది.

ఇదీ నా స్పందన ఈ రెండు కథల మీదానూ.

*

పరేశ్ దోశి

18 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ స్పందన వివరాలతో క్రోడీకరించి చెప్పడం బాగుంది. అఫ్సర్ గారికి చూపుడు వేలు కథపై చాలా ఈమెయిల్సు వచ్చాయి, ఎం చెయ్యాలో తెలియటం లేదు అన్నారు ఓ ఫేస్ బుక్ పోస్ట్ లో. కనీసం వాటిని ఉటంకిస్తూ ఓ పోస్ట్ పెడితే బాగుంటుంది.

  • బాగుంది మీ విశ్లేషణ . చూపుడు వేలు చదివాను కాని రెండొది చదవలేదు .

  • చాలా బాగా విశ్లేషించారు. మర్కజ్ వెళ్ళిన ముస్లింలను పరీక్షించాలనే హిందూ మిత్రులు నీనా గాక మొన్న హైదరబాద్ హిమాయత్నగర్ లో టి‌టి‌డి ఆఫీస్ దగ్గర దేముడి లడ్డూలు పంచిపెడితే కొన్ని వందలమంది భక్తులు కిక్కిరిసిపోయి వుంటే వాళ్ళవాళ్ళ కరోన వచ్చిందో లేదో తెలుసుకుందుకు పరీక్ష చేయించుకోవాలని అడగకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ తేడా ఎందుకు?

  • ఈ రెండు కథల్లోని తర్కవితర్కాల జోలికి నేను వెళ్లదలచుకోలేదు. మర్కజ్ అంశం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈ చర్చ జరుగుతున్నది. మార్చి 13న సమావేశం జరిగింది. విదేశీయులను మార్చి 22 న నిషేధించారు. కేంద్రానికి, రాష్ట్ర పోలీసు శాఖకు ఈ సమావేశానికి జరిగిన సమాచారం ఉన్నప్పుడు ఎందుకు నియంత్రణ చర్యలు తీసుకోలేదు అన్నది మాత్రమే వేస్తున్న ప్రశ్న. ఇక్కడ అందరూ కన్వీనియంట్గా ఇగ్నోర్ చేస్తున్నది.. కావాలని వదిలేస్తున్నది వేరు. సమావేశం జరుపుకోవడాన్ని కానీ, హాజరు కావడం కానీ తప్పు కాదు. కానీ అక్కడికి వెళ్లి వచ్చిన వారికి వైరస్ సోకిందన్న వార్త తెలిసిన తర్వాత.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పదే పదే విజ్నప్తులు చేసిన తర్వాత పరీక్షలు చేసుకోకుండా తప్పించుకోవడం దేశభక్తి అనుకోవాలా? ఇండ్లల్లో దాక్కోవడం ఔదార్యమా? ఇండోర్ వంటి ప్రాంతాల్లో పరీక్షలు చేయడానికి వచ్చిన వారిపై రాళ్లదాడికి పాల్పడటం బాధాకరమైన సామాజిక పరిస్థితా? వార్తలు బయటకు వచ్చిన తర్వాత కూడా మర్కజ్ లో ఉన్న 1746 మందికి పరీక్షలు చేయించడానికి ముందుకు రాకపోవడం సామాజిక బాధ్యతనా? అక్కడ కరోనా వైరస్ సోకింది కాబట్టి పరీక్ష చేయించుకోవాలని అడిగారు. అందుకు చేయించుకోకపోగా.. అక్కడ ఎందుకు డిమాండ్ చేయలేదు.. ఇక్కడ ఎందుకు చేయలేదు అని వితండవాదాలు మరికొన్ని. మర్కజ్ నుంచి వచ్చిన వారిికి పాజిటివ్ వచ్చింది కాబట్టే.. వారి కాంటాక్టులందరినీ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వాలు కోరాయి. ఏ ఒక్కరికి పాజిటివ్ వచ్చినా.. వారి కాంటాక్టులందరినీ క్వారంటైన్కు అన్ని ప్రభుత్వాలు పంపించాయి. మర్కజ్ యాత్రికులు పరీక్షలు చేయించుకోవాలని వారిలో చైతన్యం కల్పించకపోగా… వారిని రెచ్చగొట్టి.. దాడులకు ఉసిగొల్పి.. ఇండ్లల్లో దాచిపెట్టి .. అన్నింటికీ మించి మతం రంగు పులిమి రాజకీయాలకు వాడుకొన్న దుర్మార్గపు రాజకీయతంత్రమిది. ఒక పరిమిత చట్రంలో బందీ అయిపోయిన వాళ్లకు ప్రతి ఒక్కటీ అదే పరిమితిలో చూడటం అలవాటైపోతుంది. తమ భావనలకు అనుకూలంగా వాదనలను రూపొందించుకోవడమూ అలవడుతుంది. ఎవరూ వారిని మార్చలేరు.

  • ఇంతకు ముందు కూడా ఈయన వచ్చిన కథకు కౌంటర్ గా మరొకటి రాసినట్టు గుర్తు.
    మీరు అందులోని డొల్లతనం బాగా చూపించారు.
    మర్కజ్ నుంచి వచ్చినవారు లాక్కున్నాయి, వచ్చిన వైద్యబృందం మీద దాడి చేశారని చెప్పడం, దాన్ని హైలైట్ చెయ్యడం అతితెలివి.
    వీళ్ళకు బాబ్రీ మసీదు విధ్వంసం నుండీ జరిగిన సంఘటనలు తెలియదు అనుకోవాలా?
    ఒక నాన్న ఇంటికి వచ్చిన ప్రతిసారీ ఏదో కారణానికి చితగ్గొడుతున్నాడు అనుకుందాం. ఒకరోజు ఆ పిల్లలకు మిఠాయి తీసుకు వచ్చాడు. అయినా సరే పిల్లలు దాక్కున్నారు. ఎంత నచ్చజెప్పినా కొడతాడనే భయంతో బయటకు రావడానికి భయపడ్డారు.
    ఈ దాడులు చేసిన సంఘటనలు ఎన్ని? ఎన్ని చోట్ల సహకరించారు? సహకరించని చోట కారణాలు వెతకండి. ఆ పని చూపుడువేలు కూడా చేయలేదు.

    • దాడి చేశారని చెప్పడం.. హైలైట్ చేయడం.. అన్నారు. చేశారు అని చెప్తున్నారు.. చేశారా.. నిజమా కాదా.. సహకరించని చోట మాట్లాడకుండా.. బాబ్రీ దాడి vidhvamsam nunchi matladararu. Mari Ghajini Mohammad.. Mughals.. vaari antevasulu qhutubshahilu.. bahumanilu.. asafjahilu. Veellandaru chesina dadulu marchipote ela. Vaariki teliyadanukovala.. sahakarinchani chota.. annaru.. enni chotla sahakarinchaaru.. enni chotla sahakarinchaaru.. karanalu kuda chepthe baguntundi kadaaa

      • ఎక్కడో ఒకచోట మనం గిరిగీయాలి. ఎక్కడ గీద్దామో మీరు చెప్పండి. లేదా నన్ను చెప్పనివ్వండి.
        బాబ్రి విధ్వసం మన కళ్ళముందు జరిగింది. అది చూసిన వారు ఇంకా బతికే వున్నారు. ఆదునిక భారతదేశం (India) 1947న అవతరించింది. మీరు దీని తర్వాత మాట్లాడదామన్నా సరే దీని ముందటి బౌద్దమతాన్ని సర్వనాశనం చేసిన నాటి నుండీ మాట్లాడదామన్నా సరే. లేదా అంతకు ముందు స్థానిక జాతుల్ని అంటరానివాళ్ళని చేసిన ఆర్యుల దండయాత్ర నుండి మాట్లాడదామన్నా సరే!
        బాబ్రీ గాయాలు పచ్చిగా వుండగానే గుజరాత్ మారణకాండ జరిగింది. ఆ మారణకాండ పునాదుల మీద ఎదిగిన హిందుత్వ నాయకుడు పదవిలోకి వచ్చినపటినుండీ చేస్తున్న పనులన్నీ పనిగట్టుగొని ముస్లిములను గాయపరచేవే. దీనివల్ల మరియు చానల్స్‌లో ముస్లిములే కరోనా వ్యాపింపజేస్తున్నారు అన్న పుకార్ల వల్ల వాళ్ళు భయపడడంలో అర్థం వుంది.
        దాడి చేయడాన్ని నేను ఆ దృష్టితోనే చూస్తాను.
        మీలాంటి వారే ఇప్పుడు జార్జ్ ఫ్లాయిడ్ విశయంలో కూడా ‘అయితే మాత్రం అంత ఆస్తి నష్టమా ” అని మెటికలు విరుస్తున్నారు.

    • అదే బాధ. బాబ్రీ వరకూ ఎందుకు, గత కొన్నేళ్ళలో ఎంతమంది అఖ్లక్లు. ఆ సంఘటనలు ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తాయా, అభద్రత కలిగిస్తుందా? రెండో కథలో పర్వేజ్ తన భయాన్ని వ్యక్తం కూడా చేస్తాడు. ఆ భయాలు నిజం కావా? ఆ భయాన్ని గుర్తించిన రచయితే దాన్ని కొట్టిపారేస్తాడు, మూలాలు చూడకుండా.

  • బాధ్యతని పక్కన పెట్టి వివక్షమీద దృష్టి సారించాల్సిన సమయం కాదిది. ఆలోచనలు పక్కదారి పడితే కరోనా మొత్తం మానవజాతినే కబళించగల మహమ్మారి. మైనారిటీల పట్ల వివక్ష విషయంలో – మన పొరుగు దేశాలకూ, మనకూ ఉన్న పోలికలు, తేడాలు మనసునించి కాక వాస్తవాలనుంచి పుడితే బాగుంటుంది. కానీ వాస్తవాలు కూడా మనసులోంచే పుడితే ఎవరూ చెయ్యగలిగింది లేదు. ఇటీవల చేతన్ భగత్ విరచిత వ్యాసానికి ఇక్కడ లంకె ఇస్తున్నానుః https://timesofindia.indiatimes.com/blogs/The-underage-optimist/its-not-black-and-white-if-you-really-care-about-secularism-in-india-understand-both-hindus-and-muslims/
    ఇది కేవలం వివక్ష పట్ల అవగాహనకు మాత్రమే. వివక్ష పట్ల ఏకపక్షంగా ఆలోచించాలని fix ఐపోయినవారు తమ భావాల్ని స్మర్ధించే ఇలాంటి మరో వ్యాసాన్ని ఆశ్రయించవచ్చునని తెలుసు. ఐనా అన్ని రంగాల్లోనూ రాణిస్తూ, ఉన్నత స్థానాల్ని అలంకరిస్తున్న మైనారిటీ మిత్రుల స్ఫూర్తినీ, సమభావాన్ని స్నేహభావంతో ప్రదర్శించడంలో మాకు ఆదర్శమైన ఎందరో ఆత్మీయ మైనారిటీ వర్గీయుల్నీ – వారు మైనారిటీలని గుర్తు చేసుకోవాల్సిన అగత్యం కల్పించే రచనల ప్రయోజనం అర్థం కాక ఈ మంకె ఇస్తున్నాను. ఏది ఏమైనా ‘చూపుడు వేలు’ వంటి రచనల ప్రచురణకు స్వేచ్ఛనిచ్చే భరతావని సత్సంప్రదాయం అభినందనీయం. ఇదే సంప్రదాయం మన పొరుగు దేశాలు కూడా పాటించడానికి ఈ రచనలు ప్రేరణ కాగలవని ఆశిద్దాం. చూపుడు వేలు కథలో శిల్పానికి అభినందనలు. అందులో కథకుడి పాత్రలో నిజాయితీ ఉంది. అందుకే వివక్షపై తన భార్య రజియా అభిప్రాయాల్ని కూడా పొందుపరిచాడు.
    ఎటొచ్చీ తనుండే వాతావరణంలోనే ఉంటూ, తనతో సహజీవనం చేస్తున్న ఓ మహిళకు కలిగిన అభిప్రాయాలు ఆలోచించతగ్గవి అని భావించడానికి బదులు, ఎవరిదో కుట్ర కారణంగా ఆమెకు అలాంటి అభిప్రాయాలు ఏర్పడినట్లు వ్రాశాడు. ఒకవేళ తన అభిప్రాయాలే – ఎవ్రిదో కుట్ర అనుకునేందుకు కూడా అలా ఆస్కారమిచ్చాడు. నిజానికి ఈ కథలో మిగతా నాలుగు వేళ్లూ రజియా పాత్రలోనే ఇమిడాయి.
    తనకు తెలియకుండానే వాస్తవాల్ని కథలోకి చొప్పించడం ఉత్తమ రచయితల లక్షణమని ప్రముఖ కథకులు అంటారు. అఫ్సర్ గారికి మా అభినందనలు.

    • భలే భలే! ఏవండీ ఆ పొరుగు దేశాలు?
      మానవాభివృద్దిలో శరవేగంగా పరుగులుదీస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇంకా కాస్తా పక్కకు వెళితే ఆఫ్ఘనిస్తాన్‌లా?

      అమెరికాతో ఎందుకు చేయరు పోలిక? కెనడాతో ఎందుకు చేయరు?
      “చూపుడు వేలు” కథను ప్రచురించే స్వేచ్చనిచ్చిన భారతావనికీ, మీకూ సాష్టాంగ ప్రమాణం చేస్టున్నానండి. చాలా?

      ఈ భావజాలానిదే అసలు తప్పు. నాలువేళ్ళు ప్రచురించడానికి ఎంత హక్కుందో, చూపుడు వేలు ప్రచురించడానికీ అంతే వుంది. ఎవరూ దేన్నీ భిక్షగా వేయడం లేదు.

      • అమెరికాతో ఎందుకు చేయరు పోలిక?

        చూసున్నాము కదా అమెరికా ఎంత బాగుందో. నువ్వు పెట్టుకో పోలిక, అక్కడ ఉంట్టున్నావు కనుక నీకది తప్పదు. అమెరికన్ ప్రజలు అలా అణచివేత కు గురౌతుంటే NRIలు ఎన్ని వ్యాసాలు రాశారు? ఈ రోజు అకస్మాత్తుగా మీఅందరికి నల్ల వారిపై ప్రేమ పుట్టుకోచ్చింది. మేము నమ్మాలి.
        ఈ ప్రేమ వెనుక విషయాలను గ్రహించ లేమా?

  • సార్…..మీ విశ్లేషణ బాగుంది.చూపుడువేలు కథ ఎంత బాగుందో మీ విశ్లేషణ అంతే స్థాయిలో ఉంది.రెండవ కథ గురించి ప్రస్తావన చేసి ప్రచారం
    చేయడం అనవసరం

  • ఈ కథ ప్రయోజనం ఏమిటంటే రజియాలా అమాయకంగా టీవీ లో చూస్తున్నదంతా నమ్మే వాళ్ళు పునరాలోచిస్తారన్న ఆశ. అందరికీ నడుస్తున్న కథ రెండు పక్షాలూ తెలిసి వుండక పోవచ్చు. అలాంటి వాళ్ళకు రెండో పక్క కథ తెలుస్తుంది. ఆత్మసంస్కరణకు అవకాశం కల్పిస్తుంది.

    “చూపుడువేలు” అన్న శీర్షిక గురించి. మనకు తెలిసిందే, ఎప్పుడన్నా ఒకరి వైపు వేలెత్తి దోషిగా చూపిస్తే మిగతా నాలుగు వేళ్ళూ తనవైపే తిరిగి వుంటాయి. కాని ఆ తెలివిడి వుండదు ఆ మనిషికి ఆ క్షణాన. ప్రస్తుతం దేశంలో జరుగుతున్నది అదే.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు