మరో అడుగు ముందుకు!

సారంగ పక్ష పత్రిక ఈ సంచికతో తొమ్మిదో  ఏడులోకి అడుగుపెడుతోంది!

ఈ సందర్భంగా అన్ని విధాలా సారంగకి తోడూ నీడగా నిలుస్తున్న పాఠకులకూ, రచయితలకూ, కాలమిస్టులకు, చిత్రకారులకూ  మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ముందు కూడా మీ సహాయ సహకారాలు ఇలాగే కొనసాగుతాయని నమ్ముతూ మీతో ఈ నాలుగు మాటలు!

ఈ మాటలు రాస్తున్న సమయంలోనే ఇటీవలి తెలుగు సాహిత్య చరిత్రలో ప్రధానమైన భూమికని నిర్వహిస్తూ వచ్చిన మూడు పత్రికలు మూతపడుతున్నాయన్న విషాద వార్త వినిపించింది. దినపత్రికల్లోనూ, వార(?)పత్రికల్లోనూ  సాహిత్య పేజీలు కుంచించుకుపోతున్న దశలో ఈ వార్త సాహిత్యలోకానికి పిడుగుపాటే. ఇక మన ముందు మిగలబోతున్నవి వెబ్ పత్రికలేనేమో అని అనుకోక తప్పడం లేదు.

నిజానికి అంతర్జాతీయ స్థాయిలో చూసినా, ఇది వెబ్ పత్రికల యుగంగానే కనిపిస్తోంది. ఈ స్థితిలో కనీసం అవైనా మూతపడకుండా మనం జాగ్రత్త పడాల్సిన సమయం ఇది. సాహిత్యానికి ఆ మాత్రం కూడా చోటు లేని కనాకష్టమైన పరిస్థితి ఎలా వుండబోతుందో వూహకి కూడా అందడం లేదు. కానీ, ఉచితంగా అందుబాటులో వున్న ఈ వెబ్ పత్రికల మనుగడని సులభతరం చేయడంలో మన పాత్ర ఏమిటి? అని ఇవాళ ప్రతి చదువరీ, ప్రతి రచయితా ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.

సారంగ విషయానికే వస్తే, గత తొమ్మిదేళ్లలో ఒక ఏడాది మూసివేసే పరిస్థితిని మేం ఎదుర్కొన్నాం. ఆ రకంగా చూస్తే “సారంగ”కి ఇది ఎనిమిదో అడుగు మాత్రమే అవుతుంది. జనవరి 17, 2017 సంచికలో “ఇక సెలవ్” అంటూ మేం పత్రికని మూసివేసినప్పుడు కొన్ని వేలస్వరాల్లో నిరాశ పెల్లుబికింది. ఎలాంటి వ్యాపార ప్రకటనలూ లేకుండా, కేవలం సాహిత్య సాంస్కృతిక రంగాల పట్ల అనురాగంతో మొదలై, అతికొద్ది కాలంలోనే వేలాది  పాఠకుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసిన సారంగ నిష్క్రమణని ఎవరూ వూహించలేదు. ఆ మూసివేత వెనక కారణాలని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు.

కచ్చితంగా ఏడాది తరవాత సారంగ మళ్ళీ ప్రారంభమైనప్పుడు అది అంతకుముందు కన్నా మూడింతలు ఎక్కువ  పాఠకాదరణని  అందుకుంది. ముఖ్యంగా ఇరవై ప్లస్ తరం నుంచి అనూహ్యమైన స్పందన పెరుగుతూ వచ్చింది. ఆ ఇరవై ప్లస్ పాఠకుల కోసమూ, రచయితల కోసమూ కొత్త శీర్షికలని ప్రవేశ పెట్టక తప్పలేదు. ఇది సారంగ సాధించిన అతిపెద్ద విజయం అని, ఈ తరం వాళ్ళ కోసమైనా సారంగని  ఆపకుండా కొనసాగించాలని మేం మా రెండో ఇన్నింగ్స్ లో  స్థిర సంకల్పంతో పనిచేయడం మొదలుపెట్టాం.

యితే, ఇదే సందర్భంలో కొన్ని బాధాకరమైన సంగతుల్ని కూడా ఇక్కడ మరోసారి గుర్తుచెయ్యకతప్పదు.

సారంగ పత్రికని ప్రతి పక్షం చదువుతున్న వారికి ఒక విషయం బాగా అర్థమై వుండాలి. ఇంకే పత్రికా అందించలేనన్ని రచనల్ని సారంగ అందిస్తోంది. ఈ మధ్య  ఇంగ్లీషు విభాగం కూడా తెలుగు భాష సరిహద్దులని దాటి ఆదరణని అందుకుంటోంది. అనువాదాలకు ఒక వేదికగా మారుతోంది.  ఒక వైపు వచన రచనలు సరైనవి రావడమే లేదని కొన్ని పత్రికలు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఈ కాలంలో కూడా ప్రామాణికమైన వచనరచనల్ని మేం అందిస్తున్నాం. ప్రతిరోజూ కనీసం పాతిక కవితలు మాకు అందుతున్నాయి. అందులో కనీసం అయిదు వెంటనే ప్రచురించదగిన కవితలు వుంటున్నాయి. ఈ స్థితిలో అతిజాగ్రత్తగా ఎంపిక చేసిన కవితలు మాత్రమే అందిస్తున్నాం. అట్లాగే, కథలూ, వ్యాసాలు కూడా! సీరియల్ నవలలు కూడా మళ్ళీ ప్రచురించాలన్న  డిమాండ్ వుంది. అనివార్య సాంకేతిక కారణాల వల్ల అట్లాంటి డిమాండ్స్ ని ప్రస్తుతం పరిశీలించలేక పోతున్నాం. మామూలు పత్రికల్లో ఒక టీం అంతా కలిసి చేసే పనిని ఇక్కడ కేవలం ముగ్గురు మాత్రమే చేస్తున్నారు. రచనలు చదవడం, వాటిలో మార్పులు చెప్పి, తిరగ రాయించడం, సాంకేతికత  అనే ప్రక్రియ వల్ల చాలా రచనలు ప్రచురణకి సిద్ధమయ్యే సరికి ఆలస్యం తప్పడం లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని, ఎడిటర్లతో సహకరించాల్సిన సహృదయత రచయితల్లో వుండాలని కోరుకుంటున్నాం.

న్నిటికీ మించి, సోషల్ మీడియాలో ఆనవాయితీగా మారిన కొన్ని దురలవాట్లు వెబ్ పత్రికలకు కూడా విస్తరిస్తున్నాయి. రచనని బట్టి కాకుండా రచయితని బట్టి కామెంట్లు కురిపించడం, ఒక రచన ఎంత మంచిదైనా దాన్ని సహృదయంతో స్వీకరించి, కనీసం తమ ప్రతిస్పందనని తెలియజేయలేకపోవడం సరైన సంప్రదాయం కాదు. రచన మాత్రమే ప్రమాణంగా వ్యాఖ్యలు వుంటే అది మంచి అభిరుచిని పెంచుతుంది. రచయితల మధ్య కూడా ఇతరుల రచనల్ని చదివి, తమ అభిప్రాయాల్ని పంచుకోగల నిజమైన సహృదయ భావన అవసరం.

మరో బాధాకరమైన విషయమే ఏమిటంటే: చాలా మంది రచయితలు తమ గురించి పాజిటివ్ విమర్శలూ, సమీక్షలూ, అభిప్రాయాలు మాత్రమే ప్రచురించాలని మా మీద వొత్తిడి చేస్తున్నారు. అట్లా చేయలేదన్న కారణంగా పత్రికని అంటరానిదిగా దుష్ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఈ ప్రచారాలు కొన్ని సందర్భాల్లో మాలో వున్న రచయితల్ని కూడా బాధపెడ్తున్నాయి. మా మీద బురద చల్లడానికి వీటిని కొందరు వాడుకుంటున్నారు. మాకు లేని అనేక రకాల  రాజకీయాలని అంటగట్టే ప్రయత్నాలూ చేస్తున్నారు. అట్లాంటి సందర్భాల్లో కోరికోరి కొరివితో తలగొక్కోవడంగా ఈ పత్రికా నిర్వహణ మారుతోంది. అట్లాంటి వాటిని మీ మీ సంస్కారాలకే వదిలెయ్యడం తప్ప మేం చేయగలిగిందేమీ లేదు. మీ అధికార దాహ రాజకీయాల్లోకి మమ్మల్ని మాత్రం లాగకండి. మిమ్మల్ని సంతృప్తి పరిచే పైరవీ  పనులేవీ సారంగ వల్ల కావు, కావు, కావు!

సారంగ లక్ష్యాలేమిటో ఇప్పటికే మా పాఠకులకూ, రచయితలకూ బాగా తెలుసు. ప్రతి ఏడూ గుర్తు చెయ్యాల్సిన అవసరం లేదు. అట్లాగే, సారంగ ఎలాంటి ప్రమాణాలని అందుకునే ప్రయత్నం చేస్తుందో కూడా గుర్తు చేయక్కర్లేదు. మా స్పష్టత మాకుంది. మా వైపు నుంచి ఎప్పుడూ ఒక్కటే విన్నపం: సారంగ చదువుతూ వుండండి. మంచి రచన చదవగానే వెంటనే మీ అభిప్రాయం పంచుకోండి. అదే సమయంలో సారంగ అడుగులు బలపడడానికి మీ విమర్శని కూడా మాతో పంచుకోండి.

పుస్తకాలు చదివే లక్షణం ఈ భూమ్మీద బహుశా మనుషులకు మాత్రమే వుందేమో! ఆ జీవలక్షణాన్ని మరచిపోకుండా చదువుకుందాం. చదువు గురించి మాట్లాడుకుందాం. చదువుకోసం పాటుపడే పత్రికల మనుగడని కాపాడుకుందాం.

*

ఫోటో: దండమూడి సీతారామ్

ఎడిటర్

16 comments

Leave a Reply to Sujatha Velpuri Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పది కాలాలు పాటు సారంగా, నిలొస్తుంది. ❤️💐🍰. శుభ అభినందనలు.. సారంగా!

  • చదవగానే చాలా నచ్చేసింది మీ వ్యాసం!
    ముఖ్యంగా చివరి వాక్యాలు.. 💙💙

  • కొత్త వాళ్ళని ప్రోత్సహించడంలో ‘సారంగ’ ముందు వుంది..

    సారంగ టీం కి అభినందనలు …

  • మీరు చేస్తున్న ఈ సాహిత్య సేవకు యువ తరం మీ వెంట ఉంటుంది సార్.! saaranga చదువుతున్న ప్రతి ఒక్కరికి మీ కృషి, మీ పట్టుదల చాలా సహజంగా అర్థమౌతాయి.!🎂👏👏👏👏👏🎈🎉🎊😍🙏

  • ఎంత బావుందో ఈ వ్యాసం. తొమ్మిదేళ్లైపోయిందా! ఇంత ఓపికగా, శ్రమతో దీన్ని నడిపిస్తున్న మీ అందరికీ కృతఙ్ఞతలు, అభినందనలు. ఈ ప్రవాహం ధారాళంగా, అనంతంగా సాగాలి.

  • పత్రిక నిర్వహించడం ఎంత కష్టం..? అనేక అవాంతరాలు.. చికాకులు..ఎదురవుతాయి. తొమ్మిది సంవత్సరాల కాలం గొప్పదే..అభినందనకు మీరు అర్హులు.
    భవిష్యత్తు సారంగ లాంటి కమిటెడ్ పత్రికలదే..

  • ప్రగతిశీల భావాలకు, ఉత్తమాభిరుచి సాహిత్యానికి వేదికగా నిలిచి పాఠకాదరణ పొందుతున్న సారంగ పక్ష పత్రిక తొమ్మిదో ఏడులోకి అడుగుపెడుతోన్న సందర్భంగా సారంగ సంపాదక వర్గానికి హార్దికాభినందనలు. కృతఙ్ఞతలు.

  • మీరన్నట్టు రచయతనుబట్టి స్పందన అన్నది ప్రతి చోటా జరుగుతున్నది. ఇది మీ ద్వారా రావటం బాగుంది. కొత్త రచయిత గుర్తింపు పొందాలంటే అన్ని రచనలూ చదవాలి. కొత్త రచయితల అగచాట్లు గురించి రాస్తే పత్రికలు తీసుకోరు అన్నది కూడా సత్యమే

  • సారంగ పత్రిక నిర్వాహకులకు తొమ్మిదవ వార్షికోత్సవ శుభాభినందనలు. 💐

  • ఎలాటి వొత్తిడులకూ సారంగ టీమ్ లొంగ వద్దు. పొగడ్తలను ప్రచురించి, విమర్శలను ఆపడం ఒక రచన మీద వచ్చిన అభిప్రాయాలను ఆపడమే కదా

    అలాగే రచయితకు సోషల్ మీడియాలో ఉన్న స్నేహితుల సంఖ్యను బట్టి కామెంట్స్ రావడం కూడా అభిలషణీయం కాదు. రచనను బట్టే కామెంట్స్ రాయాలి

    నిరాఘాటంగా సారంగ కొనసాగాలి. టీమ్ ముగ్గురికీ అభినందనలు

  • సారంగతో నాది ప్రత్యేక అనుబంధం. పాఠకుడిగా మొదలైన అనుబంధం…కథకుడిగా, సమీక్షకుడిగా, రేపటి కథకులకు పరిచయ వేదిక నిర్వాహకుడిగా…..నన్ను మెరుగుపరుచుకోవడంలో సారంగ ఎంతో ఉపయోగపడింది. అందుకే సారంగ నాది అనిపిస్తుంది. తెలుుగు సాహిత్యం ఉన్నన్ని నాళ్లూ సారంగ కొనసాగాలని కోరుకుంటూ… సారంగ టీమ్ కి నా ధన్యవాదాలు. మీ కష్టానికి తప్పక గుర్తింపు లభిస్తుంది.

  • రచనని బట్టి కాకుండా రచయితని బట్టి కామెంట్లు కురిపించడం నిజంగా బాధాకరమే. ముఖ్యంగా కొత్తగా వస్తున్న రచయితలను అంతగా పేరు ప్రఖ్యాతలు లేని రచయితలను ఇది డిమోటివేట్ చేసే అంశం. సారంగ నిజంగా నాకు ఇష్టమైన పత్రిక. మీకూ మీ టీం మెంబెర్స్ కీ కృతజ్ఞతలు మరియు అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు