జనవరి నెల. ఆదివారం. వెచ్చని ఎండ హాయిగా ఉంది.
ఎప్పటి మా అలవాటు ప్రకారం వంట చేసి, ప్యాక్ చేసుకుని, నేనూ మావారూ ‘లోధీ గార్డెన్స్’ కి వెళ్లాం.
ఢిల్లీ మంచుకి తడిసి, ఎండలో మెరుస్తున్న చెట్లు, లాన్‌లు, శ్రద్ధగా, కుదురుగా పెంచిన పూల మొక్కలు. ఎన్నిసార్లు చూసినా, ఆహ్లాదంగా, అద్భుతంగా ఉండే లోధీ గార్డెన్స్ తో మూడు దశాబ్దాల అనుబంధం.
శలవు రోజు కావడంతో పార్కింగ్‌కి జాగా దొరకలేదు. మొత్తానికి తిరిగి తిరిగి పార్క్ చేసి, చక్కటి జాగాలో, దుప్పటి పరుచుకుని కూర్చుని సేద తీరాక, చుట్టూ చూస్తే, విసిరిన పూలతోబాటూ రంగురంగుల ఊలు బట్టలు వేసుకుని ఆడుకునే పిల్లలు, పెద్దలతో కదిలే పూలవనంలా ఉన్న గార్డెన్స్, మధ్యాహ్నం పన్నెండు గంటల ఎండలో మెరిసిపోతోంది.
లంచ్ చేసి, కాసేపు చదరంగం ఆడుకుని, కబుర్లు చెప్పుకున తర్వాత, మావారు కాస్త నడుం వాల్చి చిన్న నిద్రలోకి జారుకున్నారు.
వెనక్కివాలి, చెట్ల ఆకుల మధ్యనించి ఆకాశాన్ని చూస్తూ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాను..
* * *
అయిదో క్లాసులో శలవలకి హైద్రాబాద్‌నించి విజయనగరం తాతగారి ఊరికి వెళ్లడం కూడా గొప్పగా పిల్లలకి ఊరించి చెప్పి, ఇంజన్ బొగ్గుముక్కలు కళ్లల్లో పడుతున్నా దెబ్బలాడి కిటికీ పక్కన కూర్చోవడం..
మాలాగే శలవలకి వొచ్చిన పెద్దత్తయ్య వాళ్ల కుటుంబాన్ని, కేవలం ఖర్గపూర్ నించి వొచ్చినందుకూ, ‘బెంగాలీ’లో మాట్లాడుతున్నందుకూ మిగిలిన బంధువుల పిల్లలు గొప్పగా చూస్తే, అంతవరకూ హైద్రాబాద్‌నించి వొచ్చిన గొప్ప కాస్త తగ్గినట్లనిపించి ఉక్రోషం రావడం..
అంతలోనే అందరం కలిసి, మైదానాల్లోనూ, కొండల దగ్గరికీ పరుగులూ ఆటలు.. శలవలు అయిపోగానే తిరిగి వొచ్చి స్కూలు చదువులు. ఇప్పట్లా పోటీ లేని ప్రపంచంలో టెంత్ క్లాస్ సెకండ్ డివిజన్ వచ్చిందని కూడా గొప్పగా చెప్పుకుని సంతోషపడే రోజులు..
డిగ్రీ అయ్యాక, అత్తయ్యగారి అబ్బాయని కాక ఇష్టపడి చేసుకొని, ఢిల్లీలో గొప్పగా మొదలుపెట్టిన కొత్త జీవితం..
ఇద్దరం బస్సుల్లో..
పిల్లలతో స్కూటర్ మీద..
మామయ్యగారు రిటైరై మాతో స్థిరపడ్డాక, అత్తామామలతో పిల్లలతో కార్లో అంచెలంచెలుగా..
బాధ్యతలు, కష్టసుఖాలు, తోబుట్టువులకి సాయాలు, జీవితం పరుగుతీసింది.
మనలా ఇక్కడే స్థిరపడి, మనతో స్వంతవాళ్లలా కలిసిపోయి, ఒకే కుటుంబంలా అయిన స్నేహితులు. ఇక్కడి వారికి మన సంస్కృతి అలవాట్లు పరిచయం చేస్తూ అయిన స్నేహాలు.
పిల్లల గెలుపుకి అభినందనలు, వాళ్లకి ఉద్యోగం వొస్తే మన విజయంగా సంతోషపడడం..
మెల్లిగా జీవితం నడిగోదావరిలా మారింది. పెళ్లిళ్లు, మనవలు, సగం బాధ్యతలు తీరిన తృప్తి. సగం ఈదిన సంతోషం, ధైర్యం.. ‘మిగతాది ఈదగలమా..’ అని ఆందోళన..
పెద్దవాళ్లు కాలం చెందుతున్నందుకు పరామర్శలు. ‘రేపు మనం కూడా..’ అన్న ఆలోచన మొదలు కావడం.
మెల్లిగా తోటివాళ్ల పదవీవిరమణ ఉత్సవాల్లోకి వొచ్చిన జీవితం.. దూరమైన మిత్రుల జ్ఞాపకాలు..
ఆలోచనల్లో మునిగిపోయిన నేను, ఎవరో చిన్నపాప ఆడుకుంటూ పడిపోయి ఏడ్వడంతో ఉలిక్కిపడ్డాను. ఇంట్లో ఉన్న మనవరాలు గుర్తొచ్చింది.
మావారి నిద్ర పూర్తయింది. ‘ఇంక వెళ్దామా, నీరెండ వొచ్చీసింది’ అన్నారు.
నవ్వొచ్చింది. పార్క్‌లోకి కాదు.. జీవితంలోకి కూడా ‘నీరెండ’ వొచ్చీసిందని.
*
Add comment