తమిళ మూలం:ఎల్. ఎస్.రామామృతం
తెలుగు:దాము
లాల్గుడి సప్తర్షి రామామృతం(లాసరా) ‘The best stylistic and the most difficult writer of Tamil’గా పేరు పొందిన రచయిత. తమిళ భాషను కొత్త పుంతలు తొక్కించి, కొత్త dictionను అందించాడు.
మనిషికీ మనిషికీ మధ్య, మనిషికీ ప్రకృతికీ మధ్య వున్న సంక్లిష్ట వస్తువును తీసుకొని, దాన్ని సంక్లిష్ట శైలిలో చెప్పడం యితని ప్రత్యేకత. తన రచనల నుండి తాను తాత్వికంగా దూరమవుతూ, వుద్వేగ పరంగా దగ్గరవుతాడు. “నిప్పు అని పలికితే నోరు కాలాలి.” అంటాడు లాసరా.
యితని రచనల్లో interior monologue, stream of consciousness, Italian minimalism, prose-poetry, సంస్కృత పదాలు వుంటాయి. ఆయన కథలు ఏక కాలంలో మన intellectనీ, emotionనీ తాకుతాయి.
లాసరా గురించి ప్రముఖ తమిళ రచయిత సుజాతా రంగరాజన్ ఇలా అంటాడు. “ఆయన తమిళంలో రాసిన అందమైన వాక్యాలు-గందరగోళ పరిచేవి, దావాగ్నిలా కోపగించుకునేవి, నీటి ధారలా మెల్లగా ప్రవహించేవి. లాసరాను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఈయన కథల్లో కనిపించేది భక్తి-దేవుని భక్తి, కుటుంబ ఐకమత్యం మీద భక్తి, భక్తి మీద భక్తి, భాష మీద, దుఃఖం మీద, కోపం మీద, పేదల మీద, సంగీతం మీద. రామామృతాన్ని చదవని వారికి తమిళ కథల గురించి మాట్లాడే అర్హత లేదు”
20యేళ్ళ వయసులో రచన ప్రారంభించిన లాసరా 300కథలు, 6నవలలు, 10వ్యాస సంపుటులు వెలువరించాడు. 1989లో తన ఆత్మ కథ, ‘చింతా నది’కి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
***
వొక సారి, వొక మర్రి చెట్టులో వుడుత వొక ఆకుని కొరికింది.
ఆకు రాలి, కింద వున్న ముళ్ళ పొదలో చిక్కుకుంది.
ఆ ఆకు యెండకు యెండింది. వానకు తడిసింది. గాలికి వణికింది. చలికి బిగుసుకుంది.
మర్రి చెట్టు కింద వొక కాలువ ప్రవహిస్తోంది. అది ఎక్కడ పుట్టిందో ఎవరికి తెలుసు? పాములాగ ప్రాకుతూ ఎక్కడికో వెళ్తోంది. చివరిగా వొక చోట అదృశ్యమవుతోంది.
వొక రోజు వొక స్త్రీ అక్కడికొచ్చింది. ‘పరయా’ స్త్రీ. అంటరాని వాళ్ళను అప్పట్లో అలానే పిలిచే వారు. నెత్తి మీద కుండ. పొలానికి కాపలా వున్న మొగుడికి గంజి తీసుకొని వెళ్తోంది.
కాలువలో నీరు తేటగా, చల్లగా కనిపిస్తోంది.
బయట వేడిగా వుంది.
ఆమె శరీరం చెమటతో తడిసిపోయింది.
కుండ కింద పెట్టింది. చీర విప్పింది. మెల్లగా నీటిలోకి దిగింది.
ఆమె స్నానం చేస్తున్నపుడు అవతలి గట్టు వైపు వొక కుర్రవాడు వచ్చాడు. కొంచెం ఎర్రగా వున్న అతని జుత్తు సూర్య కిరణాల స్పర్శతో బంగారు రంగులో మెరిసిపోతోంది. తమలపాకు నమిలినట్టు నోరు ఎర్రగా వుంది. అతడి బుగ్గలూ, పెదాలు యిప్పటికీ అతని తల్లిపాల సువాసనల్ని వెదజల్లుతున్నాయి.
అతడి కళ్ళు…అవి దేన్ని చూస్తున్నాయో గానీ, తొట్రు పాటుతో చంచలిస్తున్నాయి. ఆ కళ్ళు కలలతో కల్లోలమవుతున్నాయి. పవిత్రమైన పంచవటి వుద్యానవనం, బృందావనం, మానస సరోవరం కనిపిస్తున్నాయి ఆ కళ్ళలో. అవును, అతడొక కవి (లేదా వొక పిచ్చివాడు). నడుం పట్టీలో గంటం దోపి వుంది. ఏవో తెలియని ఆలోచన్లతో నడుస్తున్న అతడు హఠాత్తుగా ఆమెని చూసాడు. పొద చాటున కదలకుండా నిలబడ్డాడు.
ఆమె అతన్ని చూడలేదు. ఆమె మనస్సూ, దేహమూ స్నానించడంలో పూర్తిగా నిమగ్నమయి వున్నాయి. ఆమె వంటి మీద ప్రాకుతున్న చల్లటి తాజా నీరు కలిగిస్తున్న వున్మత్త మత్తులో, ఆమె చేతుల్తో నీటిని కొడుతూ వర్షపు చినుకుల తెరను లేపి, దాని వెనుక దాక్కుంది. వెర్రిగా నవ్వుతోంది. వెల్లకిలా నీళ్ళలో పడింది.
వెంట్రుకలు విడిపోయి నీటి లోపల పరచుకున్నాయి. చేతులు చాచి, కాళ్లు దగ్గరికి చేర్చి, వొక శిలువలా నీటిలో తేలుతోంది. సూర్య తేజస్సుతో ఆమె కళ్ళు రెపరెపలాడుతూ మెరుస్తున్నాయి. ఆ వెలుగులో ఆమె దేహం వొక నల్లటి స్ఫటికంలా ధగ ధగ లాడుతోంది.
అతడు ఆమెలో లీనమైపోయాడు. దాని గూర్చి అతడు ఆలోచించను కూడా లేదు. బొడ్లో వున్న గంటం హఠాత్తుగా అతని చేతిలోకొచ్చింది.
తాటాకు వుందా? లేదు. ఓ!. చూడిక్కడ. ముళ్ళల్లో చిక్కుకున్న మర్రి ఆకు…వెంటనే దాన్ని తీసుకొని, కాళ్ళను వంచి, తొడమీద ఆకుని పెట్టుకొని రాయడం మొదలు పెట్టాడు. తన మనసులో, హృదయంలో యెలుగెత్తుతున్న భావాలకు రూపమిచ్చేందుకు ప్రయత్నించాడు.
అతడు కవి (లేదా పిచ్చివాడు). అతడివి వొక స్వాప్నికుడి కళ్ళు. ఆ స్వప్నాల్లో దయలేని తాపం, గాఢ రాత్రి వెన్నెల చల్లదనంగా మారిపోయింది; సూర్య ప్రతాపానికి కాలిన పొలాలు, వెన్నెలలో మెరుస్తున్న వుల్లాస వుద్యానవనాలుగా మారిపోయాయి; మురుగు నాచుతో నిండిన కాలువ విచ్చుకొంటున్న కలువ కమలాలతో, గంధర్వులు జలకాలాడే అద్భుత సరస్సు అయింది.
అతని వుద్రిక్త కాల్పనికతలో ఆ అంటరాని అందగత్తె యేమైంది? ఇంద్రుడి వుద్యానవన సరస్సులో క్రీడిస్తున్న అప్సరసను చూసాడా? నడిరేయి వెన్నెల్లో కృష్ణుడి రాకకోసం యెదురుచూస్తూ, యమునా నది వొడ్డున నీటి క్రీడలకోసం వేచి వున్న తొలి వలపు గొల్లభామను చూసాడా? లేదా మోహపు ఆటల్లో అలసిపోయి తోటి గోపికలంతా త్వరత్వరగా యిళ్ళకు వెళ్ళిపోగా,తను మాత్రం యింకా నీటిలో పరచుకొని వున్న ఆ మోహ పారవశ్యపు చివరి గోపికను చూసాడా?
శూర్పణక నీడ పంచవటీ వుద్యానవనం మీద పడక ముందు పంబా నదీ జలాల్లో వొక నిమిషపు ఆనందామృతాన్ని గ్రోలుతున్న సీతను చూసాడా?
లేదా ఆదిమ భూమి లోపలినుంచి దేవుడు వెలువరించిన తొలి స్త్రీని చూసాడా?
లేదా తిలోత్తమ కౌగిలికోసం చండ్ర నిప్పుల్ని కక్కుతూ, కలబడుతున్న సుందోపసుందుల్ని చూసాడా?
యేమి చూసాడతడు? తను చూసిందంతా రాయడానికి ప్రయత్నించాడు.
యిద్దరూ ఎవరి లోకంలో వాళ్ళు మునిగిపోయారు. అతడు రాయడంలో, ఆమె స్నానించడంలో. ఆమె యిప్పటికీ అతన్ని చూడలేదు.
యింకొక వ్యక్తి వాళ్ళ వైపు వస్తుండడాన్ని యిద్దరూ చూడలేదు.
నీటి యేతం తొక్కి తొక్కి, అతడు అలసిపోయి వున్నాడు. ఆకలి యెలుకలా అతని కడుపుని రక్కేస్తుంది. మాలపల్లెకు వెళ్ళి గంజి తెమ్మని తను పంపిన ఆడది యింకా తిరిగి రాలేదు. హఠాత్తుగా అతడు బిగుసుకుపోయాడు. కాలువలో స్నానం చేస్తున్న తన ఆడదాన్ని చూసాడు. నది వొడ్డున వొంగి, ఆమెను చూస్తూ, మూర్ఖుడిలా పళ్ళికిలిస్తూ కైపెక్కిన ఆ పిచ్చివాడ్ని కూడా చూసాడు.
-కుటుంబాన్ని పెంచి పోషిద్దామని యీ ఆడదాన్ని పెళ్ళి చేసుకొన్నా నేను. దీని కోసం ఐదు రూపాయలు, సగం ముంత కల్లు, వొక కోడి పుంజు యిచ్చి మెళ్ళో తాళి కట్టిన. -రంకులాడి! యిప్పుడిది నన్ను మోసం చేసింది. గుడిసెకి పరిగెత్తుకెళ్ళి నా గంజి తెమ్మని కదా చెప్పాను? వేరేవాడి పెళ్ళాన్ని చూసి చొంగ కారుస్తున్న యీ దొంగ నాకొడుకెవడు? యిదంతా బ్రాహ్మణ ఆటలాగుందే! నేనొక పరయానే కావచ్చు-అయితే యేంటి? వాడు మిద్దింట్లో, నేను దరిద్రపు గుడిసెలో వుంటే యేంటి? నాకు మానం మర్యాద లేదా? నేను మొగోడ్ని కానా?-
అతడి మెదడు దావాగ్నిలా మండుకొంది. చెవుల్లో సముద్రం హోరెత్తుతోంది. వొక మెరుపులా వెనుకనుంచి వురికాడు. ఆ కవి గంటాన్ని లాక్కున్నాడు. వాడి జుత్తు పట్టుకొని నిటారుగా నిలబెట్టి, వాడి డొక్కలో బలంగా పొడిచాడు. వొకే పోటు. అంతా క్షణంలో ముగిసిపోయింది. దాన్ని వర్ణించే సమయంలోపే.
వాడు వచ్చాడు, చూసాడు, నిర్ణయించుకున్నాడు- చంపేశాడు.
కవి చేతిలోంచి మర్రి ఆకు జారిపోయింది. అది నీటిలో పడేలోపు అతడి రక్తపు బొట్టు దాని మీద పడింది. ఆ రక్తపు చుక్క ఆకు మీద పగడపు పూసలా తళ తళ లాడుతోంది. ఆకు పడవలా నీటిలో తేలుతోంది.
కాలువలో స్నానం చేస్తున్న ఆమె తన వైపు వచ్చిన ఆకుని తీసుకొని ఆశ్చర్యంతో చూసింది. నాలుగు గజిబిజి రాతలు. మధ్యలో యెర్రటి చుక్క.
యిది మృత్యుదేవత, తన ముద్ర వేసి చేసిన సంతకమని ఆమెకు తెలియదు.
“వొసే రంకులాడి! దొంగ లం..! పరయా కులట!”
గట్టు మీది నుంచి నీటిలోకి దూకాడు. నీటి గోడలు పిడుగుల్లా ఆమె మీద పడ్డాయి. ఆ గంటం తన రొమ్ముల్లో ఎందుకు గుచ్చుకొందో అని ఆశ్చర్యపోయే సమయం కూడా ఆమెకి లేదు. అంత వేగంగా జరిగిపోయింది. ఆ ఆయుధం నిక్కచ్చిగా, నిటారుగా దూసుకుపోయింది. మృత్యుదేవత కాంక్ష యెంత గొప్పది!
ఆమె చేతిలోంచి ఆకు, ఆవలి గట్టు మీద పడింది. ఈ సారి దాని భారం రెట్టింపయ్యింది. అతడి రక్తపు చుక్క, ఆమె రక్తపు చుక్క కలిసి వొకే బిందువయింది.
ఆమెను చంపేసాక వాడి వేడి మెదడు చల్లబడింది. తను చేసింది తెలిసి అతనిలో పశ్చాత్తాపం, భయం కలిగాయి. ఆ గంటాన్ని విసిరేసి పరిగెత్తాడు.
నీటిలో తేలుతున్న శవం, గట్టు మీద పడున్న శవం, గంజిలో పడున్న గంటం-వీటి గురించి మనకవసరం లేదు.
యిది వొక ఆకు కథ.
దాని గురించి యింకా కొంచెం చెప్పాలి.
అది యెండకు యెండింది. గాలిలో తేలింది. చివరిగా, వంట చెరకు కోసం చెత్త యేరుకొంటున్న వొకావిడ పొరక కిందికి చేరింది.
“మా ముసలి నాకొడుకు యెక్కడ చూసినా పొగాకు వూశాడు..ఆగు. యిది పొగాకు కాదే! దీన్ని సూదితో కుట్టచ్చు-సరేలే, యిది బాగా యెండింది, పెద్దగా వుంది. బాగా కాలుతుంది.”
ఆమె నమ్మకం నిజమైoది.
అది బాగా కాలింది.
*
Beautiful! బ్రాహ్మణ ఆట. మృత్యుదేవత కాంక్ష.మంచి కథలు చదివింపజేస్తున్నందుకు ధన్యవాదాలు💐
బరువైన కథ.తాత్విక కథ.అనువాదం అనిపించని అనువాదం.మంచికథ ను చదివించినందుకు కృతజ్ఞతలు దాము గారు!
చాలా బావుంది. అనువాదం గొప్పగా ఉంది.
స్త్రీ ని స్వంత ఆస్తి గా భావించడం అనుమానించడం అత్యాచారం చేయడం ఏం వర్గానికో, కులానికో పరిమితం కాదు మంచి కథను అందించినందుకు ధన్యవాదాలు