మన సాహిత్యంపై కొత్త ముద్ర

‘పక్షులు స్వేచ్ఛగా సంచరించే సువిశాల ఆకాశం కింద` జీవితంలో ఎప్పుడూ వెళ్లలేనంత విశాల మైన భూమి మీద నీతో పాటు నేనూ ఉన్నా’ అని చెప్తున్న కథలు ‘మొహర్‌’!
పిడుగుపాట్లుగానో, ఫెళఫెళరావాలుగానో, యుద్ధశంఖం పూరించినట్లుగానో లేవు.. నిద్రపోతున్న తీరాన్ని మేల్కొలుపుతున్న అలల వలె సుతిమెత్తగా నిశ్శబ్దంగ
ఉన్నాయి..! షాహిన్‌ భాగ్‌లో ఎత్తిన పిడికిలంత దృఢంగా ఉన్నాయి!

+++

చిన్నప్పుడు అమ్మీ మా ఇంట్లో శుభకార్యాలప్పుడు తప్పనిసరిగా ఒక పనిచేసేది. మా ఇంట్లో ఒక రాతి పీట ఉండేది. అది గంధం తీసే పీట. మెలికల అంచుతో ఒక అందమైన గంధం గిన్నె కూడా ప్రత్యేకంగా ఉండేది! అమ్మీ ఆ రాయిని తెచ్చి నడిమింట్ల కూచునేది. గంధం ముక్కను ఆ రాయి మీద నీళ్ళు చల్లుతూ అరగదీస్తూ ఉండేది! నాకు నవ్వొచ్చేది.. అనుమానంగా కూడా ఉండేది మొదట్లో.. ఆ సందల్‌ ముక్కను రాకుతుంటే ఆ రాయి మీద ఏమీ కనిపించేది కాదు! అంతా రాయి పీల్చుకున్నట్టు అసక్కడ ఏమీ ఉండేది కాదు! కానీ అమ్మీ వదలకుండా సందల్‌ ముక్కను పట్టుకుని తదేకంగా రాస్తూనే ఉండేది! అమ్మీకి ప్రతిదాని మీద నమ్మకం ఎక్కువ.. అన్నిటి కన్నా తన మీద తనకు కాన్ఫిడెన్స్‌!

+++

నన్ను ఆర్‌కె, ఎకె ప్రభాకర్‌, ముస్లిం స్త్రీల కథల సంకలనం తీసుకువద్దామమ్మా.. నువ్వే చూడాలి మొత్తం అన్నప్పుడు.. నేను మా అమ్మీ గంధం తీస్తున్నప్పుడు ఎదురుగా అపనమ్మకంగా కూర్చున్న పదేళ్ల షాజహానాలా ఫీయ్యాను! అదే అన్నాను కూడా వాళ్లిద్దరితోనూ.. నేను చేయగలనా.. నాకు నేను కూడా ప్రశ్నించుకున్నాను!
నేను కథను సేకరించగలనా.. అసలెవరైనా స్పందిస్తారా? సహకరిస్తారా? నేను అంత పెద్ద బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలనా.. అన్నీ సందేహాలే!

+++
ఆర్‌కె, ఎకె ప్రభాకర్‌ పుస్తకం గురించిన ప్రకటన దగ్గర నుంచీ ప్రతీ విషయం కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎక్కడా ఎవరమూ మొహమాట పడలేదు. ప్రతి విషయం ఉన్నదున్నట్టుగా మాట్లాడాము. కథ ఎంపిక విషయం.. మొత్తం నాకే వదిలేశారు ఒక్క ఈ విషయమే కాదు ఎడిటర్‌గా ఏమేం చేయాలో అవన్నీ నాకు అవగతం చేయించారు! అంటే అంతకు ముందు నేను స్కైతో కలిసి సంపాదకత్వం వహించాను, కానీ మొత్తంగా ఇలా చేయడం మాత్రం నేను చాలా ఎంజాయ్‌ చేశాను.. అంటే వేరే అర్థం కాదు బాధ్యతగా ఫీలయ్యాను! ఈ పుస్తకానికి కూడా సీనియర్‌ సంపాదకుడు స్కై సహాయ సహకారాలు తీసుకున్నాను. కానీ తుది నిర్ణయం నాకే వదిలేసుకున్నాను. అలా నన్ను గైడ్‌ చేశారు ఆర్‌కె, ఎకె.
+++
మొట్ట మొదట ప్రకటన ఇచ్చింతరువాత ‘ఖులా’ కథ అందింది. స్పందన వస్తున్నందుకు సంతోషపడ్డాను! ఇక ఒకటొకటి కథు రావడం మొదయ్యాయి. కానీ ముందే ఆర్‌కె, ఎకె తో చెప్పాను, ‘ఎవరూ స్పందించక పోయినా కేవలం నాలుగు కథలే వచ్చినా.. వేయాల్సిందే సర్‌!’ అని. ‘అలాగేనమ్మా!’ అని ధైర్య పరిచారు ఇద్దరూ! అప్పుడు అంగీకారమైంది నాకు!
ఈ కథల్లో ఆయా ప్రాంత భాషా సౌందర్యం కట్టి పడేస్తుంది. మార్పును కోరుతున్న స్త్రీ లు అడుగడుగునా కనిపిస్తారు. కథలన్ని ఆలోచనలో పడేస్థాయి. కథలలో ఒక ముస్లిం స్త్రీ తనకు జరుగుతున్న అన్యాయాలను కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయాలను ప్రస్తున్నారు రచయిత్రులు. ఆ ప్రశ్న గ్రామాలనుంచి ప్రపంచం వరకు కొనసాగింది. ఆ ప్రశ్నించే హక్కుతో తనకు తాను న్యాయం చేసుకోవడం ముస్లిం స్త్రీ కథలలో మనం గమనిస్తాం.
స్త్రీమూర్తుల గోసకు ప్రతిరూపాలుగా కనపడుతూనే తిరుగుబాటు జెండాను ఎగురవేయడాన్ని మనం కథలలో చూస్తాం! ఇదొక మంచి మార్పు! ‘
హింస ఎక్కువై జీవితాల్ని అర్ధాంతరంగా ముగించుకోకుండా కొత్త ఆలోచనతో కొత్త జీవితాన్ని కోరుకోవడమే ఉత్తమం అనిపిస్తాయి కథలు చదివినప్పుడు!
సర్వం కోల్పోయిన స్త్రీలు కూడా తన ఆత్మవిశ్వాసంతో తిరిగి జీవితాన్ని నిబెట్టుకుని, ఒంటరిగా జీవితాన్ని గెలవొచ్చు అని భరోసానిస్తాయి ఈ కథలు.
ఈ కథన్నీ పెద్దపెద్ద పేరున్న రచయిత్రు రాసినవి కావు! క్పానికాు కాదు.. సగటు ముస్లిం స్త్రీల జీవితాలకు ప్రతిబింబాు.. కన్నీళ్లు, ఆనందబాష్పాలు కగలిసిన కొత్త గాథలు ..! వీటిల్లో ఎన్ని తరాల నిస్సహాయ జీవిత సారాంశాలు ఇమిడి ఉన్నాయో తెలియదు! పైకి మనకు ఒక్క జీవితంలా ఒక్క కథలా కనపడుతున్నాయి కానీ ఇవి ఎందరెందరి జీవితాలో..! ఒక్కొక్క కథా చదువుతుంటే ఎందరెందరో మన కళ్ళముందు కదులుతుంటారు.. అదే ఈ కథల్లోని ప్రత్యేకత! కథలు చదువుతున్నప్పుడు
అప్రయత్నంగా చాలామంది తమ జీవితాలను ఆ కథలలోని పాత్రల వలె గుండెకు దగ్గరగా లాక్కుని అలాయిబలాయి తీసుకుంటారు. నిజం కాని కలను జీవితాంతం మోస్తూంటారు స్త్రీలు! పెళ్లయినా తమలో తాజాగా వాడిపోకుండా ఉన్న డిజైర్‌ లను నెరవేర్చుకునే ఆనంద సమయాల్ని మనం కూడా ఆస్వాదిస్తాం..!
ఎవరెవరి ఎంతమంది జీవితాలనో.. ఎక్కడెక్కడ పడున్న జీవితాలనో పూసగుచ్చుతున్నారు ఈ రచయిత్రులంతా…! ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కోణం!
ఆడపిల్లలను ఇంగ్లీష్‌ మీడియం చదివించడమెందుకు అనుకునే భావనను ఎండగట్టి, అమ్మాయిలకు ఉద్యోగాలెందుకు అనే చాదస్తపు మనస్తత్వాలకు సరైన సమాధానం ఉంది కథలలో! చదువుకోవడమే ధ్యేయంగా ఉండే ముస్లిం ఆడపిల్లల కష్టాలన్నీ ఏకరువు పెట్టిన కథలున్నాయి. స్థిరపడిన తరువాతనే పెళ్లికి స్థానం ఇచ్చిన ఇవాళ్టి అమ్మాయి కథలున్నాయి.
చదువు, ఉద్యోగం.. నేటితరం స్త్రీల కు ఎంత ముఖ్యమో ఈ కథలు చదువుతుంటే మనకు మరింతగా అర్థం అవుతుంది!
వైకమ్‌ మహమ్మద్‌ బషీర్‌ను గుర్తు చేసే కథలుబంధాను పెంచే.. బంధాలను కలిపే, బంధాన్ని నిలిపే కథలు ఇవి!
చిన్న కథలే కానీ హృదయాన్ని ద్రవీకరించే కథలు!

స్త్రీమూర్థులు నేర్పిన ప్రేమ పాఠాలు ఇంకా మనుషుల్ని, సమాజాల్ని, దేశాల్ని సైతం మతం, కులం పేరుతో విడగొడ్తున్న నేటి పరిస్థితులకు కావాల్సిన కథలున్నాయి మొహర్ లో.
ఈ రచనలు మంచిని కోరుతున్నవి! పొరుగువారిని ప్రేమించమని, శాంతిగా, ఆనందంగా జీవించమని విశ్వ ప్రకటన చేస్తున్నవి!

చదువు, జీవనాధారం లేని స్త్రీల జీవితాలు ఎలా అర్ధాంతరంగా ముగుస్తాయో చెప్పిన కథలు ఆ కథకు సమాధానమా అనిపించే కథలు, చదువే స్త్రీ భవిష్యత్తు అని నిర్వచించే కథలు .. జీవితాలు కథలుగా కనపడే సంకలనం మొహర్!
స్త్రీలు ఎన్నిసార్లు జీవితంలో ఒంటరి అవుతారు ? ఎన్నిసార్లు తన తన్హాయిలో తామండిపోతారు? ఎందుకు జీవితం వారిని అన్నిసార్లు పరీక్షలకు గురిచేస్తుంది? సమాధానం దొరకని ప్రశ్నులు!
మతంలో ఉన్న అన్ని ఆచారాలు సంప్రదాయాలు సరైనవి కాకపోవచ్చు! కొన్ని సరైనవైనా అవి సరిగా అమలు కాకపోవచ్చు! మాట ఆచారాల దుర్వినియోగం వలన ధ్వధ్వంసమైన జీవితాల గురుంచిన కథలు..!
పడరాని కష్టాలు పడి జీవితం ‘కొలిక్కి వచ్చేసరికి తాము లేకుండా పోవడం! అలాంటి జీవితాలు మన చుట్టూ ఎన్నో.. మనం చూసి కూడా చూడనట్టు వెళ్లిపోయే పరదా చాటు జిందగీలు! అలాంటి ఒక బాధామయ ఒంటరి స్త్రీ ల ప్రయాణాల సారాంశాలు ఈ కథలు!
ముస్లింలలో ఉన్న స్థాయి భేదాల వలన కలిగే అవమానాలు, బీదరికం, వారి జీవితం మొత్తం చిత్రించిన కథలు. చాలా రకాలైన అజ్ఞానాల నించి.. అస్థిరమైన ఉనికి నుంచి.. ప్రశ్నించే జ్ఞానం వైపు మరలే కథలు!
భారతదేశ ముస్లింలంతా ఒకటేనని వారిలో మెజారిటీ ముస్లింలు ఇక్కడి మూలవాసులైన ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి ఇస్లాం స్వీకరించినవారేనన్న సృహను తీసుకువస్తున్న సాహిత్యం ముస్లిం వాదం. భారతీయ ముస్లింలను ఎవరు అవమానించినా ఈ నేలను అవమానించడమే కాక తమను తాము అవమానించుకోవడమేనన్న సృహ కూడా అందరిలోనూ పెంచుతున్న సాహిత్యం ముస్లిం వాదం. .
మనసులో చదివిన కథ గుర్తుకు వచ్చినప్పుడల్లా మన హృదయం విషాద రాగాలను వింటుంది! ముస్లిం కమ్యూనిటీలోనే ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది? భిన్నమైన శైలితో సాగిన విభిన్నమైన కథలు!
‘నేటి ముస్లిం జీవితాకు, పరిస్థితికి అద్దం పట్టిన కథలు ! అసలెందుకు ఇలాంటి స్థితి దాపురించింది? ఈ దేశపు మూలవాసులైన ముస్లింలను పౌరసత్వం చూపించమని వత్తిడి ఒకవేపు.. ముస్లిం యువతను ఇబ్బందుల పాలు చేయడం ఒకవేపు.. ప్రతి విషయంలో ముస్లింలను దోషులను చేయడం మామూలైన దేశంలో మనుషుల మధ్య మతాల
మధ్య సౌభ్రాతృత్వం లాపతా అయిన విషయం కన్ఫర్మ్‌ చేస్తున్న కథలు! మనుషుల మధ్య మతం అనే కార్చిచ్చు రగిలిస్తున్న నేటి రాజకీయాల కుటిలత్వాన్ని పట్టిచ్చిస్తున్న కథలు!

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింపై జరుగుతున్న దారుణాలను.. ఎదుర్కొంటున్న సమస్యలను అక్షరీకరిస్తున్న కథలు
సేవ ప్రధాన దృక్పథంగా ఆడవాళ్లు ఏం చేయగలరో, ఎంత చేయగలరో చెప్తున్న కథలు! మనసుంటే చాలా మంచి పనులు ఎలా చేయవచ్చో ప్రయోగాత్మకంగా నిరూపించిన కథలు! స్వచ్ఛందంగా పనిచేస్తున్న వారిని ప్రజు ఎలా రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారో తెలియచేసిన కథలు. ముస్లిం మహిళు రాజకీయాల్లోకి కూడా రావానే సంకేతాన్నిస్తున్న కథలు!
మొదటి నుంచీ భారతదేశంలో ముస్లింలు ఎదుర్కొన్న ఒక అమానుషమైన పరిస్థితి అంతర్మథన రూపంగా విస్తరించుకున్న కథలు.

ముస్లిం స్త్రీలకే కాదు, స్త్రీలందరికీ కష్టాలు అలవాటు చేసిన ప్రపంచమిది. అలాంటి ప్రపంచానికి థప్పడ్‌ వంటి సందేశాన్నిచ్చిన కథలు!
బాధనూ, ఆలోచననూ కలిగిస్తూనే మనల్ని ఊరి నుంచి ప్రపంచం వరకూ నడిపిస్తాయి ఈ కథలు! మధ్యలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలతో పాటుగా,? భూగోళం ఈ కొస నుంచి ఆ కొస వరకూ వెళ్తాం చదువుతూ!
ఈ కథా సంకనలనం ఇలా హఠాత్తుగా మిరాకిల్‌ జరిగి రాలేదు! దీనికి ఒక నేపథ్యం ఉంది! దారులేసిన వాళ్లున్నారు! ఆ ముందు దారే ముస్లింవాద సాహిత్యం! ‘జల్‌జలా’ తో ప్రారంభమైన ముస్లింవాదం ‘వతన్‌’ కథ సంకలనంతో ఒక కొత్త రహదారి వేసింది! భారతదేశంలో ఉన్న దాదాపు 15 నుంచి 20 కోట్ల మంది ముస్లిం మూలాల గురించి ఇవాళ ముస్లింవాదం మాట్లాడుతున్నది. ముస్లిం సాహిత్యకారులకు తమ సమస్యల గురించి తమ కమ్యునిటీ గురించి తామే మాట్లాడుకోవచ్చన్న ఒక సెల్ప్‌ కాన్ఫిడెన్స్‌ను.. అవకాశాన్ని ముస్లింవాద సాహిత్యం కలగజేసింది! వాదం నుంచి
ఉద్యమం దాకా ఆ ప్రస్థానం కొనసాగింది! ఎక్కడా ఆగలేదు. పుట్టుమచ్చ, జల్‌జలా, ఫత్వా, అజా, వతన్‌, ముల్కి, నఖాబ్‌, జగ్‌నేకీ రాత్‌, సరిహద్దురేఖ, వస, అలావా, మైనారిటీ కవిత్వం, ముస్లింవాద తాత్వికత, చమన్‌, బా, జుమ్మా, అధూరె, న్యూబాంబే టైర్స్‌, హర్‌ ఏక్‌మాల్‌, ఏక్‌ కహానీ కె తీన్‌ రంగ్‌, అలాయిబలాయి, బేచారె, ఆపా, జాగో,లద్దాఫ్ని, ఈ కిటికీ తెరుచుకునేది ఊహల్లోకే, టోపీ జబ్బార్‌, బక్రి, ముఖామి, సాహిల్‌ వస్తాడు, జఖ్మీ, కర్బలా, కథా మినార్‌, చోంగా రోటీ వరకూ.. ముందుకెళుతూనే ఉంది ముస్లింవాదం! దీనికి అహర్నిశలు శ్రమపడిన వారి కృషి మరవలేనిది. ముస్లిం సాహిత్యంపైన ఎంతో మంది పిహెచ్‌డీలు, ఎంఫిల్‌ లు చేశారంటే ఆషామాషీ కాదు! ఎన్నో యూనివర్సిటీలు ముస్లిం సాహిత్యాన్ని పాఠ్యాంశాలుగా పెట్టాయంటే ముస్లింవాద ప్రాధాన్యత తెలుస్తుంది. అలాగే జి.లక్ష్మీనరసయ్య, డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కె.బాలగోపాల్‌, డా.అంబటి సురేంద్రరాజు, కె.శ్రీనివాస్‌, ఓల్గా, ప్రొ.ఎండ్లూరి సుధాకర్‌, కాసుల ప్రతాపరెడ్డి, డా.జిలుకర శ్రీనివాస్‌, సంగిశెట్టి శ్రీనివాస్‌ లాంటి ఎందరో మద్దతుగా నిలవడం ముస్లింవాద సాహిత్యాన్ని మరింత బలోపేతం చేసింది.
ముస్లింవాద సాహిత్యంలోనే ముస్లిం స్త్రీ కోణం కూడా మొదటి నుంచీ ఇమిడి ఉంది! స్కైబాబ, ఖాజా వంటి ప్రముఖ ముస్లింవాద కవులే ముస్లిం స్త్రీల వేపు నుంచి బలమైన కవిత్వం రాశారు.. ముస్లిం స్త్రీ కోణానికి ఆనాడే పునాదులు వేశారు! కథల్లో కూడా ముందు వీరిద్దరే ముస్లిం స్త్రీల గురించి రాయడం గమనార్హం! ముస్లింవాద సాహిత్యంగా పేరు పెట్టకముందే పుట్టుమచ్చ (1991) దీర్ఘకవితతో ఖాదర్‌మొహియుద్దీన్‌ ముస్లిం దీర్ఘ కవిత వెలువరించారు. అయితే ఇందులో స్త్రీల కోణం లేదు!
1989లోనే షేక్‌ హుసేన్‌ సత్యాగ్ని పాచికల పేరుతో కథా సంపుటిని తీసుకువచ్చారు! ఆనాడే ఈ సంపుటిలో ముస్లిం స్త్రీల సమస్యల గురించిన కథలున్నాయి. ముస్లిం కవయిత్రులు, రచయిత్రులు రాస్తున్నారు కానీ ప్రత్యేకంగా సంపుటులు రానివారున్నారు.
ఇంత నేపథ్యం ఉంది ఈ కథా సంకలనం రావడం వెనుక!

+++
ముస్లిం స్త్రీలు మాత్రమే రాయగలరు అనిపించే కొన్ని కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. రచయితలు రాసిన కథలకు, రచయిత్రులు రాసిన కథలకు ఉండే భిన్నత్వం ఎరుకలోకి వస్తుంది.
ఎవరితో కలిసి ముందుకెళ్ళాలన్న విషయంలో ఒక స్పష్టత ఉంది ముస్లిం స్త్రీకోణానికి కూడా! కుల , మత పరంగా ఒకే రకమైన దాడులను, దాష్టీకాలను ఎదుర్కొంటున్న వారంతా అంటే బహుజన స్త్రీలు అందరూ కలిసి నడవాల్సిన గమ్యం దాదాపు ఒకటే అని ఇటీవలి ముస్లిం స్త్రీల రచనల్లో కనిపిస్తూనే ఉంది! అయితే ఇట్లా కుల మత పరంగా ఎదుర్కొంటున్న సమస్యలే కాక స్త్రీలుగా ఎదుర్కొంటున్న సమస్యల విషయానికి వస్తే మిగతా అన్ని కమ్యునిటీ స్త్రీలందరితో పాటుగా గొంతెత్తాల్సిన విషయాన్ని కూడా ముస్లిం స్త్రీలు తమ రచనలో పేర్కొంటున్నరు. తెలుగు సాహిత్యంలో ఇప్పటి వరకూ ముస్లిం స్త్రీ రచనలు ఎక్కువగా లేకపోవడం అనే గ్యాప్‌ ఏదైతే ఉందో ఆ ఖాళీ ఈ సంకనలనం పూర్తి చేస్తుందనే నమ్మకం కలుగుతోంది. మున్ముందు చాలా ఎక్కువగా ముస్లిం స్త్రీల సాహిత్యాన్ని చూడగలమని నమ్మకం కూడా ఈ సంకనలనం కలగచేస్తుంది!
+++
నేను అనుకున్న దానికంటే కూడా చాలామంది చాలా ప్రేమగా స్పందించారు! అడిగిన ప్రతి విషయంలోనూ వెంటనే సమాధానాలిచ్చారు! ఎన్నిసార్లు ఫోన్‌లు చేసినా వాట్సాప్‌లో విసిగించినా ఓపికగా విషయాలు చెప్పారు! నలుగురైదురుగుఋ తప్ప వీరిలో ఎవరినీ నేను కలవలేదు, కానీ నాతో వాళ్లంతా ఇంట్లో కుటుంబ సభ్యుల్లా ఆపాల్లా.. బహెన్‌లలా మాట్లాడి నాకు సహకరించిన తీరు ఎన్నటికీ మరిచిపోలేను! వాళ్లందరికీ బహుత్‌ షుక్రియా!
తెలిసిన ప్రతీ ముస్లిం రచయిత్రినీ కవయిత్రినీ అడిగాను తమ రచనలను ఇమ్మని! కొందరు ఇవ్వలేదు! ఇచ్చిన వాటిని ఇక్కడ మీకోసం ఒక్కో పువ్వు వేసి మాలకట్టినట్టు!

+++
ఇంక ఆర్‌కె, ఎకే గురించి ఎంత చెప్పినా తక్కువే! నేనెప్పుడన్నా నిరుత్సాహపడినా వారి మాటలతో ఉత్సాహ పరిచేవారు! ప్రతి విషయం వెనకా పెద్దరికపు సరిదిద్దుళ్లు ఉండేవి! ఇంతటి గౌరవం ఇచ్చినందుకు వారిరువురికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.
+++
ఈ సంకలనం తెలుగు సాహిత్యంలోకి వస్తున్న సందల్‌ ఊరేగింపు! స్త్రీలు మజీదులో నమాజ్‌ చేసుకుంటున్న అద్భుత దృశ్యం! తమ హక్కును తెలుసుకుంటున్న, రాస్తున్న కొత్త తోవ! వానలో వరదలో కూడా పోరాటం చేసిన షాహిన్‌బాగ్‌ స్త్రీల సమూహ పోరాట నిర్వచనం! తెలుగు సాహిత్యంలోకి, ప్రపంచ సాహిత్యంలోకి అడుగేస్తున్న ముస్లిం స్త్రీల ఆలోచనా పరంపర! ఒక వెలుగు దారి! దారివ్వాలి.. కలిసి నడవాలి..!
+++

ఏమీ కనపడని గంధం రాయి మీంచి చివరకు గంధం గిన్నె సగం వరకూ బంగారు రంగులో ఉన్న లేత వెన్నెల వంటి గంధాన్ని నింపేసేది అమ్మీ! నాకప్పుడది ప్రపంచ వింత! వచ్చిన బంధువులందరికీ అమ్మీ గంధం రాసేది! వాళ్లు కూడా తిరిగి అమ్మీకి రాసేవారు! అందరూ అలాయిబలాయి తీసుకునేవారు! అదొక సంరంభం! అదొక ఆనందం!
ఇప్పుడు చూస్తే నా చేతిలోని గంధం గిన్నెలో ‘మొహర్‌’ ఉంది! ఇందులోని పరిమళాలను ఆస్వాదిస్తారో.. పక్కవాళ్లకు పూస్తారో.. ఎవరెవరికి బహుమతిగా ఇస్తారో.. అలాయిబలాయి తీసుకుంటారో.. నాకైతే ఈ సంరంభం ఈ మధ్యలో ఆగేట్టు లేదు!
ఈ ఆనందాన్ని ఇచ్చిన ఈ పుస్తకంలోని రచయిత్రులందరికీ.. పర్‌స్పెక్టివ్స్‌కి.. స్కైకి, ముఖచిత్రం డిజైన్‌ చేసిన రమణజీవి గారికి బహుత్‌ బహుత్‌ షుక్రియా!

*

షాజహానా

1 comment

Leave a Reply to B. Rama Naidu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు