‘మా నాయన బాలయ్య’ రచయిత వై.బి.సత్యనారాయణ (మాదిగ) మహామనీషి ఎస్.ఆర్.శంకరన్ (ఐఎఎస్) (బ్రాహ్మణ) ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లినప్పుడల్లా శంకరన్ చాయి చేసి తీసుకొచ్చి ఇచ్చేవారట. తాగాక చాయి కప్పు సత్యనారాయణ తీస్తానన్నా వారించి తానే తీసుకొని వెళ్లి లోపల పెట్టివచ్చేవారట. ప్రతీసారి ఇలా జరుగుతుంటే ఒకసారి ఉండలేక సత్యనారాయణ అడిగేసారట- ‘మీలాంటి గొప్పవారు నా టీకప్పు తీయడం ఏం బాగాలేదు సర్!’ అని. అందుకు శంకరన్ నవ్వుతూ ‘మా పూర్వీకులు చేసిన పాపాలకు ప్రాయశ్చితం చేసుకుంటున్నానయ్యా!’ అన్నారట.
శంకరన్ దృష్టికోణం నుంచి చూస్తే మన సాహిత్యకారుల్లోని అగ్రవర్ణాల వారు ఎంతగా ప్రయత్నించినా కూడా వారు చేసిన పాపాలకు ప్రాయశ్చితం జరగదు కదా! పైగా వారి తీరు మరింతగా తీవ్రమవుతూ పోతున్నది. అస్తిత్వ ఉద్యమాలు ఊపులో ఉన్నంతకాలం కాస్త తగ్గినట్లు నటించిన వీరు ఈ మధ్యకాలంలో మరింతగా రెచ్చిపోయారు. అందుకు కొన్ని ఉదాహరణలు చూడొచ్చు.
కథా సిరీస్ వారి కథ 2017 ఆవిష్కరణ సభా కరపత్రం చూస్తే అగ్రవర్ణాల అహంకార భీకర దృశ్యం భయం గొలుపుతుంది. నిర్లజ్జగా ఇవాళ వారు మళ్లీ వేదికను పూర్తిగా ఆక్రమించుకున్నారు. వి.చంద్రశేఖరరావు కూడా లేకపోవడంతో ఇక సమాజంలోని మెజారిటీ అణగారిన ప్రజల ప్రాతినిధ్యమైన దళితులు, ముస్లింలు, గిరిజనులే లేకుండా, అరకొర బీసీలతో మొత్తం వేదికను అగ్రవర్ణాలు ఆక్రమించుకున్నారు.
ఈ అగ్రకులాల రచయితలు ఆంధ్రప్రదేశ్
ఇక తెలంగాణ రాకముందు తెలంగాణ రచయితల పట్ల వివక్ష చూపుతూ అన్యాయం చేస్తూ వచ్చారు. ఉద్యమంలో భాగంగా తెలంగాణ రచయితలు ఒకసారి నిలదీస్తే, హైదరాబాద్ సభ జరగనివ్వబోమని కరపత్రమేస్తే జంకిన వారు అప్పటికి ఏవేవో బొంకి తెలంగాణ వచ్చాక తెలంగాణ రచయితలను మొత్తంగానే విస్మరించారు. ‘ప్రాయశ్చితం’ చేసుకునే అవకాశం ఇవాళ వచ్చినా ఆ పనికి వారి మనసు ససేమిరా అనే అంటున్నదని ఈ కరపత్రం చూస్తే తేటతెల్లమవుతున్నది. ఇక అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ (అగ్రవర్ణ) కథ అని వారు సగౌరవంగా పెట్టుకుంటే బాగుంటుంది కదా! ఒక్క తెలంగాణ కథకుడిని చేర్చి మొత్తం తెలుగు కథ అని బొంకడం ఎందుకు? అంటే మళ్లీ తెలంగాణ నుంచి మంచి కథ రావడం లేదని అబద్ధపు ప్రచారం చేయడమే కదా!
ఇదే సందర్భంలో సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్ వేస్తున్న తెలంగాణ కథ సిరీస్‌లోని ‘దావత్’ 2017 సంకలనాన్ని పోల్చి చూసినప్పుడు ఆంధ్రాలో అగ్రవర్ణ, ఎగువ మధ్యతరగతి రచయితలు, తెలంగాణలో అట్టడుగు నుంచి వచ్చిన బహుజన రచయితలు కనిపిస్తున్నారు. వయసులోనూ తేడా కనిపిస్తున్నది. దీనిని బట్టి చాలా విషయాలు మనం విశ్లేషించుకోవచ్చు.
మరో వైచిత్రి ఏమంటే, తెలంగాణ నుంచి కొన్ని పెద్ద తలకాయలంతా, అయితే విప్లవవాదులు కాకుంటే భోళా శంకరులు!
పత్రికల సాహిత్య పేజీలు :
సాహిత్య పేజీల గతం తలుచుకుంటే అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ సాహిత్య పేజీల్లో నెంబర్ వన్‌గా (ముక్కుతూ మూల్గుతూనే) కొనసాగుతున్న ఒకానొక పేజీలో ప్రతివారం ఒక బ్రాహ్మణ రచయిత తప్పక ఉంటారని అనుకోవడం వినిపిస్తూంటూంది. ఈమధ్యకాలంలో విశ్వమానవత్వం ఒలకబోయడం మరింత ఎక్కువైందని కూడా అనుకుంటున్నారు. పైగా ఆంధ్రావారి పేజీగానే అది కొనసాగుతుంటుంది. వెనుకబడ్డ ప్రాంతాల, జాతుల నుంచి బలమైన రచనలు వచ్చినా అచ్చుకు ఒప్పుకోడానికి పేజీ నిర్వాహకులకు ‘మేధావితనం’ అడ్డొస్తుంటోంది కాబోలు. దాంతో ఆ పేజీ వల్ల ఇవాళ బహుజనులైన ఎస్సీ, బీసీ, మైనారిటీలు చైతన్యం పొందేదేమీ లేకుండా పోయిందని బహుజనులు ఆ వ్యాసాలు చదవడమే వదిలేసామంటున్నారు. పైగా భాష విషయంలోనూ పెద్దగా మార్పు లేదు. కోస్తాంధ్రా భాషలోనే సాహిత్య పేజీలు నిర్వహించబడుతున్నాయి.
మొత్తంగా ఆంధ్రా పత్రికల సాహిత్య పేజీలను ఆంధ్రా సాహిత్యంతోనే నింపుతున్నారు. ఆంధ్రా సాహిత్యానికి, తెలంగాణ సాహిత్యానికి ఉన్న తేడా పేజీలు వేరు అయితేనే బయటపడుతుంది. తెలంగాణకు తెలంగాణ సాహిత్య పేజీలు ఉండడమే సరైనది. తమ సాహిత్యం వెనుకబడి ఉందో, ముందుబడి ఉందో తెలంగాణ సాహిత్యకారులే తేల్చుకోడమే మేలు. అలా కాకుంటే పూర్వపు వివక్షే పునరావృతమవుతూ పోతున్నది.
మిగతా పేజీలన్నింటి పరిస్థితీ దాదాపు అంతేగా ఉంది. ఒక పత్రికైతే బలమైన రచనలను వేయడానికి మనస్కరించక తాలు రచనల కోసం వెంపర్లాడుతుంటోందట! పైగా మేనేజ్‌మెంట్ పాలసీ అంటూ ఒక కార్డు ఉండనే ఉంది కదా, మంచి రచనలను వద్దంటూ ఏడవడానికి!
ఒక పత్రిక మాస్ కథల కోసం వెంపర్లాడడం, మరో పత్రిక కథలు వేయడమే బంద్ చేయడం నేటి వైచిత్రి. కథల విషయంలో సాక్షి ఫండే మేలు.
ఈ నేపథ్యంలో నిజమైన దౌర్భాగ్యం ఏమంటే మనకొక నిష్పక్షపాత పత్రిక లేదు.. పేజీ లేదు.. సంకలనకర్తలూ లేరు.. విమర్శకులు కొందరున్నా ఈ విషయాలు రాయరు.
మిగిలిన ఒకే ఒక్క ఆశ సోషల్ మీడియా, వెబ్ పత్రికలూ! అవి చూసే బహుజన జాతులకు వ్యాసాలు, కథలు చదివే ఓపిక లేదు. కామెంట్ రూపంలో మంచో చెడో పంచుకునే ఓపిక అంతకన్నా లేదు.
అవార్డులు :
గతకొంతకాలంగా అవార్డులు ఇస్తున్నవారు, అవి పుచ్చుకుంటున్నవారి తీరు మహ చిత్రంగా ఉంటోంది.. ఇన్నాళ్లు తెలంగాణ వారికి అవమానాలు జరిగాయని ఇంతగా ఉద్యమాలు జరిగినా తెలంగాణ వారు పెట్టిన అవార్డులు సైతం ఆంధ్రా వారికి ఇవ్వడంతో సిన్సియర్ తెలంగాణవాదులు ఆశ్చర్యపోతున్నా
తెలంగాణ ప్రముఖుల పేర అవార్డులు ప్రభుత్వం తప్ప ఆయా వ్యక్తుల తాలూకు వారో, స్వతంత్ర సంస్థల వారో ఇచ్చే అవకాశం లేకపోవడమూ ఒక దౌర్భాగ్యమే! (కాళోజీ ఫౌండేషన్ అవార్డు ఇందుకు మినహాయింపు.)
ఇట్లా తెలుగు సాహిత్యపు పరిస్థితి దిగజారిపోయిందని బహిరంగంగానే అనుకుంటున్నారు. విభజన తరువాత ఈ పరిస్థితి మరింతగా హీనస్థితికి పడిపోతోందని వినిపిస్తున్నది. విభజన తరువాత అటూ ఇటూ కూడా భజన సాహిత్యం, భజన సంస్థలూ పెరిగిపోయాయి. ఈ దౌర్భాగ్య స్థితిని సాధికారికంగా అడిగేవారు లేరు, అడగగలిగిన అగ్రవర్ణాల వారు తమ వారే ఈ స్థితికి కారణమని చెప్పలేక మిన్నకుండిపోతున్నారేమో! అడగగలిగిన బహుజన రచయితలేమో ఇతర ఉద్యమాల ప్రవాహంలో కొట్టుకుపోతూ వీటికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
ఏతావాతా తేలేదేమంటే సంకలనకర్తలు, సాహిత్య పేజీలు నడిపేవారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న చందంగా తమ ఇష్టాలు మొత్తంగా సాహిత్యం మీద రుద్దుతున్నారు. వెనుకబడేయబడిన జాతులకు మేలు చేసే యోచన వారికి ఏమాత్రం లేదు. తద్వారా చరిత్రలో వారు తెలుగు సాహిత్యానికి ఎనలేని చెడుపు చేసినవారుగా మిగిలిపోనున్నారు.
ఈ నాలుగు మాటలతో మాత్రమే పిల్లిమెడ గంట కడుతున్నాను. ఇక మిగతా పని బాధ్యతగా ఫీలయ్యే వారెవరైనా ఉంటే వారే కానివ్వాలి! ఆ ‘కొందరు’ అప్పుడూ ఇప్పుడూ తెలుగు సాహిత్యానికి చేస్తున్న చెరుపును ఎత్తిచూపకపోతే భవిష్యత్ సాహిత్యం నిరాశాజనకంగా తయారయ్యే అవకాశముంది.
ఈ వరుసలో ఇంకా మిగతావారు కూడా కళ్ళు తెరిచి జర చుట్టుపక్కల చూసుకుంటూ పాలు తాగుతారని ఆశిద్దాం.. ఉర్దూలో ఒక సామెత ఉంది: ‘‘అఖల్‌మంద్ కో హిషారా కాఫీ!’’ అని. అర్థం చేసుకోరూ !
*
|
కథ ఎవరు రాసినా వస్తువు, కథనం, భాష, శైలి – వీటిని మాత్రమే దృష్టిలో
పెట్టుకోవాలనీ, కుల, ప్రాంతీయ కోటాల జోలికి పోవద్దనీ ఆయనతో ఉన్న
చనువు కొద్దీ కథ నవీన్ గారికి చెప్తుండేవాళ్ళలో నేనొకణ్ణి. దూరంగా ఉండి
చెప్పడం సులభమే. ఆచరించడం అంత సులభం కాకపోవచ్చు.
అయినా వీలయినంతలో ఇక ముందుకూడా, ఒత్తిళ్ళకు లోనుకాకుండా,
నవీన్ గారు కథలను మాత్రమే ఎంపిక చేస్తారనీ, కులాలనూ,
ప్రాంతాలనూ పట్టించుకోరనీ ఆశిస్తాను.
ఎల్లలు లేని ప్రపంచానికి సంబందించిన సాహిత్యం, సాహితీ స్రుజనకారులు, స్పూర్తి ప్రదాతలు ఉంటారు. జాతి, మత, కుల, ప్రాంతీయ సంకుచిత పరిమితులను కాలరాస్తూ వాళ్లను వెతుక్కుంటారు తరతరాల పాఠకులు ( తేనలూరు తెనుగు భాష తెలిసిన వాళ్లూ, భాష అడ్డును దాటిన వారూ – – – ఆ బాస నా తెలంగాణా బిడ్డల నోట వింటుంటే నోరెళ్ల బెడతా ).
వాళ్లు మహాభాగవతాన్ని ఆంధ్రీకరించిన బమ్మెర గ్రామ పోతనామాత్యుడు కావచ్చు, సుమతీ శతక కర్త బద్దెన కావచ్చు, తెలంగాణలో కవులే లేరని హేళన చేయగా “గోల్కొండకవుల చరిత్ర”తో నోరుమూయించిన సురవరం ప్రతాపరెడ్డి కావచ్చు; ప్రముఖ కవి, విమోచనోద్యమకారుడు దాశరథి రంగాచార్యులు కావచ్చు, కాళోజి కావచ్చు; జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి కావచ్చు – – – విప్లవకవి గద్దర్, ప్రముఖ రచయిత జ్వాలాముఖి, విమోచనొద్యమకారుడు మగ్దూం మొహియుద్దీన్, కౌముది కావచ్చు, విరసం వరవరరావు కావచ్చు – – – తెలంగాణ రైతాంగపోరాటయోధుడు రావి నారాయణరెడ్డి, సుందరయ్య అన్న కావచ్చు;
అంతెందుకు విశాఖ పాలమూరు ఇరుప్రాంతాల మాండలీకంలో సవ్యచాచి, వలసపక్షుల ఘోష వినిపించిన మా గొరుసన్న కావచ్చు.
వారి కొరకే ఉదయిస్తారు సూర్య, చంద్రులూ.
స్థలాభావంతో, అశక్తఅభావంతో పేరు పేరునా పేర్కొనని మహానుభావులు ఎందరో అందరికీ వొందనాలు