మన ‘ఇల్లు’ను మనమే చక్కబెట్టుకోవాలి

భవిష్యత్ ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమైన ఈ కథ ఇప్పటి సందర్భంలో ఎన్నో పాఠాలను మనకు చెప్తూ ముగుస్తుంది.

ర్గ దృక్పథం ఉన్న కథకుడిగా, తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులను కథీకరించిన రచయితగా పేరున్న తుమ్మేటి రఘోత్తమ రెడ్డి నిజానికి తెలుగు కథా సాహిత్యంలోనే ఒక సంచలన రచయిత. 1981లో ‘ధిక్కారం’ కథతో మొదలు పెట్టి సుమారు 23 కథల్ని రాశారు. తుమ్మేటి రాసిన ‘పనిపిల్ల’, ‘సెజ్’ కథల మీద జరిగినంత చర్చ బహుశా తెలుగులో మరే కథల మీద జరగలేదేమో! ‘చావువిందు’, ‘జాడ’, ‘నా పాత స్నేహితుడు’లాంటి అనేక మూల మలుపుల్లాంటి కథలేగాక ‘నల్ల వజ్రం’ అనే నవలికను రాసిన తుమ్మేటి చాలా కాలం క్రితమే కథలు రాయడం మానేసి ఇటీవల మిద్దె తోటల్ని పెంచుతూ నగర జీవుల్లో పర్యావరణ స్పృహను పెంచుతూ వస్తున్నారు. కొన్ని కథలు ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. 2009లో ‘ఏడు మౌఖిక కథలు’ పేర DVD ని వెలువరించి ఒక కొత్త సంప్రదాయానికి తెర తీశారు. 2011లో ‘జీవించు-నేర్చుకో-అందించు’ కోట్స్ బుక్ ను అందించారు. తుమ్మేటి రాసిన కథలపైన వచ్చిన విమర్శనంతా ‘ఒక కథకుడు: నూరుగురు విమర్శకులు’ (తుమ్మేటి రఘోత్తమ రెడ్డి కథల చర్చా సర్వస్వం-2013) పేరుతో పుస్తకంగా తీసుకు వచ్చారు. అడపాదడపా టీవీ చర్చల్లో, కథా కార్యశాలల్లో పాల్గొంటూ రేపటి తరం కథకుల్ని తీర్చిదిద్దడంలో నిమగ్నమయ్యారు. వీరు రాసిన మరో వర్గ దృక్పథం ఉన్న కథే ఇల్లు. మొదట ఈ కథ ‘నీడ కోసం’ టైటిల్ తో ‘కార్మిక’ అనే కలం పేరుతో వచ్చింది. ఈ కథ 1991లో భూమిక కథా సంకలనంలో మొదట ప్రచురింపబడింది.

“పొద్దు పొదుపూ.. మెరుపు తీగా.. పొయ్యేటి మేనత్త కూతురా..” అంటూ ఎక్కడి నుంచో ఒక జానపద గీతం వినిపిస్తున్నది. ఆ రాత్రి గుడిసె ముందు మంచంలో వెల్లకిలా పడుకున్న నారాయణ మనసంతా వికలమైంది… సెవన్ యింక్లైన్ కాలనీలో ఒక చిన్న గుడిసెలో కాపురముంటున్న సూరమ్మ, వీరయ్య అనే దంపతుల కొడుకే ఈ నారాయణ. వీరయ్య బొగ్గు గనిలో కోల్ ఫిల్లర్ గా, అతని కొడుకు నారాయణ బదిలీ ఫిల్లర్ (టెంపరరీ కోల్ ఫిల్లర్)గా పని చేస్తున్నారు. నారాయణకు ఈ మధ్యే అదే మురికి పేటలోని సుజాతతో పెళ్ళైంది. పెళ్లై ఆరు నెలలైనా భార్యను కాపురానికి తీసికొచ్చుకోలేక పోతున్నాడు. కారణమేంటంటే ఉన్నది ఒకటే చిన్న గుడిసె. బహిర్భూమికి పోవాలన్నా ఇంటికి దూరంగా ఉన్న పొదల్లోకి పోవాల్సిందే. నారాయణకు తల్లిదండ్రుల మీద కోపం వచ్చింది. అటు పోతూనో, ఇటు పోతూనో భార్యను చూసి ముసిముసి నవ్వులు నవ్వడంతోనే సరిపెట్టుకునే వాడు. ఇంటికి తీసుకొద్దామంటే మరో గది లేదు.

మంచంలో అసహనంగా అటూ ఇటూ కదులుతున్న కొడుకును చూసి “అవ్వ పొద్దుట్నుంచి చెప్తాందట! పోయి పొల్లను తీసుకొచ్చుకోరాదు బిడ్డా!” అన్నాడు వీరయ్య. సర్రున లేచిన నారాయణ వీధి చివర ఉన్న పాన్ షాప్ దగ్గరికి పోయి పాన్ కట్టించుకుంటున్నాడు. ఇంతలో నారాయణ వెనుక ఎవరో నిలబడ్డట్టు అయితే తిరిగి చూశాడు. ఎదురుగా వాళ్ళ నాన్న వీరయ్య. “పొమ్మని అంటేనే గిట్ట ఉరికత్త వేంది బిడ్డా!” అన్నాడు నిమ్మళంగా. “తీసుకొచ్చుకొని ఎవల మంచం కింద పండవెట్టాలె” అన్నాడు పాన్ అందుకుని ఇంటి ముఖం పడుతూ. వీరయ్య ప్రాణం వుస్సురుమన్నది.   “ఛీ ఛీ ఒక్క కొడుకు పెండ్లంట చేస్తే ఓ గుడిసె కట్టియ్యక పోతి” అని విచారపడ్డాడు వీరయ్య. బొగ్గు కంపెనీలో గిన్ని రోజులు పని చేసినా ఒక్క గుడిసె కట్టియ్యకపాయే కంపెనీ అని అనుకున్నాడు. ఇంతలో అక్కడి వచ్చిన లక్ష్మీరాజంతో తన బాధనంతా చెప్పుకొని బాధపడ్డాడు. “పెద్దయ్యా ఇది గుడిసె గుడిసె భాగోతమే! నీ తీరుగ శానామంది చెప్తాండ్రు. ఏదో ఒకటి చెయ్యాలె. రైలు కట్టావల కంపెనీ ఖాళీ జాగ బోలెడున్నది. కొద్దిగా ధైర్యం జేస్తే సూత్తి మనేటాళ్ళకు తలో గుడిసె ఏసుకోవచ్చు” అన్నాడు లక్ష్మిరాజం. గదేదో జెర జెప్పన అయ్యేటట్లు సూడుమని ప్రాధేయపడ్డాడు వీరయ్య.

తెల్లారే సరికి అనుకున్నట్లుగానే రైలు కట్టావల అర కిలోమీటర్ పొడుగూతా సుమారు అయిదు వందల గుడిసెలు వెలిశాయి. నారాయణ కూడా ఒక గుడిసె వేసుకొని భార్య సుజాతను తీసుకొచ్చుకున్నాడు. అక్కడన్నీ కొత్త సంసారాలే. అంతా సంతోషంగా సాగిపోతోంది. కానీ బొగ్గు కంపెనీ మేనేజ్ మెంట్ ఊర్కుంటుందా? ఒకనాటి తెల్లవారు జామున పది లారీలు, వంద మంది సాయుధులైన పోలీసులు, రెండు వందల మంది వాచ్ మెన్లూ, ఇన్స్పెక్టర్లు, అమీను దిగారు. “గుడిసెలు పీకుతారా? పీకించుమంటారా?” అని గద్దించారు. “నీకేమైతందయ్యా.. లావూ.. ఏమో మీ తాత పెరట్ల ఏసుకున్నట్టు మాట్లాడ్తాన్నవ్?” అని ఒకరెనుక ఒకరు గుడిసెల నుంచి బయటకు వచ్చి పోలీసుల ఎదుట నిలబడ్డారు. మాటా మాటా పెరిగింది. పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. జనం పోలీసుల మీద రాళ్ళు విసిరారు. ఉరుకులు.. పరుగులు… అరగంటలో కొంత మందిని అరెస్ట్ చేసి అయిదు వందల గుడిసెలు పీకి లారీల్లో వేసుకొని పోయారు పోలీసులు. ఎప్పటి తీరుగానే ఆ ప్రదేశం వెలవెల బోయింది.

గుడిసెలు కోల్పోయిన కార్మికులకు ఏం చేయాల్నో అర్థం కావడం లేదు. వాళ్ళలో వాళ్ళే తొక్కులాడుకుంటున్నారు. బొగ్గు బాయిల పని బంద్ పెదుదామా? కలెక్టర్ కు ఫిర్యాదు చేద్దామా? కోర్ట్ కు పోదామా? ఇట్లా చాలా ఆలోచిస్తున్నారు. లక్ష్మీరాజం అందర్నీ కూడేసి ఒక ఉపాయం చెప్పాడు. అందరూ తలాడించారు.

“తెల్లవారింది. బొగ్గు బావులు యధాప్రకారం నడుస్తున్నాయి. కంపెనీ కార్యాలయం ముందు సందు లేకుండా కార్మికులు సంసారాలతో దిగిండ్రు. ఆడవాళ్ళు నిమ్మళంగ పొయ్యిలు అంటించుకుంట ముచ్చట్లు బెట్టుకుంటున్రు. గడంచెల్లో కొందరు కార్మికులు నిర్రంధిగ నిద్ర పోతున్నరు. పసి పాపలు ఏడుస్తుంటే ముసలివారు సముదా యిస్తున్నారు. వెనుకగా జి. ఎం. కారు వచ్చి ఆగింది. జి. ఎం. కనుబొమ్మలు ముడేసిండు. ఆయనకు నాలుగు రోజుల క్రితం గుడిసెలు పీకేయించిన సంగతి జ్ఞాపకం వచ్చింది.” క్రమంగా అయన ముఖంలో రంగులు మారుతున్నాయి…

సగటు మనిషికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ ఇప్పటికీ అందని ద్రాక్షే. జీవితాన్ని సర్వస్వం బొగ్గు బాయికి ధార పోసినా చివరాఖరికి కనీసం ఒక గుడిసె కూడా మిగలక పోవడం అత్యంత విషాదం. తెలంగాణ మట్టి పొరల్లో నుండి వెలికి తీసిన బొగ్గు ఎక్కడికో తరలి పోయి ఏ పెట్టుబడిదారీ జీవితాన్నో వెలిగిస్తుంది. కానీ భూ ఉపరితలానికి సుమారు రెండు వందల మీటర్ల లోతులో సహజ వాతావరణానికి భిన్నమైన పరిస్థితుల్లో జీవితాలను ఫణంగా పెట్టి బొగ్గును తవ్వి తీసిన కార్మికునికి మాత్రం చివరికి బూడిద కూడా మిగలదు. ఇట్లా ఎన్నో తరాలు బొగ్గు బావుల్లో కూడుకు పోతున్నాయి. బొగ్గు బాయి ఇరుసులో పడి స్త్రీ, పురుష సంబంధాలు ఎలా చిట్లి పోతున్నాయో రచయిత తుమ్మేటి రఘోత్తమ రెడ్డి హృదయ విదారకంగా వర్ణించాడు ఈ కథలో. నిత్యం చీకటి గుయ్యారంలో తలకు ఒక చిన్న లైట్ పెట్టుకొని పని చేసే బొగ్గుగని కార్మికుల జీవితాల్లో పర్చుకున్న చీకటిని చాలా మంది కథకులు చెప్పినా రఘోత్తం చెప్పే తీరు మనల్ని నిలువెల్లా కదిలిస్తుంది. ఎందుకంటే ఆయన స్వయంగా బొగ్గుగని కార్మికుడు కావడమే. ఆ నొప్పిని పాఠకుని గుండెలోకి బదిలీ చేయడంలో రచయిత నూటికి నూరు పాళ్ళు సఫలీకృతం అయ్యారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో పర్చుకున్న కరువు, పేదరికం, నిరుద్యోగం, వారసత్వంగా వచ్చే భూమి లేని తనం ఇలా ఎన్నో కారణాలు ఇక్కడి యువకులని అనివార్యంగా బొగ్గు బావుల్లోకి తరిమికొడుతున్నాయి. అక్కడ పని గంటల తగ్గింపు కోసం, కనీస ఆరోగ్య సౌకర్యాల కోసం, కనీస వేతనాల కోసం గని కార్మికులు దశాబ్దాలుగా ఎన్నో ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు. అట్లా చేస్తూ వస్తున్న పోరాటాల్లో ఎంతో మంది ప్రాణాలు విడిచారు. ఎంతో మంది కార్మికులపైనా పోలీసు కేసులు మోపబడ్డాయి. రాజ్య హింస, సింగరేణి గనుల యాజమాన్యాల విధ్వంసం అంతా తుమ్మేటి పలు కథల్లో ఆవిష్కరించారు. ‘ఇల్లు’ కథ కూడా యాజమాన్యం కార్మికుల పైన జరిపిన ఒక విధ్వంస కాండకు అక్షర రూపమే. కార్మికులంతా ఏకమై తిరుగుబాటు చేయందే ఏ సమస్యా పరిష్కారం కాదని, రాజ్య, యాజమాన్య గుండెలు బద్దలు కావని కథని ముగించడం తెలంగాణ పోరాట స్వభావానికి ఎత్తిన పతాక.

‘ఇల్లు’ను పొరాడి సాధించుకోవాలనే ఒక సాధారణ వస్తువును తీసుకొని రచయిత ఒక గొప్ప శిల్పంతో రాయడం ఆకట్టుకుంటుంది. నిజానికి శిల్పం వల్లే ఈ కథ గొప్ప కథ కాగలిగింది. ఎత్తుగడ, కథ మధ్యలో కల్పించిన వివిధ సంఘటనలు, సన్నివేశాలు, ముగింపులో సమష్ఠి శక్తితో సమస్యను పరిష్కరించుకోవడం అంతా ఎంతో నేర్పుతో రాసిన కథ. ఇక్కడి జీవితాల్ని రాయడానికి ఇక్కడి భాషనే ఎన్నుకోవడం వల్ల కూడా కథ ఒక వాగులాగా ప్రవహించుకుంటూ ముందుకు సాగిపోతుంది. సందర్భానికి తగ్గ సామెతల్ని వాడడం కథకు మరింత బలాన్ని కలిగించింది. సామూహిక శక్తితో మన ‘ఇల్లు’ను మనం చక్కబెట్టుకోవచ్చుననే ఒక ముందు చూపుతో, భవిష్యత్ ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమైన ఈ కథ ఇప్పటి సందర్భంలో ఎన్నో పాఠాలను మనకు చెప్తూ ముగుస్తుంది. మన కర్తవ్యాన్ని కూడా మౌనంగా బోధిస్తుంది.

ఇక్కడ చదవండి

ఇల్లు

*

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

8 comments

Leave a Reply to Dr. Veldandi Sridhar Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు