చిగురించే కాలం, ఆకురాలే కాలం, ఎంత సహజమో-అంతే
అసహజంగా ఇప్పుడు అన్ని వంకలా ధ్వంస ఋతువే.
వనాల కొప్పులో వానవిల్లు వాడిపోయి ఒకే బూడిదరంగు దిగులు కమ్ముకొంటున్నది
కొండకోనల్లో వాగువంకల్లో తడి తాకిడి కోసం గులకరాళ్ళలో గుబులు అల్లుకుంటున్నది
ఇప్పుడేకదా ఒక భరోసా కావాల్సింది.
మన్నుమిన్ను జారిపోతున్నప్పుడు, వుప్పందించడానికో, నిప్పందించడానికో, మాటల్లోనైనా కదలిక వుండాలికదా, ఈపూట ఇంత తావు దొరికినందుకు, బతికున్న సాక్ష్యమున్నందుకు.
మాటంటే మనిషేగా: ఎదురీదడమె తన తత్వమైనట్టు నీటి వేగానికి పులస రేపటి రూపాల్ని ఎరుకచేస్తోంది. నింగికి వూపిరిపోసేట్టు పులుగు రెక్కలతో గాలి గుండెలు చీల్చుతోంది.
మనుషులం కదా: మాటలం కూడా కదా: చిక్కుముడులేసుకొన్న కాలం, కాలుకాలిన పిల్లిలా, దారితప్పుతున్నప్పుడు, నరాల్లో నెత్తురు బొట్టు వెంట బొట్టు పరుగెత్తినట్టు , బతికున్న దానికి సాక్ష్యంగానైనా ఎదురీదాలిగా, ఎగరాలిగా…. పులసలా, పులుగులా!
“అసహజం” లో అచ్చును సవరించాల్సింది కలలే, కళలే, మనిషే! మనుషులేగా? మనుషులమేగా?
*
Add comment