మనిషి పరిచయం – 6

ఎప్పటికైనా తిరిగి తన మాతృ భారతదేశానికి .. తన స్వస్థలానికి.. తన ఊరుకు వెళ్ళి… ఏదో చేయాలె..

  మనిషికి పరమ సంతోషం కలిగినా , గాఢ దుఃఖం సంభవించినా మనసులో ఒక కలవరంతో కూడిన అలజడి సముద్రంలో తుఫాను వలె రూపుదిద్దుకుంటుంది.

అప్పుడు నిద్ర పట్టదు. అశాంతితో హృదయం ఆటుపోట్లకు గురౌతుంది. ఒక ఘర్షణ.. ఒక విహ్వలత, ఒక భాషకందని అంతః ద్రవీకరణ జరిగి .. మనిషి భౌతికంగా దృశ్యమౌతూనే అదృశ్య స్థితిని అనుభవిస్తాడు.

ముక్త సరిగ్గా ఆ రాత్రి అదే ద్వైదీభావ సంఘర్షణలో ఉంది. రాత్రి రెండయింది.. ల్యాబ్ లోని ఒక మూలన ఏర్పాటు చేయబడ్ద తన నివాసంలో మెత్తని అతి సౌకర్యవంతమైన పరుపుపై దొర్లుతోందామె. గదినిండా చిక్కని చీకటి. అప్పటిదాకా పాల నురుగు వంటి కాంతిని గదినిండా ప్రసరించే బల్బులను ఆమే కావాలని ఆర్పేసింది.

వెలుగును భరించలేము అప్పుడప్పుడు. చీకటే కావాలి. కంటినిండా నిద్రపోవాలంటే చీకటో, పల్చని ఉండీ లేనట్టున్న కాంతో కావాలి. అలజడితో చివికిపోతున్న క్షణాల్లో చీకటే మంచి తోడుగా ఉంటుంది.

కొలంబియాకు దాదాపు ఏడాదిన్నర క్రితం తమ టీం వచ్చి ప్రభుత్వ అనుమతితో విశిష్టమైన ఈ ప్రయోగశాలను స్థాపిస్తున్నప్పుడు.. తను .. తనే ఈ ప్రతి నిర్మాణాన్నీ స్వయంగా ఉండి కట్టించింది. ఇక్కడి ప్రతి అంగుళం అంగుళం తన కనుసన్నలలోనే నిర్మితమైంది.

ఇప్పుడు .. ఈ భారీ నిర్మాణాల లక్ష్యం ఈ పూట బయటపడ్ద తన దీర్ఘకాల ఫలితాల క్రోడీకరణతో నెరవేరింది. గమ్యాన్ని చేరిన ఈ రోజు మహదానంద దాయకమైంది.

అందుకు ఆనందం.. మనిషి చంద్రునిపై కాలు మోపి మానవజాతిని ఉత్కంఠ భరితంగా చేసినప్పటి పరమానందం. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి.. ఎక్కడో చదువుకుని.. ఎక్కడెక్కడో జీవిత లక్ష్యాలను నిర్ధారణ చేసుకుని .. ఆ దిశలో సమర్థులను గుర్తించుకుని, సంపాదించుకుని, కావాల్సిన మార్గాన్ని నిర్మించుకుని.. పయనించీ పయనించీ.,

అలసట.. శ్రమ.. కృషి.. తపన.. తపస్సు.

ఇప్పుడు జడివానలో తడుస్తున్న చిత్రమైన శూన్యానుభూతి. వన్.. ఓన్లీ వన్.. ఎలోన్ .

ఒంటరి.. ఒంటరి తను.

అటు పుట్టి పెరిగిన నేల .. మాతృ భూమి.. ఆ మట్టితో అనుబంధం. ఆ మట్టి జ్ఞాన సర్వస్వాన్నీ నేర్పించి ప్రయోజకురాలిని చేస్తే .. జ్ఞాన సముపార్జనతో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుని.. ఇక ఎగిరే పక్షి తనై.,

రెండు రెక్కలు.. ఒక అనంతాకాశం.

ఆ రోజు రాత్రి .. బాగా గుర్తు.,

తమ వాంకిడి గ్రామంలో .. రాత్రి భీకరమైన వర్షం .. లోతట్టు ఆదిలాబాద్ ప్రాంతమంతా గత మూడు రోజులుగా ఎడతెగని వర్షాలతో తడిచి ముద్దయి ఉంది. ఆ వర్షంలోనే రెండు రోజుల క్రితం ప్రక్క గూడెం ‘ కొమ్ముల ‘ లో గిరిజన గూడేల ఉద్దరణ కోసం అధ్యయనం చేయడానికి ఐ టి డి ఎ బృందం పోలీసులతో వచ్చినపుడు.. రాములు నాయక్ దళం దాడి చేసి ప్రాజెక్ట్ ఆఫీసర్ను చంపి.. ఇద్దరు పోలీసులను కూడా హత్య చేసి.. అక్కడ ‘ అవినీతి పరులైన ఆఫీసర్లెవరైనా ఇదే గతి పడ్తుంది ‘ అని ఒక రెడ్ లెటర్ ను వదలిపోతే.,

మర్నాటినుండి అడవంతా గడ్డకట్టిన నిశ్శబ్దం ఒక్క వాన చినుకుల శబ్దం తప్పితే. మరునాటి రాత్రి తమ ఇంటిపై ఒక్కసారిగా యాభైమంది స్పెషల్ టాస్క్ పోలీసుల దాడి.. నాయినపై నక్సలైట్ల దళం నాయకుడు రాములు నాయక్ కూ , దళ సభ్యులకూ షెల్టర్ ఇచ్చిన ఆరోపణపై అక్కడే, అప్పుడే .. జొన్నల గుమ్మిలో కిక్కుమనకుండా దాక్కున్న తన సమక్షంలోనే నాయిననూ, అవ్వనూ ఐదారు తూటాలతో కాల్చి చంపుట.. రక్తం మడుగులో గిలగిలా కొట్టుకుని తల్లిదండ్రులిద్దరూ ప్రాణాలు విడుచుట.

పది నిముషాల్లో ఎక్కడివాళ్లక్కడే.. మాయం. మరుగైపోయిన ఇనుప బూట్ల చప్పుడు.

తెల్లారేదాకా .. రక్తపు మడుగునూ.. రెండు శవాలనూ.. గుమ్మిలో దాక్కుని చీకట్లోకి చూస్తూ.. అదొక దుఃఖరాత్రి.

అడవంతా అల్లకల్లోలం.. భీకరమైన గాలింపు. పిట్ట చప్పుడుకూడా కాని విషాద నిశ్శబ్దం. రెండు రోజులూ అదే స్థితి.. తను గుమ్మిలోపలే.. నాయినా, అవ్వ శవాలు అక్కడే అలికిన నేలపై.. చీమలు పడ్తూ.,

అప్పుడొచ్చిండు దళ నాయకుడు.. రాములు నాయక్ ఒక రాత్రి వెంట పది మందితో. రాత్రికి రాత్రి ఇద్దరి శవాలనూ దహనం చేసి.. లాల్ సలాం సమర్పించి.,

” బిడ్దా నువ్వు నా వెంబడి రా. ” అని రెక్క పట్టుకుని రాత్రంతా నడిపించుకుంటూ.. వరంగల్ గిరిజన బాలికల పాఠశాల , వసతి గృహం.. లో చేర్పించి.. మారు వేషంలో రాములు నాయక్ వస్తూ.. పోతూ.. ఆపన్న హస్తం అంటే తెలిసింది అప్పుడే. ఇక అతనే తండ్రి.. అతనే తల్లి, అతనే సర్వస్వమూ ఐ.,

గిరిజన హాస్టల్ లో చేరినప్పుడు తను ఎనిమిదవ తరగతి. తొమ్మిదవ తరగతిలో ఉండగా .. లైబ్రరీలోని ఈనాడు పేపర్ లో వార్త చూచింది తను.. ‘ పోలీసుల ఎదురుకాల్పుల్లో నక్సలైట్ నాయకుడు రాములు నాయక్ మృతి ‘ అని.

ఎవరీ నక్సలైట్లు.. ఎందుకీ పోలీసుల వేట.. నాయిన షెల్టర్ ఇవ్వడమేమిటి.. నాన్నను మరిపించే రాములు నాయక్ ప్రేమ ఏమిటి.?

‘ చదువుకో బిడ్డా.. చదువే నిన్ను నడిపించే అసలైన తల్లీ తండ్రీ ‘ అని పదే పదే ఎన్నోసార్లు చెప్పిన రాములు నాయక్ మాటలు లోపల ధ్వనిస్తూ ధ్వనిస్తూ.,

చదువు.. చదువే జీవితం.. చదువే దారి.. చదువే పరమావధి.

ఎస్ ఎస్ సి.. ఇంటర్.. డిగ్రీ.. ఇక వెదుకులాట.. అన్వేషణ.. చౌరాస్తాలో నిలబడ్డ జీవితం.

మొదటినుండీ ఒంటరి జీవితమే. . తెగిన గాలిపటం తను .. ఇక భయమే లేదు. నిండా మునిగినవాడికి చలి లేదు.

అమ్మా నాన్నా లేనందుకు ఎన్నడూ బాధ పడలేదు తను. వాళ్ళు జన్మనిచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూనే వాళ్ళు లేకపోవడంతో సంక్రమించిన పూర్తి స్వేచ్ఛను సద్వినియోగం ఎలా చేసుకోవాలె.. అన్న దృక్పథంతో.. సరియైన గమ్యాన్ని అన్వేషించుకుంటూ.. ఎక్కడా, ఎన్నడూ దారి తప్పలేదు.

 

బొమ్మలు: మిత్ర

‘ చాలా స్పష్టంగా నీ గమ్యాన్ని నిర్దేశించుకో.. ఇక ఒక్క అడుగుకూడా ప్రక్కకు వేయకుండా ప్రతి అడుగునూ కేవలం గమ్యం దిక్కే వేస్తూ నడువు ‘ అదీ నేర్చుకున్న పాఠం.

విద్యార్థికి ఇంటర్ ఒక కీలకమైన మలుపు.

తన లక్ష్యం .. ‘ నేనొక అసాధారణ వ్యక్తిని కావాలి. అందరికంటే భిన్నమైన లక్ష్యాలను సాధించాలె ‘

ఎట్ల.? ఎట్ల.?

కొన్ని రోజుల అంతర్మథనం. రాత్రింబవళ్ళు.. దివారాత్రాలు..’ ప్రతి సమస్యకూ ఒక పరిష్కారముంటుంది ‘ అని పెద్దల మాట.

పరిష్కారం దొరికింది. అహర్నిశలు తపస్సులా చదువు.. ప్రిపరేషన్.. సిద్ధత.. మనిషి దేనికైనా సంసిద్ధం కావాలి. ‘ ప్రయత్నిస్తే లొంగనిది లేదు.. అందనిది లేదు ‘

ఐ.ఐ.టి ఖాన్ పూర్.. బి.టెక్ బయో టెక్నాలజీ. నాలుగేళ్లు. ముక్త పేరు ఎంత అద్భుతమో అని గర్వం.. రాములు నాయక్ ప్రతి క్షణమూ జ్ఞాపకమొచ్చేవాడు.

అదే ఐ.ఐ.టి లో ఎం.టెక్ బయో టెక్నాలజీ.

చూపు దృష్టిగా మారి.. ఇక విస్తృతమైన అన్వేషణ. క్యాట్ లు.. టోఫెల్ లు.. జి. మ్యాట్ లు.. ఏ పరీక్షైనా .. చదువు చదువు .. రాయి.. అంతే.

‘ కలలు కను.. కలలను సాకారం చేసుకో ‘ అనికదా పెద్దలు చెప్పేది.

అదే చేసింది తను.

ప్రతిష్టాత్మక ‘ మెషాచుట్స్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ లో బయో టెక్నలజీలో సీట్.. డాక్టోరల్ ప్రోగ్రాం .

అదృష్టం.. అంటే కనబడనిది. సృష్టిలో ఉంటుందది.. కాని కనబడదు. దాన్నే పట్టుకోవాలి.. అదే సాధన అంటే.

కష్టపడి శోధించి.. ఒక మహామానవుణ్ణి పట్టుకుంది తను.’ పార్టికిల్ ఫిజిక్స్ ‘ లో 2004 వ సంవత్సరపు నోబెల్ అవార్డ్ గ్రహీత.. ప్రొఫెసర్ ఫ్రాంక్ విల్జెక్.

మనిషి తన గమ్యాన్ని నిర్ణయించుకుని సరిగ్గా అక్కడికి చేర్చగల వాహనాన్ని ఎంచుకుని, పట్టుకుని ఎక్కాలె. అప్పుడే సరియైన గమ్యాన్ని సరియైన సమయంలో చేరగలుగుతాము. సరియైన పనికి సరియైన మనిషిని గుర్తించి పట్టుకోవడం ఒక గొప్ప ‘ మేనేజ్ మెంట్ కళ ‘.

ఫ్రాంక్ విల్జెక్ దగ్గర డాక్టరేట్ విద్యార్థిగా చేరడం ఒక గొప్ప విజయం. నాలుగేళ్ళు.. రాత్రింబవళ్ళు.. ఒకటే పరిశోధన. భౌతిక శాస్త్రంలో అప్పటికి తెలియని ఎన్నో కొత్త కొత్త లోకాలు.

చెప్పాలంటే.. ఇన్నాళ్ళూ తనకు తెలిసిన ప్రపంచమంతా ఒట్టి ఇసుక రేణువనీ.. అప్పటీదాకా తనకు ఏదీ తెలియదని తెలిసింది.

డాక్టరేట్ పూర్తవగానే.. ప్రొఫెసర్ అంగీకారంపై పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రాం . ‘ అంటీ మ్యాటర్ పార్టికిల్ యాక్సిలరేషన్ ‘ .. అంటే ‘ ప్రతి పదార్థ త్వరణ అధ్యయనం ‘ . అది అప్పటికి అత్యంత ఆధునికమైన విషయం. అది అదృశ్య శక్తికి సంబంధించిన ‘ డార్క్ ఫోర్స్ ‘ పరిశోధనల్లో బాగా ఉపకరించే విభాగం.

ఎప్పుడూ జీవావరణమంతా దృశ్య అదృశ్య శక్తులతోనే నిండి.. ఈ జగత్తును సమతుల్యతతో స్థిరపరుస్తోంది. నిశ్చితపరుస్తోంది.

మనిషిలో బాహ్య నైపుణ్యాలైన ఆటలు అద్భుతంగా ఆడగల నిపుణత, పాటలు పాడగలగడం, నాట్యం, సాహిత్యం, వంటి సృజనాత్మక రంగాల్లో జన్మతః సంక్రమించే ప్రతిభాపాటవాలు.. వీటిని దృశ్య శక్తులుగా భావిస్తే, బయటికి భౌతికంగా వ్యక్తంకాని.. చేయాలనుకుంటున్న పనిపట్ల దీక్ష, సంకల్పబలం, లక్ష్యాన్ని చేరుకునేందుకు తపస్సమాన యత్నం.. ఇవన్నీ అదృశ్య శక్తులుగా పరిగణించవచ్చని అనిపించింది ముక్తకు. ఈ విషయంగా తన గైడ్ విల్జెక్ తో జరిపే చర్చలు ఆసక్తికరంగా ఉండేవి. ప్రపంచ విఖ్యాతుడైన ఫ్రాంక్ విల్జెక్ సహకారంతో ఈ విశ్వ అదృశ్య శక్తి ( డార్క్ ఫోర్స్ ) పై ఇటీవల పరిశోధనలు జరుపుతున్న బ్రిటన్ లోని గ్లాస్కో విశ్వవిద్యాలయం, అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయం, ఇటలీ లోని సాపియాంజా యూనివర్సిటీ లతో అకడమిక్ ‘ నాలెడ్జ్ షేరింగ్ ‘ ఒప్పందం జరిగి తరచుగా ఈ ప్రాంతాలను సందర్శించేది తను. ఆ క్రమంలో పరిచయమైన వ్యక్తులే ఈ వెనిజులా కు చెందిన ఎం ఐ టి ప్రొఫెసర్ జోస్ లూయిస్ కార్డిరో, ఇంగ్లాండ్ కు చెందిన డేవిడ్ వుడ్ లు.

మనిషి భౌతికంగా భూ ఉపరితలంపై ఉండే ప్రతి చిన్న వస్తులనూ, పదార్థాలనూ చూడవచ్చు, గమనించవచ్చు.. కాని భూ అంతర్భాగంలో నిక్షిప్తమై ఉండే పునాదులనూ, పునాదుల రహస్యాలనూ, వాటి పాత్రనూ గమనించి అర్థం చేసుకోవడం ఒక సంక్లిష్తమైన పని. మనకు పైకి పర్వతం కనబడ్తుంది. కాని దాని పునాది కనబడదు. సముద్రం కనబడ్తుంది కాని దాని అడుగున ఉండే భూమి కనబడదు. భూమిపై 71 శాతం మొత్తం నీరే ఆక్రమించి ఉంది. ఈ కోణంలో ఈ జగత్తునూ, విశ్వాన్నీ పరికించినప్పుడు.. అంతా ఒక సంక్లిష్ట వ్యవస్థగా అర్థమౌతూంటుంది. అప్పటి నాలుగున్నర సంవత్సరాల పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రాం మొత్తం కూడా .. మనసంతా ఈ విశ్వరహస్యాల ధ్యాసే నిండి ఉండేది.

ఇప్పటికి భూ భౌతిక శాస్త్రవేత్తలు నికరంగా నిర్ణయించిన భావనల ప్రకారం ఈ విశ్వమంతా సృష్టి ఆరంభంలోనే ఆవిర్భవించిన నాలుగు ‘ ప్రాథమిక శక్తుల ‘ నియంత్రణలో ఉంది. వీటిని ‘ విశ్వ పరస్పర బలాలు ‘ అని పిలుస్తారు. అవి.. 1) విద్యుదయస్కాంత బలాలు 2) గురుత్వాకర్షణ శక్తులు 3) బలహీన శక్తులు మరియు 4) దృఢతర బలాలు. తర్వాతి కాలంలో వీటితోపాటు మన దృష్టికి రాని మరికొన్ని మౌలిక అజ్ఞాత శక్తులూ విశ్వంలో నిగూఢంగా వ్యాపించి ఉన్నట్టు అర్థమైంది. వాటిలో ఐదవది ఈ ‘ అదృశ్య శక్తి ‘ ( డార్క్ ఫోర్స్ ). ఈ స్థితిలోనే ‘ అదృశ్య పదార్థ ‘ కణ భావన, ‘ ప్రతి పదార్థ ( ఆంటి మ్యాటర్ ) కణ భావన ఉనికిలోకి వస్తోంది.

‘ అదృశ్య పదార్థ కణా ‘ లను కనుక్కోవడం అంత సుళువు కాదు. ఒక నిరంతర సామూహిక కృషివలన ఇటలీలోని సాపియాంజా విశ్వవిద్యాలయ   శాస్త్రజ్ఞులు కనిపెట్టిన ‘ ప్రతిపదార్థ కణ త్వరణ యంత్రం ‘ పాడ్మే ‘ ( పోజిట్రాన్ అన్నిహిలేషన్ ఇంటు డార్క్ మ్యాటర్ ఎక్స్ పరిమెంట్ ) ఉపయోగంలోకొస్తే.. దానిలో ఒక మిల్లీ మీటర్లో పదోవంతు మదం ఉండే వజ్రపు వేఫర్ పొర గుండా ‘ పాజిట్రాన్స్ ‘ గా పిలువబడే ప్రతిపదార్థ కణపుంజాన్ని పంపించినపుడు అది సాధారణంగా ‘ ఫోటాన్లు ‘ గా పిలువబడే రెండు కణాలుగా విడుదలౌతుంది. ఒకవేళ విశ్వంలో ‘ ఐదో శక్తి ‘ గా భావిస్తున్న డార్క్ ఫోర్స్ గనుక ఉన్నట్టయితే విడుదలయ్యే రెండు ఫోటాన్లకు బదులు కేవలం ఒకే ఫోటాన్ విడుదలై, మరో ఫోటాన్ ‘ అదృశ్య ఫోటాన్ ‘ గా మిగిలి ఉంటుంది.ఈ కాల్పనిక కణమే అదృశ్య శక్తిలోని ‘ కాంతి కణం ‘ ఔతుంది. మామూలు కాంతికణం వలె దీనికి ద్రవ్యరాశి ఉండదు. కాని అదే స్థాయిలో ‘ అదృశ్య విద్యుదయస్కాంత శక్తి ‘ ని విడుదల చేస్తుంది.

ఈ ‘ అదృశ్య శక్తి ‘ కణమే.. భారతీయ అతిపురాణ వారసత్వ వైభవోపేత భావనలోని ‘ ఆది శక్తి ‘ కణమా.?

ఆది శక్తి అంటే.. ఫండమెంటల్ ఫోర్సే కదా.

ఈ భావనల్తో సాగుతున్న వ్యవస్థ మొత్తాన్ని విశ్లేషించినపుడు తెలుస్తున్న సంగతి ఏమిటంటే.. ఇప్పటివరకు మనకు కేవలం 4 శాతం విశ్వమే బోధపడింది. 90 శాతం విశ్వం అంతా అదృశ్య శక్తి తాలూకు పదార్థంతోనే కప్పబడి ఉంది. మన దృష్టికి వచ్చిన 10 శాతంలో మిగిలిన 6 శాతం ఇంకా పూర్తి అవగాహనకు రానేలేదు. విశ్వంలో అత్యధిక శాతం మేర ఆక్రమించిన ఈ అసాధారణ అదృశ్య పదార్థమే మహా మిస్టరీగా మిగిలి శాస్త్రవేత్తలను తికమక పెడ్తోంది. అదృశ్య శక్తి ఎప్పటికైనా మొత్తం విశ్వానికే పెను ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందనీ, దీని ప్రభావం గ్రహ తారలు, నక్షత్ర మండలాలపైనా ఉంటుందనీ తేటతెల్లమౌతున్నది. దీనిక్కారణం ఇది విశ్వం పొడుగునా అనంతంగా వ్యాపించి ఉండడం.. అంతరిక్ష స్థల కాలాల్లో దీని సాంద్రత అంతకంతకూ పెరుగుతూ ఉండడం, దీని గురుత్వాకర్షణ చర్య తరచుగా మారుతూండడం.. ఇవన్నీ రానున్న కాలంలో అనేక అద్భుతాలు, అవాంఛనీయ ఉపద్రవాలు సంభవించవచ్చునని సూచిస్తున్నాయి.

ఈ స్థితిలో.. ఎన్నటికీ.. ఎవరికీ పూర్తిగా అర్థంకాని ఈ సృష్టి రహస్యాల చ్ఛేదనలతో కూరుకుపోయి.. మేధోజీవులు .. పాలపుంతలో ఒట్టి రేణువులేనా.

ఇప్పుడిక్కడ.,

మనుష్యులు మాత్రమే ఐన తాము ‘ వృద్ధాప్యాన్నీ, మరణాన్నీ జయించే మనిషిని ‘ సృష్టిస్తున్నాము. చిత్రంగా వుందికదా.

నిద్రేరాని ముక్త నిర్జీవంగా నవ్వుకుంది లోలోపల.

తాను ఎప్పుడు నిద్రపోయిందో ఆమెకు తెలియనే తెలియదు.

చాలా పొద్దెక్కి సూర్య కిరణాలు ఒంటిపైబడి చుర్రుమంటూంటే తెలివొచ్చింది ముక్తకు. బద్దకంగా ఒళ్ళు విరుచుకుని కళ్ళు నులుముకుని .. స్పృహలోకొస్తూ.,

ఎవరో కవి చెప్పినట్టు.,

‘ నిద్ర విలువ నిద్ర రావప్పుడు తెలుస్తుంది

నిద్ర రాని రాత్రంటే.. జారుడుబండపై ముందుకు సాగని నడక

……………………………………………..

ప్రతి రోజూ.. నీకు తెలియకుండానే

నిద్ర ఒక అదృశ్యవరదై నిన్ను ఆవరించకుండా ఉంటే

ఊహించు ఏమౌతుందో

నిద్రరానిది మెలకువ రాదుకదా

మెలకువ లేనిది.. ఒక పునఃప్రారంభమే లేదు.

ప్రారంభం లేనివన్నీ కొత్తవికాని పాతవే

పాతవన్నీ.. నిన్నటివి.. మిగిలిపోయినవి.. గతంగా మారినవి.,

గతం అంటే భవిష్యత్తు కానిదికదా

అంటే.. నిద్ర భవిష్యత్ ప్రదాత అనికదా అర్థమయ్యేది

………………………………………………………

నిద్ర ఒక మహా రహస్యం

మృత్యువువలె భయపెట్టి భయపెట్టి

చివరికి రమ్మని ప్రార్థించినా రాకుండా భయపెట్టేది

రాకుండా చివరికి దీర్ఘనిద్రై వ్యాపించేది

నిద్ర సరళం.. నిద్ర సంక్లిష్టం.. నిద్ర రహస్యం.. నిద్ర మార్మికం.. నిద్రే సత్యం-

డోంట్ డిస్టర్బ్ మోడ్ లో ఉన్న ఫోన్ ను ఆన్ చేసి చూచుకుంది ముక్త హడావిడిగా. పైన కవితలో చెప్పినట్టు నిద్ర మెలకువగా మారి భవిష్యత్తును ప్రసాదిస్తే.. ఇదిగో ఈ హడావిడి, హంగామా.

కార్డిరో నుండి సందేశం మధ్యాహ్నం రెండు గంటలవరకు ల్యాబ్ దగ్గరికి వస్తున్నానని. డేవిడ్ వుడ్ నుండి కూడా అదే సందేశం. ఎలినా మిలోవా నుండి కూడా అదే మెస్సేజ్. బహుశా ముగ్గురూ పరస్పరం సంప్రదించుకుని కలిసి వస్తున్నారేమో. అమెరికా వంటి దేశాల్లో నాగరికులు ఎక్కువ ఫోన్లలో మాట్లాడరు. ఎస్సెమ్మెస్ సదుపాయం ద్వారా టెక్స్ట్ చేస్తారు.

అంతా అర్థమైంది ముక్తకు .. అందరమూ.. అంటే ఫుల్ టీం కలిసి నిన్నటి ఎలిజబెత్ రిపోర్ట్స్ ను సవివరంగా.. లోతుగా.. సమిష్టిగా పరిశీలించి ఇక మున్ముందు చేపట్టవలసిన కర్యక్రమాన్నీ.. ఇప్పుడిస్తున్న ట్రీట్ మెంట్ కు అదనంగా చేర్చవలసిన ఇంగ్రేడియంట్స్ నూ చర్చించి.. తుది రూపమివ్వడమే అని ఊహించిందామె.

వెంటనే అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ కు ఫోన్ చేసి మేనేజర్ రోగర్స్ కు చెప్పింది హై లెవెల్ సమావేశానికి ఏర్పాట్లు చేయమని.

తర్వాత కార్డిరో కు ఫోన్ చేసి సమావేశపు సంక్షిప్త ఎజెండా గురించి మాట్లాడింది.

‘ ఎవ్రీ థింగ్ ఈజ్ డన్ ‘ సంతోషంగా బాత్ రూంలోకి వెళ్ళింది ముక్త.

ఒక అరగంట తర్వాత బయటికొచ్చి ఎందుకైనా మంచిదని బ్రెజిల్ నుంచి ఫార్మసిస్ట్ కం బయోకెమిస్ట్ డాక్టర్ జార్జ్ ట్రయోంకాను కూడా రమ్మంది తమదగ్గరికి మధ్యాహ్నం వరకు.

అప్పుడు.. ఇక రివాల్వింగ్ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటూ.. ఎక్కడికో కొట్టుకుపోతూంటే.,

మనుషులు చాలా సార్లు తమను తాము కోల్పోయి.. భూమిమీద ఎండుటాకుల్లా కొట్టుకు పోతూంటారు చాలా తేలికగా.. పింజలవలె.

ఆమెకు చిన్నప్పటి తమ గోండు గూడెంలోని ‘ దేఢి ‘ దోపిడి పద్ధతి జ్ఞాపకమొచ్చింది.

అప్పుడు తను ఆరవ తరగతిలో ఉంది.

ఆరు నెలల క్రితం నాయినతో తను కూడా పోయింది.. సేఠ్.. షావుకారు అని పిలువబడె.. నర్సింహులు .. నల్లగా.. పరమ వికారంగా.. రోతగా ఉండేటోని దగ్గరికి ఆ రోజు.

అది జూన్ నెల. గూడెంల తిండి గింజలకు చాలా కష్టంగా ఉండే రోజులు. పంటలేవీ ఉండవు. అడవిలోకి వెళ్లినా ఏమీ దొరకదు. చెట్లన్నీ ఎండిపోయి.. ఇక చిగురిస్తూంటాయి కాని కాతకు రావు. ప్రతి గోండు కుటుంబం తప్పక అప్పు చేయక తప్పని పరిస్థితి. చిన్నపిల్లనైన తనకు అప్పుడప్పుడే కాస్త లోకం అర్థమౌతున్న స్థితి.

” గింజలు కావాలె దొరా ” అని నాయిన అభ్యర్థన.

” ఏం గింజల్రా ” అని నిర్లక్ష్య ప్రశ్న.

” తిండికీ.. రేపు పొలాలల్ల ఏయనికి విత్తనం ”

” ఎంత ”

” వంద రూపాల తిండి గింజలు.. యాభై కిరాణ సామాను.. వంద విత్తనం ”

” ఏం బెడ్తానౌ ”

” ఏమున్నది దొరా.. గదే రెండెకరాలు ”

” అరే లింగమూర్తీ.. కాయితం రాయిర ”

” భీములూ.. ఇట్రార ” అని ప్రక్క గదిలోకి పిలుపు లింగమూర్తి నుండి.

వాకిట్లో గంటసేపు చేతిలో కర్రతో కూర్చుని కూర్చుని.. అప్పుడు పిలిచి ఒక చిల్కు ఇచ్చిండు గుమాస్తా లింగమూర్తి .

వాడిచ్చినవే తిండిగింజలు.. కొలిచినవే విత్తనాలు.. కిరాణ సామాను ఎంతిచ్చి ఎంత రాసుకుంటే అంత.

నాయిన భీము వినయంగా వ్రేలి ముద్ర ఒత్తి.,

” నేను చదువుతనే నాయిన దాంట్ల ఏమి రాసిండో ” అని తానంటే ” అబ్బో వద్దు బిడ్డా.. అట్ల చేస్తె ఇగ మనకు ఉప్పుకూడ పుట్టది ఈ ఊళ్ళె. చచ్చిపోతం ”

బిక్కు బిక్కు.. మౌనం.

తర్వాత తెలిసింది రాములు నాయక్ అనుచరుడు మల్లన్న తోని. షావుకారి..’ దేఢి ‘ కింద .. రెండెకరాల భూమి కుదువబెట్టుకుంటడు. మొత్తం రెండు వందల యాభై రూపాయల వస్తువుల కింద వచ్చే పంటకు .. అంటే ఆరు నెలలకే.. ఐదు వందల రూపాయలివ్వాలె .. తమ పొలంల పండిన ధాన్యాన్ని అతనికే అతను చెప్పిన రేటుకే ఇవ్వాలె.. మిగతా పండిన ధాన్యాన్ని కూడా అతనికే అతని రేటుకే అమ్మాలె . నాణ్యత.. కొలతా.. అన్నీ షావుకారు ఇష్టమే.

ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అడిగింది తను..” అసలు గిరిజనులూ, గోండ్లూ , కొండవాసులూ ఉండే ఈ చోటికి వేరే వాళ్ళు ఎప్పుడు, ఎందుకు, ఎట్ల వచ్చిండ్లే నాయిన ” అని.

” ఏమో తెల్వది బిడ్దా.. నా చిన్నప్పటినుండే ఉన్నరు.. దోపిడి చేసెటానికి .. ఆ బూరు మిఠాయోన్ని చూచినౌ గదా .. వాడూ అంతే ”

బూరు మిఠాయోడంటే .. సిద్ధరామయ్య.. కుంటికులాసంగాడు. వాన్ని సిద్ధులు అంటరందరూ .

వాడేం జేస్తడంటే.. చాలా తెలివిగ గూడెంలున్న వయసోళ్లందరు పొలాలల్లకు, అడవిలకు, చెలకలల్లకు పనులకెళ్ళిపోయినంక మెల్లగ దిగుతడు ఊళ్లెకు రెండు మూడు ఖాళీ బొంత సంచులను.. ఒక వేరే సంచిల బూరు మిఠాయి, బొంబాయి మిఠాయి, నిమ్మ చిల్కలు, బిస్కిట్లు, చాక్లెట్లు.. ఇటువంటివి పట్టుకొచ్చి గూడెం నడిబొడ్డు రాల చెట్టుకింద కూర్చుని ఒక గంట కొడ్తడు. అఫ్ఫుడప్పుడు ఒక రేకు బాకా ఊదుతడు.

పిల్లలకు తెలియగానే.. బిలబిలమని అందరూ చుట్టూ చేరి చిరు తిండ్లకోసం ఎగబడ్తరు. సిద్ధులేమో వాటికి బదులు అడవి ఉత్పత్తులను తెమ్మంటడు. అంటె చింతపండు, తేనె, జీడిపండ్లు, ఇప్ప పండ్లు, తునికి పండ్లు, కరక్కాయలు, జీడి పప్పు ఇట్లాంటివి. ఇగ పిల్లలు వాళ్ళ వాళ్ళ ఇండ్లల్లకు ఉరికి ఇండ్లల్ల ఆ యాల్లకు ఉన్న ముసలోల్లు.. తాతనో అమ్మమ్మనో.. ఎవ్వలుంటే వాళ్ళ దగ్గర ఏడ్చో , బెదిరించో, అలిగో ఏది దొరికితే దాన్ని అడుక్కొచ్చుకోని సిద్దులుకిచ్చి వాడిచ్చిన మిఠాయినో , ఇంకేదిస్తే అది.. పట్టుకొని ఉర్కుతరు. చిన్న పిల్లల బలహీనతనూ, చదువు లేని అమాయకత్వాన్నీ ఒట్టి పనికిరాని గిరిజనేతరులు ఈ రకంగా వస్తు దోపిడికి పాల్పడ్తూ.. సాయంకాలానికి తెచ్చిన చేతి సంచెడు సామాన్లకు నాలుగైదు గోతాలనిండ అడవి ఉత్పత్తులను నింపుకుని మళ్ళి ఎవరో ఒక గిరిజన కూలీతోనే మోయించుకుని సాయంకాలపు బస్సులో వెళ్ళిపోతడు.

ఈ తంతును నాలుగవ క్లాసునుండి .. అయ్యనూ, అవ్వనూ నక్సలైట్లు కాల్చి చంపేదాకా.. రాములు నాయక్ తనను వరంగల్లుకు తీసుకొచ్చేదాక గమనిస్తూ, గమనిస్తూ.. దోపిడి.. తెలివి తక్కువ వాణ్ణి తెలివున్నవాడు, బలహీనుణ్ణి బలమున్నవాడు, అమాయకుణ్ణి వ్యూహాత్మకంగా లొంగదీసుకునేవాడు, దక్షిణాఫ్రికా వంటి వెనుకబడ్డ జాతులను బ్రిటన్ వంటి సామ్రాజ్యవాద అగ్రదేశాలు.. దోపిడీ చేసి ఆక్రమించడమే. లేదా తాము స్వంతంగా లాభపడి ఎదుటివాణ్ణి మోసం చేయడమే.

ఇప్పటికీ తన కన్న ఊరు.. మాతృ దేశం.. తల్లి నేల.. స్వజాతి మనుషులు.. అన్న తన మూలాల స్పృహ.. ఇవన్నీ ఉండీ ఉండీ బయటికి చెప్పరాని , చెప్పలేని బాధను కలిగిస్తాయి. ఎప్పటికైనా తిరిగి తన మాతృ భారతదేశానికి .. తన స్వస్థలానికి.. తన ఊరుకు వెళ్ళి…     ఏదో చేయాలె.. స్పష్టంగా తనకే తెలియని ఏదో అక్కడి సహ మూలవాసులకు అందజేయాలె.. ఈ పరుగూ, ఈ ఉరుకులూ, ఈ అత్యంత బాధ్యతాయుతమైన అనేకానేక ప్రయోగాల్లో నిత్యమూ కూరుకుపోయి తలమునకలౌతూ.,

ఉష్ట్రపక్షి బతుకైపోయిందని అనుదినమూ అనుకుంటూనే.,

కొంత విరామాన్నీ, తాత్కాలిక విరమణనీ సంపాదించుకుని.,

ముక్త నిట్టూర్చింది.,

వీలుపడ్తుందా.. ఈ పరిశోధనలూ, కొంగ్రొత్త భావనలతో ఒకదానికొకటి అంతః సంబంధాలతో సాగే శృంఖల చర్యలతో.. ఈ జీవితం.. ఈ పరుగు.. ఈ నిరంతరత.

ముక్త టైం చూచుకుంది.

పదకొండూ నలభై ఐదు నిముషాలు.

ఇంకో మూడు గంటల్లో అందరూ వస్తారు.

కాని.. ఈమె .?

గబ గబా ఏదో తోచినట్టనిపించి బయలుదేరి ఎలిజబెత్ మార్వినో బిల్డింగ్ వైపు నడిచింది.

ప్రతిరోజూ ఉదయమే తొమ్మిదిన్నరకు ఠంచన్ గా కడిగిన ముత్యంలా తయారై .. ఎల్ కె జి పాఠశాలకు వచ్చే చిన్న పిల్లలా నడచి వచ్చే ఎలిజబెత్ ఈ రోజు రాలేదు. వచ్చి చాలా సిన్సియర్ గా అన్ని పరీక్షలనూ ఓపికగా చేయించుకుని.. దాదాపు ఇరవై రెండు పరీక్షలు రోజూ.. అత్యంత కీలకమైనవి.. తాము ప్రయోగిస్తున్న ఔషదం తెచ్చే సూక్ష్మ మార్పులను ప్రస్ఫుట పర్చేవి.

ఐతే.. ఈ రోజెందుకు రాలేదామె. రాకుంటే తప్పక ఫోన్ చేస్తుందికదా. కాని చేయలేదే.?

ముక్త ఐదు నిముషాల్లో చేరుకుంది ఎలిజబెత్ నివాసానికి. ఇల్లంతా నిశ్శబ్దంగా , ఏ అలికిడీ లేకుండా ప్రశాంతంగా ఉంది. బయట వరండాలో చూరుకు వ్రేలాడుతున్న పంజరంలో మార్వినో ఇష్టంగా పెంచుకుంటున్న చిలక కూడా నిశ్శబ్దంగానే ఉంది ఏ చప్పుడూ చేయకుండా. ఎలిజబెత్ ఈ ఔషద ప్రయోగానికి అంగీకరించి వచ్చి చేరిననాడే.. ఆమెకు ఆ క్వార్టర్ ను అప్పజెపుతూ.. ఎప్పుడూ ఆమె తన నివాసం బయటి తలుపులు మూసుకోవద్దనీ, తమ ముగ్గురికీ ఏ సమయంలోనైనా ఆమెను పరిశీలీంచవలసిన అవసరం ఏర్పడుతుందనీ.. అందుకోసం సహకరించమని కోరినప్పుడామె మారు మాట్లాడకుందా ఒప్పుకుంది. వెరీ కోఅపరేటివ్ ఆమె. దాదాపు మూడేండ్లు గడపాలి ఆమె తమతో ఈ జన్యు ప్రయోగంలో. ఆమె ఆశ ఏమిటంటే.. ఈ మూడేళ్ళలో తను ఇరవై ఐదేళ్ల యువతిగా మారి తన స్వంతప్రాంతo సాల్వెడార్ కు వెళ్ళి అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేయాలని.

లోపలికి వెళ్ళి,.. మార్వినో పడక గదిలోపలికి ప్రవేశించి చూస్తే ఆమె తన మంచంపై ప్రశాంతంగా పడుకుని ఉంది వెళ్ళగిలా.. ఎవరో పదిలంగా పడుకోబెట్టినట్టు.

లిప్తకాలం ముక్తకు గుండె ఆగినట్టయి.. మళ్ళీ తేరుకుంది.. లోపల..’ ఈమె చనిపోలేదుగదా ‘ అని సంశయించి.. అలికిడి పెద్దగా కాకుండా దగ్గరికి వెళ్ళి చేతిని ముట్టుకుంది. వెంటనే ముక్కు దగ్గర వ్రేలును ఉంచి చూచింది. శ్వాసిస్తోందామె. ‘ హమ్మయ్య ‘ అనుకుని కుదుటపడి.. మార్వినోను తట్టి లేపే ప్రయత్నం చేస్తూ.,

గమనించింది.. ఆమెలో నిన్నటికీ.. ఈ రోజు ఇప్పటికీ వచ్చిన అనూహ్యమైన శారీరక మార్పును. నిన్నటితో పోలిస్తే ఆమె ఇంకో ఐదేళ్ల వయసు తగ్గి.. శరీరం ఇంకా కాంతివంతమైనట్టు తోస్తోంది. చర్మం ముడుతలు తగ్గుతూ, సౌష్టవతా, సహజ వర్చస్సూ.. అన్నీ వృద్ధిచెంది సానుకూల పరివర్తనలు వేగవంతమౌతున్నట్టనిపించి ముక్త ఆనందంతో పొంగిపోయింది. మార్వినో లోపల తాము ఉపయోగిస్తున్న ఔషదం లాలూకు ప్రభావం తీవ్రంగా పనిచేస్తున్నట్టూ.. దానిక్కారణం నిన్న తనిచ్చిన డ్రగ్ లో కొంత మనిషి శరీరంలోపలే ప్రకృతి సహజంగా ఉండే ‘ సహజ అంతర్గత రోగనిరోధక శక్తి ‘ ని ఉద్దీప్తం చేస్తూ.. జేంస్ పి అల్లిసన్ వంటి శాస్త్రవేత్తలు కనిపెట్టిన.. ఈ మధ్యనే అమెరికాకు చెందిన ప్రాధికార సంస్థ ‘ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ‘ ఎఫ్ డి ఎ అనుమతి పొందిన మందు ఎర్రయ్..ని కూడ కలిపి.. ఇచ్చిన విషయం జ్ఞప్తికొచ్చి.. బహుశా ఈ అతి నిద్ర దాని ప్రభావమేమో అని అనుకుంది.

కార్దిరో రాగానే ఈ అల్లిసన్ తాలూకు ఔషదాన్ని ఉపయోగించినట్టు చెప్పాలి. బ్రెజిల్ ఫార్మసిస్ట్ జార్జ్ ట్రయోంకా కు కూడా.

‘ ఇప్పుడు తనేమి చేయాలి ‘ అని యోచిస్తూ.. ప్రక్కనే ఉన్న స్టూల్ పై కూర్చుంది ముక్త.

‘ మనిషి ఎప్పడూ రెండు రకాల శక్తుల నడుమ సంఘర్షిస్తూ మనుగడను కొనసాగిస్తూ ఉంటాడు.. ఒకటి .. తన చుట్టూ ఉంటూ లభించే బాహ్య శక్తి.. రెండు.. తనలోనే ఉంటూ ఎప్పటికప్పుడు రక్షిస్తూ.. ఉద్దీపిస్తూ.. ప్రచలితమయ్యే అంతర్గత శక్తి. ఈ అంతర్గత శక్తి మన భారతీయ తాత్విక , శక్తి నిత్యత్వ సూత్రాల ప్రకారం .. తపస్సువల్లా, యోగసాధన వల్లా, ఒకరినుండి మరొకరికి ఎనర్జీ అప్ లోడింగ్ వల్లా సంక్రమిస్తుంది. ‘

జేంస్ పి అల్లిసన్ ను తను దాదాపు నాలుగేళ్ళ క్రితం మొట్టమొదటిసారి బర్క్ లీ లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ లో కలిసింది ఒక అంతర్జాతీయ ఇమ్యునిలాజిస్ట్ ల సదస్సులో. అప్పుడు కార్డిరో కూడా ఉన్నాడు. అదే సభలో అమెరికాకు చెందిన ప్రఖ్యాత భవిష్యకారుడు.. ఫ్యూచరాలజిస్ట్ రే కుజ్విల్ ను కూడా కలిసింది తను.

అల్లిసన్ చేస్తున్న ప్రయోగం నిజానికి మానవాళిని దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులైన కేన్సర్, మొండి వ్యాధులైన పార్కిన్ సన్, ఆల్జీమర్స్, పెరోనీ.. ఇవన్నీ ఆ వ్యాధులను కనుక్కొన్న శాస్త్రజ్ఞులూ.. డాక్టర్స్ పేర్ల పైననే ఉన్నవి.. ఇంతవరకు వీటికి శాశ్వత పరిష్కారం లేదు. కాని ఇప్పుడు వాటికి ఈ అంతర్గత రోగనిరోధక శక్తితో చికిత్సలను కనుక్కోవచ్చు. కేన్సర్ నిర్మూలనకు ఇంతవరకు నేరుగా కేన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని పనిచేసే చికిత్స విధానాలనే అమలు చేస్తున్నారు గాని.. ఆ పద్ధతికి భిన్నంగా మానవ శరీరంలోనే గుప్తంగా, సహజంగా దాగిఉన్న రోగనిరోధకశక్తిని ఉపయోగిఉంచి త్వరితంగా కేన్సర్ ను నిరోధించే అల్లిసన్ ప్రతిపాదిస్తున్న ‘ ఇమ్యూనో చెక్ పాయింట్ల ‘ గుర్తింపుతో ‘ ఇమ్యూనోథెరపి ‘ ని ఉపయోగించడం మొన్న మొన్ననే మొదలైంది.

గత ఏదాది తమ ‘ ఇమ్మోర్టాలిటీ ‘ గ్రూప్ హూస్టన్ లో సమావేశమైనప్పుడు.. తనే ‘ ఇమ్యూనోథెరపి ‘ గురించి చర్చిస్తూ మనిషియొక్క ‘ రోగనిరోధక వ్యవస్థలో ఒక బ్రేక్ గా ..అంటే అంతరాయంగా వ్యవహరించే ‘ సి టి ఎల్ ఎ -4 ‘ కణాన్ని గుర్తించి మానవ సహజ రోగనిరోధక శక్తిలో తెల్లకణాల్లంటి టి- సెల్స్ కు ఈ అడ్డుగోడను తొలగించగలిగితే అవి నేరుగా కేన్సర్ ట్యూమర్ల పై దాడిచేసి వాటిని క్రమంగా అంతరింపజేస్తాయి అని చెప్పింది. ఈ ప్రక్రియలో రోగి శరీరంలోని ప్రొటీన్లు ఉపయోగపడ్తాయి.. అని కూడా చెప్పింది. ఇదే సిద్ధాంతాన్ని జేంస్ పి అల్లిసన్ కూడా చెప్పారు.

దీన్ని బట్టి తమ ‘ మనిషి మరణాన్ని జయింపజేసే ‘ బృందం సరియైన దిశలోనే అడుగులు వేస్తోందని ఋజువౌతోంది.

ఎందుకో కాస్సేపు తదేకంగా నిద్రిస్తున్న ఎలిజబెత్ మార్వినో దిక్కు చూస్తూ ఉండిపోయి ప్రక్కనే ఉన్న సొరుగులోనుండి ‘ ఫిట్ బిట్ వన్ ‘ అనే స్లీప్ ట్రాకర్ పరికరాన్ని తీసి ఎలిజబెత్ ఒక చేతివ్రేలుకు క్లిప్ చేసి రెండు నిముషాలసేపు రీడింగ్ చూచింది. అర్థమైందేమిటంటే.. ఎలిజబెత్ ఇంకా గంటన్నరసేపు నిద్రిస్తుంది. ఇప్పుడే బలవంతంగా నిద్ర లేపడం క్షేమకరం కాదు.

ఇక అక్కడినుండి కదుల్తూ.. మేనేజర్ రోగర్ తో మొబైల్ లో మ్నధ్యాహ్నం ‘ కీలక సమావేశానికి కావలసిన ఏర్పాట్లను ‘ పూర్తి చేశాడా అని వాకబు చేసింది.

ఎఫ్ బ్లాక్ లో అన్ని ఏర్పాట్లూ జరిగాయి.

ఎఫ్ బ్లాక్ .. అంటే తురీయ స్థాయి కలయికన్నమాట.

తన చాంబర్ లోకి వచ్చి చక చకా స్నానాదులన్నీ ముగించి.. శుభ్రంగా.. తుడిచిన గాజు బొమ్మలా తయారై.. పర్సనల్ క్యూబికల్ లో.. ఒక్క నిముషం.. రిమోట్ తో ఒక అరను తెరిచి.,

అరలో.. ఒక భారతీయ శక్తి స్వరూపిణి ఐన కాళీమాత పటముంది.. ఎందుకో చిన్ననాటి తమ సంస్కృతి నుండి ఏర్పడ్డ నమ్మకం.. ఈ సకల విశ్వాన్నీ, చరాచర, జీవనిర్జీవ, చల అచల , భౌతిక అభౌతిక, దృశ్య అదృశ్య వ్యవస్థలను నడిపించేదీ, శాసించేదీ, నియంత్రించేదీ ఐన ఒక ఏదో శక్తి ఉందని బలమైన భావన. ఏమిటా శక్తి.. ఏమిటా నిరాకార మూలాధార కేంద్రం. అంతటా వ్యాపించి ఉండేదీ.. ఎక్కడా ఏమీ లేనట్టనిపించేది .. ఉండీ లేనట్టూ.. లేకా ఉన్నట్టు ఉన్నది.. ఏమిటది. ?

ఆ శక్తికి రెండు చేతులూ జోడించి మొక్కింది.. కళ్ళు మూసుకుని.

మృత్యుంజయ మంత్రాన్ని చదివింది.

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్థనం

ఉర్వారు కమివ బంధన మృత్యోర్ముక్షీయ మామృతాత్

ఐ ఐ టి లో ఒక తెలుగు ప్రొఫెసర్ ఉండేవాడు . పేరు లక్ష్మణ్ రావు. మైక్రోబయాలజీ ఆచార్యుడు. పదహారు పి హెచ్ డి లు ఆయనకు.

మొట్టమొదటిరోజే క్లాస్ లకు రాగానే.. అంగీ జేబులోనుండి ఒక చాక్ పీస్ ను బయటికి తీసి అందరివంకా నిశ్శబ్దంగా ఓ ఐదు నిముషాలు తదేకంగా చూచి.. ” నువ్వు లేవమ్మా.. ప్లీజ్ స్టాండ్ ” అని తనను లేపాడు. అడిగాడు ఓ ప్రశ్న. ” వాటీజ్ ద కంపోజిషన్ ఆఫ్ ఏర్ ” అని.

గాలి యొక్క సమ్మేళనంఏమిటి.?. అని.

తను చెప్పింది గడగడా” ఘణపరిమానం రీత్యా, నైట్రోజెన్ 78.084 శాతం, ఆక్సిజన్ 20.946 శాతం , ఆర్గాన్ 0.934 శాతం , కార్బన్ డై ఆక్సైడ్ 0.04 శాతం , నియాన్ 0.001818 శాతం , హీలియం 0.000824 శాతం , మిథేన్ 0. 000179 శాతం ” .

” కదా.. ఎక్కడా..? ఇక్కడ అనుకో.. ఒకవేళ ఎక్కడో న్యూయార్క్ లోనో, బీజింగ్ లోనో, మెల్బోర్న్ లోనో గాలి నమూనాను తీసుకుని ఎనలైజ్ చేస్తే కంపోజిషన్ ఎట్లుంటుంది ” అనడిగాడు ఇంగ్లిష్ లో.

మళ్ళీ తనే చెప్పింది ” సరిగ్గా అంతే ఉంటుంది సార్ ప్రకృతిలో ఎక్కడైనా” అని.

” కదా.. ఎందుకు.?”

అంతా నిశ్శబ్దం.

” ఎందుకంటే.. ఒక నియంత్రించే అదృశ్య వ్యవస్థ ఉంది విశ్వమంతటా. . ఎక్కడుంది అంటే .. ఎక్కడో ఉంది. లేకుంటే.. ఇంత మైక్రోస్కోపిక్ గా ఎవరు సృష్టి అంతటా ఇంత సూక్ష్మ స్థాయిలో ఈ సకల చరాచర సృష్టిని నియంత్రిస్తున్నారు.. అతను లేక ఆమె.. ఒక సూపర్ న్యాచురల్ పవర్.. మే బి ‘ జి ఒ డి ‘ గాడ్.. లేక ‘ డి ఒ జి ‘ డాగ్. డు యు ఫాలో మి ”

మళ్ళీ నిశ్శబ్దం కాస్సేపు.

” లెటజ్ గో టు సెల్ బయాలజీ .. ” అని ఒక అద్భుతమైన ఊహాత్మక విభ్రాంతికర ప్రపంచంలోకి తీసుకుపోయాడు గంటసేపు.

నిజంగా అతనొక మహాద్భుతమైన అధ్యాపకుడు.

మతాలు.. దేవతలు.. పూజలూ , ప్రార్థనలూ.. పాపపుణ్యాల భావన.. స్వర్గ నరకాల ఊహ.. ఆయా దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకానేక పురాణ ఇతిహాస , ధార్మిక , తాత్విక సాహిత్యం.. చింతన .. ఇవన్నీ కేవలం విశ్వాసానికి సంబంధించిన విషయాలే. ఇందిరా గాంధి కల్పక్కం న్యూక్లియర్ పవర్ స్టేషన్ ను ప్రారంభిస్తూ కొబ్బరికాయ కొట్టడం, ఇస్రో చైర్మన్లు పి ఎస్ ఎల్ వి ప్రయోగాలప్పుడు తిరుపతికి వెళ్ళి పూజలు చేసుకుని రావండం.. ఇదంతా హేతువాదానికి సరిపోదు. తర్కానికి ఇవి నిలవవు. మహత్తులూ మహిమలూ.. అన్నీ సైన్స్ కు నిలవని ఘటనలే.

కాని.. వ్చ్.

ఇంకా అరగంట ఉంది అందరూ తమ కిర్క్ లోని పెరీరా ల్యాబ్ కు రావడానికి.

ఎలిజబెత్ యొక్క గత రెండు నెలల సవివరమైన రిపోర్ట్స్ అన్నింటినీ ప్రింట్స్ తీసుకుని రోజువారీ వరుసల్లో పెట్టింది. ఒక్కొక్క రోజు ఇరవై ఎనిమిది రిపోర్ట్స్.

ఎలిజబెత్ చేరిన డే-1 నాటి రిపోర్ట్స్.. ఇప్పుడు.. ఒక ఏడాది నాలుగు నెలల తర్వాత నిన్నటి రిపోర్ట్స్ ను రెండు ‘ ఎండ్ పాయింట్స్ ప్రోగ్రెస్ ‘ సూచించేవిగా అమర్చింది ముక్త. ఆమెకు ప్రతి పనినీ ఒక పద్ధతి ప్రకారం ఖచ్చితత్వంతో చేసే అలవాటుంది.

అప్పుడు చూచింది .. మాగ్నిఫైయర్ తెరపై.

డే-1 నాటి టెలిమీర్లు .. నిన్నటి టెలిమీర్లు. తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది వాటి పొడవుల్లో. టెలిమీర్ అనగానే గత నాలుగేళ్ళకు పైగా రోర్డిరో దగ్గర పరిశోధక విద్యార్థిగా, సహచరురాలిగా చేరినప్పటి రోజు జ్ఞాపకమొచ్చింది ముక్తకు. అప్పటికే పోస్ట్ డాక్టోరేట్ పూర్తి చేసి కృత్తిమ మేధ .. ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ మీద మానవ శరీర సంబంధ పరిశోధనలు చేస్తూ.. అమరత్వ సిద్ధి గురించిన డిజిటల్ ఇమ్మోర్టాలిటీ, టెక్నలజికల్ ఇమ్మోర్టాలిటీ, బయోలాజికల్ ఇమ్మోర్టాలిటీ, ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అంశాలపై అతి సంక్లిష్టమైన అధ్యయనాలు జరుపుతున్న దశలో తారసపడ్ద మహా మేధాని ఎం ఐ టి ప్రొఫెసర్ జాస్ లూయిస్ కార్డిరో. అతనితో డేవిడ్ వుడ్.

అప్పటికే తన దగ్గర మరణానికి మూడు ప్రధాన కారణాలు శాస్త్రీయంగా వ్యవస్థితమై పరిశోధనలో ఉన్నయి. అవి.. ఒకటి, ఏజింగ్.. వృద్ధాప్యం, రెండు, డిసీజెస్.. వ్యాధులు, మూడు, శారీరకమైన ట్రామా.. అంటే అఘాతం. వీటిపై క్రయోనిక్స్ పైన , రిజువెనేషన్ .. పునర్యవ్వన ప్రాప్తతపైన, లంగివిటీ.. దీర్ఘాయువు పైనా.. రివర్స్ ఏజింగ్ పైనా విసృతమైన జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ దిశలో కృషి చేస్తున్న వ్యక్తుల అన్వేషణలో ఉండగా,

మిస్టర్ కార్డిరో.. జన్యువులు, జీన్స్, డి ఎన్ ఎ , క్రోమోజోంస్, టెలిమీర్లు గురించిన అవగాహనను కల్పించి.. ఇక తామందరమూ కలిసి పనిచేస్తే మహాద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని ఒక నిర్ణయానికి వచ్చి.,

ఏజ్ రివర్సింగ్.. అప్పుడే వృద్ధాప్యాన్ని జయించడంకోసం టెలిమీర్లను నియంత్రించాలనే ఒక భావన ఏర్పడింది.

మనిషి క్రోమోజోం లలో క్రాస్ వలె అమరిపోయి ఉండే రెండు పోగుల కొసలకు ఒక్కొక్కదానికి ఒకటి చొప్పున బూట్ల లేసుల కొసలకు ఉండే ప్లాస్టిక్ చుట్టవలె టోపీలు ఉంటై. ఇవి క్రోమోజోంస్ యొక్క కొసలను శిథిలం కాకుండా కాపాడుతుంటై. అసలు ఏ మనిషి ఏమిటి.? స్త్రీ పురుషులెవరైనా వాళ్ల ప్రవర్తనాపరమైన లక్షణాలు ఎట్లా ఉంటై అని నిర్దారించే డి ఎన్ ఎ ఈ క్రోమోజోముల్లోనే ఉంటుంది. క్రోమోజోంలనూ, తద్వారా డి ఎన్ ఎ నూ కాపాడే బాధ్యత క్రోమోజోంస్ కొసలకు టోపీలవలె ఉండి ఒక తోకవంటి భాగాన్ని కలిగిఉండేదే ‘ టెలిమీర్ ‘ . మనిషి జీవితం గడుస్తూ వయసు పెరుగుతూన్నకొద్దీ ఈ టెలిమీర్లు కుంచించుకుపోతూ క్రోమోజోంస్, తద్వారా డి ఎన్ ఎ , తద్వారా జీవకణం పాడై శిథిలమౌతూంటుంది. అదే శరీరంలోకి ఇంకా పొగాకు పొగ, కాలుష్యం, ఆల్కహాల్ వంటి విషపదార్థాలు చేరితే ఈ టెలిమీర్ల శిథిల ప్రక్రియ మరింత వేగవంతమై ముసలితనాన్ని తొందరగా తెస్తుంది.

మనిషి పుట్టుకతో.. బాల్య దశలో ఉన్నప్పటి స్థితిలోని టెలిమీర్లను పరీశీలించి.. వయసు గడుస్తున్నకొద్దీ శారీరక , మానసిక వికాసాలతో పాటు పూర్ణత్వ స్థాయికి చేరి.. అంటే దాదాపు 25 నుండి 30 ఏండ్ల వయసులో ఇక ‘ అగ్రిగేట్ ఐ కన్సాలిడేట్ ‘ ఐన తర్వాత.. అప్పటి క్రోమోజోం.. అప్పటి డి ఎన్ ఎ , అప్పటి టెలిమీర్ లను గనుల ఇక స్థిరీకరించగలుగుతే.. మనిషి యవ్వనం, దృఢత్వం, మనో వికాసం, జ్ఞానస్థితి.. అన్నీ అలాగే ఉండిపోయి.. ఇక ముసలితనమూ, వ్యాధులూ, మరణమూ సంభవించవు. మల్టిపుల్ ఇమ్మోర్టాలిటీ మనిషి హస్తగతమౌతుంది.

ఈ దశలో ఇప్పటికే సాధ్యమైన ఫలితాల ప్రకారం అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులన్నింటికీ చికిత్స లభించి మనుషులు రాబోయే పదేళ్ళలో రోగరహిత ప్రపంచాన్ని సృష్టిస్తారేమో.

చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. ‘ కేన్సర్ కణాలకు చావు లేదు ‘ అనే సంగతి. ఈ విషయం 1951 లో కనుక్కోబడింది. అమెరికా – ఆఫ్రికన్ స్త్రీ ఐన హెన్రిట్టా లాక్స్ మేరిల్యాండ్లో నివసించేది. ఐదుగురు పిల్లలున్న ఆమె తన 31 ఏండ్ల వయసులో ‘ సర్వైకిల్ కేన్సర్ ‘ తో బాల్టిమోర్ లోని జాన్ హప్కిన్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సందర్భంగా డాక్టర్ జార్జ్ అట్టో గ్రే ఆమె అనుమతి లేకుండా బయాప్సీ కొరకని కేన్సర్ ట్యూమర్ నుండి సేకరించిన కణాలను సజీవంగా ఉంచి వాటితో ‘ హెల ‘ సెల్స్ ను సృష్టించాడు. అవి విరివిగా కేన్సర్ నిరోధక పరిశోధనల్లో ఇంకా ఉపయోగించబడ్తున్నాయి. 1951 లో హెన్రిట్టా లాక్స్ మరణించినా ఇప్పటివరకు కూడా మరణించని ఆమె మూల కణాలతో జినస్ సాలిక్ అనే బయోమెడికల్ రీసర్చర్ ‘ పోలియో వాక్సిన్ ‘ ను కనిపెట్టి వ్యాపారం చేశాడు. అందువల్ల లాక్స్ ను ‘ మరణమెరుగని హేల ‘ కణాల దాతయైన స్త్రీ గా ప్రపంచం గుర్తించింది. ఇప్పటికీ ఆమె తాలూకు మూలకణాలు సజీవంగా ఉంటూ ఇంకా ఉపయోగపడ్తూండడం అపూర్వం.

2045 నాటికి ‘ అమరత్వాన్ని ‘ సాధించి స్పెయిన్, లాటిన్ అమెరికాలు ఆ ఫలాలను మానవ జాతికి ఒక అపురూప కానుకగా సమర్పిస్తే.. ఈ భూగోళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఊహాతీతమైన విషయం. మనుషులు పుడుతూనే ఉంటారు కాని మరణించకుండా కొనసాగుతూనే ఉంటే.. మనుషుల్లో పరిఢవిల్లే ఆలోచనలు, ధోరణులు, తత్వాలు, నేరప్రవృత్తులు, విపరీత ప్రవర్తనలు.. ఇవన్నీ స్వయంనిర్మిత అరాచకానికి దారి తీస్తాయా.. అంతిమంగా ఆత్మహననానికి బాటలు వేస్తాయా. పెరుగుట విరుగుట కొరకే అన్న పురాతన ఆర్యోక్తి నిజమౌతుందా. ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ విపరీతంగా పెరిగి అనేక అకృత్యాలను సాధ్యపరుస్తున్నప్పుడే తన జీవిత చరమదశలో స్టీఫెన్ హాకిన్స్ చెప్పినట్టుగా ప్రకృతిని ఎదిరిస్తూ మనిషి చేరుతున్న ఈ అతిమేధో ఉన్నతులు అంతిమంగా ‘ మానవ వినాశనానికే ‘ దారితీస్తుందని చేసిన హెచ్చరిక నిజమౌతుందా.

ముక్తకు ఒక్క క్షణం విపరీతమైన భయమేసింది. చకచకా బోన్సాయి చెట్లూ.. ఈ రోజే పుట్టి రేపే మరణించే అందమైన ‘ ఆరుద్ర పురుగులూ.. ఏ చరిత్రా ఎరుగని వ్యర్థ జీవరాశి.. ఇవన్నీ జ్ఞాపకమొచ్చాయి.

అంతకంటే.. తన పూజ అరలో పదిలంగా దాచుకున్న ‘ భగవద్గీత ‘ లోని సాంఖ్య యోగం లోని ఒక శ్లోకం మదిలో మెదిలింది. దాంట్లో శ్రీకృష్ణుడంటాడు. ‘ సృష్టికి స్వయంసిద్ధమైన కొన్ని ధర్మాలూ, నియమాలూ ఉన్నాయి. ఏ కారణం వల్లగానీ ఆ సహజ, మూల నియమాలకూ, ధర్మానికీ భంగం వాటిల్లినప్పుడు ఈ మానవాళికి దుఃఖం సంభవిస్తుంది ‘ అని.

తాము సృష్టించబోతున్న ‘ అమరత్వ సిద్ధ లోకం ‘ ప్రకృతికి విరుద్ధమైన చర్యేనా. సృష్టి నియమాలను ఉల్లంఘించే విపరీత ప్రయత్నమేనా. దీని ఫలితం ఆత్మవిధ్వంసమేనా.?

‘ వ్చ్.. ఏమో ‘

అప్పటిదాకా ఏదో ట్రాన్స్ లో ఉండిపోయిన ముక్త కలలోనుండి మేల్కొన్నట్టు ఉలిక్కిపడి కుర్చీలోనుండి లేచింది. లేచి తోడు వేసినా సరిగా తోడుకోని పెరుగులా ఉన్న మనసుతో బయటికి వచ్చింది. అప్పటికే ‘ సైలెంట్ మోడ్ ‘ లో ఉన్న తన మొబైల్ ఫోన్ పలికినా వినిపించలేదు.. అందువల్ల కార్దిరో, దేవిడ్ వుడ్, ఎలినా మిలోవా తదితరులున్న హెలికాఫ్టర్ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో దిగుతోంది. ఉలిక్కిపడిందామె.

ఇటు ప్రక్కనుండి ట్రిం గా తయారై ఒక ముప్పై ఏండ్ల యువతిలా అందంగా, హుందాగా తన దిక్కే నడచివస్తూ ఎలిజబెత్ మార్వినో కనిపించింది.

మొత్తం ఆర్గురు మనుషులు.. ఒక్కొక్కరిలో ఒక భిన్న ప్రపంచం. భిన్న దృక్పథాలు. భిన్న గమ్యాలు.

భిన్నత అనేదే సృష్టి రహస్యమా.?

7

మనుషులు ఎప్పడు ఎక్కడ ఎవరు ఎవరికి ఎందుకు తారసపడ్తారో ఎవరికీ తెలియదు.. అనుకుంది సుభద్ర . రాజేశం కలుస్తాడని ఎన్నడూ అనుకోలేదు. కలిసిండు.. దగ్గరయ్యిండు.. హృదయాన్ని ఆక్రమించి దగ్గరై.. ప్రాణంలో ప్రాణమై.. కలిసి రెండేండ్లున్నడో లేదో.. దుబాయ్.. అంతే .. ఎడబాటు.. కాని మానవీయ ఆత్మ సంబంధాలు ఎంత ఉన్నతంగా, ఎంత మధురంగా.. ఎంత గొప్పగా ఉంటాయో తెలిసింది. ఒక్క రాజేశం జ్ఞాపకాలు చాలు బ్రతుకంతా బ్రతకడానికి. అట్లనే మొగిలి దొరికిండు.. తల్లికాని తల్లి ఐ ఎందరో తల్లులకంటే మాతృ మాధుర్యాన్ని చవిచూచింది. ఇరవై ఏండ్లు.. కొండంత ధైర్యం.. కడుపు నిండిపోయేంత ఆనందం. ఆలోచనలూ.. ఆశలూ.. ఆలంబనా అన్నీ తానే ఐ భవిష్యత్తునంతా ఆక్రమించిన వాత్సల్యం.. కొడుకా వాడు.. స్నేహితుడే.. ఎక్కడో కన్నీళ్ళ చాటున మరిచిపోయిన చదువునూ, పుస్తకాన్నీ పునః పరిచయం చేసి జ్ఞానాగ్నిని రగిలించినవాడు. తెలంగాణ ఉద్యమంలో మౌన పాత్రదారై .. అతి సున్నిత హృదయంతో.. గాయపడి.. కుమిలి కుమిలి ఆత్మాహుతి.. మళ్ళీ ఒక నక్షత్రం రాలిపోయింది.

ఒంటరి.. ఒంటరి తాను.. ఏ ఒక్కరుకూడా తోడు లేని .. ఇన్ని కోట్ల మంది మనుషులున్న ఈ దేశంలో.. సమాజంలో అసలు ఎవ్వరి ఆసరా, కనీసం పరిచయం కూడా లేని ఒంటరి.

ఇప్పుడు దేవుడు పంపిన మరో మనిషి.. చెన్నకేశవులు సార్ పరిచయమైండు.

ఆ రోజు హైదరాబాద్ లో .. ‘ తల్లుల కడుపుకోత సభ ‘ లో పరిచయమైండు చెన్నకేశవులు సార్. వేదికపైన తను ఒక ప్రశ్న వేసిందిగదా. ఆ ప్రశ్న చాలా కదిలించింది చెన్నకేశవులు గారిని. స్టేజ్ దిగి కిందికి దిగగానే దగ్గరికొచ్చిండు ముసలాయన. అరవై ఐదు ఏండ్లుంటాయేమో. ఒక రెటైర్డ్ జూనియర్ కాలేజ్ ప్రిన్స్ పాల్ గా పరిచయం చేసుకున్నడు. ” అమ్మా మీకు నా సానుభూతి. ఇరవయ్యేండ్ల , ఇంజనీరింగ్ చదువుతున్న కొడుకును ఈ మహోద్యమంలో కోల్పోయినౌ తల్లీ. ఇప్పుడు మీరు వేసిన.. ఈ ఉద్యమంలో ఆత్మాహుతి చేసుకుంటున్న వాళ్ళందరూ బీదవారూ బడుగు బలహీన వర్గాలవారే ఎందుకు. మిగతా సంపన్న వర్గాల పిల్లలూ, ఏ ఒక్క రాజకీయ నాయకుల పిల్లలూ ఎవ్వరూ ఎందుకు బలిదానాలు చేయలేదు ..అని అడిగిన ప్రశ్న సహేతుకమైంది. అందరూ ఆలోచించదగ్గది బిడ్దా. మీరెక్కడుంటరు.. నేను వరంగల్ ల ఉంట.. ఇది నా విజిటింగ్ కార్డ్. ఎప్పుడన్న ఫోన్ చేయి. నీ తండ్రసోటోణ్ణి..” అని వెళ్ళిపోయిండు. ఆయన చూపులు.. మాట్లాడిన మాట.. చూపిన వాత్సల్యం.. ఎందుకో కలచివేసింది. కార్డ్ ను పదిలంగా దాచుకుని.. మర్నాడు కరీం నగర్ జనగర్జన సభకు వెళ్ళొచ్చి.. కొద్దిగ నిమ్మలపడ్డంక ఒకసారి మనసు కదిలి చెన్నకేశవులు సార్ కు ఫోన్ చేసింది సుభద్ర.

అంటే.. ఒక తండ్రితో మాట్లాడినట్టే అనిపించింది. పావుగంటసేపు మాట్లాడిండు. మర్నాడు తనూ, తన భార్యా.. ఇద్దరూ తమ కారు వేసుకుని జనగాం కు వచ్చిండ్లు. ఊహించలేదు సుభద్ర.

చెన్నకేశవులు సార్ భార్యను పరిచయం చేసిండు.. ” రాజ్యలక్ష్మి ” అని. నిండు ముత్తయిదువు ఆమె.. నుదుటిపై ఎర్రని కుంకుమ బొట్టుతో ముసలి దేవతలా జీవ వర్చస్సుతో ఉంది. ముఖంలో సహజ స్వచ్ఛతతో కూడిన హృదయంవల్ల సంక్రమించే కాంతి ఉందామెలో.

ఒక అరగంటసేపు గడిపిన వాళ్లు.. పనిమీద హైదరాబాద్ వెళ్తూ నీ దగ్గరికొచ్చినమమ్మా.. ఇక్కడ ఒక్కదానివే ఉంటవా అని అడిగి.. అంతా వివరంగా విని..” మాతో పాటు వరంగల్ కు వచ్చి మా ఇంట్లో వెనుక భాగంలో రెండు గదుల ఒక పోర్షన్ ఖాళీగా ఉంది.. అక్కడుండమ్మా.. మేమూ ఇద్దరమే ఉంటం లంకంత ఇంట్లో.. తోడుగా కూడ ఉంటదీమెకు ” అన్నాడు చెన్నకేశవులు గారు.

ఒక కొత్త ప్రతిపాదన. ఆలోచించదగ్గదే అనిపించింది.

ఇక్కడ అణువణువూ మొగిలి జ్ఞాపకాలు అనుక్షణమూ వెంటాడుతున్నాయి.. భరించలేని దుఃఖం తినేస్తున్నది కొద్ది కొద్దిగా.

నిజానికి జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం.

ఎవరెవరో కలిసి.. కొద్దిసేపు ప్రయాణం చేసి.. దిగిపోయి.. ఎవరి దారిలో వాళ్ళెల్లిపోయి .. మళ్ళీ ఎవరో వచ్చి.. అంతా ఒక మిథ్యలా అనిపిస్తూ.,

ఎండమావులు.. మాడ్చే ఎండలు.. చెమటోడ్చుకుంటూ నడవడమే.

ఒకరోజు చాలా అనూహ్యంగా .. ఒక ఆదివారమది.. ఫోన్ చేసింది సుభద్ర రాజ్యలక్ష్మికి. ” అమ్మా, నేను మీ ఇంటికొచ్చి ఉంటానమ్మా.. ఎందుకో నాకు మీలో నా తల్లి కనిపించింది ” అంది ఉద్వేగంగా.

అటువేపు నుండి.. రెండు నిముషాలు నిశ్శబ్దం.. ” అమ్మా.. నాకున్న ఇద్దరు బిడ్దలు.. ఆడ పిల్లలు.. పెద్ద చదువులు చదివి ఎక్కడో విదేశాల్లో ఉన్నారు. నువ్వొస్తే నా బిడ్డే నా ఇంటికొచ్చినట్టు ఆనందపడ్తా.. మేము ఇప్పుడు రామా నీ దగ్గరికి తీసుకొచ్చుకోడానికి ” అంది.

ఎంత పొంగి పోయిందో సుభద్ర. అనుకుంది.. దేవుడు కొడుకును తీసుకుపోయినందుకు ప్రతిగా ‘ అమ్మా నాన్నలనిచ్చిండు ‘ అని.

మర్నాడే వచ్చి ‘ ఇక పోదాంపద ‘ అని తీసుకుపోయారు వరంగల్ కు రాజ్యలక్ష్మి దంపతులు.

ఆ రోజు తేది: 05-11-2011.

కార్లో.. చెన్నకేశవులే కారును డ్రైవ్ చేస్తూ.. మధ్యలో ఘనపూర్ లో ఆగి కాఫీ.. హనుమకొండలో ఆగి అశోకా హోటెల్ లో టిఫిన్స్.. చివరికి కొత్తవాడలో 80 ఫీట్ల రోడ్, గాయత్రి నగర్ లో ఇల్లు. ఇంటి ముందు నలభై ఫీట్ల విశాలమైన వాకిలి.. నాలుగు వందల చదరపు గజాల్లో.. ఇల్లు. మధ్యలో. రెండు బెడ్ రూం లు.. ఒక హాల్.. ఒక విజిటర్స్ రూం.

వెనక్కి వెళ్ళి ఔట్ హౌజ్ లా ఉన్న రెండు గదుల చిన్న ఇల్లును చూచింది సుభద్ర. వాళ్ళిద్దరూ వారించారు దాంట్లో ఉండొద్దని. కాని సుభద్రకు తెలుసు..’ హద్దుల్లో ఉంటేనే ముద్దని ‘.

మనుషుల సాంగత్యాలు ఏర్పడ్డం వేరు. వాటిని గుర్తించి, గౌరవించి .. ఆ విలువలను కాపాడుకుంటూ ప్రవర్తిస్తూండడం వేరు. మానవ సంబంధాలెప్పుడూ ‘ కొత్త ఒక వింతగా.. పాత ఒక రోతగా ‘ ఉంటాయి . వాటిని నిత్య నూతనంగా కాపాడుకుంటూ ‘ తానొవ్వక నొప్పించక మెప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ ‘ రీతిలో జీవిస్తూ పోవడం ఒక కళ.

దాదాపు ఒక నెల రోజులకు పైగానే గడిచింది సుభద్రకు రాజ్యలక్ష్మి, చెన్నకేశవుకు ల సాంగత్యంలో వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా కలిసిపోడానికి . ఈ లోగా వరంగల్ కొత్తవాడ, 80 ఫీట్ల రోడ్ .. ఆటో నగర్, దాని చుట్టు ప్రక్కల ఉన్న నివాస ప్రాంతాలు .. వాసవి కాలనీ, శాంతినగర్, గాయత్రి కాలనీ యొక్క అన్ని రోడ్లు, దేశాయ్ పేట రోడ్, రిలయన్స్ ఫ్రెష్, జాకోటియా భవన్ షాపింగ్ కాంప్లెక్స్ ,, అన్నింటితో పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా కొత్తవాడ నుండి తుమ్మలకుంట ప్రాంతాల్లో ఉన్న పద్మశాలి కుటుంబాలు అనేకం చేనేత పరిశ్రమలోనే మగ్గిపోతూ దీనంగా కాలం గడుపుతూండడం గ్రహించింది. కొన్ని వందల చేనేత మగ్గాలున్నాయిక్కడ. నాల్గయిదు మగ్గాలున్న స్వంత చేనేత కుటుంబాలు కొన్ని.. ఇరవై ముప్పై మగ్గాలు .. బీం టైప్ , గుంటలో కూర్చుని కాళ్ళతో పాకోళ్ళు తొక్కుతూ నేసే తరహా .. రెండు రకాల చేనేత మగ్గాలు.. ఉన్న ‘ మాస్టర్ వీవర్ ‘ తరహా నలభై యాభై మంది కార్మికులు పని చేసే రకం మరికొన్ని.

చిత్రమైన విషయం ఏమిటంటే.. ఇక్కడ పవర్ లూంస్ లేవు. కేవలం చేనేత మగ్గాలే ఉన్నయ్. అందువల్ల మామూలు కేస్ మెట్ లాంటి, చీరలు , పట్టు ఉత్పత్తులు, నాజూకైన వస్త్ర తయారీ లేదు. కేవలం ముతక రకం దుప్పట్లు, జంపుఖానాలు, డోర్ మ్యాట్స్, డర్రీస్ .. ఇవే తయారౌతున్నాయి. స్త్రీలూ, పురుషులూ కలగలిసి నేసే చేనేత కేంద్రాలున్నాయి. సాధారణంగా విద్యార్థుల హాస్టల్స్ కు, ప్రభుత్వ వసతి గృహాలకు సరఫరా చేసే దుప్పట్లు , జంపుఖానలు ఎక్కువగా తయారౌతున్నాయి. ఒక్క దుప్పటి నేస్తే ముప్ఫై రెండు రూపాయల కూలి ఇస్తున్నారు మాస్టర్ వీవర్స్. ఒక వ్యక్తి రోజంతా కష్టపడి ఉదయం పది నుండి సాయంత్రం ఆరు దాకా నేస్తే ఆరునుండి ఏడు దాకా దుప్పట్లు తయారౌతాయి. అంటే దాదాపు రెండు వందల రూపాయలు గిట్టుబాటౌతాయి. అది గృహనిర్మాణ రంగంలో పని చేసే మామూలు ఆడ కూలీ, పారగాడు సంపాదించేదానికన్నా చాలా తక్కువ. కాని ఇది వైట్ కాలర్ జాబ్ కాబట్టి ఈ వృత్తిలోపలే వీళ్ళంతా మగ్గిపోతున్నారు. వీళ్ళంతా అసంఘటిత రంగంలో ఎవరికి వారే యమునా తీరే వలె ఉండడంవల్ల .. ‘ వీళ్ళ బతుకులింతే ‘ అన్న స్థితిలో స్థిరపడి.. అట్లా కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే పనికొచ్చే మనుషులుగా మిగిలిపోయారు. వీళ్ళను ఆధునీకరించి, శిక్షణనిప్పించి, పవర్ లూంస్ ను స్థాపింపజేసి.. ఎవరైనా ఆదుకుంటే కొన్ని వందలమంది బాగుపడ్తారు.కొన్ని కుటుంబాలు వెలుగులోకొస్తాయి. కాని ఎవ్వరు.. ఎవ్వరు వస్తారు వీళ్ళను బాగుచేయడానికి. తనేమైనా చేయగలదా.?

హనుమకొండలోని టి ఆర్ ఎస్ కార్యాలయామికి వెళ్ళింది సుభద్ర ఒకసారి.. అక్కడి బాధ్యులను కలిసింది. ఉద్యమ సందర్భంలో ఎలుగెత్తి తమ గొంతులను వినిపిస్తున్న కవులూ, కథకులూ, సాహిత్య కారులు విరివిగా జరుపుతున్న ఐదారు సాహిత్య సభలకు వెళ్ళింది చెన్నకేశవులు సార్ వెంట .. ఎందరో వక్తలను విన్నది. రాజరాజనరేంధ్రాంధ భాషా నిలయం.. వాగ్దేవి పి.జి కాలేజ్, జడ్ పి హాల్.. తదితర ప్రాంతాలకు.. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి.. టి జె ఎ సి ఆఫీస్ కు వెళ్ళింది. అంతా ఒక మనిషి అస్థిమితంగా తండ్లాడుతున్న సందిగ్ధ స్థితి.. సుభద్రది.

‘ ఇక తను ఉద్యమంలో చురుగ్గా పని చేయడానికి రంగప్రవేశం చేయాలె ‘ అని నిర్ణయించుకుంది.

ఒక రోజు అంది సుభద్ర ” మిమ్మల్ని నాన్న గారూ అని పిలుస్తా.. మిమ్మల్ని అమ్మా అని కూడా.. మీకేమైనా అభ్యంతరమా ” అని.

ఇది ఒక మేనేజ్ మెంట్ సూత్రం. నిజాయితీతో కూడిన ప్రేమ కూడా కావచ్చు. ఎదుటి మనిషిని ప్లీజ్ చేయడం వల్ల నష్టం ఏమీ లేదు.. లాభం ఉంటుందా లేదా అన్నది వేరే విషయం. ‘ మంచి నోరు.. మంచి సంభోదన .. మంచి సభ్యత.. ఇవన్నీ ఎవరికైనా లాభం కలిగించేవే. ‘

ఆ రోజు 10-12-2011.

సుభద్ర ఉదయమే ఏడున్నర ప్రాంతంలో తన రెండు గదుల ఇంట్లోనుండి.. రాజ్యలక్ష్మి వాళ్ళుండే ముందు భాగం ఇంట్లోకి వెళ్ళింది. ఆమె ఉద్దేశ్యం ముందు డ్రాయింగ్ హాల్ లో ఉన్న పెద్ద లైబ్రరీని వివరంగా చూడాలని. తనదగ్గరున్న పుస్తకాలన్నింటినీ చదవడం ఐపోయింది. చెన్నకేశవులు గారినడిగి కొన్ని పుస్తకాలు తెచ్చుకోవాలనీ.. ఇంకా.,

వచ్చి హాల్లోని సోఫాలో కూర్చుంటూంటే రాజ్యలక్ష్మి వచ్చింది పలకరిస్తూ. చెన్నకేశవులు గారు కూడా అప్పటికే అక్కడున్నారు పేపర్ చూస్తూ. కొద్ది సేపు మౌనం తర్వాత.,

” అమ్మా .. జీవితంలో చాలా చాలా కోల్పోయినదానవు.. ప్రస్తుతం నిర్దుష్టమైన ఆలోచనలేవీ లేనిదానవు.. కాబట్టి మనం ఇక కొన్ని ఉపయోగకర నిర్ణయాలు తీసుకోవాలె. తీసుకుందామా ” అన్నారు చెన్నకేశవులు గారు.

” చెప్పండి ” అంది సుభద్ర ముక్తసరిగా.

” కమాన్.. మనం ఉదయం పది గంటలకు యూనివర్సిటీ కి వెళ్తున్నాం. ఒక కొత్త ఆధ్యాయం మొదలౌతుంది ” అని అన్నారు చెన్నకేశవులు.. ” నువ్వు కూడా రావోయ్.. లాంగ్ డ్రైవ్ కు ” అని కూడా అన్నారు రాజ్యలక్ష్మితో.

” సరే.. ఇద్దరమే మిగిలిన తర్వాత ఇట్ల ఎక్కడికి పోయినా ఇద్దరం కలిసి పోవడం అలవాటైపోయింది సుభద్రా.. టీ తెస్తానాగు.. మీరు మాట్లాడుతూ ఉండండి” అని రాజ్యలక్ష్మి కిచెన్ లోపలికి వెళ్ళింది.

” ఈ నెల రోజుల్లో దాదాపు వరంగల్ నగరమంతా పరిచయమైపోయింది. ఇక జీవితంలోకి ప్రవేశించాలె నేను. నాన్న గారూ.. నేనెంత అదృష్టవంతురాలినో.. ఇదిగో ఈ డ్రాయింగ్ రూంలో ఇంత పెద్ద లైబ్రరీ మీది.. ఎన్ని పుస్తకాలో. చూస్తూంటే మతిపోవడంలేదు.. మతి ఉత్తేజాన్ని పొందుతూ నివురును దులుపుకున్న నిప్పులా నిగనిగలాడుతోంది.. నాకైతే ఈ పుస్తకాలన్నింటినీ ఎప్పుడెప్పుడు చదువుదామా అనిపిస్తాంది. ” అని లేచి.. ఎదురుగా ఒక గోడ నిండా ఉన్న గాజు తలుపుల ర్యాక్ లో పద్ధతి ప్రకారం సర్ది ఉన్న వందల పుస్తకాల పేర్లనూ, వివరాలనూ చూడ్డంలో నిమగ్నమైంది సుభద్ర. అప్పుడామె మనసు, చుట్టూ అనేక రకాల మిఠాయిలు పరచి ఉన్న గది మధ్యలో కూర్చుని నోట్లో నీళ్ళూరుతున్న పసివాడి ఆతురతలా ఉండి. టి టి డి వాళ్ళ సంపూర్ణ శ్రీ మదాంధ్ర మహాభారతం.. మొత్తం పదిహేను సంపుటాలు వరుసగా కొలువు తీరి. ఆ ప్రక్కనే సాంప్రదాయ సాహిత్యమంతా.. దేవీ భాగవతం.. సుందరకాండ.. తెలుగు విశ్వ విద్యాలయం వాళ్ళ రెండు సంపుటాల మహా భాగవతం.. వాల్మీకి రామాయణం గోరఖ్ పూర్ ప్రెస్ వాళ్ళది. మను చరిత్ర.. వసు చరిత్ర .. ఐదు రకాల భగవద్గీత గ్రంథాలు వివిధ వ్యాఖ్యానాలతో. అనేక ఇతర పురాణాలు.. పద్దెనిమిది ఉపనిషత్తులు.

ప్రక్క ర్యాక్ లో.. తెలుగు కథా సాహిత్యం .. వాసిరెడ్ది నవీన్, పాపినేని శివశంకర్ 1990 నుండి వెలువరిస్తున్న ఇరవై ఏడు కథా సంపుటాలు.. కథ-90 నుండి కథ-2017 దాకా. ఇతరేతర కథా సంపుటాలు.. మల్లాది రామకృష్ణ శాస్త్రి, శ్రీపాద నుండి ఇప్పటి బి.ఎస్.రాములు, పెద్దింటి అశోక్ కుమార్, రామా చంద్రమౌళి, అంపశయ్య నవీన్ వరకు. ప్రక్క అరలో కవిత్వం. సాంప్రదాయ కవిత్వం.. వచన కవిత్వం.. శ్రీ శ్రీ మహా ప్రస్థానం, ఆరుద్ర త్వమేవాహం, వజ్రాయుధం , కుందుర్తి పుస్తకాలు, దిగంబర కవుల అన్ని సంపుటాలు, ఇప్పటి అత్యాధునిక కవులు సి.నా.రె, శీలా వీర్రాజు, శివారెడ్డి మూడు సమగ్ర కవిత్వ సంపుటాలు. డా. నలిమెల భాస్కర్ తెలంగాణ పదకోశం, వంతెన, రామా చంద్రమౌళి ఒక దేహం..అనేక మరణాలు, అత్యాధునికమైన కవి సంగమం యువకవుల కవిత్వ సంపుటాలు, దాశరధి, ఎన్. గోపి మొత్తం కవిత్వం, నందిని సిఢారెడ్డి అన్ని సంపుటాలు.. అబ్బో ఎన్నో.

సుభద్రకు చాలా ఉద్వేగంగా ఉంది.. ఆ పుస్తకాలన్నింటిని ఎప్పుడెప్పుడు చదువుదామా..అని.

చదువు.. పఠనాభిలాష నిప్పు వంటిది. ఒక్కసారి అంటుకున్నదంటే ఇక వదలదు.. ఆరిపోదు.

ఎందుకో చెన్నకేశవులు లేచి లోపలికి వెళ్ళిన తర్వాత.. ముందు టీ పాయ్ పై ఉన్న దినపత్రికలను చూచింది సుభద్ర. ఒకటి నమస్తే తెలంగాణ, ఒకటి ఆంధ్రజ్యోతి .. ఇంకొకటి ఇంగ్లిష్ పత్రిక ‘ ద హిందు ‘.

కొద్ది రోజుల క్రిందటి పత్రికలున్నాయి టీ పాయ్ మీద. ఆది 07-11-2011 నాటి ‘ నమస్తే తెలంగాణ ‘ పత్రిక. పతాక శీర్షిక.. ‘ ఢిల్లీ లో కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్ష విరమణ ‘. ఒకటి నవంబర్ రోజున ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరశన దీక్ష ప్రారంభించిన బాపూజీ ఈ రోజు తన దీక్షను విరమించారు ఆయన .. ఇంకా ఏదో కథనముంది .,

మరొక యువకుని ఆత్మత్యాగం. వర్థన్నపేట.. పరుశురాం అనే ఆటో డ్రైవర్.. బస్ స్టాండ్ లో అకస్మాత్తుగా ‘ జై తెలంగాణ ‘ నినాదాలతో చేతిలో టి ఆర్ ఎస్ జెండా పట్టుకుని ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని..

ఇక చదువలేక పోయింది మిగతాది. వెనక్కి కుర్చీలో వాలిపోయి కళ్ళు మూసుకుంది సుభద్ర.

” బలిదానాలు వద్దు.. ఆత్మత్యాగాలు వద్దు.. యువకుల ఆత్మహత్యలు ఆగిపోవాలె ” అని అరిచింది ఆమె తనకు తెలియకుండానే.

అనూహ్యంగా వినబడ్డ ఆ అరుపులకు షాకై లోపలి నుండి రాజ్యలక్ష్మీ, చెన్నకేశవులూ పరుగెత్తుకొచ్చారు హాల్ లోకి .

వచ్చి నిశ్శబ్దంగా సుభద్ర ముందు నిలబడ్డారు ఇద్దరూ అవాక్కై.

కళ్ళు మూసుకుని అదో ఆవేశపూరిత లోకంలో ఉన్న సుభద్ర మెలమెల్లగా ఆ స్థితిలోనుండి బయటపడి.. ” సారీ సర్ ” అని లేచి నిలబడింది.

” అర్థం చేసుకోగలమమ్మా మేము.. ప్రతి రోజూ పత్రికలో ఎక్కడో ఒక చోట ఈ ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. నువ్వన్నట్టు ఇవి ఆగాలి. ఉద్యమాన్ని ఇంత ఉధృతంగా , అహింసాయుతంగా నడుపుతూ ప్రపంచాన్నే ఆశ్చర్య పరుస్తున్న కేసీఅర్ .. మడమ తిప్పని పోరాటం చేస్తున్నారు.. బలిదానాలు వద్దని మేధావులు ప్రచారం మొదలుపెట్టాలె ” అన్నాడు చెన్నకేశవులు.

” ఈ రోజు తేది 10 డిసెంబర్ 2011. అంటే కేంద్రం ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పరుస్తున్నామని ప్రకటించి రెండేళ్ళయింది. ఒకసారి సాధికారికంగా హోం మంత్రి ప్రకటించిన తర్వాత మళ్ళీ రాజకీయాల లాబీయింగ్ కు తలవంచి తెలంగాణ ప్రజలను మోసం చేసింది ప్రభుత్వం. వ్యక్తులూ, కొన్ని కుటుంబాలూ, కొన్ని వ్యాపార సంస్థలూ ప్రజలను మోసం చేస్తాయి గాని.. ప్రపంచంలోనే అతి పెద్ద ఒక సార్వభౌమ ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వమే ప్రజల్ని మోసం , దగా చేస్తుందని ఎవరైనా ఊహించగలరా. ఈ రోజు ఎంత మంది ఆత్మహత్యలు చేసుకుంటారో ” అంది.

ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా .. రాజ్యలక్ష్మి చాయ్ తెచ్చి ముగ్గురికీ అందించింది.

ఎవరి ఆలోచనల్లో వారు కూరుకుపోయి.. చాయ్ తాగుతూ.,

అప్పుడు గమనించింది సుభద్ర .. అన్ని పత్రికల్లో అక్కడక్కడ పసుపు రంగు హై లైటర్ ఇంక్ తో మార్క్ చేసి ఉంది.

భారత సైన్యంలో ఒక ఆయుధ సరఫరాదారు నుండి ఇరవై లక్షల రూపాయల నగదును లంచంగా స్వీకరిస్తూ పట్టుబడ్డ ఒక కల్నల్.

తెలుగు దేశం పార్టీ నుండి కాంగ్రెస్ లోకి దూకిన ఎమ్మెల్యే.

ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న యువతీ యువకుని ప్రేమ విఫలమై రైలుకింద పడి ఆత్మహత్య .

ఇండియన్ బ్యాక్ ను బురిడీ కొట్టించి పన్నెండు కోట్లు మోసం చేసిన గుజరాతీ.

బoజారాహిల్స్ లో మాదక ద్రవ్యాలతో పట్టుబడ్డ నైజీరియన్, వెనుక రాష్ట్ర మంత్రి హస్తం.

ఉన్నత స్థాయి రాష్ట్ర పోలీస్ అధికారి వ్యభిచారి ఇంట్లో పట్టుబడ్డ వైనం.

ఇటువంటి ఎన్నో వార్తల కింద మార్కర్ గీతలు. ఆమె తదేకంగా.. జాలిగా.. నిస్సహాయంగా చూచింది చెన్నకేశవులు దిక్కూ, రాజ్యలక్ష్మి దిక్కు కూడా.

” అదేనమ్మా ఆయన ఆలోచనా సరళి.. ఈ తరానికి పూర్తిగా నీతినియమాల స్పృహ లేదు.. రోజు రోజుకు నైతిక విలువలు, సామాజిక బాధ్యతలూ, దేశప్రేమా.. అన్నీ పతనమై ఈ తరం ధ్వంసమైపోతాంది అంటరు..” అంది రాజ్యలక్ష్మి.. ఇతనితో ఎట్ల వేగను అన్నట్టు.

” విలువలే ప్రాణంగా, మాటే ప్రాణంకన్నా మిన్నగా భావిస్తూ బతికిన తరమమ్మా మాది.. మానవ విలువలు ఇంతగా పతనమౌతూంటే చూడలేము మేము. ఇంత విచ్చలవిడి అవినీతా. మరీ బరితెగించిన ప్రేమలా.. ప్రజలకు రక్షకులుగా ఉండవలసిన పోలీసులే ఇంత బహిరంగంగా మనుషులను కాల్చుకు తింటారా. ఏమిటిది. ఎటు పోతోందీ దేశం. మనుషులు ఇంత నీతిహీనంగా ఉంటే.. స్వాతంత్ర్య పోరాటంలో ఎవరు పాల్గొనేవారు.. స్వతంత్రం ఎట్లొచ్చేది ”

” నాన్నగారూ.. ఈ రాష్ట్ర సాధన తర్వాత ఈ కుళ్ళిపోతున్న సమాజంలో మానవీయ విలువల పునః స్థాపనకోసం జాతీయోద్యమ స్థాయిలో మరో పెద్ద ఉద్యమం జరగాలి ” అంది సుభద్ర.

చాయ్ తాగడం పూర్తైన తర్వాత ..” సరిగా తొమ్మిదిన్నరకు తయారై వస్తానమ్మా. మనం సార్ చెప్పినట్టు యూనివర్సిటీకి వెళ్దాం ” అని సుభద్ర అక్కడినుండి లేచి వెనుక ఉన్న తన రెండు గదుల ఇంట్లోకి వెళ్ళింది.

బాగా డిస్టర్బ్డ్ కావడం వల్లా, మొగిలి జ్ఞాపకాలు మదినిండా పరుచుకోవడం వల్లా.. లోపలికి వెళ్ళిన ఆమె అలా మంచంపై బోర్లా పడిపోయి ఎక్కెక్కి ఏడ్చింది.

ఏడుపు చాలా సందర్భాల్లో ఒక స్వయం ఓదార్పుగా పనిచేసి .. వర్షం వెలిసిన తర్వాత మేఘంలా మనసును తేలికపరుస్తుంది.

దాదాపు పదిన్నర ప్రాంతంలో చెన్నకేశవులూ, రాజ్యలక్ష్మీ, సుభద్రా .. ముగ్గురూ బయలుదేరారు కార్లో కాకతీయ యూనివర్సిటీకి.

అప్పటిదాకా నిశ్శబ్దంగానే ఉన్న చెన్నకేశవులు కారు పెద్దమ్మ గడ్దపై నుండి వెళ్తూండగా అన్నాడు ” సుభద్రా .. జీవితాన్ని జీవించడం వేరు.. అర్థవంతంగా, ప్రయోజనకరంగా జీవించడం వేరు. చాలా మంది జస్ట్ అలా జీవిస్తూ జీవిస్తూ చచ్చిపోతారంతే. అదేదో సినిమాలో అన్నట్టు తిన్నామా, పన్నామా, లేచామా.. టైప్ లో. ఉదాహరణకు నన్ను తీసుకుంటే.. మా చిన్నప్పుడు ఉద్యోగాలు సుళువుగానే దొరికేవి. అంటే మనకిష్టమైన ఉద్యోగాన్ని ఎంచుకునే అవకాశం ఉండె. నాకు అప్పుడే పి.జి చేయడం వల్ల తలుచుకుంటే ఏ సి టి ఒ గానో, పోలీస్ ఉన్నతాధికారిగానో, బాగా లంచాలను మేయగల కస్టంస్, ఆబ్కారీ వంటివి. కాని నేను కావాలని ఈ ఉపాధ్యాయ వృత్తినే ఎన్నుకున్నాను. ఎందుకంటే.. కొన్ని తరాలను ప్రభావితం చేస్తూ ఈ దేశానికి అవసరమైన ఉత్తమ పౌరులను తయారు చేయగల అవకాశం ఒక్క ఉత్తమ ఉపాధ్యాయునికే ఉంటుంది. కాగా ఏ ప్రలోభాలకూ లొంగకుండా నీతిగా బ్రతుకగలిగే అవకాశం కూడా ఒక్క టీచర్లకే ఉంది. ఎంతో పవిత్రమైంది అధ్యాపక వృత్తి. కాని ఇప్పుడు ఈ తరంలో చూడు.. దాదాపు టీచర్లందరూ బోధన కార్యక్రమాన్ని ప్రక్కన పెట్టి చిట్టీలు, ఫైనాన్స్ లు, బినామీ ఎల్ ఐ సి ఏజెన్సీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కోళ్ల ఫారాలు నడుపుడు, ,లిక్కర్ దందాలు నడుపుడు, సైడ్ బిజినెస్ లు ఎన్నో.. అవసరమా ఇట్ల చేసుడు.. ఏందంటే.. ఏ గడ్డి కరిచైనా సరే తొందరగా డబ్బు సంపాదించాలె. బ్యాంక్ బ్యాలెన్స్ లు పెంచుకోవాలె. క్విక్ మనీ. మగడు ఏ గడ్డి కరిచి తెచ్చినా సరే పెండ్లాం అడుగదు. ప్రశ్నించదు.. నోట్ల కట్ట తెచ్చిస్తే.. ఇవి ఎక్కడివి, ఎట్లొచ్చినై అని అడగదు. సంతోషంతో మొకంపెట్టి లోపల దాచుడే. అత్యాశ.

మాకు.. ఇప్పుడు మనమున్న జాగ, ఇల్లు తప్పితే ఈ భూమ్మిద ఎక్కడా ఒక ఇంచ్ భూమి లేదు. ఎందుకంటే .. అవసరం లేదు.

డబ్బు మనకు ఎంత కావాల్నో అంత ప్రభుత్వం ఇస్తాందిగద. ఇంక ఎక్కువెందుకు. గాంధీజీ జీవితాంతం చెప్పిన విషయం ఏమిటి. సాధారణ నిరాడంబర జీవితం.. నీతివంతమైన నడవడి ఉండాలె మనిషికి..అనికదా.

కాని ఇప్పుడవన్నీ ధ్వంసమైపోయినై.

పోనీ అవన్నీ. ఇప్పుడు.. నువ్వు అర్థవంతమైన జీవితాన్ని జీవించడం మొదలుపెట్టాలె ఇగ.

అందుకు మొదటి అడుగు.. చదువు. నువ్వు ఎస్ డి ఎల్ సి ఇ ..అంటే స్కూల్ ఆఫ్ డిస్టన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ లో చేరి బి.ఎ డిగ్రీ పూర్తి చేయాలె.

దీనికి ఏ బేసిక్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఒక ప్రవేశ పరీక్ష ఉంటది. అది నువ్వు పాసౌతవు. దీక్షగా చదువుతే రెండేండ్లలో నువ్వు డిగ్రీ తెస్తౌ. ఐయాం హోప్ ఫుల్. ” అని ఆగిండు. కారు ఆలిండియా రేడియో దగ్గరికొచ్చింది.

సుభద్ర ఆశ్చర్యపోయింది. ‘ తన మన్సులో ఉన్న మాట ఈయనకెట్ల తెలిసింది ‘ అనుకుంది.

రాజ్యలక్ష్మి మౌనంగా ఉంది. అవసరం ఐనప్పుడు మాత్రమే మాట్లాడే మంచి లక్షణం ఉందామెలో.

” ధన్యవాదాలు నాన్నగారూ. సరిగ్గా నా మనసులో ఉన్న నా ఇష్టాన్నే మీరు చెప్పిండ్లు. ఇప్పుడు నేను రెండు పనులను మాత్రమే చేయాలనుకుంటున్నాను. ఒకటి.. ఎస్ డి ఎల్ సి ఇ లో మీరన్న బి.ఎ చదువు. ఉద్యమంతో అగ్నిగుండం వలె ఉన్న తెలంగాణా ఆకాంక్ష నెరవేరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాక నేనుకూడా ప్రత్యక్షంగా ఒక కార్యకర్తగా పాల్గొనడమే. తర్వాతనే నా జీవితం.. నా భవిష్యత్తు”

” శెభాష్ .. నేనూ అంతే.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఇక జరుగక తప్పదు. ఏ శక్తీ ఇక దీన్ని ఆపలేదు. మొన్ననే ఒక కవి చెప్పిండు కవిసమ్మేళనంలో.. తెలంగాణ పుడమి తల్లి పురిటి నొప్పులు పడుతున్నది.. ఆపలేరు ఆపలేరు తెలంగాణ శిశు జననం .. తెలంగాణ గగనాన తెలంగాణ రవి ఉదయం .. అని . ”

కారు ఎస్ డి ఎల్ సి ఇ ఆవరణలోకి ప్రవేశించి.,

ఒక పావుగంటలో .. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి అందరూ బయటికొచ్చారు. అడ్మిషన్ తీసుకున్నట్టే.

అక్కడి నుండి హనుమకొండ ‘ గ్రీన్ ప్లాజా ‘ దగ్గరికి తీసుకుపోయిండు చెన్నకేశవులు.

కారు దిగడానికి ముందే.. కూర్చునే చెన్నకేశవులు ” చెప్పు రాజ్యలక్ష్మీ నువ్వు ” అన్నాడు భార్యతో.

“సుభద్రా.. నీ అర్థిక పరిస్థితి మాకు తెలియదు. జీవితంతో సుదీర్ఘ కాలం పోరాటం చేస్తూ ఇన్నాళ్ళూ నడుపుకుంటూ వచ్చావని మాత్రం మాకు తెలుసు. ఇప్పుడు ఇక బీడీలు చేయడం.. ఒక వేపు ఉద్యమం, మరోవేపు నిండు దుఃఖంతో మామూలు మనిషిగా మనలేకపోవడం.. ఇదంతా ఎంత కష్టమో జీవితాన్ని లోతుగా చూచిన మనుషులుగా మాకు తెలుసు. అందుగురించి మేము నిన్న దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం నీ అనుమతి లేకుండా. అదేమిటంటే.. నీకు ప్రతి నెలా ఒక పదివేల రూపాయలు నీ అకౌంట్ లో పడేట్టు, దాంతో నువ్వు ప్రశాంతంగా సర్దుకుని కొద్దికాలం తర్వాత నీదైన దారిని నువ్వే ఎన్నుకుంటావని.. మా బిడ్డగా అనుకునే ఇది చేయడం..”

” అయ్యో.. ఎందుకమ్మా.. ఇప్పటికే మీరు చూపుతున్న ఆదరణనూ, ప్రేమనూ భరించలేకపోతూ నా అదృష్టానికి నేను పొంగిపోతున్నాను. నాదగ్గర కొంత డబ్బు ఉంది.. ఈ మొగిలి ఆత్మహత్య తర్వాత రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పార్టీల ప్రతిష్ట కోసం, పబ్లిసిటీ కోసం ప్రతి సభలోనూ కొంతడబ్బు ఇస్తున్నారు. ఆ మొత్తం ఇప్పటిదాకా ఓ ఇరవై వేలుంటుందేమో. ఐనా నాకు ఏమి ఖర్చులుంటాయమ్మా.. కష్టపడడం కూడా చిన్నప్పటినుండీ నాకు అలవాటున్నదే కదా. పెద్దగా అవసరం లేదమ్మా” అంది సుభద్ర అనుకోని ఆ ఘటనకు ఎటూ తోచక.. ఆశ్చర్యపోతూ కూడా.

చెన్నకేశవులు సార్, రాజ్యలక్ష్మి వంటి దంపతులు ఉంటారనికూడా ఇంతవరకు ఎన్నడూ ఊహించలేదామె.

” లేదు తల్లీ.. నిన్ననే నాది ఒక పది లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ మ్యాచురై ఉంది. దాన్ని నేను ఒక ఏజంట్ తో మాట్లాడిన . దాన్ని అతడు సేఫ్ గా ఒక మ్యూచువల్ ఫండ్ ‘ యు టి ఐ ట్రాన్స్ పోర్టేషన్ అండ్ లాగిస్టిక్స్ ఫండ్ ‘ లో పెట్టుబడి పెడుతాడు. దాంట్లో ఒక ఆప్షన్ ఉంది.. ప్రతి నెలా నాకు పదివేల రూపాయలు వాపస్ వస్తుంది.. మన మూలపెట్టుబడి దాదాపు క్షీణించకుండా ఉంటూనే కొన్నేళ్లలో పెరుగవచ్చు కూడా. ఆ పదివేల ఆదాయాన్ని నీకు ఇచ్చి ఆదుకుందామని అనుకున్నాం.. వద్దనకు.. పెద్దల ఆశీస్సులు ఎన్నటికైనా శుభకరమే.” అన్నాడు చెన్నకేశవులు. అని కారు దిగి ఎదురుగా కనబడ్తున్న గ్రీన్ ప్లాజా ఐ సి ఐ సి ఐ బ్యాంక్ వెనుక ఉన్న రెండవ అంతస్తులోని ‘ హరి కసల్టెంట్స్ ‘ కు తీసుకెళ్ళారు. అక్కడ ఒకాయనను పరిచయం చేస్తూ ” మిస్టర్ రవీందర్.. నాకు మంచి స్నేహితుడు.. నాకు ఫైనానిషియల్ అడ్వైజర్.. రవీ నీకు నిన్న చెప్పిన గదా ఈమె సుభద్ర.. అదే యు టి ఐ లో ఇన్వెస్ట్ మెంట్.. ఫాం నింపించుకుని సంతకం తీసుకుంటావా. ఈమెది ఒక బ్యాంక్ అకౌంట్ కూడా తీసి ఆ అకౌంట్ కు ప్రతి నెలా నేను చెప్పినట్టు పది వేలు జమ అయ్యేట్టు .. ఏర్పాటు చెయ్యి.. ఒ కె నా” అన్నాడు. అప్పటికే ఆయనకు అంతా చెప్పి ఉంచినట్టు అర్థమైందామెకు.

ఆయన ఒక మనిషిని పంపి క్రింద ఉన్న ఐ సి ఐ సి ఐ బ్యాంక్ నుండి ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఫాం తెప్పించి దానిమీద సుభద్రదీ .. యు టి ఐ ఫాం మీద చెన్నకేశవులు సంతకమూ, ఒక చెక్కూ తీసుకుని కార్యక్రమమంతా ఒక పావుగంటలో ముగించాడు.

సుభద్రకు అంతా ఒక కలలా.. నమ్మశక్యంకాని విధంగా.. చిత్రంగా ఉంది. మనుషులు ఇట్లకూడా ఉంటరా అనుకుంది.

ఇక పని అంతా ముగించుకుని.. రవీందర్ తెప్పించిన కాఫీ తాగి కిందికి కారు దగ్గరికి వస్తూండగా వినబడింది పెద్ద ఉద్యమ ఊరేగింపు బాపతు నినాదాలతో కూడిన హోరు.

” టీ ఆర్ ఎస్ ” …. ” జిందాబాద్ ”

” మాట ఇచ్చి దగా చేసిన యు పి ఎ ప్రభుత్వం ” …. ” సిగ్గుపడాలె సిగ్గుపడాలె ”

” జోహార్ జోహార్ ” ……. ” అమరవీరులకూ జోహార్ ”

” వుయ్ వాంట్ ” ……. ” సెపరేట్ తెలంగాణ ”

నినాదాలు మిన్నంటుతున్నాయి. దాదాపు ఒక కిలోమీటర్ పొడవుంది ఊరేగింపు.

” రెండేళ్లయింది .. ఇంకెప్పుడు తెలంగాణ”

” మా తెలంగాణ … మాకు కావాలె ”

” కేసీఅర్ నాయకత్వం .. వర్థిల్లాలె “.. ఇవన్నీ ప్లకార్డులపై రాయబడ్ద నినాదాలు.

సుభద్ర, చెన్నకేశవులూ, రాజ్యలక్ష్మీ .. ముగ్గురూ వచ్చి కారెక్కి కూర్చున్నారు. ఊరేగింపు వాళ్ళను దాటి పోడానికి పావుగంటకంటే ఎక్కువే సమయం పట్టింది. పెద్ద సంఖ్యలో పోలీసులు ఊరేగింపును అదుపు చేస్తున్నారు ఇరువైపులా.

ఆ ఊరేగింపులో తన మొగిలి ఉన్నట్టూ.. ఉద్యమకారులతో కలిసి నినదిస్తున్నట్టూ, కాస్సేపైన తర్వాత తన దగ్గరికి వచ్చి ఊరేగింపు విశేషాలను ఇదివరకటివలె చెప్తాడని అనిపిస్తూ.. సుభద్ర ఒక ఉద్విగ్నమైన ఊహల్లోకి వెళ్ళిపోయింది. కారును మెల్లగా పోనిస్తూ చెన్నకేశవులు అటు లష్కర్ బజార్ లోనుండి పోనిచ్చి కుమారపల్లి మీదుగా హనుమకొండ చౌరాస్తా లోకి వచ్చి వేయి స్థంభాల గుడి మీదుగా వెళ్తూంటే.,

ఎదురుగా అలంకార్ టాకీస్ చౌరాస్తాలో పేద్ద జనసమూహం.. పెద్ద సంఖ్యలో గుమికూడుతున్న ప్రజలు కనిపిస్తున్నారు. అప్పుడే కుయ్c కుయ్c మని పరుగెత్తుకొస్తూ పోలీసు వ్యాన్లు.. హడావిడి.. ఉరుకులు పరుగులు.. ఏదో జరిగింది అని అనిపిస్తున్న సంరంభ వాతావరణం.

ఏం జరిగింది.?

బాబూ ఏం జరిగింది.?

” ఎవరో అందరూ చూస్తూండగానే అలంకార్ దగ్గర ‘ జై తెలంగాణ ‘ అని అరుస్తూ ఇప్పుడే రోడ్ ప్రక్కనున్న చెట్టుకు ఉరేసుకుని.. శవం వ్రేలాడుతోంది.” చెప్తూ సైకిల్ పై వెళ్తున్నారెవరో.

‘ ఇంకో బలిదానం . తెలంగాణ సాధనకోసం మరో ప్రాణత్యాగం. ఇక చూడలేదు తను.. చూస్తూ ఈ ఘోరాలను తట్టుకోలేదు..’ సుభద్ర కళ్ళు మూసుకుంది శూన్యతతో. లోపల శతకోటి ప్రళయాలు.

” కారును వెనక్కి తీసుకుని హంటర్ రోడ్ పైనుండి వెళ్దామా ” అన్నాడు చెన్నకేశవులు.

” వద్దు .. వద్దు నాన్న గారూ. ఈ దారిలోనే వెళ్దాం. నేనా శవాన్ని, ఆ వీరుని మరణాన్ని చూడాలి .. ప్లీజ్ ఈ దారిలోనే పోనీయండి కారును.. రేపు చూడలేను ఆ త్యాగమూర్తి పార్థివ శరీరాన్ని ” అంది సుభద్ర. రాజ్యలక్ష్మి కూడా ఆమెతో ఏకీభవించి ” పోదాం పదండి. అమ్మాయి చెబుతున్నదే కరెక్ట్ ” అంది.

అప్పటికే ఆ యువకుని ఆత్మబలిదానం సంగతి నగరమంతా ప్రాకినట్టున్నది. వెనుకనుండి వస్తున్న ఊరేగింపు అదుపుతప్పి అలంకార్ చౌరాస్తా దిక్కు ఎవరికివారుగా పరుగెత్తుకుంటూ వెళ్తూండడం కనిపిస్తోంది ఉధృతంగా. పోలీసులు కూడా అప్రమత్తులై అదనపు బలగాలతో రంగప్రవేశం చేస్తున్నట్టు వాసన వస్తోంది. అక్కడక్కడ పోలీస్ బ్యారికేడ్స్ వెలుస్తున్నాయి. హనుమకొండ చౌరాస్తా నుండి ట్రాఫిక్ డైవర్షన్ మొదలై జనాన్ని సుధానగర్ మీదుగా మళ్ళిస్తున్నారు.

చెన్నకేశవులు కారును అలంకార్ దాకా తీసుకువెళ్లేసరికే ఎడమదిక్కు ఎత్తైన చెట్టుకు వ్రేలాడుతున్న శవం అలాగే ఉంది.

జనం గుమికూడడం ఎక్కువౌతోంది. డి ఎస్ పి , అదనపు ఎస్ పి .. ఇత్యాదులు చేరుకుంటున్నారు. పోలీస్ ధ్వనులు మిన్ను ముడుతున్నాయి.

సుభద్ర .. కారు దగ్గరకు రాగనే.. చటుక్కున కారు దిగి.. ఆ యువకుడు ఉరివేసుకున్న చెట్టు దగ్గరికి పరుగెత్తింది. అక్కడే అప్పటిదాకా అతను నడిపిన ఆటో ఉంది.

ఒక పోలీస్ తన పై అధికారి సూచనల మేరకు చెట్టెక్కి శవాన్ని కిందికి దించే ప్రయత్నం చేస్తున్నాడు. శవం అట్లనే వ్రేలాడుతూంటే ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుని ఏ ఉపద్రవానికైనా దారి తీయొచ్చని పొలీస్ ల భావన. కరెక్టే అది.

చెట్టునెక్కిన పోలీస్ కానిస్టేబుల్ వ్రేలాడుతున్న శవాన్ని ముట్టుకోగానే దేహం మెడ భాగం నుండి ఒక మీటర్ పొడవున్న సిల్క్ గుడ్డలాంటిది జర్రున విచ్చుకుని జలజలా కిందికి జారింది. దానిపై చక్కగా పెయింట్ చేసిన అక్షరాలతో ఉంది.,

” రెండు సంత్సరాలుగా తెలంగాణా ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వమా.. నీకు సిగ్గు లేదా.. ఇంకెప్పుడిస్తౌ మా తెలంగాణా రాష్ట్రం ” అదీ సూటి ప్రశ్న.

కాని జవాబేది.

అతనికి ఓ ఇరవై ఏళ్ళుంటాయేమో. అప్పటికే తండోపతందాలుగా జమఔతున్న మనుషులను చూసి పోలీస్ అధికారులు ఆంక్షలను విధించినట్టున్నారు. పోలీసులు జనాన్ని దూరంగా తరుముతున్నారు.

శవం కిందికి దించబడగానే సుభద్ర గబగబా వెళ్లి .. ఆ బాబు ముఖాన్ని దోసిట్లోకి తీసుకుని బోరున ఏడ్చింది తన ఉనికిని మరిచి.

‘ మొగిలి.. మొగిలి.. నా కొడుకా మొగిలీ. ‘

కారులోకొచ్చి దుఃఖ వివశయై కూర్చుని ” వెళ్దాం పదమ్మా.. నాన్నగారూ.. భరించలేనిక ఈ దృశ్యాలను ” అంది.

అప్పటికే ఆ ఉరివేసుకున్న అమరవీరుని వివరాలను అతని ఖాకీ రంగు షర్ట్ జేబులోనుండి ఏదో ఐడి కార్డ్ ను తీసి పట్టుకుని పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఊరేగింపూ.. ఉద్యమ నాయకులూ.. ఇతర కార్యకర్తలూ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నప్పటికే పరిస్థితి హింసాత్మకంగా మారుతోంది మెలమెల్లగా. లాఠీ చార్జ్ చేసే స్థితి ఏర్పడింది.

చెన్నకేశవులుకు కూడా అంతా లోపల కలచివేస్తున్నట్టుగా అనిపించింది. ‘ ఇక్కడి నుండి వెళ్తేనే బాగుండునని ‘ .. ఇక కారును స్టార్ట్ చేశాడు.

( మిగతాది వచ్చే పక్షం )

 

రామాచంద్ర మౌళి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు