మనిషితనాన్ని కలగంటున్న పక్షి !

విత్వం కేవలం కవి నే కాదు సమాజాన్ని కూడా కదిలించేలా ఉండాలి. తన చుట్టూ పేరుకొని ఉన్న చీకటి ని కవిత్వ కాంతి తో వెలుగు ని అందివ్వాలి. ఇజాల వైపు కాకుండా ప్రజల వైపు నిలబడి అక్షరాన్ని ఎక్కు పెట్టాలి. సహజం గా కవి ని యోధుడి తో పోల్చడం ఎందుకంటే నిరంతరం సమాజం లో ఉన్న సమస్యల పై అక్షరం తో పోరాడతాడు కాబట్టి.  మంచి సమాజం కోసం కలగంటు రవీంద్రనాధ్ “పక్షితనాన్ని కలగంటు” అంటూ ఈ సమాజంలో జరుగుతున్న అపరిష్కృత సమస్యలపై అక్షరాన్ని ఎక్కుపెట్టాడు.  ఈ కవి కవిత్వం లో జ్ఞానము (cognition) ఆలోచన ను లేదా జ్ఞాపకం చేసుకోవడం, వివేచించడం చాలా వరకు చూడొచ్చు. అందులో వ్యక్తి స్వేచ్ఛ ని హరించే పరిస్థితులను, తమ వ్యక్తిక ఆకాశం (personal space) కోల్పోయి వగిచే బాధపడే వారికి ఊరట గా నిలుస్తాడు.
 ఈ దేశ రైతుల పట్ల అంతర్లీనం గా తనలోని ఆవేదన ని, సంఘర్షణ ని “తోలి అడుగు” లో వివరిస్తూ ఎన్నో సమాధానంలేని ప్రశ్నలని సంధిస్తాడు. “తాము పండించే పంటలో నే కలుపు మొక్కలమవుతున్నాము ” అంటూ వాళ్ళ స్థితి కి బాధపడతాడు  సెజ్ ల పేరుతో రైతుల దగ్గర భూమిని లాక్కొని పరిహారం మొహం మీద కొట్టడం”, ఈ విషయాన్నీ నిరసిస్తాడు. ఇదే కవితలో “పట్టెడన్నం పెడుతున్న పంటపొలాన్ని లాక్కొని/నంచుకోవడానికి నష్టపరిహారాలు ఇస్తున్నారు”(తోలి అడుగు). బాల్యం లైంగిక దాడుల్లో మసి మాడిపోతే పట్టించుకోరు. దగ్గరి బంధువులో, తెలిసిన వారో మానభంగానికి పాల్పడితే ఎవరికీ చెప్పుకోవాలి.  ఇప్పుడు కోరిక మృగమై బాలికల్ని కబళిస్తుంది. అందుకే ఈ తరాన్ని రక్షించుకోడానికి ఎప్పుడో నిషేధించిన ఇనపకచ్చడాల అవసరాన్ని మరల కొని తెచ్చుకుంటున్నామని అంటాడు. “పసివాళ్ళకిప్పుడు ఇనుప కచ్చడాలు వేయించాలన్న విష సంస్కృతి లోకి జారిపోతుంది” అని ఇది మంచిది కాదని హితవు బోధిస్తాడు. అందుకే ఇప్పుడు “ప్రపంచం అంతా పసి పిల్ల అయి బావురుమంటుంది”.
ఈ కవి వ్యక్తం చేస్తున్న ఆలోచనలోకాని, మాట చెప్పే విధానం లోగాని ఎక్కడ మొహమాటం కనిపించదు విషయాన్ని పొందికగా (Coherent) చెప్తాడు. మనిషి నిస్సంకోచప్రవర్తన (Disinhibited behavior) వలన గాడి తప్పుతున్నాడు, నియంత్రణ లేకుండా ప్రకృతి విధ్వంసం చేసిన ఫలితాన్ని “నగర పంజరం” లో కళ్ళకి కట్టినట్టు వివరిస్తాడు. పర్యావరణ స్పృహతో ఇలా ” ప్రకృతి ఆవిష్కరించిన పచ్చ జెండాలని పీకిపారేసి/భూతలాన్ని కాంక్రీట్ అడ్డా చేస్తున్నావు/నీ కలుషిత నిశ్వాసానికి ఊపిరాడక ప్రకృతి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. తనకు మనిషి ఎంత ముఖ్యమో ప్రకృతి కూడా అంతే ముఖ్యమంటాడు. (నగర పంజరం). “జీవితం ఒక ప్రయాణం, గమ్యం చేరేవరకు పయనించు” అని ఓ సూక్తి. పయనించే దారుల్లో ఎందరో ఎదురుపడతారు. మనకున్న రవాణా సాధనాల్లో రైలు ముఖ్యమైంది. రైలు పెట్టెలోని పేదరికపు జీవితాన్ని కళ్లారా చూసి చలిస్తాడు. ప్రయాణికులు వేసే చెత్త చెదారాలు వేసే చీపురు తో శుభ్రం చేసే “వాడి” గురించి ఎంతో అర్ధం గా రాశారు.  బాల కార్మికుల దుస్థితి ని చూసాక మనం ఎక్కడ ఉన్నామన్నది భేరీజు వేసుకోవాలి “వాడు రైల్లో చిమ్మే చీపురై వస్తాడు/ప్రతి పెట్టెకు పాటై వస్తాడు”.  వాడి జీవితం ఒక సమాధానం లేని ప్రశ్న అందుకే చివర్లో అంటాడు. ” ఈ దేశం లో బాలుడు/వాడి కళ్ళలోకి చూడు/కనిపిస్తాడు కోటి ప్రశ్నల సూర్యుడు”(వాడు). స్వతహాగా ఉపాద్యాయుడు అయినందువలన విద్యార్థుల సమస్యలపై  స్పష్టత ఉంది. ముఖ్యం గా కార్పొరేట్ విద్యాలయాలు బాల్యాన్ని ఎలా పంజరం లో బందిస్తున్నాయో ఘాటు గా నే స్పందించారు. “కళ్ళలో నెత్తుటి దీపాలు వెలిగించుకుని/అక్షర పంక్తుల వెంట పరుగులు తీస్తున్నాం//గణిత సమీకరణాల సమాధానాలతో మమ్మల్ని మేము వెతుక్కుంటున్నాం” విద్యార్థులు ఒత్తిడి లో నలిగిపోతున్నారని వారిని ఆదుకోవాలని సహానుభూతి ప్రకటిస్తాడు
Yaadler ప్రకారం జీవన శైలికి (Style of Life) సంబంధించి మనిషి భిన్న సాధనాలని ఎంచుకుంటాడు.. కాలాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు అంటే ఆధునికానికి అలవాటు పడిపోయాము కానీ పాత కాలం లో సంప్రదాయకం తో జీవించేవారు అందులో దాహార్తి ని తీర్చే పేదవాడి “మట్టి కుండ” అందులో ఒకటి.  ఇప్పటికి పేదవాడి ప్రిడ్జు మట్టి కుండ నే దాని గురించి “అది ప్రాణం లేనిదే కావొచ్చుగాని/దానిని చూస్తే మాకు ప్రాణాలు లేచి వచ్చాయి” మట్టి కుండ అంటే కేవలం అదొక వస్తువు కాదు శ్రమ జీవన సంస్కృతి కి చక్కని ప్రతీకంటాడు (మట్టి కుండ).  జ్ఞాపకం (memory)  తీయగానే కాదు ఒక్కోసారి చేదుగా కూడా ఉండొచ్చు మంచి, చెడు నాణానికి రెండు వైపులా ఉన్నట్టు జ్ఞాపకం ఎలాగైనా ఉండొచ్చు. “అమృతం తాగిన జ్ఞాపకాల” ను తవ్వి తరిచి చూసుకొంటూ, కొన్ని మధుర స్మృతుల్ని మిగిల్చిన గతం తాలూకు అనుభవాల్ని గుర్తుచేసుకోమంటాడు  “నువ్వు లేనితనం//నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది/అమృతం తగిన నీ జ్ణాపకాలు నా చుట్టూ పరిబ్రమిస్తున్నాయి.”
మనిషి తనని తాను తరిచి చూసుకుంటే అసలైన మనిషిని గుర్తుపట్టగలడు ఇదొక అంతరంగ దర్పణం. అందుకే “అసలు సిసలు అంతర దర్పణం ఒకటి అందరి లో దాగి ఉంది //అందులో చూస్తేనే అసలు రూపమేదో స్పష్ష్టం అవుతుంది”(దర్పణం).  ఆకాశం లో సగమైనా మహిళ హక్కుల్లో మాత్రం సున్నానే. పురుషుడి అహంకార చక్రం కింద నిర్దయగా తొక్కబడుతూనే ఉంది అనుక్షణం భయం నీడల్లో నే జీవితం వెళ్లదీస్తుంది. ఇదే విషయాన్ని పక్షితనం కలగంటు లో వివరిస్తూ “పంజరాలు/వేటగాళ్లు లేని లోకాన్ని కలగంటున్నాను” అని మహిళా సమస్యల వైపు నిలబడతాడు. “అభిరుచులు హననమై /వ్యక్తిత్వం ఖననమై/పాతివ్రతపు పీఠం మీద /ప్రతి క్షణం మరణిస్తున్నాం/పంజరాలు/వేటగాళ్లు లేని లోకాన్ని ఆకాశాన్ని చుంబించే పక్షితనాన్ని కలగంటున్నాను” స్వేచ్ఛ కోసం పోరాడే ఇంటి పక్షుల గురించిన తపన నిజంగా కదిలిస్తుంది(పక్షితనాన్ని కలగంటు).. ఇద్దరు వ్యక్తుల మధ్య అభిప్రాయాలూ బిన్నం గా ఉంటాయి. ఒక పక్షి స్వేచ్ఛ ని బందించి ప్రపంచం లో ఎగరనీయకుండా చేయడం ఎలానో సంసారం బంధం లో కూడా భార్య ని అలానే చేస్తారని “రెండు ప్రపంచాల” మధ్య లోని భావాన్ని గొప్పగా చెప్పారు. మగవాడి స్వాభావికమైన ఆహం   (EgO) భార్యని బంధించడం లో చల్లబడుతుంది. “చెరోగూట్లో ఎప్పట్నుంచో మనం//మనిద్దరం యజమానికి ఒక్కరే/నాకోసం పళ్ళు/నీకోసం పూలు తెస్తుంటాడు. ఇద్దరి జీవితాలు బందీ నే అని పక్షి తో చెప్పడం వెనుక అంతరార్ధం ఇద్దరి జీవితాలు స్వేచ్ఛ లేనివే అని చెప్పడం. మగవాడు చెప్పినట్లు వినాలి అది జంతువైనా ఆడది అయినా. ఎంత అమానుషం కదా..(రెండు ప్రపంచాలు)
నాగరికత విధ్వంసానికి అభివృద్ధి పేరు తో చితికిపోయిన ఎన్నో ఊర్లు మరెన్నో సంస్కృతులు. చిన్నతనం లో ఉన్న ఊరు అభివృద్ధి భూతం మింగేస్తే తిరిగి వచ్చి చూసుకుంటే ఇళ్ల స్థానం లో వెలిసిన రోడ్డు ని చూసుకొని బావురమంటాడు “అయ్యో”లో.  స్నేహితుడి కన్నా ఒక మంచి పుస్తకం గొప్పది అది స్వాంతన ఇస్తుంది అనడం లో అతిశయోక్తి ఏమి లేదు. అందుకే సార్ధకత లో “పుస్తకాన్ని గుండె కు హత్తుకోవడం లో వాత్సల్యం ఉంది //మనిషే పుస్తకం కావడం లో నే సార్ధకత ” ఉంది.  ఈ దేశపు సైనికుడు ఎప్పుడు ఉన్నతుడే. అలాంటి వ్యక్తి కోసం తన అక్షరాన్ని అంకితమిస్తాడు. “నీ చాతి మీద ధర్మ చక్రం ఎరుపెక్కిన పొద్దులా ఉంది/నీ నిష్క్రమణ నా ఆశలను అవనతం చేసింది “అంటూ ఈ దేశం లో నువ్వెప్పుడూ స్ఫూర్తి గా బతికి ఉంటావని నీ స్ఫూర్తితోనే కలిసి ఉంటామని ప్రమాణం చేస్తాడు. చివర్లో “ఇక మనం ఎప్పటికి కలిసే ఉంటాం /ఒకే దేశం గా …ఒకే దేహాం గా ” ఈ దేశం కోసం నిరంతరం పాటుపడుతున్న సైనికులు సెల్యూట్.
రైతు గురించి రాయకపోతే అదెప్పటికీ సంపూర్ణం కాదేమో..”మట్టి దారుల్లో” నడిచే వారి కోసం తపన పడతారు . కష్టాలకి నష్టాలకి వెరవక వ్యవసాయం చేస్తున్న రైతుకి మద్దతు ఇస్తాడు. “ప్రకృతి పుస్తకానికి/ప్రారంభ పీఠిక వ్రాసినవాడి పద్యాన్ని అతని గొంతులోనే ఉరివేసి/మట్టి పాద ముద్రలను మొదలంటా తుడిచేసి ఎక్కడికని వెళ్ళగలం / దేశం పైకప్పుకే ధాన్యపు కంకులు కట్టిన వాడే కనుమరుగవుతున్న లోకం లో /రేపటికోసం గుప్పెడు విత్తనాలను మోసుకు తిరిగేవాళ్లు/ఎక్కడికని వెళ్ళగలం. అందుకే రైతు వెంట నిలబడి తానూ ముందుకు సాగుతాను అంటాడు. “భూగోళన్ని బతికించుకోవడం కోసం /మట్టి చేతుల మహా వైద్యున్ని అన్వేషిద్దాం (మట్టి దారుల్లో)
ఉత్తరాంధ్ర నుంచి ఎంతో అద్భుతమైన కవిత్వం వస్తుంది. సాహిత్యం లో ఉత్తరాంధ్ర ధీ ఎప్పుడు ప్రత్యేకమే. ఈ కవితా సంపుటి లో ఎన్నో అద్భుతమైన ప్రతీకలు ఉన్నాయి. శైలి పరంగా కానీ, అభివ్యక్తి పరంగా కాని ఇంకొక లెవెల్ కి తీసుకు వెళ్తాయి.  రవీంద్రనాధ్ కవి గా కంటే ముందు బాధ్యత గల ఉపాధ్యాయుడు. చీకటి ని పారద్రోలడానికి కవిత్వాన్ని సాధనం గా చేసుకున్నాడు.  తన చుట్టూ జరుగుతున్న సమస్యల పట్ల పూర్తి అవగాహనా తో, ఎరుక తో ఉన్నారు. సామాజిక స్పృహని రంగరిస్తూ అక్షరం తో ముందుకొచ్చారు. పక్షితనాన్ని కలగంటు మనిషి లో చచ్చిపోయిన చైతన్యాన్ని బతికించుకోవడం కోసం నిరంతరం తపిస్తాడు. చక్కని కవిత్వాన్ని పదికాలాలపాటు దాచుకోవాలి మరియు  చదవాలి.  మరల మరల చదవాలనిపించే కవిత్వానికి ఇదొక నమూనా. అలాంటి కోవలో నే ఈ కవితా సంపుటి నిలుస్తుంది. తాను పయనించే మార్గం లో ఎంతో మందిని తన తోడు తీసుకెళ్తాడు అని మాత్రం నమ్మకం కలిగించింది ఈ కవిత్వం అందుకే ఈ కవికి అభినందనలు ! ..
*

పుష్యమీ సాగర్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగా రాశారు.. నేను ఇప్పటి వరకు ఈ పుస్తకాన్ని చదవలేదు.. కానీ మీ సమీక్ష చదివాక… ఖచ్చితంగా చదవాలని నిర్ణయించుకున్నాను. మీకు నా అభినందనలు!

    • ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు తప్పక చదివి తీరాల్సిన పుస్తకం …

  • సామాజిక సమస్యలపై ఎక్కుపెట్టిన అక్షర సమీరాలే ఈ కవితా సంపుటిలోని కవనాలు.కవి గారు బాగా వ్రాశారు.మీరు అంటే చక్కగా విశ్లేషించి సమీక్షించారు.ఇరువురికి అభినందనలు💐💐

    • పుస్తకం పై మీ అమూల్య స్పందనకు ధన్యవాదాలు మాధవి గారు ….

  • నా కవిత్వంపై సమీక్షను అందించిన పుష్యమీసాగర్ గారికి ధన్యవాదములు. సమీక్ష పైన, కవిత్వము పైన స్పందిస్తున్న సాహితీ మిత్రులకున్నూ ధన్యవాదములు.

  • కవి కంటున్న ”కల” ని బాగా పరిచయం చేసారు. ఈ కవిత్వాన్ని చదివాను. కవి మరీ లోభిలా వున్నారు. ఈ పాటికి ఎన్నో పుస్తకాలు రావాల్సిన సాంద్రత కలిగివున్నవాడు. కవికీ మీకూ అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు