మనిషి…అని పిలవనా?

ఫీసులో డెస్క్ దగ్గర కూర్చుని ఉంది నిత్య. కుర్చీలో ఒక కాలు మడిచి, రెండో కాలు కింద కార్పెట్ మీద ఆన్చి మేనేజర్ పంపిన ఇమెయిల్ ని చూస్తూ ఆరీ ఆరని జుట్టుని ఎడమ చేతి వేళ్ళతో విడదీస్తోంది.

‘ఇంటి నుండి బయలుదేరేప్పుడు చెప్పింది అమ్మ జుట్టు ఆరబెట్టుకుని వెళ్లని. టైం లేదని పరుగులు పెట్టాను. ఇప్పుడు ఈ ఏసీ చలికి చస్తున్నాను’ అనుకుంది.

‘చాయ్ కి పోదామా?” అన్నాడు ఆశీష్ వచ్చి డెస్క్ మీద కూర్చుంటూ.

‘ఇప్పుడే కదా లాగిన్ అయ్యాము. అప్పుడేనా ?’ అంది జుట్టుకి క్లిప్ పెడుతూ.

‘ఇప్పుడే పోదాం. ఆ కోడ్ పని చేయడం లేదు. మైండ్ బ్లాంక్ గా ఉంది’

‘సరే పద’

చాయ్ తీసుకుని ఇద్దరూ ఆఫీస్ లాన్ దగ్గర కూర్చున్నారు.

‘పది రూపాయిలు ఈ కషాయానికి’ అని ఒక సిప్ తీసుకుంటూ అన్నాడు ఆశీష్.

‘రోజూ ఇదే అంటావ్. మళ్ళీ ఇదే కాషాయం కావాలంటావ్’ అని నవ్వింది నిత్య.

చాయ్ కౌంటర్ దగ్గర వాళ్ల మేనేజర్ కనపడ్డాడు. ఇద్దరూ ఆయనకి చెయ్యి ఊపారు. ఆయన ఒక చేత్తో లాప్టాప్ పట్టుకుని, అదే చెయ్యి భుజం కాస్త పైకెత్తి సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు. రెండో చేత్తో చాయ్ పట్టుకుని, మొక్కలకు నీళ్లు పెడుతున్న పైప్ తొక్కకుండా, తెల్ల చొక్కా మీద చుక్క చాయ్ పడకుండా వీళ్ళ వైపు వచ్చాడు.

‘హాయ్ గుడ్ మార్నింగ్, మనం వచ్చే వారం క్యాంపస్ సెలెక్షన్స్ కోసం ఇండోర్ వెళ్ళాలి. డీటెయిల్స్ పంపిస్తాను, ఏర్పాట్లు అవి చేసుకోండి’ అని చెప్పేసి, చాయ్ గడ గడ తాగేసి మళ్ళీ పరుగులు పెట్టాడు.

ఆయన అలా వెళ్ళగానే నిత్య కంగారుగా, ‘క్యాంపస్ సెలెక్షన్స ఏంటి? మనం కంపెనీలో జాయిన్ అయ్యి రెండేళ్లేగా అయ్యింది? మనకి అప్పుడే ఏమి తెలుస్తుంది ఇంటర్వ్యూ చెయ్యడం?’ అంది.

ఆశీష్ భరోసాగా నవ్వాడు.

‘నువ్వు చిల్ తీస్కో. ఇది ప్రతి సంవత్సరం ఉండేదే. క్యాంపస్ కి వెళ్ళాక అక్కడ మనకి పెద్ద పనేం ఉండదు. కానీ టెక్నికల్ ఇంటర్వ్యూ తీసుకోవడం, ఆ ఫలితాలు మేనేజర్లకి ఇవ్వడం, వాళ్ళు ఫైనల్ రౌండ్ తీసుకోవడం లాంటివి ఉంటాయి. కాకపోతే మనం ఈ కంపెనీ లో చేరాక మన అనుభవాలు కొత్త వారితో పంచుకుంటాం అని ‘షేరింగ్ పీర్ ఎక్స్పీరియన్స్’ అన్నట్టు తీసుకు వెళ్తారు. మిగతా అంతా వాళ్ళే చూసుకుంటారు.’ అన్నాడు

ఆ రోజు కాంటీన్లో ఫ్రెండ్స్ కి తెలిసింది వీళ్ళు వెళ్లబోయే కాలేజీ గురించి.

దీపక్ వచ్చి, ‘ఆక్కడ అమ్మాయిలు బాగుంటారు అట. కొంచం అమ్మాయిల్ని ఎక్కువ సెలెక్ట్ చెయ్యండి ప్లీజ్’ అని అన్నాడు.

వెంటనే ఆశీష్, ‘నీకు క్యాంపస్ అంతా కలరింగే కద రా, ఇంకా కొత్తగా ఎందుకు?’ అని రివర్స్ పంచ్ విసిరాడు. నిత్య మాత్రం, ‘కరువు పడి సచ్చినట్టున్నారు అంతా’ అని మనసులో నవ్వుకుంది.

నిత్య, ఆశీష్, నలుగురు మేనేజర్లు టిక్కెట్లు బుక్ చేసుకుని చెప్పిన రోజుకి ఇండోర్ వెళ్లారు. కాలేజీలో క్యాంపస్ సెలక్షన్ టీం వీళ్ళని ఉదయం పది గంటలకు రమ్మన్నారు. కాలేజీకి బయల్దేరుదామా అని హోటల్ రిసెప్షన్ లో అందరూ అనుకుంటుండగా, నిత్య చేతి గడియారం చూసి, ‘ఇంకో గంట టైం ఉంది కదా, పైగా కాలేజీ కూడా పక్కనే, అప్పుడే ఎందుకు?’ అని అడిగింది.

మేనేజర్ వచ్చి, ‘నో నో, మనం ఇప్పుడే బయలుదేరాలి. స్టాఫ్, స్టూడెంట్స్ ముందు మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలంటే మనం ముందుగానే వెళ్ళాలి’ అన్నా డు.

‘ఈయన గారి విజ్ఞాన ప్రదర్శనలు కాకపోతే మామూలుగా ఆఫీసులో అయితే షిఫ్ట్ లాగిన్ ఉదయం పదకొండింటికి అంటే ఒక్కొక్కరూ వచ్చేది పదకొండున్నర, పన్నెండు అలా. కానీ ఇక్కడ ఫ్రెషర్స్ ముందు మన కంపెనీ ఇలా అలా అని బిల్డప్ ఇవ్వాలి, ఫోజులు కొట్టాలి కదా ఆందుకే కాలేజీ వాళ్ళు పది అంటే మనం తొమ్మిదిన్నరకే క్యాంపస్లో దిగిపోయి వాళ్ళని టెన్షన్ పెట్టాలి’ అని అశీష్ దగ్గర నసిగింది నిత్య.

మొత్తానికి ముందే చేరుకున్నారు. సెలక్షన్ కి వచ్చిన వారిని కాకా పడితే వాళ్ళ కాలేజీ నుండి ఎక్కువ శాతం హైరింగ్ అవుతుందని మ్యానేజ్మెంట్ ఆశ. ఒక రకంగా చెప్పాలంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు మర్యాదలతో చంపేస్తారు. నిత్య కిటికీ దగ్గర నిలబడి స్టూడెంట్స్ ని చూస్తోంది. రెండున్నర సంవత్సరాల క్రితం తను కూడా హైద్రాబాదులో ఒక ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్ సెలక్షన్ అప్పుడు అదే పొజిషన్లో ఉంది. తను పడిన టెన్షన్ ఇప్పుడు వీళ్ళు కూడా పడుతున్నారేమో అని ఆలోచిస్తోంది.

చాయ్ కప్పు తో తన దగ్గరికి వచ్చిన ఆశీష్ తో, ‘వాళ్ళని అలా చూస్తుంటే మన స్టూడెంట్ రోజులు గుర్తొస్తున్నాయి. ఇంటర్వ్యూ అనగానే అప్పటి వరకు జీన్ ప్యాంట్లు, టీ షర్టులు, చుడీదార్లు మీద బ్రతికిన మన బిందాస్ బతుకులకి రాత్రికి రాత్రి సూటు బూటు తోడు అయ్యాయి. గూడు జారిపోయే సూటు మన కశ్యప్ ది ఆయితే, ఇబ్బంది పడుతూ ఆటు ఇటు సర్దుకుంటూ కొందరు. ఇక మా అమ్మాయిలైతే సూటు వేసుకున్నాక అప్పటి వరకు పెట్టిన బొట్టు, వేసిన జడ ఉంచాలా లేదా అని తికమక పడ్డాం, గూగుల్ లో కూడా చూసాము సూట్ మీద ఎలా స్టైలింగ్ చేసుకోవాలని తెలుసా?’ అని తల తిప్పకుండా ఒక్కసారిగా తన ఇంటర్వ్యూ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది నిత్య. ఈ పిల్లకి ఇంత పరిశీలనా శక్తి ఏంటి అని తనని అలా చూస్తుండిపోయాడు ఆశీష్.

వెనక నుండి ‘లెట్స్ గో టీం’ అని పిలుపు వినగానే ఇద్దరూ ఆలోచనల నుండి బయట పడ్డారు.

ఆఫీస్ టీం అంతా ఆడిటోరియంకి చేరుకుంది. అప్పటికే కాలేజీ స్టాఫ్, స్టూడెంట్స్ అంతా అక్కడ కూర్చున్నారు. పరిచయాలు అయ్యాక కంపెనీ గురించి చెప్పి స్టూడెంట్స్ ని గ్రూపులుగా విభజించి ఇంటర్వ్యూ రూమ్స్ కి పంపించారు. నిత్యకి ఇచ్చిన స్టూడెంట్స్ పదిహేను మంది. తన చేతిలో పదిహేను మంది వివరాలున్నాయి, కానీ అక్కడ ఉంది పద్నాలుగు మంది మాత్రమే. ఎవరు రాలేదని ఒకసారి చెక్ చేసి కాలేజీ కోఆర్డినేటర్ కి చెప్పాలని అనుకుంటుండగా ఆ కుర్రాడు పరిగెత్తుకొచ్చాడు. సూట్ మీద కాలేజీ బ్యాగ్ వేసుకుని, చెమటలు కక్కుతున్నాడు.

‘ఐయామ్ సాత్విక్. మే ఐ కమిన్? అని అడిగాడు.

‘యు అర్ లేట్. కంపెనీ ఓరియెంటేషన్ మీటింగ్ కూడా మిస్ అయ్యావు. ఇది ఒక ఇంటర్వ్యూ. ఇక్కడ టైం మానేజ్మెంట్ చాలా అవసరం’ అని ఎక్కడ లేని హుందాతనం తెచ్చుకుని చెప్తూ మనసు లోపల ఇంత ఆలస్యంగా రావడానికి గట్టి కారణం లేకపోతే ఎవరైనా ఇంటర్వ్యూ అప్పుడు ఎందుకు ఇలా ఆలస్యంగా వస్తారని ఆలోచనలో పడింది నిత్య.

దానికి అతను, “ఐయామ్ వెరీ సారీ. మా అమ్మ గారిని క్లినిక్ దగ్గర దింపి వస్తుండగా ట్రాఫిక్ జాం అయ్యింది అండి. నేను దింపకపోతే ఆవిడ రెండు బస్సులు మారి వెళ్ళాలి. లేట్ అవుతుందని సెలక్షన్ ఇంచార్జి కి ఫోన్ చేసి చెప్పాలని ఎంత ప్రయత్నించినా ఆయన ఫోన్ తీయలేదు. కావాలంటే చూడండి” అని ఫోన్ తీసి కాల్ లాగ్ చూపించబోయాడు.
అమ్మ కోసం అటు, ఉద్యోగం కోసం ఇటు పరిగెత్తాడు, పైగా ఫోన్ చేసి చెప్పాలనే ఆలోచన ఉందని, ‘ఇట్స్ ఓకే. కమిన్. హైరింగ్ మేనేజర్ రెండు నిమిషాల్లో ఇక్కడ ఉంటారు’ అని అతన్ని లోపలకి పంపింది.

అన్ని రౌండ్స్ అయ్యాక మేనేజర్ వచ్చి, ‘లేట్ గా వచ్చినా అతన్ని లోనికి రానిచ్చి మంచి పని చేసావు నిత్య. ఈ కుర్రాడు బాగున్నాడు. ఎప్పటిలానే అందరూ ఇంటర్వ్యూ లో ఫైర్ అలారమ్ ప్రాజెక్ట్ గురించి చెప్తుంటే తను మాత్రం ఇంటి పక్కన వారు రోజూ మోటార్ వేసి, టైం కి కట్టేయక నీళ్లు వృదా చేస్తున్నారని, దాని కోసమని ఒక చిన్న పరికరం గురించి మాట్లాడాడు. కాస్త వేరేగా ఆలోచిస్తున్నాడని మిగతా మేనేజర్లు కూడా అంటున్నారు. సెలెక్ట్ చేసేద్దాం’ అని ఫైల్ పెట్టి వెళ్ళిపోయాడు.

సాయంత్రం అయ్యే సరికి ఫైనల్ లిస్ట్ రెడీ అయ్యింది. అందులో సాత్విక్ పేరు కూడా ఉంది. సెలెక్ట్ అయిన వారి పేర్లు అనౌన్స్ చేసాక, ఉద్యోగం వచ్చిన వారికి సంతోషం ఆగదు, రాని వారికి బాధ తప్పదు.

రెండు నెలలు తర్వాత ఆ కంపెనీలో ఇంటర్న్ చేయడానికి సాత్విక్ వాళ్ళ బ్యాచ్ జాయిన్ అయ్యారు. తను నిత్యని వెతుక్కుంటూ తన డెస్క్ దగ్గరికి వచ్చాడు. ‘హాయ్, నేను సాత్విక్. మీరు నన్ను ఇండోర్ లో సెలెక్ట్ చేశారు. గుర్తున్నానా?’ అని అడిగాడు.

నిత్య లేచి, చేయిచ్చి, ‘యా, ఆఫ్ కోర్స్, ఐ రిమెంబర్ యు. వెల్కమ్ టు ది ఫర్మ్” అని స్వాగతం పలికింది.

సాత్విక్ ని, అతని ఇద్దరు ఫ్రెండ్స్ ని నిత్య, ఆశీష్ పని చేస్తున్న ప్రాజెక్టులో వేశారు. వాళ్ళకి వారి డెస్కులు చూపించి చిన్న పనులు ఇవ్వడం కూడా జరిగింది.

ఓ మూడు గంటలు తర్వాత ఆ ముగ్గురు నిత్య దగ్గరకి వచ్చి, ‘మాకు ఆకలేస్తోంది. మేము లంచ్ కి వెళ్ళొచ్చా?’ అని అడిగారు. దానికి ఆమె, ‘ఆలా ఎలా వెళ్తారు? మేము అసల ఇక్కడ తినే టైం ఇవ్వము’ అని ముఖం సీరియస్ గా పెట్టి జవాబిచ్చింది. చుట్టూ ఉన్న కొలీగ్స్ గట్టిగా నవ్వారు. తను జోక్ చేస్తుందని అప్పుడు అర్ధమైంది. వాళ్ల వెనక నుండి ఆశీష్ వచ్చి, ‘బ్రో, ఇది మీ కాలేజీ కాదు. వెల్కమ్ టు ది కార్పొరేట్ వరల్డ్. మీకు ఎప్పుడు వెళ్లాలంటే అప్పుడు వెళ్ళచ్చు’ అని సాత్విక్ భుజం మీద చేయి వేసి చెప్పాడు.

‘పాపం, క్యాంపస్ టు కార్పొరేట్ మైండ్ షిఫ్ట్ ఎంత కష్టమో కదా. వాళ్ళ మొహాలు చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత కన్ఫ్యూషన్ లో ఉన్నారో అని’ జాలిగా అంది నిత్య.

వెనక నుండి వాళ్లనే చూస్తూ, ‘అలవాటు పడతారు లే’ అన్నాడు ఆశీష్.

తర్వాత రోజుల్లో సీనియర్స్ తో పాటు లంచ్ కి వెళ్లడం, ఒకరి టిఫిన్ డబ్బా ఇంకొకరు తినడం, మిగతా కొలీగ్స్ ఇంటి నుండి తెలుగు వంటలు తేవడం లాంటివి జరిగేవి. అలా బీటెక్ నాలుగో సంవత్సరంలో ఉండగా, ఒక నెల రోజులు ఆ కంపెనీలో ఇంటర్న్ గా పని చేసి, తన పనితనంతో, మంచితనంతో ఫైనల్ ఇయర్ అయ్యాక దసరాకి అక్కడ పర్మనెంట్ అయ్యాడు సాత్విక్.

దసరా పండుగకి ముందుగానే సెలవలు పెట్టుకున్నారు కొందరు. సాత్విక్ మాత్రం దసరాకి వద్దు, దీపావళికి సెలవు కావాలని ముందే చెప్పాడు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగాల్లో సెలవలు పెట్టడంలో ఈ మాత్రం కోఆర్డినేషన్  లేకపోతే ముందు క్లయింట్ విరుచుకుపడటం, ఆ విసుర్లు బాసులు టీం మీద చూపించడం జరుగుతుంది. సాత్విక్ కి లీవ్ శాంక్షన్ అయ్యింది. చిన్నపిల్లాడిలా మురిసిపోయాడు ఫ్యామిలీని కలవబోతున్నందుకు.

దీపావళికి నాలుగు రోజులు ముందు రోడ్డు పక్కకి కారు ఆపించి మట్టి ప్రమిదలు కొంటోంది నిత్య వాళ్ళ అమ్మ.

‘పాత ప్రమిదలు ఉన్నా ప్రతి సంవత్సరం ఒక జత కొత్తవి కొనాలని ఇప్పుడు షాపు అంతా చూస్తావేంటి ? ఇంకేం కొనాలి?’ అని అసహనంగా అడిగింది నిత్య.

‘ఉండవే, ఒక నిమిషం’ అని వాళ్ల అమ్మ అంటుండగానే నిత్య ఫోన్ మ్రోగింది.

‘హలో. హాయ్ సాత్విక్, నో ప్రాబ్లెమ్, చెప్పు’

‘అర్జెంటుగా ఊరెళ్తున్నా అండి, ఇంట్లో ఏదో సమస్య’ అన్నాడు సాత్విక్ ఆ పక్క నుంచి దిగాలుగా.

‘అయ్యో అలాగా? సరేలే ఎలాగో పండక్కి వెళ్తా అన్నావు కదా. కాకపోతే నాలుగు రోజులు ముందు వెళ్తున్నావు, అవసరమైతే ఇంట్లో నుండి పని చెయ్యి, లాప్టాప్ తీసుకెళ్ళు.’

‘సరే, వెళ్ళగానే మెసేజ్ చేస్తాను’ అని నీరసంగా చెప్పి ఫోన్ కట్ చేసాడు.

నిత్య కి ఎందుకో మనసులో తెలియని టెన్షన్ మొదలైంది. ఫోన్ అలానే పట్టుకుని, ‘ఆల్ ఐస్ వెల్’ అని ఫింగర్స్ క్రాస్ చేస్తూ ఆనుకుంది.

కాని ఆ దీపావళి అంత చీకటైన పండుగ నిత్య కానీ, ఆ టీం మెంబెర్స్ కానీ ఎన్నడూ చూడలేదు సాత్విక్ సంగతి తెలిశాక. సెలవలు తర్వాత ఆఫీస్ కాంటీన్లో ‘సాత్విక్ ఎలా ఉన్నాడో’ అని చాయ్ కప్పు టేబుల్ మీద తిప్పుతూ ఆలోచిస్తోంది నిత్య.

‘అసలు ఎలా జరిగిందంట?’ అని అడిగాడు ఆశీష్.

“నాకూ అన్ని డీటెయిల్స్ తెలీదు. తను మాట్లాడలేకపోయాడు. తన ఫ్యామిలీ అంతా సిమ్లా లో ఉంటారు కదా. అక్కడే ఆ ఘాట్ రోడ్డు మీద యాక్సిడెంట్ అంట, తన తమ్ముడు తో సహా మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు ఆన్ ది స్పాట్ పోయారట’ అని పూడుకు పోయిన గొంతుతో వచ్చీ రాని మాటలతో చెప్పడానికి ప్రయత్నించింది నిత్య.

అందరి మనసులూ ఎలాగో అయిపోయాయి.

ఎంత మంచి కొలీగ్స్ అయినా బాధ తలుపు తట్టినప్పుడు ముందు ఓదార్చాల్సింది క్లయింట్ నే. అందుకే నిత్య వెంటనే సాత్విక్ పని అంతా టీం లో వారికి పంచింది. అతనకి ఉన్న సెలవలు చాలకపోతే బాస్ తో, హెచ్ ఆర్ తో మాట్లాడి హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద లాస్ అఫ్ పే లేకుండా ఇప్పించడం, కంపెనీ ఇన్సూరెన్సు వాళ్ళతో మాట్లాడటం లాంటివి చేసింది. తనకి అది పెద్ద సాయం చేసినట్లు అనిపించలేదు.

అదే మాట తర్వాత రోజుల్లో సాత్విక్ తో కూడా చెప్పింది. దానికి అతను, ‘కష్టంలో ఉన్నప్పుడు మైండ్ పనిచేయదు అండి, ఆ టైములో మన కోసం ఇంకొకరు ఆలోచిస్తే అదే పెద్ద సాయం, నేను ఉన్న పరిస్థితుల్లో హెచ్ ఆర్ తో కానీ, ఇన్సూరెన్సు వాళ్ళతో కానీ మాట్లాడి ఉండేవాన్ని కాదు. థాంక్యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్’ అన్నాడు.

యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ మీద కేసు వేస్తారా, లీగల్గా వెళ్తారా, సెటిల్మెంటా అని ఆఫీసులో పక్క టీం వాళ్ళు చిన్న చిన్న డిస్కషన్స్ పెట్టారు. మనకి ఎంత దగ్గర మనిషి అయినా సరే ఎక్కడో ఒక చోట కాస్త ప్రైవెసీ కావాలని కోరుకుంటారు. ఇదీ అంతే అని నిత్య కానీ ఆ టీం కానీ ఎవ్వరూ తనని అడగలేదు.

‘అమ్మ ఎలా ఉన్నారు సాత్విక్?’ అని ఒక రోజు సాయంత్రం ఫోన్ చేసింది నిత్య.

ప్రమాదంలో అమ్మకి వెన్నుపూస దెబ్బ తింది అండి. నిన్న మధ్యాహ్నం ఆపరేషన్ చేశారు. ఏమీ తోచట్లేదు. ఒక పూట ఇక్కడ అమ్మ కోసం ఐసియు బయట ఉంటే, ఇంకో పూట పోయిన వారి కార్యక్రమాలు, పూజలు అని ఇంటి నుండి ఫోన్లు వస్తున్నాయి. ఎటు వెళ్లాలో అర్ధం కావట్లేదు, ఇక ఓపిక లేక ఉన్న అమ్మని అయినా కాపాడుకోవాలని ఐసియు బయటే కూర్చున్నాను. ఆమెకు ఏమైనా అయితే మొత్తానికే ఒంటరి అయిపోతానండి.” అని ఏడ్చేశాడు సాత్విక్.

నేను వచ్చాక అన్ని పనులు మళ్ళీ బాగా చేస్తాను, ఏమీ అనుకోకండి” అన్నాడు. ఆ క్షణం ఇంటర్వ్యూ కి ఆలస్యం అయినప్పుడు వాళ్ళ అమ్మని క్లినిక్ దగ్గర దింపేసి వచ్చాను అని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి నిత్య కి. ‘నేను ఇతన్ని ఇంటర్వ్యూ లో సెలెక్ట్ చేసానా లేక ఇతను నాకు ఏమైనా నేర్పించడానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడా’ అనే ఆలోచనలో పడిపోయింది. మూడు వారాల తర్వాత సాత్విక్ ఆఫీసుకి వస్తున్నాడని అందరికీ తెలిసింది. తనని చూడాలి, పలకరించాలని బాసులతో సహా చాలా మంది ఎదురు చూస్తున్నారు.

ఆశీష్, నిత్య డెస్క్ దగ్గర ఉన్నారు. ఎప్పటిలా ఇవ్వాళ చాయ్ కి వెళదాం అని అతను అడగలేదు. ఇద్దరూ తమ లాప్టాప్స్ వంక చూస్తున్నారు కానీ, ఎదురుగా ఏమీ కనపడట్లేదు. అప్పుడు చూసారు ఇద్దరు గ్లాస్ డోర్ దగ్గర సాత్విక్ కార్డ్ స్వైప్ చేసి లోనికి రావడం

‘ఇప్పుడు ఏం చెప్పాలి, ఎలా ఓదార్చాలి? స్టీఫెన్ హాకింగ్ గారి రీసెర్చ్, మాటలు ప్రభావం వల్ల చనిపోవడం అనేది ఒక వేరే డైమెన్షన్ అని చెప్పనా? అలా చేస్తే తన బాధ ఎలా తగ్గేది?’ అని నిత్య ఆలోచిస్తుండగానే తను లోపలకి వచ్చి అందరిని పలకరించి ఆమె దగ్గరకు వచ్చాడు.

అవే కళ్ళు. ఈ సారి ప్రశాంతత బదులు బాధ స్పష్టంగా కనబడుతోంది. మీసాలకి ఎప్పుడైనా చాయ్ అంటుకుంటే చిటికెన వేలు మడిచి చాలా స్టైల్ గా తుడుచుకునే వాడు, ఇప్పుడు అసల షేవ్ కూడా చేసుకోలేదు.

‘హల్లో సాత్విక్, రా, కూర్చో, ఐయామ్ సారీ ఫర్ యువర్ లాస్. మీ ఫ్యామిలీ ఎలా వుంది?’ అని అడిగింది నిత్య. ఆశీష్ ఒక హగ్ ఇచ్చి మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయాడు.

‘నలుగురు వెళ్లిపోగా, మిగిలిన వాళ్ళం అలా అలా ఉన్నాం అండి. అమ్మకి ఆపరేషన్ అయ్యింది కదా, వచ్చే వారం నుండి ఫిజియోథెరపీ ఉంటుంది’ అని పూడుకు పోయిన గొంతుతో అన్నాడు.

అతనిని ఓదార్చటానికి నిత్య మాటలు వెతుక్కుంటుండగనే, తనే అడిగాడు, “ఎలా వున్నారు అండి? మీ కొత్త ప్రాజెక్ట్ ఎలా వుంది? మీ అమ్మగారికి మైగ్రేన్ తగ్గిందా?”

‘ఎంతలా బాధని దిగమింగి ఉంటాడు? శివుడిలా కంఠం లో దాచుకున్నాడా? ఎంతలా గుండె ధైర్యం తెచ్చుకొని ఉంటాడు? ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలని ఆలోచిస్తుంటే ఎప్పుడో అమ్మ మైగ్రేన్ గురించి లంచ్ టైములో కాంటీన్ లో చెప్పిన మాట గుర్తు పెట్టుకుని అడుగుతాడేంటి? మెల్లమెల్లగా పనిలో పడ్డాడు. కాని ఒక్కోసారి తింటూ తింటూ ఆపేసి కళ్ళు తుడుచుకుంటాడు. టీం కాల్స్ లో సడన్ గా సైలెంట్ అయిపోతాడు. బిక్క మొహం వేసుకుని టాయిలెట్ వైపు వెళ్తాడు. తిరిగి వచ్చేటప్పుడు కళ్ళు ఎర్రగా ఉంటాయి. లోపల తనకి ఎలా ఉందో ఆ బాధ పడిన తనకే తెలుసు కానీ చూస్తుంటే నాకు మాత్రం ఏదో లా ఉంది. అసల ఏం దేవుడు ఈయన? పూజలు ఎందుకు చెయ్యాలి?’ అని ఆ రోజు వాళ్ళ అమ్మ దగ్గర బాధ పడింది నిత్య.

‘ఊరుకో, ఆయన ఆట మనకి ఎలా తెలుస్తుంది? కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది’ అంది వాళ్ళ అమ్మ.

ఒక వారం ఆఫీసులో పని చేసాక తనకి స్పెషల్ కేసు క్రింద ఇంట్లో నుండి పని చేసే అవకాశం కల్పించారు. ఇంటి నుండి పని చేయడం మొదలు పెట్టాక మనిషి కనపడటం, మాట్లాడుకోవటం తగ్గింది. టీం లో ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో తనని పలకరించేవారు. ఒక రోజు క్లయింట్ తో వీడియో కాన్ఫరెన్స్ జరుగుతోంది. మీటింగ్ ఇంకో రెండు నిమిషాల్లో మొదలవుతుంది అనగా, ‘ఒక్క నిమిషం, హెడ్ సెట్ తెచ్చుకుంటాను’ అన్నాడు సాత్విక్. మిగతా వాళ్ళు పిచ్చా పాటి మాట్లాడుతున్నాడు. తను షెల్స్ దగ్గరికి వెళ్తూ వీడియో మ్యూట్ చేయడం మర్చిపోయాడు. ఆ హెడ్ సెట్ తమ్ముడిది కాబోలు, అది పట్టుకుని నేల మీద పడిపోయి ఏడ్చేశాడు. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, టీం అంతా కాల్ కట్ చేసారు.

చూసే వారికి ఈ అబ్బాయి అసలు మామూలు మనిషి అవుతాడా అనిపించేది. ఒక రోజు నిత్యకి ఫోన్ చేసి, ‘హాఫ్ డే ఉండను అండి. పని సాయంత్రం పూర్తి చేస్తాను” అని చెప్పాడు.

‘పర్లేదు. అంతా ఓకే నా? అమ్మ బానే ఉన్నారా?’

‘ఓకే అండి. యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ ని హాస్పిటల్ నుండి రేపు డిశ్చార్జ్ చేస్తున్నారు. వాళ్ళది వేరే ఊరు. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ నేను అంత దూరం వెళ్లి చూడలేను కదా. తన తప్పు లేకపోయినా మాకు నష్టం జరిగింది. నెల రోజులు ఆయన కూడా హాస్పిటల్ పాలు అయ్యాడు కదా. చూసి, పలకరించాలి..” అని ఇంకేంటో చెప్తున్నాడు.

నిత్య కి అవేమి వినపడట్లేదు. ఇంతలా బాధ పడుతూ ఆ బాధ కు కారణం అయిన వారి పట్ల కూడా ఎలా ఇంత మంచిగా ఉండగలుగుతున్నాడు ? అసలు తామే దుఃఖసాగరంలో కొట్టుకు పోతూ, ఎవరైనా పక్కన వారి గురించి ఎలా ఆలోచిస్తారు? వీళ్ళు కదూ ఆర్డినరీ పీపుల్ విత్ ఎక్స్ట్రార్డినరీ మైండ్సెట్?

ఆ రోజు రాత్రి నిత్య తన డైరీ లో, ‘మావోడి గిటార్ ట్యాలెంట్ గురించి చెప్పలేదు కదూ. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే టైములో ఉండుంటే ఆ గిటార్ వాయించి కాజోల్ ని పడేసేవాడు. అంత ప్రేమగా వాయిస్తాడు, ఆఫీస్ బ్యాండ్ లో కూడా ప్లే చేస్తాడు. తన తమ్ముడికి కూడా నేర్పిస్తున్న టైములో తన దూరమైపోయాడని దాన్ని తర్వాత ముట్టుకోలేదు. యు అర్ ఆర్ట్ అండ్ ది ఆర్టిస్ట్, సాత్విక్. నీకు మనశ్శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ” అని రాసుకుంది.

*

శ్రీ ఊహ

16 comments

Leave a Reply to Sri Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు