మనసు అనే ఒక మాయల దయ్యం కథ!

మనసు అనే ఒక మాయల దయ్యం కథ!

మనసు మాయను పట్టుకున్న మంచి కథ సముద్రం . ఈ కథ చదవడం ఒక గొప్ప అనుభవం!

గుప్పెడు మనసు సినిమా చూశారా ? బాల చందర్ అద్భుత సృష్టి . ఆ సినిమా కోసం ఆచార్య ఆత్రేయ ఒక  అద్భుతమైన మనసు పాట  రాశారు . ఆ పాటను మంగళం పల్లి బాల మురళీ కృష్ణ అంతకంటే అద్భుతంగా గానం చేసి ఆ పాట కొక  క్లాసిక్ స్థాయిని కల్పించారు . ఆ పాటలో మనసును గురించి  ఆత్రేయ   ఎన్నెన్ని ఉపమానాలు , ఉత్ప్రేక్షలు  గుప్పించాడో తల్చుకుంటే , విన దల్చుకుంటే  గుండె ఆనందం తో ఉప్పొంగుతుంది

చీకటి గుహ , చింతల చెల , కూరిమి వల , మాయల దయ్యం  ఇలా మనసును వర్ణించడానికి కొత్త కొత్త పదాలను సృష్టించి మరీ ప్రేక్షక శ్రోతల మనో వీధిలోకి గురి తప్పని బాణాల్లా వదిలాడు . చీకటి గుహ ఒక అనితరసాధ్యమైన ఉపమానం . ఆ మనసు ఏమి ఆలోచిస్తుందో తెలియదు . ఎలా స్పందిస్తుందో తెలియదు . గుహ అంటేనే వెలుతురు  సోకని సన్నని మార్గం అని కదా అర్ధం . ఆ వెలుతురు  సోకని తనానికి మరింత చీకటిని అద్దాడు కవి . కటిక కాటుక లాంటి చీకటి అని అనలేదు కానీ చీకటి అనడం వెనుక అదే అర్ధం వుంది ఉంటుంది . చెల  లేదా చెలమ  అంటే నిత్యం ఊరేది అని అర్ధం . ఆ మనసు లోనుండి చింతలు ఎప్పటికప్పుడు , నిరంతరం , అనంతంగా ఊరుతూ  ఉంటాయట . మనసంటే చింతలు మాత్రమే కాదు  కూరిమి కూడా . కానీ ఆ కూరిమి కూడా వల  లాంటిది . ఆ వలలో చిక్కుకుంటే ప్రాణం విలవిల  లాడవలసిందే . ఈ  ఉపమానాలు అన్నింటికీ శిఖర ప్రాయం మాయల దయ్యం . ఈ మాయల దయ్యం వున్నది వదిలేస్తుంది . లేనిది కావాలని పరితపిస్తుంది . ఫలితంగా లభించేది ఏమిటి ? యుగాల పాటు పొగిలి పొగిలి  , రగిలి రగిలి , జ్వలించే విలాపాగ్ని . ఆ అగ్ని భాష ఏమిటో తెలుసా ? అది మౌనం

తరళ  మేఘ చ్ఛాయ లో వంశీకృష్ణ  మేఘ చ్ఛాయ లాంటి కథ గురించి చెప్పకుండా ఆత్రేయ మనసు గుణ గానం చేస్తున్నాడు ఏమిటి ? అనుకుంటున్నారా ?  మనసు గారడీకి బాలి అయిపోయిన జీవితాలు ఎన్నో ! కానీ ఆ మనసు గారడీని గుర్తించి . ఆ కోర్కెల పంచ కల్యాణికి పగ్గం వేసి వెనక్కు లాగి ,జీవన యానాన్ని రహదారిమీద గుర్రపు స్వారీ లా పరుగెత్తించాలంటే ఎంత వివేకం , ఎంత విచక్షణ , ఎంత స్థిత ప్రజ్ఞత్వం , ఎంత అమాయకత్వం , ఎంత నైర్మల్యం , ఎంత ప్రేమ  ఉండాలి . అంత ప్రేమ వున్నప్పుడు మనుషులు మనుషులు కాక మరేమిటో అవుతారు . అలాంటి మనుషులు తయారు కావాలి అంటే . అంతటి మానసిక ఔన్నత్యం మనుషుల మానసిక ప్రపంచాలలో ప్రోది చేయాలి అంటే అది ఒక్క కథ  వలెనే సాధ్యం .

అలాంటి ఒక కథ . సముద్రం . రచయిత భమిడిపాటి జగన్నాధ రావు గారు . మొదటి సారి ఈ కథ  ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక 1982 లో ప్రచురించబడింది . ఆ తరువాత 2009 లో మువ్వలు పేరుతొ ప్రచురించబడిన జగన్నాధ రావు గారి రెండవ కథల  సంపుటిలో సంకలించ బడింది . చాలా తక్కువ కథలు  రాసినా భజారా  చాలా గొప్ప కథలు  రాసారు .

ముందుగా ఈ కథ  గురించి కొంత చెప్పుకుని,  ఆ తరువాత , ఆ తరళ  మేఘ చ్ఛాయ లో విహరిద్దాము

ఈ కధలో కథానాయకికి  ఒక పేరు లేదు . ఆమె తన కథ  తానే  చెప్పుకుంటుంది . మనం సౌలభ్యం కోసం  సీత  అనుకుందాము . ఎందుకంటే ఈ సీత భర్త పేరు రాజారామ్ కనుక . సీతకి రాజారామ్ వరుసకు మామయ్యా అవుతాడు . సీత కంటే పదిహేనేళ్ళు ముందు పుట్టాడు .

సీత అణువణువూ  రాజారామ్ ప్రభావం లోనే పెరిగింది . పదిహేనేళ్ల వయసు అంతరం వున్న  మామయ్యను పెళ్లి చేసుకున్నాక ఆమె రాజారామ్ ను రాజా అనడం అలవాటు చేసుకుంది . ఆమెది గొప్ప కళా హృదయం . ప్రతిదీ తీర్చి దిద్దిన పెయింటింగ్ లాగా ఉండాలి అనుకుంటుంది . ఆఖరికి కాఫీ తాగే కప్పులపై కూడా ఒక అద్భుతమైన ఆకుపచ్చటి కాడల చిన్నటి  తెల్లతెల్లటి పూలు ప్రత్యేకంగా ఆమె కోసం పెయింట్ చేయించాడు రాజారామ్ . ఆమె కోసం పియానో మెట్టు నొక్కినప్పటి సన్నటి సంగీతపు ధ్వని వచ్చేలాంటి  కాలింగ్ బెల్ పెట్టించాడు .

” కళని  అద్భుతంగా జీవితంలో పొదుగుకున్న  పిల్లవే నువ్వు ” అంటాడు రాజారామ్

” అందుకే నా కోసం అంత కాలం ఆగి ఆ ప్రౌఢ యవ్వనం లో ముప్ఫై ఐదేళ్ల పెళ్ళికొడుకు అయ్యాడు ” అంటుంది రాజారామ్

వేయి మాటలేల ఆమె తెల్లటి కాన్వాస్ అయితే అతడు అందమైన పెయింటింగ్ . ఆమె చక్కటి పియానో మెట్టు అయితే అతడు ఆ మెట్టు వినిపించే సన్నటి సంగీత ధ్వని . ఆమె శృతి చేసిన వీణ  అయితే అతడు వీణ పలికించే సరిగమల సెలయేరు . ఆమె అక్షరం అయితే అతడు భావం . ఆమె పద్యం అయితే అతడు ఛందస్సు . ఆమె వాక్కు అయితే అతడు అర్ధం . ఆమె మేఘం అయితే అతడు ఛాయా . నిజానికి వాళ్లిద్దరూ ఇద్దరు కాదు . ఒక్కటే ! వాళ్ళు ద్వైతం  కాదు . అద్వైతం

అలా సీత రాజారామ్ ల జీవితం గడచిపోతున్నప్పుడు  ఒక రోజు అతడు క్యాంపు కి వెళ్తాడు . అతడు వెళ్లిన దగ్గరనుండి ఆమె క్షణాలని గంటలుగా అనువదించుకుంటూ ఉంటుంది . అసలు ఈ కథ  ప్రారంభం కావడమే

” రాజారామ్ మామయ్య వూరు వెళ్ళాడు .. వెళ్లి ఇప్పటికి నలభై ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిముషాలు అయింది . రెండు రోజులలో వస్తాను అన్నాడు . ముప్పై నాలుగు నిమిషాల లేట్ లో వున్నాడు , నా కంటే పదిహేనేళ్ళు ముందు పుట్టిన మామయ్య ” అంటూ ప్రారంభం అవుతుంది .

మా రాజా గురించి మీకు తెలీదు కదా ! తను  ” విజయా ” వాళ్ళ సినిమా లాంటి వాడు . మేధావి వర్గం నుంచి సామాన్య ప్రజల దాకా ఆరాధనీయుడు అంటూ గొప్ప భావోద్వేగం తో రాజారామ్ గురించి తలపుల జలపాతం గురించి తలపోస్తున్నప్పుడు కాలింగ్ బెల్ మోగుతుంది

తలపుల తలుపు మూసి తలుపు తెరిస్తే ఎదురుగా, ఆమె చిన్నప్పటి స్నేహితురాలు రమ . వాళ్ళాయన

రమా  వాళ్ళాయన నేవల్  ఆర్కిటెక్ట్ . అతడు దిద్ది తీర్చిన పెయింటింగ్ లా ఉన్న  ఇల్లంతటినీ పరిశీలనగా చూస్తూ ఉంటే సీత కు  రాజారామ్ చెప్పిన మాట ఒకటి గుర్తుకు వస్తుంది . ” నేను ప్రతి చిన్న పని నుంచి పెద్ద పని దాకా చాలా అందంగా చేస్తానట . చీర మడత పెట్టడం దగ్గరనుంచి ముగ్గు పెట్టడం దాకా ” అని మామయ్య అంటాడు . ఆ చేతిలో గొప్ప స్కిల్ వుంది . అదే నన్ను మోహ పెట్టి నీ వెంట తిప్పుకుంటోంది”  అంటూ రాజారామ్ చెప్పిన మాటను తల్చుకుని ” నిజానికి నన్ను చిన్ననాటి నుంచి నేటి వరకు అద్భుతంగా మలిచింది మామయ్యే  కదా అనుకుంటుంది

రమా  వాళ్ళాయన ప్రతి అంగుళమూ  పరిశీలించి చాలా నిజాయితీగా ” నాకు చిన్నప్పటి నుండీ పెయింటింగ్ హాబీ అండీ . కానీ నేను ఇంతకాలమూ తెలుసుకోలేక పోయింది ఇప్పుడు తెలుస్తోంది . బొమ్మలు వెయ్యడం , వాటిని రంగులతో ముంచెత్తడం ఇది హాబీ కాదు . నా జీవ లక్షణం  అని . జీవితాన్ని ఇలా రంగు రంగుల అందాలతో మేళవించుకోవడం లోని హాయిని నేను హాబీ అనుకున్నాను . నాకు ఎదో అడ్డుగా ఉన్న  తెర  తొలగిపోయినట్టుంది . మీ ఇల్లు చూస్తే ” అంటాడు .

రమ  శుద్ధ మెటీరియలిస్ట్ . కానీ వాళ్ళాయన గొప్ప భావుకుడు . మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు

” మీరు గొప్ప లైఫ్ తో జీవిస్తున్నారండి -జయదేవుడి  గీతానికి రూపం వచ్చినట్టు , అనుభూతి ఆకృతి అయినట్టు ” అని మెచ్చుకుంటాడు

” జయదేవుడి జీతాలంటే -సుశీల పాడింది -“హరి హర ముగ్ధ ” అదేనా ? మనింట్లో టేప్ లో వుంది కదూ ” అంటుంది రమ

ఆ విరుద్ధ ధ్రువాల పద్ధతి సీత కు చాలా గమ్మత్తుగా ఉంటుంది . అతడి మీదసీత కి చాలా జాలి కలుగుతుంది . అలా జాలి  లో నుండి ఒక ఆకర్షణ ఏదో  మొలకెత్తుతుంది . అతడు లైబ్రరీ చూస్తూ ఉంటే సీతకు అతడిని వదలాలి అనిపించదు . ఏదో  శక్తి , లేకపోతే ఆకర్షణ , ఏదో  ఆమెను అతడివైపు లాగుతుంది .

అతడిని ఆకర్షించడానికి మరింత ప్రయత్నం చేస్తుంది . ఆమె సాన్నిహిత్యం లో అతడి ఆనందం , సౌందర్య పిపాస ఆమెకు అర్ధం అవుతుంది . అతడిని మరింత ఆకర్షించడానికి ఆమె అప్రయత్నంగా ప్రయత్నిస్తుంది . రాజారామ్ వేసిన  కాన్ఫెడెన్షియల్ పెయింటింగ్స్ ” వెన్ వుయ్ ఆర్ టు గెదర్ ” శీర్షిక కింద గీసిన బొమ్మలు చూపిస్తుంది . తెల్లటి మబ్బుల గుంపులో మామయ్య  వడిలో ఆమె వున్న బొమ్మ , పచ్చికలో తెల్లటి కుందేలు పిల్లలా , కేరింతలతో  దాని కింద ” హరిత సముద్రపు కెరటాలు వాలిన వెన్నెలే మేము ”  ఇలా వాళ్ళ అన్యోన్యత , ఏకత్వం నింపిన బొమ్మలు అన్నీ చూపిస్తుంది

ఆ బొమ్మలు చూసి అతడు ” సాధారణంగా ఆర్టిస్టులు జీవితంలో ఫెయిల్ అవుతూ వుంటారు . అంటే వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్ లో వాళ్ళేమీ మిగుల్చుకోరు . కానీ మీ వారు ఇంత గొప్ప పెయింటర్ -వారి ఆరటంతా జీవితం లో ఇలా మల్చుకుని ” అని ఇంకా ఎదో చెప్పడానికి అతడికి ఇక భాష లేదు . మాటలు రాక స్వరం మూగవోతుంది

ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళేటప్పుడు సీత తను ఏ చీర కట్టుకుంటే అత్యంత అద్భుతంగా ఉంటుందో ఆ చెర కట్టుకుంటుంది . అతడి కళ్ళలోని మెరుపు చూసి ఒక వింతైన హాయి అనుభవిస్తుంది . వాళ్ళు వెళ్లిపోతుంటే . అతడు వెళ్లకుండా ఉంటే బావుండును అనుకుంటుంది బెంగగా , ఉద్వేగంగా  ఏమిటి ? నేనేమై  పోతున్నాను  అనుకుంటుంది .

వచ్చిన అతిధులు వెళ్ళిపోతారు

రాజారామ్ వచ్చాక ఈ కధంతా అతడికి సీత అక్షరం కూడా వదలకుండా పూస గుచ్చినట్టు చెపుతుంది

ఇలా జరిగినందుకు ఏ మూలో నాకు కొంచెం గిల్టీగా వుంది మామయ్యా అని కన్ఫెషన్ టోన్ లో చెపుతుంది

అప్పుడు మామయ్య  ఇలా చెప్తాడు

” జీవితం చాలా గొప్పది . అందుకే ప్రపంచం లోని మహా రచయితలందరూ వారి ఆదర్శాలకంటే జీవితపు గొప్ప దనానికే  తల  వంచారు . నీ మనసులో అలా చిన్నతనం ఫీలవకు అని నేను చెప్పను . అది నీకే తెలియాలి . గిల్టీ ఫీలింగ్ అనవసరమని ”   ఆమె రిలాక్సింగ్ గా ఊపిరి పీల్చుకుని

” రాజా వారు చిన్న అసూయ పడుతున్నారేమోనేమి ?” అంటుంది

రాజారామ్ పకపకా నవ్వి ” అవును , నిన్న కొన్ని గంటలపాటు నిన్ను అలరించిన అతను , నేనెందుకు కాలేకపోయినా ? అని అసూయే మరి ”

మా మామయ్య రాజా కాదు . రాజరాముడు అనుకుంటుంది సీత

ఇదీ కథ

జీవితం లో మామయ్య  తప్ప మరొక మగవాడి గురించి కలలో అయినా ఊహించని సీత జీవితంలో కొన్నిగంటలపాటు ఒక అపరిచిత వ్యక్తి కల్లోలం రేపాడు . ప్రశాంత సముద్రం లాంటి ఆమె మనస్సు   తుఫాను రాత్రి సముద్రంలా కల్లోలం అయింది . ఏమిటి కారణం ? సీత తనను తాను  చాలా తరచి చూసుకుంది . తన జీవితంలో , తన మనసులో ఏ మూలయినా  రవ్వంత గోరంత అసంతృప్తి ఉన్నదా ? ఆ అసంతృప్తే ఆ అపరిచితుడిని అప్రయత్నంగా అయినా ఆకర్షించడానికి ప్రయత్నం చేసిందా ? అసలు మనసు ఎందుకంత  కోతిలా ప్రవర్తించింది ?

రాజారామ్ కి రజనీ గంధ సినిమా అంటే ఇష్టం . ఎందుకంత ఇష్టం అని సీత చాలాసార్లు ప్రశ్నించింది . కానీ రాజారామ్ ఎప్పుడూ జవాబు చెప్పాడు . తన మనసు పడిన ఉద్వేగాన్ని విశ్లేషించుకుంటున్నప్పుడు ఆమెకు రజనీ గంధ లో బాసూ ఛటర్జీ ఏమి చెప్పాడో అర్ధం అవుతుంది ”  ఈ జీవితపు సరిహద్దులు మహా విస్తృత మైనవనీ , మామూలు నీతి  సూత్రాలలో బంధించాలని ప్[ప్రయత్నించడం వ్యర్థం అనీ , జీవితపు విస్తృతిని విప్పి చెప్పే ప్రయత్నం చేస్తాడు ఆ సినిమాలో .

రజనీ గంధ సినిమాలో  దీప పడిన వ్యాకులత ఈ కధలో సీత కూడా పడుతుంది . దీపకి  సినిమాలో విద్యా సిన్హా తొలి ప్రేమానుభవం నవీన్ తో కళాశాలలో కలుగుతుంది . ఆ ప్రేమానుభవాన్ని ఆమె మనసు చీర మడతలలో ఎక్కడో పోగొట్టుకుంటుంది . ఆమె సంజయ్ అమోల్ పాలేకర్ ను పెళ్లిచేసుకుందాము అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఆమె జీవితంలోకి నవీన్ వస్తాడు . నవీనా  ? సంజయా ?అన్న విచికిత్స కి దీప గురిఅవుతుంది . చివరకు ఆమె సంజయ్ నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది . తొలి  ప్రేమానుభవం , మనసు పట్టు చీర  మడతల్లో మడతల్లో భద్రంగా దాచుకుంటుంది . ఆ మనసు వెన్నెల కుంకుమ భరిణ  లో నుంచి తొలి  ప్రేమ చందమామ ను వెలికి తీసుకుంటే ఒక చలువ పందిరి నీడన నిలిచిన వాసన తప్పిస్తే మరేమీ మిగలదు

చిత్రంగా ఈ కథలో  సీత కి పెళ్ళైయిన తరువాత తొలి  ప్రేమానుభవం కలుగుతుంది . నిజానికి తొలి  ప్రేమానుభవం  ఫలానా వయసులోనే కలగాలి అనే రూల్ ఏమైనా ఉన్నదా ? పెళ్ళైన తరువాత ఆ ప్రేమానుభవం కలగకూడదా ? అలా కలిగితే ఆ ప్రేమానుభవం అపవిత్రము , కళంకభరితం  అవుతుందా ? ఆ ప్రేమానుభవం  అంతకు ముందు ఆమె గడిపిన జీవితానికి ఒక మచ్చ అవుతుందా ?

సాదా సీదా రచయత అయితే పై సందేహాలకు , సంశయాలకు గురి అయి కథను మరొక సాధారణ మలుపు తిప్పేవాడేమో కానీ  జగన్నాధరావు గారు అలా సాధారణ మలుపు తిప్పి ఒక అనామక కథ  గా దీన్ని మిగిల్చలేదు .

అప్పటిదాకా సీత గడిపిన జీవితం ఎంత స్వచ్ఛ సుందర శుభ్ర స్పటికమో , ఆ అనుభవం కూడా అంత స్వచ్ఛ సుందర శుభ్ర స్పటికమే . ఆ జీవితం ఎంత సహజమో , ఆ అనుభవం కూడా అంత సహజమే . అందులో మలినం అనే భావనకు , భావానికి చోటు లేదు . నిజానికి సీత కూడా ఆ ప్రేమానుభవానికి ఉక్కిరి బిక్కిరి అయింది తప్పిస్తే దాన్నొక తప్పుడు భావనగా హృదయం లోకి తీసుకోలేదు

అందుకేగా ఆమె రాజారామ్ ఊరినుండి రాగానే గువ్వపిట్టలా అతడి వొడి లో  వొదిగి పోయి తన అనుభవం అంతా పూసగుచ్చగలిగింది . రాజారామ్ కూడా అంతే సహజంగా ఆ అనుభవాన్ని దర్శించగలిగాడు . ఎంతైనా పదిహేనేళ్ళు ముందు పుట్టాడు కదా  పైగా అతడొక మాట అన్నాడు

నిన్ను కొన్ని గంటలపాటు అలరించిన అతడిని నేనెందుకు కాలేకపోయాను అని –

ఎంత విజ్ఞత  ఉంటే అతడా మాట అనగలడు ?

ఈ కధకి భమిడిపాటి జగన్నాధ రావు గారు పెట్టిన పేరు సముద్రం . సముద్రం వొడ్డున కూర్చుని ఎన్ని సార్లు ఎంత సేపు చూసినా సముద్రం ఏదో  చెపుతూనే ఉంటుంది మనతో . వినగలిగిన చెవులు , అర్ధం చేసుకోగలిగిన హృదయం ఉండాలి కానీ ఆ ఘోష ఒక్కొక్కప్పుడు పియానో మెట్టు వినిపించే  సంగీత శబ్దం అవుతుంది . ఒక్కొక్క సారి గుడి మెట్ల మీద అమయాకంగా  రాలిన సంపెంగ పువ్వు అవుతుంది . ఒక్కొక్క సారి  కల్లోల పరచే సునామీ అవుతుంది . మరొక్క సరి పాదాల కింద ఇసుకను సన్నగా కోసే తరంగం  అవుతుంది

అవును .మనసు సముద్రమే కాదు . మాయల దయ్యం కూడా . ఆ మనసు మాయను పట్టుకున్న మంచి కథ  సముద్రం . ఈ కథ  చదవడం ఒక గొప్ప అనుభవం

*

వంశీ కృష్ణ

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పాట,కథ,అనుసంధానం అన్నీ బాగున్నాయి అండీ.

  • మంచి కధ, నుపరిచయం చేసిన,మీకు, అనేక కృతజ్ఞతలు..సర్!ఇప్పటివరకు,ఈ కథ, నేను,చదవలేదు..తెలియదు కూడా, .గొప్ప అనుభవాన్ని, ఎరుక పరిచిన, మీకు,రచయిత కు మరోసారి కృతజ్ఞతలు!

  • వంశీకృష్ణ గారు! “ఆరుద్ర “పాట మనసు గురించి న పీఠిక, విశ్లేషణతో ప్రారంభించి మమనసును హత్తుకున్న సముద్రం కథను చెప్పారు! ఎంత మంచి కథనో!!ఆమె జీవితం ఆమె అనుభవం రెండూ స్వచ్ఛ శుభ్ర స్పటికం! ఇలాంటి జీవితాలను , ఆలోచించె స్వచ్ఛమైన మనసుల్ని చూడగలమా!! సముద్రపు అలల్ని ,మనసునూ విశ్లేషించటము తరమా!! మనఃపూర్వక ధన్యవాదాలు ఇంతమంచి కథను పరిచయంచేసినుదుకు!🙏👌💐

  • మౌనమే నీ భాష ఓ మూగ మనసా… 🙏 థాంక్యూ ఫర్ దిస్ సర్..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు