“రోజూ ఇలానే అమ్మ ఒడిలో పడుకుని
చందమామని చూస్తూ
అప్పుడప్పుడూ నంజుకుంటూ
సగం తిని సగం తినకుండా
నిద్రలోకి జారుకుంటున్నప్పుడు
సగం నిద్రలో ఉన్నప్పుడే
నా మూతిమీద పాల మీసమొకటి మొలిచినప్పుడు
ఇలాగే ఇలాగే భూమి చివర అంచు పట్టుకుని
నేను రెక్కల గుర్రం మీద కలల వేట కి వెళతాను
నాతో పాటు వస్తే రేపు ఆ సూర్యుడినీ అడుగుదాం కాస్త చల్లబడమని”
ఒక పిల్లవాడు లేక అప్పుడప్పుడే ప్రపంచం అంటే తెలియబడుతున్న ఒక అమ్మాయో , ఇలానే ఆలొచిస్తుంటుందేమో , ఒక వేళ , వాళ్లే కనక కవిత్వం రాయాలని అనుకుంటే ఈ వాక్యాలే కాస్త కాస్తా కూడబలుక్కుని రాస్తారేమో అని నా ఊహ , కాని ఇప్పుడు మనకి ఏదైన పని నుంచి తప్పుకోవడానికి సరిపడినన్ని కథలున్నాయి కాని , మనల్ని మనం దిద్దుకొవడానికి సరైన కథల అవసరమూ ఉందని చెప్పొచ్చు.
మనదేశంలో విద్యా వ్యవస్థ దాదాపుగా కుప్పకూలిపోవడానికి సిద్దంగా ఉన్న అందమైన పురాతన కట్టడం , ఒకప్పుడు ఇక్కడ విలసిల్లిన నాగరికత, ఉన్న విశ్వవిద్యాలయాలు ఇప్పుడు అంతా కూలిపోయిన కోట గోడల చరిత్ర. మనకిప్పుడు ఇక్కడంతా మాన్సిక విశ్లేషకుల మాటలగారడీ తప్పా మరేమి లేని తనం , ఒకడు గెలవడం తప్పని సరి అంటాడు , మరొకరు , ఓటమిలో వీజయం ఉందీ అంటారు , ఈ మానసిక సంధిగ్ధతని పసి హృదయాలు ఎలా పట్టుకోగలుగుతాయి అలా పట్టుకోలేకనే ఈ బలవన్మరణాలు. ఒకప్పుడు పిల్లలకి ఆటవిడుపుగా చందమామ, బాలమిత్ర , బుజ్జాయి వంటి కధల పుస్తకాలు విరివిగా దొరికేవి ఇప్పుడు బాల సాహిత్యం బాలలకి దొరకడంలేదు అందువలన నష్టపోయేది పిల్లలే అన్న విషయం మన సమాజానికి చాలా ఆలస్యంగా బోధ పడింది , అప్పటి నుంచి బాలలకోసం బాల సాహిత్యం రాయడం మొదలైంది.
పిల్లల కథలు అనగానే మనకి ఖచ్చితంగా నీతులు గుర్తొస్తాయి , లేదా దేవుళ్ల మహిమల కథలు గుర్తుకొస్తాయి , లేకపొతే ఆలీబాబా సాహస కృత్యాలు కల్పించి రాసిన కలగా పులగం గా ఉన్న బీర్బల్ కథలు కనిపిస్తాయి , నిజానికి మన సమాజం లో ఎవరికి వారికి నీతిని గురించి చెప్పడానికి బోలెడు స్పేస్ తీసుకుంటారు , పిల్లల విషయంలో అయితే మరీనూ , అందువలనే నీతి కథలకి ప్రాముఖ్యత బాగా లభిస్తుంది , నిజానికి పంచతత్రం లాంటి కధల్లో ఉన్నది కూడా అదే , అయితె ఇప్పటి తరం పిల్లలకి కావాల్సిన కథలు దొరకడం అనేదీ కాస్త కష్టంగానే ఉంది అని చెప్పాలి , ఇప్పటి తరం పుట్టడంతొనే ఎలక్ట్రానికి వస్తువులకి బానిసలు అవుతున్నారు వాడికి మంచి నీటి కుండ అంటే ఏమిటో తెలియదు చల్లటి నీరు కేవలం రిఫ్రిజిరేటర్ నుంచే వస్తాయని అనుకుంటాడు , చెట్లు చల్లటి గాలి ఇస్తాయని తెలియదు కేవలం ఆ చల్లదనాన్ని ఏసీలోనే వెతుక్కుంటాడు , మరీ ఇవి ఎవరు చెబుతారు పిల్లలకి , అంటే మళ్లీ ఇక్కడే సాహితీ వేత్తలకి కాస్త పని బడుతుంది , అలాంటి పనిని భుజాన వేసుకున్నారు మన మిత్రులు అనిల్ బత్తుల .
అద్భుతమైన సాహిత్యం విలసిల్లిన రష్యన్ నుంచి అక్కడి జానపద కథలని ఏరి పిల్లల కోసం కూర్చారు , ఇది మలి ప్రయత్నం అంతకుం ముందూ ఒక పుస్తకం ఇచ్చారు పిల్లల కోసం , రెండు పుస్తకాలలో అదనపు ఆకర్షణ కథలు వాటితో పాటు ఉండే బొమ్మలు , ఈ మధ్యనే ఈ పుస్తకంలో ఒక కధని సాక్షి ఫండే పుస్తకంలో వేస్తే మా యదీద్యా నాన్నా మన పుస్తకంలో కథ వీళ్ళు కాపీ కొట్టారు అన్నాడు , అంటే ఆ బొమ్మలు పిల్లల్లో ఎంత గాఢమైన ముద్ర వేసాయో అని అనిపించింది . మొత్తం ఈ సంకలనం లో 20 కధలున్నాయి ఇందులో అనేకానేక ప్రసిద్దులైన రచయితల కథలున్నాయి “టాల్ స్టాయ్ ” నుంచి గోర్కీ వరకు రచించిన కధలున్నాయి . అందరూ పిల్లలకొసం తపన పడ్డారు , నేను కన ఈ రచన చేకపొతే రాబొయే తరం పిల్లలు మన చేయి జారి పోతారేమో అని రాసినట్టుంటాయి , ఇవాన్ అనే పేరు తో రాసిన మాక్జింగోర్కీ కథలో ఇలా ఉంటుంది:
చక్కటి అడవి, చిక్కటి అడివి
చిట్టిపొట్టి బుల్లి జంతువులు చక చక గెంతే ఉడతలు
నిత్యం పనిలో ఎర్ర చీమలూ
ఎంతో రుచిగా రాస్ బెర్రీలు
చక్కటి అడవి చిక్కటి అడవి
ఆనందాలని పంచే అడవి ”
కథలో పిల్లలకి అవసరమైన చిన్ని చిన్ని పదాలతో ఒక పొయెటిక్ ఫార్మ్ లో పదాలని రాయడం వలన చిన్నారుల మెదళ్ళ లోకి ఆ కథల్ని త్వరగా చొప్పించవచ్చు అదే ఈ కథల్లో కనపడుతుంది. అలాగే మరో కధ “చీమ- చందమామ”. ఈ కథ అచ్చం పిల్లల ఊహలానే ఉంటుంది , చిన్నప్పుడు అమ్మ ఒళ్ళో పడుకుని చందమామని చూస్తు అక్కడున్న పేదరాసిపెద్దమ్మ కధల్ని , చెవుల కుందేలుని చూడాలని పిల్లల మనసులో ఉన్నట్టే ఒక చీమ చందమామ దగ్గరకి వెళ్లాలనే తపనని ఇతి వృత్తంగా తీసుకుని రాసి కథ ఇది. అలాగే మరో కథ మాక్జింగోర్కీ రాసిందే సముద్ర తీరంలో పిల్లవాడు కథ సముద్రం లోకి పడిపోయిన పిల్లవాడు అక్కడ ఉండే జలచరాల్తో ఇలా మాట్లాడతాడు
“ఎండ్రాకాయ ! ఎండ్రకాయా ! ఎక్కడున్నావ్
రాళ్లక్రింద దాక్కున్నావా ?
అందమైన మా పొలుసులు చూడు
నిటారుగా ఉన్న మా మొప్పలు చూడు
పోదవైన మా తోకలు చూడు
ఎంత బాగా ఈదుతున్నామో చూడు
మేము గొప్ప.. మేమే గొప్ప”
ఈ కథ పిల్లలతొపాటు పెద్దలు చదవాలి పిల్లల ఆలొచన సరళి ఎలా ఉంటుందో ఈ కధ చూపిస్తుంది. పిల్లలకి ఏంకావాలి ఏదైనా సరే నిజాలు కావాలి , వాళ్ల చిన్న చిన్న మెదళ్లలో మొలిచే ప్రశ్నలకి సమాధానాలు కావాలి , వైజ్ఞానికంగా ఎదగడానికీవసరమైనా సరంజామాని మనం వాళ్ళకి అందించాలి, వాళ్ళ బుర్రలో బోలేడు అయిడియాలు ఉంటాయి వాటిని మనం పసిగట్టలేం, వాటితో కాస్తో కూస్తో సంభందం ఉన్న రచయితలు వాటిని పట్టుకుంటారు , పిల్లలని జో కొడతారు , బుజ్జగిస్తారు, తప్పిపోయిన వారిని దారిలో పెడతారు , జీవితం అనే రహదారిలో వారికి అవసరమైన సరంజామాని అందిస్తారు , అందుకు అవసరమైన వాటిని వాళ్లే సృష్టిస్తారు. చాలా కధలని ఇక్కడ ప్రస్తావించాలి , చాలా మంది గొప్ప రచయితలు రాసిన కధలే కాకుండా , రష్యన్ జానపద కథలూ ఉన్నాయి , ప్రతీ దేశానికీ ఆయా దేశాలకి సంబంధం ఉన్న జానపదాలు మనకి ఇందులో కనబడతాయి , అయితే నేటివిటీ కాస్త ఇబ్బదేమో అని అనిపిస్తుంది కొందరికి , కానీ ఈ రోజున ఇంటర్నెట్ మూలంగా మనకి తెలియనివి ఏముంటున్నాయి, ప్రతీదీ కళ్లముందే చూస్తున్నాం , కావాలంటే ఆన్లైన్ లొ బుక్ చేసుకుని తెప్పించుకుంటున్నాం , అలాంటి ఈ రోజుల్లో మనం నేటివిటీ గురించి అసలు ప్రస్తావన చేయకూడదు .
అసలు రష్యన్ సాహిత్యమే ఎందుకు అనేమాటకి చాలా సమధానం చెప్పాల్సి ఉంది , సాధారణ సాహిత్యంలో అభ్యుదయానికి పెద్దపీట వేసిన సాహిత్యం రష్యానుంచి వచ్చింది ప్రఖ్యాత నవల “అమ్మ” , వార్ అండ్ పీస్, అన్నా కరెనీనా లాంటి నవలలు ప్రపంచాన్ని ఒక ఊపు ఊపాయి. అలాంటి సాహిత్య అభిలాషులున్న ప్రాంతం కధలు మన ప్రాంతపు పిల్లలకి తెలియాల్సిన అవసరం ఉంది ఆక్కడ అడవుల గురించు రాస్బెర్రి పళ్ల గురించి , అక్కడ ఆహారపు అలవాట్లు , అక్కడ పండించే పంటలు వీటన్నింటిని పిల్లలకి చెప్పడం వలన వాళ్లని ఒక సార్వజనీన లోకంలోకి తీసుకు వెళ్లడం వలన వారికి ఆలొచన పరిధి కూడా పెరుగుతుంది తద్వార సంకుచిత భావన అనేది పిల్లల్లో రాకుండా చూడొచ్చు.
అలాగే ఈ పుస్తకంలో వేసిన బొమ్మలు పుస్తకానికి అదనపు ఆకర్షణ పిల్లలు ఖచ్చితంగా బొమ్మలకి ఆకర్షింపబడతారు , దానివలన కూడ పుస్తకాలని చదవాలని అనుకుంటారు. నిజానికి మనం అనిల్ బత్తుల చేసిన కృషిని అభినందించాలి , ఎందుకు అంటే ఇలాంటి చాలా రిస్క్ తో కూడిన పనిని ఎవరూ పెట్టుకోరు పెటుకున్నా సరే ఖర్చుపెట్టుకుని ప్రచురణ బాధ్యత తీసుకోరు , ఇంత పెద్ద బాద్యతని మోస్తున్న అనిల్ ని అభినందిస్తూ, ఇలాంటివే మరిన్ని పుస్తకాలు తీసుకురావడానికి మనవంతు బాధ్యత గా ఈ పుస్తకాని వీలైనంత మేరకు చదువరులకి పరిచయం చేస్తు ఉంటే మనం మనకి తెలియకుండానే రాబొయే తరం పిల్లలకి కాస్త మేలు చేసిన వారం అవుతాం . ఇదో మంచి ప్రయత్నం, మంచి పుస్తకం పిల్లల ఆకలి , పెద్దల జ్ఞానం పెంచే పుస్తకం .
*
Add comment