నగరంలో జీవితం, అన్ని సరుకుల్లాటిదే.
మనిషైనా, విలువలైనా మారక విలువ వున్నవే.
ఈ లావాదేవీల్లో నైతికత, సాంఘికనీతి అవకాశవాద రూపాన్ని తొడుక్కుంటాయి.
సంతోషం,విచారం, పశ్చాత్తాపం వంటి వాటి రుచి రంగు మారిపోతుంది.
మధ్యతరగతి “ఆదినారాయణమూర్తి” ని కొత్త తరగతి “ఆది ప్రకాష్” గా రూపాంతరం చేసిన నగరం కథ “గేదె మీద పిట్ట”.
ఈ మార్పు (మెటమార్ఫసిస్) మధ్య తరగతి సమాజం నిలబడిన విలువలమీద — (ఆడమనిషి మగవాడిని వుంచుకొనే చర్చ నుంచి మగవాడిని అవసరమైనప్పుడు కొనుక్కొనే వెసులుబాటు)— మరో వ్యాఖ్య.
“మనుషుల్ని తయారుచేసి, మనుషుల ఆకృతుల్ని మార్చి విసర్జించే పెద్దలోహయంత్రం నగరం. ”
“ఇటికలతో, సిమెంటు కాంక్రీటుతో డబ్బుతో నిర్మితమయ్యే ప్రపంచం ,నగరం.”
ఈ నగరంలో ఎప్పుడు ఉద్యోగం వూడుతుందో తెలియని ఓసివిల్ ఇంజనీర్– ఆదినారాయణమూర్తి
“మనకి వచ్చిన అవకాశం చూసుకోవాలిగానీ రాబోయే దాని గురించి చూస్తూ కూచుంటామా, సెక్యూరిటీ ఉండాలి. పైసలుండడం ముఖ్యం ”
జీవితానికి సంబంధించిన ఇలాటి సమీకరణల పట్ల క్లారిటీ వున్న టీచర్ పూర్ణ, ఆదినారాయణమూర్తి భార్య.
వీళ్ళకి చదువుకుంటున్న చిన్న పాప.వీళ్ళకి తోడుగా ఎవరికీ ఆర్ధికంగా భారం కాకూడదనుకొనే తండ్రి. మానసిక భౌతిక అవసరాలను పంచుకొనే రామ్మూర్తి (ఆది తండ్రి మిత్రుడు)
ఇదీ ఆదినారాయణమూర్తి లోకం.
“మొత్తంగా నిశ్చలంగా నిన్నలాగా, మొన్నలాగా అటు మొన్నలాగా ఎవరి పెర్సనల్ కంపల్సన్స్ కి వాళ్ళు లోబడి సాగిస్తున్న బతుకు.”
అన్నీ అలవాటుగా బతికేస్తున్న జీవితం.
ఆది కి మెరుగైన ఉద్యోగం దొరకదు. తండ్రికి గుండె ఆపరేషన్ జరిగి కోలుకొంటున్నాడనేలోగా తండ్రి చని పోయాడు.
వైద్యం గాని, చావు తర్వాతి కార్యాలు గాని తన మీద ఒత్తిడిలేకుండా జరిగిపోవడం ఆది కి ఊరట.
జరిగిపోతున్న అన్ని సంఘటనల్లాగానే ఈ విషయాలకీ అలవాటు పడి పోయాడు.
తన ఇంజనీర్ వృత్తిపరంగా పరిచయమైన ఒంటరిమహిళావ్యాపారవేత్త “నిర్మల” అవసరం, ఆది కి అంతదాకా సాగినజీవితంలో తను చూడని కొత్త పార్శ్వాన్ని పరిచయం చేస్తుంది.
ఆడవాళ్ళ కి అందించే సేవలవల్ల తనకు ఫీజు అందుతుంది.
పూర్ణకి కొంత వూరట. ఆది కి ఇలాగే కన్సల్టెన్సీలు దొరకాలని దేవుణ్ణి కోరుకుంటుంది.
“గేదె మీద పిట్ట” లో పతంజలిశాస్త్రి గారు ఈ ఆదాయం నైతికమా, అనైతికమా అని ప్రశ్న జవాబులు తో కథని నడిపించరు. జీవితం నడుస్తున్న తీరుని పాఠకుని ముందు పరుస్తారు.
ఆదినారాయణమూర్తి లో ఈనాటి “దివాళాకోరు మనిషిని” నడిపిస్తున్న దళారి నియమాల్ని చదువుతాము.
రచయిత దేన్నీ వ్యాఖ్యానించరు. మన చూపు పరిధిలోకి తెస్తారు. చదువరులు మంచి చెడులు తూకంవేసుకోవడంలోను తీర్పులు నిర్ణయించడంలోనూ వాళ్ళవాళ్ళ మార్గం ఎన్నుకొంటారు.
ఆదినారాయణమూర్తి ని, అతనితో సంబంధం కలిగిన ప్రతిపాత్ర అంచనా వేసిన విధానం ఆయా వ్యక్తుల దృష్టి కోణం నుంచి ఉంటుంది.
చదివే వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళు నిలుచున్న వైపు నుంచి కనబడతాయి.
నాగరికమానవుడు తననించి తాను విడిపోవడంలోను ,ఇతరులతో తన సంబంధాలను నిర్మించుకోవడంలోనూ, అవసరాలు ఆదాయవ్యయాలే కేంద్రంగా జీవిస్తున్నాడనిపిస్తుంది..
అద్దం ముందు నిలుచుంటె ఆదినారాయణమూర్తి అంశ కొద్దిగానైనా ఎక్కిరిస్తుంది నగర జీవిని.
“జీవితం సాయంత్రం ఇంటికెళ్ళి విప్పేసే చొక్కాలాటిది” –ఆదికి చిక్కుముడిలా కనిపించే జీవితం ఆదికి నచ్చదు. జీవితం ఓ సర్దుబాటు . జీవితం జీవిస్తుంది.
తన కన్సల్టేషన్ వ్యవహారం వింతగా అనిపించలేదు. “ఒకడే ఇద్దరిగా ఉంటున్నాడో ,అతనిలో ఇద్దరున్నారో ఆదికి తెలియలేదు.
ఆది నారాయణమూర్తి మీద అతని తండ్రికున్న అభిప్రాయం “వీడికి ఏం కావాలో వీడికి తెలియదని నా నమ్మకం. ప్రవాహంతో పాటు వెళ్ళడం వేరు, ప్రవాహంలో కొట్టుకుపోవడం వేరు.”
పూర్ణకి అప్పుడప్పుడు “అపరిచితుడు” లా కనిపిస్తాడు.
వొస్తున్న “కన్సల్టేషన్ ఫీ” వివరాలు ” అబద్దం చెప్పాలని అతను ఆలోచించలేదు గానీ నిజం చెప్పాలని కూడా అనిపించలేదు.”
ఆది తనని పిలిచే ఆడ వాళ్ళకి ” డిపెండబుల్ ..మీరు ఏవీ పట్టించుకోరు.మీతో డీల్ చెయ్యడం కష్టంగాదు.”
ఒక్కోరిది ఒక్కో చూపు.
ఆది ప్రకాష్ గా మారిన ఆదినారాయణ మూర్తికి లోలోపల అపరాధభావన.
పూర్ణకి సైతం చెప్పుకోలేనిది. నిజానికి అబద్దానికి మధ్య నిద్ర పట్టదు.
జరిగే మంచి చెడులకి ఓదార్పు కారణాల కోసము దేవుడిని ప్రస్థావించుకోవడం బాగుంది ఆదిప్రకాష్ కి.
మంచి జరగాలనీ ఆశతో ఉండడం కూడా బాగుంటుంది.
ఆది కి ఉద్యోగం వూడిన సంగతి పూర్ణకి చెప్పడానికి రెండురోజులు పట్టింది.
వెలితి పూడ్చుకోవడానికన్నట్టు, దొరికిన బస్సు, రైలు ఎక్కాడు. అవి తిప్పిన చోటల్లా తిరిగాడు. దేనితో కనెక్ట్ కాకుండా వుండడం అతనికి బాగుంది.
“బయట పోతున్న నగరంతో సంబంధం లేకుండా ఇట్లా ఉండడం ఎంత సుఖంగాఉంది! ఉద్యోగం అలాఉంచి ఈ ప్రయాణం అవసరం లేని ప్రయాణం.”
“గేదె మీద పిట్ట” నగరజీవితాన్ని, ఆ జీవితం మనుషుల్ని అవసరాలు తీర్చుకొనేందుకు దొర్లాడే జీవులుగా మార్చుస్తున్న వైనాన్ని పొరలుపొరలుగా చూపుతుంది.
ఆది నారాయణమూర్తి గాలికి ఎగిరి ఆసరా దొరికిన చోట వాలుతాడు.
జీవించడానికి ప్రయత్నించడం –కూడా ఆలోచించడు.
దొరికిన ఆసరాలో బతకడమే ఆదినారాయణ మూర్తి కి అర్ధం.
ఆధునిక జీవనం, ఈ పట్టించుకోని తనాన్ని, గాలివాటు బతుకుని –వొత్తిడి కలిగినప్పుడు దేవుడిలోనో , మరో అలవాటులోనో వూరట వెతుక్కోవడంగా పరిష్కరించేసింది.
అపరాధభావన ని మోయలేకపోవడం కూడా విషాదమే.
గిల్ట్ కూడా భాగమై పోయింది
అపరాధ భావన మనసుని తాకినా మెదడు ఆఆ వేదనల్ని అణచివేస్తుంది. రాజీపడడం ప్రారంభమవుతుంది. ఒకసారి రాజీపడడం మొదలయ్యాక అన్ని రకాల అపరాధ (గిల్ట్) భావనల్ని నియంత్రించడం అలవాటుగా మారి పోతుంది.
ఆది ప్రకాష్ ఇప్పుడు ఆదినారాయణ మూర్తి కాడు.
“గేదె మీద పిట్ట” లో (తన అన్ని రచనల లో లాగే) పతంజలిశాస్త్రిగారు కథని, పాత్రల్ని (నగరంకూడా ఓ ముఖ్య భూమిక) వాటి అస్థిత్వాన్ని చెప్పిన తీరు ఈ కథాజీవితంతో మనలని ముడేసిన విధానం “చక్కగ పొట్లం కట్టి, దారంలా చుట్టినట్టుంటుంది.”
విప్పదీసుకొంటూపోతే నానారకాల వాసనలు పొరలుపొరలుగా బయటపడుతాయి.
*
Add comment