కోరాడ రామకృష్ణయ్యగారి గురించి ఎం.ఏ తెలుగు చదువుకుంటున్నప్పటి నుంచీ తెలుసు. కానీ వారి కుమార్తె కమలగారు ఇంతమంచి కథకురాలని మాత్రం ఇప్పుడే తెలుసుకున్నాను.
పట్నంలో పుట్టి పెరిగి, సకల సౌకర్యాలూ, నగరజీవితమూ అనుభవించిన అమ్మాయి పదహారేళ్ళకే పెళ్లి చేసుకుని, విద్యుత్ దీపాలు కూడా లేని మారుమూల పల్లెటూరికి కోడలిగా వెళ్తే ఆమె మన:స్థితి ఎలా ఉంటుంది? ఆధునికత దరిచేరని సమాజంలోనూ అంత సౌందర్యాన్ని, ఆనందాన్ని వెతుక్కోగలిగిన ఆమె సౌమనస్యం ఎటువంటిది?
మద్రాసులో పుట్టి పెరిగి, సంగీతమూ, సాహిత్యమూ తన రెండు కళ్లుగా, గొప్ప గొప్ప విద్వాంసుల రాకపోకలతో ఇల్లంతా సందడిగా పెరిగిన కోరాడ కమల, భమిడి విశ్వనాథ శర్మ సతీమణిగా ఎటువంటి భిన్నమైన వాతావరణంలో ఎలా ఒదిగిపోయారో చూస్తే, ఆడపిల్లలకున్న అపారమైన జీవన నైపుణ్యం మనకు అర్ధమవుతుంది.
తణుకు పక్కన ఉన్న పాలంగి అనే పల్లెటూరిలో తన జీవితాన్ని గురించి కళ్లకు కట్టినట్లు వర్ణించిన ఈ కథలు చదివితే, శ్రీపాదవారు ‘స్త్రీల భాష’ను అంతగా ఎందుకు పొగిడారో అర్ధమవుతుంది. ప్రకృతి ఒడిలో ఒదిగిన ముద్ద బంతి ఈ కథల నాయిక. పైరుపచ్చలతో, పువ్వుల పరిమళాలతో, ఏరుల తళతళలతో మట్టిగంధాన్ని మన చుట్టూ పరిచే ఈ కథాస్థలిలో ప్రకృతిలో ప్రకృతిగా ఒదిగిపోయిన యువతి ఈమె. ఇది కేవలం ఆమె కథ మాత్రమే కాదు. తేనెలాంటి తెలుగులో, స్వీయానుభవాల పునశ్చరణలో, కొన్ని దశాబ్దాల కిందటి సంప్రదాయ కుటుంబాల స్త్రీలందరినీ మన ముందు నిలబెట్టిన అపురూప రచన కమలగారి పాలంగి కథలు.
ఇందులో ఒక్కొక్క అధ్యాయం చదువుతూంటే ఒక జీవితాన్ని కెమెరాలో బంధిస్తున్నట్టుంటుంది. మన అమ్మల తరానికి చెందిన స్త్రీమూర్తి పక్కన నడుస్తూ కబుర్లు చెబుతున్నట్టుంటుంది. ‘గడిచిన దశాబ్దాలు’ వంటి అధ్యాయాలు ఎందరో ఆనాటి స్త్రీల జీవితాలను మనముందు పరుస్తాయి. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారిపోతున్నా వయసు మీద పడడమే తప్ప, ఒంట్లో సత్తువు తగ్గడమే తప్ప, జీవితంలో ఏ మార్పూ లేని యాంత్రిక జీవితాలు మన కట్టెదుట సాక్షాత్కరిస్తాయి. కానీ ఆ యాంత్రికతలోనే సౌందర్యాన్ని వెతుక్కున్న జీవితాన్ని గురించి కమలగారు చెబుతారు. కట్టుబాట్లు, చాకిరీల సంకెలలో మగ్గిపోతున్న స్త్రీల జీవితాల్లోనూ సాహిత్యం, సంగీతం ఎలా ఆనందక్షణాలను నింపుతాయో ఈ రచన చదివితే తెలుస్తుంది. చిన్నప్పుడు నాన్న తనకు అలవాటు చేసిన ‘భగవద్గీత’ ఎన్నోసార్లు తనను రక్షించిందని ఆమె చెప్పినపుడు, భగవద్గీత మన ఆధ్యాత్మిక సంపద కాదనీ, జీవన విధానసూత్రమనీ కొందరు చెప్పేది నిజమేనేమో అనిపిస్తుంది. ‘ మళ్లీ పల్లెటూరి జీవితం. ఎద్దడి నీళ్లూ, కందికంపా, చెరకు పుల్లలతో వంటా, ఊరు చెర్లో బొంతల ఝాళింపు, అయినా మేనకోడల్ని కాదని కొడుకు చేసుకున్నందుకు అత్తగారి అసంతృప్తి, అందుకు నేనేం చెయ్యను? మౌనమే శరణ్యం. . ‘‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన..’ కాపురానికి వచ్చే రోజు నాన్నగారు నా చేతికిచ్చిన భగవద్గీత బతుకులో దేన్నయినా మౌనంగా భరించే శక్తినిస్తుంది. ధన్యురాల్ని ! ‘ అంటారు రచయిత్రి.
ఈ కథలు పూర్తిగా ఆత్మకథాత్మకమే. అనుభవం రంగరించి కమలగారు రాసిన ఈ కథల వల్ల ఈ తరంవారు ఎప్పటికీ చూడలేని, అనుభవించలేని ఒక సహజసుందరమైన గ్రామీణ జీవితంలోకి మనం అడుగుపెడతాం. పాలంగిలో పండగల గురించి రాసిన అధ్యాయం చదివినపుడు, అప్పుడు, అక్కడ పుట్టివుంటే ఎంత బాగుండేదో అని కరడుగట్టిన నగరవాసులకు కూడ అనిపిస్తుంది. ఇంత అందమైన తెలుగు వంటలను, సంప్రదాయాలను గుర్తు చేసే రచన వెనక, స్త్రీల జీవితాల్లోని కట్టుబాట్లు, విలువలేనితనం, యాంత్రికత మన మనసులను కలచివేస్తూనే ఉంటాయి. ప్రత్యేకించి స్వీయచరిత్ర రాసుకుంటున్నానని చెప్పకపోయినా, అతి తక్కువ మాటల్లోనే తన జీవితాన్నంతటినీ గుప్పిట తెరిచి మనకు చూపించారు కమలగారు.
‘తల్లి నన్ను వీడిపోయె. తండ్రి నాకు దూరమాయె బందుగులందరూ నన్నేనాడో పరిహరించినారు. స్వామీ..’ అంటూ మీరాభజనను పాడుకుని వేడుకోవడం తప్ప చేయగలిగినదేముంది? చిన్ననాటి సంగీతమే ఓదార్చే నెచ్చలి’ అనుకుంటుందామె ఒక సందర్భంలో. మనుషుల మధ్య ఆత్మీయ సంబంధాలను గుర్తు చేసే ‘యానాం పెళ్లి’, వైష్ణవుల జీవన విధానాన్ని సాక్షాత్కరింపజేసే ‘ధనుర్మాసం జ్ఞాపకాలు’ ఇలాంటి అధ్యాయాలు సంస్కృతి అంటే కేవలం పండగలు, పబ్బాలు కావనీ, మానవసంబంధాల్లోని సంస్కారమనీ మనకు చాటి చెబుతాయి.
మనసులోమాట ఎవరికీ చెప్పుకోలేని ఒక అశక్తత నుంచి తనని తాను రక్షించుకోడానికి సంగీతసాహిత్యాలను ఆలంబనగా చేసుకున్న ఆమె వ్యక్తిత్వం అపురూపం. ఎవరిమీదా, ఏ పరిస్థితిమీదా ఫిర్యాదులు లేకుండా, అన్ని అనుభవాలనూ స్వీకరిస్తూ, వాటిని సుతిమెత్తని మాటల్లో మనతో ఆమె పంచుకున్న వైనం అందరికీ శిరోధార్యం.
చివరగా, నేను పుట్టడానికి చాలాముందే మా తాతగారి (రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు) వయొలిన్ వాద్యం విని ఆనందించిన విషయాన్ని ఈ రచన ద్వారా పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ…
*
బావుంది, చక్కని పరిచయం