మట్టికి శిలువేస్తారా!!

దేహమంతా సంకెళ్ళైన
స్వేచ్ఛా విహంగం.
రాజరికం ఎరుగని
మహారాజు.
దేశానికి వెన్నెముక
అన్నం పెట్టేవాడే అందరికి
శత్రువు అన్నట్టు !
అమరగీతం ఆలపిస్తున్న సమరజీవి,
క్రిమి కీటకాలతో
యుద్దం, బిడ్డలాంటి
పంటను ఇంటికి చేర్చుకుంటాడు
అమ్మ, కూరా -కూడొండీ
పదిమందికి పెట్టినట్టు
 పంట
పనివాళ్ళకి చాటల్తో పోస్తాడు
కొలత కలతలెరుగని నేస్తం.
మబ్బులకోసం తహతహలాడే
తామరాకు ,నది ఎండిపోతున్నా
నవ్వుతూ ఇంకిపోతున్నా నీరు
స్వార్ధమెరుగక చేనైపండే
చెఱుకుగడ !
జలపాతమంత దూకినా
ఆకుపచ్చని జెండాలా ఆకాశంలో
మెరుస్తాడు.
అతనే ఉంటే అంబరాన
చుక్కలు అక్కర్లేదు !
నడినెత్తినుండి అరికాలిదాకా
అంతా మేకులు నాటినా
నాలుక నాగలై నేలను దున్నగల నేర్పరి
భూమిమీద వామిలా నిలబడకపోతే
నిద్రపట్టదు
సంకెళ్ళు తెంచుకుంటాడు
వడ్లగింజలోనుండి బియ్యపు
గింజలా బయటికొస్తాడు
మనకంత బువ్వ అవ్వడానికి
తనే లేకపోతే
నదులు నిండినా
అక్షయపాత్రలు
అడుగంటాల్సిందే….!
మట్టికి శిలువేసిట్లే  !!

2

రేపు సూర్యుడు ఉదయిస్తాడు!!

—————————————–
ఇంటికి వసారా
కంటికి రెప్పా నీళ్ళు
కారడానికే అన్నట్టు
రాలే ప్రతి చినుకు దేహాన్ని
రంధ్రం చేసి భూమిని తొలిచి
వెళుతుంది
వేసే ప్రతీ అడుగు
దేహంలోనే పడుతుంది
అందుకే సహనం కావాలంటారు
కడుపుచించుకుంటే కాళ్ళమీద
పడుతుందని ఇప్పటిదాకా
సూరుకు వేళ్ళాడిన పిచుక ,
గూడు రెండూ అదృశ్యమైనట్టు
పొయ్యిలో పిల్లిలేవాలి
చాట మొహమాట పడుతుంది
గింజల గాదేతో మాట్లాడాలంటే
అప్పుకు, అడుక్కోడానికి తేడా ఉంది
కూలిచేసి తీరుస్తానంటుంది
అయినా ముసురులా కళ్ళు
కారుతునే ఉన్నాయి చూరునీళ్ళలా!
ఓ వాసాన్ని పీకి పక్కటెముకలా విరిచి
పొయ్యి ముట్టించమన్నా
ఓ పట్టాన వెలగదే ,రాత్రంతా బహుశా
దుఃఖ్ఖాన్నే దిగమింగి తడిసి ముద్దయి ఉంటుంది
పొయ్యి ఇంక వెలగడానికేముంది
తరతరాల దుఃఖంతో ఈ పొయ్యి
 వెలగనంటుంది
చమురు లేని దీపం శక్తివంచన లేకుండా
కాంతిని వెలితీస్తుంది చమురుబావిలో
నుండి అన్నట్టు,పిల్లలపోట్లాటలో దీపం కాస్తా
దొర్లిపోయింది !
కడుపు మాడ్చుకుంటూ
రెప్పలు తెరవని వాకిలిని మూసి
మేము సూన్యంలో వెళ్ళాడుతాం
నిద్రని చిలకొయ్యకు తగిలించి
కళ్ళు ముయ్యాలంటే చూరు
కన్నీరు పెట్టకూడదు
ప్రకృతి విపత్తుకేమితెలుస్తుంది
పేదవాడి పస్తుల సంగతి
రేపు సూర్యుడు ఉదయిస్తాడు
ఎవరికీ కనబడకుండా
ఆకలిపేగుల ఆర్తనాదాల నుండి!!
*
No photo description available.
 కవిత్వం ఎందుకు రాస్తున్నారు?
కవిత్వం అన్నది ఓ తత్వం’ ఆ అనుభూతి మాటలలో చెప్పలేనిది. నేను కవిత్వం ఎందుకు రాస్తున్నానంటే సామాజిక ప్రయోజనం కోసం. మనిషిలో కొన్ని ఉధ్వేగభావనలుంటాయి. అవి మామూలు మాటలద్వారానో ,సాధారణ వ్వక్యికరణ ద్వారా చెబితే ప్రజలు వాటి పట్ల అంత మొగ్గుచూపరు.మనం చెప్పేవిధానం ప్రజలను ఆలోచింపచేసేదిగా ఉండాలి అలా ప్రజలను చైతన్యం చేయడానికే నేను కవిత్వం రాస్తున్న.
       ఉదాహరణకు :-బువ్వొద్దు భూమికావాలి
  దున్నుకుంటం /రాయతీలొద్దు రాజ్యం కావాలి ఏలుకుంటం ఇస్తావా !? ఇలా చెబితే ప్రజలు ఆలోనలో పడతారు ప్రలలో ఆలోచన రేకెత్తించడానికే నేను కవిత్వం రాస్తున్నా.అది అతసామాన్యులు ,గ్రామీణ ప్రజల భాషను సాధనంగా చేసుకొని అదే ప్రజలకు సాహిత్యం అనే ఓ బలమైన శక్తివంతమైన ఆయుధం ద్వారా ప్రజలను నడిపించడానికే నేను కవిత్వం రాస్తున్న.
తొలినాళ్ళ కవిత్వం గురించి చెప్పండి.
 నేను నా ఇంటర్ చదివే రోజులనుండి కవిత్వం రాస్తున్న. మా ఇంట్లో మహాకవి శ్రీ శ్రీ ,గుఱ్ఱం జాషువాగారి మహాప్రస్థానం ,గబ్బిలం ఉండేవి. నేను వాటిని సాధన చేసే వాడిని. స్వతహాగా మానాన్న పద్య కవి, సత్యహరిశ్చంద్ర ,యయాతి ,పూలగంపచరిత్ర తదితర వీధినాటకాలు ,ఆడేవారు.
జాంబవపురాణం కంఠస్తా వచ్చు. వారే నా ఆది గురువు.తరువాత శ్రీరామకవచం సాగర్ గారు నా సాహిత్య అభివృద్ధికి తోడ్పడ్డారు. ఇంటర్ చదివే రోజుల్లో బ్లాక్ బోర్డ్ మీద ప్రేమ కవితలు ,సంక్రాంతి ,ఉగాది పండుగలకు కవిత్వంగా  శుభాకాంక్షలు తెలియజేసేవాడిని. అవి నా తొలి నాళ్ళ కవితానుభవాలు.
*

ఎజ్రా శాస్త్రి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సమకాలీన సందర్భాలను ఆవిష్కరించే మంచికవితలు అన్న…కవిత్వం పట్ల మీ అంతరంగం చాలా బావుంది అన్న…శుభాకాంక్షలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు