మటన్

వైన్ షాపులు మస్తుగచ్చినై. ఎటుసూస్తే అటు కనవడుతున్నయ్. తాగేటోళ్లకు మంచి సౌలతులైనయ్. దినమంతా ఈగల్ని కొట్టుకొనేటోళ్లకు పొద్దువోతున్నాకొద్దీ జనం మెల్లమెల్లగా అచ్చుడు మొదలైతది.

నారం రాత్రి. నిద్రవొయ్యేముందు గంగాధరి చేతిసంచిని మంచం పక్కన వెట్టుకున్నడు. అంగి కీసలకెళ్లి పైసలన్ని దీసి సూసిండు. నాలుగునూర్లకి జర ఎక్కున్నయ్. గవి రేపటి పొద్దటి పనికి సరిపోవ్.

పెండ్లాం రమణి అరుగుపై సన్నటి మొగురానికి ఎడల్పైన ఈపునానిచ్చి కూసున్నది. తమ్ముడు ధనంజైతోటి ముచ్చట్లవడ్డది. సౌదిలుంటడు. కష్టమచ్చినా సుఖమచ్చినా అక్కతోనే చెప్పుకుంటడు. వాట్సప్ ఫోన్ కాల్లు పుకటేనాయే. ఎప్పుడు మాట్లాడబుద్దైతే అప్పుడు అక్కకు ఫోన్ జేస్తడు.  ఒక్కొక్కసారి గంటలకొద్దీ ముచ్చట్లు. అక్కతోని కడుపునిండా మాట్లాడినంకనే పక్కూర్లున్న పెండ్లాం పిల్లల్తోటి మాట్లాడ్తడు. దేశం బొయినప్పటినుంచి గిట్లనే నడుస్తున్నది.

“ఈల్ల మాటలమీద మన్నువడ… ఎంతకు ఒడై…” అని పైకి అనలే! లోపల్నే అనుకున్నడు గంగాధరి. రమణితోటి మాట్లాడి జల్ది వండుకుందామని బగ్గసేపటినుంచి సూస్తుండు. ఆమె ఇంకోదిక్కు మొఖంబెట్టుకొని నగుకుంటా తమ్ముడితోటి మాట్లాడుతున్నది. గంగాధర్కేమో నిద్రస్తున్నది. పొద్దున జల్ది లెవ్వాల… లేటయితే దొరుకుడు కష్ఠం.

ప్రింటు లుంగీ, బామ్మర్దిదెచ్చిన నల్లరంగు జాకీ బనీన్ మీదున్న గంగాధరి మంచమీద ఒరిగిండు. రమణితోటి మాట్లాడినంక నిద్రవోదమని, మాట్లాడుడెప్పుడైపోతదనని రమణి దిక్కే సూస్తున్నడు. కొంగుజారిపోయున్నది. గంగాధర్కవి అందే అందాలే ఐనా ఎన్నడు సూడనోనిలెక్క అటుదిక్కే గుడ్లప్పగిచ్చి సూస్తున్నడు. కండ్లు మూతలు వడుతున్నయ్!

అక్క-తమ్ముడి ముచ్చట షురై గంటదాటింది. గంగాధరికి నిద్రాగుతలేదు. మెత్త పక్కనే సంచి, పైసల్ వెట్టుకున్నడు. ముగ్గురు పిల్లలు ఇంకో కమ్రలున్నరు. ఆళ్ళతోని కొంచంసేపు కూసుందామని మంచం దిగిండు.

*        *        *

గంగాధరి అనుకొన్న టైమ్కు లెవ్వలే. రాత్రంతా వేరే లోకంల గడిపిండు. ఏడయ్యింది. తెలివికచ్చేసరికి ఎక్కడున్నడో సొయి అచ్చేందుకు టైంబట్టింది. మొఖంమ్మీద ఏదో పరేషాన్ ఒక్కసారే కనవడ్డది. లటుక్కన లోకంలకచ్చిండు.

ఐతారం. పిల్లలు మొద్దుల్లెక్క నిద్రవొతున్నరు. రమణి కుబుసం ఇడిసిన పాములెక్క ఇంటిపని చేసుకుంటవోతున్నది.

గంగాధరి జల్దిజల్ది పండ్లు తోమ్కున్నడు. అంగేసుకున్నడు. మంచం దగ్గరికి పోయి సూసిండు. సంచిలేదు. నోట్లులేవు. మెత్త లేపి సూసిండు. కనవడలే! కిందికంగి సూసిండు. మంచం కాలు దగ్గర కిందవడున్నయ్. సంచి పైసల్ తీస్కున్నడు.

“రమణి… పైసల్ గావల్నే. నిన్న మీ తమ్ముడితోటి నువ్వు మస్తుసేపు మాట్లాడినవ్. అడుగుదామని సూసిసూసి, పొల్లగాండ్లతోటి కొంచంసేపాడుకొని నిద్రవొయిన్నే. ఒక వెయ్యియ్యే. జల్ది మార్కెట్ వొతా. బగ్గ లేటైందే. దొర్కుతదో లేదో!” నిద్రలేని రమణి మొఖందిక్కుసూసి కన్నుకొట్టిండు!

రమణి నగుకుంట సప్పుడుకాకుండా వెవ్వేవ్వే అని ఎడ్డిచ్చింది!!

“ఛాయ్ దాగిపో. పొయ్యిమీద మరుగుతున్నది.”

“అచ్చినంక తాగుతా. ఇప్పుడద్దే. ఆల్షమైతదే. పొయినైతారం యాజ్జేసుకో. గింతంత ఆల్షమయ్యింది. గంట గంగల కల్సుకవోయింది… ఇయ్యాలింకా ఎక్కనే అయ్యేటట్టున్నదే…”

“ఏం గాదుపో…” రెండు ధైర్యం మాటల్జెప్పి కోపుల నిండా ఛాయతోటి రమణి అచ్చి కూసున్నది. ఒక కోపందుకొని గంగాధరి స్టూల్ మీద కూసోని సర్రుసర్రు ఆవాజ్ జేసుకుంటా లటలట తాగేసిండు.

సంచి, పైసలందుకొని బండి (మోటార్ సైకిల్) మీద కూసోని గంగాధరి స్పీడ్ గా వొయిండు. దొరుకుతదో లేదో అని మనసుల పీకుతున్నది. దొర్కకపోతే ఏం జేసుడు, ఎక్కడికి, ఎవ్వల్లదగ్గరికి వోవాల… ఈ ఐతారం ఎట్లెల్తదో…

రమణి, పిల్లల మొఖాలు గంగాధర్కి సాఫ్ గా కనబడుతున్నయ్. ఎట్లనన్న తీస్కపోవుడే. ఇజ్జత్ కా సవాల్… తనకి తానే ధైర్యం చెప్పుకున్నడు! దేవున్ని యాజ్జేసుకున్నడు.

*        *        *

ఎనిమిదైతున్నది. గంగాధర్ బండి అప్పులాల గుర్రంలెక్క మెల్లగ వొతుంది. దూరంగున్నగుంపు కంట్లేవడ్డది. దుఖాణం ముందట గుంపు కనవడంగనే గంగాధరి బండినాపిండు. మల్లొక్కసారి అటుదిక్కే సూసిండు. ఎప్పుడచ్చే దుఖాణమే! తోవ తప్పలేదు. సీనుగాడు తెలిసినోడే! తనని గుర్తువడ్తడు. రెండేండ్లనుంచి అదే దుకాణంల కొంటున్నడు. శనారం పొద్దున మార్కెట్ల కలిసిండు.

“రేపస్తున్న సీను… మంచిదియ్యాల్నే. సుట్టాలస్తున్నరు…”

సుట్టాలస్తున్నరని వట్టిగనే చెప్పిండు గంగాధరి. మంచిదిస్తడని!

“రావే. రేపు ఐతారం. జర జల్దిరా. నీకెర్కనే గదా. రష్ బగ్గుంటది…”

“నువ్వు దుకాణం తెరకముందే అచ్చికూసుంటా. సూడు మల్ల…” తనన్న మాటలు గంగాధరికి యాదికచ్చినై.

దుకాణం ముందట గింతమందిని ఎప్పుడు సూల్లేదు గంగాధరి. అందరు తినుడుకెగవడ్డరు. ఎంటనే యాదికి తెచ్చుకొన్నడు. తనెప్పుడు గింత ఆల్షంగా రాలేదు. గందుకే గిసుంటి గుంపుల్ని ఎప్పుడు సూడలేదు. అక్కడంతా కొత్తకొత్తగనిపిచ్చింది. ఇంకోసారి గిట్లజెయ్యద్దని తలమీద తనే గట్టిగా టొంగ గొట్టుకొన్నడు. నొప్పి అనిపించి తలమీద మెల్లగా రుద్దుకున్నడు. గట్టిగా ఎందుకు కొట్టుకొంటిరా అని తనకు తానే మనసులనుకున్నడు. గంగాధరికి పొల్లగాండ్లు గుర్తుకచ్చిండ్రు.

బామ్మర్దితోటి రమణి మాట్లాడుడెప్పుడు కతమైతదోనని సూసి సూసి, గంగాధరి పిల్లల కమ్రలకు పోయిండు. ముగ్గురు మొబైల్ ఫోన్ల ఆడుతున్నరు. ఆల్లతోని కొంచం సేపు కూసోని ఎట్లాడుతరో సూసిండు. ఒగల్లని మించి ఒగల్లు ఆడుడు సూసి గంగాధరి మస్తు ఖుషయ్యిండు. శబ్బాష్ అనుకుంటా నడుమనడుమ మెచ్చుకున్నడు.

“బగ్గసేపు ఆడుకోకుండ్రి. జల్ది పడుకోండ్రి. నేను సుగా పండుకుంటా. మబ్బున్నే లేవ్వాల.”   గంగాధరి లేసుకుంటన్నడు.

“నానా… లివరు ముక్కలు బగ్గదేవే…” బిడ్డ ప్రేమతోటన్నది.

“గట్లనే బిడ్డా… బగ్గెపిస్కస్తా…”

“నానా… మాక్కూడా తేవే…”

“మీకేం గావల్రా…”

“నీకెర్కనే గదా నానా..” ప్రేమతో పెద్దకొడుకు…

“చెప్పురా…”

“నల్లీలు బగ్గేపిచ్చుకురావే… థిల్లి…. కమ్మగా తిందమే నానా…”

“అమ్మకు బొత్తబొక్కలు, మెత్తటిముక్కలు బాగిష్టం…” చిన్నకొడుకు…

“నాకు మెదడు తేవే! ఉల్లేసి అమ్మ మంచిగ ఫ్రై జేస్తది.” బిడ్డ ప్రేమతో తండ్రిదిక్కు సూసుకుంటా చెప్పింది.

“అన్నిఏపిచ్చుకస్తా… రేపు అంద్రం కలిసి కడుపునిండ తిందం.

గంగాధరి పిల్లల్ని విడిచి, భార్యని పైసలడిగి సంచితో దగ్గర వెట్టుకొని పండుకుందమనుకున్నడు. తమ్ముడితోని  రమణి ముచ్చట్లు ఇంకా ఐపోనే లేదు. మంచమ్మీదికి చేరుకొని ఆమెనే సూసుకుంటా నిద్రవొయిండు.

రమణి తమ్ముడికి “పదిలంగా ఉండు తమ్మి…ఆగం పనుల్ చేస్కోకు…” అని చెప్పి కొంగు కప్పుకొని ఇంట్లోకి నడిచింది. అప్పటిదాకా జారిపోయిన కొంగు రొమ్ములపై ఒదిగిపోయింది. గాలచ్చినా ఎగరకుండా గట్టిగా అతుక్కొనే ఉన్నది!

ఇల్లంతా చూసింది. అల్సిపోయిన పిల్లలు మంచి నిద్రలున్నరు. రమణి మెల్లగా మొగుడి పక్కకి చేరింది. కొంగుని పక్కకు జరిపింది. గంగాధర్ని దగ్గరికి తీసుకున్నది.

మంచం కిర్రుకిర్రుమన్నది… సంచి, నోట్లు కిందవడ్డై!

*        *        *

కొత్తగైన జిల్లాల షోకుల పనులు జల్దిజల్ది షురైనయ్. పెద్ద ఆదిలాబాద్ జిల్లాని మేకని గోసి సప్పలు జేసినట్టు నాలుగు ముక్కల్జేసిండ్రు. పెద్ద ముక్కల్ని వట్టుకొని కత్తితోటి ముక్కల్గొట్టుడు ఆల్కగైతదని. కొత్త కలెక్టరాఫీసచ్చింది. పెద్దగ గట్టిండ్రు. భూముల ధరలు బగ్గ వెరిగినై. రోడ్డు పక్కకు జాగుంటే కోట్ల రూపాయలే! ఎక్కడ జూస్తే అక్కడ అపార్ట్మెంట్ల బిల్డింగులు. ఇంటికోసం ప్లాట్లు కొందామంటే పిరమైనై. జిల్లాకేంద్రం సముర్తైన అమ్మాయిలెక్క తయారైతున్నది. సుందరనగరం లిస్టుల పేరున్నది. ఫండ్స్ బగ్గస్తున్నయ్. రోడ్లను నిలువున చింపి ‘డివైడర్లు’ గట్టిండ్రు. నడ్మల జల్దివెరిగే చెట్లన్నాటిండ్రు. ట్రాఫిక్ లైట్లచ్చినై. జనం మొదటిసారి రంగుల లైట్లని సూస్తున్నరు. బండ్లు నడిపెటోల్లకి షురుల రంగులైట్లు సమజ్లవట్టలేదు. ఆగమాగం చేసిండ్రు. ఎప్పుడాపాల్నో, ఎప్పుడువోవాల్నో గుల్లుగుల్లైండ్రు. చాలన్లు అచ్చేసరికి అందరు సీదా అయిండ్రు.

ఐతారం గురించి సుగ జర జెప్పుకోవాల. జిల్లాకేంద్రం పదకొండేడ్లల్ల మస్తుగా మారింది. దాని రూపం మునుపటిలెక్క లేనేలేదు. తినుడు… తాగుడుకెగవడ్డరు… తినుడంటే ఎన్నో తీర్ల జీవాలు: మేకల్, గొర్రెల్, చేపల్, రొయ్యల్, కోళ్ళు… దొంగతనంగా శికారి మాంసాలు… తాగుడంటే అవి సుగా మస్తు రకాలు: తెల్లకల్లు, నల్లకల్లు, బీర్లు, విస్కీలు, బ్రాండీలు… ఐతారమైతారం చిన్న పట్నంల రెండునూర్ల మేకలు గొర్లు తెగుతాయంటే నమ్ముండ్రి. పండగలనాడు నన్నూరు దాకా తెగుడే! మాంసమమ్మే టేలాలు బగ్గ పెరిగినై. గల్లీగల్లీకి… సందుసందుకు కనవడ్తున్నయ్. ఐతారంరోజు వాసాల్గట్టి, లొడలొడలాడే టేబుల్లు వెట్టుకొని కూరమ్మే బుట్టి దుకాణాలు మొదలైనయ్. ఎక్కడజూసిన గుంపులకొద్దీ మనుషులు. చేతులల్ల సంచులు. జేబులల్ల పైసలు. ఐతారం మహత్యం! పుణ్యం జేసుకొని పుట్టిన వారం! గీ టెంపర్వరి దుక్నాలు మేకల్ గొర్రెల్ని కోసినరోజే కనవడ్తై. పగలు గాంగనే గయబ్! సూద్దామంటే కనవడై. మల్లైతారమే మాల్తోని కనవడుడు.

వైన్ షాపులు మస్తుగచ్చినై. ఎటుసూస్తే అటు కనవడుతున్నయ్. తాగేటోళ్లకు మంచి సౌలతులైనయ్. దినమంతా ఈగల్ని కొట్టుకొనేటోళ్లకు పొద్దువోతున్నాకొద్దీ జనం మెల్లమెల్లగా అచ్చుడు మొదలైతది. వైన్ షాపులదగ్గర్నే ఏ కష్ఠం కాకుండా బజ్జీలు, మిర్పకాయలు, గోలిచ్చిన జిమ్మలముక్కలమ్మే నూకుడు బండ్లు సుగ రోడ్లమీద తిరుగుతుంటయ్.

గంగాధరి ఏ దుకాణానికి వొయినా అన్ని ఒక్కతీర్గనే కనవడ్తున్నయ్. సప్పల మాంసమంత అమ్ముడువోయింది. బొక్కలే గనవడుతున్నై. టేబుళ్లమీద సుగ పనికిరాని ముక్కలు, జిలుగులు, బొటీ, కొవ్వుముద్దలు. గీయింత సుగ అమ్మేసి పోతమని అచ్చెటోల్లకోసం ఆశతోటి సూస్తున్నరు దుకాణపోల్లు. “యాడికి వోవాల, ఎక్కడివోతే మంచిది దొర్కుతది…” అనుకుంటా ఆలోచనలల్ల వడ్డడు గంగాధరి.

“ఏందే గంగాధరన్న… నాదిక్కు సూస్తనేలేవు. గప్పటినుంచి సూస్తున్న. ఏమాలోచిస్తున్నవే? దేనికోసం దిరుగుతున్నవ్?” దగ్గరి దోస్తు అడిగిండు.

ఇషయం జెప్పిండు గంగాధరి.

“అవునే… ఇయ్యాల్ల ఎక్కడికి వోయినా గిట్లనే ఉన్నదే! ఎగవడిఎగవడి కొంటున్నరు. నేను సుగా నాలుగైదు జాగలకు వోయిన. ఒక దుకాణంల దొరికింది. డిమాండు బగ్గున్నదని మల్ల రెండు కోసిండ్రట. కావాలంటే జల్దివో మరి.” అని చెప్పిండు.

దోస్తుజెప్పిన టేల దగ్గరికి జేరిండు గంగాధరి. దూరంనుంచే సప్పలు కనవడంగనే మనసు అల్కగైంది. దిమాకు జర సల్లవడ్డది.

“కిలోనర ఇయ్యే.” ఎట్లనన్న దొరుకుతదని గట్టిగన్నడు.

“ఐపోయిందే… గిప్పుడే ఫోనచ్చింది. ఎంతుంటే అంతుంచుమని. పార్టీ జిల్లా ప్రెసిడెంటునుంచి. ఆళ్ళ మనిషి తీస్కవొయెందుకు అస్తున్నడు…”

“గట్లనవడ్తివి. జర సూడుగదనే. కిలో అన్న ఇయ్యు. అస్సల్కైతే దేడ్ కిలో కావాల్నే నాకు. తిరిగితిరిగి నీదగ్గరికచ్చిన. ఎట్లనన్నజెయ్యు…” బతిమిలాడిండు గంగాధరి.

“పది నిమిషాలముందన్న రాకపోతివి. ఇప్పుడస్సలు కుదరదే. ప్రెసిడెంటు మనిషి తోవలున్నడు.”

గంగాధరికి పరీక్షలెక్కున్నది. ఏంజేసుడో సమజ్లవడ్తలేదు. తల్కాయ వట్టుకొని ఒరిగిన బండికి పిర్రల్ని ఆనిచ్చి నిల్సున్నడు.

వట్టిచేతుల్తోటి ఇంటికి వొతే మంచిగుండది. పొల్లగాండ్లు నారాజైతరు. చిన్నోడైతే ఏడ్సుడు షురుజేస్తడు. కూతురికి అన్నమ్ముద్ద లోపలికివోదు. అలిగి కూసుంటది. ఐతారం ఏ కూరగాయల్ని ముట్టరు. రమణి ఒక రకంగ సూస్తది. ఆ సూపులల్ల పాతకాలపు బాణాలు, కొత్తకాలం బుల్లెట్లుంటయ్. “చత్… నీయవ్వ…” అనుకుంటా జేబులనుంచి ఫోన్ దీసిండు.

“అరే సీను… పొద్దున దుఖాణంకాడ ఫుల్లు మందుండ్రి. మన నంబర్ తలిగేసరికి గంటెకెక్కే ఐతదని వాపస్ వొయిన. ఏమనున్నదా తమ్మి? ఎక్కడ దొర్కుతలేదు…”

“అయ్యో… ఒక్క ఫోన్ కొడితే అయిపోతుండేగదనే… పక్కకు తీసి పెడుతుంటి. తక్కవడితే ఇంకో మేకని కోపిచ్చిన ఇయ్యాల్ల. అదిసుగా కతమైందే. ఎప్పుడన్న గిట్లుంటె మొదలే ఫోన్ చెయ్యే. నీకోసం పక్కకుంచుత.”

“తల్కాయ కాళ్లున్నయ్. ఇయ్యాల్లటికి నడిపిచ్చుకో. తీస్కపో.”

“పొల్లగాండ్లు ఇష్టంగా తినరు తమ్మి. బేజా అందరికిష్టం. వట్టి బేజా మీరమ్మరు.”

“అవునే అన్న. తలతోనే వోతదది. అలగ్ దీసి అమ్మం.”

“ఇయ్యలంతా గడ్బడ్ అయింది. మనూర్లే తినేటోల్లు ఎక్కైన్రు. ఐతారం అచ్చిందంటే ఇదొక పెద్ద పనైందే… ఉంటా…”

ఇంకొక ఐదు నిమిషాల్ గట్లనే నిల్సున్నడు గంగాధరి. తల్కాయ గరంగరం ఐంది. “ఛాయ్ ఛాయ్” అనుకుంటా ఒక పిల్లడు థర్మాసూ, కాగితం గిలాసలు వట్టుకొని పోతున్నడు. గంగాధరికి ఛాయ్ తాగబుద్దైంది. పిల్సిండు.

ఇంట్ల పిల్లల్ని ఎదుర్కునుడెట్ల? ఎట్లజూస్తరో తనని? ఆశ జూపి వట్టిచేతుల్తోటి ఇంట్లెట్ల అడుగువెట్టుడు… గివే ఆలోచనలు గంగాధరిని సంపుకతింటున్నయ్. బండిని ఇంటికి తిప్పిండు. ఇంటిముందరాపి హారన్ కొట్టిండు. బిడ్డ ఉరికచ్చింది. ఖాళీ సంచి చేతులవెట్టి “నేనిప్పుడే అస్త.” అని ఇంట్లకువోయెందుకు బయపడి బండిని తిప్పిండు.

బిడ్డకు ఏమర్థంగాలే. ఖాళీ సంచి! ఉరికచ్చిన ఉషారుతనం ఎగిరిపోయింది. సంచివట్టుకొని ఏడుపుమొఖంతో మెల్లగా ఇంట్లకడుగులేసింది.

ఇద్దరన్నలు శెల్లె మొఖం జాలిగ జూసిండ్రు. కుర్సి మీదికి ఇసిరేసిన సంచి కనవడ్డది. రమణి పిల్లల్ని, ఆల్ల మొఖాల్ని సూస్తున్నది. సంచి కుర్సిమీద పండుకున్నది!

*        *        *

ఐతారం సచ్చిపోయినట్టు మొఖాలు వెట్టుకొని తలో మూల కూసున్నరు. బిక్కుమంటూ కూతురు తల్లి దగ్గరికివోయి పక్కనే కూసోని తొడమీద తల్కాయ వెట్టుకున్నది.

“నీకోసం బొత్తబొక్కలు, మెత్తటిముక్కలు దెమ్మన్ననే… నీ కిష్ఠం గదనే…” బిడ్డ తల్లిమీది ప్రేమతోటన్నది.

“ఊర్కే యాదిజెయ్యకు… నానకు మంచిగనిపియ్యది… సప్పుడుజేయ్యకుండా కూకుండు… మల్లైతారంకు మస్తుగా తెచ్చుకొని కమ్మగా తిందం.”

దూరంగా కూసున్న గంగాధరి కండ్లల్ల నీళ్ళు. ఊముని మింగేసినట్టు తడిని కనవడకుండ కండ్లు మింగేసినై.

“కోడినన్న తేనుంటివి గదనే నానా…” పెద్దోడు.

“నువొక్కడివే తిందామనరా? అమ్మ తినది. చెల్లె ఇష్టంగా తింటదారా?…” చిన్నోడు కోపంగా.

“సాలియ్యుండ్రి ఇగ… ఒక్క ఐతారం లేకపోతే గింతగానం లొల్లా? మనింట్ల ఆనిగెపు కాయలైనయ్. ఇయ్యాల్ల సెనెగపప్పేసి మంచిగండుతా…” కోపంగా తల్లి.

పిల్లలు ఇనరాని మాటలిన్నట్లు మొఖాలు వెట్టిండ్రు.

“నువ్వు లేసి రెండానిగెపు కాయల్నితెంపు.” రమణి పెద్దోడిని పిల్చి పని చెప్పింది.

“అరేయ్, నువ్వు స్టూలు వట్టుకొని అన్నతోనే ఉండు… పడకుండ్రి. జర బధ్రం… ” ఇద్దరికి పని జెప్పి అక్కడినుంచి లేసింది రమణి.

గిట్లెట్లాయే అని గంగాధరి లోపల్లోపల్నే తాయిమాయైతుండు… పొల్లగాండ్ల మాటల్నింటే దుఖమస్తున్నది. గోడకి తల్కాయానిచ్చి కండ్లు మూసుకున్నడు. చేపల మార్కెట్కైనా పోయేదుండే. ఒక్కోసారి మంచియి దొర్కుతై. మన్సుల ఏడుస్తున్నడు. బైటకు కనవడ్తలెడు.

గడియారంల ముండ్లు తిరుగుతున్నయ్. ఐతారం మెల్లమెల్లగా ఎండిపోతుంది. పదకొండు దాటింది. సాయంత్రంకు  రాజస్తాన్ ఎడారైపోతది.

పిల్లలు ఆనిగెపుకాయల్ని తెంపె ఆటపాటలల్లవడ్డరు.

*        *        *

గంగాధరికి చిన్న కునుకువట్టింది. తల్కాయ గోడకే ఒరిగే ఉన్నది. అపుడప్పుడు గుర్క సౌండు ఇనవడ్తున్నది. మెల్లమెల్లగ చిక్కవడ్తున్న నిద్రని తన్నుకుంటా ఫోన్ ఒక్కతీరుగా ఒర్లింది. పాత తెలుగు సినిమాపాట రింగు టోన్.

“అరె గంగాధరి… ఎక్కడున్నవురా?” జిగ్రి దోస్తు నుంచి. దూరపుసుట్టంకూడా.

“ఇంట్లనే ఉన్ననే.”

“పొద్దుగాల్ల టేల దగ్గర దూరంగా కనవడ్డవ్… నేను గప్పుడే ఇంటికి కూర దీస్కవోతుంటి. బండి దగ్గరికి వోయి నీకోసం అటుఈటు సూస్తే మాయమైనవ్… ఇయ్యాల్ల మస్తు రష్… నేను మొదలు వోవుడుకు దొరికింది… అయితే తినే బాకిలేదురా!”

“అయ్యో… ఏమైందే? గట్ల మాట్లాడుతున్నవ్.” పరేషాన్తోటి అడిగిండు గంగాధరి.

“గిప్పుడే ఫోనచ్చింది. బావకు గుండెనొప్పి అచ్చిందట. ఇక్కడ సూపిస్తే ఎంటనే పట్నం తీస్కవొమ్మన్నరట. అంబులెన్సుల శెల్లెంబడి మేము వోవాల్రా…”

“అయ్యయ్యో… గట్లెట్లైందే! మొన్న బండిమీద వొతుంటే నాకు శేతూపిండు. మల్ల లైట్లదగ్గర కనవడ్డడు. మాట్లాడిండు. ఇంటికస్తా. ఎప్పుడు వోతరే హైద్రాబాద్?”

“దావఖాండ్ల ఐసియూల ఉన్నడట. డాక్టరచ్చినంక రెండుగొట్టంగా పోవుడు… నువ్వు ఎంటనే రారా. పొద్దునదెచ్చిన కూర గట్లనే ఉన్నది. ఇంకా అండలేదు. గిదే పరేషాన్లున్నం. నువ్వచ్చి తీస్కపో.

“ఇప్పుడే అస్త.”

గంగాధరి హుషారుగా లేసిండు. సంచి తీసుకున్నడు.

రమణికి జెప్పిండు. ఏదో ఒక రూపంల ఇంతెజామ్ ఐనందుకు మనసుల నవ్వుకున్నది. గంగాధరి సుగా నవ్విండు. బయట అన్నదమ్ములు అనిగెపుకాయాల్ని కోసేతందుకు నేనంటే నేను అని గూసులాడుతున్నరు. అన్నల జగడం సూసుకుంటా శెల్లె సప్పట్లు కొడుతున్నది.

గంగాధరి ఇదంతా సూస్తున్నడు.

“మీ ఆట ఆపుండ్రి. ఆదివారం ఆనిగెపుకాయ తింటామా? తెంపకుండ్రి. ఆదివారం మటనే తినాల!” పిల్లలకి చెప్పుకుంటా కుషీకుషీగా బైటకు నడిశిండు గంగాధరి.

పిల్లలు సమజ్ వట్టక తల్లిదిక్కు సూసిండ్రు. రమణి ఆళ్ళని సూసుకుంటా నవ్వింది.

గట్ల గా ఇంట్ల ఐతారం అవతారం మాయతీర్గా మారింది. ఎడారి లటుక్కున ఆదిలాబాదు అడివైంది. సగంరాత్రికి ఐతారం నిద్రలున్న అందరి మొఖాల్ని జూసుకొని కుషీతోటి సోమారంకు తోవజేసి పక్కకు తప్పుకున్నది.

**

చిత్రం: సృజన్ రాజ్ 

సంపత్ కుమార్, టి.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు