మందాకినీ…ఆ పక్కనే హిమాలయ శిఖరాలు!

యాత్రాస్మృతి 7

   ఊఖీమఠ్ లో ఉదయం అయిదు గంటలకల్లా లేచి కనక్ చౌన్రీ  ప్రయాణానికి సిద్ధమయ్యాం. ముందు రోజు మేఘాలు, వర్షం తోడు చేరేసరికి ఇంచుమించుగా చీకటి పడటం వల్ల మాకు పరిసరాలు అంతగా కనిపించలేదు. కానీ ఈ ఉదయం మేము హోటల్ బయటకు రాగానే వాతావరణం ప్రశాంతంగా ఉండి పక్కనే కాస్త కిందుగా పారుతున్న మందాకినీనది, ఎదురుగా దూరంగా ఎండ పడి ధగధగా మెరిసిపోతూ ఉన్న హిమాలయ శిఖరాలు కనిపించాయి. తుంగనాధ్ లో మమ్మల్ని దూరం నుండి మురిపించిన కేదార్ మెయిన్, డోమ్, చౌకంభ శిఖరాలు ఇప్పుడు కాస్త దగ్గరగా.

లగేజ్ తీసుకొని షేర్డ్ జీప్ లు దొరికే జంక్షన్ వైపు నడిచాం. ఇక్కడి నుండి కనక్ చౌన్రీ కి నేరుగా ఏ వెహికల్స్ ఉండవు. అదృష్టం బాగుంటే మోహన్ ఖాల్ వరకు దొరుకుతాయి లేదంటే ముందు బాన్స్వార గ్రామం చేరుకుని అక్కడి నుండి మళ్ళీ మోహన్ ఖాల్ చేరుకోవాలి. ఆ తర్వాత అక్కడినుండి కనక్ చౌన్రీ  కి వెళ్ళాలి. మాకు బాన్సువారా కు వెళ్లే జీపు దొరికింది. మరిక ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరాం. ఓ గంటలో అంటే ఉదయం 7:15 అయ్యేసరికి బాన్సువారా చేరుకున్నాం. బాన్స్వారాలో రోడ్డు పక్కగా చిన్న హోటల్ లాంటిది కనిపించింది. బ్రేక్ ఫాస్ట్ చేసి మోహన్ ఖాల్ వెళ్లేందుకు జీపులు దొరుకుతాయా అని అడిగాం. సాధారణంగా తొమ్మిది గంటల నుండి ఉంటాయని చెప్పారు. ఎందుకంటే ఆ సమయంలోనే రోజువారి పనులపై స్థానికులు తిరగడం మొదలు పెడతారు. ఆ హోటల్ మీద ఒక రెండు చిన్న గదులు ఉన్నాయి. మాకు అవసరమైతే అందులో వాష్ రూమ్స్ వాడుకోవచ్చునని అన్నారు. అలాగే ఒక జీప్ అతనికి ఫోన్ చేసి మా ఇద్దరి కోసం స్థలం ఉంచమని కూడా చెప్పారు. నిజంగా ఎంత స్వచ్ఛమైన మనుషులు, మనసులు అంటే అక్కడి ప్రకృతి అంత.  బ్యాగ్స్ అక్కడే ఉంచి పరిసరాలు చూసి రావడానికి అని వెళ్ళాం.

రోడ్డు దిగి ఓపక్కగా క్రిందకు వెళితే మందాకినీ నది, దానిపై బ్రిడ్జి, బూరుగు చెట్లు, దూరంగా హిమాలయ శిఖరాలు. చాలా అందమైన వాతావరణం. అవన్నీ చూస్తుంటే అక్కడే ఓ చిన్న పాక నుండి ఓ ముసలి వ్యక్తి బయటకు వచ్చాడు. మమ్మల్ని చూసి ఫొటోస్ తీసుకుంటున్నారా అని పలకరించి ఆ  బూరుగు చెట్టుకు తీయండి బాగా వస్తుంది అని చెప్తూ నాకూ తీయండి అన్నాడు.

నన్ను దగ్గర నుండి చూసి ఏమిటా దెబ్బ అని నా నుదుటి మీద తుంగనాథ్ లో అయిన గాయాన్ని తడుముతూ అడిగాడు. ఏం జరిగిందో చెప్పాను. అయ్యో అంటూ అక్కడ ఇంకా కారుతున్న రక్తాన్ని  తుడిచి ఆ రక్తానికి అంటుకున్న నా తల వెంట్రుకలను సరి చేస్తూ జాగ్రత్త అని చెప్పాడు. నిజంగా నా కళ్ళు  చెమర్చాయి. ఎంత ప్రేమ వీళ్ళకి మనుషుల మీద అనిపించింది. అతను నేపాల్ నుండి వచ్చాడట. పేరు పవన్ సింగ్ ఠాకూర్ .మా ఇద్దరికీ అతనే ఒక ఫోటో కూడా తీశాడు. ధన్యవాదాలు చెప్పుకుని తిరిగి రోడ్డు దగ్గరకు వచ్చాం.

ఉదయం 8:45 ప్రాంతంలో మోహన్ ఖాల్ వెళ్లడానికి మరొక జీప్ దొరికింది అక్కడి నుండి 30 కి.మీ అయినా పదిన్నర అయింది మేం చేరుకునేసరికి రోడ్డు బావుండదు పల్లెటూర్లు మీంచి వెళుతుంది నిజంగా చూడవలసిందే ప్రయాణించవలసిందే ఆ దారి.

ఈ పల్లెటూర్ల మీదగా ప్రయాణిస్తున్నప్పుడు స్థానికంగా ఉన్నవారు రోడ్డు వద్దకు వచ్చి వేరే ఊర్లకు చేరవేయవలసిన సామాన్లను జీప్ పైకి ఎక్కిస్తారు. వాటితో పాటు వారు ప్రయాణించే అవసరం లేదు. ఏ ఊరి మీదుగానో జీప్ వెళ్తుంటే మరెవరో వచ్చి వాటిని దింపుకుంటారు. ఆ జీప్ డ్రైవర్ కు చెల్లించవలసిందేదో చెల్లిస్తారు. అలా ఎన్నో సామాన్లు జీప్ మీదకు ఎక్కుతూనే ఉన్నాయి… దిగుతూనే ఉన్నాయి.

ఆ విధంగా మోహన్ ఖాల్ కు చేరుకున్నాం. అదే చివరి స్టాప్  అక్కడి నుండి కనక్ చౌన్రీ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము అదే జీపులో మరికొంత చెల్లించి కనక్ చౌన్రీ చేరుకున్నాం.

కనక్ చౌన్రీ దగ్గర నుండి మొదలయ్యే కార్తీక్ స్వామి ట్రెక్ కు సాధారణ రోజుల్లో కూడా బయట నుండి వచ్చే టూరిస్టులు తక్కువ మేం ప్రయాణించిన మార్చి నెలలో మరీ తక్కువ అయితే స్థానికులు చాలా ఎక్కువగా సందర్శించుకుంటారు బయట నుండి వచ్చే యాత్రికులు ఎక్కువగా ఏప్రిల్ మే నెలలో వస్తారు ఆ సమయానికి వసతి కోసం టెన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అయితే అక్కడే రోడ్డు నుండి కాస్త మీదకు నడిచి వెళితే మౌంటెన్ హోం స్టే అని ఒకటి ఉంది.పక్కా భవంతి. ఒక నాలుగు ఐదు గదులు మాత్రం ఉన్నాయి అక్కడే 1500 రూపాయలకు ఒక గది తీసుకున్నాం నేను తప్ప మరెవ్వరూ టూరిస్టులు లేరు సమయం ఉదయం 11:15  అయింది. అక్కడి కేర్ టేకర్ ను అడిగితే నాలుగు గంటలలో ఆలయం చూసి రావచ్చని చెప్పేరు. కాస్త ఎండ ఎక్కడం వల్ల చుట్టూ దూరంగా ఉన్న హిమాలయ శిఖరాలు పొగలాంటి మేఘాలతో కప్పడిపోయి ఉన్నాయి సాధారణంగా ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటలు దాటాక వర్షం పడే అవకాశం ఉంటుంది ఈలోగా మేం వెళ్లి వచ్చేస్తే మంచిది. అందుకని మరి భోజనం కూడా చేయకుండా బ్యాగ్స్ రూమ్ లో పెట్టేసి కార్తీక్ స్వామి ఆలయ దర్శనం కోసం బయలుదేరాం

*

స్వాతి పంతుల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు